శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › ధర్మజ్యోతి — 3

ధర్మజ్యోతి — 3

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 8 / 37

-గీతోపదేశ హేతువు -

సూక్ష్మముగ విచారించిన గీతోపదేశ హేతువు స్వధర్మనిర్వాహణమునం దేర్పడిన విమోహమును బాపుటయే యనవలయును. జీవాత్మస్వరూవుఁడగు నర్జునునందు? స్నేహార్హుఁ డెవరో స్నేహమున కనర్హుఁ డెవరో తెలియని దోషమును, విహిత ధర్మమేదియో కానిదేదియో తెలియనిదోషమును స్పష్టముగ నగుపడుచున్నవి. ఈదోష ద్వయమునఁ దగులుపడి కింకర్తవ్యతామూఢుఁడై ధనంజయుఁడు ప్రార్థింప భగవానుఁడు గీతారూపముగా శాస్త్రోపదేశమును గావింప వలసివచ్చెను,

ఈ విషయమునం దీక్రింది యార్యోక్తి కలదు.

శ్లో॥ ఆస్థానే స్నేహకారుణ్య ధర్మాధర్మ ధియాకులం

పార్థం ప్రపన్న ముద్దిశ్య శాస్త్రావతరణం కృతం॥

-భగవద్గీత-

పై కారణములం బట్టి ధర్మతత్వము నెఱుంగగోరెఁడువారికి, భగవద్గీత ధర్మసత్రమని తెలియగలము, ఆయుద్గ్రంథము సర్వప్రాణులకును క్రమశిక్షణము నొసంగి. తద్వారా లోకమునకు రక్షణ పోషణముల నవలంబనము నొసంగి యుద్ధరించును. ఆనందసిద్ధి నందుట కందఱకు సమానావకాశము నాగ్రంథ మొసంగుచున్నది. నిష్పక్షపాతమగు సత్యబుద్ధితో, విచారించెడు వారికది సర్వసమ్మత తత్వమునే బోధించుచున్నది. ఆగీతాప్రాశస్త్యము నార్యులీ కిందివిధముగ వాకొని యున్నారు.

శ్లో॥ సర్వోప నిషదో గావః దోగ్ధా గోపాల నందనః

పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతమ్‌ మహత్‌॥

తా॥ సత్యమగు బ్రహ్మతత్వమును బోధించెడు ఉపనిషత్తులన్నియు ఆవులు, వానిఁ బితికెడు గొల్లవాఁడు శ్రీకృష్ణుఁడే. అర్జునుడు గోవత్సము కాగా పండితులు దాని క్షీరమును గ్రోలి యానందించెడు వారగుచున్నారు. మఱి క్షీరము మహత్తరమగు గీతామృతమే. ఈ ప్రశంసను కొందఱతిశయోక్తిగాఁ దలంపవచ్చును కాని యింతకు మించిన స్వభావోక్తి యని యుండదు.

అదట్లుండ భగవద్గీత నారంభించు శ్లోకము ధర్మక్షేత్రేయను పదముతోనే యారంభమగుచున్నది. అట్లనుట, భగవద్గీత సర్వ ధర్మములకు క్షేత్రమని సూచించు చున్నది. ఆయుద్దేశ్యమునే కావ్యార్థసూచనగ వ్యాసమహర్షి ప్రయోగించియుండునని యంద ఱెఱుంగుదురు.

-వ్యాస మహర్షి -

ఇఁక వ్యాసమహర్షి యన్ననో భగవత్ప్రోక్తమగు గీతాతత్వమును గ్రంథరూపముగఁ బ్రకటించి, లోకమునకు విజ్ఞాన భిక్షపెట్టిన పుణ్యమూర్తి. వ్యాసుఁడు భగవంతుని పదునేడవ యవతారమని, వ్యాసశబ్దమే రూఢపిఱచుచున్నది.

అదెట్లన వేదశాస్త్రములందు ప్రధానప్రయోగములగు నామ వాచకములు, బీజప్రాయములై సార్థకములై యొప్పుచున్నవి. గాని వస్తుతత్వమును దెలుపని నిష్ప్రయోజక పదజాలము మాత్ర మెంత మాత్రము కాజాలదు. అట్టిశబ్దముల సార్థకత ‘కాదినవ’ ‘రాదినవ’ ‘పాదిపంచ’ ‘యాద్యష్టౌ’ యనెడు నక్షరసంఖ్య సూత్రము, అనగా అక్షరములకు నంకెలను తెలుపుచుండెడు శాస్త్రపద్ధతి ననుసరించి, పరికించితిమిపో తెలియగలము. అందువలన దానిని బట్టి వ్యాసశబ్దవు సంఖ్యయు నెఱుంగఁగలము. పై సూత్రమునుఁబట్టి వ్యా. అంకె 1 కాగా స అంకె 7 అయి; 17 అనుసంఖ్య మనకుఁ దేలుచున్నది. అందు వలననే భగవంతుని పదునేడవ యవతారము వ్యాసమహర్షియని పైఁజెప్పఁబడినది.

ఇదిగాక యీమహర్షి వేదార్థములు బోధించెడు మహాభారతమును రచించెడుచో, ‘సోహం’ అను అజపాగాయత్రీ బ్రహ్మతత్వమును లేక ఆత్మ తత్వయుక్తముగు లింగదేహ స్వరూపమును తెలిపెడి పదునెనిమిది తత్వములతో నుండునట్లుగా రచించి, దానికి మరల సార్థకత యేర్పడు జయ నామము నోసంగియున్నాఁడు.

పైఁదెల్పిన అక్షరసాంఖ్యసూత్రము ననుసరించి జయశబ్దము పదు నెనిమిదికిఁ బర్యాయపదమగుచున్నది. ఇఁక గమనింపుడు. భారత పర్వములు 18, భారతయుద్ధమునఁ బోరాడిన అక్షౌహిణులు 18, కడకు భారతాంతర్గత భగవద్గీతకు నధ్యాయములు 18. ఇవిట్లుండ, వ్యాసమహర్షి రచించిన పురాణములును, నుపపురాణములును గలిసి 18 సంఖ్యగనే యున్నవి.

మఱియును లోకమునం దఖండముగ వెలుగుచుండెడి. భాగవత తత్వవిజ్ఞాన సారస్వతమునకంతయుఁ, గారణమైనవాఁడు వ్యాసమహర్షి యనుట సర్వ జనాంగీకారమైన విషయము. అట్టి వ్యాసకృత సారస్వతమున భగవద్గీత నాయకమణియై తన సహస్రదివ్యజ్ఞాన కిరణములతో ప్రకాశించుచు లోకమును వునీతము గావించుచున్నది.

అట్టి భగవద్గీతా శాస్త్రమునందు భగవానుఁ డర్జునునకు ధర్మ స్వరూపమగు కర్మయోగమును బోధించి, తనచే సృజింపఁబడిన లోకతత్వమును చతుర్థా ధ్యాయమునం దిట్లు వర్ణించుచున్నాఁడు,

శ్లో॥ చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః

తస్య కర్తార మపిమాం విధ్యకర్తా రమవ్యయం॥ 4-13

తా॥ గుణకర్మ విభాగము ననుసరించి, నాలుగువర్ణములతో నొప్పిన యీలోకము నాచే సృజపఁబడినది. ఇందులకు నేను కర్తనై యున్నాను. నన్ను కర్తనుగా నవ్యయునిగా నెఱుంగుము.

ధర్మస్వరూపమగు లోకతత్వము నెఱుంగుటకు నీశ్లోకము బీజప్రాయమగు మూలసూత్రముగ నొప్పుచున్నది. భగవంతునియొక్క యీజగత్సృష్టికి సాధనములు సత్వ రజ స్తమోగుణములు మూడును కర్మతోఁ గలిసి నాలుగగుచున్నవి. నాలుగు వర్ణములుగానై బ్రహ్మ, క్షత్ర, వైశ్య, శూద్రులను నభిధానములు గలిగి యొప్పుచున్నవి. ఇట్టి గుణకర్మ విభాగవ్యవస్థయే జగద్వవస్థ యగుచున్నది. ఆజగత్తు మరల నాకాశాది పంచభూతాత్మకమే యగుచున్నది.

లోకమునందలి ప్రతిజీవియందును, ప్రతియణువునందును పంచభూతములే యెప్పుచున్నవి. పైశ్లోకమునందలి ‘మయాసృష్టం’ అను సమాసమును వచించిన యాతఁ డాకాశతత్వమునకుఁ జెందిన సగుణమూర్తియగు నీశ్వరుఁడు. ఆతఁడే శ్రీకృష్ణుఁడను వ్యవహార నామమున నొప్పెను. ఆకాశభూత మవర్ణమైన దంటిమి గదా! తదితరంబులగు వాయ్వుగ్ని జలపృథివీభూతములు వర్ణయుతములై యున్నవి. వర్ణమన వర్ణించుటకు లేక గుర్తించుటకు ననువగు లక్షణమని చెప్ప వలయును. అందువలనఁ బంచభూతములలో ‘మయాసృష్టం’ అని వచించిన యాకాశతత్వ రూపియగు నీశ్వరుఁడు పోగా మిగిలిన మూడును వ్యవహార ధర్మముగల సత్వరజస్తమోగుణములకుఁ జెందియున్నవి. కనుక పృథివీభూతము కర్మస్వరూప వర్ణమై యుండితీర వలయును.

ఈనాలుగు వర్ణముల సమిష్టిస్వరూపమే లోకమైయున్నది, ఇదంతయు, వానికి నాధారమై, యైదవవాఁడగు నీశ్వరనిర్మితమై యున్నది. ఈయర్థమునే చాతుర్వర్ణ్యం ‘మయాసృష్టం’ అను వాక్యములతో భగావానుఁడనగలిగెను.

సత్వరజ స్తమోగుణములు మూడును మూడు వర్ణములతో నొప్పుచున్నవని శ్రుతియు నీక్రిందివిధముగాఁ జెప్పుచున్నది. పరికింపుడు.

శ్రతి-ఆశామేకాం లోహిత శుక్లకృష్ణాం నహ్వీం ప్రజా జయంతీం స్వరూపాం॥

సత్వగుణము శ్వేత(ధవళ) వర్ణము, రజోగుణము రక్త (లోహిత) వర్ణము; తమోగుణము నీలవర్ణము కలిగియుండగా కర్మత్రివర్ణ సమ్మేళనచే మిశ్రమవర్ణమై యొప్పుచుండును. ఇట్టి వర్ణములకు జనకము ఈశ్వరతత్వమగు ఆత్మ స్ఫటికమువలె స్వచ్ఛమై యొప్పుచున్నది.

ఇట్ట పంచతత్వములకు మూలభూతమగు పరమాత్మతత్వము నిశ్చలమగు తేజోబలముగఁ బ్రకాశించుచుండును. ప్రాణియందును ఆత్మయొక్క తేజస్సు, ఆ ప్రాణికి సహజముగ నేర్పడియుండిన స్వభావ వర్ణము (త్రిగుణాత్మకమగు మనస్సు యొక్క రంగు) నందుఁ బ్రసరించి, వాని కర్మమయమగు స్థూల దేహమునందు వ్యాపించి, ఆ ప్రాణియొక్క యోగ్యతానుసారముగ వానిఁ జుట్టునుఁ గొంతదూరము రంగుటద్దముగల లాంతరు నందలి దీపము కాంతివలె వ్యాపించియున్నది. ఇట్లు ప్రతి ప్రాణి నావరించి వ్యాపించియుండిన నీలపీతాది వర్ణములతో, నొప్పియున్న యాత్మమయమగు దివ్య తేజము మానవుల కర్మ మయములగు చర్మ చక్షుస్సులకు నెంతమాత్రము గోచరింపదు. కర్మమయములగు చర్మ చక్షుస్సులకుం గోచరించునవి కర్మమయములగు స్థూలరూపములు మాత్రమే.

ఈవిషయము నే శ్రీకృష్ణుఁడు పార్థున కీక్రింది శ్లోకములో నెఱిఁగించి యున్నాఁడు.

శ్లో॥ నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా

దివ్యందదామితే చక్షుః పశ్యమే రూప మైశ్వరం॥

తా॥ ఓయర్జునా! ఈ నీకండ్ల చేత నన్ను గాంచుట శక్యము కాదుగాన. నీకు దివ్యదృష్టి నొసంగుచున్నాను. నా యీశ్వర రూపమును గాంచుము.

మనస్సు లయమొందినఁగాని యాత్మ గోచరింపదు. సాధన రూపములగు భక్త్యభ్యాసాదులవలన, భగవదనుగ్రహము పొందిననేగాని, మనోలయ మేర్పడదు. అట్టి సామర్థ్యము సంపాదించి, యా తేజమును జూడఁగలిగినవారే మహర్హులు. అట్టి మహర్షులకు మాత్రము, ఆత్మయొక్క తేజ మే ప్రాణియందే వర్ణముతో, నెంతదూరము వ్యాపించియున్నదియో, నాప్రాణి స్వభావ మేవర్ణముతో భాసిల్లు చున్నదీ గోచరించుచుండును.

-మహర్షుల కృప -

అట్టి యధికార పురుషులగు మహర్షులు లోకమునందుఁగల సర్వపదార్థములందును, సర్వభూతములందును, ఏయేగుణ మెంత భాగము గలిగియున్నదియు, దాని కర్మస్వభావ మెట్లుండునదియు, అభూతములయొక్కయు, ఆపదార్థములయొక్కయుఁ, బరస్పర మిత్రత్వ శత్రుత్వ సమత్వాదులను బరిశీలించి, భూగోళ, ఖగోళ, పదార్థ విజ్ఞాన, వైద్య, యంత్ర మంత్రాదిశాస్త్రములను, లోకానుగ్రహ బుద్ధితో రచించి ప్రజానీకమునకు మహోపకార మొనరించి యున్నారు.

మఱియు నామహర్షులు తామనుభవించిన యానందరూపమగు పరమాత్మను, అందఱును పొంది యానందింప వలయునని యెంచి ఉత్తమ, మధ్యమ, మందాల్పాధికారుల చిత్తములకుఁ దగినట్లుగ శ్రుతిస్మృతీతిహాస పురాణాది రూపములలో, నాపరతత్వ విజ్ఞానము నెంతగానో బోధించియున్నాడు.

-బ్రహ్మ విష్ణు మహేశ్వరావతారములు-

అట్టి మహర్షి ప్రణీతంబులగు పురాణాదులయందున్న తాత్వికార్థమును గ్రహించుట సామాన్యవిషయముగాదు. పురాణకథలందు విష్ణుని నాభికమలము నుండి నాలుగు ముఖములుగల బ్రహ్మదేవుఁడు జన్మించి సృష్టికార్యమును సాగించినట్లు వర్ణితమైయున్నది. అధునాతనులైన సామాన్య పండితులు పురాణో ద్దేశ్యముల గుర్తింపఁజాలకయవన్నియుఁ బ్రకృతివిరుద్ధములగు నభూతకల్పన లనియు, నందుచే విశ్వాసార్హములు గావనియు, వాకొనుచుండిరి.

ఈవిషయమునుఁ బైఁజెప్పిన యంశములతో సరిపోల్చికొని చూతము. పురాణములందు వర్ణితుఁడైన యాది విష్ణువు యాకాశ మూర్తిగనున్న యాత్మయే యగును. ‘‘వ్యాప్నోతీతి విష్ణుః’’ అను వ్యుత్పత్తినిబట్టి, విష్ణు శబ్దమున సర్వ వ్యాపకత్వార్థమునే చెప్పవలయును, అదియే ధాత్వర్థమగును. ఆకాశము సర్వవ్యాపకమగుట వలన, విష్ణుశబ్దము దాని కన్వయించుట మిక్కిలి సమంజసము. అది ఆద్యము, సర్వాధారము, సర్వజనకము, సర్వనియామకమునని పైఁ జెప్పిన యంశములు, విష్ణునామక దైవికశక్తికి ద్యోతములగును కదా! కాబట్టి విష్ణునందభి వర్ణితములైన భగవల్లక్షణము లాకాశ లక్షణములనుటలోఁగల వింతయేమి?

ఆకాశమునకు వాస్తవికవర్ణము లేకుండినను, లోకుల చర్మ చక్షువుల కది నీలవర్ణ భాసితముగ నగుపడుచున్నది, అందువలన విష్ణుని నీలశుభాంగుఁడనుట మిక్కిలి పొందికగ సరిపోయినది. ఇంక నా దేవుని నాభికమలమున బ్రహ్మ యుద్భవించె ననుట విచారింతము.

నాభి శరీరమునందు సమస్థానమున(నడుము) నుండునుగదా! అట్టి సమత్వమునందే బ్రహ్మత్వసిద్ధిగలుగును, సమత్వమే బ్రహ్మత్వము. అదుండనిండు విష్ణుఁడు పక్షివాహనుఁడని పురాణములు పలుకుచున్నవి. లోకము, సుఖము, దుఃఖము; పాపము, పుణ్యము; దేవతలు, అసురులు; అను పక్షద్వితయముతో (రెండు ప్రక్కలతో)నొప్పుచున్నదని యందఱకుఁ దెలిసిన విషయమేగదా! ఈ రెండు పక్షములలో నేదానియందైన మొగ్గుసూపక సమభావముతో, రెంటిపై నధిష్టిం చినవాఁడై యుండినందున, భగవానుఁడు పక్షివాహనుడను టెంత సొంపుగనున్నదో, విజ్ఞులెఱిగిన యంశమే! అందువలన నాకాశమును, మంచి, చెడ్డయను వివక్ష లేక, యంతటను సమముగా నుండునది కాదా! మఱి యాకాశము పక్షివాహనుఁ డగు వెన్నుడనుటలో నమ్మరానిదేది? ఇఁక విష్ణునకు చతుర్భుజములు గలవని పౌరాణికు లనిరి. ఆకాశమున కాభుజముల లెట్లన్వయింపఁ జేయుటా యను మీమాంస కవకాశమే లేదు. ఆకాశమునకుఁ గర్మసాధనములుగా వాయ్వగ్ని జలపృథ్వీభూతము లొప్పునని పైఁ జెప్పితిమి. భుజములు కర్మసాధనములుగదా! ఆనాల్గే యాకాశమునకు భుజములనుటయే యందలి యథార్థము.

కాఁబట్టి పిండితార్థమేమన; విష్ణు యందుఁ జతుర్ముఖ బ్రహ్మ జన్మించెననగా, నాకాశమునందు వాయ్వగ్ని జలపృథ్వీభూతములు కలిగి నాల్గు ముఖముల సృష్టిని గావించుచున్నవని చెప్పినటులైనది. అదేలన సృష్టియంతయుఁ బై నాలుగు భూతముల సహాయము వలననే కలుగుచున్నదని మన మెఱింగిన విషయమే! అంతేగాదు. పైఁజెప్పఁ బడిన నాలుగుభూతములు నన్యోన్య సహకారములేక, సృష్టి కార్యమును సాగింపఁజాలవు.

ఒక చిన్న యుదాహరణము తీసికొందము. ఒక బీజమువలన వృక్షము వెలువడవలయుననిన, దానికి భూమి, నీరు, వేడిమి, గాలి యవసరములుగదా! వీని సహాయములేనిది విత్తనము వృక్షమగుటటులుండ మొలకైన నెత్తునా? కాఁబట్టి లోకనిర్మాణ మంతయును, భూత చతుష్టయముయొక్క, సమిష్టితత్వముననే, జరుగుచున్నదని దృఢముగ చెప్పఁగలిగితిమి. అందువలననే చతుర్ముఖ బ్రహ్మ యనిన వాయ్వగ్ని జలపృథ్వీభూతముల సమిష్టి కర్మస్వరూపియని తేలినది.

‘‘కర్మ బ్రహ్మస్వరూపిణి’’ అను నార్యోక్తి విననివారుండరు, ప్రతికర్మయు నాలుగంగముల సంబంధముతోనే యెప్పుచున్నది. లోకము కర్మస్వరూపమై చాతు ర్వణ్యముగా నున్నది. దీనికి జనకుఁడు, ప్రభువు, అయిదవ వాఁడే యగుచున్నాఁడు. అతఁడె విష్ణు శబ్దవాచ్యుఁడై, యాకాశమూర్తియై యున్నాడు. ఇదియే పురాణము లందు వర్ణితమైన విశ్వవతార తత్వము.

మఱియుఁ బురాణములలో, శివ, విష్ణు, బ్రహ్మ శక్తి పురాణములని వివిధములుగా నున్నవి. వానిలో నే పురాణమునందు నే దేవతను ప్రధాన ప్రభువుగ, ప్రధానాధిదైవముగ నొకానొక విశేష్య వాచకములోఁ జెప్పియుండినను, యా దేవత యాకాశమూర్తి యనియే యన్వయించుకోవలయును. శైవపురాణమునం దంతయు శివుఁడు సర్వాధి దేవతగఁ బేర్కొనఁబడియున్నాడు. శివశబ్దములో నుచ్చరింపఁబడినది మంగళకరమగు నాకాశభూతమే యగును, శివశబ్దమునకు చెప్పిన విశేషణములన్నియు నాకాశభూతమునకు నొప్పుచున్నవేగాని వేఱుకాదు. అందులో నొక్కయంశమునుఁ దీసికొని పరికింతము, ఆపురాణములం దన్ని చోట్లను శివుఁడు వృషభవాహనుఁడని వర్ణింప బడినాఁడుగదా! వృషభ మొక చతుష్పాత్తగు జంతువే గదా! దీని నెక్కుటచేతనే ఆ దేవుఁడు వృషభవాహనుఁడై యున్నాఁడు. అజ్ఞానమే ప్రధానమైనదగుట కర్మరూపమగు లోక మొక వృషభ మగుచున్నది. దీనికి నంగంబులగు వాయ్వగ్ని జలపృథ్వులు నాలుగును నడుపువాఁ డాకాశమూర్తియగు శంకరుఁ డనుటలో వింత యేమియు లేదు.

నాలుగు పాదము లగుచున్నవి. ఇట్టి యజ్ఞానమూర్తిని ఇట్లు పురాణములందు వర్ణితంబులగు ప్రధాన దేవతలను ఆకాశము కన్వయించుకోవచ్చును. మరొక విశేషము గమనింపుడు. అజ్ఞాన యుక్తము, కర్మస్వరూపము నామరూపాత్మకము, చాతుర్వర్ణ్యము నగు లోకమంతయును క్షేత్ర మనఁబడుచున్నది. నియంతగను, ప్రభుపుగ నుండిన ఈశ్వరుడు క్షేత్రజ్ఞుఁడని సర్వపురాణములు నేకవాక్యముగ వాకొనుచో, పురాణమందు వెవ్వేరు దేవతలు చెప్పఁబడి రనుకొనుటకంటె వెఱ్ఱితనముండునా?

వేదశాస్త్రములందును, భారత, భాగత, రామాయణాది సర్వపాచీన గ్రంథములందును, మహర్షులచేత అనేక చిత్రవిచిత్రములగు రచనలతో, కథలతో, రూపకోత్ప్రేక్షాద్యనే కాలం కారములతో వర్ణింపఁబడియున్న సారస్వతమంతయు నీక్షేత్ర, క్షేత్రజ్ఞ, విజ్ఞానమేయని యెఱుంగవలయును.

శ్లో॥ ఋషిభి ర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్‌

బ్రహ్మసూత్ర పటైశ్చేవ హేతు మద్భిర్వి నిశ్చితైః ॥ గీత13.4

తా॥ ఋషులచే బహువిధములుగా చెప్పబడిఁనదియు వివిధములగు వేదముల చేత వేర్వేరుగా వర్ణింపఁబడినదియు, యుక్తియుక్తములు సంశయ రహితములగు బ్రహ్మసూత్ర పదములచేత వర్ణింపఁబడినడంతయు నీక్షేత్ర, క్షేత్రజ్ఞ విజ్ఞానమే యని తెలియవలయును.

ఇట్టి తత్వనూత్రముతో, బరిశీలించెడువారికి పురాణాదులందు వైషమ్యభావము లుదయించవు. సర్వము 1. క్షేత్రము (లోకము) 2. క్షేత్రజ్ఞుఁడు (ప్రభువగు ఆత్మ) 3. మూలభూతమగు పరమాత్మగ విభజించుకొని వానిలక్షణములను యెఱింగిన యెడల వర్ణితమంతయు సమస్వయ మగుచుండును. క్షేత్రస్వరూపమైయున్న, నామరూపాత్మకమగు లోకమం దుండెడి చరాచర జీవరాసులన్నియు నాలుగు జాతులుగా నొప్పుచున్నవి. అవేవన:

  1. జరాయుజ జాతి - మావితోఁబుట్టు భూతములు, మనుష్యులు, మృగాదులు.
  2. అండజ జాతి - గుడ్డులోనుండి పుట్టునవి: పక్షులు, పాములు, బల్లులు మొదలగునవి.
  3. స్వేదజ జాతి - నీటి చెమ్మచేత జనించునవి : పేలు, నల్లులు, క్రిములు మొదలగునవి.
  4. ఉద్భిజములు - భూమిని భేదించుకొని పుట్టునవి : తృణ, వృక్ష, లతా, పర్వతాదులు.

ఇట్టి చతుర్విధ జీవరాసులలో వాయ్వగ్ని జలపృథివీ భూత ములయొక్క గుణలక్షణములు ప్రత్యేక విశేషములతో నగుపడు చున్నవి. జరాయుజ జాతికిఁ జెందిన మనుష్యులయందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది జాతులును; పశువులయందు గోమహిషాశ్వగజాది జాతులును; మృగాదులయందు ప్రసిద్ధముగ భిన్న జాతులును గలవుగదా!

ఇట్లుఁ బేర్కొనుచుండినఁ బ్రతియొక్కొక భిన్న జాతియందు జన్మసిద్ధములగు రూప స్వభావ క్రియాభేదములతో నవాంతరజాతు లనంతముగ వెలయుచున్నవి.

ఉదాహరణకు మామిడినిఁ గైకొందము. అదొక్కజాతియై యుండియు యెన్నియో తెగలుగా నొప్పుచున్నది. ఇట్లు భిన్న జాతులుగ చెప్పఁబడు మామిడి చెట్లయందు ప్రతియొక్క దానియందును ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, రుచి, గుణము, ఆకారము ప్రత్యేక లక్షణములతో నొప్పుచున్నవిగదా! కాన జాతియనగ జన్మచేతనే తెలియఁబడు సామాన్య రూప, క్రియా, గుణధర్మముఁగలది. యని భావము తేలుచున్నది.

లోకమునం దిట్టి విభేద లక్షణములతో నొప్పెడి యనేక జాతు లున్నను అవి యన్నియును గుణకర్మల యొక్క విభాగ తారతమ్యములవల్ల నేర్పడినవే గాని మూలములగు జాతులు లేక గుణములు మూడును, కర్మయొక్కటియు, గలసి నాలుగే యైయున్నవి. అవియే చతుర్వర్ణములని పలుమారు చెప్పితిమి. వేరొక విధమగును. ఉదాహరణ గైకొందము. సంఖ్యలలో దశ, శత, సహస్రాది. సంఖ్యలు అనంతములుగ నున్నవిగదా! ఆసంఖ్యలన్నియును, మొదటి పదియంకముల సమ్మేళనమువల్లనే కలుగుచున్నవని యంద ఱెఱుంగుదురు. అటులనే లోకమందనేక జాతులున్నను, అవియన్నియు, నాలుగు జాతులనుండియే జనించినవి. ఇట్లు నాలుగు జాతులుగ నొప్పెడి లోకస్వరూపమగు పరమాత్మ నారాధించుట కర్మమార్గమనియుఁ దీనికంతకు గారణముగ నొప్పెడి యీశ్వర స్వరూపమగు పరమాత్మ నారాధించుట జ్ఞానమార్గమనియు, మానవులు తరించుటకు రెండు మార్గములు గలవనియు భగవంతుఁడిట్లాదేశించియున్నాడు.

శ్లో॥ లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం॥ గీత 3-3

తా॥ ఓయర్జునా! లోకమందు మానవులు తరించుటకు రెండువిధములగు నిష్ఠలు పూర్వము నాచే చెప్పబడినవి. సాంఖ్యు లకు జ్ఞాననిష్ఠయు, యోగులకు కర్మనిష్ఠయు చెప్పఁబడినవి. భగవంతుడిట్లు నిరూపించిన రెండునిష్ఠులు నిట్లు క్రమముగా నొప్పుచున్నవి.

జ్ఞానయోగము కర్మయోగము

బ్రహ్మస్వరూపము ధర్మస్వరూపము

సాంఖ్యము యోగము

నివృత్తి రూపమ ప్రవృత్తి రూపము

జ్ఞానము కర్మయోగము

ఈశ్వరము లోకము

అదృశ్యము దృశ్యము

వర్ణ రహితము చాతుర్వర్ణ్యము

సాధకులకిట్లు రెండునిష్ఠలు చెప్పఁబడియున్నను, ఈ రెండిరటికిని; గమ్య మొక్కటియేయని భగవంతుఁ డీక్రిందివాక్కులతో స్పష్టపఱచి యున్నాడు.

శ్లో॥ యత్సాం ఖ్యేః ప్రాప్యతే స్థానం తద్యో గైరపి గమ్యతే

ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి॥ గీత 5-5

తా॥ సాంఖ్యులచేత నేస్థానము పొందబడుచున్నదియో, కర్మయోగులచేతను ఆస్థానమే పొందఁబడుచున్నది. ఎవడు సాంఖ్య కర్మయోగముల రెంటి నొక్కటిగనే తెలిసికొనుచున్నాడో వాడే తెలిసినవాఁడు.

సాంఖ్యమార్గ మద్వైత మగుటవలన మందాధికారులకు సులభ సాధ్యముగా నుండదు. యోగమార్గమగు కర్మతంత్రము వర్ణాశ్రమ ధర్మరూపమున చతుర్విధముగ నొప్పుచున్నది. ఈ రెండునిష్ఠలయందు గల తత్వమును భగవద్గీతయందు పేర్కొనిన సాంఖ్య, యోగ, శబ్దాక్షరములే తెలుపుచున్నవి విలోకింపుడు.

-సాంఖ్యశబ్ద నిర్వచనము-

సాంఖ్య శబ్దమునందుగల మూడక్షరములకు అక్షరసాంఖ్య సూత్రము ననుసరించి,

స - అను అక్షరమునకు 7 ఏడు చిహ్నమగును.

ఖ - అను అక్షరమునకు 2 రెండు చిహ్నమగును.

య - అను అక్షరమునకు 1 ఒకటి చిహ్నమగును.

ఈ మూడంకెలను కూడినచో 10 పది వచ్చును.

ఈ దశమసంఖ్య పరిపూర్ణతకుఁ జిహ్నముగ నొప్పుచున్నది. ఏలన లోకమునగల కోట్లకొలది సంఖ్యలన్నియు పదియంకముల నుండియే జనించియున్నవని ముందే చెప్పితిమి.

మఱియును యిట్టి దశమ సంఖ్యయందున్న రెండంకములలో మొదటిదగు ఎకాంకము ఒకటి యేమి తెల్పుచున్నది? ఏకము అద్వితీయమగు బ్రహ్మతత్వ మొక్కటియే గమ్యమైనదియు, సత్యమైనదియు నని తెలువు చున్నదిగదా!

అట్టి ఏకాంకమును చేరియున్న రెండవదగు శూన్యాంకము సున్న, సత్యమగు ఏకాంకముదక్క మిగిలినదంతయును శూన్యమేయని బోధించుచున్నదని యెంత స్పష్టముగ వివరించునో గమనింపుడు. దీనినే,

‘‘ఆఢ్యుఁడొక్కడున్న నందరు పూజ్యులు

లెక్కమీద సున్న లెక్కినట్లు’’

అనెడు నార్యోక్తి చే వివరింపవచ్చును. సత్యమగు బ్రహ్వతత్వ మొకటి యారంభమునందున్నందు వలననే శూన్యరూపములగు నితర. భూతముల కెల్లను గణ్యత యేర్పడుచున్నది. అది లేకున్న నివి పూర్ణానుస్వారములే! ప్రథమాంకముపై నాధారపడియున్న సున్నలలో అంకెకు సున్న యెంతదూరమైనది యగుచుండునో, అసున్నకు విలువయు నంత తగ్గుచుండును. మఱి అంకెకు సున్న యెంత సామీప్య మునందుండునో దానివిలువయు నంతగ హెచ్చుచుండును.

అటులనే పరబ్రహ్మ సాన్నిధ్యమునకుఁ భూతము లెంతసమీపమునకుఁ జేరియుండునో యాభూతములకు మిగతవానిలో అంతటి విలువ యుండును. దూరమగుకొలదియు విలువ తగ్గుచుండుననియు సామాన్యబుద్ధికిఁదోచుచుండును.

భగవద్గీతయందలి సాంఖ్యశబ్దమే : ‘‘బ్రహ్మ సత్యం జగన్మిథ్యా’’ యను వేద తాత్పర్యమును చాటి చెప్పుచున్నది.

- యోగ శబ్ద నిర్వచనము -

భగవద్గీతయందు ప్రయోగింపఁబడిన వర్ణాశ్రమ ధర్మరూపమున చతుర్విధమై యుండెడి రెండువదియగు ధర్మతంత్రమును తెలియఁజేయుచున్న యోగశబ్దము నందుగల రెండక్షరములకు అక్షరసాంఖ్య సూత్రము ననుసరించి యర్థమునుఁ దెలిసికొందము.

యో - అనగ 1 ఒకటి అగును.

గ - అనగ 3 మూడు అగును.

ఈ రెండం కెలను కూడినయెడల 4 నాలుగు వచ్చును. ఈ నాలుగుసంఖ్య కర్మరూపమగు లోకమందుగల చతుర్వర్ణములను బోధించుచున్నది. పై యోగశబ్దమునందుగల అక్షరాంకములు క్రమముగ నుంచినయెడల ముందు భాగమునందు 1 ఒకటవ అంకము, ప్రక్క భాగమునందు 3 మూడవయంకము నేర్పడును.

శ్లో॥ అంకానాం వామతోగతిః

తా॥ ‘‘అక్ష రాంకములు కుడిదిక్కునుండి యెడమదిక్కునకు వాయవలెను’’ అనుపలుకుల ననుసరించి పై యంకెలనుంచితిమిపో ముందుగ మూడవయంకము దానిప్రక్కగ ఒకటివచ్చి 31 ముప్పదిఒకటి యగును.

ఇటుల విలోమముగ నేర్పడిన రెండంకములలో ముందు భాగమునందుగల మూడవయంకము కర్మరూపమును లోకమందుగల చతుర్వర్ణములలోను మొదటగల బ్రహ్మ, క్షత్రియ, వైశ్య వర్ణములకుఁ జెందిన వేదాధికారముగల ద్విజ జాతిని తెలుపుచున్నది. భగవంతునిచేత చతుర్వర్ణములుఁ జెప్పఁబడిన సందర్భములో వక్రములైన సత్వ, రజ, స్తమోగుణములు మూడును ఒకజాతికిఁ జెంది, ముందున్నవి గాన పైఁ దెలిపిన యంశమే స్థిరపడుచున్నది. మఱియు గ్రంథాదిని చతుర్వర్ణములుగాఁ జెప్పఁబడిన వాయ్వగ్ని జలపృథీవీ భూతములు నాలుగింటిలో సూక్ష్మరూపము, చలనగుణము, సామాన్య లక్షణముగా కలిగి యొకవర్గముగ నేర్పడి మొదటనున్న వాయ్వగ్ని జలభూతములను మూటినికూడ పైమూడవ యంకమే బోధించు చున్నది.

కార్యరూపమగు నీలోకమునందుండిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రు లనియెడివారిలో ద్విజ జాతికిఁ జెంది, వేదాధికారము, (ఉపనయనాది సంస్కారములు) గల బ్రహ్మ, క్షత్రియ, వైశ్య జాతులను మూడిరటిని పై నుండు మూడవయంకె తెలుపుచున్నది. ఇఁక దానికిముందుండు నొకటి కర్మస్వరూపమగు శూద్రవర్ణ మనఁదగిన పృథివీభూతమును తెలుపుచున్నది. కాబట్టి పైఁ దెలిసిన యోగ శబ్దా క్షరాంక భావములను, భగవద్గీత మఱియొక చోటను, పై విషయము నిట్లు బలపఱచుచున్నది. విలోకింపుడు.

శ్లో॥ బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరం తప

కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై ద్గుణైః  గీత 18-41

ఈశ్లోకమందు నాలుగుజాతుల వారిని రెండుతరగతులకుఁ జెందిన వారినిగ విభజించి, మొదటితరగతి బ్రాహ్మణ, క్షత్రియ, విశాంఅని ఒకవర్గముగా, ద్వంద్వసమాసముతో నొక వాక్యమునందు చేర్చి, ‘‘శూద్రాణాంచ’’ యను పదమును ప్రత్యేకముగా భగవానుఁడు ప్రయోగించెను. ఇందువలన ముందుఁ దెలిపిన యోగశబ్దాక్షరాంకములయొక్క భావములు స్పష్టమగుచున్నవి. మఱియు అక్షర ప్రపంచ సృష్టిని తెలియఁజేయు వ్యాకరణశాస్త్ర మాహేశ్వర సూత్రములందును

‘‘హ-య-వ-ర-ట్‌’’ అనెడి సూత్రమందలి నాలుగక్షరంబులచే నాకాశ వాయ్వగ్నిజల భూతంబులను క్రమంబుగఁజెప్పఁబడ ‘‘లజ్‌’’ అనెడి ప్రత్యేక సూత్రముచేత పృథివీభూతము నొక్కటియుఁబై భూతవర్గంబునకు సంబంధము లేని దానినిగాఁ జెప్పఁబడియున్నది.

మఱియును వేదములు నాలుగున్నను, ఋగ్యజుస్సామ వేదములు మూడు నొకవర్గముగ నొప్పుచుండ నధర్వణ వేద మొక్కటియును, ప్రత్యేకముగఁ జెప్పఁబడుచున్నది.

శ్రుతి॥ త్రయోవేదా ఆజాయంత ఋగ్వేద ఏ వాగ్నే రజాయత

యజు ర్వేదో వాయోః సామవేద ఆదిత్యాత్‌॥ ఐతరేయం 5-32

తా॥ మూడు వేదములు జనించినవి. అందు ఋగ్వేద మగ్నివలనను, యజుర్వేదము వాయువువలనను సామవేద మాదిత్యునివలనను జనించెను. ఇదే విషయమును - మనుస్మృతియు నీక్రిందివిధముగాఁ దెలువుచున్నది.

శ్లో॥ అగ్నివాయు రవిభ్యశ్చ త్రయం బ్రహ్మ సనాతనం

దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్వజు స్సామ లక్షణం॥ 1-2-8

తా॥ యజ్ఞసిద్ధికొఱకు సనాతన శబ్దబ్రహ్మరూపమగు ఋగ్యజుస్సామ లక్షణముగల వేదత్రయమును పరమేశ్వరుఁడు జనింపఁజేసెను.

-వేదాధికారము -

అట్టి వేదపఠనమునకుఁగల యధికారమును గూర్చి విచారింతము. లోకమందుగల చతుర్వర్ణముల వారిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైౖశ్యులకు మాత్రమే ఉపనయన సంస్కారము, ద్విజత్వము, వేదాధికారము గలదని శ్రుతిస్మృత్యాదులు దెల్పుచున్నవి. అందులకుశ్రుతి:

శ్రుతి॥ గాయత్య్రా బ్రాహ్మణ ముసృజ త్త్రిష్టుభా రాజన్యం జగత్యా

వైశ్యం నకేన చిచ్ఛూద్రం॥

తా॥ పరమేశ్వరుడు గాయత్రీ ఛందస్సుచేత బ్రాహ్మణుని త్రిష్టుప్‌ ఛందస్సు చేత క్షత్రియుని, జగతీ ఛందస్సు చేత వైశ్యుని సృజించెను, శూద్రుని నేఛందస్సుచేతను సృజించలేదు.

ఇదేవిషయము భాగవతమునం దిట్లున్నది.

శ్లో॥ వివాహమా సంస్కారం శూద్రోపి లభతాం సదా

నకేన చిత్త్స మసృజత్‌ ఛందసా తం ప్రజాపతిః॥  భాగవతము 7-11

తా॥ వివాహమాత్ర సంస్కారమే శూద్రునికిఁ గలదు. బ్రహ్మదేవుఁడు ఏఛందస్సు చేతను శూద్రుని సృజించలేదు. మఱియు నాగ్రంథమే అధ్యయన మటులుండ వినుటైనను కూడదనుట కిట్లు చెప్పుచున్నది.

శ్లో॥ స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీ నశ్రుతి గోచరా

కర్మశ్రేయసి మూఢావారి శ్రేయ ఏవం భ వేదిహ॥

  ఇతిభారత మాఖ్యానాం కృపయా మునినా కృతం॥ 1-4

తా॥ స్త్రీలు, శూద్రులు, ద్విజాధములు వేదములు వినఁగూడనివారు. కాని వారి శ్రేయస్సునకై కృపతో వ్యాసమహర్షి వేదార్థమునుఁ దెలిపెడి భారతమును రచించెను.

ఈ విషయమున నిట్టి ప్రమాణము లింక నెన్ని యోగలవు. బ్రహ్మ సూత్రములయం దపశూద్రాధికరణమం దీవిషయము చక్కని హేతువాదములతో చర్చించఁబడి, మహర్షులచేత నిశ్చయింపఁబడి యున్నది. కాని మానవులలోఁ గొందఱకు వేదాధికారము గలదనుటయుఁ, గొందఱకు లేదనుటయు, భగవంతునికి పక్షపాతముండియా లేక బ్రాహ్మణకల్పితమగు మోసమా? అని కొంద ఱాధునికులు తీవ్రవాదనకు దిగుచున్నారు. భగవంతునికి పక్షపాతము గలదనుట మిక్కిలి యవివేకము, ఏలందురా, గీతయందు భగవానుడే,

శ్లో॥ సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నక్రియః గీత 9-29

తా॥ నేను సర్వభూతములందును సముడనై యున్నాను. నాకు శత్రువుగాని, మిత్రుడుగాని లేఁడు. అని నుడివియున్నాడు.

కాన భగవంతునికి పక్షపాతబుద్ధి లేదని నిర్ధారణమగుచున్నది. ప్రకృతి యెప్పుడును బీజరూపమునుండి ఫలరూపముగను, ఫలరూపము నుండి బీజరూపముగ ననేక పరిణామ దశలతో నుండుట లక్షణంబుగా గలిగియున్నది. అటులనే మానపునందును బీజరూపమగు అత్యంత మూఢావస్థ మొదలుకొని ఫలరూపమగు పరిపూర్ణ విజ్ఞానావస్థవఱకు గల యనేకతరగతులున్నవి. వారివారి స్వభావములకు తగినట్లు వారి జాతియు, జాతికి తగిన విధి నియమములు, కర్మలును భగవంతునిచేత నిష్పక్షపాత దృష్టితో నిర్ణయింపఁబడియున్నవి.