వారి యోగ్యతానుసారముగ సర్వభూతములను దర్శించుటయే భగవంతుని యాశయము. ఇందులకు ప్రాపంచిక విషయము నుదాహరణగా పాఠశాలయందలి ఉపాధ్యాయునిఁ గైకొందము. అన్ని తరగతులలోని విద్యార్థులకును విజ్ఞానము కలిగించుటయందు, నందఱయెడల నతఁడు సమభావము గలవాఁడుగనే యుండునుగదా! అట్టి ఆదర్శసిద్ధికి ఏతరగతి విద్యార్థులకు నేనియమములు విధించి, యెట్టి శిక్షణముతో, నేగ్రంథములు నెట్లుబోధించిన వారికిఁ గ్రమవికాసము కలుగునో గుర్తించి, యటుల నొనరించుచుండునుగదా! అట్టిచో విద్యార్థులయందు భేదభావముగలిగి కొందటి కెక్కువఁ, గొందఱకుఁ దక్కువ పాఠముల బోధించు పక్షపాత ముపధ్యాయుఁడు కలిగి పిచ్చి ప్రసంగము గాదా!
-వేదమంత్రములు-
అందువలనఁ బై చెప్పినట్టులే నేకొండఱకో యధికారముగల వేదమంత్రముల ప్రాశస్త్యమును విచారింతము, మంత్రము వేదస్వరూపము. అది మనస్సుచేతను వాక్కు చేతను జనించుచున్నది. కనుకనే దానికి ద్విజత్వము (రెండుమార్లుపుట్టుట) ప్రాప్తించుచున్నది. మనస్సు త్రిగుణముల సంపుటియేగదా! మంత్రములయందు శబ్దాత్మకములగు అక్షరములయొక్క సంపుటీకరణశక్తియు, మనశ్శక్తియు మిళితమై యున్నది. దానికి అంగముగ క్రియాశక్తి వెలయుచున్నది.
జగద్వ్యాప్తములై యున్న అక్షరరూప శబ్దములను రేడియో యంత్రము ఆకర్షించి, మనము కోరినట్టి సంగీతాదులను మనకు వినిపించుచున్నట్లు బ్రహ్మాండవ్యాప్తమైయున్న అక్షర దేవతాస్వరూప చైతన్యశక్తిని మంత్రములు ప్రత్యక్షము సేయుచుండును. మంత్రములయందు అక్షరరూపమున చైతన్యశక్తి యొప్పుచున్నది.
ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తులకు మంత్రాక్షరములు సంచలమును కలిగించి, ఇష్టార్థముల నిచ్చుచున్నవి. విద్యుచ్ఛక్తి యంత్రాలయ మెప్పుడును చైతన్యశక్తి భరితమైనదేయైయున్నను, చక్కని సంధానక్రమ మెఱిఁగి, ఆతంత్రులను సంధానము చేయగలిగినప్పుడే దానియందున్న విద్యుచ్ఛక్తి నియమిత కార్యములను చేయుచున్నది. అటులనే అక్షరములయందు చైతన్యశక్తి సర్వదా యొప్పుచున్నను, అనుసంధాన క్రమమెఱిఁగి యుపయోగించుకొనవలయును.
రసాయనశాస్త్రవేత్తలు భౌతికములగు వస్తువులలో నేయే వస్తువులను నేసంస్కారములతో నెంతెంత పరిమాణముగా చేర్చి యెట్లెట్లు పాక మొనర్చిన వానినుండి యేమేమిశక్తులు కలుగుచున్నవో ఆయాశక్తులవలన లోకమున కెట్టి యుపయోగములు చేయవచ్చునో గుర్తించి, వారు ఆభౌతికములగు వస్తువులతో తమ శాస్త్రీయ విధానముల కారణమున ననేకాద్భుత కార్యములనుఁ చేయుచున్నట్లు మహర్హులును, శక్తివంతములగు అక్షరములలో నేయేయక్షరముల నేయే స్వరములతో నేయేశబ్ద సమాస ఛందస్సులతో దేశ కాలాదుల నెఱింగి యెట్లెట్లు ప్రయోగించిన నేమేమిఫలములు సిద్ధించగలవో గుర్తించి, అక్షరశబ్ద విన్యాస విధానములలో మంత్ర వేత్తలై లోకోప కారమునకై వానినేర్పఱచియున్నారు.
భౌతిక యంత్రప్రయోగములకు ఆశాస్త్రాధికారు లెట్లు అర్హులగుచున్నారో, అట్లే మంత్రప్రయోగములకును, అట్టి తత్వవేత్తలే అర్హులగుచున్నారని వేఱుగఁ దెలుప నవసర మేమి? వేఱుగఁ దెలుప నవసరమేమి? మారణాస్త్ర కర్మాగార ములయందు సంచరింపఁగల నైపుణ్యము తడధికారులకుఁ గలదుగాని. తెలియనివారు సంచరించుటే తటస్థించిన ప్రమాదముల పాలు గావలసివచ్చును గదా! మఱొక విషయమును గమనింపుడు.
సూ॥ మంత్రోహీన స్స్వరతో వర్ణతోవా మిథ్యాప్రయుక్తో సతమర్ధమాహా
సవాగ్వజ్రో యజమానం హినస్తి యధేంద్ర శత్రుస్స్వరతో పరాధాత్॥
తా॥ స్వరహీనముగనో అక్షరహీనముగనో మంత్రమును ప్రయోగింపరాదు. అట్లు ప్రయోగించిన యెడల వజ్రమువంటి వేద వాక్కు ఇంద్రశతువగు వృత్రుఁడు. ఇంద్రునిపై స్వరవ్యత్యాస దోషముతోఁ బ్రయోగించిన మంత్రము, వానినే హింసించినట్లు, దానిని ప్రయోగించిన యజమానినే హింసించును,
శ్లో॥ న్యస్తహీనం తుయో ధీతే స్వరవర్ణ వివర్జితం
ఋగ్యజుస్సామ భిర్దగ్ధో వియోని మధిగచ్ఛతి॥
తా॥ వేదమంత్రము నెవఁడు విన్యాసక్రమములేక స్వరాక్షర హీనముగ చదువునో వాఁడు ఋగ్యజుస్సామములచేత దహింపఁబడి, తిర్యగ్జాతి యోనియందు జనించును.
మంత్రములయం దొక విధమగు అలౌకిక దేవతాశక్తి కలదనుట సత్యము, లోకమునందు ఇప్పటికిని అట్టినిదర్శనము లెన్నియో సంభ వించుచున్నవి. కనుకనే,
శ్లో॥ దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తుదైవతం
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవతా॥
అనెడి యార్యోక్తి అమోఘమై వ్యాపించియున్నది.
-మంత్ర వర్ణముల విధి ప్రయోజనములు-
నామరూపములతో నొప్పుచుండిన సమస్త ప్రకృతియు ఆత్మశక్తిచేత నెల్లప్పుడును చలించుచుండును. జీవులకు పాధులుగ నేర్పడిన స్థూలసూక్ష్మ శరీరములు. ఆజీవులయొక్క పూర్వకర్మ స్వభావముతో చలించుచుండును, మంత్రములును మఱియు పవిత్రపదార్థములను అట్టి జీవులయొక్క స్థూలసూక్ష్మ శరీరములకు కలిగెడి అరిష్టదాయకములగు దుష్టచలనాదులును నిరోధించి, వానికి సద్వర్తనమును కలిగించుటయందు మిక్కిలిగా నుపయోగపడుచున్నవి. మంత్రములు శబ్దాక్షర ధ్వనులతో నొప్పుచుండును, మంత్రములయందలి, ఆయా అక్షరశబ్ద ధ్వనులు ఒక్కొక్కటియు సూక్ష్మలోకమునందు ఒక్కొక్క రూపవర్ణమును (రంగును) కలుగఁజేయుచున్నవి. స్థూలప్రపంచ వ్యవహారములకధికారపదవి వహించిన దేవతలును సూక్షలోకమునందు వివిధ రూపవర్ణములుగల ఆకారములతో నొప్పియున్నారు. శాస్త్రీయ క్రమవిధానములతో మానవు లుచ్చరించెడి మంత్రాక్షరశబ్దములకు (ధ్వనులకు) అనురూపములగు రూప వర్ణములు, సూక్ష్మలోకమునందు జనించి, శబ్దవర్ణములతో సమాన రూపవర్ణముగల దేవత నాకర్షించును. ఆ దేవత మానవుఁ డుచ్చరించిన మంత్రాక్షర శబ్దమువలన జనించిన రూపమునందు ప్రవేశించి, ఆశబ్దము నుచ్చరించిన పురుషునితో సంబంధముగలది యగుచున్నది.
సూక్ష్మదృష్టిగల మంత్రవేత్తలు భూలోకమందలి మానవులకు ఇష్టార్థముల నొసంగెడి సర్వకర్మలను ఫలింపఁ జేయుటకు స్వభావమునుఁబట్టి ఏయేకర్మలు ఫలించుటకు ఏయేదేవతలు అధికారులై యున్నారో వారియొక్క స్వరూప స్వభావవర్ణము లెట్టివియో యెఱింగి అట్టి దేవతాస్వరూపమును జనింపఁ జేయగల శబ్దాకర మంత్రములను నిరూపించి, ఆయామంత్రములు ఫలించుటకుఁ దగిన ద్రవ్య కాలక్రియావిధులను నిర్ణయించియున్నారు. ఏమంత్రమందు ఏ దేవత బంధింపఁబడియున్నదియో, ఆ దేవతయొక్క శరీర స్వభావము ననుసరించి, ఆమంత్రము నుచ్చరించు వానియొక్క స్థూలసూక్ష్మశరీరములకు చలనమునుఁ గలిగించుచుండును, మంత్రము నుచ్చరించువానియొక్క పారిశుధ్యము ఏకాగ్రత భక్తి మొదలగు వాని ననుసరించి, ఫలసిద్ధులకు అవధు లేర్పడియుండును. మంత్రము నుచ్చ రించెడివాని శరీరమందు మంత్ర దేవతయొక్క వర్ణరూప స్వభావముచే కలిగిన తీరు చలనమును భరింపజాలని మలిన ప్రకృతి గలిగియుండిన యెడల అమంత్రము నుచ్చరించువాని శరీరమునందు మిక్కిలిబాధ జనించును. అట్టి తీక్షణ చలనమును భరింపఁజాలక ఒకప్పుడు ఉచ్చరించు వాని స్థూల శరీరముగాని, సూక్ష్మశరీరముగాని, రెండునుగాని చెడినను చెడవచ్చును. కావున దుష్టమగు మలినస్వభావము గలవాఁడు, గొప్ప తేజోవంతమగు మంత్రము నుచ్చరించినను, వినినను కడకు సమీపమందున్నను విశేషబాధలు పొందితీరును.
కొన్నితత్వంబులుగల శరీరులకు మంత్రములవలన స్మృతి చెడుటయు, ఆవేశాదులుఁ గలుగుటయు మనకు ననుభవగోచరమే యగుచున్నది గదా! మంత్రంబులే యననేల, కొన్ని వాద్యంబులయొక్క ధ్వనులు సైతము (చిందుతప్పెట, రణధ్వని) కొన్ని శరీరతత్వంబులకు ఆవేశాదులను గలిగించుచుండుట చూచు చున్నాము. అదృశ్యంబగు సూక్ష్మ లోకమందు (అవకాశంబుగల బయలు)నియమ యుక్త మగు వర్ణరూప స్వభావంబుగల దేవీప్రకృతియు; నియమరహితంబును, వికారవర్ణ రూపస్వభావంబునుగల ఆసురీప్రకృతియు; వ్యాపించి యొప్పుచుండును. నియమబద్ధమగు దైవీప్రకృతికంటెను, నియమరహితమగు ఆసురీ ప్రకృతి విశేషవ్యాప్తి గలదై, లోకమందు నియమబద్ధులగువారి కర్మనియమంబులకు విఘాతంబులు గలుగఁ జేయుచుండును. కనుకనే లోకమందు నియమబద్ధులగు వారికన్నను, నియమరహితులు అధిక సంఖ్యలతో నొప్పుచుందురు. కాబట్టి నియమమే దైవతత్వము. నియమ రాహిత్య మాసురతత్వమని యెఱుంగవలయును. లోకమందు శాస్త్రీయ నియమయుక్తంబులగు ధ్వనులన్నియును సూక్ష్మలోకమందలి దేవతాస్వరూపంబులను కలుగఁజేయుచున్నవి. దేవపూజాది కర్మ లారంభించునపుడు ముందుగ ఆప్రదేశమందు అంతటను విశేషంబుగా వ్యాపించియుండిన అసురీప్రకృతిని వైదొలగంగఁ జేయుటకును దైవీ ప్రకృతి నాకర్షించుటకునై, తేజోవంతము బ్రహ్మరూపమగు ఓంకార ధ్వనిని కలుగఁజేసెడి ఘంటానాద మొనర్పవలెనని శాస్త్ర మాదేశించి యున్నది.
శ్లో॥ ఆగమార్ధంతు దేవానాం గమనార్థంతు రక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం॥
తా॥ దేవతల నాహ్వనించుటకును, రాక్షసులను వెడల నంపుటకును గుర్తుగ పూజాకాలమందు ఘంటానాదంబుఁ జేయుము.
మఱియు లోకమందలి ప్రతి శుభకార్యమందును శాస్త్రీయ విధి నియమంబులుగల మంగళ శుభవాద్యంబులును మ్రోగించుటంతయు నియమయుక్త కర్మ ఫలసిద్ధి నొసంగెడి దేవతల నాహ్వానించుటకును, నియమరహితులగు రాక్షసులను పోద్రోలుటకునై యున్నది.
ప్రతి శుభకార్యము నారంభించుటకు ముందుగ సర్వవిఘ్న నిరాసనార్థంబుగఁ జేయబడెడి స్వస్తి వాచక కర్మయం దిట్లు చెప్పఁబడినది,
వాక్యము॥ యంకృత్వా సర్వవేద యజ్ఞ క్రియా కరణ కర్మారంభాశ్శుభా
శ్శోభనాః ప్రవర్తంతే తమహ మోంకార మాదిం కృత్వా
భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే॥
తా॥ దేనినొనర్చిన సర్వవేదకర్మలు శుభప్రదంబులుగ ప్రవర్తిల్లునో, యట్టి ఓంకారము నాదిగఁ జేసికొని మీచే యనుజ్ఞాతుఁడనై పుణ్యాహ వాచనంబుఁ జేయుచున్నాను.
సంస్కృతమునఁ బ్రతి యక్షరమునకు నేదోయొక దేవతా సంబంధముఁ గలదనుటకు స్కాంధపురాణ మహేశ్వరఖండమందు అక్షర దేవతా స్వరూపాదు లి ట్లభివర్ణించి యున్నారు.
శ్లో॥ ఆకారః కథితో బ్రహ్మ ఉకారో విష్ణురుచ్య తే
మకారశ్చ స్మృతో రుద్ర స్త్రయశ్చేతే గుణాస్మృతాః 1
అర్ధమాత్రాచ యామూర్ధ్ని పరమ స్ససదాశివః
ఏవ మోంకార మాహాత్మ్యం శ్రుతిరేషా సనాతనీ॥ 2
ఓం కారస్యచ మాహత్మ్యం యధాత్మ్యేన నశక్యతే
వర్షాణా మయుతేనాపి గ్రంథకోటిభి రేవవా॥ 3
పునర్యత్సార సర్వస్వం ప్రోక్తం తచ్ఛ్రూయతాం పరం
అఃకారాంతా ఆకారాద్యాః మనవస్తే చతుర్దశా॥ 4
స్వాయంభువశ్చ స్వారోచిః రౌత్తమో రైవతస్త ధా
తామసశ్చ క్షుషష్షష్ఠస్తధా వైవస్వతోధునా॥ 5
సావర్ణి ర్బ్రహ్మసావర్ణీ రుద్రసావర్ణి రేవచ
దక్షసావర్ణి రేవాపి ధర్మసావర్ణి రేవచ॥ 6
రౌచ్యో భౌత్యస్త దాచాపి మననోమి చతుర్దశ
శ్వేతః పాండు స్తథారక్త స్తామ్రం పీతశ్చ కాపిలః 7
కృష్ణ శ్యామస్త ధా ధూమ్ర స్సుపిశంగః పిశంగకః
త్రివర్ణ శ్శబలోవర్ణః కర్కంధుర ఇతి క్రమాత్॥ 8
వై నస్వతః క్ష కారశ్చ తాతకృష్ణః ప్రదృశ్యతే
కకారాద్యా హకారాంతా స్త్రయస్త్రింశచ్చ దేవతాః 9
కకారాద్యా ష్ఠకారాంతా ఆదిత్యాద్వాదశ స్మృతాః
ధాతా మిత్రో ర్యమా శక్రో వరుణశ్చాంకు రేవచ॥ 10
భగో వివస్వాన్ వూషాచ సవితా దశమస్త ధా
ఏకాదశ స్తధా త్వష్టా విష్ణు ద్వాదశ ఉచ్యతే॥ 11
జఘన్య జస్ససర్వేషాం ఆదిత్యానాం గుణాధికః
ఢకరాద్యా బకారాంతాః రుద్రాశ్చెకాద శైవ తు॥ 12
కపాలీ పింగళో భీమో విరుపాక్షో విలోహితః
అజక శ్శాసన శ్శాస్త్రా శంభు శ్చండోభవ స్తధా॥ 13
భకారాద్యా షకారాంతా అష్టౌహి వసవోమతా
ధృవో ఘోరశ్చ సోమశ్చ ఆపశ్చైవ నలో-నల॥ 14
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ అష్టౌ తే వసవ స్మృతాః
సోహశ్చేత్వశ్వినౌ ఖ్యాతౌ త్రయ స్త్రింశదిమే స్మృతాః॥ 15
అనుస్వారో విసర్గశ్చ జిహ్వామూలీయ ఏవ చ
ఉపధ్మానియ ఇత్యేతే జరాయుజ స్తథాండజా॥ 16
స్వేదజా శ్చోద్భిజా శ్చేతి తతోజీవాః ప్రకీర్తితాః
భావార్థః కథితశ్చాయం తత్వార్థం శృణు సాంప్రతిం॥ 17
ఏపుమాం సస్త్వమూన్ దేవాన్ సమాశ్రిత్య క్రియాపదాః
అర్ధమాత్రాత్మకే నిత్యే పదేలీ నాస్త ఏవహి ॥ 18
చతుర్ణాం జీవయోనీనాంతదైవ పరిముచ్యతే
యదాభూ న్మనసావాచా కర్మణాచయ జేత్సురాన్ ॥ 19
యస్మిన్ శాస్త్రె త్వమిదేవాః మానితా నైవపాపిభిః
తచ్ఛాస్త్రం హీనమంతవ్యంయది బ్రహ్మాస్వయంవదేత్॥ 20
అమీచ దేవా స్సర్వత్ర శ్రుతౌ మార్గే ప్రతిష్ఠితాః
పాషండ శాస్త్రే సర్వత్ర నిషిద్ధాం పాపకర్మభిః ॥ 21
తదమూన్ యోవ్యతిక్రమ్య తపోద్యా మధోజయం
ప్రకుర్వంతి దురాత్మానో వేపంతే మరుతః పథి॥ 22
అహో మోహస్య మాహాత్మ్యం పశ్యతా విదితాత్మనాం
పఠంతీ మాతృకాం పాపాః మన్యంతే నసురానిహ ॥ 23
తా॥ అకారము-బ్రహ్మ, ఉకారము-విష్ణువు, మకారము రుద్రుఁడు. ఇవిమూడును సత్వ రజస్తమోగుణములు. ఈ మూడక్షరములు చేరి, ఓంకార మగుచున్నది. ఓంకారముయొక్క శిరోభాగ మునందున్న అర్ధమాత్ర శివరూపమగు పరమాత్మ. వేదమిట్లు ఓంకార మహాత్మ్యమును వచించుచున్నది. ఓంకార మహాత్మ్యమును కోట్ల కొలది గ్రంథములైనను పదివేల సంవత్సరములకైనను, చక్కగ వర్ణింపఁజాలవు.
అకారము మొదలుకొని అః కారమువరకును గల అచ్చులు, చతుర్దశ మనువులు: 1.స్వాయంభుఁడు 2. స్వారోచి, 3. రౌత్తముఁడు, 4. రైవతుఁడు, 5. తామసుఁడు, 6. చక్షుషుఁడు, 7. (ఇప్పటి) వైవస్వతుఁడు, 8. సావర్ణి, 9.బ్రహ్మసావర్ణి, 10.రుద్రసావర్ణి, 11. దక్షసావర్ణి, 11, ధర్మసావర్ణి; 13.రాచ్యుఁడు, 14. భౌత్యుఁడు అనువారు. వీరికి క్రమముగ 1. శ్వేతవర్ణము 2. పాండువర్ణము 8. రక్త వర్ణము 4.తామ్రవర్ణము 5. పీతవర్ణము 6. కాపిలవర్ణము 7. కృష్ణవర్ణము 8. శ్యామవర్ణము 9. ధూమ్రవర్ణము 10.సుపిశంగ వర్ణము 11. పిశంగవర్ణము 12. త్రివర్ణము 13.శబలవర్ణము 14. కర్కంధురవర్ణము లుండును. మిగత అక్షరములలో చివరి భాగమునందుండిన క్షకారము యముఁడై యున్నాడు. అతఁడు కృష్ణ వర్ణముతో నొప్పుచుండును. కకారము మొదలుకొని హకారము అంతముగాగల 33 అక్షరములు ముప్పదిముగ్గురు దేవతలైయున్నారు. వీరిలో కకారము మొదలుకొని ఠకారమువరకుగల 12 అక్షరములు ద్వాదశాదిత్యులై యున్నారు. వారు క్రమముగా 1. ధాత 2. మిత్రుఁడు 8. అర్యముఁడు 4.శక్రుఁడు 5. వరుణుఁడు 6. అంశువు 7, భగుడు 8. వివస్వంతుఁడు 9 పూషుఁడు 10.సవితృఁడు 11. తృష్ణ 12. విష్ణువు అనఁబడుచున్నారు. వీరిలో క్రమముగా పైవానికన్నను క్రింద చెప్పఁబడిన ఆదిత్యుఁడు గుణాధికుఁడై యుండును.
డకారము మొదలుకొని బకారము వఱకునుగల పదునొకండక్షరములు ఏకాదశ రుద్రులైయున్నారు. వీరు క్రమముగ 1. కపాలి 3. పింగళుఁడు 3.భీముఁడు 4.విరూపాక్షుఁడు 5. విలోహితుఁడు. 6. అజకుఁడు 7. శాసనుఁడు 8. శాస్త 9.శంభుఁడు 10. చండుఁడు 11. భవుఁడు అవి పిలువఁబడుచున్నారు.
బకారము మొదలుకొని షకారము వఱకుగల ఎనిమిది అక్షరములు అష్టవస్తువులు, వీరు క్రమముగ 1. ధ్రువుఁడు 2. ఘోరుఁడు 3. సోముఁడు 4.అప్పు 5. నలుఁడు 6. అవలుఁడు 7. ప్రత్యూషుఁడు 8. ప్రభాసుఁడు అని పిలువఁబడు చున్నారు.
సకార హకారములు అశ్వనీ దేవతలై యున్నారు.
పైనఁ జెప్పఁబడిన పసు రుద్రా దిత్యాశ్వనీ దేవతలతో వారి సంఖ్య 33 అగుచున్నది. ఇఁక 1. అనుస్వారము 2, విసర్గ 3. జిహ్వామూలీయము 4.ఉపధ్మానీయము ఇవినాలుగును జరాయుజాండజ స్వేదజోద్భిజములగు చతుర్విధ జీవజాతులు అని భావార్థము చెప్పఁ బడియున్నది.
అందలి తాత్వికార్థ మిట్లు చెప్పఁబడుచున్నది. ఏపురుషులు అక్షరస్వరూప దేవతలను సేవింపుచు, క్రియాపరు లగుచుందురో, వారు క్రమముగ అర్ధమాత్ర స్వరూపమగు పరమపదమున లీనులగుదురు.
మానవులు త్రికరణశుద్ధిగ ఫలాపేక్షను వదలి దేవతా ప్రీతిగా యజ్ఞము లొనర్చినపుడే విముక్తి నొందుదురు. ఏశాస్త్రమందు పాపాత్ములచేత నీ యక్షరరూప దేవతలు సమ్మానింపఁ బడకుందురో, యట్టి శాస్త్రము నింద్యమైనదని బ్రహ్మ స్వయముగ చెప్పెను.
వేదమార్గమునందు క్రమముగ నీ యక్షరరూప దేవతలు ప్రతిష్ఠింపఁబడి యున్నారు. పాషండ శాస్త్రములయందు పాపాత్ములు వీరిని సమ్మానింపరు. కాన నవి నింద్యములని చెప్పితిమి. ఎవ్వఁడు పైన చెప్పబడిన అక్షరరూప దేవతలను పూజింపక తపస్సు, దానము, జపము మొదలగునవి జేయునో, అట్టి దురాత్ముఁడు బ్రహ్మా పదమునుఁ జేర్చెడి దేవమార్గమునుండి క్రిందికి గాలిచేత కొట్టఁబడు చున్నాడు. అజ్ఞానులయం దుండెడి మోహమాహాత్మ్యము మిక్కిలి ఆశ్చర్యము. ఏలన పాపాత్ములు సైతము తమ వాగ్జాలమందు అన్ని అక్షరములనుఁ బలుకుచుందురేగాని అక్షర దేవతలను పూజింప కుందురు!
-నవీనుల మంత్రపరిశోధన-
దివ్యజ్ఞాన సమాజమునకుఁ జెందిన ‘లెడ్ బీటర్ థామస్’ అనెడి పాశ్చాత్య తత్వవేత్తలు వేదమంత్రముల యొక్క శక్తిని, గూర్చి తాము మిక్కిలి పరిశోధనలు గావించినట్లును, విధి విహిత బాహ్యాభ్యంతర శౌచాది నియమములుగల తత్వజ్ఞుఁడు స్వరయుక్తముగ గాయత్రీమహామంత్రము నుచ్చరించినపుడు సూర్యమండలము నుండి యొక తేజస్సు బయలుదేరి, అమంత్రము నుచ్చరించెడివాని స్థానమునకు వచ్చి, ఆస్థానమును ప్రకాశింపఁ జేయుననియు, అదే మంత్రమును అపస్వరముగ నుచ్చరించిన యెడల, ఆవచ్చిన జ్యోతిస్సు తగ్గి వెడలిపోవుననియు, నందువలన సుస్వరమంత్రోచ్ఛారణమే ఆ యా దేవతల నా ప్రదేశమునకు రప్పించుటయు సత్యమనియు ప్రకటించియున్నారు. (ఈవిషయము ది. 20-10-47 త్రిలింగ పత్రిక యందలి అంజనేయశర్మగారి వ్యాసమునుండి గ్రహింపబడినది.)
మఱియు పాశ్చాత్త్య భౌతిక శాస్త్రవేత్త యగు ‘రాన్’ అను పండితుడు తన యంత్రములద్వారా దేవతామంత్ర మహిమలను నిరూపించియున్నాడు. 1898 ప్రాంతమున వెలువడిన విద్యుచ్ఛక్తి పత్రికయందు నీవిషయము ప్రకటింపఁబడినట్లు జ్ఞాపకము)
వేదమంత్రములయందు కర్మలను ఫలప్రద మొనర్చునట్టి మహామహిమగల దేవతాశక్తి యొప్పుచున్న దనుట పరమసత్యమని యీ పై కథనము యొక్క సారాంశము. అట్టి వేదమంత్రంబులయందధికారము స్త్రీలకును, శూద్రులకును లేదని పరమ ప్రమాణమగు వేదము సహేతుకముగనే వచియించినది. లోకమందలి సర్వకర్మలును చతుర్విధంబులుగ నున్నవి. అవేవన 1. నిశ్చయించుట 2. చెప్పుట 3. చేయించుట 4. చేయుట యనునవి.
ఈనాల్గింటిలో మొదటిమూడు కర్మలను నిర్వర్తించుటకు జ్ఞానశక్తి, బుద్ధిబలము, నాలోచనయు నవసరంబులై యున్నవి. నాల్గవది నిర్వర్తించుటకుఁ బై మూటితో నవసరము లేదు. ఉదాహరణ కొక విషయము తీసికొందము. యుద్ధకర్మలో సాధక బాధకంబు లాలోచించి సరియగు కర్తవ్యమును నిశ్చయించు వాఁడొకఁడును, అట్టి నిశ్చయకర్తవ్యమును వివరముగఁ దెలిపి శాసించు వాఁడొకఁడు నుందురు. ఆ చెప్పిన విధముగ సైన్యములను నడిపి యుద్ధముఁ జేయించువాఁడు మూఁడవవాడగును, యుద్ధ మొనర్చెడి సైన్యము నాల్గవ దగునుగదా! సైనికులను సైనికాధికారి యెటుల నాజ్ఞాపించునో వారట్లు చేయవలయునేగాని, ఆలోచించి చేయవలసిన బాధ్యత వారి కుండదు. సైనికులకు మనశ్శక్తి లేకుండినను పై యధికారులకు మాత్ర మీ వివేక మెంతయో యుండవలయును.
-మానవజీవితము-
మానవజీవితము, బీజము తల్లిగర్భములోఁ జేరినది మొదలు ప్రారంభమగు చున్నది, బీజమందు మానవునియొక్క శరీరాద్యవ యవములును, ఆత్మబుద్ధి, మనస్సు, ఇంద్రియములను నిట్టివన్నియు నవ్యక్త ములుగ నున్నవి.
కమక్రమముగ నవి క్షణక్షణంబునకు, బరిణామము నొందుచు తల్లిగర్భము నుండి శిశురూపమున భూపతన మగునప్పటికి, శరీరా ద్యవయవములు పసిద్ధమగు స్ఫుటరూపములతో నుండును, అప్పటికినీ ఆశిశువునందు మనోబుద్ధ్యాదులు అవ్యక్తములుగా నణగియే యుండును. కాన శైశవదశయంతయు మూఢావస్థతోనే యొప్పుచున్నదని చెప్పనేవలయును. మానవుని ప్రథమదశయగు శైశవము శూద్ర వర్ణమై పరిణామ మందుచు క్రమముగ చాతుర్వర్ణ్య దశలను బొందుచున్నది.
శ్లో॥ జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః
తా॥ మానవుఁడు పుట్టుకచేత శూద్రుఁడుగ జనించు చున్నాడు. కర్మచేత ద్విజుఁ డగుచున్నాఁడు.
శిశుత్వమునందు మనశ్శక్తి స్ఫుటముగలేని శరీరము మాత్రమే అట్టి మూఢావస్థయు శూద్రవర్ణము పిదప క్రమముగ శిశుత్వమువీడి యుక్తాయుక్తము లాలోచించి, నిశ్చయించుకోగల మనశ్శక్తి దృఢమైనపుడు యుక్త కర్మార్హతఁ గలిగినపుడు, ద్విజుఁడగును. సంగ్రహంబుగఁ జెప్పవలెననిన సదసద్వివేక మే ద్విజత్వమునకు లక్షణము. మానవునియం దెటుల క్రమపరిణామదశలు గలవో యటులనే మానవ సంఘంబునందును నవిగలవని సూక్ష్మబుద్ధులు గ్రహింపఁ గలరు!
మానవసంఘంబునందు శైశవావస్థయందున్న జాతిని శూద్ర జాతియని వేదశాస్త్రంబులు నుడువుచున్నవి. వారికి మనశ్శక్తి మిక్కిలి యలముగ నుండును.
వారు శారీరక శ్రమోపజీవులైయుందురు. అట్టివారిని, మనస్సుతో నంతగ నిమిత్తము లేనిదియు, శరీరాంగములతో మాత్రము చేయదగి నదియునగు కర్మయందే నియోగించుట బాగు. ఆలోచించి నిశ్చయించి చేయవలసియున్న బాధ్యతాయుత కర్మలయందు వారిని నియమించిన సంకల్పితఫలము చేకూరక పోవచ్చును.
మనస్సుపై నధికారము లేనివారికి వేదాధికారముండదు. వేదములు కార్యాకార్యములను చర్చించి, నిశ్చయించునవియై యున్నవి. త్రిగుణాత్మక మైనది మనస్సు, త్రిగుణాత్మకములైనవి వేదములని వివరముగా ముందే తెల్పితిమి.
ఉదాహరణ కొక విషయమునుఁ గైకొందము పాఠశాలయందలి యుపాధ్యాయుఁడు బాలురను మనస్సుతో నంతగ నిమిత్తము లేని యక్షరములను దిద్దుచుండెడి శారీరక కర్మయందుఁ గొంత కాలము అభ్యాసపఱచును. పిదప మనశ్శక్తి క్రమంబుగ వికాసంబు నొందు చుండ వానికిఁ దగిన అంకెలు, లెక్కలు మొదలగు వానిని నేర్ప నారంభించును.
అందువలన మనోదార్డ్యము లేనివానికి నాలోచించి నిశ్చ యించవలసిన బాధ్యతలు, చిక్కులు, సంసారమునందు మిక్కుటముగ సంభవించినయెడల, వాఁడు రోగగ్రస్త్యుడగుటయో, ఉన్మత్తుడగుటయో సంభవించును. కాబట్టిసర్వులహితమునుఁ గోరియే వేదశాస్త్రము లెవరికిఁ దగినకర్మలను వారికి విధించినవి. కాని పక్షపాత కల్పితము లెంతమాత్రముగావు. శక్తినెఱిఁగి పని కల్పించుట వాని ప్రధానాశయము.
మానవునికి జన్మప్రభృతి మరణాంతమువఱకుఁ గలుగుచుండెడి క్షణక్షణ పరిణామదశలను చతుర్విధములుగు విభజించి వానికి చతుర్విధాశ్రమము లనెడి పేళ్లు వేదశాస్త్రము లా దేశించినవి.
అటులనే మానవ సంఘమునందు బహువిధ స్వరూప స్వభావములతో నొప్పుచుండెడి వారిని విభజించి చతుర్వర్ణము లనెడి పేళ్లు వేదములు నిర్దేశించినవి. మానవసంఘమునందిలి చతుర్వర్ణంబులలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు
ఉపనయనాది సంస్కారములను విధించి, మంత్రయజ్ఞముల నాదేశించినవి. మంత్రయజ్ఞము లన కాయిక, వాచిక, మానసికము లనెడి త్రికరణములతో, నీశ్వరార్పణముగఁ జేసెడి కర్మలని తెలియవలయును. అందువలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు విధింపఁబడిన ప్రతికర్మయందును, త్రికరణమా లేకీభవించి యుండవలయును, లేకున్న, గర్మలు నిరుప యోగములగును. ఆవిషయము వివరింతము.
కర్మయందు ఈశ్వరార్పణబుద్ధితో మనస్సు నేకాగ్రము చేయుట ప్రధానమైన విషయము. అట్లుండి ఏకార్యముయొక్క ఫలసిద్ధికి నేయే దేవతలు అధికారులో తెలిసికొని ఆ దేవతలకు ప్రీతికరములగు శబ్దాక్షర నాదములుగల మంత్రసూక్తముల నుచ్చరించుట రెండవది. ఆ కర్మలకుఁ దగిన సాధనములతో శారీరక క్రియలను జేయుట మూడవది.
ఆ వేదములే స్త్రీశూద్రులకు అమంత్ర యజ్ఞములను విధించినవి. అమంత్ర యజ్ఞము లనగా మనస్సుతోడను, వాక్కుతోడను అంతగ నిమిత్తము లేని శారీరక కర్మలని తెలియవలెను. అంతేగాదు, ప్రతి మానవున కిట్లే యేదియో యొకవిధముగ యజ్ఞము(కర్మ) విధింపఁబడియే యున్నది.
-యజ్ఞ తత్వము-
ఇఁక నా యజ్ఞ తత్వమును గూర్చి యోచింతము, లోకకల్యాణార్థమై భగవత్ప్రీతిగఁ జేయఁబడు చతురంగములతో కూడిన చతుర్వర్ణములతోఁ గూడిన) సమష్ఠి రూపమగు కర్మయజ్ఞమని వివరింపవచ్చును.
ఈశ్వర స్వరూపమగు లోకమునందుగల సమస్త ప్రాణికోటులకు సర్వసౌఖ్యములు ఆనందము పుష్కలముగ లభింపలయునన్న యనేకములగు గృహములు, పాత్రలు, పదార్థములు, ధాన్యములు, సాధనములు, శయనము లెన్నియో, విధములుగాఁ గావలసి యుండును.
ఇట్టి స్వరూపసిద్ధి గలిగిన ప్రతిపదార్థము అనేక తరగతులతో నొప్పెడి యనేక జాతులయొక్క వివిధములైన వారివారి కర్మలచేత జనించిన సమిష్ఠిరూపమగు ఫలమై యున్నది. ఏజాతియందు జనించిన వాడెంతటి సమర్థుఁడై యున్నను, తా ననుభవించుటకును, జీవించుటకుఁ గావలసియున్న పదార్థములు తన కర్మవలననే సృష్టించుకొనఁజాలఁడు. సర్వపదార్థములును మానవుల పరస్పరకర్మల సహాయమువలననే జనింపవలసి యున్నవి. కాన వివిధజాతి ప్రజలు వివిధములగు స్వకర్మల నొనర్చుచు పరస్పర సహాయ మొనర్చు కొనిననేగాని లోక కల్యాణము సేకూరఁజాలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుఁ డర్జునున కిట్లు శాసించి యున్నాఁడు.
గమనిక: ఇది సామాన్య విషయము. ఒకానొక శూద్రునందు మనోబుద్ధులు ప్రత్యేకవృద్ధి నందియుండుటకుఁ బెక్కు నిదర్శనములు గలవు.
శ్లో॥ నియతం కురుకర్మత్వం కర్మజ్యా యోహ్య కర్మణః
శరీర యాత్రా పిచతే నప్రసిద్ధ్యె దకర్మణః॥ గీత 3-8
తా॥ ఓయర్జునా! నీవు నీకు నియతమై యుండిన కర్మ నొనరింపుము. కర్మ చేయకయుండుటకంటెఁ గర్మ చేయుట శ్రేష్ఠము. చేయకుంటివేని నీకు దేహయాత్రగూడ సాగదు.
ప్రతిమానవునకు స్వభావానుగుణమగు జాతియును, జాతికి నియమితమై యుండిన కర్మయు సహజసిద్ధమై యొప్పుచున్నది. ప్రతి మానవున కిట్లు జననమాత్రమున విధివిహితమై యొప్పుచుండిన కర్మకే ధర్మమని పేరు. ప్రతిమానవుఁడును ధర్మమువలన అర్థము, అర్థము వలన కామసిద్ధియు నొందవలయుననియే విధినియమము. అందువలన నేజాతియందు జనించినవా రాజాతికర్మలను జేయుచున్న యెడల నర్థ కామములు తప్పక సిద్ధించును. అట్టియర్థకామ సిద్ధిచే సర్వుల కానందమును ప్రాప్తించును. అట్లొనర్పక, పరజాతి కర్మల నొనర్చినయెడల తనజాతివలన లోకమునకుఁ గావలసిన కర్మలాభమునకు తాను భంగ మేర్పఱచిన వాఁడగుటయేగాక తానే పరజాతి కర్మ నొనరించునో ఆజాతియందు జన్మించియున్న వానికి లభించవలసిన అర్థకామములకు భంగము గలిగించినవాఁడై యా పెఱజాతివాని యసూయా ద్వేషముల కాస్పదుఁడగు చున్నాఁడు. అదటులుండ స్వకర్మ నీశ్వరార్పణబుద్ధితోఁ జేసిన నది యజ్ఞ మగుచున్నది. ఫలాపేక్షతోఁ జేసిన యెడలఁ గర్మయగుచున్నది. యజ్ఞము మోక్ష హేతువుకాగా కర్మ బంధన హేతువగుచున్నది.
ఈ విషయమునే భగవద్గీత యీ క్రింది శ్లోకముతో నుదహరించు చున్నది.
శ్లో॥ యజ్ఞార్థా త్కర్మ ణోన్యత్ర లోకోయం కర్మబంధనః
తదర్థం కర్మ కౌంతేయ ముక్త స్సంగ సమాచరం॥ గీత 3-9
తా॥ ఈశ్వర ప్రయోజనముకంటె నితరమగు కర్మ బంధకమైనది. కనుక యర్జునా! ఆసక్తి వదలి కర్మ చేయుము.
కర్మబంధము వలననే జన్మ మేర్పడుచున్నది. అందువలన మానవుఁడు కర్మఁజేయక క్షణకాలమైన నుండఁజాలఁడు.
శ్లో॥ నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః॥ గీత 3-5
తా॥ సర్వప్ర్రాణులును ప్రకృతిబద్ధులై, స్వాతంత్య్రము లేక కర్మఁ జేయుచున్నారు. అందువలన నొకానొకనాఁడైన నొక క్షణ కాలమైన నేదియేని జేయక యుండ లేరు.
శ్లో॥ సహయజ్ఞైః ప్రజా స్పృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
ఆ నేన ప్రసవివ్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ ॥ గీత 3-10
తా॥ స్పష్ట్యాదియందు బ్రహ్మదేవుఁడు యజ్ఞముతో సహా ప్రజలను సృష్టించి, యీ యజ్ఞముతో మీ రభివృద్ధి నొందుఁడు. ఈ యజ్ఞము మీ కభీష్టముల నిచ్చుగాక యని వచించెను.
లోకమునం దొక్కొక్కరి కొక్కొక్క విధమగు యజ్ఞము (కర్మ) స్వభావాను గుణముగ విధింపఁబడి యున్నదని చెప్పితిమిగదా! కాఁబట్టి వారాచరింపవలసిన యజ్ఞములు (కర్మలు) అనేకములు గలవు. లోకమునం దెవరేజాతియందు జనించియుండినను వారు వారిజాతికి సహజసిద్ధమై యుండిన కర్మ (ధర్మము) వలన అర్థము నార్జించి, ఆ యర్థమువలన కామోపభోగము లందవచ్చును. కాని, యట్లనుభవించెడి కామోపభోగములు శాస్త్రీయ స్వధర్మ జనితములై యుండ వలయునే గాని వౌల్యప్రధానములై యుండరాదు.