శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › ధర్మజ్యోతి — 5

ధర్మజ్యోతి — 5

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 10 / 37

శ్లో॥ ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మిన్‌ భరతర్షభ॥

తా॥ ఓయర్జనా! ధర్మమునకు విరుద్ధముగా నుండని కామ స్వరూపుఁడనై నే నున్నానని తెలియుము.

సర్వమానవులును తమకు విధివిహితమగు కర్మను ప్రతిఫలా పేక్ష లేక లోకస్వరూపమగు భగవదర్పణ బుద్ధితో నొనరించిన యెడల నది యజ్ఞమై వారికి బ్రహ్మస్వరూపమగు యానందసిద్ధి నొసంగును.

ఈ విషయము సర్వజాతులవారికిని బ్రహ్మానందము నొందుటకు సమానమగుహక్కును ప్రతిపాదించునదై యున్నది. ఇం దుచ్చ నీచ తరతమ భేదము లెంతమాత్రమును నుండవని భగవానుఁ డిట్లు నుడివి యున్నాఁడు.

శ్లో॥ యతః ప్రవృత్తి ర్భూతానాం ఏనసర్వ మిదం తతం

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవాః॥ గీత 8-46

తా॥ ఏ పరమాత్మవలన సర్వభూతములకును ప్రవృత్తి గలుగుచున్నదో, ఎవ్వనిచేత నీకగుపడు సర్వము వ్యాపింపఁబడియున్నదో అట్టి పరమాత్మను స్వకర్మ (పుట్టుకవలన తనకు విధివిహితమైయున్న ధర్మము) చేత పూజించినయెడల ప్రతి మానవుడుఁను సిద్ధిని పొందు చున్నాడు.

భగవంతుఁడిట్లు సర్వమానవులకును పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములను సమానముగ పంచిపెట్టి యున్నాఁడు. కాఁబట్టి ఇందు భగవంతుని పక్షపాతముగాని బ్రాహ్మణ కల్పిత మోసముగాని కొంచమైన నగుపడదు.

దేశమును పరిపాలించెడి రాజు వ్యవహార సౌలభ్యము కొఱకు రాజ్యాంగమును నానాశాఖలుగా విభజించి, ఆయాశాఖల పరిపాలనమునకు తగిన యధికార పురుషులను నియమించి, వారివలన తన రాజ్యమునందున్న సర్వప్రాణులకు రక్షణ పోషణాదుల నొనరించు చున్నట్లుగనే భగవంతుఁడును తన రాజ్యమగు బ్రహ్మాండమును పాలించుటకు సూర్యచంద్రేంద్రాగ్నియమాదిదైవతములను శాఖాధికారు లనుగ నియమించి, వారివలన లోకపాలన మొనరించుచున్నాఁడు.

రాజనియుక్తులగు నధికారపురుషులు యనుగ్రహము వలననే ప్రజలకు సర్వసౌఖ్యములు లభించుచున్నట్లే భగవన్నియమితులగు దైవముల యనుగ్రహము వలననే సకాలవర్షములు, సస్యములు ఫలించుటయును, రోగోత్పాతాదులు లేకుండుటయు సంభవించునని గ్రహింపనగును.

రాజనియుక్తాధికార పురుషుల జీవితము ప్రజలిచ్చెడి పన్నులపైననే యాధారపడియున్నట్లు భగవన్నియమిత దైవముల జీవి తములును లోకులొనర్చెడి యజ్ఞముల (సత్కర్మల) పైననే యా ధారపడి యున్నవని రూఢగిఁ దేలుపనగును.

రాజ్యమందలి ప్రజలు అధికారులను, అధికారులు ప్రజలను పరస్పరాను రాగములతో సన్మానించు కొనుచుండిన యెడల నుభయులకు సర్వసౌఖ్యములు గలుగుచుండునటులే లోకులు విధివిహిత శాస్త్రీయ సత్కర్మ లొనర్చుచు కర్మఫల లాభములను దైవార్పణ మొన ర్చినయెడల దేవతలును లోకులకు సర్వ సౌఖ్యములనుఁ చేకూర్తురని వేఱుగఁ జెప్పుటెందులకు? ఇట్లొనర్చినయెడల నుభయలోకములకును కల్యాణము సేకూరును. ఇది భగవంతుని శాసనము కూడను. పై విషయ మీ క్రిందిశ్లోకమున వివరింపబడినది గమనింపుడు,

శ్లో॥ దేవా న్భావ యతానేన తేదేవా భావయంతువః

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ॥ గీత 8-11

తా॥ బ్రహ్మ దేవుడు ప్రజలను యజ్ఞములతో యిట్లు వచించెను. మీరీ యజ్ఞములతో దేవతలను పూజింపుఁడు. ఆ దేవతలు మిమ్ముల రక్షింతురు. ఇట్లు పరస్పర సన్మానములవలన నుభయులును శ్రేయస్సు నొందఁగలరు.

శ్లో॥ ఇష్టాన్‌ భోగాన్‌ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః

తైర్దత్తాన ప్రదాయైభ్యో యోభుం క్తేన్తేన ఏవసః ॥ 3-12

తా॥ దేవతలు మీ రొనర్చు యజ్ఞములతో తృప్తినొంది మీ కిష్టభోగార్థముల నిత్తురు. దేవతలచే నివ్వఁబడిన అన్నాదులను వారి కొసంగక (దేవతా ప్రీతిగ త్యాగ మొనరింపక) యెవ్వఁడు భుజించునో వాఁడే దొంగ యగుచున్నాఁడు.

శ్లో॥ అన్నాద్భవంతి భూతాని పర్జన్యా దన్న సంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః॥ గీత 3-14

తా॥ అన్నమువలన భూతములు తృప్తి యగుచున్నవి అన్నము వర్షము వలనను, వర్షము యజ్ఞము వలనను, యజ్ఞము కర్మలవలనను గలుగుచున్నవి.

శ్లో॥ అగ్నా వాజ్యాహు తిస్సమ్యక్‌ ఆదిత్య ముపతిష్ఠతే.

ఆదిత్యా జ్జాయతే వృష్టిః వృష్టే రన్నం తతః ప్రజాః॥

తా॥ అగ్నియందు ప్రేల్చఁబడిన ఆజ్యాది హోమద్రవ్యము సూర్యునియందుఁ జేరుచున్నది. సూర్యునివలన వర్షము, వర్షమువలన అన్నమును, అన్నమువలన ప్రజలును గలుగుచున్నారు.

శ్లో॥ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్త యతీ హ యః

ఆఘా యురింద్రియా రామో మోఘం రార్థ సజీవతి॥ గీత 8-16

తా॥ ఇట్లు నాచే ప్రవర్తితమైయున్న వేదయజ్ఞరూపమగు జగచ్చక్రము నెవ్వఁ డనుసరింపకుండునో అట్టి విషయలోలుఁడు పాపజీవనుఁడై వ్యర్థముగఁ బ్రతుకుచున్నాఁడు.

పుట్టగోగులవలె పుట్టి గిట్టుచుండెడి మానవకల్పితములగు ఇక్కాలపు ప్రణాళికల (ఇజముల) వలెగాక భగవంతుఁడు లోకకల్యాణమునకై భగవద్గీతా రూపమగు ప్రణాళిక నేర్పఱచి, యనుగ్రహించి యున్నాఁడు. ఆప్రణాళికయందు అనేక గుణకర్మస్వభావములతో అనేక జాతులుగ మానవులు జన్మింతురనియును, వారికి జన్మమాత్రముననే విధివిహితమగు పిత్రీయజాతి వృత్తి కర్మ (సధర్మము) యేర్పడి యున్నదనియు, వారాకర్మను విధిగఁ జేయుచు, తత్కర్మఫలములను లోకకల్యాణమునకై త్యాగ మొనరింపవలెననియు, తామనుభవించు కామోప భోగములు, ధర్మజనితములై యుండవలెననియు ప్రతివానిని శాసించుచున్నవి. ఇది, జాత్యహంకారములకుగాని, అసూయా ద్వేషములకుగాని, సోమరితనమునకు గాని ఎంతమాత్రము చోటొసంగక సర్వులకును తృప్తియు, నానందమును, గలుగఁజేయుచు సర్వులకు లోక స్వరూపమగు భగవత్సేవనే విధించియున్నది. ఆ విషయమును భగవంతుఁడిట్లు సెలవిచ్చి యున్నాఁడు.

శ్లో॥ గీతాజ్ఞాన ముపాశ్రిత్య త్రీన్‌ లోకాన్‌ పాలయామ్యహం॥

తా॥ గీతాజ్ఞానము నాధారముగఁ జేసికొని మూడులోకములను పాలించుచున్నాను.

ఇప్పుడు లోకమునందు వ్యాపించియుండిన సంకర వాతావరణమువలన ఈ ప్రణాళిక కొందఱకు రుచింపక పోవచ్చును. కాని, యే నాటికైనను లోకమునకు శ్రేయస్సు లభించటకు గీతా ప్రణాళికయే శరణ్యము గాకతప్పదు,

ఈ విధమున వర్ణితంబులగు ఫలకర్మల కాధారభూత మగునది జగత్తు. ఇది యొక చక్రము. అట్టి జగచ్చక్రమునుగూర్చి యిఁకఁ గొంతవిచారితము.

- జగచ్చక్రము -

జగచ్చక్రము కుమ్మరిసారెవలె నొప్పుచున్నది. కనుకనే జగత్తత్వమునుఁ దెలుపుటకు వేదాంతులుపమానముగ కుమ్మరిసారెను గ్రహించియున్నారు. కుమ్మరిసాలెకు వంకెలు నాలుగుండును. ఇవి జగత్తునఁగల చతుర్వర్ణములనుఁ దెలుపుచున్నవి. ఈ వంకె లిరుపార్శ్వములయం దుండెడి వంకెలతో పరస్పరముఁ జేరుచు చక్రమున కనుకూలముగ వంగియుండును. అవంగియుండుట జగత్తునందలి చతుర్వర్ణములయొక్క పరస్పర సహాయావలంబనమును సూచించు చున్నది గదా! ఈ నాలుగువంకెలకును నాలుగారులు సంధింపఁబడియున్నవి. ఈయాకులు నాలుగును చతుర్వర్ణముల యొక్క విధవిహీతములగు చక్కని సహజ ధర్మములనుఁ దెలుపుచున్నవి. కుమ్మరిసాలెకు మధ్య భాగమునందు పై నాలుగాకులు చేరుచుండెడి మధ్య కేంద్ర ముండును గదా! అది చతుర్ముఖ బ్రహ్మ స్వరూపమునుఁ దెలుపుచున్నది.

కుమ్మరి సాలెలోని మధ్య కేంద్రము చక్కగా నిలిచియుండిన అచలమగు ఇనుప యిరుసుమీద నాధారపడియుండునుగదా! అది సర్వాధారభూతమగు నిర్గుణ బ్రహ్మమునుఁ దెలుపుచున్నది. చక్రమును ద్రిప్పువాడు కుమ్మరి. అతడు సగుణరూపుఁడగు ఈశ్వరుని తెలుపును. దీనినుండి జనించెడు నానావిధములగు పాత్రలు సృష్టిభూత పదార్థములనుఁ దెలుపుచున్నవి. కాఁబట్టి లోకమునందుగల ప్రతి భూతమునుఁ ప్రతిపదార్థమును, ప్రతికర్మయును భగవంతుని జగ ద్రూపమగు చిద్విలాసమునే బోధించుచున్నవి, వేయేల కాలక్షేపముకొఱకు విలాసార్థముగ నాడుకొనుచుండెడి ‘విశ్వేట్‌’, చతురంగము (చదరంగము), పులిజీతము, పరమపదసోపానపఠము, ఓమన గుంతలు, మొదలగు నాటలయందును ధర్మ స్వరూపమగు జగత్తత్వ బోధన మెంతయో గోచరించుచున్నది.

ఉదాహరణమున ‘విశ్వేట్‌’ అనెడి ఆటను గైకొందము.

-విశ్వేట్‌ (Playing Cards) -

ఈ యాటఁ దెలియనివారరుదు. ఇది నాలుగుజాతుల చిత్ర పత్రములతో నాడుకొను నొక క్రీడమై యున్నది. దీని యథార్థ నామము విశ్వస్ఫుటము లేక విశ్వస్ఫోటము అని చెప్పుదురు. అట్లనగా జగత్తత్వమునుఁ దెలిపెడిదని యర్థము. ఈనామము జగద్విధానమంతయు నొక ఆటయే యని తెల్పుచున్నది, దీని విషయము తెల్పుటకు ముందు విశ్వశబ్ద సాంకేతికార్థము వివరింతము.

-విశ్వము-

విశ్వమనగా బ్రహ్మండములేక జగత్తు; ఇది పదమూడువిధములుగ నొప్పుచున్నది. అక్షర సాంఖ్య సూత్రము ననుసరించి విశ్వశబ్దము నందుగల మూడక్షరములకు ఈ క్రిందిసంఖ్యలు తేలుచున్నవి.

వి - 4 నాలుగు సంఖ్య అగును.

శ - 5 ఐదు సంఖ్య అగును.

వ - 4 నాలుగు సంఖ్య అగును.

ఈ మూడు సంఖ్యలను కూడిన 13 పదమూడు సంఖ్య యేర్పడును, కాఁబట్టి విశ్వమనగా పదమూడవసంఖ్యకు సంజ్ఞయని తేలినది గదా! ఇఁక ‘విశ్వేట్‌’ ఆటవిధానము గమనింపుఁడు.

దీనియందు 1.విశ్వేట్‌ 2.కళావర్‌ 3. ఆటిన్‌ 4.డైమన్జ్‌ అనెడి నాలుగు రకములగు చుక్కలు బొమ్మలుగల దళసరి కాగితములు ఏబది రెండుండును. ఆకాగితముల యొక్క వెనుక భాగములన్నియు నోకటే విధమగు ఆకార స్వరూప ప్రమాణ వర్ణములతో నొప్పియుం డును, ఈకాగితము లన్నియును నాలుగు జాతులుగ మాత్రముండి యందొక్కొక్కజాతికి 13 కాగితము లుండుమ. 10 కాగితములు 1 మొదలు 10 వఱకునుగల చుక్కలగుర్తులతో నుండును. మిగిలిన మూడు కాగితములును బొమ్మలుగలిగి యుండును. ఈ కాగితములన్నియు నొక పెట్టెయందుండును.

ఇఁక దీనిఁగూర్చిన తత్వార్థమును వివరింతము, బ్రహ్మాండమును సూచించు చున్నది. దీనియందుగల నాలుగు జాతుల కాగితములు బ్రహ్మాండమునందుగల చాతుర్వర్ణ్యజీవరాసులనుఁ దెలుపుచున్నవి. ఈ కాగితముల యొక్క వెలిభాగములు బ్రహ్మాండము నందలి జీవరాసుల స్థూలశరీరములను సూచించుచున్నవి. మఱి యందలి పదిచుక్కల కాగితములు బ్రహ్మాండమునందలి జీవరాసులలోని ఏ కేంద్రియ, ద్వీంద్రియ, త్రీంద్రియ, చతురింద్రియాది దశవిధేంద్రియ జీవులవఱకు నుండుట సూచించును. బ్రహ్మండమునందిట్టి యేకేంద్రియాది దశవిధేంద్రియ పర్యంతముగల ప్రత్యేకజీవములు గలవని ఆయుర్వేద శిక్షాదర్శనమను గ్రంథమున సూత్రస్థానము పదియన అధ్యాయములో ద్రవ్యము అనుశీర్షికలో వ్రాయబడి యున్నది విలోకింపుఁడు.

ఇట్టిజీవరాసులలో మానవుఁడు మాత్రమే పదియింద్రియములును పరిపూర్ణస్వరూపముగాఁ గలవాఁడై యున్నాడు. ఆదియునుగాక పైఁ జెప్పిన యంకములలో దశమాంశము పరిపూర్ణతకు చిహ్నముగ నొప్పుచున్నది. విశ్వేట్‌ నందు పదిచుక్కలకు తర్వాతినే మానవత్వమునకు చిహ్నమైన సర్వావయవములునుఁ గలిగిన బొమ్మలుఁ గలిగియుండుట గమనింపఁదగినది. ఆ బొమ్మలలో జాకీయనుబొమ్మ నపుంసక తత్వమునుఁ దెలుపుచున్న దందురు. దానికి పైనుండిన రాణియనుబొమ్మ స్త్రీత్వమును సూచించుచున్నది. దానికిఁ దర్వాతనుండిన రాజుబొమ్మ పురుషతత్వమును తెలియఁజేయుచున్నది.

బ్రహ్మాండంబునం దిట్లు పదమూడు విధములగు స్వరూపములు గల జీవరాసు లుండునని యీయాట సూచించెడినిగదా!

‘‘పురుషోయం లోకసమ్మితః’’

పురుషుఁడు లోకమునకు సమానుఁడు. అనెడు వచనమునుఁబట్టియు పిండాండమగు మానవునియందును పదమూడు తత్వములుఁ గలవు. మానవుని యందుఁ బది యింద్రియములును వానికిఁబైన నవుంసకలింగమునకుఁ జెందియున్న మనస్సును, మనస్సుకుపైన స్త్రీ లింగమునకుఁ జెందియున్న బుద్ధియును, దానికిఁబైగా పుంలింగంబునకుఁ జెందిన పురుషస్వరూపుఁడగు ఆత్మయు నుండుటవలన మానవుఁడు పద మూడు తత్వంబులతో నొప్పుచున్నాఁడని చెప్పితిమి.

పిండాండమునందలి విశ్వతత్వములను భగవద్గీత యిట్లుగాఁ బేర్కొనుచున్నది.

శ్లో॥ ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్యః పరం మనః

మనసస్తు పరాబుద్ధిః యోబుద్ధేః పరత స్తునః॥ గీత 3-42

తా॥ పది యింద్రియములు శ్రేష్ఠములు. ఇంద్రియములకంటె మనస్సు శ్రేష్ఠమైనది, మనస్సునకంటెను బుద్ధి శ్రేష్ఠమైనది, బుద్ధి కంటెను ఆత్మ శ్రేష్ఠుఁడు.

కాఁబట్టి ప్రతిమావవునియం దిట్లు విశ్వరూప మొప్పుచున్న దని చెప్ప వలయును.

- విశ్వేటు విశేషములు[1]* -

విశ్వేటు పెట్టెయందు 54 కాగితము లుండును. ఒక్కొక్క జాతికి 13 ప్రకారము నాలుగు జాతులకును 52 కాగితములును, వీనిక దోడుగ ‘జోకర్‌’ అను వికార స్వరూపముగల బొమ్మ యొకటి యందుఁ గాన్పించును. ఈ‘జోకర్‌’ కాగితమన్ని జాతుల కాగితము లందు నన్నియాటలయందును జేరుచుండును.

ఈ ‘జోకర్‌’ బ్రహ్మాండమందుగల సర్వభూతములందును జేరియున్న కర్మాభియుక్త త్రిగుణాత్మికయగు మాయను సూచించు చున్నది. సర్వవికారములును మాయకుఁ జెందియుండుననుట లోక విదిత విషయమే. కనుక జోక రట్టిదిగాఁ జూపబడినది. ఈ యేబది మూడు కాగితములుగాక ఆ పెట్టెయందేయేవిధమగు చుక్కగాని బొమ్మగాని లేని యొక్క తెల్లకాగితముండును. ఈకాగిత మేయాట లోగాని నేకాగితముతోగాని సంబంధము లేనిదిగా నుండును. ఇది మాయకు పరమందున్న నిస్సంగము, నిర్వికారమగు పరమాత్మయని రూఢగిఁ దెలుపవచ్చును.

ఇఁక దీనిలో నాఁడబడెడు నాటల గమనింతము. జోకర్‌ కాగితము మొదలు కొని నాలుగుజాతుల కాగితములుఁ యనేక విధములగు ఆటల కాస్పదమగు చున్నవి. మఱియును ఆ యాటలన్నియును లాభాలాభ, సుఖదుఃఖ, కామ క్రోధాదులను జనింపఁ జేయునవిగనే యుండును. ఈకాగితముల నాయాటలోఁ, బాల్గొనువారల కందఱకును కలిపి సమానముగ పంచుదురు. పంపక ములో ఆటలోఁ జేరిన ప్రతివానికిఁ గొన్ని కాగితములు వచ్చుచుండును. అట్లు వచ్చిన కాగితములు పొందినవాని కొకప్పుడు సుఖదాయకముగను, లాభకరముగను మఱియొకప్పుడు నష్టకరముగను, ఇంకొకప్పడు మిశ్రమ భావజనకముగా నుండునుగదా! ఈకాగితములయొక్క పంపకపుసామ్యము ప్రతియొక్క జన్మమందును ప్రాణికి స్వకర్మానుసారముగ గలుగుచుండెడి సుఖదుఃఖాదులను సూచించును. ఈయాటలో గలిగెడి సుఖదుఃఖాదులకు దైవప్రయత్నము, పురుష ప్రయత్నమను నీ రెండును కారణములై యొప్పుచున్నవి.

ఆ పంపకములో వచ్చి చేరెడి కాగితములకు దైవప్రయత్నంబును, ఆ వచ్చి చేరియున్న కాగితములను తానాడెడి యా యాటయందు మంచి తెలివితోఁ జక్కగ నుపయోగించుకొనుటలో పురుష ప్రయత్నమును కూడియుండునుగదా! ఈయాటయం దిట్టి జగత్తత్వంబునుఁ దెలుపు సామ్యంబులింక నెన్నియో యున్నవి గాని విస్తరభీతిని మానవలసినవచ్చెను.

ఈయాటనుఁబట్టి జగత్తంతయును చతుర్వర్ణంబులతో నొప్పుచు సర్వ క్రీడలకును స్థానమై లాభాలాభ, సుఖదుఃఖ, కామక్రోధాదులను గలిగించుచు, విడువని యనురాగమును జనింపఁ జేయుచున్నదని రూఢయిగుచున్నది. జగత్తు నందిట్లు చతుర్వర్ణాశ్రమ కర్మానుస్థానమనెడి ధర్మంబు సనాతనంబుగ సహజమై యొప్పుచున్నదని శ్రుతి స్మృతి పురాణాదు లనేక విధములగు రచనలతో నిరూపించు చున్నవి. కొన్ని యథాప్రకారంబుగ నీక్రింద పొందుపఱతును.

శ్రీమద్భాగవతమునందు ధర్మరాజు సనాతన ధర్మతత్వము నెఱుంగఁగోరి బహ్మపుత్రులలో శ్రేష్ఠుఁడగు నారదమహర్షితో నిట్లనెను.

శ్లో॥ భగవన్‌ శ్రోతు మిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం

పర్ణాశ్రమా చారయుతం యత్పుమాన్‌ విందతే పరం॥ భాగ. 17స్కం. 11ఆధ్యా.

తా॥ ఓనారదా! దేని విజ్ఞానమువలన మానవుఁడుత్తమ గతిని పొందగలడో; అట్టి వర్ణాశ్రమాచార యుక్తములగు మానవ సనాతన ధర్మము మీ నుండి వినఁగోరుచున్నాను.

అని ప్రశ్నించిన ధర్మరాజుతో నారదమహర్షి యిట్లనుచున్నాడు,

శ్లో॥ నత్వా భగవతే జాయ లోకానాం ధర్మ సేతవే

వక్ష్యే సనాతనం ధర్మం నారాయణ ముఖాచ్ఛృతం॥ భాగ.7స్కం.11ఆధ్యా

తా॥ లోకములకు ధర్మానుసంధాతయగు బ్రహ్మదేవునికి నమస్కరించి, నేను స్వయముగా నారాయణమూర్తి వలన వినియున్న సనాతన ధర్మమునుఁ జెప్పుచున్నాను. అని భగవద్గీతయందు ప్రతిపాదించిన చతుర్విధ వర్ణాశ్రమ రూపమగు ధర్మమునే సవిస్తరంబుగ బోధించియున్నాఁడు. ఆగ్రంథములం దది చూడనగును.

- ధర్మరక్షణము భగవత్కృత్యము -

గుణకర్మలయొక్క విభాగములవలన కోట్లకొలది జాతి స్వరూప స్వభావములతో నొప్పిన చాతుర్వర్ణ్య భూతములకు సహజములై యుండిన విధివిహిత కర్మానుష్ఠానములకు బాధగలిగి యెపుడు వ్యత్యస్త మేర్పడునో అపుడు భగవానుఁడవ తరించును. ఆవిషయము నీ క్రింది శ్లోకము రూఢ యొనర్చుచున్నది.

శ్లో॥ యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థాన మధర్మన్య తదాత్మానం సృజామ్యహం॥ గీ 4-2

తా॥ ఎవుడెవుడు అధర్మబాధచే ధర్మమునకు హాని గలుగు నో అపుడు అధర్మ నిర్వాపణమునకై నన్ను నేను సృజించుకొనుచున్నాను.

శ్లో॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగేయుగే॥ గీ 4-8

తా॥ సాధువులను (మతవిహిత కర్మానుష్ఠాతలను) రక్షించుటకును, దుష్కృతులను (విరుద్ధకర్మల నొనర్చువారిని) శిక్షించుటకును ధర్మమును నిలఁ బెట్టుటకును ప్రతియుగమునందును జనించుచున్నాను.

- గుణకర్మ విభాగము -

ఈపుస్తకమునం దచ్చటచ్చట గుణకర్మవిభాగ మనియును, చాతుర్వర్ణ్య మనియును పలుమార్లు పేర్కొనఁబడి యున్నది. త ద్విషయ మిఁకఁగొలది విచారింతము. లోకనిర్మాణమునకు భగవంతునిచే సృజింపఁబడిన గుణకర్మ విభాగముచే నొప్పిన చాతుర్వర్ణ్య మెట్లు కారణమై యున్నదోనాయీ పుస్తకరచన కంతటికిని,

శ్లో॥ చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశ॥ గీ 4-13

అనెడి భగవద్గీతాశ్లోకమే బీజరూపమగు కారణమై యున్నది. ఈగ్రంథ మంతయు దాని వివరణమనియుఁ జెప్పనగును. కాఁబట్టి భావదార్‌ఢ్యముకొఱకు వునరుక్తి యగునని యైనను, శంకింపక పలు మఱు వ్రాయుటగుచున్నది.

గుణవిభాగమున సత్వరజస్త మోగుణములు ప్రత్యేకములయ్యును, పరస్పర సమ్మేళనము గలవై ప్రతియొక్కటియు మిగిలిన రెండు గుణములతో చేరియుండును. ఇట్లు చేరుటలో నవి సమానాంశములుగఁ జేరక యెక్కువతక్కువ భాగములుగాఁ గలిసి యుండును. అందువలన నొక్కొక్క ప్రాణి యొక్కొక్క గుణవిభాగముతో, జనించుటవలన లోకమునందు కోట్లకొలది చేష్టలుండగా భిన్న భిన్న స్వభావములు గల భూతము లనేకములై విలసిల్లుచున్నవి.

ప్రాణికోటుల యుత్పత్తికి గుణవిభాగంబును, కర్మవిభాగంబును రెండును కారణములై యొప్పుచున్నవి. ప్రాణికి వ్యవహార దశయందు స్థూలసూక్ష్మ కారణంబు లనెడి మూడు శరీరములు గలవు. అందు సూక్ష్మకారణ శరీరములు రెండును గుణవిభాగంబుచేతను, స్థూల శరీరము కర్మవిభాగంబుచేతను ప్రవర్తిల్లుచున్నవి. కర్మవిభాగమనగ స్త్రీపురుష శుక్ల శోణిత విభాగవ్యవస్థయై యున్నది.

శ్లో॥ భూతభావో ద్భవకరః విసర్గః కర్మసంజ్ఞికః॥ గీ 8-2

తా॥ భూతభావములనగ ప్రాణుల శరీరములు, వీనిని బుట్టించెడి విసర్గమనగ శుక్ల శోణిత విభాగవ్యవస్థ. ఇది కర్మవలన జనించునదిగాక కర్మసంజ్ఞచే నొప్పు చున్నది. విసర్గమనగ నక్షర సమమ్నాయమునందు రెండు బిందువుల చేరికగ: నిట్టిరూపము చూపఁబడుచున్నది. అటులేర్పడిన రెండు బిందువులలోగల భావము పరికింపుఁడు.

గుణమయము కర్మమయము

శుక్లము శోణితము

పురుషతత్వము స్త్రీతత్వము

స్వతంత్రము అస్వతంత్రము

పోషకము పోష్యము

సేవ్యము సేవకము

ఆత్మ కారణముగ నిట్లు గుణకర్మలు రెండును కలియుట వలననే సర్వభూత సృష్టియు నేర్పడుచున్నది. మానవులకు గుణవిభాగమువలన జనించిన సూక్ష్మకారణ శరీరములు రెండును ప్రత్యేకము లగునవిగావు. కాన వాని విభేదములు తెలియఁబడవు. అనుమేయములై యుండును. కర్మవిభాగమువలన యేర్పడిన స్థూలశరీరము లన్ననో ప్రత్యక్షానుభవములు.

- దాంపత్యము -

స్త్రీ పురుష సంయోగము వలననే సృష్టియంతయును సాగుచున్నదనుట నిర్వివాదాంశమై యున్నదిగదా!

పిండాండ స్వరూపుఁడగు మానవునియందు కర్మమయమగు స్థూల దేహమునకును, గుణమయుడగు జీవునకును నెట్టి పరస్పర సంబంధము గలదో లోకమందలి స్త్రీపురుష దాంపత్య వివాహసంబంధ మట్టిదేయని తెలియవలయును.

జీవుఁడు స్వతంత్య్రుడగు ఆత్మమూర్తి యేయైయున్నను, అజ్ఞాన వశమున కర్మానురాగముచేత బద్ధుఁడై కర్మసాధనమగు స్థూల దేహమును కల్పించుకొని, దానితో క్రీడిరచుచుఁ దన్మయుఁడై సృష్టిరూప మగు సంసారమునుఁ బెంచుకొను చున్నాడు. ఇందులకు భగవద్గీత యిట్లు చెప్పుచున్నది.

శ్లో॥ పురుషః ప్రకృతి స్థాహి భుంక్తే ప్రకృతి జాన్‌ గుణాన్‌

కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు॥     గీ.13-21

తా॥ పరాప్రకృతి రూపుఁడగు జీవుడు అపరాప్రకృతి అవిద్యాలక్షణమగు దేహేంద్రియాది సంఘాతమును రూపము తనదిగా కల్పించుకొని, దానివలన జనించిన సుఖదుఃఖాదులను పొందుచున్నాఁడు, ఈజీవునకు తదను రాగమే సదసజ్జన్మలకుఁ గారణమగుచున్నది. అనగ దేహాభిమానమే సంసార జన్మ హేతువని భావము.

అపరాప్రకృతి స్వరూపము కర్మజన్యమగు దేహమునకు పరాప్రకృతి స్వరూపుడు గుణమయుఁడు నగు జీవుఁడు భర్తయైయున్నాడు. 1. దేహము 2. జీవుఁడు అను నీరెంటిలో దేహము స్త్రీతత్వము, అస్వతంత్రమైనది. జీవుఁడు పురుషతత్వము, స్వతంత్రమై యుండునది, మానవులయం దీరెంటికిని మూల కారణమైన పురుషోత్తముఁ డనఁ బడు పరమాత్మయు, నుపద్రష్టయ భర్తయై, సర్వస్వతంత్రుఁ డై యెప్పుచున్నాఁడు.

శ్లో॥ ఉపద్రష్టాను మంతాచ భక్తాభోక్తా మహేశ్వరః

పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్‌ పురుషః పరః గీత 18-12

తా॥ పైనఁదెల్పిన స్త్రీపురుష తత్వములగు దేహజీవుల కంటె నుత్తముఁడగు పురుషుఁ డీదేహమునందు పరమాత్మయని పిలువబడుచున్నాఁడు. అతఁడీరెంటికిని భర్తయు, భోక్తయు, మహేశ్వరుడునై యున్నాఁడు.

అను పై విషయము భగవదుక్తిచే నిరూఢమగుచున్నది. కాఁబట్టి పై విషయమును మఱింత వివరముగఁ దెలుపుచో 1. పరమాత్మ 2. జీవుఁడు 3.దేహము అను ఈమూడిరటిలో దేహమునకు జీవుఁడు భర్త స్వతంత్రుఁడు కాగా, దేహులకు పరమాత్మ భర్తయై, సర్వతంత్ర స్వతంత్రుఁడై యున్నాడు. జీవుని సేవించుట దేహమునికు ధర్మము. దేహమును సహాయముగాగొని పరమాత్మను సేవించుట జీవుని ధర్మమైయున్నది. ఇట్టి ధర్మమునే లోకమునందలి దంపతులకు పరమాత్మను సేవించుట వేదశాస్త్రములు విధించుచున్నవి. పురుషుడు స్వతంత్రుఁడనియును, స్త్రీనిఁ గైకొని రక్షించి, పోషించుట పురుష ధర్మమనియు, కర్మ స్వరూపిణియు నస్వతంత్రయునగు స్త్రీకి పతి సేవయే పరమధర్మమనియు వేదశాస్త్రములు నుడువు చున్నవి.

ఇట్లు వచించుటలో వేదశాస్త్రములకు రాగ ద్వేషములుఁ గలవని తలంచుట పొరపాటు. ఏలందురా శాస్త్రములలో కెల్లను మిక్కిలి శ్రేష్ఠమైనదిగను, ‘‘యద్వై మనురవ దత్తద్భేషజం’’ అని వేదముచే స్తుతింపఁబడిన మనుస్మృతియను శాస్త్రము స్త్రీల నెంతగ గౌరవించినదియోఁ జూడుఁడు.

శ్లో॥ పితృభి ర్భాతృభి శ్చేతాః పతిభి ర్దేవతై స్తథా

పూజ్యా భూషయితవ్యాశ్చ బహుకల్యాణ మీప్సుభిః॥

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

యత్త్రెతాస్తు సపూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియా॥

శోచంతి జామయో యత్ర వినశ్యత్యాకు తక్కులం

నశోచింతీ తు యత్రైతాః వర్ధతే తద్ధి సర్వదా॥

జామయో యాని గేహాని పశ్యంత్య త్రిపూజితాః

తాని కృత్యా హతానీవ వినశ్యంతి సమంతతః॥

తస్మా దేతా స్సమభ్యర్చ్యాః భూషణా చ్ఛాద నాళనైః

భూతి కామైర్నరై ర్నిత్యం సత్కారే ణోత్సవేనచః॥

సంతుష్టో భార్యయా భర్తా భర్త్రా భార్య తదైవచ

యస్మి న్నేత త్కు లేనిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం॥

తా॥ శుభఫలములమ గోరెడి తండ్రులు, అన్నదమ్ములు, భర్తలు, బావలు, మఱదులు స్త్రీలను వస్త్రభూషణాదుల చేత పూజించవలెను. ఎచ్చట స్త్రీలు పూజింపఁ బడుదురో, యచ్చట దేవతలు సంతోషింతురు. ఎచ్చట స్త్రీలు పూజింపబడరో యచ్చట సర్వకర్మలును విఫలములగును. ఎచ్చట వదినెగార్లుగాని, మరదండ్లుగాని, దుఃఖంతురో యావంశము వేగముగ నశించును. వారెచ్చట దుఃఖంపకుందురో ఆ వంశ మెల్లప్పుడు అభివృద్ధి నొందును.

వారు పూజింపఁబడక యేగృహములఁ జూతురో యాగృహములు ఖడ్గముచే కొట్టఁబడినట్లు నశించును. అందువలననే శుభైశ్వర్యములను గోరు పురుషులు వీరిని అన్నవస్త్ర భూషణాదులచేతను, గౌరవ సత్కారోత్సవాదులచేతను పూజింప వలయును. భార్యచేత భర్తయును, భర్త చేత భార్యయు నేవంశమునందు నిత్యము సంతోషము నందుదురో యావంశమునం దెప్పుడును నిశ్చయముగ శుభము సేకూరుచునే యుండును.

శాస్త్రములందు స్త్రీలకు విధించిన ధర్మము లన్నియును చక్కగ యోజించిన యెడల, వారి తత్వములకు హితమగునవియేగాని పక్షపాతకల్పితము లెంతమాత్రమును గావని తెలియఁ గలము. ఆ ధర్మతత్వరహస్యములు, దెలియక పోవుటవలన నవి విపరీతములైనవి గాఁదోచుచున్నవి.

శాస్త్రములయం దచ్చటచ్చట స్త్రీనిందారూప వాక్యములును, గనుపట్టుచున్నవి. లేదనలేదు. అదేలన శాస్త్రదృష్టిలో జ్ఞానము, పురుషతత్వముగను అజ్ఞానము స్త్రీతత్వముగను భావింపఁబడి యున్న జ్ఞానస్వరూపుఁడు భగవంతుఁ డొక్కఁడే పురుషశబ్దముతో వ్యవహరింపఁ దగినవాడు, తదన్యు లందఱు నజ్ఞానయుక్తులే గాన అట్టి వారు స్త్రీలనియే వేదతాత్పర్యము. అట్లు స్త్రీత్వ సంయోజితులఁ గూర్చి యా నిందావాక్యము లనిన నెంతయుఁ దగియుండును.

అజ్ఞానరూపమగు స్త్రీత్వము నింద్యమైనదని వేదశాస్త్ర వచ నాభిప్రాయముకాని స్త్రీలని తీసికొనరాదు. అజ్ఞానము నివృత్తి యగువఱకును స్త్రీపురుషులగు సర్వమానవులును పతియను భగవంతుని సేవించి, ధ్యానించి, యారాధించి భగవదైక్యతను పొందవలయునని వారిభావము. ఇది సర్వమానవులకును విధియై యున్నది. లోకము నందుగల సర్వవర్ణములవారిలో పురుషులైనను, స్త్రీలైనను జ్ఞానసిద్ధి నందియున్నవారెందఱో గలరు.

శ్లో॥ జై గీషవో యధావిప్రః యధా చైవా సితాదయః

క్షత్రియా జనకాద్యస్తు తులాధారాదయో విశః

ధర్మవ్యాధా దయస్సప్త శూద్రా శ్చేల వకౌదయః

మైత్రేయీ సులభా గార్గీ శాండిలీచ తపస్వినీ॥

ఏతే చాన్యేచ బహవో నీచయోని గతా ఆపి

జ్ఞాన నిష్ఠాం పరాం ప్రాప్తాః॥

తా॥ జైగీషవుఁడు, అసితుఁడు మొదలగు బ్రాహ్మణు లెట్లు జ్ఞానసిద్ధి నందియున్నారో, అటులనే జనకుఁడు మొదలగు క్షత్రియులును, తులాధారుఁడు మొదలగు వైశ్యులును, ధర్మవ్యాధుఁడు ఇలవకుఁడు మొదలగు శూద్రు లేడుగురును జ్ఞానసిద్ధి నందియున్నారు. మైత్రేయియు, సులభయు, గార్గియును, తపస్వినియగు శాండిలినియు నిట్టివారే! మఱి యనేకులు స్త్రీలు నీచయోనిజన్మ గలవారైనను, జ్ఞానసిద్ధి నందియున్నారు. లోకమంతయును భగవంతుని చిద్విలాస నాటకమనెడి భావమును సర్వులు గుర్తెఱింగిన యెడల నీనాటకము నందు జేరిన, మానవు లందఱును స్త్రీ వేషధారులైనను, పురుష వేషధారులైనను ఏ జాతికిఁ జెందిన వేషములు ధరించియున్నను, ఆయా వేషముల యొక్క పాత్రోచితిని పాటించ వలసినవారై యున్నారనుట మఱువఁగూడదు.

ఈ జగన్నాటకము నందలి వేషధారు లందఱును ఆయా వేషములను స్వయముగఁ గోరు కొనియే జగన్నాటక రంగమునందుఁ బ్రవేశించి యున్నారు. గాన ప్రతివారును తమకు విధివిహితములగు పాత్ర నియమములను చక్కగా పాటించవలయును. ఇందుచ్చ నీచత లెంతమాత్రము నుండవు. కనుక విషయ మర్థము చేసికొనఁజాలక వేదశాస్త్రములయొక్క ధర్మనిర్ణయ విధులను నిష్కారణముగ నిం దింపకుందురుగాక.

- వేదజాతులు-

ఋగ్వేదము లోకమునంతయును విరాట్పురుష రూపముగ వర్ణించుచుఁ దద్దేహాంగముల నిట్లు పేర్కొనుచున్నది.

బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌ బాహూ రాజస్యః కృతః

ఊరూ తదస్య యద్వైశ్వః పద్భ్యాం శూద్రో ఆజాయత॥

తా॥ విరాట్పురుషునకు బ్రాహ్మణుడు ముఖమును, క్షత్రియుఁడు చేతులును, వైశ్యుఁడు తొడలును, శూద్రుఁడు పాదము లాయెను.

పురుష దేహమం దవయవము లెన్నియో యున్నను, వేదము పురుష ముఖ్యముగా నాలుగంగములనే బేర్కొనియుండుటకు హేతు వీచెప్పబడిన నాలుగంగములయందే సర్వాంగములును జేరియుండుటయు, శరీరమునం దివీ ప్రత్యేకముగా గుర్తించుటకు వీలగునట్లు విభజింపఁ బడియుండుటయునై యున్నది. వీనియందుఁ గ్రమముగ సత్వరజ స్తమోగుణ కర్మ తత్వములు నాలుగును ప్రత్యేక విశిష్ట లక్షణములతో నొప్పియుండుట వలనను వాని వ్యాపారములు ప్రసిద్ధముగఁ జతుర్విధములై యుండుటవలనను చాతుర్వర్ణ్యబోధకు చక్కని యుపమానములై యుండెనని యూహింపనగును.