మఱియును ద్విజవర్ణమునకుఁ జెందిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యజాతులు మూడును, విరాట్పురుషునకు శిరస్సు, బాహువులు, తొడలుగ వర్ణింపబడి యుండుటకు హేతువు శరీరమునందు మూడంగములు నొకదానిక్రింద నొకటి చక్కగ నిలబడి యొక వర్గమునకు చెందియున్నట్లగుపడు చుండుటయే యని యెఱుఁగవలెను. శూద్రవర్ణమునుఁ దెలిపెడి పాదములుమాత్రము పై యంగముల వలె చక్కగ నిలబడియుండక పై మూడంగములను భరించుచు, నడ్డముగ నుండుట చేతనే తమ ప్రత్యేకతనుఁ దెలుపుచున్నవి.
గుణకర్మ స్వరూపములతో నొప్పిన నాలుగుజాతులకునుఁ జెప్పబడిన శర్మ, వర్మ, గుప్త, దాస లక్షణములు క్రమముగ శిరోబాహూరుపాదములయందు ప్రత్యేక విశిష్టత నొందుచున్నవి. ఈచతురంగములను తమతమ నియత వ్యాపారముల యందు ప్రవర్తింప జేయు దైవ మైదవకారణమై యున్నది. మానవున కానందము సిద్ధింపవలయునన్న పైనఁ బేర్కొనియున్న చతురంగములయొక్క పరస్పర సహకారమును దైవిక పక్షమునను నీయైదును కారణములై యున్నవి.
అటులనే లోకమునకు కల్యాణము సేకూరవలయునన్నచో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగుజాతుల పరస్పర సహకారమును దైవాను గ్రహమును కారణములై యుండవలెను. మానవుఁడొనర్చెడి యే కార్యమైనను సిద్ధి గాంచుటకు నీయైదును తోడ్పాటు నొసంగవలసి యున్నది.
ఈ విషయమును భగవద్గీత యిట్లు వివరించుచున్నది.
శ్లో॥ పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వ కర్మాణాం॥ గీత 18-18
అధిష్ఠానం తధాకర్తా కరణంచ పృథగ్విధం
వివిధాశ్చ పృథ క్చాష్టాః శైవంచై పాత్ర పంచమం॥ గీత 18-14
తా॥ ఓయర్జునా! మానవు లొనర్చెడి యుక్తాయుక్తములగు సర్వకర్మలయొక్క సిద్ధికి వేదాంతమునందు ఐదు కారణములు చెప్పఁబడినవని తెలియుము. ఇందులో నొకటి అధిష్ఠానమగు శరీరము. రెండవది కర్తయగు జీవుఁడు, మూడవది ఇంద్రియ సమూహము, నాల్గవది వివిధములగు చేష్టలు, అయిదవది దైవమునై యున్నవి. ఇందులో పై నాలుగు కారణములు మానవ కృత్యములు, నైదవది దైవకృత్యమై యున్నదిగదా!
జ్ఞానవాసిష్ఠ గ్రంథమునందు ప్రతి కార్యసిద్ధికి నిట్లు కారణములు వచింపఁబడి యున్నవి.
శ్లో॥ ద్రవ్యమంత్ర క్రియా కాల శక్తయస్సాధు సిద్ధిదాః
తా॥ ద్రవ్యము, మంత్రము, శరీర వ్యాపారము, కాలము, శక్తి అను నైదును సమకూడినగాని కార్యములు సిద్ధింపవు.
వాస్తవ మిటు లుండుటఁబట్టియే లోకములో నేదియైన కార్యము చెడిపోయిన యెడల దానికి పంచకము బాగుండలేదనెడి ప్రతీతి యేర్పడినది. మఱియును నలుగురుఁ జేరినగాని యేకార్యమును సఫలము గాదను వాడుకయు లోకమునం దేర్పడుటయు, నీవిషయమునే చూపును, మానవునకు సౌఖ్యము, నానందము లభించవలయునన్న, శరీరావయవము లన్నియును తమతమ వ్యాపారములనుఁ జక్కగ జేయుచు పరస్పర సహాయకములై యుండవలయునుగదా!
అటులనే లోకమునకు సౌఖ్యము, నానందము లభింపవలయుననిన జాతులన్నియును స్వస్వవృత్తులఁ జేయుచు, పరస్పర సహాయ కములుగ నుండి తీరవలయును. శరీరావయవములలో నీచము నిరుపయోగమునగు నవయవ మొక్కటియును లేనట్లే, లోకములో నీచమై నిరుపయోగమైన జాతియొక్కటియును లేదు. వేద మీ యభిప్రాయమునుఁ దెలుపుటకే లోకమునందలి చాతుర్వర్ణ్య జాతులకు సుపమానముగ విరాట్పురుషుని చతురంగములను పేర్కొనినది.
మఱియును కఠోపనిషత్తు మానవత్వము నిట్లు సాలంకారముగ వర్ణించు చున్నది. గమనింపుడు.
ఆత్మానం రథనం విద్ధి శరీరన్ రథమేవచ
బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ॥ తృతీయవల్లి॥ 3 మంత్రం
ఇంద్రియాణి హయావ్యాహుః విషయానేషు గోచిరాన్
ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యా హుర్మనీషిణః॥ తృ॥ 4 మంత్రం
యస్త్వవిజ్ఞాన వాన్భవ త్యయుక్తేన మనసా సహ
తస్యేంద్రి యాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథేః ॥ తృ॥ 5 మంత్రం
తా॥ మానవునియందాత్మ రథికుఁడు, శరీరము రథము, బుద్ధి సారథి, మనస్సు పగ్గము, ఇంద్రియములు గుఱ్ఱములు, విషయములు మార్గములు, ఆత్మేంద్రియ మనోయక్తుఁడగు వానిని భోక్త యందురు. బుద్ధి (సారథి) అవివేక మైనయెడల మనస్సు(పగ్గము) బుద్ధివశమున నుండదు. గాన ఇంద్రియములు (గుఱ్ఱములు) వశములుగాక రథికుని హానికిఁ దార్చును.
ఆత్మను బుద్ధి యనుసరింపవలయును. బుద్ధిని మనస్సు, మనస్సును ఇంద్రియములు ననుసరించుచుండిన నానందము సిద్ధించునని విశేష భావము.
‘పిండాండ వద్బ్రహ్మాండం’
అనెడు సూక్తి ననుసరించి, లోకమునందు ఆత్మరూపమగు బ్రాహ్మణ తత్వమును బుద్ధిరూపమగు క్షత్రియతత్వ మనుసరింప వలయును, దీనిని మనోరూపనుగు వైశ్యతత్వము పైవాని రెంటి ననుసరింపవలయును. ఇంద్రియ రూపమగు శూద్ర తత్వము పై మూడు తత్వములకు హితముగ వర్తించవలయునని చక్కగ పైవిషయములఁబట్టి తెలియనగును. లోకమిట్టి నియమములతో నుండిన ప్రతియొకరికి నానందము సిద్ధించును.
ఈ నియమ మాకాలమునం దుండెడిదని శ్రీమద్రామాయణ మందిట్లు వచింపఁబడియున్నది.
శ్లో॥ క్షత్రం బ్రహ్మముఖం చాసీత్ వైశ్యా క్షత్ర మగువ్రతాః
శూద్రా స్వధర్మ నిరతాః త్రీన్ వర్ణా నుపచారిణః॥ బాలకాం. 6 సర్గ 19 శ్లోకము
తా॥ బ్రాహ్మణులను క్షత్రియులు, క్షత్రియులను వైశ్యులును ఆ మువ్వురను శూద్రులు ననుసరించి వర్తించుచుండిరి.
ఇట్టి చాతుర్వర్ణ్య వ్వవస్థ మానవులయందేగాక దేవతలయందు నున్నట్లు బృహదారణ్య కోపనిషత్తు ప్రథమాధ్యాయము నాల్గవ బ్రాహ్మణములో 11 మొదలు 15 వరకుగల మంత్రములలో వర్ణింపఁబడియున్నది. అందలి సారాంశమును మాత్రము పేర్కొందును. దేవతలలో అగ్ని బ్రాహ్మణుఁడై యున్నాడు. ఇంద్రుఁడు, వరుణుఁడు, చంద్రుఁడు పర్జన్యుఁడు, యముఁడు, మృత్యువు, ఇషానుఁడు అను వీరు క్షత్రియు లైయున్నారు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వదేవతలు, మరుత్తులు అను వీరు వైశ్యులై యున్నారు. మఱి పూషానులు శూద్రులై యున్నారు. అందువలన వర్ణవ్యవస్థ వేదబోధితమేగాని మానవకల్పిత భేదబుద్ధిజనిత మెంత మాత్రమును గాదని తెలియగలదు. లోకమునందు ముఖ్యముగా బ్రహ్మ, క్షత్రములు రెండును వీర్యవంతములై యొప్పుచుండినయెడల కల్యాణము సేకూరగలదని భగవద్గీత యిట్లు చెప్పుచున్నది.
శ్లో॥ యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీ ర్విజయో భూతిః ధ్రువానితి మతిర్మమ॥ గీ.18-27
దీని భావార్థ మేమన ఎచ్చట స్వధర్మము ననుష్ఠించు బ్రహ్మ తత్వమగు శ్రీకృష్ణుఁడును, స్వధర్మమునకు గడంగిన క్షత్రియ తత్వమగు అర్జునుఁడును గలరో, యచ్చట సంపదయు, విజయము, ఐశ్వర్యము, నీతియు ధ్రువమై యుండును.
లొకమునందు ముఖ్యముగ ధర్మము నుద్ధరించవలసిన బాధ్యత విశేషించి బ్రాహ్మణ క్షత్రియులయందే గలదు. కనుకనే శాస్త్రము బ్రాహ్మణక్షత్రియులకు నితరులకంటెను యెక్కువ కఠిన నియమములను విధించుచున్నది, బ్రహ్మ క్షత్రియులు తమకర్మనిష్ఠల యందసమర్థులైనయెడల నధర్మము విద్యుద్వేగముతో వ్యాపించును. కనుకనే వారు మిక్కిలి సుశిక్షితులుగా నుండవలయును. వారి ధర్మ మసిధార వంటిది. వారు స్వధర్మనిష్ఠులు గాకుండినయెడల వారు జెడుటయే గాక లోకమును జెఱచినవా రగుదురు.
శాస్త్రములయందు స్త్రీవైశ్యశూద్రులు తర తమ భేదములతో నొప్పిన తమోగుణ స్వభావులు. వారికి ప్రమాదము సహజము గావున వారికి విధించిన కర్మలయం దంతటి కఠిననియమములు లోపించియుండుట గమనించవలెను.
తమోగుణమునకు రజోగుణమును, రజోగుణమునకు సత్వగుణమును ఉద్ధారకము శిక్షకమునై యుండును. రజోగుణవిశిష్ఠుడగు క్షత్రియుని యుక్త కార్యములయందు నియోగింపవలసిన బాధ్యత సత్వగుణ విశిష్ఠుడగు బ్రాహ్మణుని యందే గలదు. లోనమునందిపు డిరతటి యధర్మము వ్యాపించుటకుఁ బ్రధాన కారణము బ్రాహ్మణుఁడే యనుట నిర్వివాదాంశము. స్వధర్మము నతఁడు జక్కగ ననుష్ఠింపఁ దొడంగిన యెడల సర్వమును జక్కఁబడును, బ్రహ్మమూర్తియగు శ్రీకృష్ణుఁడు సర్వభూత సమత్వరూపమగు స్వధర్మమును తా ననుష్ఠించుచు, మోహవశమున స్వధర్మమునుండి ప్రమాద పడుచుండిన యర్జునునకు కర్తవ్యమును బోధించి యుండినందుననే తొల్లి ధర్మము సుప్రతిష్ఠితమైనది. బ్రాహ్మణుఁడు స్వధర్వనిష్ఠఁ దప్పకుండిన నగుఫలమును భగవద్గీత యిట్లు సూచించుచున్నది.
శ్లో॥ యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్తదేవే తరోజనాః
సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే॥ గీ. 3-21
తా॥ శ్రేష్ఠుఁడగువాఁ డెటు లాచరించుచుండునో యితరుఁ డటులనే యాచరించును. అతఁడేది ప్రమాణమని నిరూపించునో లోకము దానినే యనుసరించి వర్తించును.
లోకమునం దిపుడు బహ్మఁ క్షత్రియ, వైశ్య, శూద్రులను వారెవ్వరో గుర్తించుటైన కష్ట మనిపించు సాంకర్య మేర్పడి యున్నది. ఈసాంకర్యము పరాకాష్టను పొందుటనుబట్టి వర్ణమనినను, జాతియనినను, కులమనినను, ఆశ్రమ మనినను లోకము రోతపడు స్థితి యరుదెంచినది. అట్లు రోతపడుటకు మనము రోషప ప్రయోజనము లేదు. కాని దినదినమునకు కులమత జాతిద్వేషములు ప్రబలు చున్నవని విచారపడవలెను. వీనికి కారణము కాలమేయని, బ్రాహ్మణుల స్వధర్మ నిరాసనమేయని భావింపవలయును.
- బ్రాహ్మణ-నింద -
కాని యథార్థము నెఱుంగదలంపని కొందఱు కులమతవర్ణాశ్రమ విభేదముల కన్నిటికిని బ్రాహ్మణులే కారణమనియు, వాని దెల్పు గ్రంథములు ధూర్త బ్రాహ్మణ కల్పితములనియు, బ్రాహ్మణ జాతినే బూతులతో దూషించుచున్నారు. అట్లు దూషించవచ్చును. గాని ఇపుడన్ని జాతుల వారిలో నధర్మపరత యధికముగా నుండుట గమనింపకుండిరని విచారింపవలెను. ఇది కాలచోదితమని సమాధాన పడవలయును.
శ్లో॥ దైవం ప్రజ్ఞా విశేషణ కోని వర్తితు మర్హతి
విధాతృ విహితం మార్గం నకశ్చిదతి వర్త తే॥
కాలమూల మిదం సర్వం భావాభానౌ సుఖాసుఖే
కాలః సృజతి భూతాని కాల స్సంహరతే ప్రజాః॥
కాలోహి కురుతే భావా స్సర్వ లోకే శుభాశుభాః
కాలస్సం క్షిపతే సర్వాః ప్రజాని సృజతే పునః॥
ఆతీతా నాగతా భావాః యేచవర్తంతి సాంప్రతం
తాన్ కాల నిర్మితాన్ బుధ్వా నసంజ్ఞాం హాతు మర్హసి ॥__ __ భారతము ఆదిపర్వానుక్రమణిక
తా॥ దైవము నెవఁడు స్వకీయప్రజ్ఞతో నివర్తింహాఁగలడు? విధివిహితమార్గము నెవ్వఁడతిక్రమింపఁగలడు? భావాభావ సుఖదుఃఖ రూపమగు సర్వము కాల మూలమై యున్నది. భూతములను సృజించునదియును, సంహరించునదియును కాలమే! సర్వప్రజలను కాలము సంక్షేపించుచున్నది. మఱియు విడుచుచున్నది. కడచిపోవునవి, రాబోవునవి వర్తించుచున్న స్వభావములును, కాలముచే నిర్మింపఁ బడినవిగా నెఱింగి వీడకుండుము.
ఒక సంవత్సర కాలములో మంచు ఎండ గాలి వాన ఎటుల ఋతుధర్మములని దలంచుచున్నామో! ప్రకృతి విలాసమని గ్రహించి సహించుచున్నామో లోకమం దిపుడు వర్తించుచున్నది కలియుగమని యెఱింగి యట్ల దానిని సహించవలెను.
చతుర్విధములగు గుణకర్మలలో సత్వగుణ విశిష్ఠమగు బ్రాహ్మణ కృత యుగము గడచిపోయినది. దానికిఁ బిదప వచ్చిన రజోగుణ విశిష్ఠమగు క్షత్రియ శ్రేతాయుగము చెల్లిపోయినది. దానికి దర్వాత తమోగుణవిశిష్ఠమగు వైశ్య ద్వాపర యుగము గతించినది. నాడు కర్మవిశిష్ఠమగు శూద్ర కలియుగము వర్తించుచున్నది. ఇందు కర్మమయులగు స్త్రీశూద్రులకు ప్రాధాన్యత యేర్పడుట దీనికి సహజ లక్షణమైనది. అది విజ్ఞుల కనుభవవేద్యము కూడను. మఱియును సత్వగుణ విశిష్ఠమగు బ్రాహ్మణతత్వమున కిది విరుద్ధము. గాన నివుడు బ్రాహ్మణతత్వ మధమస్థితి నొందుటయు, నిందాపాత్ర మగుటయు సహజముగనే యగుపడును. కాబట్టి మన మీమార్పును ప్రకృతి విలాసమనిఁ దలంచవలయునేగాని, దూషించరాదు.
శాస్త్ర మిట్లనుచున్నది.
శ్లో॥ యుగేయు గేతు యేవిప్రాః తేషు తేషుచ యేద్విజాః
తేషాం నిందా నకర్త వ్యా యుగరూపా హితే ద్విజాః పరాశర స్మృతి 11-50
తా॥ ప్రతియుగమునందే ధర్మములు గలవో యేబ్రాహ్మణులుగలరో ఆధర్మములను ఆబ్రాహ్మణులను నిందించగూడదు. ఏలన వారు యుగానురూప ధర్మరూపము గలవారై యుందురు.
ఇదే విషయమశ్వమేధ పర్వమున నిట్లు వివరింపఁ బడియున్నది.
శ్లో॥ యుగేష్వా వర్త మా నేషు ధర్మోప్యా వర్తతే పునః
ధర్మేష్వా వర్తమా నేషు లోకోప్యా వర్తతే పునః
తా॥ యుగధర్మములు తిరిగి వచ్చుచుండగ యుగాను రూప ధర్మమును తిరిగి వచ్చుచుండును. ధర్మములు మరల వచ్చు నట్లుగనే జనులును తిరిగి వచ్చుచుందురు.
- కలి-ధర్మము -
కలిధర్మమునుఁ గూర్చి పరాశరస్మృతి యీవిధముగ వర్ణించుచున్నది.
శ్లో॥ జితో ధర్మో హ్యధర్మేణ సత్యం చైవా నృతేనచ
జితాశ్చోరైస్తు రాజానః స్త్రీభిశ్చ పురుషాః కలౌ॥ 1-30
సీదంతి చాగ్నిహోత్రాణి గురుపూజా ప్రణశ్యతి
కుమార్యశ్చ ప్రసూయంతే తస్మిన్ కలియుగే సదా॥ 1-51
తా॥ ధర్మము అధర్మముచే జయింపఁబడును. సత్య మసత్యముచేత జయింప బడును. దొంగలచేత రాజులు జయింపఁబడుదురు. స్త్రీలచేత పురుషులు జయింపఁబడుదురు. అగ్నిహోత్రములు శిథిలము లగును. గురుపూజ నశించును. పెండ్లిగాని కన్యలు ప్రసవింతురు. కలియుగమునం దెప్పుడు నిట్లు జరుగుచునే యుండును.
శ్లో॥ యథా యథా సతాం హానిః వేద మార్గాను సారిణా
తదా తదా కలేర్వృద్ధి అనుమేయా విచక్షణైః ॥ విష్ణుపురాణము
తా॥ వేదచోదిత మార్గములందు జరించువారి కెపుడెపుడు హాని గలుగునో అపుడపుడు పండితులచేత కలియొక్క వృద్ధి యూహింపబడును.
శ్లో॥ ఆద్యే కృతేతు యోధర్మః సత్రేతాయాం ప్రవర్త తే
ద్వాపరే ప్యాకులీభూతః ప్రణశ్యంతి కలౌయుగే॥ లింగపురాణము
తా॥ మొదట కృతయుగమునందున్న ధర్మము త్రేతయందు వ్యాపించి, ద్వాపారమందు సంకులమై కలియందు నశించును.
మ॥ వనితా దుర్భల దీనబంధుజన సర్వస్వాపహారుల్ సుహృ
జ్జన మాతాపితృ పుత్రహంతలు యదృచ్ఛా కర్మశీలుల్ ధరన్
జన సంపూజితులై చరింతురు వినష్ట శ్రీకులై విప్రులా
జనులన్ జేరి పరిగ్రహించెద రవజ్ఞా పూర్వ దుర్విత్తముల్ (ఆరణ్యపర్వము)
ఇదే విషయ మీకిందిగ్రంథములందిటులున్నది. భావము నుగమ మగుటవలన శ్లోకములమాత్ర ముదహరింతును.
శ్లో॥ బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః సంగిరంతం పరస్పరం
శూద్ర తుల్యా భవిష్యంతి తపస్సత్య వివర్జితాః ॥ భారతము-ఆరణ్యపర్వము
భూమిర్నద్యో నచాశ్చైతే సిద్ధా దేవర్షయస్తథా
కాలం సమను వర్తంతే తథాభావా యుగేయుగే॥
సర్వే ధర్మాః కృతే జాతాః సర్వేనష్టాః కలౌయుగే॥ పరాశరస్మృతి
అల్పాయు షోల్ప పుణ్యశ్చ దుర్బలా శ్చాల్ప మేధసః
స్వభావ చంచలా మూఢాః కామక్రోధాది రూషితాః॥
మా ఢ్యేన పశుతుల్యాశ్చ కర్మ శ్రద్ధాం నకుర్వతే
తథావిధానాం స్త్రీణాంతు సకలే కర్మసిద్ధయః॥
కలిధర్మోత్తరం సౌరధర్మణి
ఇట్లు సంస్కృత గ్రంథములేగాక యాంధ్రగ్రంథము లనేకములు కలిమహాత్మ్యమును బహువిధముల వివరించియున్నవి. అందుఁ గొన్నిటి నుదహరింతును.
కం॥ సుతు డవమానించు జనకుఁ
బతి నవమానించు భార్య పడతులు పతులున్
మతి నొండొరువుల మెచ్చక
సతతము చరియింతు రిష్ట సంచారములన్॥
కం॥ నడువవు దేవ పితృక్రియ
లుడుగును వేదార్థ సమ్య గుపదేశములున్
గడగును మోహతమంబులు
పుడమి సమస్తంబు కుజన భూయిష్టమగున్
కం॥ క్షత్రియజాతులు శూద్ర చ
రిత్రంబున శౌర్యమును సరియు దేజంబున్
మైత్రేయును లేక చెదరి ధ
రితీశ్వర శూన్యులై చరించెద రెందున్॥
కం॥ శ్రుతి ధర్మంబులు శూద్రులు
ప్రతిభం జెప్పంగవినుచు బ్రాహ్మణ జాతుల్
ధృతి జెడి తత్సేవకులయి
యతి నిందిత కర్మకారు లయ్యెద రధిపా॥
తరువోజ॥ ఉక్కున శూద్రు లత్యుగ్రులై కవిని యొండొండఁ బె క్కండ్ర నుడుగకచంప
దిక్కెవ్వరును లేక దీనులై వసుమతీ జనుల్ నాలుగు దెసల బాఱెదరు
మ్రుక్కిడిచోరులు ముట్టి నిరవశేషముగ ధనావలి గొని మొగి వధింపంగ
స్రుక్కి కాకులయట్లు శూన్యులై చెదరి సోంపేది యడవులను సొచ్చెదరు జనుల్
మత్త కోకిల॥ దేవతా యతనంబులున్ జగతీ సురావసధంబులున్
పావనాశ్రమ భూములున్ జెడి పాడగున్ శుభవృక్షు వ
ల్లీవనంబులు నాశమొందు కలి ప్రవేశము నందుదు
స్త్రీ విహారము మద్యపానము జైల్లుఁ బెల్లుగ నెల్లెడన్
గీ॥ అన్న విక్రయ మొనరింతు రఖిలజనులు
వేదవిక్రయులగుదురు విప్రవరులు
పణ్యయోనులు నగుదురు పద్మముఖులు
కష్టతరమైన యక్కలికాలమందు.
శాస్త్రపురాణాదులయం దిట్టి వెన్నియో కలిధర్మములుగ వచింపబడి యున్నవి. అవి యన్నియు నొక్కటియైనఁ దప్పనట్లు మనకుఁ బ్రత్యమోనుభవము లగుచునే యున్నవి.
ఇట్లు వర్తమాన కలియుగమునందేగాక నీకల్పమునం దెన్నిమారులు కలియుగము వచ్చినను యిట్టి పరిస్థితులే సంభవించు చుండునని స్కాందపురాణము నందు శౌనకాది మహర్షులకు సూతుడు పూర్వకలియుగ పరిస్థితులను దెలుపుటను బట్టి తెలియగలము.
శ్లో॥ శ్రుణుసూత పురాకృచ్ఛ్రే కలౌ కాలేతు పాపిని
రాజను చ్యుత ధర్మేషు నాస్తి కేషు దురాత్మను॥
వంచాకా నీచజాతీయాః కర్మ భ్రష్టాశ్చ దస్యవః
క్రూరావవృద్ధి రే ధానైః ధనై రపిసుఖై స్తథా
భోవిప్రాః కలికాలేస్మిన్ ఆస్తిక్యం బహు దుర్ఘటం
జీవనం దుర్లభం నౄణాం ధార్మికే పథినాన్యథా॥
శిల్పాని సంపద ర్శ్యైవ కురాజా వంచయంతివః
సర్వధా వైదికీ వృత్తిః భవతా మద్యదుర్లభా॥
అంతతో నాగక వ్యాసుఁడు కలిలో నుండఁబోవు మానవ లోకమునుగూర్చి యిట్లనియె నఁట.
ఆచండాల మనుప్రాప్తాః సర్వే వాణిజ్య కర్మణి
శూద్రా స్వతంత్రతాం నీతాః కురాజాహంతు ముద్యతాః॥
కృషికర్మాణి వాణిజ్యం విప్రః కుర్యాత్త థాపది
ఇత్యుక్తం జీవనోపాయం పరిగృహ్యాద్య సాధయేత్
భవంతస్తేన కుర్వంతు షట్క ర్మాణ్యపి శాస్త్రతః
యథాజలం యథాయోగం సర్వం నస్సుగమం భవేత్
ఈ విధముగా పూర్వకలియుగ స్థితిని వర్ణించి యుండుటఁబట్టి కలియుగ మెప్పటికిని బ్రాహ్మణతత్వమునకును వేదమార్గానుసారులకును బాధను కలిగించునదిగ నుండుననియే స్పష్టమగుచున్నదిగదా! ఆ పూర్వకలియుగముయొక్క ప్రతిబింబముగనే వర్తమాన కలియుగము వర్తించుచున్నదని మన సామాన్యబుద్ధికి దోచుచున్నది. ఇటులనే గుణకర్మ తత్వములతో నొప్పిన నాలుగు యుగములును క్రమముగ నెల్లప్పుడు చరిత్ర ప్రదర్శనములగు టాకీరాళ్లవలె (వీఱశ్రీవ ూ్‌శీఅవం శీట నఱర్‌శీతీవ) తమయందున్న చరిత్రలను ప్రదర్శించు చుండును, పగటికాలము గడచిన పిదప రాత్రికాలమును, రాత్రికాలము గడచినపిదప పగటికాలము నెట్లనివార్యముగ వచ్చుచుండునో అటులనే యుగధర్మమును తప్పనిసరిగా వచ్చుచునే యుండును. ‘‘నఱర్‌శీతీవ తీవజూవa్‌ం ఱ్‌ంవశ్రీట’’ అనిఅనుభవజ్ఞు లందురు.
జ్ఞాన వాశిష్ఠ గ్రంథమునందలి భుసుండోపాఖ్యానమునం దీవిషయమును వసిష్టమహర్షి చిరకాలజీవియగు భుసుండుఁడను కాకిని ప్రశ్నింపగ తాఁ జూచిన యుగకల్పములయొక్క సృష్టి వైచిత్రముల నిట్లు తెలిపినటు లున్నది.
మునే తే బ్రహ్మాపుత్రస్య జన్మాష్టమ మిదంకిల
సంస్మరా మ్యష్టమే సర్గే తస్మిం స్త్వం మమ సంగతః॥
స్మరామి ద్వాదశం చేద మమృతాం బోధిమంధనం
వారత్రయం హిరణ్యాక్షో నీతవా న్వసుధా మధః॥ నిర్వాణప్రకరణం 155
ఈ విషయమునే శ్రుతియు నిటులఁ దెల్పుచున్నది.
‘‘ధాతా యథా పూర్వను కల్పయేత్’’
తా॥ సృష్టికర్త సర్వ ప్రపంచమును మునువున్న రీతినే సృష్టించెను.
బ్రహ్మసూత్రములు ప్రథమాధ్యాయము తృతీయ పాదము నందుగల 30న సూత్రము నీభావమే తెల్పుచున్నది.
సమాన నామరూపత్వా చ్చా వృత్తావస్య విరోధో దర్శనా త్స్మృతేశ్చ
మఱియును స్మృతి యిట్లు వచించుచున్నది.
యధాభి మానినోతీతాస్తుల్యాస్తి సాంప్రతైరిహ॥
కడచిపోయిన కాలమున నుండువారు నిప్పుడుండువారితో సమానులే యని పై వాక్యముల భావము, అదేవిషయమును శ్రీమద్భగవద్గీత యందు శ్రీకృష్ణుఁడు వచించుచున్నాఁడు.
బహూనిమే వ్యతీతాని జన్మాని తవ చార్జున
తాన్యహం వేద సర్వాణి సత్వం దేత్థ పరం తప॥ గీ. 4-5
నత్వేపావహాం జాతు వాసం నత్వం నేమో జనాధిపాః
నచైవన భవిష్యాషుః సర్వే వయ మతః పరం॥ గీ.2-12
భావమేమన ‘‘ఓయర్జునా! నాకును నీకును బహుజన్మలు గడచినవి. వానిని నేనెఱుఁగుదును, నీ వెఱుగవు. నే నొకప్పుడైనను లేదను నది లేదు. నీవును యీ రాజులును లేరనునది లేదు.’’
ఆబ్రహ్మ భువనాల్లో కాః పునరావృత్తి నోర్జునా॥ గీ.7-16
అనగా బ్రహ్మ మొదలు సమస్తలోకములును పునరావృత్తిఁ గలిగియున్నవి సుమా యని భావము.
దేహికి కౌమారము, యౌవనము, వార్ధక్యము దేహాంతర ప్రాప్తి యెటుల గలవో గుణకర్మతత్వములు నాలుగును యుగనామములతో నొకదానివెంట నొకటి క్రమముగా వచ్చుచునే యుండును. ప్రకృతియందున్న యీచాతుర్వర్ణ్య స్వభావంబులను గుర్తించి, లోకంబునకుఁ దెలిపినవారు బ్రాహ్మణులేయైనను, మఱెవ్వరైనను యిందు వారు కల్పించిన యసత్య మొక్కటియు వివేచనగల వారి కగుపడదు.
ఒక వేళ కొందఱు దలంచుచున్నట్లు బ్రాహ్మణ కల్పితమోసమేయనిఁ దలంచుటకు వారి కిందువల్ల గల్లెడి లాభ మేదో గాఢముగ నాలోచించినను స్ఫురింపకున్నది. వారీ చాతుర్వర్ణ్య జాతి వ్యవస్థ మానవులయందు మాత్రమే గలదని వచించి యుండలేదు. ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ నామరూపాత్మకమగు సర్వప్రకృతియందును గలదని వక్కాణించియున్నారు. ఖగోళమందలి జ్యోతిర్గ్రహముల యందును బ్రాహ్మణ, క్షత్రియాదిజాతులును స్త్రీపురుషాది తత్వము లున్నట్లు వచించియున్నారు. పరికింపుడు.
క్రూరాభాను తమశ్శని ధ్వజికుజా శ్శుక్రార్య సౌమ్యేందవః
సౌమ్యాస్తే పురుషాః కుజార్క గురవో రాహ్విందుశుక్రాస్త్రియః
తచ్ఛేషాస్తు నవుంసకా గురుభృగుర్వి ప్రౌ కుజార్కౌనృపౌ
వైశ్యా చంద్రబుధా తదన్య కులజో మందస్తు వర్ణేశ్వరః॥ కాలామృతం
తా॥ రవి, కుజ, శని, రాహు, కేతువులు పాపగ్రహములు. చంద్ర, బుధ, గురు, శుక్రులు శుభ గ్రహములు. రవి, కుజ, గురువులు పురుషులు, చంద్ర, శుక్రులు స్త్రీగ్రహములు. మిగిలినవి నపుంసక గ్రహములు. గురు, శుక్రులు బ్రాహ్మణులు, రవి, కుజులు క్షత్రియులు, చంద్ర, బుధులు వైశ్యులు, శని శూద్రుఁడు.
ఇట్లు శాస్త్రకారులు వచించుటవలన వారికి గ్రహనక్షత్రాదులయందును, అసూయా ద్వేష పక్షపాతాదులు గలవనిఁ జెప్పవల వలయునుగదా! అంతకంటె నవివేక ముండునా! అట్టి విభేదము గ్రహములయందే గాక అక్షరములయందును చాతుర్వర్ణ్యజాతు లున్నట్లుఁ దెలిపియున్నారు. అక్షరములలో స్వరములు పదునారును క-చ-ట వర్గాక్షరములు పదునైదును బ్రాహ్మణజాతికిఁ జెందినవి, త-ప వర్గాక్షరములు పదియును, రేఫవకారములు రెండును క్షత్రియ జాతివి. దంత్యములగు చ-జలు రెండును ఱకార శకారములు రెండును శూద్రజాతియని శారదాదర్పణమను గ్రంథమునందిట్లు చెప్పఁబడినది.
స్వరాః కచట వర్గాశ్చ ధర ణీసుర మాతృకాః
తపవర్గౌ సమావతస్థౌ బాహు సంభవ మాతృకాః॥
ఇత్యాది శ్లోకములతో అక్షరజాతులును అక్షరదైవములు మొదలగునవి వచింపఁబడినవి. ఇట్లే రత్న గజాశ్వ సర్ప వృశ్చిక కీటాదులయందును జాతివ్యవస్థ యున్నట్లు ఆయాశాస్త్రములయందు బరికింపనగును.
వేయేల గీతాశాస్త్రమునందు సర్వము గుణకర్మవిభాగమున చాతుర్వర్ణ్యముగ నాచే సృజింపఁ బడినదని భగవానుఁడు స్పష్టపరచియున్నాఁడని పలుమాఱు చెప్పితిమిగదా! అట్టిచో జాతిభేదములు బ్రాహ్మణకల్పితము లనుట పొరబాటుగాక యేమగును.
-జాతులు - కర్మలు -
అంతియగాక జాతులకు తగినకర్మలును భగవంతునిచే విధింపఁబడినవేగాని మానవ కల్పితములుగావు. పరికింపుఁడు.
బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చపరం తప
కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః గీ.18-41
తా॥ ద్విజవర్గమునకు జెంది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకును వారివారి స్వభావములందుగల సత్వరజస్త మోగుణములకు తగినట్లు వారివారికి కర్మలు నాచే ప్రత్యేకముగ విభజింపఁబడి యున్నవి.
భగవానుఁడు జాతులకు కర్మల నిట్లు ప్రత్యేకముగ విభజించి యుండిన కారణమున నతఁడిరదులకు కర్తయై యున్నను, వారివారి స్వభావముల ననుసరించి వారు కోరినట్లు విభజించి యుండుటవలన నతఁడు అకర్తగనే భావింపఁ బడుచున్నాఁడు. అందులకు భగవద్గీత యిట్లునుచున్నది.
తస్య కర్తార మహిమాం విధ్యకర్తార మవ్యయం॥ గీత 4-13
తా॥ దానికి నేను కర్తనై యున్నాను. కాని నీవు నన్ను అకర్తనుగ తెలియుము. అని తన యకర్తృత్వము భగవంతుఁడు ప్రకటించి యున్నాఁడు.
ఇంతదూరము వివరించినమీద మానవులందఱును జన్మ చేత నొక్క జాతిగ వుట్టి పిదప వారు చేసెడి వృత్తి కర్మలచేత వేఱువేఱుజాతులగుదురనుట పై వాదమువలన సమంజసముగా నుండదాయని కొందఱు వచింతురు. ఇందలి సత్యము నెఱుఁగుటకు భగవద్గీతకంటెను వేఱు శాస్త్ర ప్రమాణముండబోదు. ఏలందురా? యీతత్వములనుఁ దెలుపుటకే యాశాస్త్రము ప్రవృత్తమై యున్నది.
అర్జునుఁడు జన్మచేత క్షత్రియుఁడై యున్నాఁడు. అతఁడు తనకు విధి విహితమైయున్న యుద్ధకర్మ పాపహేతువైనదని దలంచి, భిక్షాకర్మ నవలంబింప దలంచి, యుద్ధరంగమునుండి మఱలుట కుద్యమించెననికదా యాయుద్గ్రంథ మారంభమైనది. అట్టి విషమావస్థ యందు ధర్మ రక్షణార్థమై యవతరించిన శ్రీకృష్ణుఁడు స్వధర్మము నుండిప్రమాదము నొందుచుండిన యర్జునునకు గీతాశాస్త్రము నుపదేశింప వలసివచ్చినది, గాన భగవద్గీతయే ప్రమాణమని దలంచెడువారు పుట్టుకవలననే జాతియును, ఆ జాతికి నిధివిహితమగు కర్మయు, నేర్పడి యున్నదనెడి గీతాసిద్ధాంతము నొప్పుకొనక తప్పదు.
- ధర్మనిర్ణయము కష్టమైనది-
ధర్మమనగ భగవత్స్వరూపమగు సత్యతత్వము అది మానవుల యుక్తి వాదముల కందనిది. మానవులకు భ్రమ ప్రమాదములు సహజములు. ధర్మము నెఱుంగుటకు ప్రతివిషయమునందును సత్య తత్వమును దర్శించగల మహర్షి కావలెను. కనుకనే భగవానుఁడు,
శ్లో॥ కిం కర్మ కియక ర్మేతి కవయో ప్యత్ర మోహితాః
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష సే-శుభాత్॥ గీ.4-16
తా॥ ఏది ధర్మము ఏది అధర్మము అనెడి విషయములో పండితులైనను ప్రమాదపడుచున్నారు. ఏది యెఱింగిన మానవుఁడు అశుభమునుండి విడువఁ బడునో అట్టిధర్మమునుఁ జెప్పుచున్నాను.
శ్లో॥ కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః
ఆకర్మణస్య బోద్ధవ్యం గహనా కర్మణోగతిః గీ.4-16
తా॥ విహితకర్మయొక్కయు, నిషిద్ధ కర్మయొక్కయు, అకర్మయొక్కయు తత్వము తెలియదగినది. అందుచేత గర్మతత్వము మిక్కిలి గహనమైనది.
అని యర్జునుని బోధించియున్నాఁడు. లోకమునందధర్మము నాచరించువారు రెండు విధంబులుగ నుందురు. ధర్మంబు నెఱుంగక నాచరించువారును, ధర్మంబు నెఱింగియు లోభావేశమున తద్విరుద్ధంబుగ నాచరించువారు నొప్పుచున్నారు.
శ్లో॥ ధర్మోపదేశ సమయే జనాస్సర్వేపి పండితాః
తదనుష్టాన సమయే మునయోపి నపండితాః॥
అనినట్లు ధర్మోపదేశమున నందఱు పండితులేగాని తదనుష్ఠాన కాలమునఁ బండితులు నవివేకు లగుచున్నారు. అందువలననే భారత యుద్ధరంగమునందు మోహప్రమాదము నొందిన యర్జునుండును సత్యధర్మము నెఱింగిన వానివలెనే శ్రీకృష్ణునితో నిట్లు వచించెను, ‘‘కృష్ణా! నేనీయుద్ధము నొనర్పను రాజ్యము, విజయము, సుఖము, నాకక్కర లేదు. గురువులు, తండ్రులు, తాతలు, కుమారులు, బంధువులు మొదలగువారినిఁ జంపిన యెడల పాపము రాకతప్పదు. రాజ్యలోభినై వంశక్షయ మిత్రద్రోహ పాపములను పై వేసికోఁజాలను. నాకులస్థులనుఁ జంపినయెడల సనాతన వంశధర్మములన్నియునుఁ జెడును. అధర్మము వ్యాపించును. అందువల్ల కులస్త్రీలు చెడుదురు. వర్ణసంకర మేర్పడును. దీనివలన పితృవర్గములకు పిండ తిలోదకములు లోపించును. అబ్బబ్బ! ఇట్టు వర్ణసంకర మొనర్చిన కులఘ్నునికి మహానరకమే గతి. గాన దీనికన్నను వారిచేఁ జచ్చుటయేమేలు, లేకున్న భిక్షమెత్తు కొనియే జీవింతును.’’ అని మహత్తర ధర్మోపన్యాసముఁ జేసెను. (అర్జున విషాదయోగమునుఁ జూచునది) అర్జునుఁడు వచించిన పై వాక్యములు ధర్మముగాకున్నను ధర్మములైనవిగనే సామాన్యమానవులకు గన్పట్టుచున్నవిగదా!