అర్జునునంతటి ధీశాలికి అధర్మమే ఇట్లు ధర్మమనితోచి యున్నవుడిక సామాన్యులు ధర్మము నెఱుంగఁగలరా? దాని నాచరణలోఁ బెట్టఁగలరా? లోకమునందు కొన్ని కార్యములు మానవుల దృష్టికి ధర్మములుగ గనుపట్టుచున్నను, నిజమున కధర్మంబులై యున్నవి. కొన్ని అధర్మములుగ గనుపట్టుచున్నను సూక్ష్మంబుగఁ జూచిన ధర్మంబులై యగుపడకపోవు. దివ్యదృష్టిచేత ధర్మాధర్మములను, ఆత్మయందు చూడగలిగినవారే ధర్మనిర్ణయాధికారులు. వారి వాక్యములే ప్రమాణంబులుగాని తాత్కాలిక లాభాలాభదృష్టితోఁ జెప్పినవి ధర్మంబులుగావు.
శ్రీమద్రామాయణమునందు జాబాలియను బ్రాహ్మణుఁడు పితృవాక్యపాలనకై మునివృత్తి దాల్చి, చిత్రకూట పర్వతమునుఁ జేరియున్న శ్రీరాముని చెంతకేగి వేదధర్మవిరుద్ధమగు నాస్తి కోపన్యాసము నొనర్చుచు శ్రీరామునితో నిట్లు నుడివెను.
శ్లో॥ అష్టకా పితృదైవత్య మిత్యయం ప్రనృతో జనః
అన్న ప్యోప ద్రవం పశ్య మృతోహి కిమశిష్యతి॥
యదిభుక్త మిహాన్యేన దేహ మన్యస్య గచ్ఛతి
దద్యాత్ప్ర వసతశ్శ్రాద్ధం నత ర్పథ్యశనం భవేత్ ॥
దాన సంవన నాహ్యేతే గ్రంథా మేధావిభిః కృతాః
యజస్వ దేహి ధీక్షస్వ తపస్త ప్యస్వ సంత్యజ॥
సనాస్తి పరమిత్యేవ కురుబుద్ధిం మహామతే
ప్రత్యక్షం యత్త దాతిష్ఠ పరోక్షం పృష్ఠితః కురు॥ ఆయోధ్య కాండము 108 సర్గ 14, 15, 16, 17
తా॥ ఓ రామా! లోకము నిష్కారణముగ చనిపోయిన తలిదండ్రులను గుఱించి ప్రతిసాంవత్సరిక మనెడి పితృశ్రాద్ధమునుఁ జేయుటను నిది వృథా అన్న నాశమని యెఱుంగుము. శ్రాద్ధమందు పెట్టబడిన యన్నమును చచ్చినవాఁడుఁ దినుచున్నాడా? లోకములో యొకడు దీనిన యన్నంబును మఱియొకని దేహంబునకుఁజేరి వాని యాకలిఁ దీర్చుచున్న యెడల ప్రవాసంబు నందున్న వానికై శ్రాద్ధంబుఁ జేయవచ్చును. ఇంటిలో పెట్టఁబడిన యన్నంబు మార్గస్థునికి చెందుటలేదు గాన అదంతయు అన్న నష్టమేగాని వేఱుగాదు. దానముల కొఱకు వశీకరణోపాయపరులగు ద్రవ్యగ్రహణ బుద్ధుల చేత ‘‘కర్మ చేయుము’’, ‘‘దాన మొసంగుము’’, ‘‘దీక్షితుఁడవు గమ్ము’’, తపస్సు చేయుము’’, ‘‘ధనేషణాదులను వదలుము’’ అనెడి సూక్తులు వ్రాయఁబడినవి. గాన బుద్ధిశాలివగు ఓరామా! నీవు పరలోక మేలేదని గ్రహింపుము. ప్రత్యక్షమైనదానిని స్వీకరింపుము. ఏది పరోక్షమో దానిని వదలుము.’’
అని యిట్లు తర్క రూపములగు నాస్తికవాక్యముల నుపదేశించిన జాబాలిని గాంచి శ్రీరాముండిట్లు నుడివియున్నాఁడు.
శ్లో॥ భవన్మే ప్రియకామార్థం వచనం యదిహోక్త వాన్
అకార్యం కార్యసంకాశం అపథ్యం పథ్య సమ్మితం॥ 109 సర్గ 2
తా॥ బ్రాహ్మణోత్తమా! నీవు నాయందు ప్రీతితో నిపుడుఁ బలికిన వాక్యము, సిద్ధాంతకార్యంబువలె గనుపట్టుచుండెడి అకార్యంబుగను పథ్యమైనదిగ దోచుచుండెడి యపథ్యంబునై యున్నది సుమా!
శ్లో॥ ఆధర్మం ధర్మవేషేణ యదీమం లోకసంకరం
అభిపత్స్యే శుభం హిత్వా క్రియావిధి వివర్జితం॥ 109 సర్గ 6
శ్లో॥ కశ్చేతయానః పురుషః కార్యాకార్య విచక్షణః
బహుమన్యతీమాం లోకే దుర్వృత్తం లోకదూషణం॥ 109 సర్గ 7
ప్రత్యగాత్మ మిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయం
భార స్సత్పురుషా చీర్ణ స్తదర్థ మభిమన్య తే॥ 109 సర్గ 19
తా॥ లోకమును సంకర మొనర్చు నట్టియు, క్రియావిధులు లేనట్టి యీనీచేఁ జెప్పఁబడిన యధర్మంబును నేను శుభదాయక మగు వేదకర్మను విడచి ధర్మ వేషముతో సంగీకరించి దుర్వృత్తి నవలంబించినచో, లోక దూషితుఁడు నగు నన్ను యుక్తాయుక్త పరిజ్ఞానములుగల యేవిజ్ఞుఁడు సత్కరించును ఇపుడు నే నాచరించుచుండెడి సత్యమగు వేదధర్మమును, ఆత్మయందు ప్రత్యక్షముగ నేను జూచు చున్నాను. గాన సత్పురుషులచే నాచరింపఁబడిన యీ జటావల్కల భారమును అంగీకరించుచున్నాను.
అని శ్రీరామమూర్తి వేదధర్మము నాత్మయందు దర్శించుచు నాచరించు చున్నానని జాబాలికి సమాధాన మొసంగియున్నాడు.
ధర్మాధర్మముల నాత్మయందు స్వయముగ జూచు సామర్థ్యము మహర్షులకే గలదు. వారి నిర్ణయములే శాస్త్రము. శ్రీమహాభారతమునందు నీవిషయమును భగవంతుఁడిట్లు నుడివియున్నాఁడు.
శ్లో॥ శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే యస్తా ముల్లంఘ్య వర్త తే
ఆజ్ఞా ఛేదీమను ద్వేష్యః సమేవధ్య తమో మతః॥
తా॥ వేదశాస్త్రములు నాయాజ్ఞులు. ఎవ్వఁ డట్టియాజ్ఞల నుల్లంఘించి వర్తించునో వాఁడు నాయాజ్ఞను ఛేదించినవాఁడై నాకు ద్వేష్యుఁడును, చంపదగినవాఁడునై యుండును.
ధర్మమును గుర్తించు సామర్థ్యము మానవుల కుండదు గాన వారు వేదశాస్త్రములుఁ జెప్పిన ట్లాచరించవలయును. అందులకై, మనుస్మృతి యిట్లు వచించుచున్నది.
శ్లో॥ వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాదతం ద్రితః
తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిం॥
తా॥ వేదచోదితమగు స్వజాతికర్మను ప్రమాదపడకుండ, నిత్యము యథాశక్తిగ నాచరించువాఁ డుత్తమగతి నొందును. అదే విషయము కూర్మపురాణమునం దిట్లు చెప్పఁబడినది.
శ్లో॥ యథాశక్తి చరేత్కర్మ నిందితాని వర్జయేత్
విధూయ మోహకలిలం లబ్థ్వాయోగ మనుత్తమం॥
గృహాస్థో ముచ్యతే బంధాత్ నాత్ర కార్యా విచారణా॥
తా॥ విధివిహిత కర్మను యథాశక్తిగఁ జేయుచు నిందిత కర్మలను విడచు గృహస్థుఁడు అజ్ఞానముక్తుఁడై యోగ సిద్ధినంది బంధమునుండి విడువఁ బడుచున్నాడు.
శాస్త్రము లిట్లేక వాక్యముగ సత్యము వచించుచుండుటవల్ల మానవు లెవరే స్వభావముచేత నేజాతీయందు జన్మించి యున్నారో, ఆ జాతికి విధివిహితకర్మ అదెట్టిదై యున్నను యథాశక్తిగ నాచరించు చుండిన యెడల పాపవిముక్తులై సుఖానందముల నొందగలరు. ఆ విషయము నెంతరూఢగి శ్రీకృష్ణుఁడు చెప్పుచున్నాఁడో వినుఁడు.
శ్లో॥ స్వభావ నియతం కర్మ కుర్వ న్నా ప్నోతిహి కిల్బిషం। గీ.15-42
భగవద్గీత మానవులకు వారి వారి స్వభావములవల్ల జాతులును కర్మలు భగవంతునిచే నేర్పఱుపఁబడి యున్నవనిఁ దెలువుట యధార్థమేయైనను స్వభావ శబ్దమునకు నిజమగు యర్థమేమియోఁ దెలిసినగాని జాతికర్మలకు హేతువు పూర్తిగా తెలియజాలము. గీతయందు ఆ స్వభావశబ్దమును ఎక్కడెక్కడ నేయేయర్థములందు వాడినదియు గమనించినగాని దాని తాత్పర్యము బోధపడదు. కొన్ని యట్టి నిదర్శనముల నిచుచ్చుచున్నాను, గమనింపుడు.
శ్లో॥ స్వభావస్తు ప్రవర్తతే। గీ. 5-14
శ్లో॥ దేహినాం సాస్వభావజా। గీ. 17-2
శ్లో॥ కార్పణ్య దోషో పహత స్వభావః గీ. 12-7
శ్లో॥ బ్రహ్మకర్మ స్వభావజం॥ గీ. 18-42
శ్లో॥ స్వభావ నియతం కర్మ॥ గీ. 18-47
శ్లో॥ స్వభావ జేన కాంతేయ॥ గీ. 18-60
ఇత్యాది స్థలములయం దన్ని చోట్లను స్వభావశబ్దమునకు అంతఃకరణము ప్రకృతి అనియర్థమే రూఢగిఁ జెప్పఁబడినదని యర్ధవిదు లెఱుంగగలరు. భగవద్గీతకు సరియైన యర్థమును ప్రయోగిత పదములఁబట్టి చెప్పినది శంకరాభాష్యమని పండితు లెఱుంగుదురు. అందులకై శ్రీవారి భాష్యమునుండి కొంత వివరింప యుత్నింతును.
శంకరభాష్యము స్వభావశబ్దము నెట్లు వ్యాఖ్యానించెనో గమనింపుడు,
శ్లో॥ స్వభావః అవిద్యాలక్షణ ప్రకృతిః గుణము॥ గీ. 5-24
శ్లో॥ జన్మాంతరకృతో ధర్మాది సంస్కారః
మరణకాలే అభివ్యక్తః స్వభావ ఉచ్యతే॥ గీ. 17-2
స్వభావమనగ పూర్వజన్మ దేహముయొక్క మరణకాలము నందుండిన అంతఃకరణము లేక ప్రకృతియని తాత్పర్యము. అందువలన మానవునిజన్మ దేనిపై నాధారపడియున్నదని విచారింతము.
- తొలి-మలి జన్మల సంబంధము -
ప్రాణికి మరణసమయమునం దెట్టి భావముగల యంతఃకరణము (ప్రకృతి) గలిగియుండునో ఆప్రకృతి ఆభావముయొక్క సిద్ధికి పునర్జన్మయందనుకూలమగు శరీరమును గలిగించును. అందులకు నాధారమును విలోకింపుడు.
శ్లో॥ యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కళేబరం
తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః గీ. 8-6
తా॥ జీవుఁడేయేభావమును (ఆకృతిని) గోరుచు దేహమును విడచునో ఆభావమునే పొందును. ఎల్లప్పుఁ డేభావమును స్మరించు చుండునో ఆసమయమున నాభావము గలుగును.
మరణసమయమునం దంతఃకరణమునందు సాత్వికభావ మధికమై యుండిన యెడల అది బ్రాహ్మణజాతి దేహమును గలిగించును. దానికి శమము, దమము, తపస్సు ఇత్యాదులు విధివిహితకర్మలుగానుండును, తమోగుణమునకంటే రజో గుణము అధికముగనుండినపుడు మరణము గల్గినయెడల నది క్షత్రియజాతి దేహమును గలిగించును. దానికి శౌర్యము, తేజస్సు నొప్పెడికర్మలు విధివిహితము లగును, సత్వమునకంటే తమస్సు, తమస్సునకంటే రజోగుణము అధికమై యున్నపుడు మరణము గలిగిననది వైశ్యదేహమును గలిగించును. దానికి కృష్యాదులు కర్మలుగా నొప్పును.
సత్వమునకంటే రజస్సు, రజస్సునకంటే తమోగుణము అధికమై యుండినపుడు మరణము గలిగిన యెడల నది శూద్ర దేహమును కలిగించును. సేవాదులు దానికర్మలుగా నుండును. మరణకాలమందేయాకృతిగల కర్మయం దతఃకరణము వర్తించుచుండునో ఆకర్శకు తగిన దేహము నది గలిగించును.
ఇందులకుఁ దార్కాణముగ స్కాందపురాణమందలి హేమ కూటఖండము నందలి యొకకథ నుదహరింతును.
పూర్వము పంపా క్షేత్రమునందలి తుంగభద్రాతీరమునందొక వేశ్య పూర్వపుణ్య వశమున యోగినియై పర్ణశాల కల్పించుకొని వసించుచుండెను. ఆమె దైవాను గ్రహమున పూర్వజన్మ జ్ఞానమును అణిమాది సిద్ధులను గలిగియుండినది. జనులు స్వాభీష్టఫల సిద్ధులకై ఆమెను తండోపతండములుగా సేవించుచుండిరట. ఇట్లుండ నొకప్పుడు శండిలుఁడను ఋషి స్నానార్థమై తుంగభద్రానదికిఁ బోవుచు నచ్చట జనసమూహములతో నొప్పుచున్న జటావల్కల భస్మ రుద్రాక్షలను ధరించియున్న యోగినియగు వేశ్యనుగాంచి, కర్మవశమున నామెపై నసూయఁజెంది ‘‘ఆహా! యేమి యీజనుల యజ్ఞానము. నీచకులమునందు బుట్టిన వేశ్య నిట్లేల సేవించుచున్నారో’’ అని ఆమెను మనస్సునందు నిందించుచుండెను.
ఆయోగిని తనయాత్మబోధమున నదియెఱింగి యాఋషిని గాంచి ‘‘మహాత్మా! మీరేల నన్ను నిష్కారణముగా మనసులో నిందించుకొనుచున్నారు?’’ అని వినయముతో ప్రశ్నింపగ నాఋషి యామెతో నిటుల బలికెను.
‘‘నేను నిన్ను నిందింపలేదుగాని నీవు సాధుగర్హితమగు వేశ్య కులమున బుట్టినదానవు. నీకు తపస్సు జ్ఞాన మెక్కడిది. లోకులజ్ఞానులై వ్యర్థముగ నిన్ను సేవించుచున్నారే. అని నామనంబున నవ్వుకొను చుంటిని.
అనిఁబల్కిన శండిలునితో ‘‘ఓబ్రహ్మమూర్తి! మీరు పరుల నిటుల నిందింపఁదగునా’’ అని యిట్లనెను.
శ్లో॥ విప్రో భవతి పూర్వస్మి న్నిదానీం పూర్వజన్మవాన్
శూద్రో విప్రత్వ మాయాతి విప్ర సంకర జన్మవాన్
తా॥ పూర్వజస్మమందు శూద్రుఁడుగఁ బుట్టిన యొకానొకడం బ్రాహ్మణుఁ డగుచున్నాఁడు ఇపు డీజన్మయందు బ్రాహ్మణుఁడుగఁ బుట్టియున్న వాఁడొక కారణమున సంకరజన్మ నొందుచున్నాడు, ప్రాణుల కర్మగతి నెవ్వఁడెఱుంగఁగలడు. వ్యర్థముగ బ్రాహ్మణుఁ పండితుఁడనను గర్వము నొందకు’’ మనిఁ జెప్పి వెడలిపోయెను. ఋషియు నచ్చటనుండి తన యాశ్రమమునకు వెడలిపోయెను.
పిమ్మట కొంతకాలమునకు భూరియను పేరుగల చండాలుఁడు సంతానార్థియై ఆయోగినిని సేవించి ప్రార్థింపగ, నామె యాచండాలునితో ‘‘నీవు మంచి చర్మముతో పాదుకలను జేసి, యీ వైశాఖము నందీక్షేత్రమునందు వసించుచున్న శండిలుఁడను బ్రాహ్మణున కిచ్చిన యెడల నీకు పుత్రుఁ డుదయించు’’నని పలికెను.
అపుడా చండాలుఁడు మంచిపాదుకలను నిర్మించి శండిల మహర్షి వసించెడు నాశ్రమ బహిఃప్రదేశమునం దుంచి వెడలిపోయెను. స్నానార్థమై బయలు త్రోవలో నా మంచిపాదరక్షలుఁ గన్పించినంత సంతసించి, వానిని గ్రహించి యుప యోగించెను. దైవయోగమువలన నా పాదరక్షలయం దనురాగమును శండిలునకు వృద్ధికాఁజొచ్చెను. పాదరక్షలయం దిట్లా ఋషి మనస్సు నిల్పియున్న సమయమున నతనికి మరణము గలిగెను.
ఆదోషమువలన శండిలఋషి భూరియనెడి చండాలుని భార్య గర్భమునందుఁ జేరి స్వకర్మకై చింతించుచు ప్రసవసమయ మేతెంచినను బయటకు రాక నిరోధించుచు బాధ కలిగించుచుండెను. చండాలుడు తద్బాధా నివారణ కొఱకు మరల నాయోగినిని ప్రార్థింపగనే యరుదెంచి, యామె గర్భనుందున్న శిశువుతో నిటులఁ బలికెను.
‘‘ఓ బ్రాహ్మణుడా! ఏల బాధ గలిగించెదవు. గర్భమునుండి వెడలిరమ్ము. పూర్వార్జిత దోషము ననుభవింపక తీరునా? నిన్ను ఆవుపాలచే పోషించునట్లేర్పాటుఁ జేయింతునని తెలిపి చండాలునితో నట్లే సలుప నాజ్ఞాపించి వెడలిపోయెను.
వెంటనే యతఁడు భూరికి పుత్రుఁడై జన్మించెను. భూరి సంతోషించి యా శిశువునకు నిత్యయోగియని పేరు పెట్టి యోగిని జెప్పిన విధమున పోషించు చుండెను. కొంతకాలమునకు నిత్యయోగి పెద్దవాఁడయ్యెను. పూర్వపుణ్య విశేషమున నతఁడు జన్మప్రభృతి ఆత్మజ్ఞానియై వర్తించుచుండెను. ఒకనాడు తండ్రియగు భూరి గ్రామాంతరమున కేగియున్న సమయమునందాపట్టణమున రాత్రి జాగరణ మొనరింప వలసిన పనికై చిత్రసేనుఁ డనురాజు భూరికొఱకు భటునిఁ బంపెను. భూరి గ్రామమున లేఁడు. రాజాజ్ఞ నిర్వర్తింపక తప్పదు. గాన భూరి భార్య కుమారుఁడగు నిత్యయోగి కాసంగతిఁ దెలిపెను. తానాపనిఁ జేసి వత్తునని తల్లితోఁ జెప్పి ఆపట్టణమునం దారాత్రి ప్రజలను జ్ఞాన ప్రబోధక వాక్యములతో జాగరణ మొనర్చిను. ఆ రాజావాక్యములు రాత్రి విని ఉదయమున నిత్యయోగినిఁ బిలిపించి నీవెవ్వఁడవని ప్రశ్నించెను. ఆతఁడు తా నెవ్వఁడో తెలియదనియు పంపాక్షేత్రమునం దున్న యోగినియగు వేశ్యను విచారించిన యెడల తెలియఁగలరనెను.
అపుడారాజు ఆయోగినినిఁ బిలిపించెను. ఆమెవలన విషయము నంతయు నెఱింగి ఆమె అనుగ్రహమున సర్వులు కృతార్థులైరి.
శ్లో॥ అంత్యకాలేతు యంభావం స్మరంతి విబుధా అపి
ప్రాప్నువంతి తద్భావ మితివేదవిదో విదుః॥ స్కాందము
శ్లో॥ యం యం స్మృత్వా త్యజం త్యంతే కళేబర మనన్య ధీః
తం తం దేహాం సమాప్నోతి పురుషోభావనా బలాత్॥ హేమకూట ఖండము
ఈసిద్ధాంతములను పైకథ చక్కగ వివరించినది.
పుట్టుక చేత మానవులందఱు సమానులేయైనను, యెవ్వరికిగాని నియమ బద్ధములగు కర్మలు లేకపోయిన యెడల సంకర మేర్పడి కష్టము లుదయించును.
ఉదాహరణ కొకకుటుంబ వ్యవహారములఁగైకొందము. ప్రపంచ మొక కుటుంబము. దీనికి పరమేశ్వరుడు తండ్రియగుట వలన యజమానుఁడై యున్నాడు. మానవులందఱును అదే దేవుని కుమారులే. కుమారు లందఱును తండ్రి నియమించిన కర్మలను విధిగ జేయుచు కర్మఫల లాభములను కుటుంబ సౌఖ్యమునకై తండ్రికి సమర్పించవలయును గదా! కుమారు లందఱకును తండ్రి వారివారి యిష్టానుసారముగా పనులను నియమించుచుండుటయుఁ దెలిసిన యంశమే. ఱేపటిపని కుమారు నడిగి రాత్రియందే తండ్రి నియమించును, లేదా నిశ్చయించును. తండ్రితో రాత్రి తాను కోరుకొని యున్న పని మఱుదినమునందు చేయకపోయినను మఱొక పనికి బోయినను క్రమశిక్షణమునకు భంగముఁ గలిగించినవాఁడై కుటుంబ సౌఖ్యమునకు లోటుగలిగించి తండ్రిచే దండిరపఁ బడునుగదా!
ఇందువలన తేలిన సారాంశమేమన మానవులు కిపుడు లభించి యుండిన జన్మలును, జన్మలకు విధింపఁబడియున్న కర్మలును తమతమ పూర్వదేహముల మరణసమయములందు జీవులు కోరుకొని తెచ్చుకొని యున్నవేగాని వేఱుగావు. ప్రస్తుతము వర్తించుచున్న జన్మకు విధివిహితమై యుండిన కర్మను విడువ నెవ్వనికినిఁ జెల్లదు.
శ్లో॥ నియతస్యతు సన్న్యాసః కర్మణో నోపపద్యతే
మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితిః గీ. 18-7
తా॥ జన్మమాత్రమున నియతమై యుండిన కర్మయొక్క విడుపు చెల్లదు. అట్లొనర్చినవాఁడు తామసుఁడుగ పరిగణింపఁబడును.
శ్లో॥ శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మా త్స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః॥ గీ. 3-35
తా॥ పరధర్మమును తాను లెస్సగ నాచరించుటకంటె హీనమైన స్వధర్మము నాచరించుట శ్రేయస్కరము. స్వధర్మమునందలి మరణమైనను మంచిదేగాని పరధర్మము భయావహమైనది.
శ్లో॥ వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృష్ణాతి నరో-పరాణి
తథా శరీరాణి విహయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ॥ గీ. 2-22
తా॥ మానవుడు జీర్ణించిన వస్త్రములను విడచి యితర నూతనవస్త్రముల నెటుల ధరించుచుండునో జీవుఁడట్లే ప్రాతదేహములను విడచి కొత్త దేహములనుఁ దాల్చుచున్నాడు.
ఇదెంత చక్కని యుపమానమో పరికింపుఁడు. జీవునకు దేహము మానవునకు వస్త్రమువంటిది. అభిమానము పూర్తిగ నశించువఱకును మానవుఁడు వస్త్ర ధారణముఁ జేయుచునే యుండును. అటులనే అజ్ఞానము నివర్తించువఱకును జీవుఁడు జన్మము లెత్తుచునే యుండును.
మానవుఁడు ధరించుటకు లోకమునం దనేక విధములగు వస్త్రములు గలవు. వానిలో తన యోగ్యతానుసారముగ నిష్టములగు వస్త్రములను మానవుఁడు గైకొని ధరించుచుండును. అటులనే జీవుఁడు తన యోగ్యతానుసారముగ నిష్టములగు జాతిశరీరములఁ దాల్చును.
పైఁజెప్పిన విషయములనుఁబట్టి జాతి యనునదియు, కష్టసుఖ ములనునవియు, నేదోయొక నియతినిఁబట్టి కలుగుననియు, నవి యా హ్లాదకరములును, సంకటదములు నగుననియుఁదేలినది. అదియుగాక నానియతిఁ బట్టి మానవుఁడు పూర్వజన్మమున నాస్థితి గోరుకొనియే యుండెనని తద్వాంఛాను సరణముగ నాతని కావిధమగు జీవితస్థితి లభించు ననియుఁ జెప్పినటులైనది. కాని కొందఱు మానవుఁడు సంతోషమును గోరక కష్టములఁ గోరునా, మనకన్నుల యెదుట నింతటిదుఃఖ మగుపడుచున్నదే, యిందులకుఁ గారణము వారి జన్మాంతర వాంఛ యనుట అవివేకముగ నుండదా యనవచ్చును.
ఈ వాదము చాల సమంజసముగ నున్నది. ప్రతియొక్కఁడును సుఖింపఁ గోరునుగాని సంకటములఁగలనైన వాంఛింపడు. ఇందులకొక లౌకికోదాహరణము నొసంగుదుము.
ఈ శాలమున ఛాయాచిత్రము (ూష్ట్రశ్‌ీశీ) నెఱుంగని వారుండరు. లోకము నందు ఫోటో తీయించుకొనగోరెడి వారెల్లరును తమ కిష్టములును సాధ్యములునగు వస్త్రవాహన భూషణాదులను, వసతులను, పరివారకుటుంబజనులను, ప్రియ జంతువులను, జేకూర్చుకొని యిష్టములగు అంగవిన్యాసాది కర్మలతోనుండి ఫోటో తీయించు కొందురు. లోకమందు తామట్టి బింబరూపములతో నొప్పుచుండవలెనని వారికవుడు కలిగియుండిన కోరికయైయున్నది.
ఫోటో తీయువాఁడు బొత్తాము నొక్కు సమయమందు ఫోటో తీయించుకొనగో రెడివారెట్లుఁదురో అట్టి బింబములే ఫోటోయందు పడును. పిమ్మట నెప్పుడైనను తామట్లు లోకమున గనుపడుచుండుట తమకసహ్యమేయైనను, యిష్టము లేకున్నను, ఆబింబము నశించువఱకు నట్లు కన్పడక తప్పదుగదా!
అటులనే మరణకాలమందు జీవుని స్వభావమెట్లుండునో, అట్టి స్వభావానుగుణ జాతిరూపగుణకర్మలు లభించును. తప్పించుకొనుటకు వీలులేదు. వలదనినను మఱియు ప్రకృతి తత్వమెప్పుడును. మానవులకు క్షణక్షణము భిన్న భిన్నాభిరుచులను గలిగించుచుండుట, లక్షణముగాఁగలదై యున్నది. మానవునకు, బాల్యము మొదలు జీవితాంతమువఱకు నొకప్పుడు ప్రియముగ నుండినది, వయస్సు మీఱిన కొలఁదియు నదియే యప్రియమైనదగుచున్నది.
మఱియు లోకమునందొకనికి ప్రియముగ నుండినది మఱియొ కని కప్రియమైనదిగా నుండుటందఱెఱుంగుదురు. ఒకనికి నీచముగ నుండునది మఱియొకనికి యోగ్యమైనదిగ నుండును. ఇంతెందులకు, బాలుర మీకిష్టము లగునవి తీసుకొండని ద్రవ్యమిచ్చినయెడల వారొక ఱొకఱు ఒక్కొక పదార్థము, తినుబండారమునుగాని, ఆటవస్తువునుగాని కై కొనుచున్నారు. యౌవన రూపలావణ్యాదులుగల యొక్కతయే భర్తకు, తండ్రికి, కుమారునకు, యువకునకు, వృద్ధునకు నపుంసకునకు ఒకరొకరి కొక్కొక్క విధమగు నభిప్రాయము జనింప జేయుచున్నది గదా!
భరతఖండ వాసుల కెల్లఱకు ప్రియపదార్థమగు నెయ్యి, బర్మా వాసులకు సరిపడక యసహ్యమగుచున్నది. మఱియు నిట్టి యభిరుచి భేదము లేగాదు;
ఉత్తమజాతికర్మలు మిక్కిలి బాధ్యతతో కూడినవి. గాన చక్కగ నిర్వహించుటకు తగిన యర్హత గావలయును. లోకమందు తరతమ భేదములతో నొప్పెడి రాజోద్యోగ పదవులనేక ములున్నను, ప్రజలు వారువారు నిర్వహించుటకు యోగ్యములగు పదవులను మాత్రమే కోరుకొనుట లేదా! తలారి పనికి దరఖాస్తు పెట్టకొనిన వానికి కలెక్టరు పని నిచ్చెదమన్న యోగ్యత చాలనందున వాడనుమతింపగలఁడా!
గాన అట్లు సంశయింప పనిలేదు. మానవులకు గలిగియున్న జన్మకర్మలకు, సుఖదుఃఖాదులకును పూర్వజన్మముయొక్క మరణసమ యమునందలి స్వభావము, వారివారి పుణ్యపాపకర్మలే కారణములు గాని, భగవంతు డెంతమాత్రమునుగాడు. వారివారి కర్మలకు తగిన ఫలములను వారు కోరినట్లు క్రమము దప్పక వారికందఁ జేయుట భగవంతుని కృత్యమైయున్నది.
భగవంతుడు నిమిత్తమాత్రుడగు నిష్పక్షపాతి.
కం॥ వినుమలుకయు కూర్మియు లే
వనవద్యా యెజ్జనంబు అందును విధికిన్
మునుజేసిన కర్మము ఫల
మనుభవ గోచరము సేయు నంతియ తరితోన్॥ (భా.-ఆను,5 ఆశ్వా)
తాత్పర్యము సులభము.
కొందఱు నిష్కారణముగ భగవంతునకు పక్షపాతాదులు గలవని నిందింతురు. అటుల దలంచుట పొరపాటు. వైద్యుడగు వాడు ప్రజలకు సంభవించిన నానావిధములగు రోగములకు మూలకారణముల నెఱింగి యేరోగ నివారణమున కెట్టి మందు నొసంగవలెనో యెట్టి ఆహార విహారాది విధుల నేర్పఱుపవలెనో అట్లొనరించు చున్నాడు. రోగములు నానావిధము లగుటవల్ల చికిత్సలును నానా విధములుగు నొప్పుచుండును. రోగులయందు వైద్యున కెట్టి పక్షపాతాదులు లేవు. వైద్యుడందఱయందును సమబుద్ధితో రోగశాంతినే యభిలషించుచుండునుగదా!
అటులనే భగవంతుడు ప్రజలకు సంభవించియున్న బహువిధములగు పుణ్యపాపకర్మలయొక్క శాంతికై బహువిధములగు సుఖదుఃఖాదులను విధించు చున్నాడు. సర్వభూతములయందును సమరూపుడై వారివారి తగిన కర్మలకు జాతికర్మవిధులు నేర్పఱచుచున్నాడు. భగవంతున కెవరియందెట్టి పక్షపాతమును లేదు.
శ్లో॥ లాల నే తాడ నే మాతుః నవైషమ్యం యదార్భకే।
తద్వదేవ మహేశస్య నియంతుర్గుణపోషయోః॥
తా॥ కుమారుని లాలించుటయందును, దండిరచుటయందును, తల్లి కెటుల వైషమ్యభావము లేకయుండునో, అటులనే గుణదోషములకు నియంతయగు పరమేశ్వరునకు వైషమ్యభావము లేదు.
భగవద్గీత బోధించిన ధర్మసిద్ధాంతము నిదియే.
అటులగాదు, మానవులకు జన్మమాత్రమున విధివిహితములగు జాతులు గాని, కర్మలుగాని లేవని యనినయెడల భగవద్గీతయందలి యీక్రింది శ్లోకములకు సరియగు అర్థము జెప్పుటకే వలనుపడదు.
శ్లో॥ నియంతం కురుకర్మత్వం గీ-3-8-
శ్లో॥ నియతస్యతు సంన్యాసిః గీ-18-7-
శ్లో॥ సహజం కర్మ కౌంతేయ॥ గీ-18-48-
శ్లో॥ స్వధర్మమపిచావేక్ష్య॥ గీ-2-31-
శ్లో॥ స్వేస్వకర్మణ్యభిరతః గీ-18-48
శ్లో॥ శ్రేయాన్ స్వధర్మోనిగుణః గీ-18-47
శ్లో॥ స్వకర్మణాతమభ్యర్చ్య॥ గీ-18-46
ఇత్యాది వాక్యము లనేకము లింకనుగలవు. వీనికి పక్షపాతముతోను, పాండిత్య ప్రకర్షతోనో, యెవ్వరేని యేదియోయొక విధమగు అర్థమును ప్రయాసతో నాసా కేశాకర్షణమువలె కల్పించినను అది పారమార్థ మెంతమాత్రమును కాజాలదని మాత్రము చెప్పవలయును.
భగవద్గీత ఒక జాతియందు జన్మించిన మానవుడు మఱియొక జాతి కర్మ నెంతమాత్రమును జేయరాదని శాసించుచున్నది. జన్మ చేతనే జాతి యేర్పడుచున్నదని స్పష్టపఱుపఁబడినదిగదా!
బీజప్రాయములుగ, తత్వసూత్రములుగా నొప్పుచుండిన భగవద్గీతా సిద్ధాంతములకు వివుల వ్యాఖ్యానమై యొప్పుచుండిన భారతము నందీ విషయమే ధర్మరాజు భీష్మునితో నిట్లు ప్రశ్నించెను.
కం॥ అనిన పితామహుతోన ।
జ్జనపతీ బ్రాహ్మణ్య మవలిజాతులమూటన్ ॥
జనియించిన వానికి దొర ।
కొనునొకొ యతివిమలకర్మ గుణయోగమునన్ ॥ (తెనుగు భారతం అనుశాసనికం. 1 ఆశ్వా.)
అని అడిగిన ధర్మరాజునకు ప్రత్యుత్తరముగ భీష్ముడిరద్రమతంగ సంవాదమను కథను వచించెను.
ఆ భారత కథవలన సర్వులకును జన్మవల్లనే జాతి యేర్పడు ననియు నొకజాతియందుఁ బుట్టినవాడు మఱొక జాతికి మాఱుట దుస్సాధ్యమనియు తేలుచున్నది. కనుకనే శాస్త్రమిట్లు వచించు చున్నది.
శ్లో॥ సర్వేషాం జన్మనాజాతిః నాన్యధా కర్మకోటిభిః ॥
పశ్వాదీనాం యథాజాతిః జన్మనైవ నచాన్యథా ॥
తా॥ పశ్వాదుల కెట్లు జన్మచేతనే జాతి సిద్ధమైయున్నది అటులనే సర్వులకును జన్మచేతనే జాతి యేర్పడునుగాని కోట్లకొలది కర్మలచేతను జాతి మారట సంభవింపదు.
భారతమునందు శివుడు పార్వతికి వర్ణపరిపాకమును దెలుపుచు నిల్లు బల్కెను.
చం॥ తమతమ కర్మముల్ దెరువుదప్పక జేసినవారు దేవలో
కమున సుఖంబు నొందుదురు క్రమ్మరి వచ్చియు పూర్వజాతి జ
న్మమున మహార్తి బొందుదురు మానిని యిమ్మెయిదప్పి యెట్టి
కృత్యముల జరించి రజ్జనుల కట్టికులంబున బుట్టు వాటిలున్॥ (అనుశాసనికం 5 ఆ. 81 పద్యం
మఱియును బృహదారణ్యకోపనిషత్తునందు జాతులయొక్క జన్మ హేతువులిట్లు వచింపబడినవి.
॥శ్రుతి॥ రమణీయచరణాః రమణీయాం యోనిమాపద్యేరన్ బ్రాహ్మణయో
నింవా క్షత్రియయోనింవా వైశ్య యోనింవా॥
కపూయచరణాః కవూయాం యోనిమాపద్యేరన్ శ్వయోనింవా
సూకరయోనింవా చండాలయోనింవా॥
తా॥ పుణ్యకర్మాచరణులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య యోనులయందు జనింతురు. పాపకర్మాచరణులు శ్వ సూకర చండాల యోనులయందు జనింతురు.
- జాతి భేదములు -
జాతియనగ పుట్టుకతోడనే జనించియుండిన భావము అని అశబ్దముయొక్క ప్రకృతి ప్రత్యయముల వల్లనే తేటపడుచున్నది. పశుపక్ష్యాదులయందు రూపక్రియా భేదములచే జాత్యవాంతర జాతు లెటుల సిద్ధములై యున్నవో మానవులయందును అటులనే జాత్యవాంతర జాతులు జన్మ చేతనే సిద్ధములై యున్నవి.
బహువిధ స్వరూప స్వభావ గుణభేదములతో నొప్పియున్న జాత్యవాంతర జాతులలో నేజాతి కాజాతియందు మాత్రమే సహవాస సంసర్గములు రెండును చెల్లుచుండును. కొన్ని భిన్న జాతి జంతువులకు పరస్పరము సహవాసముగాని, సంసర్గముగాని యేమాత్రము చెల్లుట లేదు, కొన్ని జాతులకు సహవాసము మాత్రము చెల్లును సంసర్గము చెల్లుట లేదు. ఇదంతయు లోకానుభవమునం దెలియదగు నంశము.
ఆ సాంప్రదాయమే మానవులయందును గలడు. శ్రీమచ్ఛంకర భగవత్పాదా చార్యులవారు తమ శారీరక భాష్యమనందిట్లు వచించిరి.
‘‘పశ్యాది భశ్చావిశేషాత్’’
తా॥ పశ్వాదుల వలెనే మనుష్యులయందును జాతులు పుట్టుక తోడనే నశించునవియై యున్నవి. అని స్పష్ట పఱచియున్నాడు.
అట్లు ప్రసిద్ధములైన యొక్కొక్కజాతి కర్మవలన లోకమునందొక్కక్క ప్రత్యేక ప్రయోజనమున్నది. జాతికి సాంకర్యము గిలిగి చెడిపోయిన యెడల వాని ప్రత్యేక ప్రయోజనముయొక్క పటుత్వమును చెడిపోవును. జాతి భేదములును వాని ప్రత్యేక గుణకర్మ లును మానవులయందేగాక, జడపదార్థములందును గలిగియున్నది.
గంధకము, అభ్రకము, తాళకము, ఇంగిలీకము, శాంతము వంటి పదార్థములు ఒక్కొక్కటియు వాని సహజగుణముల వలనఁ బెక్కు జాతులుగ వ్యవహరింపబడుచున్నవి. ఆవిషయము రసార్ణవము నంజూచునది.
ఆ విధముగా జడపదార్థములందును ఒక్కొక్క దానియందిట్లు పెక్కు ప్రత్యేక జాతులును, వాటి ప్రత్యేక గుణ ప్రయోజనములును ప్రసిద్ధములు ప్రత్యక్షములై యుండ మానవుల యందిట్టి జాతి భేదములు లేవనుట మూర్ఖప్రలాపములు గాక మఱేమగును. ఇట్లు బహువిధ స్వరూప స్వభావగుణ కర్మ జాతిభేదములతో నొప్పియున్న లోకమును జక్కగ గాపాడుచుండునది నియతియేగనుక నియతి ప్రాముఖ్యతను కొంత వివరింతును.
- నియతి -
జాతులకు సహజమైయుండిన నియతికే నియతి ధర్మమను పేరు విలసిల్ల చుండినది. నియతిని వీడకున్నంతవఱకే ప్రకృతి యానంద దాయకమగుచున్నది. లోకమునందలి భూతకోటులలో నొక్కొక్క జాతికి నొక్కొక్క ప్రకృతి సహజమై యొప్పుచున్నది. ప్రకృతికి నొక్కొక్క కర్మ నియతమైయున్నది. నియమ రాహిత్యము పశుత్వమునకు లక్షణముగ నొప్పుచున్నది. కావున నియమమే మానవునియందలి విశేషలక్షణము, మానవ సంఘమునందు నియతి వర్ణాశ్రమ ధర్మరూపమున నలరారుచున్నది. నియతిని వీడిన యెడల ప్రకృతి దుఃఖదాయిని యగుచున్నది.