శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › ధర్మజ్యోతి — 9

ధర్మజ్యోతి — 9

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 14 / 37

శ్లో॥ యస్మిన్‌ దేశే యఆచారః న్యాయదృష్టస్తు కల్పితః ।

సతస్మిన్నేవ కర్తవ్యః దేశాచారస్మృతో భృగోః (దేవలోక్తి)

యస్మిన్‌ దేశేపురేగ్రామే త్రైవిధ్య నగరేపివా ।

యోయత్ర విహితోధర్మ స్తంధర్మం నవిచాలయేత్‌॥ (పరాశరస్మృతి)

తా॥ ఏ దేశమునం దేయాచారము కల్పింపబడియున్నదో ఆయాచారము వలయును, సాంప్రదాయముగ ఆ దేశమునందే ఆచరించ ఏ దేశము ఏ పురము ఏ గ్రామము త్రివిధమగు యేనగరమునందైనను ఎచ్చట ఏధర్మము విహితమై యున్నదో అచ్చట ఆ ధర్మము నుల్లంఘింపరాదు.

మఱియును వైద్య విద్వాంసుడుగు చరకాచార్యడిటు నుడివి యున్నాడు.

శ్లో॥ యస్మిన్‌ దేశేతుయోజాతః

తస్య తజ్జం హితం స్మృతం॥

తా॥ ఏ దేశమునందు జనించియున్న వానికి ఆ దేశమునందు గల ఆహార విహారాదికమగు స్వధర్మము హితమైనది.

ఏదేశ జాతుల కెయ్యవి విహితాచార కర్మలో వాని కితర దేశ జాతి సాంకర్యములు లేకయుండిన యెడల వారికి అనందము తృప్తియు స్థిరముగ నుండును, పరస్పర సంఘర్షణములకుగాని అసూయా ద్వేష యుద్ధాదులకుగాని యెంతమాత్ర మవకాశముండదు.

లోకమునందలి సర్వ దేశ ఖండ జాతులకు పరస్పరము సల్లాప సందర్శనాది స్పృశ్యత లెంత సన్నిహితము లగుచుండునో దుఃఖము లంతగ వ్యాపించుచుండును,

శ్లో॥ సల్లాపస్పర్శ నిశ్వాసాత్‌ సహశయ్యా సహాసనాశనాత్‌ ।

యాజనాధ్యాప నాద్యానాత్‌ పాపం సంభ్రమతే నృణాం॥ (దేవలోక్తి)

తా॥ సల్లాపమువల్లను సంస్పర్శవల్లను నిశ్వాస వాయువువల్లను కలసి పరుండుట కూర్చుండుట భుజించుటవలనను కర్మలు చేయించుట చదువు చెప్పుట కలసి తిరుగుట అను వీనివలనను మానవులకు పాపములు సంక్రమించును. పాపమనగ దుఃఖమును గలిగించునది యని అర్థము.

ఏజాతి మానవునకైనను సుఖానందముల నొసంగునది అస్పృశ్యతయే, అస్పృశ్యతవలననే ధర్మార్థ కామమోక్షములు సిద్ధింపవలసియున్నది. అగ్రహారముల యందు బ్రాహ్మణు లితర జాతులనుండి అస్పృశ్యులుగ నుండినంతవఱకును వారి కేలోటును సంభవించి యుండలేదు. ఇపుడస్పృశ్యత నీచమను విపరీత భావ మేర్పడి యున్నది. పైత్యరోగము సంభవించినపుడు కండ్లకు తెల్లని వస్తువే పచ్చగ గనుపడునట్లు నేడత్యంత తమోగుణ భూయిష్టమగు కలికాలమగుటవలన జాతులకు పవిత్ర ధర్మముగ వేదశాస్త్రములచే జెప్పబడియున్న లోక కల్యాణము నొసంగెడి అస్పృశ్యత లోక నాశమొనర్చెడి మహామారివలె దోచుచున్నది.

శ్లో॥ అధర్మం ధర్మవితియా మన్యతే తమసావృతా।

సర్వార్థన్‌ విపరీతాంశ్చ బుద్ధిస్సార్థ తామసీ॥ (గీత-48-32)

తా॥ ఓయర్జునా! అధర్మమును ధర్మమనియును సర్వ సత్య ప్రమాణార్థములను అసత్య ప్రమాణార్థములుగనే బుద్ధి అజ్ఞానముచే గప్పబడి దలచుచున్నదోయది తమోగుణాత్మకమైనదిగా నెఱుంగుము.

వేదశాస్త్రములయందే కార్యముల ధర్మములని స్పష్టముగ నిరూపింపబడి యున్నవో యేవి పరమధర్మములుగ జెప్పబడియున్నవో వాని కన్నిటికి నిపుడు విపరీతభావము లేర్పడియున్నవి. నొక్కొక్కటియు నేడెత్తి చూపుటకు మహాభారతమంత గ్రంథము గావలసివచ్చును.

ఎప్పుడెప్పుడు కలి విజృంభించునో అప్పుడప్పుడు వేద ధర్మములకు హానియు, బౌద్ధధర్మముల కభివృద్ధియు గలుగుచుండునని శాస్త్ర గ్రంథములు చెప్పును. అష్టాదశ మహావురాణములలో నొకటియగు అగ్ని పురాణమునందు పదునారవ అధ్యాయములో బుద్ధావతారతత్వ మిట్లభివర్ణింప బడియున్నది. అగ్నిరువాచ

శ్లో॥ వక్ష్యేబుద్ధావతారంచ పఠతశృణ్వతోద్ధ దం ।

పురాదేవాసురాయుద్ధే దైత్యైర్దేవా పరాజితాః ॥       1

రక్షర క్షేతి శరణం వదంతో జగ్మురీశ్వరం ।

మాయామోహస్వరూపోసా శుద్ధోదన సుతోభవత్‌ ॥?      2

మోహమాయా సదైత్యాంస్తాన్‌, త్యాజితావేద ధర్మకం ।

తేచబౌద్ధాబ భూవుర్హి తేభ్యో న్యేవేద వర్జితాః ॥       3

అర్హత స్వాభవత్పశ్చా దార్హతానకరో తృరాన్‌ ।

ఏవం పాషండినోజాతాః వేదధర్మాది వర్జితా॥       4

నర కార్హం కర్మచక్రుః గ్రహిప్యంత్యధమాదపి ।

సర్వేకలియు గాంతేతు భవిష్యంతిచ సంకరాః ॥      5

ధర్మకంచుక సంవీతాః ఆధర్మ రుచయస్తధా।

మానుషాన్‌ భక్షయిష్యంతి మ్లేచ్ఛాపార్థివ రూపిణః॥      6

తా॥ అగ్ని యిటుల బల్కెను. చదువుటవల్ల వినుటవల్లను, తెలివి నొసంగెడి బుద్ధావతార విధమును జెప్పుచున్నాను. పూర్వము దేవాసురయుద్ధమందు రాక్షసుల చేత దేవతలోడిపోయి రక్షింపుము రక్షింపుమని యీశ్వరుని శరణమునొందిరి. అపుడా యీశ్వరుడు దేవతలను రక్షింపదలచి మాయామోహ న్వరూపుడై శుద్ధోదనునకు కుమారుడై బుద్ధుడుగ జనించెను. పిదప నా రాక్షసుల నందఱను వేదధర్మములను విడచునట్లు బోధించి వారిని సమ్మోహ పఱచెను. అట్లు వేదధర్మములను విడచినవారు బౌద్ధులైరి. బౌద్ధులవలన నితరులును వేదధర్మ వర్జితులైరి.

పిదప నా భగవంతు డర్హతుడుగ జనించి మణికొందఱ నార్హతులుగ జేసెను, ఈ విధముగ వేదశాస్త్ర ధర్మవర్జితులగు పాషండులు గలిగిరి. వాఱందరును కలియుగాంతమందు సంకరులయ్యెదరు. అధములవలనను విషయములు పరిగ్రహింతురు. పాపకర్మలను జేయుదురు. అట్లు అధర్మపరులగు మ్లేచ్చులు రాజ్యాధికారములు గలవారై లోకులను వంచించుటకు మాత్రమే ధర్మములు బలుకుచు ధర్మవేషములను ధరించి మనుష్యులను అన్ని విధముల భక్షింపగలరు. (చెడఁగొట్టఁగలరు).

లోకమునందిపు డపరబుద్ధావతారముగ భావింపబడుచుండిన గాంధీ మూలమున నిప్పుడెంతయో ప్రచారము జరిగియుండిన యిక్కాలములో నస్పృశ్యతయు వర్ణాశ్రమ ధర్మములును పవిత్రనియమములని యెవ్వడు బలుకునో వానిని లోకము వెఱ్ఱివానినిగా భావించి వదలుటయో దూషణ తిరస్కా రాదులచేత జుట్టుముట్టుటయో చేయకపోదు.

లోకమంగీకరింపనీ, తిరస్కరింపనీ, మరేమైనరానీ నేను సత్యముగ భావించి యుండిన ధర్మమును దెలుపుట నావిధి.

లోకమునం దధర్మములుగ గనుపట్టుచున్నను ధర్మములై యుండెడి కార్యములు కొన్నియును, ధర్మములుగ గనుపట్టుచున్నను అధర్మములై యుండు కార్యములు కొన్నియును గలవు. ధర్మమును నిర్ణయించుట మానవుల బుద్ధికి అతీతమగు విషయము. అది తర్కమూలములగు హేతువాదముల కందనిదైౖయున్నది.

ఏ ధర్మమందలి సత్యమైనను ఆత్మయందు చూడగలిగివవారికి గోచరించును.

కం॥ వినదగు నెవ్వరు సెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్‌

కని కల్ల నిజము దెలిసిన

మనుజుడె పోనీతిపరుడు మహిలో సుమతీ.

అని సుమతి శతక కారుడును వచించియున్నాడు. లోకము నందిపుడంతటను శుష్క హేతువాదములును, అధర్మాచరణంబులును ప్రబలియున్నవి. ప్రబలు చున్నవికూడ! వీని కన్నిటికిని హేతువు కాలమైయున్నది.

ఈ యధర్మము నిప్పుడిరతలో నెవ్వరు నాపజాలరు. పండితులు సైతము దీని నిప్పుడారాధించుచున్నారు. వేవేల ప్రభుత్వమే దీని నిపుడు పూజించుచున్నది. కాని నేనిప్పు డస్పృశ్యత విషయమున నిటు బలుకుట తప్పుగా లోకము భావింప వచ్చును. లోకమున కిప్పుడ ప్రియమైనదిగ దోచినను ఇది హితమైనదియని లాభకరమని నాభావనము గనుక చెప్పితిని.

శ్లో॥ పురుషా బహవో రాజన్‌ సతతం ప్రియవాదినః ।

ఆప్రియస్యతు పథ్యస్య వక్తాశ్రోతా చదుర్లభః ॥ (భారతము)

తా॥ తమకు ధర్మములుగ నున్నను లేకున్నను ఇతరులను తృప్తి పరిచుటకై యెప్పుడును స్తోత్రములు చేయువారు లోకమునందు బహుజనులు గలరు. అప్రియమైనదియైనను పథ్యమగు విషయమును ఖండితముగ జెప్పువాడును, చెప్పిన వినువాడును దుర్లభులు.

మానవుడు కర్మచేయక యుండజాలడు. శాస్త్రీయమును లోకహితమునగు కర్మచేయుట మానవునకు విధియైయున్నది, ఫలమీశ్వరాయత్తము గదా!

- దైవ పౌరుష స్వాతంత్య్రములు -

భగవదంశమే మానవుడు. భగవంతునకు మానవునకు పితృ పుత్రన్యాయము వర్తించుచుండును. భగవంతుడగు తండ్రి, మానవుడగు కుమారునకు కుటుంబ పోషణార్థమై గృహారామక్షేత్రాదుల నొసంగి వానిని చక్కగ పాలించుచుండుమని కొంత యాజమాన్య మొసంగియున్నాడు. తండ్రి యొసంగిన మితాధికారమును కుమారుడు దుర్వినియోగ మొనర్చినయెడల దండిరచు స్వాతంత్య్రము తండ్రికి గలదుగదా! మానవుడు దైవభక్తి గలిగి దైవము తనకొసంగిన సదసద్వివేకమనెడి పౌరుష శక్తిచేత దైవశాసన రూపమగు శాస్త్రీయ విధిని జక్కగ నొనర్చుచు యథోక్త కారిత్వమువలన దైవానుగ్రహమును బొందుచు క్రమక్రమముగ నున్న అధికారము లను పూర్ణ స్వాతంత్య్రమును సంపాదింపవలయును, అట్టి మానపుడు స్వధర్మము దోషమైనదియని ద్వేషింపడు. మేలైనదియని పరధర్మమునందనురక్తి జెందడు.

శ్లో॥ నద్యేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే । (గీత)

తా॥ కర్మ మంచిదికాదని ద్వేషింపడు. మంచిదని అనురక్తి నొందడు.

- బాధ్యత అధికారము -

ఈ రెండును శబ్దార్ధమువలె జంటగకూడియుండునేగాని, యొకదానిని విడచి మఱియొకటి యుండజాలదు. బాధ్యతతోకూడి అధికారముండునేగాని బాధ్యత లేకుండ నధికారముండజాలదు. లోకమునందధికార పదవిని గోరు మానవుడు తానెంతటి యధికారమును గోరునో అంతటి బాధ్యతనుగూడ వహించవలయును. తానెంతటి బాధ్యతను వహించుచుండునో అంతటియధికారము దానంత నదియే చేకూరుచుండును. బాధ్యతను గోరక యధికారమును మాత్రము గోరువాడు మూర్ఖుడుగను అవివేకిగను పరిగణింపబడును.

ఎవ్వడు కుటుంబముయొక్క రక్షణపోషణాది సర్వబాధ్యతలను వహించి కుటుంబస్థుల మేలుకొరకే తన శక్తి నంతయు వినియోగించు చుండునో వానికి ఆ కుంటుబమునందు పెద్దతనము అధికారము గల్గి కుటుంబముయొక్క రక్షణపోషణాది బాధ్యతల నే మాత్రము వహింపక తన సౌఖ్యమును మాత్రమే జూచుకొనుచుండు వానికీ కుటుంబమునందెట్టి పెత్తనముగాని గౌరవముగాని యుండనేరదు ఎవ్వడు తనకుటుంబమును వలెనే తనవంశమునంతయును జూచు చుండునో వాడు వంశాధికారియగును.

ఎవ్వడు తనవంశమునేగాక తనజాతినంతయును తనకుంటుబముగనే జూచుచుండునో వాడు జాతినాయకుడగును లోకమునంతయును తన కుటుంబముగనే జూచువాడు లోకనాయకుడగును. అట్టివాడు సర్వమునకు తానే ప్రభువగును. కాళిదాసకవి దిలీప మహారాజు సద్గుణముల నిట్లభివర్ణించెను.

శ్లో॥ ప్రజానాం వినయాధానా ద్రక్షణార్భరణాదపి ।

సపితా పితరస్తాసాం కేవలం జన్మ హేతవః ॥ (రఘువంశము)

తా. దిలీపమహారాజు ప్రజలకు నీతిగఱపుటవలనను రక్షించుటవలనను పోషించుటవలనను ఆ ప్రజల కందఱకును తండ్రియయ్యెను. వారిని గనిన తండ్రులు కేవలము జన్మకుమాత్రమే కారణభూతులైరి. అధికార మొకరిచ్చునది యెంతమాత్రమునుగాడు, తాను సత్యముగ నెంత యనురాగ బాధ్యతలు లోకమునందు గలిగియుండునో అంతటి నాయకత్వము వానికి తనంత జేకూరుచుండును.

- రాజు ప్రజలు -

ప్రజలకును రాజునకుగల సంబంధము భార్యకును భర్తకునుగల సంబంధము వంటిదై యున్నది. వీఱిద్దరును పరస్పరానురాగములతో వర్తిల్లుచుండవలయును.

అటులనుండినచో నుభయులకును సుఖానందములు గలుగు చుండును. అటులగాక వీరిలో నభిప్రాయభేదము లేర్పడినపుడు స్వతంత్రమగు పూర్ణాధికారము రాజునకు గలదా అనెడి విచికిత్స యేర్పడినపుడు సర్వాధికారము రాజునకు గల్గియుండుటయే శాస్త్రవిహితమైయున్నది. గృహస్తధర్మమునందు స్వాతంత్య్రము భర్తకగలదు గాని, భార్యకు గలదనుట విరుద్ధము.

భార్యక్షేత్రము. భర్త క్షేత్రజ్ఞుడు, దేహముపై నాత్మకధికారము గలదుగాని ఆత్మపైన దేహమునకు అధికారము గలదనుట సత్య విరుద్ధము. భర్తనుప్రేమించి సేవించుట భార్యకును, భార్యను ప్రేమించి పోషించుట భర్తకును ధర్మమైయున్నది. భర్తను ప్రేమించి భార్య సేవించుచున్నందున గృహకృత్యములయందు భర్త సర్వ స్వాతంత్య్రములు భార్యకేయొసంగి భార్యయిష్టానుసారము భర్త వర్తించు చుండును. భార్యకులభించియున్న యీ స్వాతంత్య్రము భర్త కలుగ జేసినదియేగాని నిజమైనది గాదు. భర్తకు హితముగ భార్యవర్తించు చున్నంతవఱకు మాత్రమే యది చెల్లు చుండును.

ఇదేవిధముగ ప్రజలకును ప్రభువునకు నిట్టిధర్మములే యొప్పుచుండును. కనుకనే రాజునకు ప్రజాపతియనెడి పేరొప్పుచున్నది.

- ప్రజాప్రభుత్వ సిద్ధాంతము -

ఇపుడు వర్తించుచుండిన ప్రభుత్వమును ప్రజాప్రభుత్వమను చున్నారు. ఈ ప్రజాప్రభుత్వ శబ్దమునకు అర్థము షష్ఠీ తత్పురుషగ ‘ప్రజలయొక్క ప్రభుత్వము’ అని నిర్వచించుచున్నారు. ప్రజలయొక్క యిష్టముపైననే ప్రభువును ప్రభుత్వము నడచితీరవలెననుట దీని తాత్పర్యము. ఇది భార్యజెప్పునటులనే విధిగ భర్తయు గృహకృత్యమును నడచితీఱవలె నన్నట్లున్నది! దీనియందు అధిక ప్రజలయొక్క సమ్మతియే ప్రభుత్వాధికారిని నియమించును. ప్రజలను వారికి మానవత్వమున్నను లేకున్నను వయస్సు వచ్చియుండిన కరచణాద్య వయవములుగల మానవబింబ స్వరూపులందఱునని నిర్వచింపబడి యున్నది. వీరి యిష్టమే ప్రభుత్వమును నడపవలసినది. ఈనిర్ణయములు అన్ని కార్యకలాపములు జరుగవలసియున్నవి, నిరుపయోగవ్యయము నెంతయో భరింపవలసియున్నది. నిజముగ నిది కలి ప్రేరితము, ఇది సత్యధర్మ విరుద్ధమునగు అపసవ్యసిద్ధాంతమై యున్నది. ప్రజలందఱి యందు నిపుడు అధికారవ్యామోహము మిన్నుముట్టిపోయినది. ఇంకను వృద్ధియగు చున్నది. ఇందువల్ల ప్రజలు భయభక్తులు యుక్తాయుక్తములును లేక ప్రవర్తించు చున్నారు. సమ్మెలు విధ్వంసనములును జేయుచున్నారు.

క్షణక్షణము నిప్పుడు ప్రభుత్వమును ప్రజలు భయపెట్టు చుండుటయును, ప్రభుత్వము భయశంకితమగుచుండుటయు, తటస్తించు చున్నది. ఇందువలన నూరూర లేని కక్షలు, అనూయా ద్వేషములు భయవిషాద సంఘటన లెన్నియో సంభవించుచున్నవి. ఇట్టి ప్రజలచే వివరింపబడెడి వారన్ననో ఉత్తమశ్రేణికి చెందిన పండితులేయైయుండుట మిక్కిలి యరుదు, ఒక వేళ క్వాచిత్కముగ నట్టిపండితులే వరింపబడినను వారికి వంశాచార సాంప్రదాయ సిద్ధమగు రాజ్యాంగ పరిపాల నానుభవ మే మాత్రము నుండదు. అట్టివారికే మంత్రిపదవులు మొదలగునవి జెందవలసియుండును. అపుడు వారేమి చేయగలరు? వారు కింది తాబేదారుల వలన పరిపాలనా విధానము సభ్యసింపవలసిన వారగుచుందురు అట్టిచో క్రింది తాబేదారులు జెప్పినట్లే మంత్రులు నడువవలసివచ్చును. అనుభవము లేనివాడు బండిని తోలవలసిన వాడైన యెడల గుఱ్ఱము లతని స్వాధీనమునందు నడవక స్వేచ్ఛగ జరించుననుట లోకవిదితము. బండియందున్న వారందఱును భయ సందేహప్రమాద కష్టనష్టములకు గుఱిగావలసివచ్చును. తఱచుగ ఆ మంత్రుల కార్యదర్శులు మొదలగువారును అనుభవము లేని క్రొత్త వారేర్పడు చుందురు. ఈ విధాన మెట్లున్నదనగ,

ఉ॥ ‘కాననివాని నూతగొని గాననివాడు విశిష్ఠవస్తువుల్‌ గానని భంగి’

అనెడి భాగవత పద్యార్థమును స్మరణకుఁ దెచ్చుచున్నది. ప్రజలనబడు వారిలో బెక్కండ్రు విద్యాగంధపుశూన్యులగు మానవాకారమాత్రులే యగుటవల్లను, అట్టివారికి వోటుహక్కు అనెడి సమ్మతి నొసంగెడి యధికారముగలిగియుండుటవల్ల, వారు నీతి నియమములు లేక విచ్చల విడిగ జరించుచు యుక్తాయుక్తములు లేక ప్రభుత్వమును ధిక్కరించుచు, జెలరేగుచున్నారు.

శ్లో॥ మర్కటస్యమధ్యోః పానం మధ్యే వృశ్చిక దర్శనం।

తన్మ ధ్యే భూతసంచారం యద్వత్త ద్వ ద్భవిష్యతీ॥

తా॥ కోతి కల్లు త్రాగియున్నది. దాని కపుడు తేలుకుట్టినది అందులో గ్రహము ప్రవేశించినది. అపుడాకోతి యెట్లుండునో అట్లు కాగలదు.

ముఖ్యముగ నీరాజ్యాంగ విధానమునందలి పరిపాలనాశాఖ లన్నిటి యందును గల అన్ని యుద్యోగముల యందును పారంపర్య క్రమబద్ధ సాంప్రదాయము, ననుభవము లేమాత్రము లేని క్రొత్తవారు తఱచుగ జేరుట సంభవించుచుండుట వలన నిందెన్నియో నష్టకష్టములు దాపురించుచున్నవి.

దోషమంతయు నీరాజ్యాంగ విధానమునందే గలదు. దైవశాసన విరుద్ధమగు నీయధర్మ సిద్ధాంతము నివుడు పండితులనబడు వారు సైతము నుత్త మధర్మముగ పరిగ్రహించి పూజించుచున్నారు.

ప్రజలు ప్రభువును వరించుట యనగ తాము అసమర్థులగుటవల్ల తమ రక్షణ పోషణములకై సమర్థడగు వాని నాశ్రయించుటను నర్థము జెల్లునుగాని, నియమించుట అను అర్థము సెల్లదు. రాజుసహజశక్తి సంపన్నుడగు విష్ణ్వంశ సంభూతుడని వేదశాస్త్రములు నుడువుచున్నవి. ప్రభువగువాడు తనసహజ ధీరోదాత్త లక్షణములచే ప్రజల నాకర్షించి వారికి తనయందు భయభక్త్యను రాగ విశ్వాసములను గలిగించి వారిసేవల నందుకొనుచు వారిని పాలించవలయును.

పంచమ వేదమనబడిన భారతము నందిట్లుగలదు.

కం॥ రాజులకు ప్రజ శరీరము

రాజు ప్రజకు నాత్మగాన రాజును ప్రజయున్‌॥

రాజోత్తమ యన్యోన్యవి

రాజితుడైయుండవలయు రక్షార్చనలన్‌॥

ప్రజలు ఇంద్రియములు ప్రభువు మనస్సువంటి వారైయున్నారు. మనస్సును సేవించుచు నింద్రియములు వర్తించుచుండవలయును. ఇంద్రియములును నియమించి పోషించుశక్తి మనస్సున కుండవలయును, మనస్సు ఇంద్రియములకు ప్రభువని శాస్త్రము నుడువుచున్నది.

శ్లో॥ ఇంద్రియాణాంహిచరతాం యన్మనోను విధీయతే

తదస్యహరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి॥ (గీత-2-68)

తా॥ స్వేచ్ఛగా విహరింపబోయెడి. యింద్రియములను ఏ మనస్సు నియమింపజాలదో అది నీటియందు గాలి ఓడను ముంచెడి విధమున జీవుని యానందమును హరించును.

పరిపాలనా విధానము నెంతగనో భగవద్గీత బోధించుచునే యున్నది. అందు భగవాను డిట్లు నుడువుచున్నాడు.

శ్లో॥ గీతాజ్ఞాన ముపాశ్రిత్యత్రీన్‌ లోకాన్‌ పాలయామ్యహం॥

తా॥ గీతాజ్ఞానము నాశ్రయించి నేను మూడు లోకములను పరిపాలించు చున్నాను.

నేటి ఈ ప్రజాప్రభుత్వ సిద్ధాంతము గీతాతత్వమునకు పూర్తిగ విరుద్ధమై యున్నది. లోకమునందు మెంతవఱకుండునో అంతవఱకును శాంతియుండ జాలదు, అమెరికా ఇంగ్లాండు మొదలగు దేశములయందీ ప్రజాప్రభుత్వ సిద్ధాంతము విజయవంతమై యున్నదని కొందఱు వచింతురు. అది జయాపజయములు పరికించువారిలో గల భావభేదములతో నొప్పుచుండును. ఆ దేశముల యందిపుడు విషయభోగము లెన్నియో బెఱిగియుండవచ్చును. కాని శాంత్యానందముల కాదేశములయందెంత మాత్రమును తావులేదు. నేడవి యుద్ధజ్వాలలకును భయాందోళనములకును నివాస భూములుగ నొప్పుచున్నవి. త్రిదోషసంకరమగు సన్నిపాత రోగము వలన దృఢముగలేచుట పరువెత్తుట ప్రసంగించుట మొదలగునవి గలిగియున్న, వానిని ఆరోగ్యవంతునిగ దలంచుట యవివేకము గదా!

అటుల కాదనినను ఆదేశముల కిపుడు గలిగియుండిన భోగైశ్వర్యాదులు ఆదేశములయొక్క యోగదశలవల్ల కాలానుగుణ్యముగ నేర్పడినవిగనే తలంప వలయును. భూగోళమందలి సర్వ దేశములకు గలుగుచుండెడి శుభాశుభ ఫలములకు ఖగోళమందలి నక్షత్ర గ్రహసంచారములు కారణములని జ్యోతి శాస్త్రములు నుడువుచున్నవి.

శ్లో॥ నక్షత్ర త్రయవర్గై రాగ్నేయాద్యైర్య వస్థి తైర్నవధా।

భారతపర్షే మధ్యాత్‌ ప్రాగాది విభాజితా దేశాః॥ (వారాహాసంహిత)

తా॥ కృత్తిక మొదలుకొని మూడేసి నక్షత్రములు - ఒక్కొక వర్గముగ ఆకాశము నందుండిన యిరువదేడు నక్షత్రములు తొమ్మిది వర్గములుగ విభజింపబడియున్నవి. అటులనే భరతవర్షమునందలి సర్వ దేశములు మధ్య భాగమున మొదలుకొని ప్రాగాదిగ తొమ్మిది ఖండములుగ విభజింపబడియున్నవి.

శ్లో॥ వర్గైరాగ్నేయాద్యైః క్రూరగ్రహపీడితైః క్రమేణ నృపాః ।

పాంచాలో మాగధికః కాళింగాద్యా క్షయంయాంతి॥ (వారాహీ సంహిత)

తా॥ పైన ఆకాశమునందు తొమ్మిది వర్గములుగ నుండిన కృత్తి కాది నక్షత్రములను క్రూరగ్రహములు సంచారవశమున నెప్పుడు పీడిరచునో క్రింద భూమియందు ఆ నక్షత్రముల క్రింద నుండిన పాంచాలము మాగధము కళింగము మొదలగు దేశములకును రాజులకు క్షయ మేర్పడును. యోగగ్రహములు ఏ నక్షత్రముల యందెప్పుడు గూడు చుండునో అపుడా నక్షత్రముల క్రిందనున్న ఆయా దేశములకు రాజయోగములు గలుగుచుండును.

భూగోళమునందు సర్వమానవులును నివసించుచుండెడి సర్వ దేశములును గల కర్మభూమికి భరతవర్షమని పేరు. అట్టి భరత వర్షమంతయును తొమ్మిది ఖండములుగ విభజింపబడియున్నది, (1) మధ్యఖండము (2) ప్రాఖ్ఖండము (8) ఆగ్నేయఖండము (4) దక్షిణ ఖండము (5) నైరృతిఖండము (6) పశ్చిమఖండము (7) వాయవ్యఖండము (8) ఉత్తరఖండము (9) ఈశాన్యఖండము: ఈ చెప్పబడిన తొమ్మిది ఖండముల యందు నేయేఖండములయందే యే దేశములున్నదియు, వారాహాసంహితయందు వివరముగ చెప్పబడినవి. వాని[2]* నీక్రింద గనుబఱచుచున్నాను. ఈ శాస్త్రమునందు వచింపబడియున్న దేశముల పేర్లకును, ప్రకృతము వ్యవహారములో నుండిన దేశముల పేర్లెన్నియో విధములగు మార్పులనొందియున్నవి. బుద్ధిమంతులు, చారిత్రక పండితులును, ఈ పేర్లను పరిశీలించి కారణములను దెల్పుదురని శాస్త్రీయ దేశనామములను ప్రకటించితిని. లోకమునందలి ఈ మార్పులకు తగిన యీ దేశములకును, ఖండములకు నొకదాని నుండి యొకదానిని వేరుపఱచుచు నైసర్గికమగు ప్రత్యేక వ్యక్తిత్వమును నిరూపించెడ సముద్ర నదీ పర్వతారణ్యాదులు భగవంతునిచే సృజింపబడియున్నవి. దేశములయొక్కయు, ఖండములయొక్కయు నైన శీతోష్ణాది భేదములవల్ల ఆహార విహారాదుల సాంఘికాచారములు మొదలగునవి యొక్కొక్క దేశమునందొక్కొక్క విధముగ నొప్పుచుండును.

మానవుల కెటుల వారి వారి జాతకముల ననుసరించి కాలాను గుణ్యముగ శుభాశుభ దశా యోగఫలములు గలుగుచుండునో అటులనే గృహ గ్రామ మండల రాష్ట్ర దేశ ఖండాదులకును కాలానుగుణ్యముగ శుభాశుభ ఫలములు గలుగుచుండును. మానవుని కెన్ని యంగములు గలవో గృహ గ్రామాదులకు నన్ని యంగములు గలవని వాస్తు శాస్త్రములు పేర్కొనుచున్నవి.

ఆ వాస్తు విద్యావిషయ మీ క్రింద నుదహరించుచుంటిని.

- వాస్తు విద్యా -

శ్లో॥ యత్రచ యేన గృహీతం విబుధేనా దిష్ఠిత సృత త్రైవ ।

        తదమరమయం విధాతా వాస్తువారం కల్పయామాన॥ (వారాహా సంహిత)

తా॥ నివాసార్థమై యెవనిచేత నెచ్చట నెంతభూమి గ్రహింప బడుచున్నదో యచ్చట దేవునిచేత ఆ వాస్తుమూర్తి ప్రతిష్ఠింపబడుచున్నాడు. బ్రహ్మదేవుడు ఆ దేవతామయుడగు వాస్తు పురుషుని కల్పించెను.

మానవుని యందెటుల 1 ఆత్మ 2 బుద్ధి 3 మనస్సు పది యింద్రియములుగా పదమూడు అవయవ భేదములు గలవో అటులనే ప్రతి గ్రామము నొక్కొక్క పురుష స్వరూపమై జాతులనబడు 13 అవయవములతో నొప్పుచున్నది.

మా నవునియందుండిన యీ యంగములు ఆత్మానుసారముగ తమ తమ స్వధర్మములను చక్కగ జేయుచున్న యెడల మానవునికి సుఖానందము లెటుల సిద్ధించునో పురుష స్వరూపముగ నుండిన గ్రామముసకు అంగములుగ నుండిన పదమూడు జాతులును తమ తమ జాతి, ధర్మములను చక్కగ జేయుచుండిన యెడల గ్రామమునకు సుఖానందములు అటులనే సిద్ధించుచుండును.

- గ్రామమునకు ఆయకట్టు పద్ధతి -

పురుషస్వరూపముగనుండిన గ్రామమునకు

1 ఆత్మ - పురోహితుడు ఈ రెండును బ్రాహ్మణ జాతులు

జీవుడు  - కరణము

2 బుద్ధి - రెడ్డి లేక రాజు - క్షత్రియజాతి

3 మనస్సు - వర్తకుడు - వైశ్యజాతి

10 ఇంద్రియములు- శూద్రులు - శూద్రజాతి

మొత్తము పదమూడు అంగములు.

- గ్రామజాతి లక్షణము -

శ్లో॥ బృహస్పతి స్తులేఖకాననీపతౌ కళాదరౌ।

స్త్వయస్కరస్తు దారుకార కుంభకార రాత్రి పాః॥

క్షురీతు వస్త్రశోధకః ప్లవశ్చ చిన్మకారకో ।

యథాక్రమంచి జాతిభేద మాహురాత్మ విజ్జనాః (వాస్తువిద్యా)

తాత్పర్యము క్రింద తెలుపబడినది.

శ్లో॥ గృహనగర గ్రామేషుచ సర్యత్రైవం ప్రతిష్ఠితా దేవాః ।

తేషుచ యథానురూపం వర్ణః విప్రాదయో వాప్యాః ॥ (వాస్తు విద్యా)

తా॥ గృహ నగర గ్రామాదుల యందంతటను వాస్తు పురుషుని శరీరా వయవములయందు ఆ యా దేవతలు ప్రతిష్ఠింపబడుచున్నారు. గ్రామాదులయొక్క యే యే అంగములయందు యేయే జాతులు నివసింపవలయునో అటుల విప్రాది జాతులు వసింపవలెను.

పది ఇంద్రియములును గ్రామమునందలి పది జాతులు వానివివరమ

ఇట్లు ప్రత్యేక వ్యక్తిత్వములతో నొప్పుచుండిన గృహ గ్రామ దేశ ఖండాదులకు ప్రత్యేకాచార సాంప్రదాయ భేదములున్నను,

1 షరాబు గ్రామమునందు కొలత తూకములు జేయువాడు.

2 కంసాలి బంగారు పని చేయువాడు

3 కరుముల ఇనుము లోహముల పనిజేయువాడు

4 వడ్ల చెక్క పనులు జేయువాడు

5 కుమ్మర కుండలు జేయువాడు

6 తలారి గ్రామమును రక్షించువాడు

7 మంగల క్షౌరాదులు జేయువాడు

8 చాకల వస్త్రము లుతుకువాడు

9 మాల గ్రామ పరిశుద్ధి జేయువాడు

10 మాదిగ తోళ పనులు జేయువాడు

అవి యన్నియును సత్య జ్ఞానానంద రూపమగు ధర్మమును పోషించునవిగ నుండవలయును.

శ్లో॥ చతుర్ణా మసీవర్ణానా మాచారో ధర్మపాలకః ।

ఆచార భ్రష్టదేహానాం భవేద్ధర్మః పరాఙ్ముఖః॥ (పరాశరస్మృతి)

తా॥ చతుర్వర్ణముల వారియొక్క ఆచారము, ఆనందరూపమగు ధర్మమును పోషించునదియై యుండవలెను. ఆచారమును విడచువారికి ధర్మము తిరుగు ముఖమగును.

- ఆచారల క్షణము -

శ్లో॥ యస్మిన్‌ దేశేయ ఆచార పారంపర్య క్రమాగతః ।

వర్ణానాం పాంతరాళా నాంస స దాచార ఉచ్యతే ॥ (మనుస్మృతి)

తా॥ అనేకములగు భేదములతో నొప్పుచుండిన అన్ని జాతులవారికి నే దేశమునందు నాచారము వంశపారంపర్య క్రమముగ నెడ తెగక వచ్చుచున్నదో అది అజాతివారికి సదాచారమనబడుచున్నది.

శ్లో॥ ఆచార లక్షణోధర్మః సంతిశ్చాచార లక్షణాః।

సాధూ వాంచ యథావృత్త మేత దాచార లక్షణం॥ (అనుశాసనిక పర్వం)

తా॥ ధర్మము ఆచారమే లక్షణము గలదియై యున్నది. ఆచారమే లక్షణముగ గలవారు. సాధువు లనబడుదురు. సాధుపు లెట్లు వర్తించుచుందురో అదియే ఆచారమునకు లక్షణము.

సర్వ దేశములయందును యే జాతి యందున్న సాధువులు ఆ జాతివారికి ఆచారమును నిరూపించవలసినవారైయున్నారు. సాధువులనగ దయా సత్య జ్ఞానాదులు గలవారు. వారి ప్రవర్తనమే ఆ జాతికి సదాచారమైయున్నది.

ధర్మము సుఖరూపమైనది, ఆచారము దానిని వృద్ధిజేయునదియై యున్నది.

కొందఱు ఆచారమునకును, ధర్మమునకుగల భేదమును గుర్తింపక ఆచారమే ధర్మమనుకొనుచున్నారు.

ఇంగ్లాండమెరికా మొదలగు దేశముల యందిపుడున్న ప్రజాస్వామిక రాజ్యములను గాంచి మనము నట్టిదాని నెంతమాత్ర మభిలషింపరాదు. అనుకరణము ధర్మమునకు వ్యతిరేకమైనదిగ నుండరాదు.

ధర్మమూర్తి యగు భగవంతుడన్ని దేశములకు నొక్క డేగలడు. భగవచ్ఛాసన మన్న దేశములకు నొక్కటియేయై యున్నది.

ఆ దేశములయందిపుడున్న ప్రజాస్వామిక రాజ్యములైనను కలియుగముయొక్క అధర్మ ప్రాబల్యమువల్ల నేర్పడినవియేగాని సనా తన ధర్మబద్ధము లెంతమాత్రము గావు. మఱియు సర్వలోక ప్రభువగు భగవంతుడు సర్వలోకమును చాతుర్వర్ణ్యముగ సృజించితినని జెప్పి యున్నాడుగదా! ఒక్క భరత ఖండమునందు మాత్రమే మొదటి నుండియు బ్రాహ్మణాది చాతుర్వర్ణ్య జాతులును వారి ప్రత్యేక స్వరూప విధులును గనుపడుచున్నవియేగాని యితర దేశములయం దిట్లుండినట్లు చారిత్రక నిదర్శనము లైనను లేవు. ఇందులకు కారణమేమని కొందఱు సంశయించుచున్నారు. అట్లు సంశయింప బనిలేదు. చాతుర్వర్ణ్యవ్యవస్థ సర్వదేశములయందును గలదు. అది భరత ఖండము నందుండిన పేళ్లతో నుండక పోవచ్చును. దేశాచార

సాంప్రదాయములు భిన్నములుగ నుండవచ్చును. చాతుర్వర్ణ జాతులును ప్రత్యేకములగు కర్మలును విధింపబడియున్నట్లు వారికి తెలియకపోవచ్చును. భరత ఖండమునందుండినంత స్పష్ట రూపములతో నుండక పోవచ్చును. కాని పాశ్చాత్య దేశములయందును ధర్మము నుపదేశించెడి సత్యజ్ఞానానంద స్వరూపులగు పోవులు అనెడి గురువుల వంశములును, వారు బోధించిన ధర్మముల ననుసరించి దేశమును పరిపాలించెడి రాజుల వంశములును, వారి ననుసరించి వర్తించడి ధనిక వ్యాపార వంశములును పై మువ్వురకు హితముగ ప్రవర్తించెడి కార్మిక వంశములును, వారి వారికి పారంపర్యముగ వచ్చుచుండిన ఆచార సాంప్రదాయ విధులును గలిగియుండినట్లు ఆయా దేశ చరిత్రలు దెలుపుచున్నవి.

వర్తమాన కాలమునందన్ని దేశములయందును సాంకర్య మెంతయో గలిగి జాతులు భ్రష్టములైనవి. ఆ దేశముల యందిప్పటికే గుర్తించుటకును వీలుగాని విధమున జాతి భ్రష్టత గలిగియున్నది.