- భరత ఖండ ప్రశస్తి -
భరతవర్ష మనెడి వేదపురుషునకు ఆత్మస్థానమున భరతఖండ మొప్పుచున్నది. కనుకనే యది యెల్లప్పటికిని ధర్మజ్యోతికి నిలయమై విలసిల్లుచున్నది. సర్వదేశముల యందును, వెలిగిన విజ్ఞాన దీపిక లన్నియును భరతఖండ దివ్యజ్ఞాన జ్యోతినుండియే జనించి యున్నవనుట కెన్నియో చారిత్రక నిదర్శనములు గలవు.
భరత ఖండమునందు జనించిన తత్వజ్ఞాన సంపన్నులగు మహర్షులే సర్వ దేశములకును శాస్త్రకళా విజ్ఞాన భిక్ష నొసంగియున్నారు. భరత ఖండమునందుండిన నైసర్గిక పరిస్థితులను సూక్ష్మదృష్టితో బరిశీలించిన యెడల సమస్త సంపదలకును సర్వ ధర్మములకును భరత ఖండము బీజ భూతముగ నున్నదని తెలియగలదు.
ధర్మజ్యోతి ప్రకాశము దూర దేశములయందు ముందు క్రమ క్రమముగ తగ్గుచు వచ్చినది. ఇపుడిచ్చటను క్షీణించుచున్నది. కాని భరతఖండము నందెప్పటికిని ఆది స్వరూపహాని నొందక బీజప్రాయముగ ధర్మముండగలదు, మఱియు ధర్మమంతటను వ్యాపించెడి సమయ మేతెంచునపుడు యిందుండియే ధర్మము విశ్వవ్యాప్త ము గావలయును, పిండాండమునందుండిన ఇడ పింగళ సుషుమ్నలవలె భరత ఖండము నందుండిన గంగా యమునా సరస్వతీ నదులు మూడును, జ్ఞాన కర్మ భక్తి యోగములను దైవాసుర బ్రహ్మ సంపత్తులను సద సద్వివేకములను సుఖ దుఃఖా నందములను పుణ్య పాప సమతా తత్వములను మూటిని బోధించుచున్నవి.
భరత ఖండమునందు త్రివేణీ సంగమ స్థానముగ బ్రసిద్ధి వహించిన ప్రయాగ క్షేత్రము త్రివిధ నిష్ఠలతో జీవుడు బ్రహ్మాత్మైక్యమును బొందెడి విధమును దెలుపుతున్నది. దయామయుడగు భగవంతు డన్నిలోకములయందును యుక్త సమయములయందు బ్రహ్మ ఋషులద్వారా ధర్మమును బ్రబోధించి లోకములు సంకరములు గాకుండ నడ్డుపడి ఎల్లప్పుడు ధర్మజ్యోతిని ప్రకాశింప జేయుచుండును.
ససేతుర్విధరణమేషాం లోకానామసంభేదాయ
సర్వలోకములను భగవంతుడు రక్షించి పాలించుగాక.
సర్వేజనాః సుఖనోభవంతు
శ్రీ కృష్ణార్పణమస్తు.
సంధ్యావందన తత్త్వప్రదీపిక
అను నామాంతరముగల ‘‘ధర్మజ్యోతి’’ రెండవకిరణము
(యజుర్వేద సంధ్యావందన సహితము)
రచయిత:
పాణ్యం లక్ష్మీనరసయ్య
ముద్రణ
పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు
2022
యో నః ప్రచోదయాత్
మా కనిష్ట పితామహుల రచన సంధ్యా వందన తత్త్వప్రదీపిక గురించి. ‘‘న గాయత్య్రాః పరం మంత్రం; న మాతుః దైవతం పరం’’ అని కదా ఆర్యోక్త ప్రమాణము. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రీ మంత్రజపానుష్ఠానముతో కూడిన సంధ్యావందనం ప్రతి రోజూ మూడు పూటలా చేయడం త్రైవర్ణికుల (బ్రహ్మ, క్షత్రియ, వైశ్య) తొలి కర్తవ్యం. తండ్రి లేదా గురువు చేసెడి గాయత్రీ మంత్రోపదేశాన్నే బ్రహ్మోపదేశం అని కూడా అంటాం. ఆ విధాన మహత్త్వాన్ని జ్ఞాన, యోగ కర్మల స్థాయిలలో వివరిస్తున్నది ఈ గ్రంథం. ‘‘అహరహస్సంధ్యాముపాసీత’’ ప్రతిరోజూ సంధ్యనుపాసింపవలెను. ‘‘మాతృపితృభ్యో హి వత్సలతరో వేదః’’-వేదమ్ తల్లితండ్రుల కన్నా అధికమైన వాత్సల్యం కలది. మానవునికి కావలసిన కామ్యాలన్నిటిని తీర్చి, చివరకు ఉత్తమలోక ప్రాప్తిని కల్గిస్తుంది కాబట్టే వేదం మాతృస్వరూపగా భావించబడుతుంది. భావనకు ఆధారమైనది నామరూపాత్మకమైన పరంబ్రహ్మం.
‘‘చిన్మయస్యా-ద్వితీయస్యనిష్కలస్యా-శరీరిణః
ఉపాసకానాం దార్యార్ఠం బ్రహ్మణో రూపకల్పనం’’
పరబ్రహ్మ చిన్మయుడు; అద్వితీయుడు; నిష్కళుడు; అశరీరుడే ఐనను
ఉపాసకులకు మనోదార్యాన్ని ఇవ్వడానికి నామరూపాత్మకమైనదిగా కల్పించ బడుతుంది. విగ్రహారాధనలోని పరమార్థం ఇదే. ఆ పరిమితమైన రూపాన్ని నామాన్ని ఉదాహరణకు రాముడు, అమ్మవారు, శివుడు, గణపతి, వేంకటేశ్వేరుడు, మొదలైన రూపాలను విడివిడిగా దేవతలని భావిస్తున్నాం. షోడశోపచారాలతో నిత్యం పూజిస్తున్నాం. మళ్ళీవాటి మధ్య భేదం చూస్తున్నాం. దీనికే పరిమితమైతున్నాం. ఇక్కడే ఆగిపోరాదు. ఆ నామాలు, రూపాలు అన్నీ పరమాత్మ విభూతిగా భావించడం నిత్య సాధనామార్గంగా మారాల. క్రమంగా నీకు వాటికి తేడా లేదనే స్పృహ గల్గుతుంది. ఇంకా సాధన చేస్తూ పొతే ప్రతీ ప్రాణీ ఆత్మస్వరూపంగా తెలుస్తుంది. ఇలా విడివిడిగా తత్త్వశోధన చేయడం అభ్యసించాల. అంటే భావన చేస్తూపోవడమే. ప్రతీదాన్నీ దాని ఆకారంగా ఆయాపేర్లతో కాకుండా పరమాత్మ విభూతిగా ‘‘అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః’’ అనే విశ్వమంతా బయటా, వెలుపలా అంతటా వ్యాపించిన విష్ణుతత్వమే గోచరిస్తుంది. అందుకే ‘విశ్వం విష్ణుః’ అని మొదలయ్యింది. ‘విశ్వం దర్పణ’ అనే దక్షిణామూర్తి స్తొత్రం అదే. బ్రహ్మాకార వృత్తి ఇదే! ఇక్కడి వరకూ రావడానికే మూర్తి పూజ యేర్పరచబడిరది. కేవలం విగ్రహాలకే పరిమితమైతే ‘‘ప్రతిమా అల్పబుద్దీనాం’’ అన్నట్లు అల్పబుద్ధులముగనే మిగిలిపోతాం!
అఖండా-ద్వితీయ పరబ్రహ్మ తేజము యొక్క ఒక్క అంశమే సూర్యభగవానుడు. ‘‘సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ’’ జగత్తునకంతా సూర్యుడు ఆత్మ. ‘‘జ్యొతిషామ్ రవి రంశుమాన్’’
‘‘జ్యోతిస్సులలో ప్రకాశించు సూర్యుడను నేను’’ - భగవద్గీత విభూతి యోగము. లోకాన్నంతా వెలుగులతో నింపే భానుడు ఇంటి గవాక్షం నుండి కొద్ది ప్రకాశంతోనే ఇంటినంతటిని వెలిగించినట్లు, పరమాత్మ దివ్య చైతన్యంలో ఒక చిన్నభాగం సూర్యుడనే గవాక్షం ద్వారా ఈలోకాన్ని భౌతికంగా ప్రకాశింప జేస్తున్నది. ఆ సూర్యతేజస్సును ఆత్మతత్త్వంగా ఉపాసించడమే సంధ్యావందనం. గాయత్రీ మంత్రార్థం అదే కదా! ‘‘భగవత్సంకల్పమునకు భిన్నముగ నుండని బుద్ధిని ప్రసాదింపుము’’ అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ‘‘సంధ్యావందనం’’ అర్థాన్ని కొంచెం వివరించుకుందాం. గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా అని అమ్మవారిని హయగ్రీవ ఋషి కీర్తించినాడు. సంధ్యే గాయత్రి. గాయత్రే లలిత. అందుకే చతుష్పాత్ గాయత్రీ మంత్రం స్థూలం ఐతే పంచదశీ మంత్రం సూక్ష్మం అని మంత్ర కోవిదుల ఉవాచ. వాటి సమన్వయ నిరూపణం కూడా అద్భుతంగా ఉంటుంది. విషయానికి వస్తే పరమాత్మ అచలం, సర్వవ్యాపకం. అచలం చలంగా మారింది. అదే కాలం. కాలీ/కాళీ. మహాకాళీ. కదిలేదే కాలం. జ్ఞానం క్రియగా మారింది. ఈ కాలాన్ని ఉపాసించడం ఎలా? దాన్నినిత్యం ధ్యానిస్తూ పోవడమే. అది మనలను మళ్ళీ మూలతత్త్వానికి చేరుస్తుంది. ఎక్కడినుండి వచ్చామో అక్కడికే తిరిగి చేరడం ఇది. అదే ముక్తి. మోక్షం. కైవల్యం. నిత్య చలనమైన కాలాన్ని భావించి ధ్యానించడం సాధ్యంకాదు. అందుకే మనకు అనుభవం లోని రాత్రి పవళ్ళను కలిపే అతి సూక్ష్మకాలాన్ని సంధ్యగా ఉపాసిస్తాం. అట్లే పూర్వ, పర అహ్నములను (పగటి భాగాలను) కలిపేది మధ్యాహ్నం. ఈ మూడు సమయాలలో చేసే వందనమే సంధ్యావందనం. తాత్వికంగా చెప్తే సమ్యక్ ధ్యానమే సంధ్యా వందనం. కాల దేవత బాహ్య రూపమైన రాత్రి పగళ్ళ, రెండు పగళ్ళమధ్య కాలం ప్రభావవంతంగా ఉంటుంది. ప్రాతస్సంధ్య, సాయంసంధ్య, మాధ్యాహ్నిక సంధ్యగా వీటిని వ్యవహరిస్తాం. ఆకాలంలో జరిపే కర్మ, యోగ, ఉపాసనలన్నీ అధిక ఫలదములు.
‘‘యశ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః
న స సిద్ధిమవాప్నోతి న సుఖం నపరాం గతిం’’ -గీత
శాస్త్రాన్ని ఉల్లంఘించి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే, ఇహపరాలకు చెడుతాడని అర్థం.
‘‘గాయత్రీం తు పరిత్యజ్య యో-న్య మంత్రముపాసతే
సిద్ధాన్నం తు పరిత్యజ్య భిక్షామటతి దుర్మతిః’’
గాయత్రిని విడిచి అన్యమంత్రాలను జపించేవాడు, సిద్ధంగా ఉన్న పవిత్రమైన భోజనాన్ని వదలి, భిక్షాటనకుపోయే తెలివితక్కువవాడు. అట్లే మధ్యలో సంధ్యావందనం వదలి తిరిగి శ్రద్ధ కలిగి చేయాలనుకునే వాళ్ళు ఏదో ఆడియోలో, వీడియోలో విని చూచి చేసుకోవడం మంచిదికాదు. అది మేలుకన్నా కీడునే కలిగిస్తుంది. కారణం విధివిధానాలను గురుముఖతఃగా తెలుసుకొని కొన్నాళ్ళు నిత్యం చెప్పించుకొని సక్రమంగా సస్వరంతో చేసినప్పుడే ప్రయోజనం చేకూరుతుంది.
గాయత్రీ మంత్రం ఋగ్వేదం తృతీయ మండలంలో, యజుర్వేద సంహిత చతుర్థ కాండంలో ఉంది. 24 అక్షరములు, 3 పాదములు, 10 పదములుగా ఉంది. తత్, సవితుః, వరేణ్యం, భర్గః, దేవస్య, ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్. ముందు ఓమ్ చేరిస్తే 24 అక్షరాలు.
దీనికి సాయణ మహర్షి భాష్యం. యస్సవితా దేవః నః అస్మాకం ధియః కర్మాణి ధర్మాది విషయా వా బుద్ధిః ప్రచోదయాత్ ప్రేరయేత్ తత్ తస్య సర్వాసు శృతిషు ప్రసిద్ధస్య దేవస్య ద్యొతమానస్య సవితుః సర్వత్య్రామితయా ప్రేరకస్య జగత్స్రష్టుః పరమేశ్వరస్య అంతః భూతం వరేణ్యం సర్వైః ఉపాస్యతయా జ్ఞేయతయా చ సంభజనీయం ధరః అవిద్యా తత్కార్యయోః భంజనాత్ భర్గః స్వయం జ్యోతిః పరబ్రహ్మాత్మకం తేజః ధీమహి ధ్యాయేమ. తద్యోహం సో-సౌ యో-సౌ సో-హమితి మితి ధ్యాయేమ.
దీని భావం - యే దేవుడు మాకర్మలను (పనులను) లేక మా బుద్ధులను ప్రేరేపించుచున్నాడో అతడు సర్వ వేద ప్రసిద్ధుడు. సర్వాంతర్యామి. స్వయంజ్యోతీ ప్రకాశము. పరబ్రహ్మాత్మక తేజము. ఆ తేజాన్ని నేనే దానిగా అదే నేనుగా భావిస్తూ ధ్యానిస్తాను. సవితృదేవుని యొక్క ఆ తేజస్సును ధ్యానింతుము. ఇది పరమార్థం. అధర్వణ వేద మంత్రంలో భర్గ = అన్నం; ధీ=కర్మ అనే అర్థమ్‌లో ‘‘ఏ సూర్యుడు కర్మలను ప్రేరేపించుచున్నాడో, ఆ సూర్యుని అనుగ్రహంచేత అన్నాది ఫలములను (కోరికలను) పొందుచున్నాము’’ ఇది సామాన్యార్థం.
‘‘ఏ సూర్యుడు మాకర్మలను ప్రేరేపించుచున్నాడో, ఆ సూర్యుడు స్రష్ట. అందరూ చూడగల్గుతున్న, అందరూ పూజించదగిన, పాపాలను హరించెడి, ఆ సూర్య తేజోమండలాన్ని ధ్యానిస్తాను’’. ఇది అంతరార్థం. ఈవిధంగా ప్రతి మంత్రాన్నీ మూడు అర్థాలలో చెప్పుకొనేది మన ఆర్ష సంప్రదాయం. శంకర భాష్యం అద్వైత పద్ధతిలో ఉంటుంది. సంగ్రహంగా చూద్దాం. గ్రంథంలో సంపూర్ణంగా ఉంది.
తత్ = పరంబ్రహ్మ; సవితుః = సృష్టి, స్థితి, లయాత్మకమైన జగత్తునకు, ద్వైత భ్రాంతికి అధిష్టానమైన పరమాత్మ; వరేణ్యం = సర్వులు కోరదగిన పరమానందం; భర్గః = అజ్ఞానాది దోషాలను తొలగించే జ్ఞానం; దేవస్య = సర్వ చైతన్య మూలమైన చిత్; సవితుః, దేవస్య, ధియః = దేనినుండి సర్వం ప్రభవించినదో, బుద్ధి మొదలైన సర్వదృశ్యజగత్తుకు సాక్షిగా నున్న ఆ దివ్య తేజం; యః, నః, ప్రచోదయాత్ = ‘‘నేను అదే’’ అనే సర్వాత్మ భావం నిశ్చలమగుటకు నన్ను నడుపునుగాక. స్థూలంగా చెప్పుకుంటే ‘‘ఏది ఓమ్ కార వాచ్యమగు పరబ్రహ్మమో ఆ స్వరూపమునే నేనైతిని’’. అక్షర సంఖ్యాసూత్రమ్ ప్రకారం గాయత్రీ మంత్రం సూచించే సంఖ్య 100.
త
త్స
వి
తు
ర్వ
రే
ణ్యం
6
7
4
6
4
2
1
భ
ర్గో
దే
వ
స్య
ధీ
మ
హి
4
3
8
4
1
9
5
8
ధి
యో
యో
నః
ప్ర
చో
ద
యాత్
9
1
1
0
2
6
8
1
100 సంఖ్య పరిపూర్ణతకు ప్రతీక. ప్రణవంతో కూడిన సప్త వ్యాహృతులు ఓమ్ భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అనునవి పరబ్రహ్మాన్ని బోధించేవే. ‘‘ఓమాపోజ్యోతీరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్’’ ఇది గాయత్రీ శిరోమంత్రము. ఇదికూడా పరమాత్మ బోధకమే.
సంధ్యావందనం మూడు భాగాలు. అర్ఘ్యప్రదానం, గాయత్రీ మంత్రజపం, ఉపస్థానం(నమస్కార క్రియ). మొదటిదైన అర్ఘ్య ప్రదానానికి కాలనియమం చాలా ముఖ్యం. ప్రాతః సంధ్య ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నప్పుడే చేయడం ఉత్తమం. అరుణోదయంలో మధ్యమం. సూర్యోదయం తర్వాత అధమం. మాధ్యాహ్నికం 11-30 నుండి 12-00 గంటలలోపుగా జరగాల. దాటితే అధమం. సాయంసంధ్య సూర్యాస్తమయం కాలం ఉత్తమం. నక్షత్ర దర్శనాత్ పూర్వము మధ్యమం. తదనంతరం అధమం. అర్ఘ్యముల సంఖ్య కాలాతీత మైతే ప్రాయశ్చిత్త అర్ఘ్యంగా 1 యెక్కువగా ప్రదానం. అది ముందుగా వదలి (సంకల్పంతో) మిగిలినవి వదలడం క్రమం. ఉదయం 3 అర్ఘ్యాలు, మధ్యాహ్నము 1 సాయంత్రం 2. సకాలార్ఘ్యప్రదానంవల్ల సూర్యగతినడ్డుకొనే మందేహాది రాక్షస వధ జరుగుతుందని ఐతిహ్యం. రెండవది గాయత్రీ మంత్రజపం. ‘‘దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం తన్మంత్రంతు బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవతం’’ అని భాగవతంలో భగవానుడు చెప్పినట్లుగా మంత్రం మన ఆధీనం కావాలంటే జప విధిని తు చ తప్పక పాటించడమే మార్గం. గాయత్రీ మంత్ర జపానుష్టానం చేయనివాడు బ్రాహ్మణుడే కాదు. ఆ విధి యేది? ప్రతి మంత్రానికీ ఋషి, దేవతా, ఛందస్సులు, శక్తి, కీలక, దిగ్బంధాలుంటాయి. వాటినన్నిటినీ మన శరీరంలో న్యాసం చేసుకుంటూ, అట్లే అంగన్యాస, కరన్యాసాలను చేస్తూ మంత్రాధిదేవతా ధ్యానంలోని అర్థాన్ని భావిస్తూ ఆ రూపాన్ని మనసులో నిల్పడానికి యత్నిస్తూ ఉపాంశు (పెదవులు మాత్రమే కదులుతూ, ధ్వని బైటకురాని విధం), మౌన పద్ధతులలో ఒక పద్ధతి మాత్రమే అనుసరిస్తూ మంత్ర జపం 108 కి తక్కువగాకుండా సల్పి, తిరిగి అంగన్యాస కరన్యాసాలు దిగ్విమోకము ధ్యానంతో జపవిధి ముగుస్తున్నది. గాయత్రీ మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు; దేవత సవిత(సూర్యుడు); ఛందస్సు గాయత్రీ; ముఖం అగ్ని; శిరస్సు బ్రహ్మా; హృదయం విష్ణువు; శిఖ రుద్రుడు; యోని (మూలస్థానం) పృథ్వీ; ప్రాణ వాయువులే ప్రాణం; ఈ న్యాసాలతో మాంస శరీరం మంత్ర శరీరంగా మారుతుంది. అప్పుడు గానీ మంత్రజపార్హత రాదు. నారుద్రో రుద్రమర్చయేత్ రుద్రుడు కానివాడు రుద్రార్చన చేయరాదు. మహన్యాసమంటే ఇదే. ఈ విధంగా గాయత్రీ మంత్రజపం చేసి, మూడవదైన ఉపస్థానానికి ఉపక్రమిస్తాం. ఉదయ కాలం మిత్ర, మధ్యాహ్నం సవిత, సాయంత్రం వరుణ అనే పేర్లతో సూర్యశక్తిని నమస్కరిస్తాం. సృష్టి, స్థితి, లయలకు ఇవి ప్రతీకాత్మకంగా ఉన్నాయి. ప్రతి రోజూ మనం చూసే సూర్య భ్రమణమే ఇవి, ఉదయ మధ్యాహ్న సాయంకాలాలు సృష్టి స్థితి లయాలే, దానికి సాక్షి సూర్యుడే. అందుకే అతడు కర్మ సాక్షి, జగత్సాక్షి. తర్వాత చేయవలసిన నమస్కారం దిక్కులకు, సర్వ దేవతలకు ఆత్మ ప్రదక్షిణంగా జరుగుతుంది. ‘‘సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛ్‌తి’’ ప్రవరతో ముగుస్తుంది. ప్రతిసారి దేహ మనో శౌచం కోసం ఆచనమం చేస్తాం. ఈవిధంగా యెన్నెన్నో విశేషాలను ఈ గ్రంథం వివరిస్తుంది.
విజ్ఞప్తి
ఆస్తిక వరేణ్యులారా!
సకాల సంధ్యావందన క్రియ యందు మొదటి నుండియు నాకు గల భక్తి, ఆసక్తులు - నన్నీ గ్రంథము రచించుటకు బ్రోత్సహించినవి. ఈ గ్రంథము రచించి చాలా కాలమయినది. కాని దాని ముద్రణ విషయమున నే నౌదాసీన్యముగా నుండి నందున యీగ్రంథము ఇంతవరకు బహిర్గతముకాక యుండినది. నా రచనలలో ఇంకనూ రెండు, మూడు గ్రంథములు అటులనే యున్నవి.
నేటికీ గ్రంథ ముద్రణ కనువగు ప్రేరణము నొసంగి - తత్కార్యము సిద్ధింప జేసినందులకు శ్రీ సూర్యమండలాంతర్వర్తి యగు బ్రహ్మ మూర్తికి నా శతసహస్ర నమోవాకములు.
ఇదియుగాక పండితవరేణ్యులు, ఆస్తికవర్యులు, కావ్యతీర్థ విద్వ విరాజితులు, నంద్యాల పురవాస్తవ్యులు అగు బ్రహ్మశ్రీ మద్దులపల్లి వేంకట సుబ్రమణ్యశాస్త్రులు వారును - కడప పుర వాస్తవ్యులు, కావ్య పురాణ తీర్థ, విద్వద్బిరుద విరాజితులు, బ్రహ్మశ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ గారును - యీ గ్రంథమును ముద్రణమున కనువగురీతి సమకూర్చి సహకరించిరి. వారికి కృతజ్ఞతాభివందనము లర్పించు చున్నాడను. మరియును -
శ్రీ శ్రీ శ్రీ పరమహంస - పరివ్రాజకాచార్యులు - కంచి కామకోటి పీఠాధిపతులు - ధర్మోపదేశార్థము జగద్గురు - లోకసంచారము చేయుచు - ప్రొద్దుటూరు పురమునకు విజయం చేసినారని విని - తద్దర్శనార్థము నేను ప్రొద్దుటూరునకు వెళ్ళితిని. వారిని దర్శించి ఈ గ్రంథమును వారికి నివేదించి వారి యనుమతిని, అభిప్రాయమును పొందవలయునను అభిలాషతో ఉండగా - వారి దర్శనముకై చేరిన జనసముదాయము అత్యధిక మైయుండుటచే రెండు, మూడు దినములు చూపెట్టియుండిననూ అపుడు నా కోరిక సిద్ధింపదయ్యెను.
నిరాశతో గ్రామమునకువెళ్ళి మరల గార్యాంతరముచే ప్రొద్దుటూరునకు వచ్చితిని. నా భాగ్యమున ఆ దినము శ్రీవారి యుపన్యాసమని తెలియుటచే నేను వారి యుపన్యాసామృతమును గోలుటకు శ్రీ కన్యకాపరమేశ్వరీ యాలయమున శోతలలో గూర్చొండి యుండగా శ్రీవారు తలవనితలంపుగా హస్త సంజ్ఞచే పిలచిరి. శ్రీవారి పాదకమల సాన్నిధ్యముచేరి నమస్కృతి యొనర్చితిని.
శ్రీవారు కుశలప్రశ్న మూలకముగా నా వృత్తాంతమును ప్రశ్నించిరి. అపుడు నాయీ గ్రంథ విషయాదికమును నివేదించితిని. శ్రీవారు ఈ గ్రంథ విషయమును పరిశీలించుటకు తమకు ఆంధ్రలిపి యందును, ఆంధ్రభాష యందును అంత పరిచయము లేని లోపముల తెలిపి తమ ఆస్థానమున నుండిన పండితవరేణ్యులగు మరియొక పరివ్రాజకుల నచటికి బిలపించి - నన్ను వారి యనుగ్రహమునకు బాతృలుగా జేసిరి.
మరుదినమున ఆ పండిత పరివ్రాజకులు నా గ్రంథము నంతయు సాదరముగా పఠించి - యుత్సాహముతో అచ్చటికి వారి ఆస్థాన పండితుల బిలిపించి వారికీ గ్రంథమునంతయు తమిళమున నివేదించిరి. పిదప వారిరువురు యీ గ్రంథమును శ్రీవారికి నివేదించిరి. వారి యనుగ్రహము పొందినపిదప శ్రీవారి సందేశమును, ఆశీర్వచనములను మీకు లేఖారూపమున పంపుదుమని నాకు సెలవిచ్చిరి. వారి యనుగ్రహముతో నేను గ్రామమునకు వెళ్ళితిని. మూడు, నాలుగు దినములలోనే వారి ఆశీర్వచన సందేశ పూర్వకమగు లేఖ నా కందినది. కండ్ల కద్దుకొని ధన్యుడనైతినని తలంచి గ్రంథ ముద్రణమునకు ప్రయత్నించితిని. శ్రీవారి సందేశపు లేఖ ఈ గ్రంథమున పొందుపరచి యున్నాను.
ఈ గ్రంథ ప్రకటనకు అనుమతి నిచ్చిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ మచ్చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారికిని -
శ్రీవారి శిష్యులును, భావిపీఠాధిపతులును అగు శ్రీ శ్రీ శ్రీమజ్జయేంద్ర సరస్వతీస్వాముల వారికిని -
తదాస్థానమునుండి గ్రంథము నామూలాగ్రము పరిశీలించి సదభిప్రాయము లొసంగిన పండిత వరేణ్యులకును నా కృతజ్ఞతా పూర్వక నమస్కృతులు,
నా యీ గ్రంథరచన మందుగల యల్పజ్ఞతను క్షమించి నన్ననుగ్రహింతురని కోరుచున్నాను.
__‘‘నిందతు నందతువా సన్న సూయు రనసూయు రత్రికిం తేన __
యత్సన్మాన సగమనాయై వేదంమమతు పాధేయమ్॥’’
ఉయ్యాలవాడ. ఇట్లు విన్నవించు
కోవెలకుంట్ల తా॥ కర్నూలు జిల్లా, పండిత వశంవదుడు,
ప్లవంగ భాద్రపద శుక్ల ప్రతిపత్తు. పాణ్యం లక్ష్మీ నరసింహయ్య.
శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య
శ్రీ కాంచీ కామకోటి పీఠాధిప జగద్గురు శ్రీ శంకరాచార్య
శ్రీ మఠసంస్థానమ్, కాంచీపురమ్
యాత్రాస్థానం: ప్రొద్దుటూరు తేది:30-1-66
బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహ మహోదయ!
ఉయ్యాలవాడ గ్రామం
కోవెలకుంట్ల తాలూకా, కర్నూలు జిల్లా.
నమాంసి - భూయాంసి -
తత్రభవతః సాక్షాత్ విజ్ఞాపనామ్ ఆనుసృత్య
శ్రీచరణైః భవదుపజ్ఞ సన్ధ్యావందన తత్త్వప్రదీ
పికార్థం అనుగ్రహీతం శ్రీముఖమనేన లేఖనేనసాకం
ప్రేషితం విద్యతే ఇతిని వేద్యతే॥
నమాంసి,
మ.వి.కృష్ణమూర్తి,
శ్రీమఠీయ నిర్వాహక.
శ్రీ
శ్రీ చంద్ర
మౌళీశ్వరాయనమః
శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీ మచ్ఛంకర భగవత్పాద ప్రతిష్ఠిత
శ్రీ కాంచీకామకోటి పీఠాధిప జగద్గురు
శ్రీ మచ్చంద్ర శేఖరేంద్ర సరస్వతీ శ్రీపాద దేశానుసారేణ
శ్రీ మజ్జయేంద్ర సరస్వతీ శ్రీ పాదైః
దత్త మండలీయ ఆహోబిల నరసింహక్షేత్రప్రాంతగః
ఉయ్యాలవాడమహాగ్రామ అభిజన బ్రహ్మశ్రీ పాణ్యం
లక్ష్మీ నరసింహయ్య విషయే క్రియతే నారాయణస్మ ృతిః
భవతావిరచితా సంన్ధ్యావందన తత్త్వప్రదీపికా,
శ్రీ మద్రామాయణ - స్కాంద - భాగవత - ఆది
పురాణ ప్రమాణమూలకేన ప్రయోజన విశేషాది
నిర్దేశేన, సన్ధ్యావందనస్యావశ్యకతాం ప్రతిపాదయంతీ
గాయత్రీ మహామంత్రార్థం శ్రీశంకర భగవత్పాద
విద్యారణ్య భాష్యవచన ప్రమాణపూర్వకం విశదయతి.
విశేషతస్తు - గాయత్రీ మహామంత్రా న్తర్గత వర్ణానాం
కటపయాదిరీత్యా సంఖ్యామాదాయ నిరూపితాః
అర్థవిశేషాః, భవన్మేధా పరిశ్రమవిశేషం విశదయన్తి.
ఏతత్‌గ్రంథావలంబనేన శిష్టవంశ ప్రసూతాః
సర్వేపిపునః స్వపూర్వజవత్ శిష్టాః భూత్వాయుః
‘‘ఋషయోదీర్ఘ సన్ధ్యత్వాత్ దీర్ఘమాయురవాప్నుః
ఇతిమను వచనానుసరేణ, దీర్ఘాయు రవాప్యసవితృ
మండలమధ్యస్థ భర్గానుగ్రహభాజనీ భూయాసు ఇత్యాశాస్మహే.
యాత్రాస్థానమ్:
ప్రొద్దుటూరు: కడప జిల్లా నారాయణస్మృతిః
పరాభవ మార్గశీర్షామావాస్యా
శ్రీ గాయత్య్రైనమః
సంన్ధ్యావన్దన తత్వప్రదీపిక
పండితాభిప్రాయము:
శ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ,
కావ్యపురాణతీర్థ విద్వాన్, కడప.
‘శ్రీ లలితా విలాసము’
ప్లవంగ భాద్రపద శుద్ధ విదియలు,
శకము: 1884.
విజ్ఞప్తి
ఆస్తిక వరేణ్యులారా, ధర్మైక తత్పరులారా!
విశ్వనిర్మాతయగు విధాత ప్రాణుల సృజించి, వానివానికిఁ దగిన కర్మాచరణము విధించియున్నాడు. సకల ప్రాణులలో మానవుల నుత్తములుగా నేర్పరచి యున్నాడు. భగవానుడు విధించిన ధర్మములను ఆచరించుట ప్రతి మానవుని విధియైయున్నది. మనము భగవ దధీనులము.. ‘‘ధర్మోరక్షతి రక్షితః’’ అను మంత్రమును నిశ్చలముగ మననము చేసుకొని ధర్మానుష్ఠాన తత్పరులైయుండుట మనుష్య విధి-
__ధర్మంబుఁ జెఱుపఁ జెఱచును __
__ధర్మము రక్షించువారి దారక్షించున్ __
__ధర్మంబుఁ జెడకయుండను __
నిర్మలమతి నడపవలయు నిశ్చలనియతిన్? (భారతము)
ఇట్టి నిర్మలములైన ధర్మప్రతిష్ఠా వాక్యములను మనస్సునందు నిశ్చలముగా నిలుపుకొని - శ్రీ పండితోత్తములు, స్వధర్మ నిష్ఠాపరులు బ్రహ్మశ్రీయుతులు పాణ్యం లక్ష్మీ నరసయ్య గారు ధర్మోపదేశముల నెన్నియేని లోకోపకారార్థమై యుపన్యనించుటయే గాక - గ్రంథ రూప మునఁ దెలుఁగు లోకమున వెలయించు చుండుట యంద ఱెఱింగిన యదియే. ప్రకృత గ్రంథమగు సంధ్యావందన తత్త్వప్రదీపికను రచించుటలోఁ బైన దెలుపబడిన భావములు ప్రకటితములగు చున్నవి. అన్ని వర్ణములవారును ఈ విషయము నెఱింగి - వారి వారి మతానుసారమున సంధ్యావందనము చేయుట తప్పనిసరిగాఁ దలంప వలయునని ఈ గ్రంథోద్దేశము. సంధ్య యను పదమునకును వందనము అను పదమును - గాయత్రియను గాయత్రీ మంత్రము నకును - తదనుష్ఠానమునకును గల ఫలములేగాక - సాంఖ్యతత్వ విధానమునఁ గావించిన సమన్వయము మిక్కిలి నుతింపఁదగినది. ఈ విషయమున వీరు చేసిన కృషి, యుదహరింపబడిన గ్రంథ సందర్భములు కొనియాడఁదగియున్నవి. ఒక్కొక్క విషయము నందును లక్ష్యలక్షణ సహితముగా నొనరింపఁబడిన విమర్శ యుక్తియుక్తముగఁ గలదు. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ఈ విషయమున సూచించిన భాగములను యెల్లవారును గ్రహించి - యాచరణలో నుంచుకొనఁ దగినవని ముమ్మాటికిఁ దెల్పఁగలను. ప్రతి వ్యక్తియు నీ గ్రంథము జదివి యందలి విషయము నాకలించుకొని - స్వధర్మ తత్పరులై ఇహపర సుఖంబులను బడయుదురు గాక. వేదమాత యగు గాయత్రీ ప్రసాదమునకుఁ బాతృలగుదురుగాక.
చతుర్వింశతి వర్ణాత్మికయు - చతుర్వింశతి తత్వాత్మికయు, శత సంఖ్యాత్మికయు నగు గాయత్రీదేవి యనంత ఫలదాయిని. యెల్లరకుఁ జతుర్విధ పురుషార్థములను ప్రసాదింపగలదు. రహస్యాది రహస్యములును అను ష్ఠేయములును నగు విషయములను వివరించిన శ్రీ పాణ్యం లక్ష్మీ నరసయ్య గారి కెల్లవారును కృతజ్ఞులయి యుండుటయే గాక వారి రచనలకుఁ బ్రోత్సాహము నొసఁగి లోక సేవ వారి వలనఁ గలుగు సుకృతమునందును బాల్గొనుదురుగాక. శ్రీ గాయత్రీ మహాదేవి త్రిమూర్త్యాత్మిక సకల విధములగు శుభ - సంపదల నొసగి - సర్వదా సర్వధా దీర్ఘాయుష్యాదులఁ బ్రసాదించు గాక. గ్రంథకర్త గారికిని వినయముగఁ దెలుపుచు - సెలవు వేఁడుచున్నాఁడ.
అభిప్రాయములు
శ్రీ సూరవరపు లక్ష్మీపతిశాస్త్రిగారు,
__తైత్తిరీయ సంధ్యా భాష్యకర్త, __
__గాయత్రీ పదారవింద సేవక __
‘‘ద్వారకాచార్య’’
__వెంకట సంపూర్ణసదనము, __
__గాయత్రీ నికేతనము, __
మైలవరము (పోస్టు)
కృష్ణామండలము-29-6-67.
1) పాణ్యమనగను నుపసంజ్ఞ పరగగలిగి
కరము లక్ష్మీనృసింహయ్య కవివరేణ్య
తా మొసంగిన గ్రంథముల్ తరుణముననె
నందుకొనియుంటి సంతోష మందితార్య॥
2) తాము పంపిన శ్రీరామ తత్త్వమేను
గూఢభావంబులెల్లనుఁ గూర్మితోడ
చదివి యాశ్చర్యమునుబొంది మదిని సతము
కబ్బమునునిట్టి దెచ్చట కనగ లేదు !!
3) సాంధ్యతత్వప్రదీపికన్ సాంతముగను
పఠనఁజేసితి నెంతయో పట్టుదలను
ముచ్చటల నూరుచుండెను మోద మొసగ
సచ్చిదానంద భావమున్ త్రచ్చిచూపె ॥
4) ఆఁట వెలఁదినిఁ బరికించి యబ్బురపడి
తేటగీతిని తిలకించి తేటపడితి
చంపకంబులన్ వీక్షించి చకితుడనయి
ఉత్పలంబుల గాంచంగ నుత్సహించి
తనివితీరంగఁ జదివితిఁ దత్వమఱయ
నహహ సర్వాంగ సుందరం బనగనోప్పె॥
5) భార్యయు, సుతులు, కూతుండ్రు భాగ్య మొప్ప
మంచియారోగ్యవంతులై మించియుండ
సుఖములనుబడసి మను మెప్డు సుముఖుడైన
శంకరుని కృపవలన నిశ్శంకతోడ॥
6) గ్రంథకర్తకు సంసార బంధముక్తి
ద్రవ్యదాతలు నిరతాన్నదాతకాచు
పుత్రపౌత్రులు, ధనమును, మిత్రసమితి,
గలుగునట్టులు గాయత్రి! గాచుగాత ॥