శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › ధర్మజ్యోతి — 11

ధర్మజ్యోతి — 11

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 16 / 37

7) ‘‘సంధ్యయన్విద్వ’’ గరుణించె సమతగలుగ

‘‘బ్రహ్మవిద్యయు’’ నలవడెబహుళముగను

చేరె ‘‘శ్రీవిద్య’’ నీ చెంత చిన్మయముగ

‘‘రామభక్తి’’యు నీకడ రాణయొప్పె

నాల్గు నద్వైతభావంబు నాగఁ బఱగు॥

8) నీదుజని సార్థకంబయ్యె నిక్కముగను

దేవతా సంధ్యయొసగును దివ్యశక్తి

భక్తిభావానమెలగెడి భవ్యమూర్తి

చరమజన్మంబె నీకిది సాధుచరిత!

సూరవరపు లక్ష్మీపతి సూరివరుని

సూక్తి నిజమంచుదెలుపుదు సుజనమాన్య॥

9) శ్రేష్ఠ! ప్లవంగవత్సర జ్యేష్ఠ కృష్ణ

సప్తమీ గురువారాన క్లుప్తముగను

అంచితంబుగ నభిమత మెంచికూర్చి

పంపుచుంటిని కవికిని నింపుమీఱ?

శుభం భూయాత్‌.

శ్రీ గాయత్య్రై నమః ॥

శ్రీ గణేశాయనమః॥

సంధ్యావందన తత్త్వప్రదీపిక

శ్లో॥ ముక్తా విద్రుమ హేమనీలధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణై

ర్యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్‌

గాయత్రీం వరదా-భయాంకుశకశాః శుభ్రం కపాలంగదాం

శంఖం చక్ర మథారవిందయుగళం హస్తెర్వహంతీం భజే॥

శ్రీ లక్షణ లక్ష్యభూతమై యొప్పు భారతదేశమున ధర్మజ్యోతియై వెలయుచున్న సంధ్యావిధిని, తన్మూలమగు గాయత్రీ తత్త్వమును సమీక్షించుట యిపుడత్యంతావశ్యకము; ఏలయనఁ తత్త్వవేత్తలగు మహర్షులచే పరమప్రమాణముగ పూజింపబడుచున్న వేదములో ‘‘అహరహ స్సంధ్యాముపాసీత’’ (ప్రతి దినము సంధ్యనుపాసింపుము) అని శాసించుచున్నది. దయావతియగు శ్రుతిమాత ప్రజలకు నొక కర్మ నిట్లు విధించిన దన, తత్కర్మయం దేదియో మానవు లెఱుంగఁ జాలని మహత్తర లాభ ముండియే తీఱవలయును. ‘‘శ్రు॥ మాతృ పితృభ్యోహి వత్సలతరో వేదః’’ తల్లిదండ్రులకంటెను అధిక వాత్సల్యము గలది వేదముయని తాత్పర్యము. ఏల యన: మానవులకు గోచరము గాని సుఖాస్పదములగు సత్యధర్మములను బోధించి, మహత్తర సుఖ లాభములఁ జేకూర్చుచుండుట చేతనేగదా వేదమునకంతటి పరమ ప్రమాణ పూజ్యపదవి సిద్ధించియున్నది. వేదము నందటి విశ్వాసము గలిగియుండుట చేతనే వేదోక్త కర్మలయందు లాభ నష్టముల మీమాంస నేమియు చేయక లోకము యధోక్తముగ నాచరించుచు వచ్చినది.

కలికాలమగుటచే నేడట్టి విశ్వాసము లోపించినది. వేద వాక్యములను సైతము శంకించు దుస్థితి దాపరించినది. వేదోక్త నిత్యకర్మానుష్ఠానములలో నతి ముఖ్యమైనది సంధ్యావందనము. తత్కర్మచే మానవుల కెట్టి లాభము చేకూరగలదో పరిశీలింతము, ‘‘శ్రు॥ యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోరునిషదా తదేవ వీర్య వత్తరంభవతి’’ అనగ ఏ కర్మయైనను దాని యర్థము నెఱింగి శ్రద్ధయు సమాహితబుద్ధియుఁగలగి చేసినచో ఆకర్మ ఫలకారి యగును అని తాత్పర్యము. భారతీయార్ష విజ్ఞానమునకంతయు శ్రీ గాయత్రియే మూలబీజము, ప్రపంచమహాసౌధమున కదియే పునాదిరాయి. గాయత్రి యనఁగ సూర్యమండలమునుండి యనంతకోటి కిరణములతో దేదీప్యమానముగ వెలుఁగుచున్న తేజఃపుంజమే. ఆదియే సర్వ జగన్మూలమైనది. సర్వలోక శరణ్యమైనది.

అది లింగ, విభక్తి, నామ, రూప, క్రియలులేని యనిర్వాచ్యా- ద్వితీయ తత్త్వమేయైనను వ్యవహారసిద్ధికై వేదములద్దానిని గాయత్రి యనియు, ఆత్మ యనియు, పరబ్రహ్మ మనియుఁ బేర్కొనుచు అద్దానిమహిమ నుగ్గడిరచుచున్నవి.

శ్లో॥ చిన్మయ స్యా-ద్వితీయస్య నిష్కల స్యా-శరీరిణః।

ఉపాసకానాందార్ధ్యార్థం బ్రహ్మణో రూపకల్పనమ్‌॥

అనగా: పరబ్రహ్మ చిన్మయుడు; ఆద్వితీయుడు; నిష్క లుడు; ఆశరీరుడేయైనను ఉపాసకులకు మనోదార్డ ్య మేర్పడుట కై రూపాదులు కల్పింపబడినవి అని తాత్పర్యము.

అఖండా-ద్వితీయ పరబ్రహ్మతేజముయొక్క ఒకయంశమే మనకగుపడుచున్న సూర్యభగవానుడు. ఈ బ్రహ్మాండమున కంతయు నతడే సర్వేశ్వరుడు. ‘‘శ్రు॥ సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ’’ చరా-చరాత్మకముగ నుండు విశ్వమునకంతయు సూర్యుడు ఆత్మగ యున్నాడని తాత్పర్యము.

శ్లో॥ విష్టభ్యాహమిదంకృత్స్న మేకాంశేన స్థితోజగత్‌’’ (భగవద్గీత.)

నేనీ విశ్వమునంతయు నొక యంశచే నరికట్టి యావరించి యున్నానని భావము. ‘‘జ్యోతిషాం రవి రంశుమాన్‌’’-గీత. జ్యోతిస్సులలో బ్రకాశించు సూర్యుడను నేను. ఈ బ్రహ్మాండ మునం దంతటను అద్వితీయమై యఖండముగ వెలుగుచుండిన యెండ యింటియందు గవాక్షమునుండి ఖండరూపముగ యింటిలో ప్రసరించి, యింటినంతయు నెటుల బ్రకాశింపఁజేయుచున్నదో, అఖండా-ద్వితీయమగు బ్రహ్మతేజము ఖండరూపముగనున్న సూర్యమండలమను గవాక్షమునుండి యీ బ్రహ్మాండమను యిల్లు నంతయు బ్రకాశింపఁ జేయుచున్నది. ఇట్టి బ్రహ్మాండము అనేకములుగలవు. అన్ని బ్రహ్మాండముల యందును ఒకటే బ్రహ్మతేజము వెలుగుచున్నది. ఆ తేజోమయమగు పరతత్త్వము, నామక్రియలు లేనిదేయైనను మానవులయొక్క చర్మ ఛక్షుస్సుల కది భిన్నభిన్న నామరూపక్రియలు కలదిగ గోచరించు చున్నది.

శ్లో॥ మయాతత మిదం సర్వం జగ దవ్యక్త మూర్తినా।

మత్థ్సాని సర్వభూతాని నచాహమ్‌ తేష్వవస్థితః॥ (గీ. 8-4)

ఈ విశ్వము అవ్యక్త స్వరూపుడనగు నాచే వ్యాపింపఁ బడినది. సర్వభూతములు నాయందున్నవి. వానియందు నేను లేను అని భావము.

శ్లో॥ అవిభక్తం చ భూతేషు విభక్త మివచ స్థితమ్‌ । (గీ. 13-16)

భూతములయంద విభక్తముగ నుండు నేను విభక్తునివలె గనఁబడు చున్నానని తాత్పర్యము.

భగవత్తత్త్వ మొక్కటియేయైనను వ్యక్తావ్యక్తరూపములతో రెండు విధములుగ నుండుటచేతనే భగవత్సిద్ధిని సంపాదించెడి నిష్ఠలు సైతము రెండు విధములుగఁ జెప్పబడినవి.

శ్లో॥ లోకే-స్మిన్‌ ద్వివిధా నిష్ఠాఃపురాప్రోక్తా మయా-నఘ

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌॥ (గీ.3-3)

అనఁగా లోకమున కనుష్ఠింపవలసిన నిష్ఠలు రెండు విధములుగఁ జెప్పఁబడినవి. సాంఖ్యలకు జ్ఞాననిష్ఠయు, యోగులకు కర్మనిష్ఠయు విధింపఁబడినవి. ఈ రెండు విధానములలో జ్ఞాన మవ్యక్తము. కావున నందించుకంతయు వ్యవహారముండంజాలదు. ఆనిష్ట మిక్కిలి కష్టతరమైనది. అది అనేక జన్మలలో చేసిన పుణ్యకర్మల విశేషమున భగవదనుగ్రహమును సంపాదించుకొన్నవారికే సాధ్యము.

శ్లో॥ క్లేశో-ధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్‌

అవ్యక్తా హి గతి ర్దుఃఖం దేహవద్భి రవాప్యతే॥ (గీ. 12-5)

అనఁగా ఆ వ్యక్తము నుపాసించుట మిక్కిలి కష్టతరము. దేహాభిమానుల కామార్గము దుఃఖప్రదము. కావున దుస్సాధ్యము.

అవ్యక్త రూపమగు జ్ఞాననిష్ఠ కష్టతరమైనదనుటచే మానవులకు విధింపఁబడిన తక్కిన కర్మనిష్ఠయే సులభము, సుఖప్రదము అని చెప్పినటులయ్యెను. కావున మానవకోటి తరించుట కభివ్యక్త నామరూపాత్మక భగవదుపాసనరూపమగు కర్మనిష్ఠయే సర్వజన గ్రాహ్యమగు సులభ రాజమార్గము. కర్మనిష్ఠచే జ్ఞానసిద్ధియు తద్వారా మోక్షము సిద్ధించును.

శ్లో॥ నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే

తత్స్వయం యోగసంసిద్ధః కాలేనా-త్మని విందతి॥(గీ.4-38)

అనఁగా జ్ఞానముతోసమానమగు పవిత్రమగు ఉపాయము ఆ జ్ఞానము బహుకాలము చేయఁబడిన కర్మ నిష్ఠచే సంప్రాప్తించును. కనుకనే దయావతియగు శ్రుతిమాత మానవులకు మిక్కిలి సులభమగు కర్మపద్ధతిని బోధించినది.

ఈ బ్రహ్మాండమున విరాజిల్లుచున్న జ్యోతిర్మయ దివ్య మూర్తులలో సర్వాధికతేజస్సంపన్నుఁడు శ్రీ సూర్యభగవానుఁ డొక్కడే. ఈలోకమున కతఁడే సర్వేశ్వరుఁడు. జీవకోటులన్నియు నా భగవానుని బ్రహ్మ లోకమును జేరవలయును. సూర్యానుగ్రహ మూలముననే సర్వా భీష్టముల నొందవలసియున్నది. ఆ దివ్య మూర్తి సంకల్పానుసారమే యీ లోకమున సర్వప్రకృతియు నడచి తీఱవలయును, మనుష్యేతర ప్రాణికోటి యేమియు స్వతంత్రింపక యటులనే నడచుచుండును. మానవకోటి మాత్రము తన కేదియో స్వాతంత్య్రముగల దనెడి మోహాభినివేశముచే నటుల నడువక స్వేచ్ఛతో నడచుట కుంకించు చుండును. కాని భగవత్సంకల్పముతో మానవసంకల్ప మేకీభవించి నపుడు మాత్రమే మానవుని కానందము సిద్ధించును. భిన్నమైనపుడు దుఃఖము గలుగుచుండును. శ్రీ గాయత్రీ మహామంత్రములలోఁగల భావము భగవత్సంకల్పమునకు భిన్నముగ నుండని బుద్ధిని ప్రసాదింపు మని ప్రార్థించుటయేగదా. సర్వమునకు సూర్యమండలాంతర్గత బ్రహ్మతేజమేగదా మూలకారణము. అదియే గాయత్రీ నామమున బిలువబడుచున్నది. సర్వమానవులద్దానినే యుపాసింపవలయును.

శ్లో॥ గాయత్రీం తు పరిత్యజ్య యో-న్యమంత్ర ముపాసతే

సిద్ధాన్నం తు పరిత్యజ్య భిక్షా మటతి దుర్మతిః॥

అనఁగా ఎవ్వఁడు గాయత్రి నుపాసింపక యితర మంత్రముల నుపాసించునో వాఁడు సర్వసంసిద్ధముగనుండిన పవిత్రాన్నమును విడిచి భిక్షాన్నమునకుఁ దిరుగుచున్నవాడేయగునని చెప్పఁబడినది. గాయత్రి నుపాసింపక మఱియెట్టి జప తపో యజ్ఞ దానవ్రతాది పుణ్యకర్మలు చేసినను అవియన్నియు నిష్ఫలములగుటయే గాక మఱియుఁ బాప మాపాదించుననికూడఁ చెప్పఁబడుచున్నది.

శ్లో॥ యో-న్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్త మ

విహాయ సంధ్యాప్రణతిం స యాతి నరకాయుతమ్‌॥

అనఁగా ఎవ్వఁడు సంధ్యావందనముఁజేయక యితర పుణ్య కర్మలు చేయుటకుఁ బ్రయత్నించునో వాఁడనంత నరకముల నందునని తాత్పర్యము. అంతటి మహత్తర శక్తి సంధ్యావందన మందుంటంబట్టియే పరమప్రమాణమగు వేదము మానవులను ‘‘అహరహ స్సంధ్యా ముపాసీత’’ అని శాసించుచున్నది. ఆ వేద వాక్యమునఁగల‘‘ఉపాసీత’’ అను ధాతువు విధి లిఙ్‌రూపమున నున్నది. దాని తాత్పర్యమేమన, ప్రతిదినము సంధ్యావందనము చేసియే తీఱవలయును అను నర్థము నిచ్చుచున్నది. కావున మానవుల కది విడువరాని పరమవిధియై యున్నది. దాని నెవ్వఁ డుల్లంఘించునో వాఁడిహపర సుఖములకు రెంటికినిఁ జెడినవాఁడే యగునని యిట్లు చెప్పఁబడినది.

శ్లో॥ య శ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః

న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిమ్‌॥(గీ.16-23)

ఎవ్వఁడు శాస్త్రవిధి నుల్లంఘించి స్వేచ్ఛగ వర్తించునో వానికిహ పర సుఖములుండవని భావము, లోకములో నేదియేని యొక్క కర్తవ్యమును నిశ్చయించు విషయమున పరీక్షావిధి యిట్లు గలదు.

‘‘శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం చాత్మనిశ్చయమ్‌’’ అని శాస్త్రములోఁ జెప్పఁబడియుండవలె. గురువు చెప్పవలె. అద్దానిని తాను తన యనుభవములోఁ జూచుకొనవలె. అన్నిటికి వేదమే ప్రమాణమని జగద్గురువులగు శ్రీ మచ్ఛంకర భగవత్పా దులవారు తాము కర్మబంధ మేమాత్రములేని జ్ఞానస్వరూపులయ్యును లోకము నిట్లాదేశించియున్నారు.

‘‘వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం’’ అని. అనఁగా నిత్యము వేదమును చదువుము, వేదము విధించిన కర్మను లెస్సగ నాచరింపుము.

సంధ్యావందనకర్మకు శాస్త్రోక్తియు గురువాక్యము లభించి యున్నను జనబాహుళ్యమున కాత్మనిశ్చయ మేలనో చేకూరకున్నది. తన్మాహాత్మ్య మెఱింగినవాఁ డెవ్వఁడు దానిని పరిత్యజింపఁడు. కావున శ్రీ గాయత్రీ మంత్రమహిమను వివేచించి చూతము.

శ్రీ గాయత్రీ మహామంత్రము ఋగ్వేదమున తృతీయ మండలము నందును యజుర్వేదమున సంహిత చతుర్ధకాండము నను పది పదములతో నిరువదినాలు గక్షరములు గలిగియున్నది.

మంత్రము:

‘‘తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌॥’’

పదవిభాగము:

తత్‌, సవితుః, వరేణ్యం, భర్గః, దేవస్య, ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్‌॥

ఏ తేజస్సు మాబుద్ధులను (లేక) మా కర్మలను ప్రేరణము చేయుచున్నదో వెలుగుచున్న సవితృమూర్తి యొక్క శ్రేష్ఠమగు ఆ తేజమును ధ్యానింతుము అని యర్థము.

అద్వితీయమైయుండు ఏ పరమేశ్వర తేజము నానావిధ నామరూపములుగఁ దానే విలసిల్లుచు సంకల్పరూపమున నా భూతములను తానే నడుపుచున్నదో యా దివ్యతేజమును ధ్యానింతుము అని భావము.

ఋక్‌ సంహిత సాయణ భాష్యము:

భాష్యము: య స్సవితా దేవః నః అస్మాకం ధియః కర్మాణి ధర్మాదివిషయా వా బుద్ధీః ప్రచోదయాత్‌ ప్రేరయేత్‌ తత్‌ తస్య సర్వాసు శ్రుతిషు ప్రసిద్ధస్య దేవస్య ద్యోతమానస్య సవితుః సర్వాంతర్యా మితయా ప్రేరకస్య జగత్స్రష్టుః పరమేశ్వరస్య ఆత్మభూతం వరేణ్యం సర్వై రుపాస్యతయా జ్ఞేయతయా చ సంభజనీయం ధరః ఆవిద్యా తత్కార్యయో ర్భర్జనా ద్భర్గః స్వయంజ్యోతిః పరబ్రహ్మాత్మకంతేజః ధీమహి ధ్యాయేమ తద్యోహం సోసౌ యోసౌ సోహ మితి ధ్యాయేమ.

అనఁగా: ఏ దేవుడు మాకర్మలను (లేక) మాబుద్ధులను ప్రేరేపించు చున్నాఁడో సర్వవేద ప్రసిద్ధుఁడును, ప్రకాశించు వాఁడును, సర్వాంత ర్యామియై ప్రేరేపించు వాడును, జగత్స్రష్ట యగు పరమేశ్వరునకు ఆత్మభూతమగునదియు సర్వోపాస్య మగుటచేతను సర్వజన జ్ఞేయమగుట చేతను భజింపఁదగినదియు అజ్ఞానమును పోఁగొట్టు నదియు స్వయం జ్యోతియగు పరబ్రహ్మాత్మక తేజమును ఆ తేజమునే నేను; నేను ఆ తేజమునే అను భావముతో ధ్యానింతుముగాక.

భాష్యము: యద్వా తదితి భర్గోవిశేషణం, సవితుర్దేవస్య తత్తాదృశం భర్గః ధీమహి.

అనఁగా: తచ్ఛబ్దము భర్గః అను శబ్దమునకు విశేషణము. సవితృ దేవుని యొక్క ఆ తేజస్సును ధ్యానింతుము.

భాష్యము: యద్వా య స్సవితా సూర్యః ధియః కర్మాణి ప్రచోదయాత్‌ ప్రేరయతి తస్య సవితుః సర్వస్య ప్రసవితుః దేవస్య ద్యోతమానస్య సూర్యస్య తత్‌ సర్వైః దృశ్యమానతయా ప్రసిద్ధం వరేణ్యం సర్వైస్సం భజనీయం భర్గః పాపానాంతాపకం తేజోమండలం ధీమహి ధ్యేయతయా మనసా ధారయేమ.

అనఁగా: ఏ సూర్యుఁడు మా కర్మలను ప్రేరేపించు చున్నాఁడో స్రష్టయగు ఆసూర్యునియొక్క సర్వజన దృశ్యమైన దగుటచే ప్రసిద్ధ మైనదియు, సర్వజనులచే భజింపఁదగినదియు, పాపములను దహింపఁజేసెడి తేజోమండలమును ధ్యానింతుము.

భాష్యము: యద్వా భర్గశ్శన అన్నమభిధీయతే య స్సవితా దేవః ధియః ప్రచోదయతి తస్యప్రసాదాత్‌ భర్గోన్నాది. లక్షణం ఫలం ధీమహి ధారయామః తస్య ఆధారభూతాభవేమ ఇత్యర్థః. భర్గశ్శబ్దస్య అన్నపరత్వే ధీశబ్దస్య కర్మపరత్వే అధర్వణం శ్రుతిః. వేదాశ్ఛందాంసి సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య కవయో-న్నమాహుః కర్మాణిధియస్తదుతే ప్రబ్రవీమి ప్రచోదయన్‌ సవితా యాభి రేతి.

అనఁగా: భర్గశ్శబ్దమునకు అన్నమని యర్థము. ధీశబ్దమునకు కర్మయని యర్థము. ఏ సూర్యుఁడు కర్మలను ప్రేరేపించు చున్నాఁడో ఆ సూర్యుని అనుగ్రహముచే అన్నాదిఫలమును పొందుచున్నాము. భర్గోధీశబ్దములకు పై యర్థములు ఆధర్వణ వేదమంత్రమునఁ జెప్పబడినవి.

శంకర భాష్యమ్‌ :

భాష్యము: అధ సర్వదేవాత్మనః సర్వశక్తేః సర్వావభా సతేజోమయస్య పరమాత్మనః ద్యోతనార్థం సర్వాత్మకత్వ ప్రతి పాదక గాయత్రీ మంత్రస్యోపాసనప్రకారః ప్రకాశ్యతే.

అనఁగా: సర్వదేవతాత్మకము సర్వశక్తి సంపన్నము సర్వ ప్రకాశకము తేజోమయమగు పరమాత్మతత్త్వము నెఱుంగుటకు సర్వాత్మక బ్రహ్మ తత్త్వమును గాయత్రీమంత్రము నుపాసించెడి విధము తెలుపఁబడు చున్నది-

భాష్యము: తత్రగాయత్రీం ప్రణవాదిసప్త వ్యాహృత్యు పేతాం శిరస్సమేతాం సర్వవేదసార మితి వదంతి. ఏవం విశిష్టా గాయత్రీ ప్రాణాయామైరుపాస్యా సప్రణవవ్యాహృత్యుపేతా ప్రణ వాంతా గాయత్రీజపాదిభి రుపాస్యా తత్ర శుద్ద గాయత్రీ ప్రత్యగ్బ్రహ్మైక్య బోధికా.

అనఁగా: ఆ మంత్రము ఆదిలో ఓం అనెడు ప్రణవాక్షరములతోఁ గూడ భూః భువః సువః మహః జనః తపః సత్యం అనెడు సప్తవ్యాహృతులతోడను ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ అనెడు గాయత్రీ శిరముతోడను కూడియున్నది గాన, గాయత్రీ మహామంత్రము సర్వవేదసారమని తత్త్వవేత్తలు వచింతురు. ఈ విధముగఁ జెప్పబడిన గాయత్రిని ప్రాణాయామాదులచే నుపాసించవలయును. ఆదియందు ఓం అను ప్రణవాక్షరమునుజేర్చి పిదప భూః భువః సువః అనెడు మూడు వ్యాహృతులతో అంతమందు ఓం అను ప్రణవాక్షరము గలిగియున్న గాయత్రీ మహామంత్రమును జపాదులచేత నుపాసించ వలయును. శుద్దమగు గాయత్రీ మహామంత్రము ప్రత్యగాత్మ బ్రహ్మైక్యమును బోధించుచున్నది.

భాష్యము: తస్య ప్రచోదయా చ్చబ నిర్దిష్టస్య ఆత్మనః స్వరూపభూతం పరంబ్రహ్మ తత్సవితురిత్యాది పదైర్నిర్దిశ్యతే ఓం తత్స దితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్స్మృతః ఇతి గీతా.

అనఁగా: తత్సవితుః అని మొదలగు పదములచేత ప్రచోదయాత్‌ అను పదముచే నిర్దేశింపఁబడిన స్వరూపభూతమగు పరమాత్మ సూచింపఁబడుచున్నది.

‘‘ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్స్మృతః’’ అని గీతావాక్యము.

భాష్యము: తచ్ఛబ్దేన ప్రత్యగ్భూతం స్వతస్సిద్ధం పరం బ్రహ్మోచ్యతే.

అనఁగా: తత్‌ అనుపదముచే ప్రత్యగ్భూతము స్వతస్సిద్ధ మునగు పరంబ్రహ్మ చెప్పఁబడుచున్నది.

భాష్యము: సవితు రితి సృష్టి స్థితిలయ లక్షణ కస్య సర్వ ప్రపంచస్య సమస్త ద్వైతవిభ్రమ స్వాధిష్ఠానం లక్ష్యతే.

అనఁగా: సవితుః అనియనుటచే సృష్టి స్థితి లయ లక్షణము గల సర్వ ప్రపంచమునకును సర్వద్వైత భ్రమకును ఆధిష్ఠానమగు పరమాత్మ సూచింపఁబడినది.

భాష్యము: వరేణ్య మితి సర్వజన వరణీమమ్‌.

అనఁగా: వరేణ్య మను పదముచే సర్వజనవరణీయమగు నిరతిశయానందము తెల్పఁబడినది.

భాష్యము: భర్గ ఇతి అవిద్యాది దోషభర్జనాత్మక జ్ఞానైక విషయత్వమ్‌.

అనఁగా: భర్గః అను పదముచే అజ్ఞానాది దోషపరిహారకమగు జ్ఞానము తెలుపఁబడుచున్నది.

భాష్యము: దేవస్యేతి సర్వద్యోతనాత్మకాఖండచిదేకర సః

అనఁగా: దేవస్య అనుటచే సర్వచైతన్య ద్యోతనాత్మకమగు చిదేకరసము వర్ణింపఁబడినది.

భాష్యము: సవితు ర్దేవన్యేత్ర షష్ఠ్యర్థో రాహోశ్శిరోవ దౌపచారికః

అనఁగా: సవితు ర్దేవస్య అనుపదముల షష్ఠీవిభక్త్యర్థము రాహువు యొక్క శిరము అనునటుల ఔపచారికము.

భాష్యము: బుద్ధ్యాది సర్వదృశ్య సాక్షీలక్షణం యన్మే స్వరూపభూతం పరమానందం నిరస్త సమస్తా నర్థరూప స్వప్రకాశ చిదాత్మకం బ్రహ్మేత్యేవం ధీమహి ధ్యాయేమ.

అనఁగా: మొదలుగాఁగల సర్వదృశ్యమునకుసాక్షియై ఏతత్త్వము నాస్వరూపమై యున్నదో అదియే సర్వ ప్రపంచమునకు అధిష్ఠానభూతము పరమానందము సర్వానర్థవిరహితము స్వప్రకాశకము చిదాత్మకమునగు పరబ్రహ్మమని ధ్యానింతుము గాక.

భాష్యము: ఏవంసతి సహ బ్రహ్మణా స్వవివర్త జడ ప్రపంచేన రజ్జుసర్పన్యాయే నాపవాద సామానాధి కరణ్యరూప మేకత్వం సోయ మితి న్యాయేన సర్వసాక్షి ప్రత్యగాత్మనో బ్రాహ్మణా సహ తాదాత్మ్యరూపమేకత్వం భవతీతి సర్వాత్మక బ్రహ్మబోధకో-యం గాయత్రీమంత్ర స్సంపద్యతే.

అనఁగా: ఇట్లు ధ్యానించుటచే పరబ్రహ్మతోఁజేరి స్వవివర్తమై యున్న జడప్రపంచముచే రజ్జుసర్ప న్యాయమున అపవాద సామానాధికరణ్యమగు ఏకత్వము వాఁడే వీఁడు అనునటుల సర్వ సాక్షియగు ప్రత్యగాత్మతో తాదాత్మ్యరూపమగు ఏకత్వము సిద్ధించును అని సర్వమునకు ఆత్మయైయున్న పరతత్వమును బోధించుటకు శ్రీ గాయత్రీ మహామంత్రము అన్ని విధముల నొప్పియున్నది.

భాష్యము: సప్తవ్యాహృతీనా మయ మర్థః భూరితి 1 సన్మాత్ర ముచ్యతే.

అనఁగా: 1 సప్తవ్యాహృతుల కర్థమిది భూః అనుటచే సన్మాత్రము చెప్పఁబడినది.

భాష్యము: 2 భువ ఇతి భావయతి ప్రకాశయతీతి వ్యుత్పత్త్యా చిద్రూప ముచ్యతే.

అనఁగా: 2 భువః అనగ సర్వం భావయతి ప్రకాశయతి యనెడు వ్యుత్పత్తిచే చిద్రూపము తెల్పఁబడినది.

భాష్యము: 3 సువ రితి సు వ్రియత ఇతి వ్యుత్పత్త్యా నుష్ఠు సర్వేంద్రియమాణ సుఖస్వరూపముచ్యతే.

అనఁగా: 3 సువః అనఁగ ‘‘సువ్రియతే’’అనువ్యుత్పత్తిచే సర్వేంద్రియ వరణీయమగు సుఖస్వరూపము చెప్పఁబడినది.

భాష్యము: 4 మహ ఇతి మహీయతే పూజ్యత ఇతి వ్యుత్పత్త్యా సర్వాతిశయత్వ ముచ్యతే.

అనఁగా: 4 మహః అనఁగ మహీయతే పూజ్యత అను వ్యుత్పత్తి చే సర్వాతిశయత్వము వదింపఁబడినది.

భాష్యము: 5 జన ఇతి జనయతీతిజనః సకలకారణముద్యతే.

అనఁగా: 5 జనః అనఁగ జనయతి వ్యుత్పత్తిచే సకల కారణము వచింపఁబడినది.

భాష్యము: 6 ఒతప ఇతి సర్వతే రూపత్వం.

అనఁగా: 6 తపః అనఁగ ‘‘తప్యతే’’ ఆనుటచే సర్వస్వరూపత్వము చెప్పఁబడినది.

భాష్యము: 7 సత్య మితి సర్వబాధా రహితం.

అనఁగా: 7 సత్యం అనఁగ ‘‘సర్వబాధారహిత’’ మని కీర్తింపఁ బడినది.

భాష్యము: ఏత దుక్తం భవతి యల్లోకే సద్రూపం త దోంకారవాచ్యం బ్రహ్మైవ ఆత్మనో-స్య సద్రూప సభావాదితి.

అనఁగా: ఏది లోకమున సద్రూపమో అది ఓంకారవాచ్యమగు పరబ్రహ్మమే. సచ్చి, ద్రూపములు పరమాత్మకు గలవు గనుక.

భాష్యము: అధ భూరాదయః సర్వలోకాః ఓం కారవాచ్య బ్రహ్మాత్మకాః న తద్వ్యతిరిక్తం కించి దస్తీతి.

అనఁగా: భూరాది సర్వలోకములును ఓంకార వాచ్యమగు పరబ్రహ్మాత్మకములు. పరబ్రహ్మ వ్యతిరిక్తమైన దేదియునులేదు గనుక.

భాష్యము: వ్యాహృతయోపి సర్వాత్మక బ్రాహ్మబోధికాః

అనఁగా: వ్యాహృతులు నైతము సర్వాత్మక పరబ్రహ్మను బోధించు వాక్యములే.

భాష్యము: గాయత్రీ శిరసోవ్యయమేవార్థః

అనఁగా: ‘‘ఓమాపోజ్యోతి’’ అను గాయత్రీ శిరోమంత్రమునకును ఇదియే అర్థము.

భాష్యము: అపః ఇత్యాప్నోతీతి వ్యుత్పత్త్యా వాపిత్వముచ్యతే

అనఁగా: ఆపః అనుటచే ‘‘ఆప్నోతీత్యాపః’’ అను వ్యుత్పత్తిచే సర్వవ్యాపిత్వము తెల్పఁబడినది.

భాష్యము: జ్యోతి రితి ప్రకాశరూపకత్వం.

అనఁగా: జ్యోతి అనుటచే సర్వప్రకాశకత్వము వచింపఁబడినది.

భాష్యము: రస ఇతి సర్వాతి శయత్వం.

అనఁగా: రసః అనుటచే సర్వాతిశయిత్వము తెలుపఁబడినది.

భాష్యము: అమృతమితి మరణాది సంసార నిర్ముక్తత్వం.

అనఁగా: అమృతమ్‌ అనుటచే మరణాది సంసార నిర్ముక్తత్వము తెలుపఁబడినది.

భాష్యము: సర్వవ్యాపి సర్వప్రకాశక సర్వోత్కృష్ట నిత్య ముక్త మాత్మరూపం సచ్చిదానందాత్మకం య దోంకార వాచ్యం బ్రహ్మ త దహ మస్మీతి గాయత్రీ మంత్ర స్వార్థః

(ఇతి శంకర భాష్యమ్‌)

అనఁగా: సర్వవ్యాపిత్వ సర్వప్రకాశకత్వ సర్వోత్కృష్ట నిత్యముక్తములు ఆత్మరూపములు ఆత్మ సచ్చిదానందాత్మకము. ఎయ్యది ఓంకార వాచ్యమగు పరబ్రహ్మమో ఆ స్వరూపము నేనైతిని అని గాయత్రీ మహామంత్రమునకు అర్థము.

(ఇట్లని శంకర భాష్యము.)

పరమప్రామాణికులును, బ్రహ్మర్షులు, నవతార పురుషులు నతీంద్రియ జ్ఞానసంపన్నులు, వేదాంతవిజ్ఞానధురీణులు, జగదారాధ్యపదవి నధిష్ఠించిన మహనీయులు, పూజ్యులునగు ఆచార్య పురుషుల భాష్యములను పరికించినచో శ్రీ గాయత్రీ మహా మంత్రము సర్వవేద సారము, సర్వజగన్మూలము, సర్వజన శరణ్యము, సర్వజనోపాస్యము, సర్వరక్షకము, సర్వాధారము అగు పరతత్వమని స్పష్టపడుచున్నది. శ్రీ గాయత్రీ మహామంత్రము నందుఁగల మహిమ నింతవఱకు మహనీయుల భాష్యరూపమగు శబ్ద విజ్ఞానముతో పరిశీలించితిమి. ఇక గాయత్రీ మహామంత్ర రహస్యమును సాంఖ్య విజ్ఞానముతో పరిశీలించి చూతము:

సాంఖ్యవివేకము :

భారతీయార్ష వేదశాస్త్ర వాఙ్మయమునఁగల నిజతత్త్వమును గ్రహించెడివిధానములు రెండువిధములు. మంత్రములయందున్న శబ్దములనుండి యందుఁగల యర్థతాత్పర్యములను గ్రహించు పద్ధతి ఒకటి. ఇది సామాన్యవిధి. ఇదే బహు ప్రచారములో నున్నది. ఇక విశేషవిధి ఆమంత్రాక్షరములకు శాస్త్రీయాక్షర సాంఖ్యసూత్రముతో చెప్పఁబడిన అంకముల (సంఖ్యల) ద్వారా అందుఁగల తత్త్వము నెఱుంగుట రెండవది. ఇది విశేషవిధి. ఈపద్ధతి యత్యంత నిగూఢ తాత్పర్యమును చక్కగ తెలియజేయునదిగానుండును. మొదటిది స్థూలరూపము; రెండవది సూక్ష్మ, రూపము. శబ్దములనుండి అర్థమును గ్రహించెడి సామాన్యవిధి. యంకప్పు డర్థ వైకల్యము కలిగినను గలుగవచ్చును, ఏల నన, దేవభాషయందొక శబ్దము అనేకార్థములను తెలుపునదియై యుండును. అందు సందర్భానుసారముగ నౌచిత్యమును గుర్తించి అర్థమును నిర్ణయింపవలయును. కావున నొకప్పుడు వికల్ప మేర్పడుటకవకాశముండును. రెండవ పద్ధతియగు అక్షర సాంఖ్యము నందు అనఁగ అక్షరాంకములనుండి యర్థము నెఱుంగు విధియందు వికల్ప మేర్పడుట కవకాశమేమియునుండదు. ఈ పద్ధతి నిస్సందిగ్ధముగ సత్యార్థమును దెలుపునదియైయుండును. అయినను గాయత్రీ మహామంత్ర మూలతత్త్వము నింతవఱకు ధీనిధులగు మహనీయులు శాబ్దిక విజ్ఞానముతో పరిశీలించిన భాష్యములే గనుపట్టు చుండటయు సాంఖ్యవిజ్ఞానముతో వివేచింపక నిలిపియుండుటయు కాగా అది నావంతున కేర్పడుట భగవదను గ్రహరూపమగు భాగ్యమే యన వలయును. గాయత్రీ మహా మంత్రము నిపుడక్షరసాంఖ్యముతో (సంఖ్యాశాస్త్రముతో) పరిశీ లింపవలయును. గాన ఆ సూత్రము దానియర్థము నెఱుఁగవలయును.

అక్షరసంఖ్యాసూత్రము :

కాదినవ టాదినవ పాదిపంచ యాద్యష్టా వితి సాంఖ్యసూత్రాణి అంకాః కటపయ వర్గోద్భూతైర్వర్ణైర్భవంతి యోగాంత్యై రితి॥

సూత్రార్థము: కాదినవ అనఁగా అక్షరములలో కవర్గము నుండి చెప్పఁబడిన తొమ్మిది యక్షరములకు ఒకటి మొదలు తొమ్మిది యంకములు సంజ్ఞలగును. టాదినవ అనఁగా టవర్గ మునుండి చెప్పఁబడిన తొమ్మిది యక్షరములకు ఒకటి మొదలు తొమ్మిది యంకములు సంజ్ఞలగును. పాదిపంచ అనఁగా పవర్గ మునుండి చెప్పఁబడిన అయిదు అక్షరములకు ఒకటి మొదలు అయిదు అంకములు సంజ్ఞలగును. యాద్యష్టౌ అనఁగా యకారమునుండి చెప్పఁబడిన ఎనిమిది యక్షరములకు ఒకటి మొదలు ఎనిమిది యంకములు సంజ్ఞలగును.

అక్షరాంక పథకము:

1

2

3

4

5

6

7

8

9

భారతీయార్ష శాస్త్రములన్నియు నీ సూత్రముచేతనే అంకములను తెలుపును. సర్వవేదసారమైయున్న గాయత్రీ మూల మంత్రమును పరిశీలించినచో గాయత్రి స్థూల దేహమగు నిరువది నాలుగక్షరములకు ఈ క్రిందఁజూపిన అంకములు వచ్చును.

6

7

4

6

4

2

1

4 3

త్స

వి

తు

ర్వ

రే

ణ్యం

భ ర్గో

8

4

1

9

5

8

9

1

దే

స్య

ధీ

హి

ధి

యో

1

0

2

6

8

1

యో

నః

ప్ర

చో

యాత్‌

గాయత్రీ మంత్రాక్షరముల కేర్పడియున్న అంకములన్ని టిని కూడినచో నూరు సంఖ్య వచ్చును.

భారతీయ సంఖ్యామానమందు దశ శత సహస్త్రాది సంఖ్య లన్నియును అనఁగా ఒకటవ అంకమునకు ప్రక్కన తక్కిన వన్నియును సున్నలుగల సంఖ్యలన్నమాట. పరిపూర్ణత్వమును దెలుపునవియై యున్నవి.

గాయత్రీ మంత్రాక్షరముల కేర్పడిన శతసంఖ్య వ్రాయునపుడు ముందు 1 అని ఒకయంకె పెట్టి తర్వాత రెండుసున్నలు పెట్టుడుము, అపుడు నూఱు (100) అగును.

ఇట్లు వ్రాసిన శతసంఖ్యయందు ముందుభాగమునగల ఒకటవ అంకె మనకు బోధించునది యేమనఁగ:

ఆద్యము అద్వితీయము సర్వాధారము సర్వజనకము సర్వ మూలములగు పరబ్రహ్మతత్త్వ మొక్కటియే యనియు తక్కిన దంతయు శూన్యమేయనియు ఈ యంకె తెలుపుచున్నది. ఈ యొకటవ యంకెకు ప్రక్క భాగమునఁగల రెండు శూన్య బిందువుల (సున్నల) తాత్పర్యమేమనఁగా, ఆద్యము సర్వమూలమగు పరమాత్మయొక్క సాన్నిధ్యము సాహచర్యము కలిగియున్నపుడు మాత్రమే గణ్యతగలిగి అదిలేకపోయినచో శూన్యములేయగునని, పరమేశ్వర పరాపర ప్రకృతులను రెంటిని నీరెండు శూన్య బిందువులు తెలుపుచున్నవి. పరాపరప్రకృతులు రెండిటిచేతనే సర్వలోక వ్యవహారము భాసిల్లుచున్నది. ఈ రెండు పరాపర ప్రకృతులకు భూతప్రపంచసృష్టియందు దేహజీవ సంజ్ఞలును శబ్దార్థ ప్రపంచమున శబ్దార్థ సంజ్ఞలు కలిగియున్నవి.