శ్లో॥ సదాశివస్య ద్వేరూపే పర మప్యపరం చ యత్
పర మర్థాత్మకం ప్రాహు శ్శబ్దాకార మధాపరమ్ ॥స్కాంద॥
అనఁగా పరమేశ్వరునికి పరము అపరము అను రెండు శక్తులు గలవు. అందు పరాప్రకృతి అర్థరూపముగలది. అపరా ప్రకృతి శబ్దరూపమైనది.
శ్లో॥ భూమి రాపోనిలో వాయుః ఖం మనో రేవ చ
అహంకార ఇతీయంమే భిన్నాప్రకృతి రష్టధా॥ (గీ. 7-4)
ఆపరేయ మిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్
జీవభూతాం మహాబాహోయయేదం ధార్యతేజగత్॥(గీ.7-5)
అనఁగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు బుద్ధి, అహంకారము ఇవి ఆపరాష్ట్రకృతి. ఈ యపరాష్ట్రకృతి యష్టవిధ తన్మాత్రల రూపముననున్నది. రెండవది పరాప్రకృతి. అది జీవరూపమున నున్నది. ఈ పరాప్రకృతిచేతనే అట్టి ప్రపంచము నిలిచియున్నది. ఈ విధములగు పరాపర ప్రకృతులతో విలసిల్లుచున్న అఖండా ద్వితీయ బ్రహ్మతత్త్వము శ్రీ గాయత్రీ మహామంత్రమందు సుప్రతిష్ఠితమైయున్నది. వేద మీతత్త్వమునే ‘‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ । బ్రహ్మ సత్యం జగన్మిథ్యా’’ అని బోధించుచున్నది.
శ్రీ గాయత్రీ మహామంత్ర స్థూలశరీరము చతుర్వింశత్యక్షర రూపమున చతుర్వింశతి తత్త్వములతో విరాజిల్లుచున్నది. మఱియు గాయత్రీ మహామంత్రము పది పదములుగ విభాగింపఁబడియున్నది. ఈపదముల దశసంఖ్యయు, పరిపూర్ణతను దెలుపుచున్నది. ఈ దశవిధ పదములలో మిక్కిలి ప్రధానమైనవి మూడుపదములుగలవు; అవియేవియన:- సవితుః-భర్గః-ధీమహిః అనునవి. ‘‘సవితుః’’ పరమాత్మ యొక్క (లేక) సూర్యునియొక్క ‘‘భర్గః’’ తేజస్సును ‘‘ధీమహి’’ ధ్యానింతుముగాక అని యర్థము.
ఇందులో ‘‘సవితుః’’అనుపదము శ్రీ గాయత్రీమహామంత్ర స్థూల దేహాంతర్గత సూక్ష్మదేహమైయున్నది. అది తేజోమయము సూక్ష్మ శరీరమును తైజస శరీరమందురు. దీనికి లింగళరీరమను నామాంతరముగూఁడ గలదు. లింగ మనఁగ గుర్తు. గాయత్రీ మహా మంత్రమందు ‘‘సవితుః’’అను నదియే లింగము. శాస్త్రముల యందు లింగ శరీర తత్త్వములు పదునేడు సంఖ్యగ లెక్కింపఁబడినవి.
శ్లో॥ పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితమ్
ఆపంచీకృత భూతోత్థం లింగాంగం భోగసాధనమ్॥ (పంచదశి)
శబ్దాది విషయములు 5, జ్ఞానేంద్రియములు 5, ప్రాణాదులు 5, మనోబుద్ధులు 2 ఇవిచేరి 17 తత్త్వము లగును.
గాయత్రీమంత్రమూర్తి యందు సూక్ష్మశరీరముగఁబేర్కోనఁబడిన ‘‘సవితుః’’అను శబ్దమునందుఁగల మూడక్షరములకు అక్షర సాంఖ్య సూత్రముతో పరిశీలించినచో ‘‘(స 7; వి 4; తు 6) ఇట్లు సంఖ్యలు వచ్చును. ఈ సంఖ్యలను కూడగ సూక్ష్మ శరీర తత్త్వసంఖ్య 17 వచ్చును. దీనిని అజపాగాయత్రీ యందురు. వ్యాసమహర్షి రచనలన్నియు బ్రహ్మ తత్వముతో చేరిన సూక్ష్మగాయత్రీ (అజపా) తత్వ సంఖ్యయగు, అష్టాదశ సంఖ్య 18 సంఖ్యతో శోభిల్లుచున్నది. ఎట్లనగ మహాపురాణములు 18; ఉపపురాణములు 18; భారత పర్వములు 18; భారతసైన్యములు 18; గీతాధ్యాయములు 18; యుద్ధదినములు 18; వ్యాసరచనలన్నియు, 18; సంఖ్యతో నొప్పుచున్నవి. ఇక శ్రీ గాయత్రీ మహామంత్రమందుగల (భర్గః) అను శబ్దము శ్రీ గాయత్రీ మంత్రదేవికి, కారణ శరీరమని తెలియవలెను. సర్వమునకు మూలకారణము పరమేశ్వర తేజమేగదా! ఆ తేజస్సును ధ్యానింతుమనియేగదా! గాయత్రీ మంత్రార్థము’’.
(భ4 ర్గ3) ఇట్లు సంఖ్యలు ఈ రెండు సంఖ్యలనుకూడినచో కారణదేహసంఖ్య వచ్చును. అనఁగా 7 అగును.
‘‘కర్మేంద్రియ ప్రాణాపానౌ కారణస్య’’ కర్మేంద్రియములు 5, ప్రాణాపానములు 2, చేరి 7.
సవితృమూర్తియగు శ్రీ సూర్యభగవానుఁడు సప్తవిధ కాంతులతో నొప్పు కారణ తత్త్వములతో దివస సప్తకముగల సర్వలోక పరిపాలన మొనరించుచున్నాఁడు. కారణరూపమగు సప్త సంఖ్యతో లోకము పరిపూర్ణతాసిద్ధి నందుచున్నది. మహా కారణ తత్త్వమగు సవితృమూర్తికి సప్తాశ్వుఁడు సప్తరజ్జువు అను నామములుగలవు. ‘‘దేవా ఆదిత్యో వై యేసప్త ‘‘(అరుణము) సప్తలోకములు, సప్తగ్రహములు, సప్తస్వరములు, సప్తవిభక్తులు, సప్తర్షులు, సప్తద్వీపములు, దేహమునఁగల సప్తచక్ర ములు మొదలగునవి యన్నియు పరిపూర్ణతకుఁ గారణములు.
ఇట్టి రహస్య విషయము లెన్నియో శ్రీ గాయత్రీ మహామంత్ర మందు గర్భితములై యుండుటను బట్టియే శ్రీ గాయత్రీ ధ్యానమందు ‘‘తత్త్వార్థవర్ణాత్మికాం’’అని కీర్తింపబడియున్నది. అనఁగా తత్త్వార్థములతోఁ గూడిన యక్షరములు కలిగినది అని యర్థము.
శ్రీ గాయత్రీ మంత్రమే యననేల? గాయత్రీ నామము సైతము అక్షర సాంఖ్య సూత్రముతో పరికించినచో తత్త్వార్థ బోధకమైయున్నది. శ్రీ గాయత్రీ నామమునకు శబ్దార్థమిట్లు చెప్పబడినది:
శ్లో॥ గాయంతంత్య్రాయతే యస్మా ద్గాయత్రీ త్యభిధీయతే
అనఁగా స్తుతించువారిని, జపించువారిని రక్షించునది అని యర్థము.
గాయత్రీ శబ్దమునగలఁ మూఁడక్షరములకు అక్షరసాంఖ్య సూత్రముతో గా3 య1 త్రీ2 ఇట్లు సంఖ్యలువచ్చును. ఈసంఖ్యలను కూడినచో 6వ సంఖ్య యగును. ఈ షట్సంఖ్య గాయత్రి షట్కుక్షులు గలది యని తెలుపుచున్నది. గాయత్రి షట్కుక్షులేవియన! నాలుగు దిక్కులు భూమి ఆకాశము ఇవిచేరి ఆరు అగును. అనఁగ ఈ కనఁబడుచున్న బ్రహ్మాండమంతయును గాయత్రియే యని భావము.
శ్రుతి॥ గాయత్రీ వా ఇదగ్‌ం సర్వమ్ ఈ కనఁబడుచున్న దంతయును గాయత్రియే యని యీశ్రుత్యర్థము.
శ్రీ గాయత్రి వేదమాతృక సర్వవిద్యాస్థాయిని అది. అవాజ్మానస గోచరతత్త్వము గాయత్రీ మంత్రము నందింక నెన్ని రహస్యార్థములు ఎన్ని మహిమలు గలవో యెవ్వ రెఱుంగుదురు? వేదతాత్పర్యము మహాదురవగాహమైనది.
శ్రీ గాయత్రీ మంత్రార్థభావము నిపుడు నే నక్షరసాంఖ్య సూత్రముతో వివేచించి చెప్పుట యనునది శాస్త్రీయ పద్ధతియే యగునా? లేక నాయూహా జనిత వైపరీత్యమేనా? అని విచారింప వలయును. ఏలయన?
శ్లో॥ ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్
బిభే త్యల్పశ్రుతా ద్వేదో మామయం ప్రతరిష్యతి॥ (బహ్మాండ పురాణము)
అనఁగా ఇతిహాసపురాణములచే వేదార్థము పరిపూర్తి యగును. వేదము ఇతిహాసపురాణములు తెలియని యల్పజ్ఞుని వలన వీఁడు నన్ను వంచించునని భయపడుచుండును. అని తెలిపియుండుటచే నా యీ భావము ఇతిహాస పురాణముల యందుండని యెడల తప్పిదమే యగును. కనుక విచారింతము.
ఇతిహాసములలో శ్రీ వాల్మీకి మహర్షికృత శ్రీమద్రామాయణ మత్యంత ప్రామాణ్యమై యొప్పుచున్నది. వేదప్రతిబింబమే శ్రీమద్రా మాణయము. గాయత్రీనామమున విలసిల్లు పరతత్త్వమే శ్రీరామమూర్తి. శ్రీరాముని వంశకర్త సూర్యభగవానుఁడు. సూర్య మండల తేజమే గాయత్రి. శ్రీరాముఁడు దశరథాత్మజుఁడు, గాయత్రి దశదిశావలయ శోభిత (లేక) గాయత్రీ మంత్రము దశసంఖ్యాపదవిలసితము, రామాయణము శతకోటి ప్రవిస్తరము, గాయత్రీమంత్రము శతకోటి ప్రవిస్తరము. శ్రీ గాయత్రీ మంత్రము, శ్రీ గాయత్రీనామము, ఎట్లు అక్షరసంఖ్యాసూత్ర తత్త్వగర్భితమైయున్నదో. శ్రీమద్రామాయణము రామ నామము సైతము అట్లే అక్షర సంఖ్యాసూత్ర గర్భితము. శ్రీమద్రా మాయణ మంతయు శ్రీ గాయత్రీమంత్ర పరిబృంహితమైయున్నది.
శ్రీ వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ ప్రారంభల్లోక ప్రథమా క్షరము శ్రీ గాయత్రీమంత్ర ప్రథమాక్షరమగు ‘‘త’’ అను అక్షరముతో ప్రారంభించి గాయత్రీమంత్ర మెట్లు శత సంఖ్యా సంభావితమో ప్రథమ శ్లోకాక్షర సంఖ్యచే నిరూపించి మీఁదు మిక్కిలి ప్రథమ శ్లోక సంఖ్యయును శత సంఖ్యతో పరిపూర్తి జేసియున్నాఁడు. చూడుఁడు:
6 1 4 1 1 0 2 6 6 1 4 4 4 8 4 2
త ప స్స్వా ధ్యా య ని ర తం త ప స్వీ వా గ్వి దాం వ రం
0 2 8 1 2 1 2 7 4 5 1 5 0 1 3 4
నా రం దం ప రి ప ప్ర చ్ఛ వా ల్మీ కి ర్ము ని పుం గ వమ్ ॥
ఈ శ్లోకమునందుఁగల యక్షరములకు అక్షరసంఖ్యా సూత్రముతో వచ్చు పైనఁజూపిన అక్షరాంకములనన్నిటిని గూడినచో 100 (శతసంఖ్య) వచ్చును. ఈ శతసంఖ్య శ్రీగాయత్రీ మంత్రాక్షర శత సంఖ్యయై యుండుటచే శ్రీమద్రామాయణము శ్రీ గాయత్రీమంత్ర స్వరూపమైనదని కావ్యార్థసూచన జేయఁబడినది. మఱియును ఈ బాలకాండ నూరు సర్గలతో నొప్పి యున్నదని కూడ ఈ శ్లోకము తెలుపుచున్నది.
గాయత్రీ నామమువలెనే రామనామము అక్షరసంఖ్యాతత్త్వ శోభితమైయున్నది. ఎట్లన రా2 మ5 అక్షరసంఖ్యాసూత్రముచే రామ శబ్దమునకు 2-5 సంఖ్యలు వచ్చును. ఈ సంఖ్యలను వరుసగా 25 అని యుంచినచో సంశవింశతి (ఇరువదియైదు) సంఖ్య ఈ సంఖ్య పరమేశ్వర తత్త్వమును దెలుపును. ప్రకృతి తత్త్వములు 24. బ్రహ్మతత్త్వము చేరి పంచవింశతి తత్త్వములగును. రా2 మ5 ఈ రెండు అంకములను 2+5 కూడినచో 7 అని కారణస్వరూపసంఖ్య వచ్చును. సూర్యతత్త్వ మును దెలుపును.
రా2 మ5 ఈ రెండంకెలను 25 ఇట్లు గుణకమొనర్చిన 10 యగును. పరిపూర్ణా ద్వితీయ తత్త్వమును బోధించును. భగవత్స్వ రూపమగు 25 సంఖ్యను రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న రూపాంశములుగ నాలుగు 25ను గుణించినదో శత సంఖ్య చేకూరును. వేయేల? రామాయణమంతయు గాయత్రీ స్వరూపమే.
శ్లో॥ వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షి ద్రామాయణాత్మనా॥
అనఁగా వేదముచేఁదెలియఁబడుచున్న పరమపురుషుఁడు దశరథ కుమారుఁడుగ నవతరింపఁగనే వాల్మీకిమహర్షిచే వేదము రామాయణ రూపము దాల్చెను.
శ్లో॥ ఆలోడ్యాఖిలవేదరాశి మసకృద్యత్తారకం బ్రహ్మత
ద్రామో విష్ణురహస్యమూర్తి రితితం విజ్ఞాయ వల్మీకభూః
గాయత్య్రా శ్శ్రుతి మాతురర్థమధనం ప్రత్యక్షరం వ్యాకరో
దేకై కస్య సహస్ర మారచితవాన్ గ్రంథం రామాయణే (అఖండానందీయ)
అనఁగ వాల్మీకిమహర్షి వేదరాశినంతయు ననేక పర్యాయములు చక్కగా నాలోడిరచి శ్రీరామచంద్రుఁడు తారకబ్రహ్మ మనియు, శ్రీ మహావిష్ణు రహస్యావతార మనియు గుర్తించి వేద మాతృకయగు శ్రీ గాయత్రీ మంత్రమందుఁగల యర్థము నంతయు చక్కగమధించి గాయత్రీమంత్ర మందుఁగల యిరువది నాలుగక్షరములకు ఒక్కొక్క యక్షరమును వేయి శ్లోకములుగ వ్యాఖ్యానించి శ్రీ మద్రామాయణమును రచించెను. శ్రీమద్రామయణోత్తరకాండయందు శ్రీ వాల్మీకిమహర్షి రామాయణ స్వరూపము నిట్లు వక్కాణించి యున్నాఁడు:
శ్లో॥ ఇద మాఖ్యాన మాయుష్యం సౌభాగ్యం పాపనాశనమ్
రామాయణం వేదసంజ్ఞం శ్రాద్ధేషు శావయే ద్బుధః
గాయత్య్రా శ్చ స్వరూపం తద్రామాయణ మనుత్తమమ్॥
వేదము గాయత్రీ స్వరూపము పవిత్రమునగు రామాయణము శ్రాద్ధకాలముల యందు వినిపింపఁదగినది. శ్రీ రామాయణము ఆయుః ప్రదము భాగ్యకరము పాపనాశకము అయినదని తాత్పర్యము.
గాయత్య్రుపాసనమునకుఁ జెప్పబడిన విధి నియమమే శ్రీమద్రామాయణము నకును విధింపఁబడినది.
శ్లో॥ ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజ సంయుతమ్
త్రిసంధ్యం యఃపఠే న్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే॥
అనఁగ శ్రీ గాయత్రీ బీజాక్షరయుక్తమగు రామాయణము నెవ్వఁడు నిత్యము మూఁడు సంధ్యాకాలములయందును పఠించునో వాఁడు సర్వపాప విముక్తుఁడగును. సప్త కాండలతో గాయత్రీ మంత్రాక్షర తత్త్వ బీజములుగల యిరువదినాలుగు వేల శ్లోకములతో విరాజిల్లు శ్రీమద్రామాయణ సప్తధాతుయుక్తము. చతుర్వింశతి తత్త్వాత్మకమునగు శ్రీ గాయత్రీ మహాదేవియొక్క స్థూల శరీరము.
శ్రీ మద్రామాయణ సుందరకాండము శ్రీ గాయత్రీతేజో మయ సూక్ష్మశరీరము సుందరశబ్దమునఁగల మూఁడక్షరములకు అక్షరసంఖ్యా సూత్రముతో సుం7 ద8 ర2 ఈసంఖ్యలువచ్చును. ఈ సంఖ్యలను కూడినచో సూక్ష్మ శరీరతత్త్వ సప్తదశ 17 సంఖ్య వచ్చును. సుందర కాండము శ్రీ గాయత్రీదేవియొక్క తేజోమయ శరీరము కావుననే శ్రీ సుందరకాండ పారాయణ మమోఘ ఫలప్రదమై యున్నది.
శ్రీ సుందరకాండ గర్భమందుఁగల రామశబ్దము శ్రీ గాయత్రీ మహాదేవికి కారణశరీరమగుచున్నది. అక్షరసంఖ్య సూత్రముతో రా2 మ5 ఈ సంఖ్యలు వచ్చును. ఈ సంఖ్యలను కూడగ కారణ శరీరతత్త్వ సప్తసంఖ్య 7 వచ్చును. ఇది సర్వ మూలము. వాల్మీకిమహర్షికృత శ్రీ మద్రామాయణము యజుర్వేద ప్రతిబింబము. యజుర్వేదమందు ఋక్సామాధర్వణవేదమంత్రము లుండుటచే అది సర్వవేదమయము.
శ్రీమద్రామాయణము సర్వవేదమయమనుటకు హేతువులు ఇట్లు తెలియఁబడుచున్నవి. వాల్మీకి మహర్షి సుందరకాండమందు శ్రీరామచంద్రుని ‘‘యజుర్వేద వినీతశ్చ’’ అని పేర్కొనియున్నాడు. శ్రీమద్రామాయణమునకు కృష్ణ యజుర్వేదమునకు బెక్కు స్వరూప లక్షణములు సమానములై యున్నవి.
శ్లో॥ నధో నాథా రూప మితి సప్తకాండ వ్యవస్థితిః
యజుర్వేద సంహితాయాం కాండభక్తేషు తేష్వధ
తదారబ్ధం భవత్యేవ జయత్యేవ చ సర్వశః
చతుర్వింశ తృహస్రాణి శ్లోకానా ముక్తవా నృషిః
తేషు వేద్భవర్ణాని హ్యనులోమ విలోమశః
వర్ణక్రమానుసారేణ బుద్ధిమా నుద్ధరే త్సదా.
అనఁగా ‘‘నధో నాథా రూప’’మను సూత్రముచే పరిశీలించిన శ్రీమద్రా మాయణమునందుఁగల యేడుకాండలు మొదలగునవి యజుర్వేద సంహిత యందలి సప్త కాండలు మొదలగు వానితో సమానములై యున్నవి. ఆ రెండిటియందును జయశబ్దము సమానము. వాల్మీకిమహర్షి చతుర్వింశ త్సహస్ర శ్లోకములతో రామాయణము రచించెను. అందు వేదవర్ణము లపక్రమముగఁ గూర్పఁబడినవి. బుద్ధిమంతుఁడు వాని నుద్ధరించుకొనవలెను.
__కృష్ణయజుర్వేద ప్రమాణ మంత్రము __
సూత్రము: ‘‘న భావః కామతో జాతికరానాధరధీరయః జాతుజాల మరాః’’ అనఁగా కృష్ణయజుర్వేదమందు స7 ఏడుకొండలు భా4 వః4 నలువదినాలుగు ప్రశ్నములు (కా1 మ5 తః6) 651 అనువాకములు (జ8 తి6 క1 రా2) 2168 పనసలు (నా0 ధ9 ర2ధీ9ర2 యః1) 1 2 9 2 9 0 పదములు (జా8 తు6 జా8 ల3 మ5 రా2) 2ల 53వే 868 అక్షరములు కలవు.
వేదమందుఁగల మంత్ర బ్రాహ్మణ అరణ్యక ఉపనిషత్ ఏకాగ్ని కాండలయందు అక్షరములెన్నిగలవో వాల్మీకిరామాణయమందును ఉపోద్ఘాతోప సంహారసర్గలతో లెక్కించిన అన్ని అక్షరములేగలవని శ్రీరామాయణ వేదసమర్థన ప్రకాశికాకారుఁడు నిరూపించియున్నాఁడు.
శ్రీమద్రామాణయ సర్గ ప్రమాణసూత్రము
సూత్రము:- ససీ 77 తాధిప 196 కధార 291 జలాలి 338 తనవ406 సుగమ 537 సభాషాః 647. ఈ సూత్రముతో బాల కాండయందు 77 సర్గలు అనియు, అయోధ్యాకాండమందలి సర్గలతో బాలకాండసర్గలు చేర్చిన 196 సర్గలగుననియు ఇటులనే సప్త కాండములలోని సర్గలు ఒకదానితో మఱియొక కాండ సర్గల కూడిన, పైనఁజూపిన సంఖ్యలు వచ్చును.
శ్రీ మద్రామాయణ శ్లోక సంఖ్యా సూత్రము
శ్లో॥ గ్రంథా స్స్యు ర్బాలకాండే నిజఖుర (2280) గణితామాన్యభావా (4415) ద్వితీయే రంగే సాశ్రీ (2737) తృతీయే ఖగవర (2432) గణితా స్స్యు శ్చతుర్థే చ కాండే - కాండే త త్పంచమే తు స్తననగ (3006) గణితా నాధిధామా (5990) చ షష్ఠే- రాగీ భోగీ (3432) పరస్మై రహరవర (24282) ఇతిస్యా త్సమా స్యాపి సంఖ్యా॥
ఇతిహాస శ్రేష్టమగు శ్రీ వేదవ్యాసమహర్షికృత శ్రీమద్భాగవతము సైతము శ్రీ గాయత్రీమంత్ర విలసితమైయున్నది. శ్రీ వ్యాసమహర్షి శ్రీ పరమేశ్వరుని సప్త దశావతారము. వ్యాసశబ్దము (వ్యా1 స7) సప్తదశ సంఖ్యను దెలుపుచున్నది. మఱియు భాగవతనామము సైతము (భా4 గ3 వ4 తమ్6) ఈ సంఖ్యలను కూడఁగ సప్తదశ 17 సంఖ్య వచ్చును.
ఇది అజపా గాయత్రీస్వరూపము. శ్రీ గాయత్రీ సూక్ష్మ దేహము, వ్యాసరచనలన్నియు బ్రహ్మతత్త్వాంచితాష్టాదశసంఖ్యతో విలసిల్లుచున్నది. భాగవతము శ్రీ గాయత్రీస్వరూపమే.
శ్లో॥ యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మవిస్తరః
వృత్రాసుర వధోపేతం త ద్భాగవత మిష్యతే॥ (మత్స్యపురాణము)
అనఁగా ఏమంత్రము గాయత్రీమంత్ర నిబద్ధమైయున్నదో ధర్మము విస్తారముగ వర్ణింపఁబడియున్నదో వృత్రాసురవధ కల్గియున్నదో అది భాగవతమని చెప్పఁ బడుచున్నది.
శ్లో॥ అర్థోయం బ్రహ్మసూత్రాణాం భారతార్థ వినిర్ణయః
గాయత్రీ భాష్యరూపోసౌ వేదార్థ పరిబృంహితః
పురాణానాం సారభూత స్సాక్షా ద్భాగవతో దితః
ద్వాదశస్కంద సంయుక్త శ్శతవిచ్ఛేద సంయుతః
గ్రంథోష్టాదశ సాహస్రః శ్రీ మద్భాగవతాభిధః (గరుడ పురాణము)
అనఁగా బ్రహ్మసూత్రములకు అర్థభూతమైనదియు, భారతార్థమును నిర్ణయించునదియు, గాయత్రీ మంత్రమునకు భాష్య రూపమైనదియు, వేద తాత్పర్యమును విస్తారముఁగ బలపఱచునదియు, పురాణములలో శ్రేష్ఠమైనదియు, శ్రీశుకబ్రహ్మచే స్వయముగ బోధింపఁ బడినదియు, ద్వాదశస్కంధములు గలిగినదియు, గాయత్రీ మంత్రము వలెనే శతవిభాగములతో నొప్పుచున్నదియు, అష్టాదశ సహస్ర శ్లోకములు గలిగినదియు భాగవత మనుపేరఁ బ్రసిద్ధమైనది. వేయేల? లోకమున వేదమువలెనే శాశ్వతములై జపించువారి కభీష్టార్థముల నిచ్చుచున్న పవిత్ర గ్రంథములన్నియును శ్రీ గాయత్రీ ప్రభావముననే సమర్థము లగుచున్నవి.
ఆయా గ్రంథములయందుఁ బ్రతిపాదింపఁబడిన ప్రధాన దైవము రాముఁడైనను, కృష్ణుఁడైనను మఱి యే నామముతో పిలువఁ బడుచున్నను అది గాయత్రీనామ పరతత్త్వమే యని భావింపవలయును.
అక్షరసాంఖ్య సూత్రముచేత పరిశీలించిన ఆయా దేవతా నామముల కై క్యము గోచరించును. సంధ్యావందన మంత్రములలో నొకచోట-
మం॥ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః॥
అని చెప్పఁబడినది. లౌకికదృష్టితోఁ జూచువారికి శివ విష్ణు శబ్దములను బట్టియు శివ విష్ణు స్వరూపములను కృత్యములను బట్టియు నెంతయో విభేదము గనుపట్టును. తత్తత్త్వము నెఱుంగ వలయునన్న అక్షరసాంఖ్యసూత్రముతో పరిశీలించినఁ దెలియనగును. శివ విష్ణు శబ్దముల కక్షరసంఖ్య లిట్లు వచ్చును:
శి5 వ4 - ఈరెండు సంఖ్యలను కూడఁగ 9 సంఖ్యవచ్చును. వి4 ష్ణు5- ఈరెండు సంఖ్యలను కూడఁగ 9 సంఖ్యయే వచ్చును.
సంఖ్యాశాస్త్రమున తొమ్మిదిసంఖ్య బ్రహ్మతత్త్వమును దెలుపును. కనుకనే శివుఁడు పరబ్రహ్మమే, విష్ణువు పరబ్రహ్మమే; భేదములేదు.
మం॥ ఆకాశాత్పతితం తోయం యధాగచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి.
అనఁగా ఆకాశమునుండి భూమియందుపడిన వర్షోదకమంతయు సముద్రమునే చేరునట్టు లేదేవతకు నమస్కరించినను అది పరమేశ్వర తత్త్వమునే చేరును.
మం॥ సర్వవేదేషు య త్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్దనమ్॥
అనఁగా సర్వవేదములయం దేవుణ్యముగలదో సర్వతీర్థము లయం దేఫలముగలదో అట్టి ఫలము జనార్దనుఁడగు నారాయణ మూర్తిని స్తుతించినవాఁడు పొందునని చెప్పబడినది. కనుకనే-
శ్లో॥ ‘‘ధ్యేయ స్సదా సవితృమండల మధ్యవర్తీ
నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః’’
అని చెప్పబడినది. సర్వ మానవులకు సూర్యమండలాంతర్గత నారాయణమూర్తి యే ధ్యేయ తత్త్వమని సారాంశము.
సూర్యోపాసనమన్నను గాయత్య్రుపాసనమన్నను ఒకటియేగాని భేదమేమియునులేదు. సూర్యమండలాంతర్గత తేజమే గాయత్రి. ఆ గాయత్య్రుపాసన విధికి సంధ్యా వందనమను పేరేల గల్గెనో విచారింతము.
సంధ్యావందన విచారము
సంధ్యావందన వాక్యమందు సంధ్యాశబ్ద మొకటియు, వందనశబ్ద మొకటియుఁగలవు. సంధ్యాశబ్దముచేత కాలవిశేషము రూఢగిఁ దెలియఁబడుచున్నది. అంతయేగాక సంధ్యాకాల మందుపాసింపఁబడు దేవతయు తత్కాలకర్మయును సంధ్యాశబ్దముచే నుపలక్షింపఁబడు చున్నది.
శ్లో॥ అహో రాత్రస్య య స్సంధి స్సూర్యనక్షత్ర వర్జితః
సాతు సంధ్యా సమాఖ్యాతా మునిభిస్తత్త్వదర్శిభిః
అనఁగా సూర్యుఁడుగాని, నక్షత్రములుగాని కనబడకుండు నట్టి దివారాత్రముల యొక్క సంధికాలమును సంధ్యయని తత్త్వవేత్తలు వచింతురు. ‘‘సంధౌ భవా క్రియా సంధ్యా’’ అని వ్యాస నిర్వచనము.
శ్లో॥ ఉపా స్తే సంధివేళాయాం నిశాయా దివసస్య వా
తామేవ సంధ్యాం తస్మాత్తు ప్రవదంతి మనీషిణః
అని దివారాత్రములయొక్క సంధికాలమందు ఏ దేవత యుపాసింపఁబడుచున్నదో, ఏక్రియ సలుపఁబడుచున్నదో దానిని సంధ్యయని విద్వాంసులు వక్కాణింతురు, అని చెప్పబడినది.
సంధి యనఁగ రెండిటియొక్క చేరిక లేక కూడలి యని యర్థము, ఈ కనఁబడుచున్న విశ్వమంతయు మనకు భూమ్యాకాశములుగ, దివారాత్రములుగ, సుఖ దుఃఖములుగ, పుణ్య పాపములుగ ద్వంద్వ స్వరూపముతో నొప్పుచున్నది. పరమేశ్వర బ్రహ్మతత్త్వము ఇట్టి ద్వంద్వముల సంధించునదియై సంధి స్వరూపమై యొప్పుచున్నది.
సుఖబోధకై మన మీ విశ్వమునంతయు ఒక రూపాయి నాణెముగ భావించుకొందము, రూపాయ నాణెమునకు ఒకవైపున రాజముద్రాది చిహ్నము, రెండవవైపున దాని విలువయునుండును. రెండువిధములగు నామరూప లక్షణములుగల రెండు పక్షములతో రూపాయ నాణె మొప్పుచున్నను, దాని రెండుపక్షములకు ఆధారభూతమై సమానాశ్రయ మొసఁగి ఆ రెండు పక్షములను సంధించి వాని సంధియందు సమత్వస్థితి గలిగియున్నది వెండియేగదా మనకు గణ్యమైనవి! కోరదగినది. మన కభీష్టార్థ ఫలముల నొసంగునది ఆ రెండిటి సంధియందుండునది వెండిగాక మఱి యేది? అట్లే దృశ్యమగుచున్న బృహ్మాండమంతయు దివారాత్రములు, భూమ్యాకాశములు అను రెండుపక్షములు గలిగి పగటికాల మందు సూర్యబింబ మొకటియు, రాత్రికాలమందు నక్షత్రాది రూపమొకటియు గోచరించుచున్నది. ఈ దివారాత్రములకు భూమ్యాకాశములకు సమానాశ్రయ మొసఁగి వాని సంధియందు సమత్వస్థితి గలిగియున్నది. కాలస్వరూప పరమేశ్వర బ్రహ్మతత్త్వమే సంధిరూపమైనది. అట్టిదానినే సంధ్యయని వేదశాస్త్రములు పేర్కొనినవి. సంధ్యయనఁగ గాయత్రీనామమున పిలువఁబడుచున్న దేశకాలముల యొక్క సంధి స్వరూపమే. అదియే సర్వమానవకోటి కారాధ్య దైవము.
సంధ్య యన నేమియో తెలిసికొంటిమి. ఇక వందన శబ్దమును విచారింతము. వందన మనఁగ నమస్కారక్రియ. ఇది సర్వజన విదితమే. సంధ్యావిధియందు నమస్కార క్రియయే అతి ముఖ్యమైనది. నమస్కార క్రియావిధులు శాస్త్రములయందు పరిపరి విధములుగఁ జెప్పఁబడియున్నను ముఖ్యముగ రెండు హస్తములను హృదయ భాగమునఁగాని, నాసికాగ్ర భ్రూమధ్యముల యందుఁగాని జోడిరచి మనోదృక్కులను అందుఁజేర్చి ధ్యానించుట యనునది అతి ప్రధానమైనది.
మానవులు తమ యభీష్టార్థము నందుటకు దేవతాకోటి నారాధింతురు. దేవతాగణములో ఒక్కొక్క ఫలము నిచ్చుటకు ఒక్కొక్క దేవత కధికారము గలదు. ఏ ఫలముల నొసఁగుట కే దేవత కధికారమున్నదియు శాస్త్రముచే విచారించి, ఏ ఫలము కావలసి యున్నదో ఆ ఫలము నొసఁగుట కధికారముగల దేవతనే యుపాసించి నచో శీఘ్రముగ ఫలసిద్ధి లభించును.
శ్లో॥ కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంత ఇహదేవతాః
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి ర్భవతి కర్మజా॥ (గీత)
అనఁగా కర్మల ఫలసిద్ధినిగోరి దేవతల నారాధింతురు. దేవతాను గ్రహమున వేగముగ కర్మఫలసిద్ధి నొందును.
దేవతోపాసన విధులలో ఉపాస్యదేవత ఏ స్వరూపము, ఏ స్వభావము, ఏలక్షణము, ఏతత్త్వము గలిగియున్నదో తద్దేవతోపాసనకు అట్టి స్వరూపము, అట్టి స్వభావము, అట్టి లక్షణము, అట్టి తత్త్వము ముఖ్యవిధులుగ వేదశాస్త్రములయందు నిర్ణయింపఁబడియున్నవి.
మానవుల కే ఫలసిద్ధినందుట కేదేవతానుగ్రహము కావలయునో తదనురూప క్రియావిధులచే ఆ దేవత నుపాసింపవలసియున్నది.
ఉదాహరణకు: వర్షమును గోరువాఁడు వరుణ దేవత నుపాసింప వలయును. వరుణుఁడు జలతత్త్వము గలఁవాడు కావున వరుణాను గ్రహమును బొందుటకు జలప్రవాహములు యందు స్నానము, ఆర్ద్రవస్త్రములతో జలమధ్యమందేనిలిచి జలతత్త్వమంత్రములను జపించుట, అర్ఘ్యములిచ్చుట, ఘటాభిషేకములుచేయుట, జల ప్రబ్బలిబెట్టులచే పూజించుట, మొదలగునవి వరుణోపాసన విధులుగ నిర్ణయింపఁబడినవి. వేదశాస్త్రములయందే దేవత నుపాసించుటకే విధులు చెప్పఁబడినవో అట్టి విధులను నిర్వర్తించిన శీఘ్రముగ ఆ కర్మఫలించును.
ప్రకృత విచారణీయాంశమగు సంధ్యావందన కర్మకుఫలము బ్రహ్మసాయుజ్యము. ఉపాస్యదేవత బ్రహ్మస్వరూపమగు సంధ్యాదేవి. అది సంధి స్వరూపమైనది. కావున సంధ్యాదేవతానుగ్రహముఁ బొందుటకుఁ జెప్పఁబడిన విధులలో ముఖ్యవిధియగు వందనక్రియ సంధి స్వరూపమున నున్నది. బ్రహ్మాండలక్షణమే గల పిండాండమగు దేహము సైతము కుడి యెడమలను రెండు పక్షములు గలిగి దివా రాత్రములవలె పరస్పర విరుద్ధధర్మములు గల ప్రాణాపాన క్రియలు గలదియై యున్నది.
సంధ్యావందన ముఖ్యవిధియగు వందనక్రియయందు రెండు చేతులను జోడిరచుట, మనోదృక్కుల కేకాగ్రత గిల్పించుట యంతయు సంధి స్వరూపమేయైయున్నది. మఱియు రెండు పాదముల నొకదానితో నొకటిచేర్చి పద్మాసనమున గూర్చుండుట అంగన్యాస కరన్యాస దిగ్బంధనాది క్రియలన్నియు సంధి స్వరూపములుగనే యున్నవి.
సంధ్యోపాసనమునకు వందనక్రియ అతిప్రధానమైన దగుటచే తత్కర్మకు సంధ్యావందన మనుపేరు రూఢయైనది.
వేదోకర్మ లేవియైనను విధివిహితముగఁ జేసినప్పుడే యవి ఫలసిద్ధి నిచ్చుటకు సమర్థములైయుండును. విధిని విడిచి కర్మచేయుట నేల విడిచి సాముఁజేయుటవంటిదే యగును.
శ్లో॥ య శ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్త తే కామకారతః
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిం॥ (గీత)
అనఁగా ఎవ్వఁడు విధిని విడిచి కర్మచేయునో వాఁడు ఫలసిద్ధి నొందఁజాలడు, ఐహిక సుఖముగాని, పరలోక సుఖముగాని పొందఁజాలఁడు.
శ్రీ గాయత్రి సర్వలోకజనని; కరుణామయి. సుపాసించినఁ జాలును, వారేమియుఁ గోరకయుండినను వారి యోగక్షేమముల నన్నియు నామెయే ప్రసాదించును. ఇట్లని శ్రుతి:
। ।
మం॥ ఉద్యంతమ స్తంయంతమాదిత్య మభిధ్యాయన్ కుర్వన్
॥ । ।
బ్రాహ్మణో విద్వాంథ్సకలం భద్రమశ్నుతే॥
అనఁగా ఉదయించుచున్న, ఆస్తమించుచున్న సూర్య భగవానుని నెవఁడు ధ్యానించునో వాఁడు ఐహికాముష్మిక సకల శుభములను పొందును.
లోకమునఁ బ్రాణికోటిపడు నారాటమంతయుఁ బుష్కలముగ నిహపరలోకసుఖములు ననుభవించుటకేగదా! ఎవఁడు విధిగ యుక్తకాలమున శ్రద్ధతో సంధ్యావందనముఁజేయునో వాని కైహికాముష్మిక సుఖములన్నియుఁ జేకూరునని పరమ ప్రమాణమగు వేదము నిస్సందిగ్ధముగ వచించుచుండ సుఖభోగముల నాసించి లౌకిక కార్యాసక్తుఁడై వేదము విధిగ విధించిన సంధ్యా వందన కర్మను విడనాడుటకన్న నవివేకము మఱియొకటి యుండునా?
అజ్ఞానముచేఁగాని, అహంకారముచేఁగాని ఎవ్వఁడు సంధ్య నుపాసింపఁడో వాఁడుభయలోక దుఃఖభాజనుఁడే యగును.
బ్రహ్మమూర్తి యగు శ్రీకృష్ణుఁడు తన కత్యంత ప్రియభక్తుఁడగు నర్జును నిట్లాదేశించియున్నాడు.
శ్లో॥ మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా త్తరిష్యతి
అధ చే త్త్వ మహంకారా న్న శ్రోష్యసి వినశ్యసి॥ (గీ.18-58)
‘‘అర్జునా! చిత్తము నాయందుంచి ప్రవర్తించినచో, సర్వ దుఃఖముల నుండి విముక్తుఁడ నగుదువు. అహంకారముచే నన్న సుసరింపవేని కష్టములతో నశింతువు’’అని శాసించి