శ్లో॥ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః॥(గీ.12-2)
అనఁగ ‘‘నిత్యము నాయందు మనస్సునుంచి ఎవరు పరమ శ్రద్ధతో నన్నుపాసింతురో వారు నా కత్యంతప్రియులు’’అనియు,
శ్లో॥ శేషా మహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్
భవామి న చిరాత్సార్థమయ్యావేశిత చేతసామ్॥ (గీ.2-7)
‘‘ఎవ్వరు నన్నాశ్రయించి సేవింతురో వారిని సంసార సముద్రమునుండి నేనుద్దరింతును.’’ మఱియు
శ్లో॥ శ్రేయో హిజ్ఞాన మభ్యాసా ద్జ్ఞానా ద్థ్యానం విశిష్యతే
ధ్యానా త్కర్మఫలత్యాగ స్త్యాగా చ్ఛాంతి రానంతరమ్॥(గీ.12-13)
‘‘ఆనందమును సంపాదించు సాధనములలో అభ్యాసము కంటె జ్ఞానము శ్రేష్టమైనది. జ్ఞానముకంటె ధ్యానము- ధ్యానము కంటె కర్మఫలత్యాగము శ్రేష్ఠము. కర్మఫలత్యాగమునకు తర్వాత నున్నది పరమశాంతియే’’ అని చెప్పి-
ఇట్టి శాస్త్రీయవిధి ననుసరించి ఫలము నేమియుఁ గోరక కేవల కర్తవ్యతాబుద్ధితో సంధ్య నుపాసించుట అత్యంత శ్రేయోదాయకము. అట్లాచరించినచో వాని మనశ్శాంతికిఁగావలసిన సర్వ ఫలములను శ్రీ గాయత్రియే ప్రసాదించును. ఫలమునుగోరి చేసినచో కోరిన ఫలమును మాత్రమే యొసంగును.
సంధ్యానుష్ఠానముచే సాధింపరానిదేదియునులేదు. గాయత్రీ ప్రసాదమున విశ్వామిత్రుఁడు సృష్టికిఁ బ్రతిసృష్టి చేయగలిగినాడు. బ్రహ్మత్వమును సాధించినాఁడు.
నియమయుక్తుడై ఫలాపేక్షతో సంధ్య నుపాసించినచోఁ గోరిన ఫలము మాత్రమే లభించును. అట్లు లభించిన ఫలముతోఁ గలుగఁగల సుఖ దుఃఖముల బాధ్యతయంతయు నుపాసకునిదే యగును. నిష్కామబుద్ధితోఁ జేసినచో నన్నియు లభించును.
శ్లో॥ ఆదిత స్యోదయే స్నాత్వా సహస్రం ప్రత్యహం జపేత్
ఆయు రారోగ్య మైశ్వర్యం ధనం చ లభతే ధ్రువమ్॥
అనఁగా నిత్యము నెవఁడు సూర్యోదయమునకు ముందుగ స్నానమొనరించి, సహస్ర గాయత్రీ జపముఁజేయునో వాఁడు ఆయుస్సును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ధనమును నిజముగ బొందును.
శ్లో॥ శతజప్తా తు సాదేవీ పాపౌఘశమనా స్మృతా
సహస్రజప్తా సా దేవీ ఉపపాతక నాశినీ
లక్షజాప్యేన చ తధా మహాపాతక నాశినీ
కోటిజాప్యేన రాజేంద్ర యదిచ్ఛేత్తత్త దాప్నుయాత్॥
అనఁగా ఎవఁడు నియమముతో శతగాయత్రీ జపము సేయునో వాని పాపములన్నియు నశించును; సహస్ర గాయత్రీ జపముచే ఉపపాతకములును; లక్షజపముచే మహాపాపములును నశించును; కోటి సంధ్యాగాయత్రీ జపముఁజేసిన వాఁడేదికోరిన నది సిద్ధించును.
శ్లో॥ యోధీతేహన్యహన్యేతాం త్రీణి వర్షా ణ్యతంద్రితః
స బ్రహ్మపర మాప్నోతి వాయురూపేణ మూర్తి మాన్.
‘‘ఎవడు జాగరూకుఁడై మూఁడుసంవత్సరములు నిత్యము విడువక గాయత్రిని జపించునో వాఁడు వాయుస్వరూపుఁడై పరబ్రహ్మత్వము నొందు’’నని తాత్పర్యము.
శ్లో॥ అనేన విధినా నిత్యం జపం కుర్యాత్ప్రయత్నతః
ప్రసన్నో విపులాన్ భోగాన్ భుక్తిం ముక్తిం చ విందతి॥
అనఁగా నిత్య మెవ్వఁడు విధివిహితముగ గాయత్రీ జపమును ప్రయత్నముతోఁ జేయునో వాఁడు నిర్మణుఁడై విపుల భోగైశ్వర్యములను, భక్తి ముక్తుల నొందును.
శ్లో॥ గాయత్య్రాన్యం జప్యం గాయత్య్రా నపరం ధనమ్
గాయత్య్రాన పరం ధ్యానం గాయత్య్రాన పరాssహుతిః
అనఁగా గాయత్రికన్న వేఱుజపముగాని, ధనముగాని, ధ్యానముగాని, హోమముగాని మఱియొకటి లేదు.
మానవులు సుఖభోగానందములనందుటకు విధివిహిత నిష్కామ నిత్య కర్మానుష్ఠానమగు సంధ్యోపాసనము సర్వోత్తమ మని వేదశాస్త్రము లెంతచెప్పినను, సత్యసంధులగు గురువు లెంత బోధించినను మానవుఁడు కోరికలేకుండ నుండలేఁడు. కోరుట యనునది మానవ లక్షణము, ఎవ్వరెట్టి ఫలములనుగోరి యేదేవత నుద్దేశించి యే కర్మ చేసినను, ఆ చేసిసకర్మకుఁదగిన ఫలము నొసంగునది గాయత్రియే. వేదశాస్త్రోక్త కర్మల ప్రారంభమున సంకల్పప్రాణాయామమందే ‘‘ఓం భూః ఓం భువః’’ మొదలగు సప్తవ్యాహృతులతోడ శ్రీ గాయత్రీ మంత్రమునుజేర్చి, సంకల్పించి కర్మను ప్రారంభించవలయును. అటులఁ జేసిననే ఫలసిద్ధిఁ గలుగఁజేనెడి శక్తి చేకూరును. అట్టి విధి విహిత శుద్ధ సంకల్పములేకున్న ఆకర్మ నిష్ఫలమగును. ఆకర్మను ఫలింపఁ జేయునది గాయత్రియే.
యంత్ర యుగమగు వర్తమానకాలమున విద్యుచ్ఛక్తి మహిమ నెఱుఁగని వారెవ్వరు నుండరు. ప్రజావసరములకుఁ గావలసిన దీపములను వెలిఁగించుట, నీరుతోడుట, పంకాలు విసరుట, పిండి విసరుట మొదలగు సమస్త కార్యములను నిర్వర్తించుచున్న నానావిధ యంత్రములను నడుపుచున్నది విద్యుచ్ఛక్తియే గదాః ఆణుశక్తియన్నను, విద్యుచ్ఛక్తియన్నను సర్వమూలమై సర్వాంతర్యామియైయున్న తేజోమయ మగు సూర్యశక్తియే. దానినే బ్రహ్మశక్తి యని వేదశాస్త్రములు పేర్కొనుచున్నవి.
లోకమునందిపుడు నానావిధ రూపములతో నొప్పుచున్న యంత్రముల నన్నిటిని నడపుచు ప్రజాభీష్ట ఫలముల నొసంగు చున్నది. ఆ పరాశక్తియే ఎవరెట్టి ఫలములను గోరుదురో అందుకుఁదగిన యంత్రమును చేబట్టి, ఆ యంత్రమునకు యుక్తముగ విద్యుచ్ఛక్తి ననుసంధానము చేయఁగలిగినప్పుడే ఆ ఫలము పొందఁగలుగుదురు.
నానావిధ రూపములతో నొప్పుచు, ప్రజావసర కార్యములను నిర్వర్తించుచున్న యంత్రములవంటివే వేదమంత్రములు సైతము. ఆ మంత్రములు అదృశ్య స్వరూప దేవతానామములతోఁ బరఁగుచున్నవి. యంత్రములకు విద్యుచ్ఛక్తి నెటుల ననుసంధానము చేయుదుమో అట్లే మంత్రానుష్ఠాన సంకల్పమునందు శ్రీ గాయత్రీమహామంత్రము ననుసంధింప వలయును. వేయేల? సర్వయంత్రములకు, సర్వ మంత్రములకు, సర్వతంత్య్రములకు చైతన్యము గలిగించునది ఆ తేజోమయ పరాశక్తియే.
భారతీయులనాది కాలమునుండియు వేదమూలమున ఆ పరాశక్తి మహిమ నెఱిఁగి మంత్రానుష్ఠానములద్వారా సర్వాభీష్ట ఫలముల మహర్షులు లోకమున కందీయఁగలిగిరి.
భారతదేశమున సంధ్యానుష్ఠానము (సూర్యోపాసనము) ముఖ్యవిధియై యుండుటచేతనే ఈ దేశమునకు భారతదేశమని పేరు ప్రసిద్ధమైనది. ‘‘భా’’అనఁగ సూర్యాంతర్గత బ్రహ్మతేజము.‘‘రత’’ అనఁగ అద్దాని యందాసక్తి, ప్రీతిగల దేశమని యర్థము.
పాశ్చాత్య దేశముల వారిపుడిపుడే ఆ సూర్యశక్తి (ఆటం) మహిమను గుర్తించి, యంత్ర విధులచే తదనుగ్రహమును సాధించి తమ యభీష్టార్థములు నందఁగలుగుచున్నారు. భారతీయులకు మొదటి నుండియు సంధ్యావిధిరూపమగు సూర్యోపాసనము విడువరాని పరమ ధర్మమైయున్నది. సంధ్యోపాసనము విడిచినచో దుస్సహమగు ప్రత్యవాయము కలుగును.
శ్లో॥ ఉపతిష్ఠంతి వై సంధ్యాం యే న పూర్వాం స పశ్చిమామ్
ప్రజంతి తే దురాత్మనః తామిస్రం నరకం వ్రజేత్॥ (విష్ణు పురాణము.)
అనఁగా ఎవ్వరు సాయంప్రాత సంధ్య నుపాసింపరో ఆ పాపాత్ములు తామిస్రనరకము నొందుదురు. మఱియు -
శ్లో॥ సంధ్యాహీనోశుచి ర్నిత్య మనర్హ స్సర్వ కర్మసు
య దన్య త్కురుతే కర్మ న తస్య ఫలభా గ్భవేత్॥
సంధ్యావందనము సర్వమానవులకు విధియైయున్నది. కాని దానిని ద్విజులు సమంత్రకముగను, స్త్రీ శూద్రాదు లమంత్రకముగను జేయవలయును. వేద మటులనే శాసించినది. మంత్రయుక్తముగఁ జేసిన వానికెట్టి స్థానము గలదో యథోక్త కారిత్వము వలన ఆమంత్రకముగ సంధ్యావందనముజేసిన వారికిని ఆ స్థానమే లభించును. అనఁగా నిత్య మెవఁడు సంధ్య నుపాసింపఁడో వాఁడపరి శుద్ధుఁడును సర్వకర్మల కనర్హుఁడు నగును. అతఁడు మఱియే యితరకర్మ చేసినను తత్ఫలమును బొందఁజాలఁడని దక్షవచనము గలదు. మఱియు -
శ్లో॥ సంధ్యా యేన న విజ్ఞాతా సంధ్యాయే నానుపాసితా
జీవమానో భవే చ్ఛూద్రో మృత శ్శ్వానోభిజాయతే॥
అని గోభిలవచనము. అనఁగా ఎవఁడు సంధ్య నెఱుఁగఁడో ఎవఁడు సంధ్య నుపాసింపఁడో వాఁడు బ్రతికియుండగా శూద్రుఁడై చచ్చిన పిమ్మట శునకమై జనించునని భావము.
అత్రి యిట్లు చెప్పియున్నాఁడు :
శ్లో॥ నోపతిష్ఠంతి యే సంధ్యాం స్వస్థావస్థాను యేద్విజః
హింసంతి హి సదా తేవై భగవంతం దివాకరమ్॥
ఎవరారోగ్యముగనుండియు సంధ్య నుపాసింపరో, వారు సూర్య భగవానుని హింసించిన వారే యగుదురని తాత్పర్యము.
శ్లో॥ గాయత్య్రుపాసనానిత్యా సర్వవేదై స్సమీరితా
యయా వినా త్వధః పాతః బ్రహ్మణస్యాపి సర్వధా
గాయత్రీమాత్రనిష్ణాతః ద్విజో మోక్ష మవాప్నుయాత్
విహాయ తాం తు గాయత్రీం విష్ణూపాస్తి పరాయణః
శివోపాస్తి పరో విప్రో నరకం యాతి సర్వధా॥ (దేవీ భాగవతము)
అనఁగా గాయత్య్రుపాసనము సర్వులకు నిత్యమైన పరమ విధియని సర్వవేదములచే చెప్పఁబడినది. నిత్యోపాసనమగు సంధ్యానుష్ఠానమును వదలినచో బ్రహ్మకైనను అన్ని విధముల అధఃపతనముతప్పదు. ఇతరానుష్ఠానము లేమియు చేయకపోయినను సంధ్యావందనము మాత్రము చేయుచున్నచో ఆ ఆ ద్విజుఁడు మోక్షము నొందును. సంధ్యావిధిని విడిచినవాఁడు విష్ణు భక్తుఁడైనను, శివభక్తుఁడైనను ఆ విప్రుఁడు అన్ని విధముల నరకము నొందును.
శ్లో॥ గాయత్య్రాస్తు పరం నాస్తి ఇహలోకే పరత్ర చ
సర్వదుఃఖహరం వ్యాధి నాశనం మోక్షదం తధా
సదాచారేషు సంధ్యాయాః ప్రాధాన్యం మునిపుంగవ
సంధ్యా-చరణతోదేవీ భక్తాభీష్టం ప్రయచ్ఛతి॥ (దేవీ భాగవతము)
అనఁగా సర్వదుఃఖములను పోగొట్టుటయందును వ్యాధి నాశనమందును. మోక్షము నిచ్చుటయందును, ఇహలోకమందుఁ గాని, పరలోకమందుఁగాని, గాయత్య్రుపాసనముకన్నను మించినది మఱియొకటిలేదు.
శ్లో॥ విప్రో వృక్షో మూలకాన్యత్ర సంధ్యా
వేదా శ్శాఖాః ధర్మకర్మాణి పత్రం
తస్మా న్మూలం యత్నతో రక్షణీయం
ఛిన్నే మూలే నైవ వృక్షో న శాఖా॥
అనఁగా బ్రాహ్మణుఁడను వృక్షమునకు సంధ్యావందనము మూలమగు వేరు. వేదములు కొమ్మలు, ధర్మకర్మలు ఆకులు. కావున ప్రయత్నముతో మూలమును రక్షించవలయును. మూలము లేకున్న చెట్టుగాని, కొమ్మలుగాని యుండబోవు.
శ్లో॥ ఏషాం తు జన్మసాఫల్యం తేషాం శ్రద్ధాతు జాయతే
ఏషాం తు జన్మసాంకర్యం తేషాం శ్రద్ధా న జాయతే॥
అనఁగా ఎవ్వరికి జన్మసాఫల్యముకాగలదో వారికి సంధ్యా వందనమందు శ్రద్ద జనించును. ఎవ్వరికి జన్మసాంకర్యము కానున్నదో వారికి శ్రద్ధ జనింపదు.
యమఃశ్లో॥ గాయత్రీం చైవ వేదాంశ్చ తులయా తోలయత్ప్రభుః
ఏకత శ్చతురో వేదాన్ సాంగా శ్చ స ప ద క్రమాన్
ఏకత శ్చైవ గాయత్రీం తుల్యరూపాచ్చ సా స్మృతా॥
అనఁగా పరమేశ్వరుఁడు త్రాసునందు గాయిత్రి నొక వైపునకు సర్వవేదములను, షడంగములను, పదక్రమాదులను అన్నియు నొకవైపున పెట్టి తూఁచగా అన్నింటితో గాయత్రి తులతూఁగెను.
__వ్యాసః : __శ్లో॥ దశకృత్వః ప్రజప్తాసా త్య్రహా ద్యద్య త్కృతం లఘు
త త్పాపం ప్రణుద త్యాశు నాత్ర కార్యా విచారణా॥
అనఁగా గాయత్రీమంత్రమును పదిమార్లు జపముచేసిన మూఁడుదినములలోఁజేసిన పాపము సరిహార మగును.
శ్లో॥ యక్ష విద్యాధరత్వం వా గంధర్వత్వ మధాపినా
దేవత్వ మధ వా రాజ్యం భూలోకం వా ప్యకంటకమ్
కోటిజప్తేన గాయత్య్రాః య దిచ్ఛతి తదా ప్నుయాత్॥ (దేవీ భాగవతము)
అనఁగా శ్రద్ధతో కోటి గాయత్రీజపము చేసినచో యక్షత్వముకాని, విద్యాధరత్వముకాని, గంధర్వత్వముకాని, దేవత్వము కాని, నిష్కంటక మగు రాజ్యముకాని యేదికోరిన నది లభించును.
సంవర్తః :
శ్లో॥ ఐహికాముష్మికం పాపం సర్వం నిరవశేషతః
పంచరాత్రేణ గాయత్రీ జప్యమానా వ్యపోహతి॥
అనఁగా విడువకుండా ఐదుదినములు గాయత్రీ జపము చేసిన బహికాముష్మిక పాపమంతయు నిశ్శేషముగ హరించును.
శ్లో॥ ప్రణవే నిత్యయుక్తస్య వ్యాహృతీషు చ సప్త సు
త్రిపదాయాం చ గాయత్య్రాం న భయం విద్యతే క్వచిత్॥
అనఁగా ప్రణవసప్త వ్యాహృతీ సహిత త్రిపదా గాయత్రీ మంత్రమును నిత్యయుక్తుఁడై చేసిన వానికి భయము కొంచెమైనను సంభవింపదు.
శ్లో॥ తదిత్యృచా సమో నాస్తి మంత్రావేద చతుష్టయే
సర్వవేదా శ్చ యజ్ఞా శ్చ దానాని చ తపాంసి చ
సమాని కలయా ప్రాహు ర్మునయో నతదిత్యృచః
పరిహార్యాపి వేదాంస్త్రీన్ కర్మాణి వివిధాని చ
సావిత్రీమాత్ర మాప్యత్య ద్విజో భవతి నిర్భయః
వాయుభక్షో దినం స్థిత్వా రాత్రౌ నీత్వా తు సూర్యదిక్
జప్త్వా సహస్రం గాయత్య్రా శ్శుచి రహ్మవదాదృతే
సాయం ప్రాతస్తు య స్సంధ్యామాసన్నా ముపతిష్ఠతే
జపన్ వైపావనీం దేవీం పవిత్రాం వేదమాతరమ్
స తయా పావితో దేవ్యా బ్రాహ్మణో ధౌత కల్మషః
నసీదే త్ప్రతి గృహ్ణానః పృథివీంచ స సాగరాం
గాయత్య్రా లక్షజాప్యేన పాతకేభ్యో విముచ్యతే
స్నానా చ్ఛతేన గాయత్య్రా శ్శతమంతర్జలే జపేత్
ఆప శ్శతేన పీత్వా చ సర్వపాపైః ప్రముచ్యతే
చతుర్ణా మపి వేదానాం గాయత్రీ జననీ భవేత్
తా ముపాస్తేధయో నిత్యం సవిప్రః పఙ్త్కి పావనః
సర్వేషా మపి పాపానాం సంకరే సముపస్థితే
శత సాహస్త్ర మభ్యస్య గాయత్రీ శోధయే త్తతః
అనఁగా నాల్గువేదములయందుఁగల మంత్రములన్నియు ‘‘తత్’’ అను గాయత్రీ మంత్రముతో సరిపోలవు. సర్వవేదములు, సర్వ యజ్ఞములు, సర్వదానములు సర్వతపస్సులు అన్నియును కలిసియు గాయత్రీ మంత్రముయొక్క పదునారవ భాగమునకు సమము కావనియు, మునీంద్రులు వక్కాణింతురు. వివిధ కర్మలను మూఁడు వేదములను విడిచినను గాయత్రి నొకదానిని జపించు వానికి భయము లేదు. పగలు వాయు భక్షకుఁడై నిలిచి, రాత్రి యందు సూర్య ద్మిఙ్ముఖుఁడై సహస్ర గాయత్రీ జపమొనర్చినచో బ్రహ్మదేవునివలె పరిశద్ధుఁడగును. క్రమముగ ప్రాత స్సాయంకాలములయందు పవిత్ర వేదమాతయగు గాయత్రీ మంత్రము నెవ్వఁడు జపించునో వాఁడు నిష్పాపుఁడై పవిత్రుడగును. అట్టి బ్రాహ్మణుఁడు చతుస్సముద్ర ముద్రితమగు భూమి నంతయు పరిగ్రహించినను దుఃఖించపనిలేదు. లక్ష గాయత్రీ జప మొనర్చినచో సర్వపాపవిముక్తుఁడగును. గాయత్రీ మంత్రముతో శతస్నానము లొనర్చి, నీటియందు నిలిచి శత గాయత్రీ జపమొనర్చి శత గాయత్రీమంత్రపూతమగు పానమొనర్చినచో సర్వపాపములనుండి విముక్తుఁడగును. గాయత్రి నాల్గు వేదములకు తల్లి. అట్టి గాయత్రి నెవ్వఁడుపాసించునో వాఁడు పఙ్త్కి పావనుఁడు. సర్వపావనుఁడు. సర్వపాపములు సంకరములై సంభవించినపుడు లక్ష గాయత్రీ జప మొనర్చినచో పరిశుద్ధుఁడగును.
చతుర్వింశతి మతే
శ్లో॥ గాయత్య్రాస్తు జపన్ కోటిం బ్రహ్మహత్యాం వ్యపోహతి
లక్షా శీతిం జపే ద్యస్తు సురాపానా త్ప్రముచ్యతే
పునాతి హేమహర్తారం గాయత్రీ లక్ష సప్తతిః
గాయత్య్రాష్షష్ఠిభిర్లక్షై ర్ముచ్యతే గురుతల్పగః
గాయత్య్రష్ట సహస్రంతు జపం కృత్యోత్థి తే రవా
ముచ్యతే సర్వపాపేభ్యః యది సబ్రహ్మహా భవేత్॥
అనఁగా కోటి గాయత్రీజపము బ్రహ్మహత్యను పోగొట్టును ఎనుబదిలక్షలు గాయత్రీ జప మొనర్చినచో సురాపాన వాపమునుండి విముక్తుఁడగును. ఏడులక్షలు గాయత్రీ జపమొనరించినచో బంగారము దొంగిలించిన పాపము పరిహార మగును. ఆరులక్షల గాయత్రీ జపము గురుతల్పగ పాపమును పోఁగొట్టును. సూర్యోదయవేళ అష్ట సహస్ర గాయత్రీ మంత్ర జపముచేసినచో బ్రహ్మహత్య చేసినవాఁడైనను సర్వపాపముల నుండి విముక్తుఁడగును.
వాక్యమ్: సప్త కోటి మంత్రేషు గాయత్య్రా స్సర్వోత్తమత్వం ద్విజానా మావశ్యకతా పరాణ్యనేక ఋషి ప్రోక్తాని వచనాని శతశ స్సహస్రశ స్పంతి. విస్తరభయాదత్ర న లిఖితమ్॥
అనఁగా సప్తకోటి మహామంత్రములలో గాయత్రీ మంత్రము సర్వోత్తమమనియు, గాయత్రి ద్విజుల కత్యంతావశ్యకమైనదని తెలిపెడి ఋషివాక్యములు నూర్లు వేలుగనున్నవి. విస్తార భయముతో నిందు లిఖింపనైతిని.
వేదశాసనము రాజాజ్ఞవలె నెవ్వరికిని మీరరానిది. దాని నుల్లంఘించిన వారికి శిక్ష తప్పదు. ఉపాయాంతరములచే రాజ దండనమునైనను తొలగించుకొనవచ్చునేమోగాని, దైవ శిక్ష తప్పించు కొనుట కెవ్వరికిని సాధ్యపడదు. దైవము సర్వాంతర్యామి, జగచ్చక్షువు, కావున దైవము నెవ్వడు మోసగింపజాలఁడు. కావున సర్వమానవులును, స్త్రీలు సైతము-సంధ్యావందనమును చేసియే తీరవలయును. ‘‘సంధ్యావందన’’మనిన సంధ్యాకాలముల యందు సర్వమానవులు తమతమ యిష్టదైవమును మనస్ఫూర్తిగ ధ్యానించుటయే యనియు, దానిని ద్విజులు సమంత్రకముగను, అన్యులమంత్రకముగను చేయవలయును. వేద మిటులనే శాసించినది. మంత్రయుక్తముగ చేసినవారి కెట్టి స్థానముగలదో అమంత్రకముగ చేసినవారికి సైతము అట్టిస్థానమే లభించగలదు. అందుకు సందేహములేదు. ప్రతి మానవుఁడు దైవము నారాధించియే యున్నత స్థితికి రావలయును. భగవదనుగ్రహమును సంపాదింప వలయునన్న భగవదాజ్ఞలగు వేదోక్త కర్మలే ముఖ్యసాధనములు. తండ్రి దయను పొందవలయునన్న తండ్రి మాట జవదాటఁక కుమారుఁ డాచరించవలయును గదా. వేదోక్తకర్మ విధివిహితముగఁజేసినపుడే ఫలసిద్ధి నొసంగును. మానవుఁ డిష్టార్థ ఫలముల నందవలెనన్నచో వేదశాస్త్రములయందు చెప్పఁబడిన కర్మలను చేసియే తీరవలయును.
ప్రతి కర్మయు నేమాత్రము చెడకుండా ఫలసిద్ధి పొంద వలయునన్న ప్రతి కర్మకు ఐదు విధములగు కారణములు లోపములేకుండ చక్కగ సమకూడవలయును.
శ్లో॥ పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే
సాంఖ్యేకృతాంతే ప్రోక్తాని బద్ధయే సర్వకర్మణాం॥
అని భగవద్వచనము గలదు. అనఁగా అర్జునాః సర్వకర్మల ఫలసిద్ధికి శాస్త్రమందు ఐదు కారణములు చెప్పబడినవి: అవి యేవనగా
శ్లో॥ మంత్ర ద్రవ్య క్రియా కాల శక్త యస్సాధు సిద్ధిదాః
- జ్ఞానవాసిష్ఠము 1. మంత్రము, 2. ద్రవ్యము, 3, క్రియ, 4.కాలము, 5, పర మేశ్వరాను గ్రహశక్తి . ఈ యైదును చక్కగ సమకూడినప్పుడు మాత్రమే కర్మలు ఫలసిద్ధి నిచ్చునని తాత్పర్యము. ఈ చెప్పఁబడిన ఐదు కారణములు కర్మల ఫలసిద్ధికి ముఖ్యాంగములై యున్నవి. వీనిలో మొదటి నాలుగు పురుషు ప్రయత్నాధీనములు. మానవుఁడీ నాలుగంగములను చక్కగ సమకూర్చుకొని కర్మచేసినచో ఐదవ యంగమగు పరమేశ్వ రానుగ్రహశక్తి ఆ కర్మను విధిగ ఫలింపఁజేయును,
ప్రతి కర్మకు శాస్త్రమందుఁ జెప్పఁబడిన ఐదంగములను జక్కగ నెఱింగి చేసిన కర్మలను నశింపకుండా ఫలింపఁజేయు పురోహితులను పంచాంగము వారని పిలుచుట పరిపాటియైనది. ఏదైన కర్మఫలింపక చెడిపోయినచో ఆకర్మకు చక్కగ పంచకము కుదరలేదనియు, పంచికచెడినదనియు చెప్పుటకూడ వాడుకగలదు. ప్రకృత విషయమగు సంధ్యోపాసనకర్మకు చెప్పఁబడిన పంచాంగములలో (విధులలో) మొదటిది మంత్రము - ఇది ద్విజులకు ఉపనయన కాలమందు గురూపదిష్టమై యున్నది. దానిని స్ఫుటముగ, సుస్వరముగ నుచ్చరింప వలెను. రెండవది ద్రవ్యము - ద్రవ్యమనగా పరిశుద్ధమగు స్థలము. జలము, ఆసనము, జపమాల మొదలగునవి. మూడవది క్రియ ఆచమనము, ఆర్ఘ్యము, - అంగన్యాసకర న్యాసాదులు ఇవి. నాల్గవది కాలము సూర్యోద యాస్తమయముల యొక్కయు, పూర్వాపరాహ్ణముల యొక్కయు, సంధికాలము. ఈ నాలుగును యుక్తముగ సమకూర్చుకొని సంధ్యానుష్ఠానము చేసినచోఁ బరమేశ్వరానుగ్రహశక్తి విధిగఁ జేకూరును, సందియములేదు.
భగవదనుగ్రహము వలననే మానవుఁ డభీష్టార్థ ఫలముల నంద వలయును. దానికి వేదచోదిత కర్మానుష్ఠానమే సులభమగు ముఖ్య సాధనము. అది ఉపనయన కాలమునుండి సంధ్యానుష్ఠాన మూలముగఁ బ్రారంభమగును. దాని యాధారమున భగవదను గ్రహమును సంపాదించుచు, యథేష్టైహికాముష్మిక సుఖములు నొంది, తుదకు బ్రహ్మసాయుజ్యము నందవలయును. ఇది సర్వ మానవులకు దైవోపదిష్టమగు విధియై యున్నది. ఇది ద్విజులు సమంత్రకముగను. ఇతరుల మంత్రకముగను జేసితీరవలయును. దైవానుగ్రహము నందుట కింతకంటే సులభ మార్గము లేదు.
శ్లో॥ తత్ప్రసాదాత్క్రమాన్ మార్గాన్ విశిష్టానేతి మానవః
తత్ర తత్ర స్థితోదేవః ప్రసాదం కురుతే-స్యతు
సోపాన క్రమతోదేవః వేదమార్గస్య కారణం
వేదమార్గ స్థితో దేవః సాక్షాన్ముక్తేస్తు కారణం
ఆతోవేదాశయోమర్త్యః నాన్యమార్గం సమాశ్రయేత్
వేదమార్గైకనిష్ఠానాం నకించిదపి దుర్లభం
అత్త్రే వపరమాముక్తిః నచాన్యత్రతు పుష్కలా! (స్కాందం)
అనఁగ భగవదనుగ్రహముచే మానవుఁ డుత్తమ మార్గముల నందుకొనును. ఆయా మార్గములయందు సోపానక్రమముగ భగవానుఁడు వాని నున్నతస్థితికిఁ గొనిపోవును. వేదమార్గమునకు కారణము భగవానుడు. వేదమార్గమునాశ్రయించిన వాఁడన్య మార్గముల నాశ్రయింపఁడు. వేదమార్గైకనిష్ఠులకు దుర్లభమైన దొక్కటియునులేదు. ఈ మార్గముననే పరిపూర్ణముక్తి లభించును. అన్యమార్గమునలేదు అనిభగవానుఁడు శాసించియున్నాడు. మఱియు
శ్లో॥ శృతి స్మృతి మమైవాజ్ఞేయసా వుల్లంఘ్య వర్త తే
ఆజ్ఞాచ్ఛేదమ మద్వేష్యో సమే వధ్యతమోమతః
అనఁగ వేదశాస్త్రములు, నా యాజ్ఞలు, వానినెవఁడుల్లంఘించు నో వాఁడు నాకు ద్వేషింపదగినవాఁడును, వధార్హుఁడు నగునని చెప్పియున్నాఁడు; మఱియు
శ్లో॥ సుత్వేతద్యసూయంతో నాను తిష్ఠంతి మేమతమ్
సర్వజ్ఞాన విమూఢాంస్తా న్విద్ధి నష్టానచేతసః॥ (గీత. 3-22)
అనఁగ నాయీ మతము నెవ్వఁ డనుసరింపఁడో వాఁడన్నిటఁ జెడినవాఁడే యగును.
శ్లో॥ వేదోదితం స్వకం కర్మ నిత్యంకుర్యా దతంద్రితః
తద్ధికుర్వన్ యధాశక్తి ప్రాప్నోతి పరమాగతిమ్॥
అనఁగ వేద మెవ్వనికెట్టి కర్మను విధించినదో దానిని యధాశక్తి నాచరించిన వాఁడుత్తమ గతినొందును; మఱియు
శ్లో॥ యతఃప్రవృత్తి ర్భూతానాం యేనసర్వమిదం తతమ్
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతిమానవః॥ (గీత 18-46)
అనగా ఏ సూర్యమండలాంతర్గత బ్రహ్మశక్తిచే సర్వ భూతములకుఁ బ్రవృత్తి గలుగుచున్నదో దేనిచే సర్వప్రపంచము వ్యాపింపఁబడినదో అట్టి పరమేశ్వర తత్త్వమును స్వకర్మచే పూజించి, మానవుడు సిద్ధినొందునని భగవచ్ఛాసనమై యున్నది. కనుక ఇట్టి పవిత్రమగు వేద ధర్మమును దెలిపి, వేదకర్మా నుష్ఠానమును లోకమున వ్యాపింపఁజేసి తద్వారా లోకకల్యాణము జేకూర్చవలసిన బాధ్యత ముఖ్యముగ బ్రాహ్మణుల మనఁబడు వారియందే యున్నది.
శ్లో॥ స్థాపయధ్వమిమం మార్గం ప్రయత్నేనా పిహేద్విజాః
స్థాపితే వై దికేమార్గే సకలం సుస్థిరం భవేత్
యోహిస్థాపయితుం శక్తోనకుర్యా న్మోహితోనరః
తస్యహంతా సపాపీయానితి వేదాంతనిర్ణయః
యస్థ్సాపయతు ముద్యుక్తః శ్రద్ధయైనా క్షమోపి సన్
సర్వపాప వినిర్ముక్త స్సాక్షాన్మోక్ష మవాప్నుయాత్
యస్తువిద్యాభిమానేన వేదమార్గ ప్రవర్తకం
ఛలిజాత్యాదిభిర్జీయాత్స మహాపాతకీభవేత్॥ (స్కాందం)
అనగా ద్విజులారా, మీరీ వేదమార్గమును ప్రయత్నముతో స్థాపింపుడు. వేదధర్మము స్థాపితమైనచో సర్వము చక్కఁబడును. సమర్థుడై యుండియు నెవ్వడు వేదధర్మము నుద్ధరింపడో వాఁడు వేద ధ్వంసకుడు: పాపాత్ముడు అని వేదాంత నిర్ణయము. ఎవ్వఁడు సమర్థుడు గాకుండియు, శ్రద్ధగలిగి వేదధర్మము నుద్ధరింపఁ బూనునో వాఁడు సర్వపాప వినిర్ముక్తుడై జ్ఞానసిద్ధు డగును, ఎవఁడు విద్యాగర్వము చేతను, మోసముచేతను, జాత్యభిమానము చేతిను, వేదధర్మ ప్రవర్తకుని జయింప దలచునో వాఁడు మహాపాపాత్ముడగును. వేదధర్మము నుద్ధరించు బాధ్యత బ్రాహ్మణులపై నున్నది. కాన బ్రాహ్మణు లనబడువారు తమ విధులను తాము చేయకపోయిన యెడల తాము చెడుఁటయే గాక లోకమును సైతము చెఱచినవారే యగుదురు. బ్రాహ్మణు లెట్టి విశేషవిధులను చేసినను, చేయకపోయినను, ఏమైనను, యుక్తకాలమున నిత్యము సంధ్యావందనమునైన చక్కగఁ జేయుచున్నచో -లోకమునకు సర్వకల్యాణములు సేకూరును. ఈ కార్యమును నిర్వహించుటకు దినమున కొక్క గంటకాలము వినియోగించినఁ జాలుసు, ఇంత మాత్రమేని చేయుచుండినచో వారికి భగవానుడు సర్వశుభములఉ జేక్చూరును. కనుకనే -
శ్లో॥ అనన్యాశ్చింత యంతోమాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥ (గీత 9-12)
అని భగవంతుడు ప్రతిజ్ఞ చేసియున్నాడు. అనగా ఎవ్వరితర చింతలు వీడి-నన్నుపాసింతురో వారి యోగక్షేమముల బాధ్యత యంతయు నేనే సహింతునని చెప్పియున్నాడు.
సత్యస్వరూపుడు, సర్వశక్తి సంపన్నుఁడగు భగవానుఁడిట్లు స్పష్టముగ వచించియుండ తద్వాక్యమును విశ్వసింపక పోయినచో మఱి దేనిని విశ్వసింప వలయునో దెలియకున్నది. కొందఱు కర్మఫల ప్రబోధకము లగు శాస్త్ర వాక్యములను - అర్థ వాదములనియు, వానియందు సత్యము లేదనియుఁ దలంతురు. వారు తలంచుచున్నట్లు సంధ్యానుష్ఠాన మందు లాభ మేమియును లేకపోవుఁగాక! దినమున కిరువది నాలుగు గంటల కాలముండగ నొక గంట కాలమైనను భగవదారాధన రూపముగ విశ్రాంతి శాంతి లభించునుగదా! నిత్యము మానవుఁడు కొంచమైనను కాలమును వ్యర్థపుచ్చుటయే లేదా? కుటుంబపోషణాది కార్యముల కిరువదిమూడు గంటల కాలము చాలదా? పోనీ మానవుఁడు స్వతంత్య్రతఁ బాటించి-లాభాపేక్షతోఁ జేయుచున్న కార్యము లన్నియు నొక్కటిగూడ చెడిపోకుండ సఫలములే యగుచున్నవా? ఎంతటి యవివేకము! పశుపక్ష్యాదులకులేని యుక్తాయుక్త పరిజ్ఞానమును భగవానుడు మానవుల కొసంగియున్నాడు. ఆ జ్ఞానమును దుర్వినియోగ మొనర్చుకొనినచో అథోగతిసంభవించుట తథ్యము-
శ్లో॥ ఉచ్ఛాస్త్రం శాస్త్రతం చేతిద్వివిధం పౌరుషం స్మృతమ్
తత్య్రోచ్ఛాస్త్ర మనర్థాయ పరమార్థాయశాస్త్రితం॥ (జ్ఞానవాసిష్ఠము)
అనగా శాస్త్రము నుల్లంఘించుట, శాస్త్రము ననుసరించుట, అనునవి రెండును పురుష స్వాతంత్య్రములోఁ జేరినవి. అందు శాస్త్రము నతిక్రమించుట యనునది సర్వానర్థములఁ జేకూర్చును; శాస్త్రము ననుసరించుట యనునది పరమసుఖము నిచ్చును. శాస్త్ర మన భగవదాజ్ఞయే గావున శాస్త్రానువర్తి భగవదనుగ్రహమునకుఁ బాత్ప్రుఁడగును.
శ్లో॥ సర్వకర్మాణ్యపిసదా కుర్వాణో మద్వ్యపాశ్రయః
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతపద మవ్యయమ్॥ (గీత 8-58)
అనగా నన్నాశ్రయించి సర్వకర్మలు చేయుచున్నవాఁడు నా యనుగ్రహమునఁ బరమగతి నొందును. జన్మలయందుఁ జేసిన పుణ్య కర్మపరిపాక వశమున పవిత్రమగు భారతదేశ మందిపుఁడుత్త మోత్తమ మగు మానవజన్మ లభించియున్నది, ఇట్టి మహోన్నత శుభ సమయమును దుర్వినియోగ మొనర్చుకొనుట యవివేకము.
శ్లో॥ భూతానాం ప్రాణివశ్రేష్ఠాః పాణినాం బుద్ధిజీవినః
బుద్ధిమత్సు నరాశ్రేష్ఠాః నరేషు బ్రాహ్మణాధమాః
బ్రాహ్మణేషుచ విద్వాంసః విద్వత్సు కృతబుద్ధయః
కృతబుద్ధిపు కర్తారః కర్తృషు బ్రహ్మవాదినః
అనగా భూతములలో ప్రాణశక్తి కనఁబడని యచర భూతముల కంటే ప్రాణశక్తిఁగల చరభూతములు శ్రేష్ఠములు. చరభూతములలో బుద్ధిఁగలవియు, బుద్ధిజీవములలో మానవులును, మానవులలో బ్రాహ్మణాధములును -బ్రాహ్మణులలో విద్వాంసులును-విద్వాంసులలో శాస్త్ర విశ్వాసముఁ గలవారును-శాస్త్ర విశ్వాసము గలవారిలో వేదోక్త కర్మలు చేయువారును కర్మలను చేయువారిలో బహ్మనిష్ఠులును శ్రేష్ఠులు అని చెప్పబడినది.
శ్లో॥ దుర్లభం భారతేవర్షే జన్మతస్మిన్ మనుష్యతా
మానుషే బ్రాహ్మణత్వంచ దుర్లభం సుతరాం మతమ్
విప్రత్వేసతి దుష్ప్రాపా విద్యాదిగుణయోగితా
తత్ప్రన్యాయార్జితార్థాప్తిః తతోభక్త్యాప్తి రిష్యతే॥ (దేవలోక్తి)
అనగా భారతదేశమున జన్మ లభించుట మిక్కిలి దుర్లభము. ఆ జన్మలలో మనుష్యుడై పుట్టుట శ్రేష్ఠము - మనుష్యులలో బ్రాహ్మణుడై పుట్టుట పుణ్యవిశేషము-బ్రాహ్మణులలో విద్యయు సుగుణ సంపత్తియుఁ గలిగియుండుటయు అందులో న్యాయార్జిత ధనజీవనుఁడగుటయు - అందులోను భక్తిఁగలవాఁ డగుటయు మిక్కిలి శ్రేష్ఠము, మఱియు భరద్వాజ మహర్షి లోకవిశేషముల దెల్పుచు - భారతదేశము నిట్లు గడిరచియున్నాడు.
శ్లో॥ భువనేషుచ సర్వేషు భువనంభూః ప్రశస్యతే
తపస్సుకరణం భూమిః భూమిరిత్యాహ శంకరః
అతఏవ జగద్ధాతా లోకేష్వన్యేషు సత్స్వపి
పృథివ్యాం యజ్ఞమకరోత్ పరమేశ్వర తుష్టయే