దీన్నే ఇతివృత్తంగా ‘‘విశ్వనాథ నాయకుడు’’ అనేపేరుతో డా॥ సి. నారాయణ రెడ్డిగారు గేయకావ్యంగా వ్రాసినారు. శ్రీ నరసరామయ్యగారి వీర రస కావ్యం నాటి పండితుల ప్రశంసలనందుకొన్నది.
వీరకంకణం కావ్యాన్ని నరసరామయ్యగారు 4 తరంగాలు (భాగాలు)గా వ్రాసినారు. దీనిలో 48 పద్యాలున్నాయి. కృష్ణరాయల వద్దకు పాండ్యుడు వచ్చి, తన దైన్యాన్ని ప్రకటించుకొని, చోళుని దుస్సాహసాన్ని తన అంతఃపురకాంతను చెరబట్టిన దురాగతాన్ని విలపిస్తూ విన్నవిస్తాడు. చోళపాండ్యులిద్దరూ తన సామంతులే. ఒకరిపై ఒకరు ఒనర్చిన దౌష్ట్యాన్ని అరికట్టి న్యాయం చేయడం చక్రవర్తిగా రాయల కర్తవ్యం. అందుకే వెంటనే నాగమనాయకుని వైపు సాభిప్రాయంగా చూస్తాడు. వెంటనే సన్నద్ధుడై నాగమనాయకుడు చోళునిపైకి దండెత్తి పోయి, భీకర సంగ్రామంలో వాణ్ణి జయించి, చోళపాండ్యరాజ్యాలను రెండిరటిని వశపరచుకుంటాడు. రెండు రాజ్యాలు వశంకావడంతో దుర్బుద్ధి, దురాశలతో తనను తానే రాజుగా ప్రకటించుకుంటాడు. ఈ సంగతి రాయలకు చేరడంతో ఈభాగం ముగుస్తుంది. దీనిలోని కవి రచనా ప్రతిభను ఒక విహంగావలోకనం (ఏరియల్ వ్వ్యూ) చేద్దాం.
రాయల పరాక్రమం, సామ్రాజ్య విస్తరణ, రాజనీతి, ప్రజారంజకపాలన, కళాపోషణ వర్ణనలతో కావ్యం ప్రారంభమైంది. చూడండి:
పృథుల తురుష్కవాహినుల వెల్లువ పెల్లడగిఁచి,శత్రు ని
ర్మథన మొనర్చి, తిమ్మరుసుమంత్రి వివేకము కల్మి, దక్షిణా
పథమఖిలమ్ము శాంతిసుఖభద్రములన్వెలయించి, విక్రమ
ప్రథితుడు కృష్ణరాయనృపభాస్కరుడొప్పు మహఃప్రపూర్ణుడై
కవివరేణ్యుండు, చిత్రలేఖకుఁడు, శిల్పి
గాయకోత్తము డసమాన కౌశలమున
నమ్మహారాజమూర్ధన్యు నాశ్రయమున
సత్కళాలక్ష్మికానాడు స్వర్ణయుగము.
ఇట్టి కాలంలో ఒకనాడు రాజసభలో పాండ్యుడు ముఖంలో దైన్యం తాండవిస్తుండగా భయంతో ఎకాఎకి రాజు పాదాలపై కుప్పకూలినాడు. చోళుని దుర్మార్గం వివరిస్తూ తన భార్యను చెరబట్టిన సంగతి దుఃఖంతో అవమానంతో చెప్పలేకపోతాడు. కవి దాన్ని వర్ణిస్తూ ‘నిత్యపతిభక్తి పరాయణ ధర్మశీలయౌ పావన సచ్చరిత్ర జెరపట్టే మదీయ’’ అంటూ మాట పూర్తి చేయలేడు. దానిని కవి సభికులంతా జాలి పొందినట్లు ‘‘యాపై వచియించ లేక తలవంచె గనుంగవ చెమ్మరింపగన్’’ అని మనకు సన్నివేశాన్ని కన్నులకు కట్టిస్తాడు. వెంటనే రాయలు ‘‘హృదయదారకమైన యాదృశ్యమరసి కటకటంబడి’’ క్రోధంగా నాగమనాయుని వైపు చూసినాడు. ఇక్కడ నాగనమనాయకుణ్ణి వర్ణిస్తాడు కవి.
నాగమనీడు రాయల మనంబునకెక్కినవాడు సర్వ శ
స్త్రాగమ సుప్రయోగ సమయజ్ఞుడు దుర్జయ విద్విషద్వపా
యాగములేన్నియో సలిపినట్టి శతక్రతు సోమయాజి తే
జోగరిమంబునం దసదృశుడయి వెల్గుచు నుండె గొల్వునన్
ముందు జరుగబోయే కథకు ఈ పద్యం చాలా కీలకం. ఎందుకంటే కేవలం తన పరాక్రమపు మదంతోనే నాగమనీడు తన్నుతాను రాజుగా ప్రకటించుకుంటాడు.
ఆ సన్నివేశంలో వాని ఆలోచనలను వివరిస్తూ కవి ‘‘రాజధానికి సుదూరస్థమై ప్రభుసేన కందుబాటున లేనిదగుట దలచి, అనిలోన దన్నెర్కొనజాలు మొనగాడు భూమీశు గొల్వులో లేమిఁదలచి, తన స్వతంత్రత ప్రకటించుకొనె నతండు.’’ రాజధానికి దూరంగా ఉండడం, యుద్ధంలో తనను జయించే వీరుడు రాయల వద్ద వేరొకడు లేడనే మదంతో, విజయ గర్వంతో, చేసిన దుర్మార్గమది. ‘‘పాండ్యచోళ వసుంధరా ప్రాజ్యరాజ్య లక్ష్మీమోహన నవ్య విలాసములను గాంచి నాగమ సేనాని కనులు చెదరి’’
ప్రాయము వచ్చుటాది నృపవర్యుని కొల్వున దందనాథుడై
యాయత సంగరాగ్రముల బ్రాణములొడ్డుచు స్వామిసేవయే
ధ్యేయము గాగ జీవితముఁ దీర్చిన నాగమనాయకుండె, యౌ
రా! యవినీతుడయ్యె -నకృతాత్ముల ప్రాభవ కాంక్ష యెట్టిదో?
జీవితమంతా రాజును సేవిస్తూ, మహావీరునిగా ఎన్నియుద్ధాలలోనో విజయం సాధించిపెట్టి, రాయలకు కుడిభుజంగా కీర్తి పొంది కూడా, నాగమనీడు చివరకు అధికారమునకు, ప్రాభవానికి, సంపదకు వశుడై, ప్రభుధిక్కారము చేసినాడు. ఇది మానవ స్వభావం. యెప్పుడూ మనమే ఊడిగం చేయాలనా? మాకు రాజ్యాధికారం కావాలని కోరుతూ, అవకాశం వచ్చినప్పుడు అధికారం చేజిక్కించు కోవడం అనాదిగా వస్తున్నదే. కాని వాస్తవానికి మనం దానికి తగిన వారమా అనే ఆలోచనే లేకుండా, కన్నుమిన్ను గానక ప్రవర్తించి, తుదకు పతనమై, అవమానాలను పొందడం నాగమనాయకుని శీలానికి మచ్చ. ఇటువంటి మానవ స్వభావ చిత్రీకరణలో కవిది అందె వేసిన చేయి.
వీరకంకణం రెండవ భాగాన్ని గురించి కొంచెం ముచ్చటించుకుందాం! మొదటిభాగం నాగమనాయుని రాజరికపు ప్రకటనం రాయలకు తెలియడంతో ముగుస్తుంది కదా! మరి రెండో భాగంలో ఏమి జరుగబోతుందో అనే ఉత్కంఠ మనందరిలో రేకెత్తిస్తూ రెండవభాగం రాయల సభాభవన వర్ణనతో
నాడు లేవందు సుకవితా నవ్యగతులు
నృత్యములు లేవు లేవు సంగీతములును
బహుజనాకీర్ణమయ్యు నాభవనమెల్ల
పూనియున్నది గంభీరమౌన ముద్ర
అని ప్రారంభమౌతుంది. రాయలు క్రోధంతో కూడిన గాంభీర్యంతో సింహాసనం అధివసించి ఉన్నాడు. పక్కన మంత్రి తిమ్మరుసు కించిదూనపీఠంపై ఆసీనుడై ఉన్నాడు. రాజును వర్ణిస్తూ
ప్రాకట దక్షిణాపథ ధరాతల సర్వజనానుకూల శో
భాకర రాజ్యపాలన వివర్ధిత భాగ్యపరంపరా సదా
లోకన తృప్తముల్ నృపతి లోచన సుందర పుండరీకముల్
కోకనదంబులైనవవిగో! హృదయాశయ దర్పణంబులై
ఇదో గొప్ప పద్యం. దక్షిణా పథమునంతటిని విజయనగర సామ్రాజ్యముగా విస్తరింపజేసి, సిరిసంపదలతో తులతూగేటట్లు, ప్రజలంతా సుఖసంతోషాలతోనున్న పాలన వల్ల కల్గిన తృప్తితో కాంతివంతమైన తెల్లదామరల వలెనున్న స్వచ్చమైన నేత్రాలతో ఎప్పుడూ ఒప్పారెడి రాయలు, ఆనాడు కోపంతో కూడిన ఎర్రని కన్నులతో ప్రకాశిస్తున్నాడు. అవి ఆతని మనసులోని భావాలను, నాగమనాయున్ని తగినట్లు శిక్షించాలనే తీవ్రమైన ఆవేశాన్ని ప్రతిఫలిస్తున్నాయి. ఇక్కడ కవి పదప్రయోగం చాలా వ్యుత్పన్నయుతం.
పుండరీకము = తెల్లతామర
కోకనదము = ఎర్రని తామర
సభికులతో నాగమనాయుని దురాగతం వివరిస్తూ తనను, తన సభలోని వీరులందరిని లెక్కసేయక నాగమనీడు ప్రవర్తించినాడని, వానిని ఓడిరచి, పట్టిబంధించి తెచ్చి అప్పగించిన వీరునికి ‘‘వీరకంకణం’’ బహుమతిగా నిత్తునని ప్రకటించినాడు. కాని ఎవ్వరు ఏమీ పల్కలేదు. అందరికి నాగనాయుని ఎదిర్చడానికి భయమే. ఇంతమందిలో ఒక్కడూ ముందుకు రాకపొవడం రాయల ఆగ్రహానికి కారణమైనది. ‘‘ఒక్క ముదుసలిని బంధించి, తీసుకరావడనికి మేమే స్వయంగా దండెత్తి పోయె దుస్థితికి మా సభ దిగజారిందా’’ అని హుంకరించినాడు. ఆ సమయంలోనే ‘‘యౌవన నవ్య రేఖ సకలాంగములన్ మిఱుమిట్లు గొల్ప, శోభావహమౌ తదీయరుచిరాస్యము హృద్గత దుస్సహ వ్యధావ్యావిలమై, పయోదపటలావృత పూర్ణ హిమాంశు మండల శ్రీ వరియింప, వాడు నిలిచెన్ జగదేక ధనుర్ధర ప్రభన్’ ఒక నవ యువకుడు తీవ్రమైన బాధతో మ్లానమైన ముఖంతో, దట్టమైన మేఘం ఆవరించిన పూర్ణచంద్రబింబము వలె, శౌర్యం మూర్తీభవించినట్లు సభామధ్యంలో అంజలి ఘటించి, నిల్చున్నాడు. ఎవరావీరుడు? నాగమనీని కుమారుడైన విశ్వనాథ నాయకుడే. రాజుతో ‘‘ప్రభువరేణ్య! త్వదీయ పావన పదాబ్జ దాసుడగు వీడొనర్చు ప్రార్థన మొకింత నాలకింపుడు’’ అంటూ తన వంశమంతా రాజభక్తి, ప్రభుసేవలే వ్రతంగా సేవించిందని, ఇప్పుడు తన తండ్రి చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, అవమాన భారంతో కుంగుతున్నాని, ఈమచ్చ మాపుకోవడానికి నాకు అనుజ్ఞనిమ్మని వేడుకున్నాడు.
‘చంచత్ ఖడ్గకళావిలాసమెనయన్ సంగ్రామ రంగ క్రియో
దంచత్ప్రౌఢమిఁజూపి,తండ్రిఁ ద్రుటిమాత్రన్ బట్టిబంధించిమీ
పంచన్ బెట్టెద, గానిచోఁగలిత దీవ్యద్దివ్య దేహంబుతో
బ్రాంచద్విక్రమవీరగమ్యమగు స్వర్గద్వారమున్ దట్టెదన్’
యుద్ధంలో గెలిస్తే తండ్రిని పట్టిబంధించి మీకు అప్పగిస్తాను. మరణిస్తే వీరస్వర్గం అలంకరిస్తాను. అన్న వీరమనాయుని పల్కులకు సభ విస్తుపోయింది. రాజు మెచ్చినాడు. తిమ్మరుసు వీరఖడ్గాన్ని అందించినాడు.
వీరమనాయక! తావక
నీరంద్ర నిసర్గ ధర్మనిష్టారతి యి
క్కారణమునఁ బ్రకటితమై
ధారుణి వెలయించుగాక తంద్రిత యశమున్
అని ఆశీర్వదించినాడు కూడా. ఈ విధంగా వీరమనీడు సర్వ సైన్య సన్నద్ధుడై తంజాపురానికి తండ్రితో తలపడడానికి బయల్దేరి పోవడంతో రెండవ భాగము సమాప్తమౌతుంది.
వీరకంకణంలోని తృతీయ తరంగంలోని కథాభాగంతో పాటు దానిలోని రచనావిశేషాలను చూద్దాం. వీరమనాయడు రాజు ఆజ్ఞ గొని తండ్రిపై దండెత్తి పోవడంతో రెండవభాగం ముగుస్తుంది. ‘‘ధర్మ సంస్థాపనైకతత్పర తపస్వి’’ అని కవి వీరమనాయుని పేర్కొంటూ ఈ భాగాన్ని ప్రారంభించినాడు. ధర్మాన్ని నిల్పడానికే యుద్ధాన్ని ఒక తపస్సుగా భావించి వీరమనాయుడు సిద్ధమైనాడు అని సూచిస్తూ, ధర్మం కోసం రక్తసంబంధం కూడా లెక్కించకున్నాడు అని వీరమనాయుని పాత్రను ఉదాత్తంగా చిత్రీకరిస్తున్నాడు కవి. కావ్యనాయకుని ధీరోదాత్తునిగా, ఉత్తమగుణ యుక్తునిగా తీర్చిదిద్దినప్పుడే కావ్యం చిరకీర్తిని పొందుతుంది. రాయలతో మాట్లాడునప్పుడె తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, వెల్లడిరచినాడు కదా! కేవలం ఐహిక సుఖభోగాలకే వ్యామోహం చెంది ధర్మాన్ని తప్పిన తండ్రిని దండిరచి, వంశానికి తెచ్చిన అపకీర్తిని బాపుతానని రాజుతో పల్కినాడు. అంతేకాకుండా లోకమంతా తనను రాజద్రోహి కుమారునిగా అవమానిస్తున్నదని వ్యథ చెందుతాడు. ఇదంతా కవి చాలా జాగ్రత్తగా కావ్యనాయకుని పాత్రసృష్టిలో చూపిన నేర్పు. ఈ పూర్వ రంగం సిద్ధం చేసుకోవడంతో ఈ భాగంలో వీరమనాయుడు తన లక్ష్యాన్ని అవలీలగా చేరుకోగల్గినాడు. ఇంక ప్రస్తుతానికి వస్తే
ప్రకట పితృభక్తి, నిరుపమ రాజభక్తి
యొండొకటి మించి డెందంబు నిండుకొనగ
జనకు మది మఱలించి రెంటిని భజింప
నతడు తలపోసె విజ్ఞప్తి ననుప దలచి
రాజ, పితృ భక్తులను రెండూ సమానంగా నిర్వహించడమే తనముందున్న కర్తవ్యం. దానికోసం మొదటి యత్నంగా తనతండ్రికి ఒక అభ్యర్థనను పంపినాడు. ఆయన పరాక్రమాన్ని, రాజసభలో ఆతని ప్రాముఖ్యాన్ని ఉగ్గడిస్తూ, ఇప్పటి పనితో తన కీర్తి ప్రతిష్టలు ఎలా నశించినాయో వివరిస్తాడు. పొరపడడం మానవసహజం. దానిని తెల్సుకొని సరిదిద్దుకోవడం వివేకవంతుల లక్షణం. రాజు దయామయుడు. ఇప్పటికేమీ మించి పోలేదు. శరణు వేడి, చోళ పాండ్య రాజ్యాలను అప్పగించమని హితం బోధిస్తాడు. ఈ మాటలను లేఖారూపంలో పంపుతాడు.
కొడుకు జాబును చూసి, నాగమనీడు యెంతో ఆనందిస్తాడు. కాని వెనువెంటనే ‘‘స్వార్థ నటీమణి గజ్జెకట్టి నృత్యంబొనరింప దద్విలసన నాభినయక్రమ మోహితాత్ముడై, లబ్ధరాజ్యము విడువనొల్లక యతండు తనయు తనవైపు ద్రిప్పుకొనదలచి’’ ప్రత్యుత్తరం వ్రాసినాడు. దాన్ని భక్తితో కన్నులకద్దుకొని చదివినాడు మన కథానాయకుడు. ప్రతి చోట కవి జాగరూకుడై నాయకపాత్రకు మెఱుగులు అద్దడాన్ని గమనించడములో మనం విఫలం కారాదు. కావ్యాన్ని చదవాల్సిన తీరిదే. తండ్రిలేఖలోని అంశాలు ఈ విధంగా తెలుస్తున్నవి. నాగమనాయకుడు
తనయా! ధర్మం బనునది
అనుసరణీయంబ విహితమగు నట్టుల; నై
నను ధర్మ నిర్ణయంబది
మనుజుల తరతమత బట్టి స్మర్తవ్యమగున్
ఒక్క నరున కొక్కగేస్తున కొక్క నృపతి
కందరకు ధర్మమొకటిగా నమరి నదియె?
అంతయేటికి కృష్ణరాయల ప్రభుత్వ
మాక్రమించిన విధము ధర్మానుగుణమె?
ధర్మము ధర్మమంచు బహుధావచియించెడు శాస్త్ర చర్చలన్
బేర్మివహించి దాస్యగుణవృత్తికి బాల్పడి యెల్ల కాలమున్
శర్మవిదూరమౌ పథమునంబడి మ్రగ్గుట వీరధర్మమే?
కూర్మి కుమార! యున్నతి గోరి చరించుటనింద్యకర్మమే?’’
భాగ్యదేవత తనకుదావలచి వచ్చినప్పుడూరక శాస్త్ర వాక్యముల కులికి విముఖత వహించి తఱిఁ జాఱవిడుచుకొనిన నభినుతింతురె లోకజ్ఞులైనవారు.
తనయ! యీరీతిగా రాజధాని నుండి
బైటఁబడి వచ్చినందుకు బ్రమదమొదవె
గృతయుగమునాటి ధర్మసంగతిని బోక
వచ్చి కైకొమ్ము రాజ్యసంపదలనెల్ల
అవని వర్ధిష్ణువే యుపాయమునైన
బ్రాభవోన్నతులందుకోవలయునండ్రు
అఖిలశాస్త్రమలేకవాక్యముగ నుడువు
పరమ ధర్మము పితృవాక్యపాలనంబు
నీవునేనును నొకటిగా నిలుతుమేని
మనల నెదిరించు వీరుడిమ్మహిని లేడు;
రాయలొల్లకపోడు మర్మజ్ఞుడగుట
నొల్లకుండిన నతడు చేయునది లేదు
అని కుమారుణ్ని తనవైపునకు మర్లుకొనుటకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. మానవ నైజం ఇదే కదా! తనేం చేసినా సరైనదనే చెప్పడం దానికి పురాణాలనుండి, శాస్త్రాలనుండి రుజువులుగా ఏవేవో చూపడం, అనాదిగా వస్తున్నదే. హిరణ్యకశిపాదులు కూడా తాము ధార్మికులమనే చెప్పుకున్నారు. మనమాటల్లో చెప్పుకుంటే నాగమనాయకుడు కొడుకుతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు.
మనిషి తాను ఉన్న స్థితి, పరిస్థితిని బట్టి ధర్మానికి అర్థాన్ని తనకు అనుకూలంగా మార్చడం, అందరూ తనతో కలిసిరావాలనుకోవడం నేటి కాలంలో ఇంకా విజృంభిస్తూ ఉంది. కలి ప్రభావం. ఏం చేస్తాం? ప్రేమ వివాహాల పేరుతో కులాంతర, మతాంతర సాంకర్యం అంతా ఇప్పుడు ధర్మబద్ధమే. ఈషణ త్రయం; ధన, పుత్ర(పుత్రికా), భార్య వ్యామోహాలకు బానిసలై ధర్మచ్యుతికి పాల్పడుతూ అదంతా కరెక్టని ప్రచారం, ఆడంబరంగా వివాహ వేడుకలు ఏ మాత్రం సిగ్గు శరం, జంకు గొంకు లేక చేస్తున్నారు. వీరిదే మెజార్టి. ఆ వేడుకలకు హాజరయిన వారంతా, పరోక్షంగా ధర్మచ్యుతులే. అట్లే దుర్నీతిపరులైన రాజకీయులు, వ్యాపారవేత్తలు, లంచగొండ్లు ఉద్యోగులు, చివరకు దారుణకృత్యాలకు పాల్పడిన నేరస్తులు కూడా తమదే ధర్మం అంటున్నారు. ఇదే నేటి సంస్కృతి.
అసలు సృష్టి తత్వమే ద్వంద్వంగా పరిభాసిస్తుంది. సుఖం దుఃఖం, మంచి చెడ్డ, చీకటి వెలుగు, విద్య అవిద్య, పాపం పుణ్యం, పక్కపక్కనే వుంటాయి. వాటిని గుర్తించి, వ్యామోహపడకుండా జాగరూకులై సద్వస్తువును గ్రహించడమే వివేకం. ఇదే ధర్మనిరతి. ఇక్కడ కథలో వ్యామోహ పడినవాడు నాగమనీడైతే, వాటికి లొంగనివాడు వీరమనీడు. ఇట్టి వారికే ‘‘ధర్మో రక్షతి రక్షితః’’ అన్న సూక్తి వర్తిస్తుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే తండ్రి జాబు చూసిన వీరమనీడు
సామమార్గముఁబట్టి నిష్ఫలుడనైతి
దానభేదంబులకు నిట దావు లేదు
నృపతి సేవ యనుల్లంఘనీయమగుట
నంతిమోపాయ మిక శరణ్యంబు నాకు
అనుకొని యుద్ధానికి సిద్ధంగా సైన్యంతో రణభూమి ప్రవేశించినాడు. ఈ యుద్ధ సన్నివేశాలను కన్నులకు కట్టిస్తాడు కవి. ఈతనికి పద్యరచనలో గురువు నాటి ప్రసిద్ధ చారిత్రక కావ్యకర్త గడియారం వేంకట శేషశాస్త్రి. వీరి కావ్యం ‘శివభారతము’’ మరాఠా వీరుడు హిందూధర్మ పరిరక్షకుడు శివాజీ మహరాజ్ చరిత్ర. శేషశాస్త్రి గారికి తిక్కన ఆదర్శం. ఆ శైలిలోనే యుద్ధ వర్ణనలు చేసారు. మన నరసరామ కవి కూడా ఆ మార్గంలోనే పయనించినారు. ఒకటి రెండు
ఉదాహరణలు. ‘‘ఆజిస్ఫీత పరాక్రమార్జిత యశుండౌ నాగమన్నీడు తుంగాజా నేయమునెక్కి వచ్చె నపుడుద్యద్విక్రమోదగ్రులౌ పౌజుల్ పౌజులు దీరి తన్నను సరింపన్ ప్రాప్త విశ్వంభరా రాజత్వావన దీక్ష బూని సుతు సంగ్రామంబులో లోగొనన్’’
ఆజి = యుద్ధం; స్ఫీత=విస్తారమైన; అనేక యుద్ధాలలో పరాక్రమార్జిత యశుండు = ఆరితేరి విజయాలతో కీర్తి పొందినవాడు; తుంగ = యెత్తైన; అజానేయము = గుర్రము; ఉద్యత్ = ప్రకాశిస్తున్న; విక్రమోదగ్రులౌ = తీక్షణమైన పరాక్రమం కల్గిన; పౌజుల్ = సైన్యము; బారులు అనేది మఱొక అర్థం. ప్రాప్త విశ్వంభర = లభించిన రాజ్యం; రాజత్వ = అధికారాన్ని; అవన = కాపాడుకోవడమనే; దీక్షపూని; సుతు = కొడుకును; సంగ్రామంబులో = యుద్ధంలో; లోఁగొనన్ = లోబర్చుకోవడానికి;
నాగమనీడు వీరులైన సైన్యంతో, తానంతవరకు గడిరచిన పరాక్రమ కీర్తితో, తనతో రాయల సైన్యం తలపడలేదనే దురహంకారంతో, తాను సంపాదించుకున్న రాజ్యాన్ని యెట్లైనా కాపాడుకోవాలనే తపనతో, తన కుమారుణ్ణి యుద్ధంతోనైనా లోబర్చుకోవాలనే పట్టుదలతో సిద్ధమై యుద్ధానికి వచ్చాడు. ఈ సందర్భంలోని పద్యాలన్నీ రసగుళికలు. ఊరికే చదువుతూ పోతూ రససిద్ధిని పొందవచ్చు.
మునుపు ఫల్గుణ బబ్రువాహనుల కిపుడు
వీరికుదయించె సమరంబు పితృసుతులకు
యెవడు గెల్చునో యిప్పుడే యెరుగ లేము
కాని యానాడు సుతునకే కల్గె జయము’
ఇది యుద్ధానికి ప్రారంభంలో సైన్యం అభిప్రాయం. క్రమంగా యుద్ధం తీవ్రంగా మారింది.
ఆయుధములూని భీకరావహము జొచ్చి
తండ్రి కొడుకుల మనుకొంట తప్పిదంబు
బాహు బలంబులో సమరపాండితిలో ప్రతివీరమర్ద నో
త్సాహములో బరస్పరము దగ్గనివారు జయైక లిప్స న
వ్యాహత సుప్రతాప మహిమాన్వితులై సరిపోరుచుండ న
యావహమంతకంతకు మహత్తరమై భరమయ్యెనయ్యెడన్
ఉరవడిమీరు యౌవనపు టుద్ధతికిన్ రణకేళి చాతురీ
గరిమము తోడుసూప బటుకాండ కఠార కుఠారకుంతము
ద్గరముఖ శస్త్రముల్ సముచిత క్రమ ధాటినిగిడ్చిపుత్రకుం
డురుబలశాలియౌ జనకు నుక్కిరి బిక్కిరి జేసె నార్చుచున్
రామువిభూతికిన్ బరశురాముని సత్వమువోలె బ్రోదయ
త్తామర సాప్తు దీప్తికి సుధాకరు తేజము రీతి విక్రమో
ద్దాముడు ధీరుడౌ సుతుని ధాటికి నాగమనీని భూరి బా
హామహిమంబు సర్వమడుగంతగ జొచ్చె గ్రమక్రమంబుగన్
బాహుబలమెల్ల లుప్తమై పట్టు సడలి
జాఱు కరవాలు దన సర్వ సారమూది
పట్టి గెలుపాసలుడిగియు స్వాభిమాన
ముడుగ కఱిముఱి బెనగుచుండె నతడు
అదను గుర్తించి వీరమాహ్యయుండు మించి
తత్కృపాణము నెగజిమ్మి తత్‌క్షణంబ
తురగమును గూల్ప నాతండు త్రుళ్ళిపడుచు
ధరణిపై వ్రాలె, విధ్వస్త కరణుడగుచు
ఈ విధంగా యుద్ధం ముగిసింది. కాని ఇప్పట్టున విశ్వనాథ నాయకుని పితృభక్తిని ప్రకటించే అద్భుతమైన పద్యంతో ఈ భాగం ముగుస్తున్నది.
రణజయశాలియయ్యు గుణరమ్యుడు వీరమనాయకుండు, త
త్‌క్షణంబ హయంబుడిగ్గి వసుధాగతుడౌ తన తండ్రికిం బ్రద
క్షిణమొనరించి వందనము జేసె బదంబుల నంటి -ధీవిచ
క్షణుఁడెపుడేని దుస్స్మయ వశంబున నౌచితి విస్మరించునే
వీరకంకణం చివరి భాగము నాల్గవ తరంగం 23 పద్యాలతో కూడి ఉన్న రచన. నాగమనీని బంధించి రాయల సమ్ముఖానికి తీసుకువచ్చిన వీరమనాయకుని వర్ణిస్తూ - ‘‘అనితర ప్రభుభక్తి జనకునితో బోర ఘనరణదీక్ష గైకొనినవాడు, రణదీక్ష విపుల విక్రమమున జాతురి జూపి విజయ సిద్ధిని గాంచి వెలుగు వాడు, జయసిధ్ధి గాంచియు స్మయదూషితుడు గాక వినయ సంపత్తి దీపించువాడు, వినయంబుతో సర్వజనుల సన్నుతులొంది ద్విగుణిత కీర్తితో వెలుగు వాడు’’
సాటిలేని రాజభక్తితో తండ్రితో పోరాడవలెనన్న ధర్మ దీక్షతో యుద్ధం చేసి, పరాక్రమంతో విజయం సాధించి మహావీరుడైన తండ్రిని బంధించి తెచ్చినా ఏ మాత్రం అహంకారం లేక, జనులందరి మెప్పుపొంది గొప్ప కీర్తి పొందినవాడుగా వీరమనీని పేర్కొన్నాడు కవి. వినయం చాలా గొప్ప గుణం. నీతి శాస్త్రం ‘‘విద్యా దదాతి వినయం; వినయాత్ యాతి పాత్రతాం; పాత్రత్వాత్ ధనమాప్నోతి; ధనాత్ ధర్మం; తతః సుఖం’’ అని పేర్కొంటుంది. దీని అర్థం:
విద్య వినయాన్నిస్తుంది. వినయం వల్ల అర్హత పొందుతారు. అర్హత ధనాన్ని, దానితో ధర్మాన్ని దానివల్ల సుఖాన్ని పొందతారు. నిజమైన విద్య వినయాన్ని పెంపొందిస్తుంది. అహంకారాన్ని పెంచడానికి విద్య తోడ్పడరాదు. కాని అనుభవంలో చూస్తే వినయం ఎవరికో సహజంగా అలవడుతుంది. వారు సుకృతులు. అవసరానికి తెచ్చిపెట్టుకున్నది వెంటనే బైటపడక తప్పదు. లేదా అసమర్థత, భయంవల్ల చూపేది వినయం కాదు. అశక్త దుర్జనులు వీరు. అసలైన వినయం భగవద్గీత చెప్పే నిర్మమత్వమే. పద్మపత్రమివాంభసా తామరాకుపై నీటి బొట్టు మాదిరి దేనికి తగుల్కొనకుండ, కేవలం స్వధర్మాన్ని నిర్వహించడమే. ఈ అంశాలన్నీ వీరమనాయునికి సరిపోతున్నై. తిరిగి కథలోకి వస్తున్నాం. రాజుతో ‘మీ ఆజ్ఞ మేరకు తండ్రిని జయించి తెచ్చినాను. ధన్యుడనైనాను’’ అన్న వీరమనాయునికి వీరకంకణం బహూకరించబోగా మీ దయ చాలు. బహుమానం వద్దు. అంటూ అవమానభారంతో దుఃఖిస్తున్న తండ్రిని చూపుతూ నాతండ్రి తనకు అసహజమైన రీతిలో ఈ సభలో దోషిగా నిల్చున్నాడు. ఆతని అపరాధాన్ని మన్నించమని కోరినాడు. నాగమనాయుడు కూడ రాయల పాదాలపై బడి శరణు కొరినాడు. రాజు కన్నులలోని భావాన్ని గ్రహించి, వెంటనే తిమ్మరుసు లేచి, ‘‘నీవు రాజ్యానికి చిరకాలం చేసిన సేవలను గుర్తించి, నీకుమారుని ప్రార్థనను బట్టి, రాజు నిన్ను క్షమిస్తున్నాడు’’ అని ప్రకటించినాడు. రాయలు పాండ్యుని చూచి ‘‘వీరమనాయునికి నీ కుమార్తెతో వివాహాన్ని నిశ్చయించినామని వెంటనే జరుగవలెను’’ అని చెప్తూ వీరమనాయుని వైపు చూస్తే ‘‘వాడు నునుసిగ్గుతో తలవంచెనపుడు’’ మహావైభవంగా పెండ్లి జరిగింది. రాయలు కానుకగా పాండ్యరాజ్యానికి రాజుగా వీరమనాయున్ని అభిషేకించినాడు. అప్పటినుండి వీరమనాయుడు ‘‘విశ్వనాథ నాయకుడు’’గా కీర్తిపొందినాడు. ఇదీ కథ. ఈకావ్యం చివరి వాక్యం కూడా నాయకుని ‘‘ధర్మదేవతవిభూతికి దానొక లక్ష్యభూతుడై’’ అనే శీల వర్ణననే చేస్తుంది. కవి కావ్యమంతా అనుస్యూతంగా ధర్మాచరణకే తన కావ్య నాయకుడు కట్టుబడినట్లు చిత్రీకరించి కావ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినాడు.
కాని ఇక్కడ కథా సంవిధానంలో ఒక లోపం ఉంది. ప్రారంభంలో పాండ్యుడు రాయలవద్దకు వచ్చి విలపిస్తూ, తనభార్యను చోళుడు చెఱ బట్టినాడని చెప్తాడు. ఆమె ప్రస్తావన మళ్ళీ ఎక్కడా రాదు. ఇది కవి విస్మరించడం కావ్య మర్యాదకు లోటు. నాగమనీడు చోళుని జయించి, పాండ్యుని భార్యను విడిపించి, భర్త వద్దకు పంపినాడా? లేదా వీరమనీడు తన వెంట ఆమెను తీసుకొని వచ్చి అప్పగించినాడా? పాండ్యుని కూతిరితో వీరమనాయుని వివాహం జరిగినప్పుడు ఈ ప్రసక్తే లేకపోవడం నిజంగా కావ్యనాయకుని పాత్ర చిత్రణలో వెలితిగా ఉంది. రాయలు, తిమ్మరుసు వంటి వారినుండి కూడా ఈ ప్రస్తావనే లేకపొవడం ఇబ్బందిపెట్టేదే. కవి దీన్ని చదువరుల ఊహాకే వదలివేశాడా? తెలియదు. ఎక్కడో ఒక చోట ఒక వాక్యంలో చెప్పి ఉండాల్సింది. కావ్యరచనలో అన్ని అంశాల పై సమాన ప్రాధాన్యత లేకుంటే జరిగే నష్టం ఇట్లే ఉంటుంది.
శ్రీరస్తు
విజ్ఞప్తి
పాఠక మహాశయులారా!
నేను చిన్నప్పటినుండి పద్యములల్లు నలవాటుగలవాడ నైనను, కావ్యము రచించు కవి సర్వవిధముల పరిణతయోగ్యత కలవాఁడై యుండవలయునన్న యభిప్రాయముగల వాఁడనగుట వల్ల నేమియు రచించియుండలేదు. కాని, యొకసారి శ్రీ శివధారత గ్రంథకర్తలు, విశ్రుతనాములు, మహాకవి బ్రహ్మశ్రీ గడియారము వేంకట శేషశాస్త్రిగారి సన్నిధియందు ప్రసంగవశమున నాయీ యభిప్రాయమును వెల్లడిరపగా, వారపుడు అట్లూరకుం డుట యొకవిధమగు స్తబ్ధప్రకృతియని, సుకుమారముగా మంద లించి, వ్యర్థముగా కాలము వెళ్ళబుచ్చక యేదేని నొక చిన్న యితివృత్త మునుగ్రహించి రచనసాగించి యభ్యాసపాటవమున ఫలసిద్ధి నొందవలసినదిగా నాదేశించిరి. భావించి వారికేకలవ్య శిష్యుడనై యుపక్రమించి యింతమాత్రము రచించగల్గితిని. అయినను అన్ని విధముల నల్పప్రమాణముగల దని ప్రకటించదలచియుండలేదు. అంతేకాక రచించినట్లు కూడ నితరులతో జెప్పియుండలేదు. కాని, యొకటి రెండు సంవత్సర ముల యనంతరము మా గ్రామములోని ప్రముఖ భూస్వామి స్వర్గీయ బుడ్డా సీతారామిరెడ్డి గారెట్లో యీ విషయమెఱింగి, నన్ను నిలిపించుకొని మీరొక పుస్తకమువ్రాసినట్లు తెలిసింది. మీరు దానిని బ్రకటించవలయును. ముద్రణమునకు ద్రవ్యము నేనొసంగుదునని యెంతో బలవంతముచేసి వెలువడునట్లు చేసిరి. వారి యభిమానము. సర్వదా స్మరణీయము. పరిమాణమున నల్పమైనదైనను దీనిని ప్రముఖ పత్రికలు ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, భారతి విశేషించి ప్రశంసించినవి. పాఠక మహాశయులు పెక్కుచోట్ల సభలుచేసి, సన్మానించిరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారును నన్నొక కవిగా గుర్తించి సత్కరించిరి. ఎందరో పండితులు, కవులు తమ యామోదమును దెల్పుచు లేఖలు వ్రాసి పంపిరి. అందుకు నేనెంతమాత్ర మర్హుడనన్నది యాలోచననీయము. (అంతయు మహాకవుల ఆశీర్విలసనముగా భావించితిని) అన్నియుఁ బ్రకటించినచో మూలమునకు రెండు మూడంతల గ్రంథము కాగలదని కొన్ని మాత్రమే యిందు బ్రకటించితిని. వారు నాపైఁజూపిన యుదార వాత్సల్యమునకుఁ గృతజ్ఞుడను. ప్రథమ ముద్రణ ప్రతులన్నియు త్వరలోనే యైపోయినను, నేనేదో యితర వ్యాసంగములతో కాలము గడుపు వాఁడనగుటవల్ల పునర్ముద్రణమును గూర్చి అంతగా పట్టించుకొననందున, మూడు నాలుగేండ్లు గడిచినవి. ఇంతలో ద్రోణాచలమున ప్రకృతము నివసించుచున్న నా మిత్రులు నియమ నిష్టాపరులు ప్రముఖులు నగు శ్రీయుత చండ్రపల్లె నారాయణరావుగారికీ విషయము తెలుపగా, వారు శ్రీయుత కొట్రికె కృష్ణమూర్తి గారిని ప్రోత్సహించి, అతని తండ్రి స్వర్గీయ కొట్రికె వెంకటశెట్టిగారి స్మృతిచిహ్నముగా ద్వితీయ ముద్రణము గావించునట్లు చేసిరి. వారి కాయురారోగ్య భాగ్యములు ప్రసాదించు గాక! నని భగవానుని ప్రార్థింతును. ఈ విషయమందేకాక సర్వదా తగిన సలహాలనిచ్చుచు నాయంద వ్యాజాదరము నెఱుపుచున్న సంస్కృతాంధ్రాంగ్ల హిందీ విశారదులు బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి కామావధానిగారికిని, అడిగినదే తడవుగా ఆశంసనము వానియిచ్చి ఆశీర్వదించిన ప్రాచీన ఋషికల్పులు బ్రహ్మశ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ గారికిని విధేయ హృదయుఁడను. ఇందేమైన గుణమున్నచో మీ హృదయమున నాకు సముచిత స్థాన మొసంగవలసినదిగా పాఠక మహాశయులకు విజ్ఞప్తి.
శ్రావణ శుక్ల ద్వితీయ,
పరాభవ సంవత్సరము. పాణ్యం నరసరామయ్య.
శ్రీమత్త్రి పురసుందర్యై నమః
ఆశంసనము
(ప్రథమ ముద్రణమునుండి సముద్ధృతము)
ప్రకృత కాలమునఁ గవితకుఁ బట్టిన దుర్దశ యెంతయ వారింపరానిది - అయినను రససిద్దులగు కవులు మాత్రము కేవలము ఋషితుల్యులనవలయును ‘‘నానృషిః కురుతేకావ్య’’మ్మను నట్లు ‘‘ఏకః శబ్దః సుష్ఠుజ్ఞాతః సమ్యక్ప్రయుంజానో స్వర్గేలోకే కామదుగ్భవతి’’ యనుసూక్తి ననుసరించి చక్కని మార్గమును తెలిసికొని విజ్ఞులగువారు కావ్యములు వ్రాయుచున్నారు. ఇట్టివారు సర్వదా పూజ్యులు - వీరికావ్యము సర్వధా సంస్తవనీయము. భాష ప్రవాహినియై దిక్కులేక యుండు కాలమునఁ జక్కని లక్షణములతోఁగూడిన కావ్యరచనఁ గావించువారు వంద్యులు - ‘‘వీర కంకణ’’మను నీ చిట్టికావ్యము సర్వవిధముల నిట్టి తెగకుఁజేరినది. ఇతివృత్తము చారిత్రకము - సుప్రసిద్ధము - శ్రీకృష్ణ దేవరాయ సంస్థానమున జరిగిన విషయము - వీరరసప్రధానమై యెంతయు ముద్దులొలుకు పద్దెములతో నలరారుచున్నది. ‘‘కవితా వనితాచైవ సరసాస్వయమాగతా’’ యనునట్లు వీరి కవిత వలఁచి వచ్చినది గాని బలాదాకృష్యమాణగాదు. ఇందారంభము నుండి కొసవఱకుఁ జక్కని పదజాలముతో స్వాభావికమగు నడకలతోఁ బద్యములు, హృద్యములై కవియొక్క సరళత్వమును బ్రదర్శించుచున్నవి. అనవసరములగు వర్ణనములజోలికిఁ బోక తగినరీతిగా నడుపఁబడిన యీ కవిత యెంతయుఁ గొనియాడఁదగియున్నది. కావ్య లక్షణము లొక్కింతయు సడలనీక యిందుఁబొందు పఱచుట హర్షింపదగిన విషయము. తండ్రి కొడుకుల యుత్తర ప్రత్యుత్తరములు సంగర రంగమునఁ దండ్రి పల్కిన పల్కులు కుమారుని సమాధానములు మఱిమఱి పఠించి యానందింపఁదగినవిగా నున్నవి. ఇందలి ప్రసాదగుణ మెంతయు నుత్యము, ‘‘కూలికై కుత్తుకను గోసి కొనుటగాదె’’ ‘‘ధీవిచక్షణుఁ డెపుడేని దుస్స్మయ వశంబున నౌచితి విస్మరించునే’’ మున్నగు నర్థాంతరన్యాసములు సమయస్ఫూర్తిని దెల్పుచున్నవి. ‘‘సుకవి మండల తిలకుని ఘన కావ్యమునకు దీటగుసరణిన్’’ అనునది కవియొక్క గొప్పతనమును భావసారళ్యమును దెల్పుచున్నది. ‘‘అన్నముబెట్టినవాని యింటికే యగ్గిరగిల్చినట్లు ‘‘అను భావమును కవియెంత ముద్దుగ సభలోఁ బల్కునట్లు కూర్చెనో? ఇట్లుదాహరణములు చూపఁబూనిన గ్రంథమునంతయు వ్రాయవలసియే వచ్చును. పాఠక మహాశయులు తప్పక చదివి యానందింతురుగాక. శ్రీ పాణ్యము నరస రామకవి యీ కావ్యరచన చేయుటలో రాయలసీమ యందుఁగల కవుల యాత్మానుభవమును సంపూర్ణముగఁ బ్రకటించెననవలయును. రాయలసీమ కవిరాయలసీమ యనునట్లుగ ముద్దులమూట గట్టు పద్యరత్నములఁ దనకావ్యమునఁ బొందుపఱచి యాంధ్ర భోజునకు ముచ్చట లూరించు నీ సీమకీర్తిని వెలయించినాఁడు. కవితాధార యనర్గళమై యొడుదుడుకులులేనిదై సుస్నిగ్ధముగ సాగినది. ఈ కావ్యము పఠించుట కారంభించిన ముగించువఱకునే పాఠకుఁడును నిలుపఁడని నా యాశయము.