శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › ధర్మజ్యోతి — 16

ధర్మజ్యోతి — 16

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 21 / 37

ఈ కావ్య నిర్మాతకిట్లే చారిత్ర కాంశములను సలక్షణ శైలిలోఁ గావ్య రచనమును గావించి భాషకును, దేశమునకును సేవచేయుటకై భగవంతుఁ డాయురారోగ్య భాగ్యముల నొసంగు గాతయని సర్వశక్తి యుక్తునిఁ గోరుచున్న వాడను. రాయలసీమ వాస్తవ్యులగు ధనవంతులు వీరికిఁ దగిన ప్రోత్సాహ మొసంగఁ గలరనియు, సత్కావ్యముల వెలయింప దోడ్పడుదురనియుఁ బ్రార్థించుచున్నాను.

శ్రీ లలితా పండిత వశంవదుఁడు

విలాసము. జనమంచి వెంకటసుబ్రహ్మణ్యశర్మ

శ్రీ

ఆశీస్సు వీరకంకణ కృతి

క॥ శ్రీరస్తు! విమలవర్తన!

సారమతీ! నరసరామశర్మా! నీదు

శ్రీరుచిర వీరకంకణ

మారసికనుఁగొంటి ! మిపుల హర్షముఁగంటిన్‌ ॥

చ॥ సరళము లర్థవంతములు శబ్దములన్‌ బిగువారఁ గూర్చి వ్యం

గ్యరస చమత్క్రి యాద్యలఘుకావ్యగుణంబు లపూర్వ కల్పనా

సరణి నలంకరించి, సరసమ్ముగఁ గావ్యమువ్రాయు నీదు చా

తురియిది వీరకంకణముతోఁ గవి సన్నుతమై వెలింగెడిన్‌ ॥

ఉ॥ రాయలనాటినుండి, కవిరాజుల కావ్యకళా వినోదముల్‌

మ్రోయుచు నింటనింట నలరుంబువుతోఁటలఁ దేంట్లపాటలై

రాయలసీమలో వెలయురా యనుకీర్తికి వన్నె పెట్టుచున్‌

హాయినిగూర్చె నీకృతి తదాత్త, కవిత్వ మహత్వహృద్యమై॥

ఉ॥ పెద్దల యొద్దఁ బుస్తకము విప్పుచు సంస్కృత కావ్యపాఠముల్‌

ముద్దుగనేర్చు కుఱ్ఱఁడవు మొన్నటిదాఁకిపు డప్పుడప్పుడే

పద్దెములల్లు టేమి-రసవత్కృతులన్‌ రచియించితౌర! యే

ప్రొద్దున బుగ్గవుట్టి యిటుపొంగెనో కైత రస స్రవంతియై॥

గీ॥ కరము మాకిది యాహ్లాదకరముచూవె!

నయవినయ గుణగణధామ! నరసరామ!

కృతివగుచు నిట్లె కృతుల భారతిని గొల్వ

శ్రేయము లొసంగి శివుఁడు రక్షించుఁగాక!

ప్రొద్దటూరు, ఇట్లు

వికారి జ్యేష్ఠ శు11లు. గడియారము వెంకటశేషశాస్త్రి

బ్రహ్మశ్రీ కవివర్యులు పాణ్యము సరసరామకవిగారికి... లేఖ - తాము పంపిన కావ్యరత్నము ‘‘వీరకంకణము’’చేరినది.

కావ్యమును నాయోపిన కొలఁది - ఆమూలాగ్రముఁ బరిశీలించితిని. ప్రాతకొత్తల మేలుకలయికగా నుండి, రచనలో, భావములలో నిండుఁదనము కలిగియున్నది ఇయ్యది ప్రచురణార్హమేకాని యుపేక్షింపఁ దగినదికాదు. ఇతివృత్తమా! ఆంధ్రచరిత్రలో సువర్ణాక్షరములలో లిఖింపఁదగిన కృష్ణరాయల కాలమునాటి తండ్రి కొడుకులది - పోకడలా! ప్రాచీ నార్వాచీనముల కలయికగా నున్నవి - రచనయా! ద్రాక్షాపాకమున హృదయమును సూటిగఁ దాఁకునట్లు లోకజ్ఞత పాండిత్యములచే నొప్పుచున్నది - ఇక ప్రజామోదము నందుటలో సంశయింపవలసినదేమి? కనుక త్వరగా ముద్రణ నందింతురని కోరుచున్నాను.

ద్రోణాచలము. ఇట్లు భవదీయుడు,

9-12-1958. తుమ్మలపల్లి కామావధాని

శ్రీః

ఉషస్సులు వెనుక పడగా చీకట్లు మసక వెలుతురులు. నేడు సాహిత్య రంగములో అలముకొంటున్నాయని దురపిల్లేవారికి శ్రీ పాణ్యం నరసరామయ్యగారు రచించిన ‘‘వీరకంకణము’’ ఒక ఆశారేఖ. సరసగుంఫనమైన కవితా సరిత్సారణము ఇంకా పోలేదని అంతర్వర్తినియై జీవనదివలె అది తెలుగు సాహితీసీమలో వర్తిల్లుచునే యున్నదని యిటువంటి కృతులవల్ల బోధపడుతుంది. ‘‘సరళము లర్థవంతములు శబ్దములన్‌ బిగువారగూర్చి వ్యంగ్య రస చమత్క్రి యాద్యలఘు కావ్యగుణంబు’’లతో నలరే యీ లఘు కృతి యలఘు కృతియే.

పద్యముల నడక చాలా చక్కగా చిక్కగా పూర్వకవితల దలపించుచున్నది. అక్కడక్కడ రచయితకు శ్రీనాథుని కవితారీతు లలవడినట్లగుపించుచున్నది. కాగా వృత్తముల పరుగులు నన్నయ నడకల పుణికి పుచ్చుకొన్నది. ‘‘బహుశరణలబ్దచాతురీ ప్రౌఢనొికడు’’ ఇలా హాయిగా నున్నవి. చిట్టచివరి పద్యాలలో ‘‘ధర్మదేవత విభూతికి తానొక లక్ష్యభూతుడై’’ రాజ్యపాలనచేయుచున్నా డనడము కడు చక్కగా గూర్చినాడు.

శ్రీ నరసరామయ్య గారు ఇతోధికముగా సరసమైన కృతులు రచించి తెలుగు సాహితీ మహతిని మరింత ఉదాత్తంగా పలికిస్తే లబ్ధప్రతిష్ఠులు కాగలరు.

26-9-1959. ‘‘కృష్ణాపత్రిక’’

ఇది పద్యకావ్యము. శ్రీకృష్ణదేవరాయల సంస్థానమున జరిగిన విషయమును ప్రధాన వస్తువుగా తీసుకొన్నాడు. వర్ణనలతో పద్యాలను నింపకుండా తగిన పద్ధతులతో కావ్యము నడుచుకొంటూ వచ్చింది. పదజాలములు ముద్దొస్తున్నవి.

‘‘గండర గండఁడాతఁడరికాండయముండయి యేపుఁ జూపుచున్‌

భండన భూమిఁజొచ్చి భుజమండల మండిత మండలాగ్ర ని

ష్ఖండిత శాత్రవప్రకర కంఠశిరః పదబాహు మండలిన్‌

తాండవమాడె నాత్మభట తండములుబ్బ ప్రచండమూర్తి యై॥’’

ఈ విధంగా పద్యాలు తేలికగా నడచిపోతవి.

‘‘వారినిఁజూచి యిట్లనె నృపాలకుఁ డిరదరలోన వీరుఁడన్‌

తీరున కెక్కువాఁడు గనిపింపఁడొకో యొకఁడైనఁగాని యే

మీ రణమన్న నింత భయమే యొక వృద్ధుని దాకిపోరగా

బీరములేని వానికొక పెద్ద కటారియు మీసమేటికిన్‌॥’’

ఇట్లు పద్యములు మనోహరంగా వీరరసంతోనిండి నిబిడీకృతమైనవి. కవిత్వము ఒడుదుడుకులు లేకుండా సాగింది.

10-10-1959. ‘‘ఆంధ్రపత్రిక’’

బ్రహ్మశ్రీ పాణ్యం నరసరామయ్యగారికి విన్నపము:-

ఆర్య! మీరు విశ్వాసముతో పంపిన ‘‘వీరకంకణ’’ కావ్య మందినది. సాంతముగా చదివితిని. మరి చదువ కెట్లుండగలను? మీ రచనయందలి ధారాళమై సుసంస్కృతమైన శయ్య, అందిలి యర్థ భావముల సంయమ భూషిత సౌందర్యమట్లు చేయించినది. మున్ముందు మీ కవిత యింకను రచనా మర్మముల లోతుపాతు లను తెలుగు సహృదయులకు పంచిపెట్టునని నా మంగళాశంస.

తిరుపతి భవదీయుఁడు,

16-8-1959. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ.

శ్రీః

‘‘గుణరసహావభావమున కున్నెలవొ కవితావిలాసినీ

ప్రణయము జూరగొన్న కవిరాజులు పాణ్యమువారటన్న స

త్ఫణితి కిదే యిటీవలి యుదాహృతి నేర్పుఁజెలంగ వీరకం

కణము నిటుల్‌ తరంగములుగా వెలయించితివౌర తమ్ముఁడా!

మ॥ పదముల్‌ పొంకము బింకమున్‌ గదుర భావంబున్నతస్థాయినొ

ప్పిదమై యందము చందమున్‌ మెరయ సద్వృత్తంబు దాత్తంబుగా

కదమున్‌ ద్రొక్కినరీతి శైలి ముదమున్‌ గల్పించు నీకైత నె

మ్మది మెచ్చుం గలిగింపదే నరసరామయ్యా! రసజ్ఞాళికిన్‌॥

20-9-1960. జోస్యము జనార్దనశాస్త్రి.

మహోదయా!

మీరంపిన కావ్యము నామూలాగ్రము చదివితిని. చదువగా, తండ్రిగారి ధర్మజ్యోతి నుండి వెలువడిన మీ వంశ ప్రతిష్ఠను నిల్పుటకు మీరు కట్టుకొన్న వీరకంకణముగాఁ దోచినది. ఇంతటి యుదార సుందరమైన కవితాశయ్యతో సంతరించిన మీ కావ్యము చరిత్ర ధన్యము కాఁగలదని నా విశ్వాసము,

                            __       భవదీయుఁడు,__

__మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, __

రాజమహేంద్రవరము, 14-11-1960.

మహాశయా!

నిర్దుష్ట కవితా సృష్టికి నోచుకొన్న మీరెంతయు చరితార్థులు, ఇంతటి సుందర ప్రౌఢముగా కావ్యము వ్రాయు వారీ నాఁడెంందరో లేరు. మిమ్ము బిగ్గ కౌగలించుకొని నా యానందమును తెలుపువలెనని నా యాశ. ముసలివాఁడను. బైటకు రాలేనివాఁడను. అది యెపుడు కల్గునో.

__తుమ్మలపల్లి సీతారామమూర్తి చౌదరి, __

9-9-1960.

శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః

శా॥ శ్రీమన్మంగళ దేవతా వదన రాజీవాంశుమద్దామము

ద్దామోజ్జృంభితసింహ వక్త్రకలితోద్యన్మానవాకారరే

ఖామంజుస్ఫురణంబు యోగి హృదయాగార ప్రదీపంబుత

ద్భూమాజ్యోతి సమాశ్రయింతు సతతంబున్‌ ధ్యేయసంసిద్ధికై

క॥ శ్రీమన్నవ యౌవన శో

భామంజుల మమృతభాను భాసిత శిరమున్‌

భ్రూమధ్య కలిత తేజో

ధామము యోగాభి గమ్యదైవముఁ దలఁతున్‌॥

క॥ అరుణాచల వర శరణునిఁ

గరుణారస వరుణ లసదగారుని సతత

స్మరణీయ చరణ కమలుని

శరణమ్మునుగోరి, రమణ సద్గురుఁ దలఁతున్‌॥

చ॥ ఘనమగు బోధనొక్క కవిగా, విబుధాదరణంబొకింత నా

కనువుపడంగఁ జేసిన మహా మహితాత్మ మనోజ్ఞమూర్తి మ

జ్జనకునకార్షవర్తన విశాలునకాయత భక్తితోడ వం

దనములు సల్పి యంకితమొనర్చితి దీనిఁ గృతార్థతార్థినై॥

శ్రీరస్తు

ఇది శ్రీకృష్ణదేవరాయల కాలమునాడు జరిగిన కథ - చంద్రశేఖరపాండ్యుని పారద్రోలి, అతని భార్యను చోళరాజు చెరపట్టగా, రాయల ఆజ్ఞతో చోళరాజును జయించిన నాగమ నాయకుడు రాజ్యము పాండ్యునికీయక స్వతంత్రించగా అతని కుమారుడు వీరమనీడు (విశ్వనాథ నాయకుడు) ధర్మప్రాణియై తండ్రి పైకెత్తిపోయి జయించితెచ్చి రాయలముందు నిలిపిన వీరగాథ. తండ్రి కొడుకుల మధ్య జరిగిన యుద్ధకథ. పూర్వము అర్జున బభ్రువాహనులు పోరాడిన కథలో అర్జునుని కోరికపై క్షత్రీయ ధర్మముదలచి బభ్రువాహనుడు తండ్రితో పోరాడినాడు. సోరబ్‌-రుస్తుం కథలోను ఇట్లె విధిచోదితులై తండ్రి కొడుకులు పోరాడినారు. ఆ కథలకంటే నీ విశ్వనాథ నాయకుని కథ మేలైనది. వానిలోలేని ధర్మరక్షాదీక్ష ఇందులో నుండి కథకుదీప్తి కల్గించుచున్నది. ఆ మధ్య వచ్చిన సి.నారాయణరెడ్డిగారి ‘‘విశ్వనాథ నాయకుడు’’ అను కావ్యము పాఠకులు మరచియుండరు. అది యొడలు మరచి చదువుకొనదగిన గేయకావ్యముకాగా, ఇది యొడలు తెలిసి చదువవలసిన వీరకావ్యము. నాల్గు తరంగములుగా విడగొట్టి వ్రాసిన ఈ కావ్యమునకు కర్త ‘‘శ్రీ పాణ్యం నరసరామయ్యగారు’’. ఈయన ఈ కావ్యముతో ఉత్తమశ్రేణి కవిగా ముందుకువచ్చి నిలుచుచున్నాడు.

నరసరామయ్యగారు వ్యుత్పన్నుడు, ఔచితీపరుడు. సంయమము సాధించిన వాడు. తిక్కనాదులయొరవడిలో నడిచెడివాడు. ఈ కావ్యము పరిమాణమున చిన్నదయ్యును గుణమున పెద్దది. కథ తీర్పులోను, మాటల కూర్పులోను, భావముల తీండ్రములోను నైసర్గికమైన సొగసునొకదానిని సాధించినాడీయన. సంస్కృతమైన వాక్కుతో వీరమునకనువగు ఒక ఉల్బణచ్ఛాయ సమాసములు లేకయే ఈయన కవితలో కన్పించును. సభలో రాయల మాటలలోనేమి, నాగమనాయక విశ్వనాథ నాయకుల ఉత్తర ప్రత్యుత్తరములలోనేమి ఔచితి, కర్తవ్యదృష్టి, రాజకీయమైన నేర్పు చక్కగా వెలువర్చుటయేకాదు, ఆయావ్యక్తుల సంస్కారముల నుజ్జీవింప జేసినాడు కవి. ‘‘జననిందుతు నాగమనీని బట్టి’’ అన్న రాయలవాక్కు, వినగానే తిక్కన రాయబార ఘట్టములోని ‘‘తిట్టువాట్లంబోయెడు వారు దైవోపహతులైమున్న చెడియుండుదురుగావునవారిని జెఱుపనుం జులకన’’ అన్న కృష్ణుని మాటలు జ్ఞప్తికివచ్చును. తండ్రికొడుకులు తలపడిన ఘట్టమున నాగమనీని సహజ వాత్సల్యమును కవి సంఘర్షణలోను మరువక స్పృశించి కథలోని వైశిష్ట్యము పాలించినాడు.

చూడుడు:

ఆగ్రహాక్రాంతమగుట తావందులేక

రక్తనాడి కలందె నిద్రాణమైన

మమత యుబుకుచు హృదయకోశమును జేరి

స్పందన మొనర్ప సుతునితో బలికెనిట్లు॥

నాగమనాయకుడు త్రపాశిధిలాక్షరములతో రాయల క్షమాభిక్ష వేడునందాక కథనిట్లే విశిష్టమార్గమున నడిపినాడు. క్రింది పద్యము నరసరామయ్యగారి శైలికిని సంస్కారమునకును మచ్చుతునక.

నాగమనీడు రాయలమనంబున కెక్కినవాడు సర్వ శ

స్త్రాగమ సుప్రయోగసమయజ్ఞుడు దుర్జయ విద్విషద్వపా

యాగములెన్నియో సలిపినట్టి శతకృతు సోమయాజి తే

జోగరింబునం దసదృశుండయి వెల్గుచునుండెగొల్వునన్‌

పట్టువిడువనీక చదివించు భావబంధురమగు కావ్యము పుష్టిగల యిట్టి కావ్యము విద్యార్థులకు పాఠ్యగ్రంథమైన నెంత బాగుండును.

ఆగష్టు, 1960. ‘‘భారతి’’

శ్రీరస్తు

వీరకంకణము

ప్రథమ తరంగము

చ॥ పృథుల తురుష్క వాహినుల వెల్లువ పెల్లడగించి శత్రుని

ర్మథనమొనర్చి, తిమ్మరుసు మంత్రి వివేకముకల్మి, దక్షిణా

పథమఖిలమ్ము శాంతిసుఖ భద్రములన్‌ వెలయించి, విక్రమ

ప్రథితుడు కృష్ణరాయ నృపభాస్కరుడొప్పు మహఃప్రపూర్ణుడై.

ఉ॥ రాణ దలిర్పరాయలు స్వరాజ్య మహోన్నతి కర్థనీతి వి

న్నాణమునం దటాకము లనంతముగా వెలయింప, మంచి మా

గాణములై పొలంబులు నిగారపు బంటలుపండ, నిత్య క

ల్యాణము పచ్చతోరణములం దులదూగిరి మేదినీ ప్రజల్‌.

సీ॥ ప్రత్యక్షరమున శాశ్వత దివ్యభావంబు నలరించి కావ్యంబులల్లినాడు

సహజ స్వరూప నిశ్చలతగొల్పు మనోజ్ఞ వివిధ చిత్రముల రూపించినాడు

భావనాగమ్య లావణ్య రూపములకు శిలలలో స్థిరత గీల్కొలిపినాడు

స్వరసుధార్ణవమీది వరరత్నముల దెచ్చి పిడికిళ్ళతో బంచిపెట్టినాడు.

గీ॥ కవి వరేణ్యుండు, చిత్రలేఖకుడు, శిల్పి

గాయకోత్తముడసమాన కౌశలమున

నమ్మహారాజ మూర్ధన్యు నాశ్రయమున

సత్కళాలక్ష్మి కానాడు స్వర్ణయుగము

చ॥ భుజముల నప్పళించి జగముల్‌ గబళింపగజూచు సద్భట

వ్రజములుగొల్వ గ్రుద్ధమృగరాజ పరాక్రముడై కళింగరా

డ్గజపతి యుక్కడంచి, జయకామిని గౌగిటజేర్చి, పూర్వది

గ్విజయమొనర్చి, సర్వరిపు భీకరుడై వెలుగొందుచుండగన్‌.

ఉ॥ శాంతుడు, చంద్రశేఖరుడు, శత్రుకృతోగ్ర మహాపరాభవ

కాంత హృదంతరుండయి, జగన్నుత పాండ్యకులీనతా కళా

కాంతులు కాటపట్టగు మొగంబున దైన్యముతాండ వింప, భూ

కాంతునిపాద పీఠము నెకాయెకిడాయుచు మ్రొక్కి నిల్చినన్‌

ఉ॥ భూమివరుండు వానిమొగమున్‌ బరికించుచు ‘‘బాండ్యపాలకా

యేమిది! వెంటనొక్క భటుడేనియులేక యభాగ్యురీతి రా

నేమికతంబు? నీకహితమేమియు లేదుకదా? ప్రజాళికిన్‌

సేమమె?’’ యంచు నక్కజముజెందుచునాదృతి బల్కరించినన్‌.

క॥ ‘‘దేవా! యేమని నుడువుదు

క్ష్మావర శాసకులు మీ నిమంత్రణ మహిమన్‌

బావన మధురా రాజ్యము

నేవిధమగు లోటులేక ఏలుచునుండన్‌

ఉ॥ పాలితదుర్ణయుండు, తెగువన్‌ బలగమ్ములబెంచి, చోళ భూ

పాలుడు వీరశేఖరుడు బాలిశవృత్తి గడంగి యేమి పో

గాలమొ వాడకారణముగా మధురాపుర రాజ్యమెల్ల గ

గ్గోలుపడంగజేసి దొసగుల్‌ పచరింపుచు నాక్రమించెడున్‌

సీ॥ అల జగన్మాత మీనాక్షి మందిరసీమ బెడిదంపు సేనకు విడిదిజేసి

ముదితశీల సంపదల స్వాహాచేయు తన సైనికుల దురంతముల సైచి

ప్రతి గృహమ్మునుజొచ్చి పరికించి గాలించి ధనధాన్యములు దోచుకొనగజేసి

యనవసరంబుగా నాబాల గోపాలమడలగొట్టించి దుందుడుకు మీఱి

గీ॥ అభ్రతలచుంబి వప్రశృంగాగ్ర భాగ

భాసమాన త్వదీయ సత్ప్రాభవైక

చిహ్నవీర వరాహలాంఛిత పతాక

గడగి నేలపైబడగొట్టి కాలరాచె॥’’

చ॥ అని వచియించునప్డు హృదయమ్ముననిండి రుషాదవాగ్నిలో

చన యుగళంబునన్‌ సెగలుసల్ల మహీపతి: ‘‘యేమి? చోళ దు

ర్జనుడుస్వతంత్రుడై యటులుసల్పెనె? మృత్యువు జేరబిల్చెనే?’’

యని శిరమూపఁ బాండ్యనృపుఁడంతట నీగతిఁబల్కె ఖిన్నతన్‌॥

ఉ॥ ‘‘ఈవిధమాగడంబు లొనరించుటతోఁ బరితృప్తిఁబోక దు

ర్భావుఁడు వాఁడు నిత్యపతిభక్తి పరాయణ ధర్మశీలయా

పావన సచ్చరిత్రఁ జెఱపట్టి మదీయ’’ యటంచుఁబల్కి యా

పై వచియింపలేక తలవంచెఁ గనుంగవ చెమ్మరింపగన్‌॥

గీ॥ హృదయ దారకమైన యాదృశ్యమరసి

కటకటంబడి నృపతి దుర్గర్వితారి

వీరశేఖర విదళనోద్వృత్తహృదయుఁ

డగుచు వీక్షించె దండ నాయకులవైపు॥

చ॥ నాగమనీఁడు రాయల మనంబునకెక్కినవాఁడు సర్వ శ

స్త్రాగమ సుప్రయోగ సమయజ్ఞుడు దుర్జయ విద్విషద్వపా

యాగములెన్నియో సలిపినట్టి శతక్రతు సోమయాజి తే

జోగరిమంబునం దసదృశుండయి వెల్గుచునుండెఁ గొల్వునన్‌॥

గీ॥ వాని యకలంక నిశ్చల స్వామిభక్తి

వాని బాహార్గళ ప్రతాప ప్రసక్తి

వాని యసమాన కార్యనిర్వహణ శక్తిఁ

దలఁచి నెమ్మది నృపతి సత్తముఁడు పిలిచి ॥

గీ॥ ‘‘వింటివె? నాగమనాయక!

తుంటరియగుచోళు, వాని త్రుళ్ళడఁ గంపన్‌

దంటతనంబునఁ జనుమీ

వెంటంగొని వలసినట్టి వివిధ బలంబుల్‌

క॥ అని పలికి నృపుఁ డొసంగిన

కనకమణీ భూషణాదిక బహూకృతులన్‌

గొని యతఁడుచ్చావచసా

ధనయుతుఁడై యుద్ధవీరదళ నాయకుఁడై ॥

చ॥ అతుకులులేని తెంపున దురాత్ముల కుత్తుక లుత్తరించుటే

ప్రతిదినచర్యగాఁగఁ దలపండిన దంట, నృప ప్రభుత్వ సు

స్థితికొకపట్టుఁగొమ్మ, రణధీరుఁడు నాగమనాయుఁ డుత్తమో

న్నత జవనాశ్వమెక్కి పృతనానివహంబులనెల్లఁ గాంచుచున్‌॥

ఉ॥ ప్రాపగు కృష్ణరాయ నరపాలకు నాజ్ఞవహించి జైత్ర యా

త్రాపరత న్నితాంత ధనధాన్య సమృద్ధము, భాగ్యసీమ, తం

జాపురినేలుసుప్రధిక సార్థకనాముఁడు వీరశేఖరో

ర్వీపతిపైకి దండునడిపెన్‌ భటతండముఁ బ్రోత్సహించుచున్‌

చ॥ అదివిని వీరశేఖరుఁడు దగ్రదురాగ్రహుఁడౌచు సింగపుం

గొదమల జూలువట్టి పడఁగొట్టగజాఁలు మహాపరాక్రమో

న్మదులగు పోటరుల్‌ సమరమండను లాయుధపాణులై భజిం

పఁదనరి పొంచియుండెఁ బ్రతిపక్షులరాక నిరీక్ష సేయుచున్‌

ఉ॥ ఇద్ధపరాక్రముండు ధ్వజినీంద్రుఁడు నాగమనీఁడు సర్వ స

న్నద్ధములైన చోళపృతనాని వహంబులుఁజూచి క్రుద్ధ సిం

హోద్ధతి నార్భటించుచు మహోగ్రనిశాత కృపాణపాణియై

యుద్ధముపక్రమించె రిపుయోధులపాలి సురాలయాధ్వమున్‌

చ॥ అనిమొనఁజొచ్చివైరినిచయంబులఁగూల్చుటొకండుగాక కాల్‌

వెనుకకుఁ ద్రిప్పఁబోని పటువిక్రము లాతని సైనికోత్తముల్‌

ఘనతర భీకరాయుధములంగొని యుద్ధతిమీఱి ‘‘కోబలీ’’

యని పడదూఁకిరందఱులయాంత కృతాంత దురంతమూర్తులై

ఉ॥ గండరగండఁ డాతఁడరికాండ యముండయి యేపుఁజూపుచున్‌

భండనభూమిఁజొచ్చి భుజమండల మండిత మండలాగ్ర ని

ష్భండిత శాత్రవప్రకర కంఠశిరః పదబాహు మండలిన్‌

దాండవమాడె నాత్మ భటతండము లుబ్బఁ బ్రచండమూర్తియై॥

ఉ॥ సాహసమూని మార్కొనినసార బలాఢ్యులకున్‌ సురాల యా

రోహణ తంత్రముఁ గఱపి స్రుక్కిమగంటిమిఁదక్కి సాధ్వస

వ్యాహృతులైనవారికిఁ బలాయనమంత్రమునేర్పి నేర్పుమై

యాహవ పండితుండు గురువయ్యెనతండు సపత్న సేనకున్‌॥

ఉ॥ భారత భీకరాజిఁ బరిపంథి విలుంఠన నిష్ఠురాత్ముడై

స్వైరవిహారముల్‌ సలుపు శాంతనవున్‌ దలపించు విక్రమో

దారుఁడు వృద్ధనాయఁ కుడతండు సమిచ్చర భూతకోటికి

బారణపెట్టె బాహుబల భంజిత శాత్రవరక్త ధారలన్‌ ॥

ఉ॥ ప్రాకటతేజుఁడై స్వభటవర్గముపైఁ బడువాని సాగి రా

నీక యెదిర్చి, త్రోసికొని యేపున వచ్చినవాని జాఱి పో

నీక వధించి, కౌశల సమిద్ధకరాసి కొకింత విశ్రమం

బీక సమీపభూమిఁ జరియించె నరాతులమట్టు పెట్టుచున్‌॥

ఉ॥ వాటమువెంటఁ గేలఁగరవాలము శూలము బాకు బల్లెమున్‌

బాటవమొప్పఁ బట్టిరణపండితఁడై విహరించువాని యా

ర్భాటముఁజూచి స్వీయపరివారము పోటరికంటుఁదక్కి యా

రాటమునొందఁ జోళపతిగ్రక్కునముందుకు దూకియుగ్రుడై

ఉ॥ ‘‘దుర్జయ వీరలోక పటుదుస్స్మయ ఘస్మరులార! విక్రమో

పార్జిత కీర్తులార! సమరావని మీరు పరాక్రమించినన్‌

నిర్జరులైన నడ్డుపడి నిల్వఁగ నోపుదురే’’ యటంచు వి

స్ఫూర్జిత శౌర్యసారములు వోయుచు సేనలనూలు కొల్చుచున్‌

చ॥ ‘‘ఆయుముమూడి ఓముదుకఁడా! యహితాంతకులైన చోళవం

శీయుల భూమిఁజొచ్చితివి; మిత్రులుఁ పుత్రులు గొల్వనింటిలో

హాయిగఁబ్రాణముల్‌ విడుచుప్రాప్తము దేవుఁడునీమొగంబునన్‌

వ్రాయగలేదు; నాకరమునంబడి చచ్చుట నిక్కువం’’ బనన్‌॥

ఉ॥ ఆహతపన్నగ ప్రతిముఁడై యతడుద్ధతుఁడౌచు రేఁగి ‘‘ఓ

కూహకమూర్తి! పొల్లులనుగూయక మూతిని మీసమున్నచో

సాహస ముగ్గపట్టి నిముసంబిట నిల్వుము నీశిరంబుఁ బూ

ర్ణాహుతిఁజేసి యింక సమరాధ్వరహోమముఁ బూర్తిజేసెదెన్‌’’

మ॥ అనితీండ్రిరచి గజంబుపై కుఱుకు సింహంబై విజృంభించి దు

ర్జనుఁడౌ చోళునిఁదాఁకె; వాఁడపుడమిత్ర ప్రాణవాత వ్రజా

శన దర్వీకరభీకరఁసిగొని చంచద్రక్త రేఖాంత లో

చనుఁడై నాగమనీ ని వాజి శిరము జక్కాడెనొక్కుమ్మడిన్‌

క॥ దళితహయుఁడగుచు ధరణి

తలగతుఁడగు నాగమాఖ్యుఁదాఁకి వధింపన్‌

బిలపిల చుట్టును ముట్టిరి

యలఘుతరోత్సాహులగుచు నరి వీరభటుల్‌!

ఉ॥ ముట్టినవిద్విషద్భట సమూహము హుమ్మని బొబ్బరించుచున్‌

నెట్టుచు, మేనిపై నొరయనీక యడాలునఁ దత్కృపాణముల్‌

దట్టుచు, వీరవిక్రమ విదారణ శస్త్రకళా విభూతిఁ జూ

పెట్టుచు, మించిపైకొనుచు, బెట్టిదుఁడై దురమెల్ల ముట్టుచున్‌

ఉ॥ వాలుమగంటిమిన్‌ మునుముబట్టి వధించుచుఁ గాలభైరవో

ద్వేల విహార విస్ఫురణఁ బీనుగుఁపెంటలు గొల్పు తద్భుజా

భీలతకోహటించి యరివీరులు ప్రాణభయమ్ము పెంపునన్‌

గాలికి బుద్ధిసెప్పిరి వికావికలై తలకొక్క దిక్కుగన్‌॥

చ॥ విమతవిమర్ధనోత్సుకత వెక్కసమై సివమెత్తి రోజుచున్‌

సమధిగ సాహసోద్ధతుఁడు నాగమనాయుఁడు వీరలోక దు

ర్ధముఁడగు వీరశేఖరునిఁదాఁకి గదాహతి:ఁ దత్తురంగ మ

స్తముఁ దెగటార్పఁ జోళవసుధాపతి చెంగునదూఁకినేలకున్‌

ఉ॥ ‘‘కాటికిఁ గాళ్ళఁజాచు ముదకండనిసై చితి నింతదాఁక, నీ

యాటలు సాగవింక బడుగా! చెడుగా! యటనిల్వు మొక్క యీ

పోటున నీతనూరుధిరముల్‌ పొలిచల్లెద’’నంచు నార్చుచున్‌

వ్రేటునుగొన్న పెద్దపులిపెట్టున నాగమనీనిపైఁ బడెన్‌॥

గీ॥ ఇరువురు ప్రధాన వీరులు

నిరుపమ శౌర్యాభిమాన నిష్ఠుర హృదయుల్‌

సరిసరిగఁ బోరఁ దొడఁగిరి

వెరువున రణలభ్యమాన విజయోత్సుకులై॥

గీ॥ బహుళరణలబ్ధ చాతురీ ప్రౌఢనొికఁడు

నడిమి ప్రాయంపు గండు తనంబు నొకఁడు

నూఁతఁగాఁగొని ద్వంద్వ యుద్ధోరు సరణిఁ

బెనఁగులాడిరితనువెల్లఁ గనులు కలిగి॥

గీ॥ ఒకఁడు పై కొన నింకొకఁ డొదిగినట్టు

లుండి తఱిఁజూచి తివిరి పే రుబ్బుఁజూపఁ

బ్రతి నిమేషంబు మారుచు వాని వీని

భటుల మొగముల వెలసె సంబరము చెలువు॥

గీ॥ ప్రాణములనొడ్డి తనకొఱకట్లు పోరు

వీరు లిర్వుర సమర విహార మరసి

మురిసి జయలక్ష్మి యేవైపు మ్రొగ్గలేక

యెంతకాలమొ తటపటాయించి తుదకు॥

చ॥ పరభటకాలదండ సమబాహుయుగోన్మిషదుగ్ర విక్రమ

స్ఫురణముఁజూచి, శౌర్యధనశోభిత దుర్హృదహంక్రియానిరా

కరణముఁజూచి, వృద్ధుఁడగుగాకనుచున్‌ గుణరక్తయై జయేం

దిర వరియించె నేండ్లఱువదిన్‌ దలమోసిన నాగమాహ్వయున్‌

ఉ॥ బాహుబల ప్రశస్తి రణవార్థి మధించి జయేందిరా వరా

రోహను గొంచునాప్తు లితరుల్‌ దనియన్‌ సుధఁబంచిపెట్టు నా

శ్రీహరిఁబోలు నాగమయ చెంగట నమ్రత దోఁప నిల్చి దా

సోహమటంచుఁగొల్చె మధురాహ్వయరాజ్యము చోళరాజ్యమున్‌

గీ॥ తరుగుఁజూపని భోగసంతతులఁ బొలుచు

పాండ్యచోళ వసుంధరా ప్రాజ్యరాజ్య

లక్ష్మీమోహన నవ్య విలాసములను

గాంచి నాగమ సేనాని కనులుచెదిరి॥

సీ॥ తనపైనభక్తి తత్పరులైన భటులతో హవణించు నాత్మసైన్యముఁ దలంచి

పర దుర్గమములైన వరదుర్గములు పెక్కు తన చేతిలో నొప్పుటను దలంచి

రాజధానికి సుదూరస్థమై ప్రభుసేన కందుబాటునలేని దగుటఁ దలచి

యనిలోనఁదన్నెదుర్కొనజాలు మొనగాఁడు భూమీశుకొల్వులో లేమిఁదలఁచి

గీ॥ అప్పుడప్పుడే గెలుచుకొన్నట్టి తూర్పు

దేశమున స్వీయవిభుత సుస్థిర మొనర్పఁ

బాటుపడుఱేని కార్య దుర్భరతఁ దలంచి

తన స్వతంత్రతఁ బ్రకటించుకొని నతండు॥

ఉ॥ ప్రాయమువచ్చుటాది నృపవర్యుని కొల్వున దండనాథుఁడై

యాయత సంగరాగ్రములఁ బ్రాణములొడ్డుచు స్వామిసేవయే

ధ్యేయముగాఁగ జీవితముఁదీర్చిన నాగమనాయకుండె, యౌ

రా! యవినీతుఁడయ్యె-నకృతాత్ముల ప్రాభవకాంక్షయెట్టిదో?

ఉ॥ అతని యీదురుద్యమమె యంబుగతంబగు తైలబిందువై

క్ష్మాతలమెల్లఁ బ్రాకి రభసంబునఁ బర్వుచు శౌర్యసాహసో

పేతుఁడు కృష్ణరాయ పృథవీపతి కర్ణముజేరె, నుగ్రుడై

యాతడు భావి కార్యకల నాదరణాతురుఁడయ్యె నయ్యెడన్‌॥

ద్వితీయ తరంగము

గీ॥ సకల సామంతభూపతుల్‌ సచివ వరులు

కవులు గాయకులుద్యోగి గణముఁ గొలువ

భువన విజయ సభాంతరంబున మృగేంద్ర

పీఠమునఁ గృష్ణరాయలు వెలుఁగుచుండె

చ॥ నిరవధి రాజనీతి సరణింగల మల్పులెఱింగి తంత్రముల్‌

నెఱుపుచు రాజ్యపాలన వినిర్ణయచక్రము బొంగరంబుగా

గిరగిరఁ ద్రిప్పజాలు జనగీత సుధీమహిమోన్నతుండు తి

మ్మరుసు మహాప్రధాని నృపమాన్యుఁడు దక్షిణపీఠి నొప్పెడున్‌

గీ॥ నాడు లేవందు సుకవితా నవ్యగతులు

నృత్యములులేవు లేవుసంగీతములును

బహుజనాకీర్ణమయ్యు నాభవనమెల్ల

పూనియున్నది గంభీర మౌనముద్ర॥

ఉ॥ ప్రాకట దక్షిణాపథ ధరాతల సర్వజనానుకూల శో

భాకర రాజ్యపాలన వివర్ధిత భాగ్యపరంపరా సదా

లోకన తృప్తముల్‌ నృపతి లోచన సుందర పుండరీకముల్‌

కోకనదంబులైన వవిగో! హృదయాశయ దర్పణంబులై॥

గీ॥ మూరు రాయరగండఁ డాభూవరుండు

తత్సభాగత వీర బృందములఁజూచి

‘‘యెఱుఁగరే? నాగమన్నీని దురుత’’ మనుచుఁ

బలికె నీగతి గంభీర భాషణముల॥

చ॥ ‘‘కలిగినదిప్పుడీ సదవకాశ’’ మటంచును రాచగద్దెపైఁ

గులుకఁదలంచి యాచెనటి గొంతెమ కోరికయంచు నెమ్మదిన్‌

దలఁపక కండకావరమునన్‌ బ్రకటించె నిజప్రభుత్వ మి

ల్లలికిన మాత్రఁ బండువగునంచుఁ దమిం దలపోసెనేమొకో?

చ॥ ప్రకటవివేక విక్రమ ధురంధరు లిందఱు మీరు దండ నా

యకు, లనురక్తి భక్తివెలయన్‌ సతతంబు భజింప దుర్జన

ప్రకర దురీక్షమై వితతభద్ర తరోన్నత వాసిఁగాంచు మా

మక విభుతాప్రతిష్ఠకిటు మచ్చ ఘటించుట కెన్ని గుండెలో?

ఉ॥ తానొకఁడే పరాక్రమ నిధానము, ధీబలశాలి, యన్న దు

ర్మానము గాకెఱుంగడె, సమస్త మహీతల మొక్కపెట్టునన్‌

బూని యెదిర్చినన్‌ వెఱవుఁ బొందక డీకొనఁజాలు నస్మదా

స్థానమునన్‌ జెలంగు సరదారుల యప్రతిమ ప్రతాపముల్‌॥

ఉ॥ మాకును, మమ్ముఁ గొల్చు నసమాన పరాక్రమసాహసాంకులౌ

మీకును, సైఁపరాని మిడిమేలపుఁ ద్రోవలువట్టి స్వార్థపుం

బోకడఁబోయి రాచఱిక మున్నెలకొల్పిన దుర్మదాంధునిన్‌

బ్రాకృతువానిఁబట్టి గుణపాఠమునేర్ప కుపేక్షసేతురే?

ఉ॥ ఏజగజట్టియైనను సరే! చనుదెంచిరణాంగణంబునన్‌

దేజముఁ దెంపుఁజూపి జననిందుతు నాగమనీనిఁబట్టి మా

యోజను బెంచువానికి, సముజ్జ్వల సాహసమూర్తికిన్‌, యశో

భాజన ‘‘వీరకంకణ’’ ముపాయనమియ్యది, భోగ్యమయ్యెడున్‌

క॥ నిరవద్య వీరశేఖర

బిరుదం, బీభూషణం, బపేక్షించు బలో

త్తరుఁడైనవాఁడు, నా కని

కరమెత్తుంగా కటంచు క్ష్మాపతి పలుకన్‌॥

చ॥ ఎదిగిన నాటినుండి రణమే యెడఁబాయని యింటి పట్టుగా

మెదలిన జీవనుఁడమేయ పరాక్రమ శోభితుండు, బ

ల్లిదుఁడగు నాగమాహ్వయుని ఢీకొన గుండెలులేక తత్సభన్‌

గదిసిన వీరులందఱు మొగంబులు వాల్చిరి వెల్లఁబోవుచున్‌॥

ఉ॥ వారినిఁజూచి యిట్లనె నృపాలకుఁ ‘‘డిరదరిలోన వీరుఁడన్‌

బేరున కెక్కువాఁడు గనుపింపఁడొకో యొకఁడైనఁగాని! యే

మీ! రణమన్న నింతభయమే! యొకవృద్ధునిఁదాఁకి పోరఁగా

బీరములేని వానికొక పెద్దకటారియు మీసమేటికిన్‌’’

ఉ॥ మూఁడవకన్ను పూర్వముగఁ బుట్టిన మేటికైన నాజిలోఁ

బోడిమిఁజూపి మించఁగల భూరిభజాబల జృంభమాణులౌ

ప్రోడల కాటపట్టగుచుఁ బొల్పు వహించిన మా దివాణ మీ

నాఁ డభిమాన పౌరుష వినాకృతమై యిటుగొడ్డువోయెనే?

గీ॥ దక్షిణాపథ సర్వస్వతంత్ర లక్ష్మి

పరిఢవిల్లెడు మా ప్రభుత్వమున నున్న

యోధులందఱు గణనోపయోగమాత్రు

లగుట కెంతయు సంతాప మతిశయించు॥

గీ॥ వాహినీశ్వర మండలేశ్వర పదంబు

లంది కొల్వున మెలఁగు వారిందఱుండి

యొక్క యల్పునికోసమై యక్కటకట

స్వయముగామేమె నేఁడు పోవలయునేమొ॥

చ॥ అనియిటు కృష్ణరాయ వసుధాధిప సింహము, ప్రావృడంబుద

స్తనితముగాగ హుంకరణ సల్పుచు వాకొనినంత లేత జ

వ్వనమున నూఁగు మీసములవచ్చిన వీరరసంబునాగ, న

జ్జనపతి ముందటన్నిలిచి సాగిలిమ్రొక్కె నొకండు దీర్ణుడై

ఉ॥ యౌవన నవ్యరేఖ సకలాంగములన్‌ మిఱుమిట్లుగొల్ప, శో

భావహమౌతదీయ రుచిరాస్యము హృదంతర దుస్సహవ్యధా

వ్యావిలమై, పయోదపటలావృతపూర్ణ హిమాంశు మండల

శ్రీవరియింప, వాఁడు నిలిచెన్‌ జగదేకధనుర్ధర ప్రభన్‌॥

మ॥ ఆతఁడే వీరమనాయకుండ హితబాహా గర్వనిర్వాపణో

ద్ధత నిర్వక్రపరాక్రమక్రముడు, ప్రోద్యద్ధర్మదీక్షా సమం

చిత పుణ్యోదయమూర్తి నాగమ మహాసేనానికిన్‌ బుత్రకుం

డతిలోక ప్రభుభక్తి తత్పరత దృష్టాంతంబు, లోకంబునన్‌॥

గీ॥ ఆలఘుగుణశాలి యాతఁడంజలి ఘటించి

ప్రభువరేణ్య! త్వదీయ పావన పదాబ్జ

దాసుఁడగుఁడొనర్చు ప్రార్థన మొకింత

నాలకింపుఁ డటంచు నీలీలఁ బలికె ॥

ఉ॥ ప్రాకటరాజభక్తి ప్రతిరక్తకణంబున నుగ్గుఁ బాలతోఁ

బ్రాకి, జనస్తుతుల్వడసి పండిన మామక నాయకాన్వయ

శ్రీకిటు సిగ్గుజేటొదవఁజేసెగదా యనువంతఁ దండ్రిపై

నాకు పితృత్వ గౌరవమునన్‌ జరమాంశముగూడ రూపఱెన్‌॥

ఉ॥ ఆగ్గలమైన ప్రేమఁ దనకన్నముఁ బెట్టినవాని యింటికే

యగ్గి రగిల్చినట్లు, భవదాదరణంబున వైభవంబునన్‌

నిగ్గులుదేరి, యిట్టులవినీతి పథంబున సంచరించి మీ

కెగ్గొనరించు స్వార్థపరు, నీమని తండ్రియటంచుఁబల్కుదున్‌

ఉ॥ ఐహిక వైభవోన్నతులకై నిజధర్మముఁదప్పి స్వామికిన్‌