ద్రోహమొనర్చినట్టి నయదూషిత వర్తనుడైన వానికిన్
దేహజుఁ డితఁడంచు ననుఁదేరి కనుంగొని లోకులాడ దే
వా! హృదయంబులో శతసహస్ర శరంబులు గ్రుచ్చినట్లగున్
ఉ॥ పదుగురిలో మెలంగ దలవంపులుగూర్చి దురంత వేదనా
స్పదమగుచున్న యీహృదయశల్యము మూలముఁ బెల్లగించిమీ
సదమలసేవలో మహితశాంతినిఁ జెందఁగనిచ్చగింతు ని
య్యదను ననుగ్రహింపుమధిపా! ప్రభుధిక్కృతినిగ్రహింపఁగన్
చ॥ భవదను శాసనం బమితభక్తి శిరంబునఁదాల్చి భీకరా
హవమున దండ్రిఁదాకి యవురా! యనలోక మపూర్వకల్పనన్
బ్రవిమల రాజభక్తికొక రమ్యతరంబగు వజ్రహర్మ్య మిం
పవునటు గట్టెద బ్రభువరా! యిదికాదన కాదరింపవే॥
ఉ॥ ఆతత ధర్మశీలురు మదన్వయ పూర్వజులైన తాత ము
త్తాతలునిల్పి పుష్పభరితమ్ముగఁ బెంచిన సద్యశోమహీ
జాతము, దుష్టకీటక వశమ్మున మ్రోడగుచుండెఁ, దత్క్రిమి
వ్రాతము వెల్వరించి తొలిరాణ నొసంగ ననుగ్రహింపవే ॥
శా॥ చంచత్ఖడ్గకళా విలాసమొనయ సంగ్రామ రంగ క్రియో
దంచత్ప్రౌఢమిఁజూపి, తండ్రిద్రుటి మాత్రన్‌బట్టి బంధించిమీ
పంచన్ బెట్టెదఁ, గానిచోఁ గలిత దీవ్యద్దివ్య దేహంబుతోఁ
బ్రాంచ ద్విక్రమ వీరగమ్యమగు స్వర్గద్వారమున్ దట్టెదన్
చ॥ గురుతర రాజభక్తి జనకుం డొనరించిన దుష్కృతంబునన్
వఱలువ్యధాభరంబుఁ బ్రతివాక్కున ముద్రితమై మెలంగన
పరమ పవిత్రమూర్తి గుణబంధురుఁ డిట్టులుదాత్త ధీర వై
ఖరి వివరింప నక్కజముఁగాంచిరి భూవరుఁడున్ సభాసదుల్
గీ॥ పరహృదయవేది మంత్రి తిమ్మరుసు వదన
మవని నాథుండపాంగ దృగం చలమున
నరసి, సభ్యుల కాశ్చర్య మతిశయింప
నిశిత ఖడ్గము వీరమనీని కొసఁగి॥
ఉ॥ నీదు ప్రయత్నమియ్యది వినీతచరిత్ర! ధరిత్రిలో, నన
న్యాదృశమోయి! దీనఁ జరితార్థుఁడ వౌదువయేని మీద మా
యాదరణమ్ము పెంపున సమంచిత వైభవమున్ సభాంగణా
సాదిత గౌరవంబు, జనసన్నుతులున్ స్థిరమై తనర్చెడున్ ॥
క॥ వీరమనాయక! తావక
నీరంధ్ర నిసర్గ ధర్మనిష్ఠారతి, యి
క్కారణమునఁ బ్రకటితమై
ధారుణి వెలయించుఁగాక తంద్రితయశమున్॥
ఉ॥ మించిన శౌర్యసంపద సమిజ్జయముం గొనివచ్చి ధన్యతం
గాంచుమటంచు వీడ్కొలుపఁగా, నతడంతఁ బ్రభూతహర్షరో
మాంచితదేహుఁడై, నృపపదాంబుజ పీఠము ముట్టిమ్రొక్కియే
తెంచెఁ జమూసనాథుఁడయి తేజునఁ దంజపురంబుఁ జేరగన్.
తృతీయ తరంగము
గీ॥ ధర్మసంస్థాపనైక తత్పర తపస్వి
వీరమన్నీఁడు సుగుణ విస్తారధనుఁడు
అతుల చతురంగబల యుక్తుఁడగుచు విడిదిఁ
జేసెఁ దంజా పురోపాంత సీమఁజేరి ॥
గీ॥ ప్రకట పితృభక్తి, నిరుపమ రాజభక్తి
యొండొకటి మించి డెందంబు నిండుకొనఁగ
జనకు మది మఱలించి రెంటిని భజింప
నతఁడు తలపోసి విజ్ఞప్తి ననుపఁ దలఁచి॥
క॥ కలమును కాగితమునుగొని
సులలిత హృదయంగతార్థ శోభిత శబ్ద
మ్ములఁజేర్చి సుకవి మండల
తిలకుని ఘనకావ్యమునకు దీటగు సరణిన్॥
చ॥ ‘‘ఘనులగు తండ్రిగారికి-నఖండితభక్తి పురస్సరంబుగా
వినతులొనర్చి మీసుతుఁడు వీరమ నీఁడొనరించు విన్నపం’’
బనుచు నుపక్రమించి నయమారగలేఖ లిఖించె నిట్టు ల
య్యనఘఁడు ధీరసన్నుత సమంచిత ధర్మపథావధానుఁడై ॥
గీ॥ ధర్మ విరహిత మార్గ తత్పరత వచ్చు.
భాగ్యమయ్యది చంచలాభంబుగాక
సుస్థితి వహించి ప్రాభవ సుఖవిభూతి
మనుపనోపునె? సుజన సంభావ్య చరిత!
గీ॥ ఐహికములగు భోగభోగ్యముల నొఱపి
యనుభవించుట కంతగా ననువుగాని
ప్రాయమున నిట్లు పరమ దుర్గమముఁజేయు
పథముఁబట్టుట యుచితమ్మె? భద్రమూర్తి!
ఉ॥ అందఱకన్న మిన్నగ సభాంగణ గౌరవ భాగ్య సంచయం
బందఁగఁజేసి మీపయి నిరంతర మాదృతిఁజూపు రాజసం
క్రందను డెంద మివ్విధముగా రగిలించి కృతఘ్నతాగ్నిలో
మ్రందుటపాడియే? జనసమాజము సంతత మీసడిరపఁగన్?
మ॥ విమలోదాత్త విశేషఘట్టములతో విద్వజ్జన స్తోత్ర పా
త్రముగావెల్గు భవచ్చరిత్రఁ జరమాధ్యాయం బొకండిట్లు శా
స్త్రములున్ సర్వమహీజనుల్ దెగడు రాజద్రోహగాధా విధా
నముతోఁ బంకిలమౌటకున్ వగతునంత స్తాపమే పారఁగన్
చ॥ జరిగినదేదియో విధివశమ్మున ధర్మ విరుద్ధ పద్ధతిన్
జరిగినదేమొకాని, గుణసాంద్రులు త్వాదృశులైన వార లి
క్కరణిఁ జరింతురే? స్వకుల గౌరవమైనఁదలంపకుందురే
భరమగు దుర్యశంబుఁ దలపైనిడుకొందురె శాశ్వతంబుగన్
క॥ పొరపాటు మనుజ సహజము
ధరణీపతి చరణ సన్నిధానము నందున్
జరిగిన దానికి వగచుచు
శరణంబును వేడుటుచిత సంధానమగున్॥
క॥ తఱిఁబట్టి యిది యవశ్యా
చరణీయము విబుధలోక సమ్మత మతమున్
నరపతి క్షమించునేయని
పరికింపకు మతని యెద కృపాజలధిగదే!
గీ॥ అనుచుఁ దన నిశ్చితార్ధమం డచ్చుపడఁగ
వ్రాసి ముమ్మాఱు చదివి చేవ్రాలుసేసి
యుచితనయశాలియొక్క యుద్యోగి వెంటఁ
దండ్రి కడకంపె నీతి నిస్తంద్రుఁడతడు॥
ఉ॥ పంబిన భక్తితో సుతుఁడు పంపిన లేఖనుజూచి దానఁ దో
రంబగు వాని ధర్మగుణరక్తికి నాగమనీఁడుమెచ్చి హ
ర్షంబును జెందియున్ దివిరి స్వార్థనటీమణి గజ్జెఁగట్టి నృ
త్యం బొనరింపఁ, దద్విలస నాభినయక్రమ మోహితాత్ముఁడై
గీ॥ లబ్ధరాజ్యము విడువనొల్లక యతండు
తనయుఁ దనవైపునకు ద్రిప్పుకొనఁ దలంచి
స్వమత మండన యుక్తివాదములతోడ
వఱలు ప్రత్యుత్తరంబును బంపె నపుడు ॥
గీ॥ జనకుఁ డంపిన యుత్తరంబును గ్రహించి
తోరమగుభక్తిఁ గనుల కద్దుకొని తదధి
రోహితార్థ మెఱుంగు కుతూహలమున
స్వగతముగ నిట్టూలద్దానిఁ జదువుకొనియె॥
క॥ తనయా! ధర్మం బనునది
యనుసరణీయంబ విహితమగు నట్టుల, నై
నను ధర్మ నిర్ణయంబది
మనుజుల తరతమతఁబట్టి స్మర్తవ్యమగున్
గీ॥ విపిన దేశములందుంఛవృత్తి మెలఁగు
మౌనులు చరించు శుద్ధ ధర్మప్రవృత్తి
లౌకిక వ్యవహారంబులం జరించు
నట్టి మనవంటివారల కనువుపడునె?
గీ॥ ఒక నరున కొక్కగేస్తున కొక్క నృపతి
కందఱకు ధర్మమొకటిగా నమరి నదియె?
అంతయేటికిఁ గృష్ణరాయలు ప్రభుత్వ
మాక్రమించిన విధము ధర్మానుగుణమే?
గీ॥ రక్తమొడిగట్టి ఘోర సంగ్రామములను
మనము శ్రమియింపఁ దత్పల మహిత సుఖము
ననిశమును గృష్ణరాయలే యనుభవింప
వలయునని బ్రహ్మదేవుఁడు వ్రాసినాఁడె?
గీ॥ రాజనీతిగ నదియు ధర్మంబెయందు
రతని యాజ్ఞను దలఁదాల్తు; రైన యప్పు
డట్టిపని మేముగూడఁ జేయంగరాదొ?
యతని పనులలోఁ గుటిలత్వ మలమలేదొ?
గీ॥ బహుమతులు సూపి శౌర్యంబు బ్రస్తుతించి
మనకు మనలోననే బేధమును ఘటించి
తంత్రములతోడఁ దన ప్రభుత్వంబు నిలుపు
కొనఁదలంచెడు నతని సేవనము ఘనమొ?
ఉ॥ ధర్మము ధర్మమంచు బహుధావచియించెడు శాస్త్ర చర్చలన్
బేర్మివహించి దాస్యగుణవృత్తికిఁ బాల్పడి యెల్లకాలమున్
శర్మ విదూరమౌ పథమునం బడిమ్రగ్గుట వీరధర్మమే?
కూర్మి కుమార! యున్నతినిగోరి చరించుట నింద్యకర్మమే?
గీ॥ భాగ్యదేవత తనకుఁ దావలఁచివచ్చి
నప్పుడూరకశాస్త్ర వాక్యముల కులికి
విముఖత వహించి తఱిఁ జాఱవిడుచుకొనిన
నభినుతింతురె? లోకజ్ఞులైనవారు॥
గీ॥ ధైర్యసాహస శౌర్య నిధానమయ్యుఁ
దరతరంబుల నుండియుఁ బరులపంచఁ
బడుచు రూపఱు నాయకాన్వయము శోభ
వఱలఁజేసితి నొక ప్రభుత్వంబు నిలిపి॥
గీ॥ తనయ! యీరీతిగా రాజధాని నుండి
బైటఁబడివచ్చినందుకుఁ బ్రమద మొదవెఁ
గృతయుగమునాటి ధర్మ సంగతిని బోక
వచ్చికైకొమ్ము రాజ్యసంపదలనెల్ల॥
గీ॥ అవని వర్థిష్ణువే యుపాయముననైనఁ
బ్రాభవోన్నతులందుకో వలయునండ్రు
రాజధిక్కృతి గాదిది : రాజ్యహాని
యాయనకులేక మనము రాజ్యంబువచ్చు॥
గీ॥ ప్రియకుమారక! రాజ్యము వీరభోజ్య
మనెడి సూక్తికి నాయత్నమును గుణంబ
పరమ బలశాలి వీరశేఖరుని నుండి
ఘనరణంబున బలిమిఁ గైకొనిన దగుట॥
గీ॥ అఖిలశాస్త్రములేకవాక్యముగ నుడువు
పరమ ధర్మము పితృవాక్యపాలనంబు
పుణ్యచరితుఁడు శ్రీరామమూర్తిఁ దలఁచి
నడుచుకొనుమింక నీ ప్రయత్నమున నడిచి॥
గీ॥ నీవు నేనును నొకటిగా నిలుతుమేని
మనల నెదిరించు వీరుఁ డిమ్మహినిలేఁడు;
రాయలొల్లకపోఁడు మర్మజ్ఞుడగుట
నొల్లకొండిన నతఁడు చేయునదిలేదు॥
గీ॥ అనుచు లేఖఁబఠించి తదర్ధ మరసి
తండ్రి మనసున ధర్మ కైతవమునంది
స్వార్థపరవృత్తి యిట్లు నృత్యంబుచేత
కుడకి, యాత్మజుఁడొక్క నిట్టూర్పు విడిచి
గీ॥ సామమార్గముఁబట్టి నిష్ఫలుడనైతి
దాన భేదంబులకు నిటఁదావులేదు
నృపతిసేవ యనుల్లంఘనీయమగుట
నంతిమోపాయ మిఁక శరణ్యంబు నాకు!
క॥ అని మది గట్టిపఱచుకొని
ఘనతర భుజసక్త హేతికాంతుల తోడన్
జనకు మది తమము నడఁపఁగ
ననిసేఁతకు వాహినులకు నాజ్ఞ నొసంగెన్॥
శా॥ భేరీ భాంకరణారవంబులు విజృంభింపన్ -సముద్రిక్తులై
బారుల్ దీరి భటావళుల్ నడువ దుర్వారోగ్ర తేజుం డతం
డారోహించి హయంబు సాయుధకరుండై ధర్మపక్షంబునం
బోరాడన్ రణభూమికిన్ జనె జనంబుల్ మెచ్చి కీర్తింపఁగన్ ॥
శా॥ ఆజిస్ఫీత పరాక్రమార్జిత యశుండౌ నాగమన్నీఁడు తుం
గాజానేయము నెక్కివచ్చెనపు డుద్యద్విక్ర మోదగ్రులౌ
పౌఁజుల్ ఫౌఁజులుదీరి తన్ననుసరింపం బ్రాప్త విశ్వంభరా
రాజత్వావన దీక్షఁబూని సుతు సంగ్రామంబులోలోఁగొనన్॥
మ॥ జనకుండంచుఁ గుమారుఁడంచుఁ గల సత్సంబంధమున్ వీడిపం
బిన రోషంబున భీకర ప్రధనభూమిన్ జొచ్చి ప్రత్యర్ధులై
ఘనశస్త్రాంచితహస్తులై విజయకాంక్షం బోరనుంకించి ర
య్యనురూపాహవకర్మ మర్మగులు ధర్మాధర్మ సంప్రేరణన్॥
గీ॥ మునుపు ఫల్గుణ బభ్రువాహనుల, కిపుడు
వీరి కుదయించె సమరంబు పితృసుతులకు
నెవఁడుగెల్చునొ? యిప్పుడే యెఱుఁగలేము
కాని యానాఁడు సుతునకే కల్గె జయము ॥
ఉ॥ వీరమనాయుఁ డప్పుడతివేల మహార్ణవమట్లు పొంగి పెం
పారెడు తండ్రి సైన్యమును నాత్మభటావళితోఁడ జొచ్చి దు
ర్వార పరాక్రమస్ఫురణ బాడబమై వెలుఁగన్ దదీయ వీ
స్ఫారిత విస్ఫులింగముల చందముదోఁచిరి తద్భటోత్తముల్
క॥ ధర్మంబు తనకుఁ దొడుగని
వర్మం ప్రాపుగాఁగఁ బటుతేజమునం
బేర్మి వహించుచు శాత్రవ
నిర్మథనాభీలనిష్ఠ నిష్ఠురుఁడయ్యెన్॥
ఉ॥ నాఁడలతమ్మి మొగ్గరమునన్ జరితార్థుఁడుగాక దేహము
వీడిన సవ్యసాచిసుతు విక్రమము న్మదిమెచ్చ కాహవ
క్రీడల మృత్యు తాండవ పరిక్రమముల్ దలపించువాని నె
వ్వాఁ డెదిరింపలేక పితృపక్ష బలంబులు పర్వె వెన్కకున్॥
ఉ॥ అచ్చపు రాజభక్తి సమరావని వీరరసావతారమై
వచ్చెనొకోయనన్ మెఱయువానిఁ గుమారునిఁగాంచి డెందమ
దచ్చెరువొంది మెచ్చుకొనునంత దురాగ్రహవృత్తి పైకొనన్
జెచ్చెరవచ్చి తాఁకెరఁణసింహుడు నాగమనాయుడంతలో ॥
గీ॥ ఆగ్రహాక్రాంత మగుటఁ దావందులేక
రక్తనాడీ కలందె నిద్రాణమైన
మమత, యుబుకుచు హృదయ కోశమునుజేరి
స్పందనమొనర్ప సుతునితోఁ బలికె నిట్లు॥
గీ॥ ‘‘తనకు మాలిన ధర్మమా’’ యనక నీవు
రాజ భక్త్యభిదాన తంత్రమునఁ జిక్కి
యాత్మ విధ్వంసకరమగు ననికి దిగుట
కూలికై కుత్తుకనుగోసి కొనుటగాదె ॥
ఉ॥ నాయతనంబు నీమదికి నచ్చకపోయినదైనచో నుపే
క్షాయుత మానసుండవయి సర్వముఁజూచుచునుండు మప్పుడా
రాయలు నన్ను దాకి బవరం బొనరింప స్వయంబుగానె వేం
చేయునొ? లేక యన్యు బలిఁజేయునొ యీకరవాల ధారకున్॥
గీ॥ బాలుఁడవు రాజనీతి జంబాలమందు
నడుగు పెట్టుకుమని యిటులాడు చుంటిఁ
దెలియదే నీకు? మత్కరస్థిత కృపాణ
వైరి నిర్భేదన క్రియాపాటవంబు ॥
గీ॥ అనెడు జనకునితో బదులాడుటకును
నతని దుర్వృత్తి మాన్చుట కతనిలోని
వంచనయు గర్వమింత సహించుటకును
నిచ్చగింపక పుత్రకుం డిట్టులనియె ॥
క॥ దైవాంశ శోభితుండగు
భూవరు నాజ్ఞా విధానమును గొల్చుటలో
జీవములనైన విడుచుట
కావంతయు జంక, నింత యరయుము తండ్రీ!
క॥ ఆయుధములూని భీకరాహవముఁ జొచ్చి
తండ్రి కొడుకుల మనుకొంట తప్పిదంబ,
మాటలేటికి నింక యుష్మత్ప్రతాప
మెంత ఘనమైనదో శస్త్రమెత్తుమయ్య!
గీ॥ అనినన్ రోషకషాయితాక్షి యుగళుండై ఫాలనేత్రంబు వి
ప్పిన కల్పాంత పినాకపాణి వికటావేశంబుతో నాత్మనం
దనుపైదూఁకి కృపాణధారలకుఁ దన్మస్తంబు లక్ష్యంబుఁ జే
సిన డాలుంగొని దానిఁదట్టు చతఁడక్షీణాహవ ప్రౌఢమిన్॥
క॥ బెడిదమగు నడిదమున్ గొని
వడిఁద్రిప్పుచుఁ దండ్రిఁదాఁకి బహువిధగతులన్
గడిమిమెయిఁ బోరఁ దొడఁగెను
నుడుకెత్తిన యెడఁదతో మహోద్ధతుఁ డగుచున్॥
ఉ॥ బాహుబలంబులో సమరపాండితిలోఁ బ్రతివీర మర్ద నో
త్సాహములోఁ బరస్పరముఁ దగ్గనివారు జయైకలిప్స న
వ్యాహత సుప్రతాప మహిమాన్వితులై సరిపోరుచుండ న
య్యాహవ మంతకంతకు మహత్తరమై భరమయ్యెనయ్యెడన్
క॥ నిరవధిక రీతి, సమరము
పెరుగుచు భరమౌకొలంది, విక్రమరేఖా
స్ఫురణమునఁ బోరుచుండిరి
యిరువైపుల సైనికుల్ బళీయని మెచ్చన్ ॥
చ॥ ఉరవడిమీరు యౌవనపు టుద్ధతికిన్ రణకేళి చాతురీ
గరిమము తోడుసూపఁ బటుకాండ కుఠార కుంతము
ద్గరముఖ శస్త్రముల్ సముచితక్రమ ధాటినిగిడ్చి పుత్రకుం
డురుబల శాలియౌ జనకు నుక్కిరిబిక్కిరిఁజేసె నార్చుచున్॥
ఉ॥ రామువిభూతికిం బరుశురాముని సత్వమువోలెఁ బ్రోదయ
త్తామర సాప్తుదీప్తికి సుధాకరు తేజమురీతి విక్రమో
ద్దాముఁడు ధీరుఁడౌ సుతుని ధాటికి నాగమనీని భూరి బా
హామహిమంబు సర్వమడుగంటఁగఁజొచ్చెఁ గ్రమక్రమంబుగన్.
గీ॥ బాహుబలమెల్ల లుప్తమై పట్టుసడలి
జాఱుకరవాలుఁ దన సర్వసారమూది
పట్టి, గెలుపాసలుడిఁగియు స్వాభిమాన
ముడుఁగు కఱిముఱిఁ బెనఁగుచునుండె నతడు.
గీ॥ అదను గుర్తించి వీరమాహ్వయుఁడు మించి
తత్కృపాణము నెగఁజిమ్మి తత్‌క్షణంబ
తురగమునుగూల్ప, నాతండు త్రుళ్ళిపడుచు
ధరణిపైవ్రాలె, విధ్వస్తకరణుఁ డగుచు ॥
గీ॥ ప్రాణ భయమున తత్తఱపాటు నొంది
స్వభటులందఱు దిక్కులఁబట్టి పర్వ
విజయ సంరంభులౌ పుత్ర వీరవరుల
నడుమ నేకాకియై చిక్కె నాగమయ్య ॥
చ॥ రణజయశాలియయ్యు గుణరమ్యుఁడు వీరమనాయకుండు, తత్
క్షణమ హయంబుడిగ్గి వసుధాగతుఁడౌ తన తండ్రికిం బ్రద
క్షిణ మొనరించి వందనముఁజేసెఁ బదంబుల నంటి-ధీవిచ
క్షణుఁ డెపుడేనిదుస్స్మయవంశంబున నౌచితి విస్మరించునే?
ఉ॥ అంత స్వయ మీగతి శుభాంతముగాఁ జరితార్థ మౌటకున్
సంతసమొందుచున్ గుసుమశయ్య నమర్చినపల్లకిన్ రణ
క్లాంతునిఁదండ్రినిల్పి జయలక్ష్మి వరించి యతండు మేదినీ
కాంతునిఁ జూడఁగాఁజనె నఖండ జవంబునరాజధానికిన్ ॥
చతుర్థ తరంగము
సీ॥ రాజేంద్ర సంగ్రామ రంగాత్త జయకథా సంగతిస్తుతి పాఠ సముదయములు
ఘనకళానిపుణ సత్కవితా విలాసినీ వివిధహృద్య విలాస విభ్రమములు
నతుల గాంధర్వ విద్యాసార నిష్యంది కల మృదు గంభీర గానగతులు
నటనానుగుణ నదన్నర్తకీ మంజీర కాంచికా కింకిణీ క్వణనములును
గీ॥ వఱలు భువన విజయ సభాభవనమందు
భద్రపీఠిక, దక్షిణా పథనృపాల
సేవితుఁడు కృష్ణరాయలు సెలఁగుచుండె
ననుపమానంద సుప్రసన్నాత్ముఁ డగుచు ॥
సీ॥ అనితర ప్రభుభక్తి జనకునితోఁ బోర ఘనరణదీక్షఁ గైకొనినవాఁడు
రణదీక్ష విపులవిక్రమముఁజాతురిఁజూపి విజయసిద్ధినిగాంచి వెలుఁగువాఁడు
జయసిద్ధిఁగాంచియు స్మయదూషితుఁడుగాక వినయ సంపత్తి దీపించువాఁడు
వినయంబుతో సర్వజనుల సన్నుతులొంది ద్విగుణిత కీర్తితో వెలయువాఁడు
గీ॥ అతఁడు వీరమనీఁడు ధర్మాను వర్తి
తండ్రితోవచ్చి, తత్సభాస్తార దృగళి
పటలి పరివేష్ఠితానన పద్ముఁడగుచు
నృపతి సత్తమునకు నమస్కృతు లొనర్చి ॥
గీ॥ నిత్యశుభదము ప్రభువరా! నిగమసూక్తి
సన్నిభంబగు భవదీయ శాసనంబు
నౌదల భజించి ధన్యుఁడనైతి ననుచు
జనకుని-జూపి నిలిచె హస్తములు మొగిచి ॥
చ॥ జనపతి చంద్రుఁడంతఁ బరిషజ్జనమున్ గని, ధర్మవీరుఁడై
యనుపమ శక్తియుక్తి సమరావని, నాటిప్రతిజ్ఞ మేఱకున్
జనకునిఁ బట్టితెచ్చిన విశారదు వీరమనీని, వీరకం
కణ బహుమానరూప నవగౌరవ భాసితుఁజేయు టొప్పదే?
క॥ అని నుడివి వీరకంకణ
మునుజూపి యుదారప్రేమ పొల్పారువిలో
కనముల వీరమనాయకుఁ
గనుఁగొని జయశాలి! దీని గైకొను మనిన ॥
చ॥ వినయవివేకశీల సముపేతుఁడతండు మహాప్రభూ! భవ
న్మనమునఁ గందళించు నభిమాన పరత్వముగాక వే ఱుపా
యన మిదియేలదేవ! కరుణాలయ! కింకరుఁడైన వీనికం
చును వచియించి దుఃఖవివశుండయి నిల్చిన తండ్రి జూపుచున్
సీ॥ పరమాభిజాత్య సంపన్నంబు నాయక ప్రధిత వంశమునందుఁ బ్రభవమొంది
సతతంబు ధర్మరక్షా దీక్షా వర్తించు భవదీయ సుప్రభుత్వమునఁజేరి
స్వామిసేవా పరత్వమున నింతటివాఁడు లేఁడనఁ గార్యముల్ వెలయఁజేసి
యాస్థానమునఁబోలె నఖిల జనంబులం దతులిత గౌరవోన్నతులఁగాంచి॥
గీ॥ అంచి తుండయ్యు నేఁడిట్టు లదయనియతి
ప్రోద్బలమ్మున నసహజమ్ముగఁ జరించి
కుములు నాతండ్రి! తదపరాధము క్షమించి
మనుప నర్థింతునయ్య! క్షమాసముద్ర!
ఉ॥ నాగమనాయుఁడంత నయనంబుల శోకరసంబఖండ ధా
రాగతిఁ జాలువాఱఁగ, ధరాపతి పాదములంటిపట్టి యీ
యాగడమున్ క్షమించిశరణార్థి జనావన! పూర్వమట్లు నా
పైఁ గృపఁజూపవేయని, త్రపాశిథిలాక్షరసూక్తి వేడినన్॥
గీ॥ ధారుణీపతిలోచనాంతరనిగూఢ
భవ్య కరుణాత్త హృదయ తత్త్వమ్ము నెఱిఁగి
సకల సామ్రాజ్యకార్య నిశ్చయ విధాత
మంత్రి జనశేఖరుండు తిమ్మరుసు లేచి ॥
సీ॥ ఎనలేనిభక్తి పెంపున మున్నొనర్చిన నీసేవ కడు గణనీయమగుట
దురిత సంగతి నిజోద్యోగ ధర్మముమీఱి నట్టి తప్పిదమిది యాద్యమగుటఁ
ద్వదపరాధంబు సర్వముఁజక్కఁదీర్చిన యనఘుఁడీతఁడునీకుఁదనయుఁడగుట
శరణార్థి సంత్రాణ పరతంత్రగుణముహైందవ ధర్మముఖ్య సిద్ధాంతమగుట
గీ॥ నన్నిటినిమించి కృష్ణరాయలు నిసర్గ
సత్కృపామయ మంజుల స్వాంతులగుట
నాగమాహ్వయ! సుప్రసన్నత వహించి
నిన్ను క్షమియించి, రనె నయోన్నిద్ర ఫణితి॥
ఉ॥ భూతల నాయకుండపుడు ‘‘భూరిసమిజ్జయలబ్ధ సద్యశ
స్స్నాతకుఁ డీకుమారుఁడిఁక సాగవలెన్ గద పెండ్లి’’యంచు సా
కూతముగాఁగఁబాండ్యుఁగనుఁగో, నతఁడుత్సుకుఁడౌచులేచి దే
వా! తమ యీప్సితమ్మునకు నన్యముగాఁ జరియించువాఁడనే?
గీ॥ అనుచు వచియింప నాగమాహ్వయునిఁ జూచి
తన్మనోగత సుఖితేంగి తమ్మునరసి
వీరమన్నీనిపై దృష్టివెలయఁజేయ
వాఁడు నునుసిగ్గుతోఁ దలవంచె నపుడు ॥
గీ॥ అమల వంశీయ పాండ్యునేకైక తనయ
నాగమన్నీని యేకైక నందనుండు
దంపతులుగాఁగఁ బరిణయోత్సవ శుభమ్ముఁ
దనరఁగాఁజేసె శుభముహూర్తమున నృపతి ॥
సీ॥ లలితరసాల పల్లవ తోరణములతోఁ బెనఁగొను మణిదామ వితతితోడ
రంగారు ముత్యాల రంగవల్లికలతో మహితమౌ నుద్వాహ మండపమున
భూసురాశీర్వాదములు నవ్యవివిధ మంగళ తూర్యనాదముల్ గడలుకొనఁగ
హితులును వాహినీపతు లాత్మబంధు సంతతులు నాశీస్సుయాక్షతలు చల్ల
గీ॥ కృష్ణరాయ నృపాలలోకేశ్వరుండు
వీరమన్నీని కప్పుడు ‘‘వీరకంక
ణ’’మ్ముతోఁబాటు పాండ్య రాజ్యమ్ముఁ దనదు
స్వాంతము నొసంగెఁ బరిణయోపాయనముగ ॥
గీ॥ మనుజనాథుని సెలవుఁగైకొని యతండు
నవ్యలావణ్య సహజ సౌందర్యరాశి
ప్రేయసీమణితోఁగూడి విపుల భాగ్య
రంజితంబగు మధురాపురంబుఁ జేరె ॥
చ॥ సకలజనుల్ నుతింప నృపసత్తము నానతి ‘‘విశ్వనాథ నా
యక’’పదమున్ వహించి సుగుణాంచితుఁడాతఁడు పాండ్యనామక
ప్రకటమహీతలంబుఁ బరిపాలనఁ జేయుచునుండె నిత్యభా
వుకుఁడయి ధర్మదేవత విభూతికిఁ దానొకలక్ష్య భూతుఁడై ॥
ఇతిశమ్