(ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర)
పద్య కావ్యము
కర్త
పాణ్యం నరసరామయ్య
ముద్రణ
పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు
2022
నరసింహారెడ్డి సామాన్యుడే!
నరసరామయ్యగారి ‘‘స్వాతంత్య్ర వీరుడు’’ గురించి నాలుగు మాటలు. భారత స్వాతంత్య్ర పోరాటం చరిత్రలో 1857 లో సిపాయి పితూరితో ప్రారంభమైనట్లు పేర్కొనబడిరది. దానికి ముందు జరిగిన ప్రయత్నాలను చరిత్ర పరిగణలోనికి తీసుకొనలేదు. అసలు పాఠ్యగ్రంథాలుగా, విశ్వవిద్యాలయాల పరిశోధనలుగా ఉన్న చరిత్రను మనం ఎంతవరకు పరిగణలోనికి తీసుకోవాలనేది చర్చనీయాంశం. ఇది వినేందుకు వింతగా ఉన్నా అది నిజమే! ఎందుకంటే దానిలోని విశ్వసనీయత ప్రశ్నార్థకం కాబట్టి. కూట నీతితో, భేదబుద్ధితో మన సాహిత్య సంస్కృతులను పురాణాలను, ఇతిహాసాలను వేదశాస్త్రాలనన్నిటినీ అశాస్త్రీయాలని, మూఢనమ్మకాలని విదేశీయులు, వారి మానస పుత్రులైన మన మేధావులు, పండితులు, చరిత్రకారులు, విశ్వవిద్యాలయాల పరిశోధకులు, రచయితలు, కళాకారులు వంటి వారంతా ఇంతవరకు ప్రచారం చేసి చేసి మన బుద్ధులన్ని దానికే బద్ధమైనాయి. ‘‘పురాణం పంచ లక్షణం’’ అని కదా నానుడి, సర్గం, ప్రతి సర్గం, మన్వంతరం, రాజ వంశం, అనువంశం. సర్గం అంటే ప్రథమ సృష్టి. ప్రతి సర్గం అంటే మళ్ళీ, మళ్ళీ ప్రళయములేర్పడిన తర్వాత జరిగే పునఃసృష్టి. మన్వంతరం అంటే 71 మహా యుగములు. మహాయుగము అంటే కృత, త్రేత, ద్వాపర, కలి నాలుగు కలిసి యేర్పడేది. 14 మన్వంతరాలకు ఒకసారి మహాప్రళయం ఏర్పడుతుంది. నాల్గవది రాజవంశం. సృష్ట్యాదిలోని సూర్య, చంద్ర వంశ రాజుల చరిత్ర. ఐదవది అనువంశం. కలియుగంలోని రాజుల చరిత్ర. ఈ వివరాలన్నీ భాగవతం, భవిష్య పురాణాలలో ఉన్నాయి. రామాయణ భారతాలు ఇతిహాసాలు. ‘‘ఇతి’’ ‘‘హ’’ ఈ విధంగా జరిగింది అని జరిగిన వృత్తాంతాన్ని చెప్పేవే ఇతిహాసాలు. ఇదంతా భారతీయుల చరిత్ర కాదనడం ఒకపెద్ద కుట్ర, మోసం. సంస్కృతం రాని, తెలియని లేదా తెలిసినా ప్రమాణం కాదనే కుతర్కంతో పురాణాలలోని శ్లోకాలకు అప వ్యాఖ్యలు చేసిన ‘సర్ విలియం జోన్స్’ ‘మాక్స్‌ముల్లర్’ వంటి పాశ్చాత్యులు చేసిన ద్రోహం ఇది. దీన్ని ఖండిస్తూ కోటా వెంకటాచలం, టి.యస్.నారాయణ శాస్త్రి, నడిరపల్లి జగన్నాథ రావు వంటి పరిశోధక పండితుల గ్రంథాలున్నాయి. మనపురాణాలలోని శాస్త్రీయ అంశాలు కొల్లలు. మహాభారత యుద్ధకాలాన్ని సప్తర్షి మండల గమనంతో లెక్కించి నిర్ణయించినారు. అంతెందుకు? పంచాంగాలలో సృష్ట్యాది గతాబ్దాః అంటె సృష్టి ప్రారంభమైనప్పటినుండి ఇప్పటి వరకు జరిగిన సంవత్సరాలు అని 195,00,00,061 గా లెక్కిస్తారు. అట్లే కలియుగాబ్దాః అంటే కలియుగంలో ఇప్పటి వరకు జరిగిన సంవత్సరాలు 5121, శాలి వాహనశకాబ్దాః అంటే శాలివాహన శకంలో జరిగిన సంవత్సరాలు 1943 అని లెక్కిస్తూ రాస్తున్నారు. అట్లే విక్రమార్కుడు, యుధిష్టిరుడు వంటి శకకర్తలున్నారు. వీరెవరినీ చరిత్ర కారులనబడేవారు ఒప్పుకోరు. అసలు భారతీయులకు చరిత్రే లేదు అని హేళన. వారిని ప్రమాణంగా తీసుకొన్న మన చరిత్రకారులది అదే బాట. ఫలితంగా అసలైన చరిత్ర మరుగున పడిపోయింది. వక్రీకరించబడిరది. స్వాతంత్య్ర పోరాట చరిత్ర కూడా అట్టిదే. 1875 ముందున్న పోరాటాలను అస్సలు పట్టించుకోలేదు. భారతదేశ వ్యాప్తంగా ఇట్టి యెందరో విస్మృత వీరులు భరత మాత విముక్తి కోసం జీవితం చివరిక్షణం వరకు సాహసంతో పోరాడి ప్రాణత్యాగం చేసినారు. నేటి మన కావ్య నాయకుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి కూడా అట్టివాడే. పాణ్యం నరసరామయ్యగారు మొట్టమొదట ఆ వీరుని చరిత్రను పద్యకావ్యంగా సంతరించినారు. అప్పటివరకు కేవలం చుట్టుపక్కల పల్లెటూర్లలో జనసామాన్యంలో పాటలుగా కథలుగా ప్రచారంలో ఉండేది. అట్టి కావ్యాన్ని గురించి తెల్సుకుందాం.
ఈ కావ్యం 4 ఘట్టాలుగా 302 పద్యాలలో వీరరసాన్ని చిప్పిలజేస్తూ సాగిన రచన. కవి కావ్య ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా నాటి మేటి వీర రస కావ్యం ‘‘శివభారతం’’ రచనా శైలిని అనుకరిస్తాడు. శ్రీ గడియారం వేంకట శేషశాస్త్రిగారు వీరికి పద్య రచనలో ఆదర్శం. ‘‘ఉత్తమ కవితాగుణ సంపత్తికి గాణాచియౌచు పాఠక కోటీ చిత్తంబుల లోగొను రసవత్తర శివభారతంబు భావింతు మదిన్’’. ఇదీ కవికి శివభారతము పైనున్న గౌరవం. తనకావ్యాన్ని కూడా ఆస్థాయి లోనే తీసుకరావలనే తహతహ రచనలో కనిపిస్తుంది. ప్రతి కవికీ ఇది ఉంటుంది. ఉండాలి కూడా. ఉన్నప్పుడే రచన రసవత్తరం అవుతుంది. ఒక మహాకవి బాటలో నడవడం అసిధారా వ్రతమే! ఎందుకంటే కవి తాను సాధించి, సేకరించుకున్న తన ప్రతిభా పాండిత్యాలు, వ్యుత్పన్నత, వివిధశాస్త్రీయ పరిజ్ఞానం వంటి యెన్నెన్నో విషయాలను, తన కావ్యంలో కథాసంవిధానం, పాత్రచిత్రణ, రసపోషణ, ఆలంకారిక రచన మొదలైన వాటినన్నింటిని ఔచితీ భంగం లేకుండా కావ్య రచనలో ఇమిడిరచడం అనేపని నిర్దుష్టంగా చేయగల్గినప్పుడే సహృదయుల (కవితో సమానమైన హృదయం కలిగిన వారు) మెప్పు బడయగలరు. ఇక్కడ ‘‘రసం’’ అంటే ఏమిటో కొంచెం మామూలు మాటల్లో తెలుసుకుందాం. కావ్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, లేదా నాటకం, సినిమా వంటి వానిని చూస్తున్నప్పుడు ఆయా పఠిత, శ్రోత, వీక్షకులకు సన్నివేశానికి తగిన మానసిక అనుభూతిని కల్గించడం. దీనికి కథ, మాటలు, సంగీతం, పాత్ర ధారులైన నటుల నైపుణ్యం; వీటిన్నన్నిటిని తగు పాళ్ళలో మేళవించిన ఆ కవి, సూత్రధారి, దర్శకుని ఆలోచనా పద్ధతి, వ్యక్తీకరణా నైపుణ్యం కారణమైతాయి. ఇక్కడ ప్రాణులన్నిటిలో సమానమైన కొన్ని జీవధర్మాలతో పాటు మానవునికే ప్రత్యేకమైన కొన్ని మానసిక, బౌద్ధిక లక్షణాలు ఆధారమైతాయి. ఆకలి, నిద్ర, భయం, కామవాంఛ, కోపం, ఉత్సాహం, దుఃఖం, వంటివే కాకుండా, శాస్త్రీయ, వైజ్ఞ్ఞానికాంశాలు కూడా కళాత్మకంగా చేర్చడంవల్ల చదువుతున్న, వింటున్న, చూస్తున్నప్పుడే ఆయా అనుభూతులను పొందడమే రసము పుట్టించడం అంటే! దీన్ని భరతముని నాట్యశాస్త్రం నుండి యెన్నేన్నో ఆలంకార శాస్త్ర గ్రంథాలు వివరించినాయి. గ్రీకు రోమన్ కవుల దారిలో ఇంగ్లీషు కవులు, సంస్కృత కవుల దారిలో తెలుగు కవులు పయనించి సాహిత్యాన్ని సుసంపన్నం చేసినారు.
కథా భాగంలో ప్రవేశిస్తే ఘట్టములననుసరిస్తూ విమర్శిద్దాం. అసలు ఈ విమర్శ పదము చాలా చిత్రమైనది. అద్భుతమైనది. ‘‘విమర్శ రూపిణీ విద్యా’’ అని లలితా పరాభట్టారిక ను స్తుతిస్తారు. ప్రకాశ విమర్శ బిందువులుగా శివ శక్తులను పేర్కొంటారు. అవే సత్,చిత్. ఉన్నది, ఉన్నట్లు తెలిసేది. దాన్నే స్ఫురణ అంటాం. అదే అమ్మవారు. స్ఫురణకూ, స్ఫురణ రాకపోవడానికీ కారణం అదే! మనమంతా ఆ స్ఫురణతోనే, ఇంకా మాట్లాడితే ఆ స్ఫురణగానే ఉన్నాం. అనంతంగా సాగుతున్న అనేక కోట్ల స్ఫురణలే మనం. దీన్ని గురించి వ్యాస భారతంలో కర్ణపర్వములోని ఒక సన్నివేశము గుర్తుకొస్తున్నది. కర్ణుడు అర్జునునితో పొరాడుతున్నాడు. దాదాపు చివరిదశలో ఉంది ద్వందయుద్దం. బ్రహ్మాస్త్రం ప్రయోగించాలను కున్నాడు కర్ణుడు. కాని దాని అధిష్టాన దేవతా మంత్రం గుర్తు రాలేదు. అస్త్రాలన్నీ తపస్సు ద్వారా గురుముఖతః పొందాల్సి ఉంటుంది. వాటిని మంత్రశక్తి తోనే ప్రయోగించడంగాని ఉపసంహరించడంగాని జరుగుతుంది. శస్త్రాలు అంటే గద, కత్తి, శూలం వంటి ఆయుధాలు. ఉపదేశం పొంది సాధించ వలసినవి అస్త్రాలు. కేవలం బాణాలు కావు. కర్ణునికి మంత్రం స్ఫురించక పోవడానికి కారణం పరశురాముని శాపం. కాని సారథియైన శల్యునితో ‘‘బ్రహ్మాస్త్రం న మే స్ఫురంతి చ’’ - బ్రహ్మాస్త్రం నాకు స్ఫురించడం లేదు అని అంటాడు. అప్పుడు శల్యుని నోట వ్యాస భగవానుడు పల్కించిన మాట చూడండి. యెంత అద్భుతంగా ఉందో! ‘‘కథం స్ఫురతి? స్ఫూర్తిః అర్జున రథే తిష్ఠతి’’ - ఎట్లా స్పురిస్తుంది? స్ఫూర్తి అర్జునుని రథంలో ఉందిగదా! పరమాత్మ అర్జునుని రథంలో సారథిగా ఉన్నాడు. ఒక అర్జున రథానికే కాదు. మొత్తం భారత యుద్ధానికే సారథి కదా! ఈ మాటా పొరబాటే! సర్వజగన్నియంత కదా ప్రభువు. దీన్నే యోగశాస్త్రం వాక్కుకు మూల స్థానమైన ‘‘పరా’’గా పేర్కొంది. ఈ స్ఫురణ లేనప్పుడు జడమే! ఇది మనకు బాగా అర్థం కావడానికి నిద్ర కొంతవరకు పనికొస్తున్నది. ఇంకా బాగా పనికొచ్చేది కోమా. సరే! ఈ గోలంతా ఇప్పుడెందుకు?అని కదా ప్రశ్న. చెప్తా. కావ్యరచనలోని గుణదోషాలను మనకు తోచినట్లు కాకుండా పూర్వ కవుల, ఆలంకారికుల ప్రమాణాల మేరకు లేక్కించాలంటే వాటి పరిజ్ఞానం ఉన్నా ఇప్పటికిప్పుడు అవి స్ఫురించి, సమన్వయించ గల్గడమే విమర్శ.
స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల అధికారాన్ని ధిక్కరించి, వారి అధికారిని కోవెలకుంట్ల తహసీల్దారును వధించడం వరకు ప్రథమ ఘట్టం.
నరసింహారెడ్డి చెంచుమల వంశానికి దత్తు పోయినాడు. నొస్సం కోట పాలకుడు జయరామిరెడ్డి ఆనాటి అందరి పాలకులవలెనే ఆంగ్లసామ్రాజ్యానికి దాసోహమన్నాడు. వారితో సామరస్యంగా ఉంటూ వార్షిక భృతి ‘తవర్జీ’ పొందుతుండేవాడు. ఇతనికి పురుష సంతానం లేదు. వారసునిగా దౌహిత్రుడైన నరసింహారెడ్డిని దత్తు గైకొన్నాడు. వీరిది మజ్జరి వంశం. రేనాడుగా పేరు పొందిన ప్రాంతం కుముద్వతీ నదీ జలాలతో సుసంపన్నంగా విలసిల్లుతుండేది. ఈ నదికే కుందూ అని, కుందేఱు అని పేళ్ళు. మన కావ్యనాయకుని జన్మస్థలం రూపనగుడి గ్రామం. బాల్యమంతా ఉయ్యాలవాడ, గుళ్ళదుర్తి గ్రామాలలో గడిచింది. ఈ గ్రామాలన్ని దగర దగ్గరగా 5, 6 మైళ్ళ పరిధిలో ఉన్నవే. రేనాటిప్రజల లక్షణాన్ని వర్ణిస్తూ కవి
ఆత్మగౌరవమునకు నావంతయేని
భంగపాటొనరించినవాని బట్టి
పంతమున మట్టుబెట్టెడు నంతవరకు
బట్టుపట్టుట వారి స్వభావ గుణము
ఇదే మన కావ్యనాయకునిలో మూర్తీభవించింది. ఆతని గుణగణరూప వర్ణలతోనే మనకు ఒక నేపథ్యాన్ని అందిస్తున్నాడు కవి.
‘‘శైశవంబాది తగిన శిక్షణము నొంది
తనకు నుచితములైన విద్యలను నేర్చి
మొలకమీసంబు మొగముపై పొటమరించు
నాటికే పెక్కు కళల నిష్ణాతుడయ్యె’’
‘‘యెంతయుద్దండుడో యంత శాంత మూర్తి
యెంతటి శఠుండొ యంతటి మృదుల హృదయు
డెంత నిష్కృష్టభావుడొ యంత విశద
వర్తనుండు పరిస్థితిని బట్టి యతడు’’
‘‘వైరమొదవిన యప్పుడెవ్వానికైన
ఫాలనేత్రంబు విప్పిన శూలపాణి
తన్నుజేరిన విహిత బృంద ములకెల్ల
సవిధముననున్న్ కల్పవృవృక్షం బతండు’’
అతనికి దగ్గరి గ్రామం క్రిష్టిపాడులోనున్న వెంకటసుబ్బయ్య అనే హనుమదుపాసకుడు పురోహితుడు. సాహిత్య గురువు ఓబుళాచార్యుడనే వైష్ణవ పండితుడు. ఆతని పాలనలోని ప్రజాభిమానం
‘‘కరవాలు నడుము డాపల
ధరియించి తురంగమెక్కియ తత్ప్రాంత మిలం
జరియించుచు బాగోగుల
బరికించుచు ప్రజలకాత్మ భాంధవుడయ్యెన్’’
ఒకసారి కోవెలకుంట్ల తహసీల్దారు వద్దకు తన సహచరుని వార్షిక భరణం తెమ్మని పంపినాడు. ముందుగనే ఒకసారి జరిగిన ఘర్షణను పురస్కరించుకొని ఆ అధికారి నరసింహారెడ్డిని తీవ్ర పదజాలంతో తూలనాడ్తూ
‘‘దాసరిక్రింద కూడ నొకదాసరియా యని యీసడిరచి యా
దాసరి వచ్చి మమ్మడిగి ద్రవ్యము గైకొనవచ్చటన్న న
చ్చో సమయజ్ఞు డై యతడు సుంతయు మారువచింప కుండవి
చ్చేసి సమస్తముం దెలియజేయగ రెడ్డి మహోగ్ర హూగ్రుడై’’
వాని తల నఱకకుండ తాను భోజనం చేయనని ప్రతినబూని
‘‘నీవు పలికిన రీతిగా నిజముగాను
దాసరిని సుమ్ము నరసింహదైవమునకు
నీకుమాత్రము కాలసన్నిభుడసుమ్ము
తెలిసికొను మింత రేప యేతెంతు నేను’’
అంటూ తహసీిల్దారుని వధించేందుకు సమీప గ్రామమైన ‘కలవటాల’ నుండీ 200 మంది బోయ సైన్యాన్ని పిలిపించినాడు. వీరిని వర్ణిస్తూ
‘‘అనిమొన నేనునేననుచు నాత్రము జెందెడివారు, వైరులం
దునుముట గాకయింకొకటితోచని వారలు, బొయవారు పే
ర్చినతమితోడ వెందవిలి రెడ్డి తురంగము వెంట ‘‘కో బలీ’’
యని పెడబొబ్బవెట్టుచును సాయుధులై చనుదెంచిరందఱున్’’
ఒడ్డె ఓబన్న అనే వీరుడు రెడ్డికి అంగరక్షకుడు. సైన్యంతో ప్రవేశించిన రెడ్డిని జూచి కోవెలకుంట్ల పట్టణం భీతిల్లింది. నిర్మానుష్యంగా మారింది. వీరిని జూచి తహసీల్దారుని కాపలా సైన్యం భయంతో ఆయుధాలు పారవేసి పరిగెత్తినారు.
తనసైన్యాన్ని హెచ్చరిస్తూ స్త్రీబాలవృద్ధులను బాధించరాదు. ఆస్తులకు నష్టం కల్గించరాదని చెప్పినాడు.
‘‘మీరెవరైనగాని మితిమీరి చరించుచు స్త్రీలపై దురా
చారమొనర్పరాదెవరివిత్తము పూరియుగూడ ముట్టరా
దేరికి నూరకే భయమొకింతయు గొల్పగరాదటం చసా
ధారణ ధీరవర్తనుడతండు వచించుచు బంపినంతటన్’’
ఇది కవి అభిమాన కావ్యం శివభారతంలో శివాజీ తన సేనాధిపతి మాందేవుని హెచ్చరిస్తూ ‘‘మా యాజ్ఞన్ గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయుస్సూత్రములీవె త్రుంచుకొనెదో ఔద్ధత్యమోర్వన్ జుమీ’’ అంటూ కొపం కట్టలు తెంచుకొని ‘మా శాసన ధిక్కారానికి శిక్షగా ప్రాణాలు పొగొట్టుకొంటావా’ అని గర్జిస్తాడు. దీనికి కారణం అతడు బీజాపూర్ పాలకుని ఓడిరచి, రాణివాసాన్ని బంధించి తేవడం. ‘‘స్త్రీలు భూజంగమ పుణ్యదేవతల’’ని స్తుతిస్తూ వారిని అవమానిస్తే మరణదండనమే అని తీవ్రంగా నియమించినాడు.
ఇక్కడ నరసరామయ్య కవి గూడ ఇదే ఆదర్శాన్ని తన కావ్యనాయకునికి ఆపాదించినాడు. సరే! కార్యాలయమంతా వెదకి తాహశీల్దారుని వధించినాడు రెడ్డి. తరువాత ధనాగారం(ట్రెజరీ) కొల్లగొట్టడానికి పొతే, అక్కడకాపలాదారు ఖడ్గధారియై, కూర్చొన్నాడు. ఇంత జరుగుతున్నా మొక్కవోని ధైర్యసాహసాలతో తన కర్తవ్య పాలనజేస్తున్న బుందేల్‌ఖండ్ క్షత్రియవీరుడు బొందిలి నారసింగు అతడు. వాణ్ణిచూసి ఆశ్చర్య ఆనందాలను పొంది, వాని ధర్మదీక్షను కొనియాడి, తనసైన్యములో జేరి భరతమాత స్వాతంత్య్రానికి పోరాడమని ఆహ్వానించినాడు. కాని జీతబత్తెములను ఇంతకాలం తిని, కుటుంబపోషణ చేసుకుంటూ, ఇప్పుడు తీరా సమయము వచ్చినప్పుడు ప్రాణం కోసం పారిపోవడం ధర్మం కాదన్నాడు.
‘‘ప్రాణభయమున గర్తవ్యపాలనంబు
నుండితొలగుట మమకానూనకీర్తి
సారబుందేలుఖండ సుక్షత్రియాన్వ
యులెరుగని కొంగ్రొత్త పాఠమయ్య’’
అన్న వీరుని విధిలేక వధించి కోశాగారాన్ని స్వాధీన పర్చుకున్నాడు. తహశీల్దారుని తలను ఖండిరచి, బల్లెమునకు గుచ్చి పట్టణవీథులన్నీ ఊరేగించినారు. కడకు అక్కడ కొలువున్న శ్రీరంగనాథ స్వామిని సేవించి తన గ్రామానికి చేరడంతో ఈఘట్టం ముగుస్తుంది.
కడప మండలాధిపతి ఆంగ్లేయుడైన కాక్రేన్ అనువాడు నరసింహారెడ్ది తిరుగుబాటు తెలిసి, వెంటనే సైన్యాన్ని అతనిపైకి పంపినాడు. కాని ఆ సైనికులు ప్రాణాలరచేత బెట్టుకొని ఉయ్యాలవాడ పరిసరాలలో నిలచినారు. వారంతా భారతీయులు. అందుకే వారిని బెదిరించి పంపాలని తలచి వారితో
‘‘పెద్దపులినైన విడిచేత బిట్టడిరచి
కోరలను బీకజాలిన వీరవరుల
కాకరంబగు నిచ్చోట కలవి గాని
పనిని సాధింప దలపోసి వచ్చినారొ’’
‘‘ఈ నడిగడ్డ పైకి బగయెత్తుచు నెవ్వడు గాని వచ్చి కా
లూనగరాదటం బెరుగరో? మరిమీరలెఱుంగకున్నచో
నేనేరింగింతు నొక్కతృటి నిల్వుడటంచును హుంకరించి పం
చాననమట్లు దూకుచు రయంబున వారిని డాయబోయినన్’’
అంటూ వారిమీదకు హుంకరిస్తూ పోయినాడు. అది చూసిన ఆంగ్లేయ సైన్యం భీతిల్లి -
‘‘అడుగో వచ్చుచునున్నవాడు, నరసింహారెడ్ది కల్పాంత కృన్మృడ భీమార్భటి తో’’ అని పారిపోసాగినారు. కాని రెడ్డి బోయ సైన్యం వారిని అడ్డగించి తమ నాయకుని ముందు నిలబెట్టినారు. రెడ్డి వారితో ‘‘మొదటి తప్పౌట మిమ్ము నిప్పుడు క్షమింతు, నెన్నేడేగాని యిటు వత్తురేని నింక బ్రాణములు మేన నిల్వబోవను యథార్థమెరిగి మెలగుడు’’ అని హెచ్చరించి వారి ఆయుధాలను, గుర్రాలను, ఇంకా యుద్ధసామాగ్రిని స్వాధీన పరచుకొని, వారిని ప్రాణాలతో వదలి వేసినాడు. కాని భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాడు. నొస్సం కోటను కట్టుదిట్టం చేసుకున్నాడు. అగడ్తలు, బురుజులు సిద్ధం చేసినాడు. గొసాయి వెంకన్న అనెడి అంజన సిద్ధుడు ఆకుమళ్ళ గ్రామవాసి. అతనికి ఏడు పరువుల దూరం వరకు (14 మైళ్ళు) జరిగే సంగతులన్నీ తన అంజన ప్రభావంతో తెలుసుకోగలడు. అవసరమైతే కత్తిపట్టి యుద్ధములో విజృంభించగలడు కూడా. అతనిని తనవద్దే నిలుపుకున్నాడు. ఔకు ప్రాంతపు పాలకుడైన నారాయణ రాజును కలిసి తనతో కలిసి ఆంగ్లేయులను ఎదిర్చమని కోరినాడు. కాని దానికి అతడు సమ్మతించక ‘‘బలవత్ప్రభుత్వము పైనిం బహిరంగ విప్లవంబొనరింప బూనుటుకు ముందు, స్థిమితముగా నరయగవలయు దేశకాల స్థితులన్.’’
‘‘భారత దేశమెల్ల నొకవ్యక్తిగ సంఘటితంబునొంది, పెం
పారెడు పూన్కితో గవిసినప్పుడు గాక, యపార యుద్ధ సం
భార పరీత భూరి పరివార విరాజితులైన యా బ్రిటీష్
వారినడంపనౌనె తెగువన్ మనమిర్వురమెంత పోరినన్’’
అనిమరలింపజూచినా మన రెడ్డి వినలేదు. ధన సహాయం జేస్తానన్నా తీసుకోలేదు. తనయత్నాలు మానలేదు. ముక్కమళ్ళ, ముదిగోడు, కానాల, సంజామల వంటి పరిసర గ్రామాలనుండి బోయ సైన్యం సమకూర్చుకున్నాడు.
కానీ ఆంగ్లేయాధికారులు మళ్ళీ సైన్యంతో నొస్సం కోటనుముట్టడిరచినారు. వారికి అధిపతి వాట్సన్. వారిని ఎదుర్కొనడానికి వడిసెలవారు, విల్లంబుల వారు, తుపాకీ సైన్యం వంటి విభాగాలతో ఆంగ్లేయుల నెదిరించినాడు.
కొన్నాళ్ళు కోటలోనికి ఆహారం పోకుండా అడ్డసాగినారు ఆంగ్లేయులు. వారికి బళ్ళారి నుండి రావలసిన మందుగుండు సామాగ్రిని రానీయక అడ్దగించినాడు ఔకురాజు. మిత్రుని తంత్రనీతికి ఆనందపడినాడు రెడ్డి. వెంటనే కోట ద్వారాలు తెరిపించి ప్రత్యక్షయుద్ధానికి సిద్ధమైనాడు.
యుద్ధ వర్ణనలో తిక్కన, శివభారత కర్తలను ఆదర్శంగా గైకొని మన కవి కృతకృత్యుడైనాడు.
‘‘అందినవానినెల్ల హతమార్చుచు, నందనివానికోసమై
ముందునకేగుచున్ సమరభూమి, విలుంఠిత శత్రు కంఠని
ష్యందకవోష్ణరక్తకలితాంగకుడై...’’ విజృమ్భించాడు రెడ్డి.
‘‘కచ్చకు కాలుదువ్వి రిపుకాండము భీకర భండనంబునన్
ద్రచ్చి, తదీయ రక్తముల స్నానములాడుట కుత్సహించు, న
య్యచ్చపు బోయదండు...’’ సైన్యమిటువంటిది. ఇంకా
‘‘తొడ బల్ గొట్టుచు, బొబ్బరించుచును, శత్రు శ్రేణులంజీల్చి న
ల్గడలన్ ముట్టుచు, వైరియోధమథనోగ్రస్ఫూర్తి వాతంబు వెం
బడి, గేలం గరవాల తోమర గదా భల్లాదులం దాల్చి, బి
ట్టడరం బోరగజొచ్చిరందరు రణవ్యాపార పారీణతన్’’
‘‘దక్షవాటిభయానకోద్దండమూర్తి,
వీరభద్రుని యపరావతారమనగ,
జండతేజుడు, రెడ్డివీరుండు, సమర
తలము పీనుగ పెంటగా సలుప దొడగె’’
ఇటువటి యుద్ధం విదేశీయులకు కొత్త. రెడ్డి సైన్యం ధాటికి యుద్ధం విడిచి పారిపోయినారు. విజయదరహాసంతో కోట జేరినాడు రెడ్డి. ఈవిధంగా ద్వితీయఘట్టం ముగిసింది.
నొస్సంకోట నుండి అహోబిలమునకు కొద్దిదూరంలోనున్న నల్లమల్ల అడవిలోని తమ పూర్వులు నిర్మించిన దుర్గానికి మారినాడు. ఇది దట్టమైన అడవి మధ్యలో ఉంది. ఎవరూ రాలేరు. ఇక్కడి ప్రాంతీయ వనరక్షణాధికారి (రేంజర్) ఒక ఆంగ్లేయుడు. చాలా దుర్మార్గుడు. పేదప్రజలను అడవిలోనున్నవాటిని తెచ్చుకోనివ్వడు. వారి ధన, మాన, ప్రాణాలను హరించేవాడు. రుద్రవరంలో ఉండేవాడు. వాని దౌష్ట్యం విన్న రెడ్డి, వానిని మట్టుబెట్టడానికై ఒడ్డె ఓబన్నను తోడుగా తీసుకొని పోయి, వాని బంగళాలో దూరి ‘‘నీ దురాగతాలకు నేటితో చెల్లు, నిన్ను వధించి ఈ ప్రాంత ప్రజల వెతలు దీరుస్తాను, నిన్ను కాపాడే వాడు ముల్లోకాలలో లేడు’’ అని అరుస్తూ కలియదిరుగుతున్నాడు. ఇది ముందే పసిగట్టిన ఆ నీచుడు భార్యా బిడ్డలనువదలి, పారిపోయి గ్రామంలోని ఒక చాకలి వాని ఇంటిలో దాగుకున్నాడు. అది తెలిసి బైటకు లాగి,
‘‘ఆయుధమేటికంచు, హుంకృతి నొనరించి, ముష్టి పయికెత్తి
శిరంబున గ్రుద్దగా, ధరం జతికల గూలి తత్‌క్షణమే చచ్చెను
నెత్తురు నోట గ్రక్కుచున్...’’
ఈ విధంగా వాని పీడ ఆప్రాంత జనులకు వదిలింది. ఇక్కడ ఒక విశేషం. ఆ రజకుడు తన్ను కాపాడమని ఏడుస్తూ కాళ్ళపై బడిన ఆంగ్లేయుణ్ణి మాసిన బట్టల మూటల కింద దాచిపెట్టి, రెడ్డితో తనకు తెలియదని చెప్పినాడు. కాని వాని మరణాన్నీ కోరుకున్న ఒకడు తెల్పిన సమాచారముతో రెడ్డి వాణ్ణి కనిపెట్టి సంహరించినాడు. ఆ చాకలి శరణాగతత్రాణపరత్వానికి సంతసమొందినాడు నరసింహారెడ్డి. చిన్న చిన్న పాత్రలను గూడా ఇట్లా తళుక్కున మెరిపించి, పఠితలను మురిపిస్తాడు కవి. రెడ్డి స్వాతంత్య్ర ఉద్యమానికి దన్నుగా అప్రాంత ప్రజలే కాకుండా, కంబం ప్రాంతవాసులు కూడా ఉత్తేజితులై, అతనికి అన్నిరకాల సాయమందించే వారు. ప్రజలలో ఆంగ్లేయులంటే ఉన్న భయాన్ని పోగొట్టి, ఎదిరించి పోరాడాలనే సాహసాన్ని నింపినాడు ఆ వీరుడు. ఇవన్నీ తెలుసుకొంటున్న కంబం తహసీల్దారు తన పై అధికారులకు తెల్పుతూ రెడ్డి ఆనుపానులు కనుగొనేవాడు చారులద్వారా. వాణ్ణి గూడా చంపాలనుకున్నాడు మనకావ్యనాయకుడు.
‘‘వీని దుర్గతి యిట్టి దుర్వృత్తులకును
జీవి తాంతంబు వరకు విస్మృతికి రాని
మంచిగుణపాఠమై యొప్పునంచు రాజ
తంత్రవిదుడౌట దత్ప్రయత్నముననుండె.’’
ఇంతలో ఒక గ్రామములో జరుగుతున్న కోడిపందాలకు ఆహ్వానం పైన వెళ్ళినాడు నరసింహారెడ్డి. ప్రాణములు పోతున్నా పౌరుషాన్ని వదలవు కోళ్ళు. వాటి పోరాట పటిమ గొప్పది. అందుకే రెడ్దికి మక్కువ. అంతేకాక అక్కడ చేరిన వారికి స్వాతంత్య్ర పోరాటము గురించి వివరించవచ్చు. ఇది తెలిసి తహసీల్దారు రెడ్దిని బంధించడానికి పోలీసు సూపరెండెంట్, రక్షకభట వర్గంతో పోయినాడు. కానీ ప్రజలందరు రెడ్డికి బాసటగా నిల్చి ఎదిరించినారు. పోలీసుల తుపాకులను గుంజుకున్నారు. పారిపోతున్న ఇద్దరు అధికారులను వెంటాడి చంపినాడు నరసింహుడు. ఈవిధంగా ప్రజలలో చైతన్య దీప్తిని వెలిగించినాడు. ఇదీ తృతీయ ఘట్టం. ఇంక చతుర్థం చివరి ఘట్టం. చెన్ననగరం(మద్రాసు) రాజధానిగా దక్షిణాపథాన్ని ఆంగ్లేయులు పాలించేవారు. నరసింహారెడ్ది తిరుగుబాటు వారికి కంటగింపుగా మారింది. వాట్సన్ వంటి సైన్యాధికారే భంగపాటు నొంది వచ్చినాడు. కిం కర్తవ్యం? అని ఆయా అధికారులు తీవ్రంగా చర్చించి, చివరకు
‘‘కనుకన్ సర్వ బలంబును గ్రుప్పి సముదగ్రస్ఫూర్తి బోరాడి యా
తని బంధించి వధించుటే ప్రథమ కర్తవ్యంబికన్ జాగొన
ర్చినచో దేశమునం బ్రజావితతి బ్రేరేపించి యొక్కుమ్మడిన్
మనపై దూకెడులాగు తోచుననిసంభావించి వాఱందరున్’’
‘‘ఘనమగు కెప్టెన్ పదవిం
దనరెడు సెనానియైన నార్టెన్ నామున్
బనుపగ నాతండుదుటున
విరివిగ సాధనములు సైన్యము గొనుచున్’’
‘‘...... ఆంగ్ల సైన్యాధినేత
భీషణంబుగ బ్రస్థాన భేరిమొరయ
బండ్లుగుండ్లును మంది మార్బలముతోడ
నల్లమల ప్రాంతమునకు బైనంబు సలిపి’’
గిద్దలూరు వద్ద సైన్యం విడిసింది. అక్కడి నుండి కోట వరకు సైన్యానికి విశాలమైన మార్గం ఏర్పరచడానికి చెట్లు, పుట్టలు, రాళ్ళ గుట్టలు తొలగించినారు. ఇదంతా చారులద్వారా తెలిసికొని, రెడ్డి ప్రతివ్యూహం రచియించి తన అనుచరులతో ఇలా అన్నాడు.
‘‘మనమిక జాగొనరింపక
ఘనయత్నము తోడ వారి స్కంధావారం
బునుజొచ్చి శ్వేత వదనుల
హననం బొనరింపవలయు నటుగాకున్నన్’’
‘‘దారిని గల్ల జేసుకొని దగ్గరకున్ జనుదెంచి దుర్గమున్
వారి దళంబు చుట్టుకొనినన్ మనకప్పుడు బైటి నుండి సం
భారములెవ్వి యందెడు నుపాయము గల్గ దొకింత దాన దా
ఱ్మాఱగు వ్యూహమాపయి గరంబు భరంబులగున్ పరిస్థితుల్’’
‘‘ఘోరతర మారణాస్త్ర
స్ఫార బలాన్వితుల రిపుల బహిరంగముగా
జీఱుటసాధ్యము కావున
వారేమరియున్నయపుడె వధింపవలెన్’’
‘‘మనము సాగించు నీ యుద్యమమ్మె యట్లు
వ్యాప్తమై మాతృదేశ దాస్యము నడంచు
గాన మనజన్మ ధన్యత గాంచుననుచు
వారికెరిగించి యాపైన బయనమయ్యే’’
ఇదీ ఆదేశభక్తుని లక్ష్యం. దాస్య విముక్తికి యెవరో ఒకరు ముందకు వచ్చి, ప్రజలలో స్ఫూర్తి నింపి, పగతురతో పోరాడి, ప్రాణత్యాగం చేస్తే క్రమంగా ఉద్యమం వ్యాపించి తీవ్రమై స్వాతంత్య్రం సిద్ధించగలదు. తరువాతి సాయుధ పోరాటాలకు యత్నించిన లక్ష్మీబాయి, అల్లూరి, నేతాజీ, భగత్‌సింగ్ వంటి అసంఖ్యాక యోధులకు, తిలక్ వంటి మొదటితరం నాయకులకు ఆదర్శం మన రెడ్డి వీరుడు. అతని కార్యక్షేత్రం చిన్నదే కావచ్చు. కాని ధ్యేయం మహొన్నతం. పొరాట పటిమ, మొక్కవోని సాహస పరాక్రమాలు శ్లాఘనీయం.
‘‘ఒకనిశిరంబు ద్రుంచి, మరియొక్కని బాహువులుత్తరించి, ఇం
కొకని యురంబు జీల్చి, మరియొక్కని నెత్తురు నేలరాల్చి, ఇం
కొకని గళంబు కోసి, మరియొక్కని ప్రేవులు దీసి, శాత్రవ
ప్రకరము దూలజేసె నిటు వాటము వెంట మహోద్భటంబుగన్’’
‘‘అతని భటులును శత్రు సంహార పరత
నొకనికొక్కడు దీసిపోకుండ మించి
శ్వేతవదనుల గూల్చి రవ్వీరునకు
దగిన అనుచరులనగ నంతట జరించి’’
ఈ మెరుపు దాడికి తట్టుకోలేక, నార్తన్ బళ్లారికిపోయి అక్కడి సైన్యాన్ని అంతటిని తీసుకుని వచ్చినాడు.
దీన్ని కవి రెడ్డికి విధి వక్రించినట్లు వర్ణిస్తాడు.
‘‘శత్రు గళనాళనిర్యదస్రస్రవంతి
బ్రధన జయనౌకనడుపు కైవర్త మౌళి
రెడ్డివీరుని రేఖ వక్రించెనేమొ
దుర్నిమిత్తములగపడదొడగె నపుడు’’
ఇది అద్భుతమైన రూపకం. ప్రాచీనకవులెవ్వరికీ తీసిపొని సమాస గ్రధనం. భావస్ఫూర్తి. వ్యుత్పన్నత. రచనాశైలి. అనవరతం కావ్యపఠనానుశీలురైన రస భావుకులు, వ్యుత్పన్నులు తలయూచి మెచ్చే రచన. దీని అర్థం-శత్రువుల గొంతులు కోయడంవల్ల రక్తం యేరులై పారింది. ఆప్రవాహంలో విజయమనే పడవను నడుపుతున్న నావికుడు నరసింహా రెడ్డి.