శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › స్వాతంత్య్రవీరుడు — 2

స్వాతంత్య్రవీరుడు — 2

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 24 / 37

అప్పుడే రెడ్డి భార్య, తల్లి మరణించినారు. కాని కర్తవ్య పరాయణుడైన కర్మయోగిగా వారికి జరుపవలసిన శాస్త్రీయ విధులొనరించి, శత్రు బలానికి తగిన వ్యూహం అనుసరించినాడు. కొందరే కోటలో ఉండి, మిగిలినవారు బయటుండి, రాత్రిపూట శత్రువులను సంహరిస్తూ, పగలు స్వీయరక్షణ జేసుకుంటూ, యుద్ధం కొనసాగించినారు. క్రమంగా కోటలోని ఆహార పానీయాలు, యుద్ధ సామాగ్రి తగ్గుతున్నాయి. సైన్యం హతమవుతుంది. ఆంగ్లేయులు సర్వసన్నద్ధతతో అపారసైన్యంతో, ఆయుధ సంపత్తితో ఉన్నారు. ఫిరంగి గుండ్ల తాకిడికి కోట కూడా శిథిలమైంది. ఇంక అక్కడ ఉండరాదని నిర్ణయించినారు మనవీరులు. కోట వదలి పోయినారు. నిర్జనాకీర్ణమైన కోటలో పాలకుడున్నాడనే వ్యర్థ భ్రమతో కోటపై దాడిని కొనసాగిస్తున్నారు మూర్ఖమైన ఆంగ్లేయ సైన్యం. కొన్ని రోజులకు కోట స్వాధీనమైనది. కానీ అందులో యెవరూలేరు. తమ వ్యర్థప్రయత్నానికి సిగ్గిలినారు శ్వేతముఖులు. అడవులలో తిరుగుతూ గెరిల్లా యుద్ధ తంత్రంతో దాదాపు మూడు సంవత్సరాలు పొరాడినాడు. అనుచరులందరూ హతులైనారు. ఐనా ఒంటరిపోరాటాన్ని కొనసాగించినాడు. క్రమంగా అక్కడి ప్రాంతమంతా విదేశీయుల వశమైనది. అది గమనించి ఎర్రమలలోని జగన్నాథ క్షేత్రానికి చేరినాడు మన వీరుడు. అది శత్రువులు తెలిసికొని అతనికి అన్నము కొనిపోయే గొల్లని ధనాశతో లోబరుచుకొని, ఆహారములో నల్లమందు కలిపి రెడ్డికి స్పృహలేనప్పుడు బంధించినారు. ఒక్కని గూడా యెదుర్కొనలేని పిఱికిపందలు వారు. కోవెలకుంట్లకు తీసుకువెళ్లి ఉరిశిక్ష విధించి, జుఱ్రేటి ఒడ్డున శిక్షను అమలుపర్చినారు. 1848 వసంవత్సరములో ఇది జరిగింది.

‘‘అతడు ప్రారంభమొనరించినట్టి యుద్య

మమ్మె రవులుచు ఒక దశాబ్దమ్మునకును

క్షితి ‘సిపాయి పితూరి’గా గింవదంతి

గన్న ‘స్వాతంత్య్ర సమరంబు’గా జ్వలించె’’

‘‘అతని జీవాత్మ భౌతికమైన తనువు

వదలి యంతట వ్యాపించి బహుమహోద్య

మమ్ములొనరించి యొక శతాబ్దమునకును

మాతృభూమికి స్వాతంత్య్ర మహిమ గూర్చె’’

శ్రీరస్తు

శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణేనమః

అవిఘ్నమస్తు


క॥ శ్రీమదహోబల మంజుల

ధాముని లక్ష్మీనృసింహు, త్రయ్యంతవధూ

సీమంత కుంకుమాంకితు

మామకగృహదైవతంబు మది భావింతున్‌॥

మ॥ ఆవతంసీకృత, చంద్రశాబకము-వామార్థాంగ శుద్దాంతమున్‌

పవనాంధఃపతి కంకణంబునగు రూపంబూని-యస్మన్మనో

భవనంబందు వసించుచున్న పరమబ్రహ్మంబు-విద్వజ్జన

ప్రవరామోదకరో త్తమోత్తమ కవిత్వప్రౌడి, భాసించుతన్‌॥

క॥ పరతత్వమూర్తి సచరా

చరవర్తి-యశేషభక్త జన సంసృతి సా

గరతరణ ప్రవణుండగు

గురుదేవుని-రమణమౌనికుంజరుఁ దలఁతున్‌ ॥

క॥ ఉత్తమకవితాగుణ సం

పత్తికిఁ గాణాచియౌచు పాఠకకోటీ

చిత్తంబుల లోఁగొను రస

వత్తర శివభారతంబు భావింతు మదిన్‌ ॥

క॥ ఆరుదై నతత్కవిత్వము

గుఱిగాఁగొని-నాదు శ క్తికొలది రచింపన్‌

దొరకొంటి వీరలోకో

త్తరుఁడు ‘‘నరసింహరెడ్డి’’ ధన్యచరిత్రన్‌॥

శ్రీరస్తు

శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణేనమః

విజ్ఞప్తి

భగవదనుగ్రహమువల్ల ఇందలి కథానాయకుడు శ్రీనరసింహా రెడ్డిశాఖీయుల కోరికను నెరవేర్చ గల్గితని. ఈ కావ్యరచనకుగల పూర్వాపర సందర్భము లన్నియు ప్రకృతము కేంద్ర ప్రభుత్వమంత్రిగానున్న గౌరవనీయులు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యగారు వ్రాసిన పరిచయ వాక్యములలో తెలిపియున్నారు. వారికి నాశుభాకాంక్షలు-

ఈ కావ్యము పరిమాణమునను గుణమునను అల్పప్రమాణము గలదైనను. తెలుగునేల నాల్గుచెఱగులనుండి సుప్రసిద్ధులగు పండితులు-కవులు - సాహితీ ప్రియులును తమ యామోదము తెలుపుచు నన్ను ఆశీర్వదించిరి. అభిమానము ప్రకటించిరి. అది వారి యౌదార్య విశేషము-అన్నియు ప్రకటించినచో, మూలమునకు మూడు నాల్గంతల గ్రంథమై కావ్యమునకు నాకును భారమగునని యిందు కొన్నిమాత్రము చేర్చితిని కాని అందరికి కృతజ్ఞుడను అంతేకాక, ప్రముఖపత్రికలు ప్రశంసించినవి - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమువారు ‘‘విద్వాన్‌’’ పరీక్షా పాఠ్యగ్రంథముగా నిర్ణయించి మన్నన జూపిరి. ఈ కావ్యముపై శ్రీ అవధానము రంగనాథవాచస్పతి యం.ఏ.బి.ఇడి.గారు రచించిన నలుబదిపుటల విమర్శనమును పూర్వముద్రణమున ప్రకటించియుంటిని కాని, పైని విన్నవించుకొని విస్తృతిభయమున ఇందు ప్రకటించలేకపోయినాను. అందుకు వారు నన్ను మన్నింతురని విశ్వసింతును మఱియొక ముఖ్యమైనమాట వయోభారమునైనను లెక్కించక శ్రమతీసుకొని ముద్రణస్ఖాలిత్యములన్నియు సవరించిన మాన్యులు శ్రీ బి.భీమరావుగారికి ‘‘నమోవాకం ప్రశాస్మహే’’ అనుటకన్న నేనేమియు ప్రత్యుపకారము చేయలేనివాడను. కాని వారి యుపకారము మరువరానిది. ఇంతకు ఈ కావ్యమునం దేమైన గుణమున్నచో తమ హృదయమున నాకు సముచితస్థాన మొసంగవలసినదిగా మహాశయులకు విజ్ఞప్తి.

__18-1-1984. గ్రంథకర్త __

ద్వితీయ ముద్రణము పాణ్యం నరసరామయ్య

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

మ॥ అమితోద్దండ దురంత పీడనకులోనై, భారతీయ ప్రజా

సముదాయం బొనరించినట్టి ప్రథమస్వాతంత్య్ర సంగ్రామరం

గముకన్నం బదియేండ్లకు న్మునుపె యాంగ్ల ప్రాజ్య సామ్రాజ్యసై

న్యముపై గత్తినిదూసినట్టి ‘‘నరసింహారెడ్డి’’ సామాన్యుడే॥

సీ॥ కలికితురాయి గీల్కొలుపు పట్టురుమాలు

    గట్టిన యు త్తమాంగంబుతోడ

వైష్ణవభక్తిభావముచాటు నూర్ద్వపుం

    డ్రము నీటుగొలుపు ఫాలంబుతోడ

క్రేవల కెంజాయరేక లింపారు, నా

    తతదీర్ఘ ధవళ నేత్రములతోడ

చిఱునిమ్మకాయల నిరువైపు నిల్పుకో

    జాలిన గుబురు మీసములతోడ ॥

గీ॥ వైరిహంవీర విదళన ప్రళయకాల

దండనిభ ఖడ్గకలిత హస్తంబుతోడ

ప్రజకు భయభక్తి సంభ్రమ భావములను

గొలుపు వర్చస్సుతోడ న బ్బలియుఁడలరు॥

అంకితము

గీ॥ నాకు నా కావ్యగత కథానాయకునకు

నాత్మదైవము గృహదైవమై వెలుంగు

శ్రీ అహోబల లక్ష్మీనృసింహమూర్తి

పాదుకల కేను దీని నర్పణ మొనర్తు॥                     - __గ్రంథకర్త__

అన్నా - తండ్రి

మ॥ మన వంశీయుడు వీరమౌళి నరసింహారెడ్డి చారిత్రమున్‌

మన యాచార్యునిచేత శ్రీ నరసరామయ్యాఖ్యుచే నీవు భ

క్తిని వ్రాయించిన పద్యకావ్యము భవత్స్మృత్యర్థ మీరీతి నూ

తనముద్రాకృతి సల్పినారము భవద్భావానుగుణ్యంబుగన్‌॥

గీ॥ బాల్యమాదిగ సంసారభారమెల్ల

మోసి మ మ్మింతవారిగాఁ జేసి-దివికి

నరిగియున్నట్టి నిన్నెప్డు మరువబోము

సరళవర్తన! మా కృతజ్ఞతల గొనుము

- తమ్ములు -

రూపనగుడి గ్రామము వెంగల రెడ్డి

’’              పెద్ద వెంకటరెడ్డి

’’              చిన్న వెంకటరెడ్డి

’’ కుమారుడు         నారాయణ రెడ్డి

శ్రీరస్తు

పరిచయము

మ॥ అమితప్రాభనసర్వసైన్య సముపే తాంగ్లేయసామ్రాజ్యసిం

హము మీసల్‌ నులివెట్టి లాగుచు-నుదగ్రాటోపవీరోచితో

ద్యమసంరంభ మొనర్చినట్టి ‘‘నరసింహారెడ్డి’’ కాస్థాన రం

గముగా భూరియశంబుగాంచినది-మా గ్రామంబు-పూర్వంబునన్‌.

ఒకప్పుడు నా పర్యవేక్షకత్వమున ఉయ్యాలవాడలో జరిగిన రైతుమహాసభలో-స్వాగతోపన్యాస సందర్భమున శ్రీ పాణ్యం నరసరామయ్యగారు పై నుదహరించిన పద్యము చెప్పియుండిరి. అప్పుడా సభనలంకరించిన కీ.శే.కల్లూరు సుబ్బరావు గారును - కీ.శే. కళా వేంకటరావుగారును- కీ.శే.దామోదరం సంజీవయ్యగారును పద్యముచే నాకర్షితులై, సభాసమావేశానంతరము - తామున్న విడిదికి కవిగారిని పిలిపించుకొని- శ్రీ నరసింహారెడ్డిని గురించి వివరములు తెలుసుకొని. అంతటి మహావీరుని చరిత్ర వెలుగులోనికి రాక కాలగర్భమున కలసిపోయినందులకు-తమ విచారమును వెళ్ళడిరచిరి. అంతే కాక-ఆమహావీరునిచరిత్ర-కావ్యముగా మీ రేల రచించలేదని అడిగి రచించుమని నొక్కిచెప్పగా ఆ చరిత్ర సమముగా ప్రామాణికముగా లభించలేదని కవిగారు చెప్పిరి.

పిమ్మట ప్రకృతము బెంగుళూరు విశ్వవిద్యాలయమున ఆంధ్రశాఖాధ్యక్షులుగా నున్న డాక్టర్‌ తంగిరాల వెంకట సుబ్బారావు గారు పిహెచ్‌.డి. పట్టమునకై విశ్వవిద్యాలయమువారికి సమర్పించిన వీరగాథలు అను పరిశోధనావ్యాసమున శ్రీ నరసింహారెడ్డి చరిత్ర వివరముగా ప్రామాణికముగా తెలిపిరి. వారికి పాఠకలోక మంతయు కృతజ్ఞులై యుండవలసియున్నది.

అనంతరము మా ప్రాంతమున గణనీయులు శ్రీ నరసింహా రెడ్డి శాఖీయులునగు నగరిండ్ల వారు ముఖ్యముగా రూపనగుడి గ్రామ మునసబు - శ్రీ కర్నాటి అయ్యపురెడ్డి గారును. ప్రముఖ భూస్వామి సారస్వత ప్రియుడు కీ॥ శే॥ ఆల్లూరు గ్రామం ఆరెకట్ల చిన్నమల్లారెడ్డి గారును - కవిగారిని యొత్తిడిచేసి కావ్యముగా వ్రాయించి, ఈ చరిత్ర వెలుగులోనికి తెచ్చిరి. పిమ్మట శ్రీ అయ్యపురెడ్డి గారు తమశాఖీయులనేకాక - మా ప్రాంతమున ప్రముఖులైన యితరులనుకూడా గృహమున సమావేశపఱచి ఈ కావ్యమునకు ఘనముగా ఆవిష్కరణోత్సవమును జరిపించుటకు నిశ్చయించి ఒక సంఘము నెన్నుకొని వారి ఆహ్వానముపై వెళ్ళియుండిన నన్ను ఆ సంఘమునకు ఏకగ్రీవముగా అధ్యక్షునిగా నెన్నుకొనిరి. ఈ విధముగానేకాక నాకును ఈ కావ్యముతో మఱియొక సంబంధమున్నది. ఈ కావ్యనాయకుని మాతామహుడును దత్తు తండ్రియునగు - శ్రీ చెంచుమల జయరామి రెడ్డి మా గ్రామస్థుడే నేటికిని కొందరు మా సంజామల గ్రామమును చెంచల్‌మల అని పిలుచుచుందురు. ఆ జయరామిరెడ్డి పిమ్మట తన నివాసమును నొసముకోటకు మార్చుకొనిరి. కవిగారు అక్కడినుండి ఈ కావ్యకథ ప్రారంభించినారు. కథానాయకుని గ్రామమైన ఉయ్యాలవాడకు చెందిన శ్రీ సరసరామయ్యగారు కావ్యమురచించుట కథానాయకుని పూర్వికునిగ్రామమైన సంజామలవాడనైన నేను ఈ కావ్యమునకు పరిచయవాక్యములువ్రాయుట ఒక విచిత్రమైన దైవఘటన కానోపును. ఇంతకు దేశ స్వాతంత్య్రమునకై - తన సర్వశక్తులతో పర పరిపాలకులపై పోరాటము సాగించి. ఆత్మబలిదానముచేసిన శ్రీనరసింహారెడ్డి చరిత్ర వ్యాప్తిలోనికి తెచ్చుట-రేనాటి ప్రజలయొక్క ముఖ్యముగా నగరిండ్ల వారి యొక్క ముఖ్యకర్తవ్యమై యున్నది. నాకు తెలిసినంతలో శ్రీఅయ్యపురెడ్డిగారును - ఆల్లూరు ఆరెకట్ల మల్లారెడ్డిగారి కుమారుడు శ్రీరామిరెడ్డిగారును. ఈ కార్యక్రమమునకై విశేషించి శ్రమించుటేకాక ఎంతో ధనవ్యయముచేసి- ఒక రూపమునకు తేగలినారు. ఇంకను చేయవలసినది చాలయున్నది.

ఇంక కవిగారిని గురించి కొంత తెలుపనిచో, నా పరిచయ వాక్యములు పూర్తికావు. శ్రీనరసరామయ్యగారు పుంభావ సరస్వతులు-ఎంతటి సాధారణ విషయమైనా వారి చేతిలోపడినచో, అసాధారణదీప్తితో వెలువడుతుంది. సహజత్వాన్ని కోల్పోకుండా సన్నివేశాన్ని కండ్లకు కట్టినట్లు చిత్రించడంలో కవిబ్రహ్మ పోకడలు వారి రచనలో కన్పట్టును. రాయలసీమ కేవలము రతనాలసీమయేకాదు. కవిరత్నాలసీమకూడా, అల్లసాని పెద్దన, రామరాజభూషణుడు, పింగళిసూరన్న వంటి మహాకవులను తెలుగు సరస్వతి కందించింది. అటువంటి సీమలో జన్మించిన శ్రీసరసరామయ్యగారు ఆ మహాకవుల సంప్రదాయాలను పలుకుబడులను పుణికిపుచ్చు కొనడము ఎంతో సహజము.

ప్రాచీన కావ్యధోరణిలో ఆధునిక చరిత్ర రచనకు పూనుకొన్నందులకు శ్రీ నరసరామయ్య గారిని హృదయపూర్వకముగా అభినందించు చున్నాను. శ్రీ నరసింహారెడ్డివంటి దేశభక్తుని - త్యాగి మహావీరుని చరిత్రను ఈ విధముగా వెలుగులోనికి తీసుకొని వచ్చిన మహాకవి శ్రీ పాణ్యం నరసరామయ్యగారు ఆంధ్రదేశమునకు ముఖ్యముగా రాయలసీమకు ఎనలేని సేవచేసినారు. తరతరాలుగా ఈ ప్రాంతమువారు వారికి ఋణపడియుందురనుటలో, అతిశయోక్తిలేదు. శ్రీ నరసరామయ్యగారు ఇంతకుమునుపు రచించిన ‘‘వీరకంకణ’’ కావ్యమునుండి కొంత భాగమును బెంగళూరు మైసూరు విశ్వవిద్యాలయములు. ూ.ఖ.జ. పాఠ్యభాగముగా స్వీకరించిరి. మన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమువారును వీరినొక కవిగా గుర్తించి సత్కరించిరి. ఇట్టి వీరి కవిత్వమునుగూర్చి వింగడిరచుట అనవసరము. కావ్యము ముందున్నది చదివినచో దీని ప్రాశస్త్యమును పాఠకులేగుర్తించగలరు. చదువుట మొదలు పెట్టిన తర్వాత సాంతముగాచదువుదాక యే పాఠకుడును నిలుపడని నా విశ్వాసము.

జైహింద్‌

క్రొత్త ఢిల్లీ పెండేకంటి వెంకటసుబ్బయ్య

24-5-76 పార్లమెంటు సభ్యుడు

-: అభినందనము :-

శ్రీ పాణ్యం నరసరామయ్యగారి యీ గంభీరోదారకృతికి అభినందన రూపముగా యీ రెండు మాటలు వ్రాయగల్గి నందుకు నన్ను నే నభినందించుకొను చున్నాను. గ్రంథములు పరిశీలించి అభిప్రాయములు వ్రాయు నుత్సాహము మందగించి నాకు కొంతకాలమైనది. కాని కవిగారి విశ్వాసపు కోరికను త్రోసివేయ లేకున్నా-మఱి యింత చక్కని రచనను చవిచూచు సుసందర్భము ఎప్పుడోగాని అభిప్రాయములిచ్చు వృత్తిగలవారికి తరచుగా కలుగదు.

గ్రంథమందలి రెండు ఘట్టములు మాత్రమే ముద్రించి కవిగారు నాకు పంపియుండిరి. అందలి చరిత్ర అసంపూర్ణముగా నుండి కొంత నొప్పిగలిగింపగా దానిని పూర్తిగా వివరములు ప్రామాణికముగా సేకరించి రచించునట్లు వారిని కోరియుంటిని. వారట్లు చేసి నన్ను గౌరవించినారు. కృతజ్ఞుడను.

‘‘సిపాయి పితూరి’’కి పదేండ్లముందే ఇంగ్లీషువారి ‘‘జనస్థాన’’పు దర్బారు నోర్వలేక యెదిరించిన వీరసింహుడట యిందలినాయకుడు నరసింహారెడ్డి. ఇట్టివా రెందరి పచ్చి నెత్తురు కండలో ఈ పుణ్యభూమిలో ఇంకి యెండిపోయిన తర్వాతగదా యీ మహాదేవికి స్వతంత్ర భూమిక వేసుకొనుట సాధ్యమైనది! మరి దీనిని స్వార్థపరుల ‘అహిభయము’ నుండి తప్పించి నెలకొల్పుటకు ఇంకెంతో వివేకుల అవివేకులు రక్తము ప్రవహింప వలసియున్నదని మన మిప్పుడు గమనించుచున్నాము అనాదిగా అనంతముగా జరుగు సృష్టితత్వమని సమాధానపడ వలసియున్నది.

ఈ చిన్న మహాకావ్యమున కవిగారు నరసింహారెడ్డిమూర్తినే కాక, సమకాలిక వ్యక్తులను.. సందర్భములను అచ్చుగొట్టినట్లు చిత్రించినారు. కవి కల్పన లేవియు దీనిలో లేవనిపించినారు. చరిత్ర కావ్యరచనలో ఇదొక అపూర్వసిద్ధి - భాష బలిసిపండిన నిండుపండు నిలుకడలేక నియమముతో సాగినవి అర్థభావాలు. అలంకారాలు ఆడంబరాలు లేని అచ్చమైన ప్రాచీనశయ్య. మొదలు పెట్టిన తర్వాత తలపొలముదాక ఈడ్చుకొనిపోవుధీరోదాత్తరచన. నరసింహుడు నరసింహారెడ్డి యీ కవిచేతిలో అమరపదవినందినాడు.

బెండుకవితలు-బిత్తలి కవితలు-విప్లవకవితలు-వెఱ్ఱికవితలు ఇత్యాదిగా ఎన్నోరకాల రచనలలో మునిగియున్నను నేటి తెలుగు రసికులకు హృదయమును ఈ అయఃకాంత మాకర్షింపగలదు.

బెంగళూరు

ఆనంద శుక్ల ద్వాదశి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

శ్రీ పాణ్యం నరసరామయ్య సన్నిధికి......మీ కృతి చదివితిని. ఎంతో సంతోషించితిని. ‘‘అవతంసీకృతచంద్రశాబక’’ పద్యము పరమ రమణీయముగా నున్నది - శ్రీశివభారతచ్చాయలు మీకృతియందు నిలువున గోచరించును. కాని, మీ శయ్య వేరు. మీరు మఱికొన్ని కృతులు రచించవలెను. ఇది నా యాకాంక్ష-

__14-7-1977. సి.వి.సుబ్బన్న __

__ యం.ఏ..శతావధాని.__

శ్రీరస్తు

__కళాప్రపూర్ణ నిడదవోలు వెంకటరావు. M.A., __

రిటైర్డు. మదరాసు విశ్వవిద్యాలయము తెలుగు శాఖాధ్యక్షులు.

శ్రీ పాణ్యం నరసరామయ్యగారికి... దానిపై నా యభిప్రాయము నీ క్రింది విధముగా పొందుపఱచుచున్నాను.

ఆమోదము

ఆంధ్రసాహిత్యమున నాధునికయుగమున సంస్మరణీయులైన చారిత్రక మహాపురుషులను గూర్చిన కావ్యములు రాయలసీమ యందే వెలువడుట విశేషము - దుర్భాక రాజశేఖర శతావధానిగారి ‘‘రాణాప్రతాపసింహ’’ గడియారము వేంకటశేషశాస్త్రిగారి ‘‘శివభారతము’’ యావదాంధ్ర విద్వల్లోకమునకు సుపరిచితములు. నేడు వెలువడిన శ్రీ పాణ్యం నరసరామయ్యగారికృతి ‘‘స్వాతంత్య్రవీరుడు’’ (ఉయ్యాలవాడ నరసింహారెడ్డిచరిత్ర) రాయలసీమకు సంబంధించినదే, రాయలసీమ కవిరత్నాలసీమ.

దేశకాలపాత్రముల గమనించిన ‘‘స్వాతంత్య్ర వీరుడు’’ అను కృతి కొక విశిష్టతయున్నది. పైవానిలో ‘‘రాణాప్రతాపసింహ’’ ఉత్తరభారతమున రాజపుత్ర స్థానమునకు సంబంధించినది. శివభారతము దక్షిణయిన మహారాష్ట్రదేశమునకు సంబంధించినది-కాని, అచ్చముగా ఆంధ్రదేశమునకు తెలుగుగడ్డకు సంబంధించినది. ‘‘స్వాతంత్య్రవీరుడు’’ అనుకృతి. కాలక్రమ ననుసరించి రాణా ప్రతాపసింహ, శివాజీలకు తరువాతివాడు నరసింహారెడ్డి. వారివలెనే స్వాతంత్య్రవీరుడు. ఈ కృతియు కడపటిది-

చిత్ర సంఘటనలు

కథానాయకుడు నరసింహారెడ్డి - కృతికర్త పాణ్యం నరస రామయ్య. ఇరువురు ఉయ్యాలవాడ వాస్తవ్యులగుట, కావ్యవస్తువు ‘సిపాయీలపితూరి’ అని ఆంగ్లేయులు నామకరణము చేసిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామమునకు తొమ్మిదేండ్లకు పూర్వమే స్వాతంత్య్రదర్శనమిచ్చిన యుదంతము ఆంధ్రదేశమున తీరాంధ్రమునగాక రాయలసీమలోనే తొలిసారిగా స్వాతంత్య్ర దర్శనమగుట మొదటిది. రెండవది నామసామ్యము. కథానాయకునిపేరు నరసింహారెడ్డి, కవి పేరు నరసరామయ్య నరసశబ్దము నరసింహశబ్దభవము. ఈకృతియు ఆహోబల నరసింహస్వామికి నంకితము. మూడవది రసస్పూర్తి. కృతికర్తపేరు నరసరామయ్య. న-రస -రసలేనివాడు అని యర్థము కాని కావ్య మామూలాగ్రము రస మయము- తన పేరెట్లున్నను లోకమునకు రసప్లుతకావ్వము నందించేవాడు ప్రస్తుతకవి. నాల్గవది కావ్యము పరిమాణమున చిన్న. ధారాశుద్ధి పాత్రచిత్రణ రసపోషణ ఈ మూడిరటియందు మిన్న. అయిదవది - జానపద సాహిత్యమున నాబాలగోపాలము నాకర్షించిన నరసింహారెడ్డి కథ - నేడు పద్యసాహిత్యమున పండిత కవిలోకము నంతటిని ఆకర్షించుచున్నది.

ప్రాచీన కవితయందలి యభినివేశము క్షీణించుచున్న యీనాడిట్టి రసవత్తరకావ్యము రచించిన శ్రీ నరసరామయ్యగారిని మనః పూర్వకముగా నభినందించుచున్నాను.

ఉ॥ ముట్టినదాది కావ్యము సమూలముగా పఠియించిగాని-యే

పట్టుననైన తీసి చదువందొరకొన్ననుగాని-వీడగా

పుట్టునే బుద్ధి? యిట్టిది యపూర్వము నేటి తెలుంగు కావ్యులం

దిట్టి యమోఘకావ్య ఘటనై కమహత్వముగల్గునేరికిన్‌?

క॥ వాణ్యానుగ్రహమున నతి

గణ్యంబౌ వీరరసము కావ్యంబులలో

నాణ్యంబయ్యెను నీ కృతి

పాణ్య నరసరామయాఖ్య! భవ్యకవీంద్రా!

28-10-1976 నిడదవోలు వెంకటరావు.

కళాప్రపూర్ణ డాక్టర్‌ దాశరథి.

మహాకవి శ్రీ పాణ్యం నరసరామయ్యగారికి...... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వీరునిగాథను కావ్యవస్తువుగా తీసుకొని కావ్యము రచించుట నాకు ఎంతో ఆనందము కలిగించినది స్వాతంత్య్రయోధులగాథ-మహకావ్యరచనకు చక్కని వస్తువు కాగలదని రుజువుచేసినారు. రాళ్లపల్లి వారన్నట్లు మీది ధీరోదాత్త రచన ప్రతి పద్యము హృద్యము. మీ శైలి శ్రీనాథాదులను తలపించు చున్నది పద్యరచనను ఈసడిరచుకొనువారికి మీ కావ్యము కనువిప్పు కాగలదు.

ఇట్టికావ్యము రచించిన మీకు నా అభినందనలు. ఆ మూలాగ్రము పఠించి ఆనందించితిని.

__7-7-1977 శుభాకాంక్షలతో, __

__ భవదీయుడు, __

__ దాశరథి__

ఆర్యా!....

ఆ॥ పెద్దవ్రాయజాల వృద్ధుడనగుట; నీ

కవిత జదివి లెస్స కరిగినాడ

నరసరామ! నీదు సరసాధు ప్రౌఢ

రచన నమరుడయ్యె రెడ్డిజోదు

7-12-1976 తుమ్మల సీతారామమూర్తి చౌదరి

__ అప్పికట్ల.__

డాక్టర్‌. సి. నారాయణరెడ్డి

శ్రీ నరసరామయ్యగారికి మీరు ఆప్యాయంగా పంపిన కావ్యము ‘స్వాతంత్య్రవీరుడు’ చదివితిని. ఏమిశైలి? ఝరీ సదృశం - ఏమిభావన? హృదయస్పృశం. అభినందన లందుకోండి.

8-7-1977 సి.నా.రె

శ్రీ పాణ్యం నరసరాయయ్యగారికి కృతజ్ఞుడను. ఇంతకాల మా వీర రసావతార మూర్తి నరసింహారెడ్డి చరిత్రను జానపదులే పాడుకొనిరి. ఈనాటినుండి సహృదయసాహితీ బంధువులందరు మీకావ్యముద్వారా ఆ పుణ్యపురుషుని చదువుకొందురు. వస్తువుకు తగినట్లే మీ కవిత్వముకూడ పరమోదాత్తముగా నున్నది. నరసింహారెడ్డి కత్తిపదును మీ కలమున కెక్కినట్లున్నది. ఆ కత్తి. ఈ కలము ధన్యతగాంచినవి. మీరుపుట్టినగడ్డ బలమట్టిది ఆ వీరుని చరిత్ర చదివిన మేము ధన్యులమే. నమస్సులు.

28-10-1977 బి.రామరాజు

__విద్వత్కవివతంసులు శ్రీ పాణ్యం నరసరామయ్యగారికి... __

ఆర్యా! మీ కావ్యమునకు వస్తువుగా పురాజకథనో ఈ కాలపు యువతీ యువకుల విశృంఖల ప్రేమకలాపమునో కై కొనక మరుగునపడియున్న ఒక స్వాతంత్య్ర వీరునిగాథ నెన్నుకొని రస బంధుర ప్రబంధముగా రూపొందించుట యెంతయు ప్రశంసనీయ విషయము. ఆంగ్లప్రభుత్వముపై తిరుగబడి పోరాటమునకు సిద్ధపడిన నరసింహారెడ్డి దేశభక్తియు, ధైర్య స్థైర్యములు, పౌరుషపరాక్రమములు మీ రచనలో నిపుణముగా నిరూపితములైనవి. మీ కావ్యము దేశభక్తుని పవిత్ర చరిత్ర మగుటచేత అటు దేశాభిమానలకును మీ కమనీయ కవితా సారస్యము చేత ఇటు సాహిత్యరసికులకును అవశ్యపఠనీయమై ఆనందసంధాయకమై అలరారు చున్నది. మీ దేశభక్తిని, ప్రతిభావ్యుత్పత్తులను, కావ్యనిర్మాణకళాకౌశలమును, పద పదమునను ప్రకటించుకున్న మీ యీకృతి మీ కీర్తికి పతాకయై విరాజిల్లగల దనుటలో సందేహములేదు.

4-8-1977 భవదీయుడు

__ దీపాల పిచ్చయ్యశాస్త్రి__

__మాన్యశ్రీపాణ్యం నరసరామయ్యకవిగారికి... __

మీ వీరకావ్యమును ఆసక్తితో చదివితిని. వయస్సుచేతను అనారోగ్యముచేతను ప్రామాణిక రచనలు చదువు ఓపికలేక నవలలతోనే ప్రొద్దుపుచ్చుచున్న నాకు మా కావ్యము లేనిసత్తువనిచ్చి త్వరలో ఆమూలాగ్రముగా చదువగలుగునట్లు చేయుటచూడ ఇది సామాన్య రచనకాదని నాకు విదితమైనది. అందును దేశభక్తుని చరిత్ర అగుటచేత ఇది అభ్యర్హితముగానున్నది. మీలేఖినియు అనవసరమైన వక్రతలులేక అర్థాంతరన్యాసములతో ఉత్తమ వీరకావ్యముగా నొప్పు చున్నది. ప్రసన్నశైలిగల ఈ వీరగాథ బి.ఏ., యం.ఏ., విద్వాన్‌ విద్యార్థులకు పాఠ్యగ్రంథము కాగలదని ఆశించుచున్నాను.

__15-7-1977 భవదీయుడు. __

__ ఖండపల్లి లక్ష్మీరంజనం__

__ఆంధ్రవిశ్వవిద్యాలయము రిటైర్డు తెలుగుశాఖాధ్యక్షుడు __

గంటిజోగి సోమయాజి

శ్రీ నరసరామ్యగారికి.... మీ వీరకావ్యము ఆనంద జనకముగా నున్నది. చాలామందికి అజ్ఞాతుడు. అశ్రుతుడు అగు దేశభక్తునిచరిత్రను బయటకి తెచ్చి కావ్యరూపమున వెలయించుట ముదావహము. నేడు గణయతిప్రాసలులేక స్వల్ప విషయములను ఆశ్రయించి రసభావములను పోషించుటలో శ్రమకుపాల్పడు కొందరు నవ్యకవులవలె వచనరూపమున వృత్తగంధిరూపముల నాదరింపక ప్రాచీనకవుల శైలిని వ్రాయగల్గుట సంతోషమే. మీ గ్రంథమును చదివి ఆనందించువారు ఇంకను ఎందరో కలరు.

మ॥ కవితారూపము నిత్యనూతనము వాగ్వైచిత్రి నానావిధ

స్త వనీయంబగు మార్గముంగలది శబ్దాంబోధిలో ర

త్నవితానంబున కంతులేదు మఱి, అర్థవ్యక్తి సత్కల్పనా

భవమై రంజిలు, నిట్టి కావ్యములు నవ్యంబుల్‌గదా యెప్పుడున్‌.

10-10-1977 విద్వాన్‌ సోమయాజి

బ్రహ్మశ్రీ సరసకవి పాణ్యం నరసరామకవి మహాశయులకు... మీ కావ్యము నిన్న చేరవచ్చెను. వచ్చినతోడనే ఇతిశ్రీగా చదివి యానందించితిని. చేతికి పుస్తకము తీసుకొన్నతర్వాత విడువ బుద్ధిపుట్టక చదువనయ్యెడి పుస్తకము లేకొన్నియో. అందులో మీది యొకటి. అస్మద్గోత్రంవర్థతామ్మను నా యాశయమును తీర్చినది మీ రచన.

ఉ॥ వ్రాసిన పద్యమెల్లను సెబాసనిపించుకొనంగబోలునం

దేసరసత్వమేని సొగసేనియు భావములోనొ శబ్ద వి

న్యాసములోనొ యేచితినొ వ్యంగ్యమునందునొ యర్థచిత్రమం

దో సరిపోయియుండవలయున్‌ రసికుల్‌ తలలూచి మెచ్చగన్‌,

అన్న నా లక్ష్యమునుతీర్చినది మీరచన, చాలా సంతోషమైనది. ఆప్యాయనము కల్గినది.

ఉ॥ తేటతెనుంగుబాస నొక తీపిగ వ్రాసితి వీరగాథ ధీ

పాటవచాటుసూక్తి పరిపాటికిసూటికివచ్చుధాటి-యె

చ్చోటను జారకుండ సరసుల్‌ మది మెచ్చగ దీని కొక్క మా

ర్మాటయ లేదుసూ నరసరామకవీ! వశవర్తివాక్ఛవీ.

క॥ రేనాటివీరచరితము

రేనాటి కవిప్రవీర కృతకృతి యౌటన్‌

రేనాటి వీర భూమికి

నేనాటికి భూష్యభూషణీరితమసుడీ-

గీ॥ నరసరామకవీశ! నీ నరసపదము

సరసచేయుదు నాకును నాకు సాకు తెనుగు

లిపిని వ్యత్యాసమెంతయోలేదు; గాన

సరసకవిరామ నీ నామకరణ మిదియ.

క॥ సాకారమైనకాలము

లోకైకవ్యక్తిని తనలో మాటుకొనన్‌

నీ కలము నిరాకార

మ్మాకల్పమునిల్పె నక్షరాత్మునిగ కవీ!

కాలము - కలము - ఆకారమే భేదము.

నా కంటికి ఆపరేషన్‌ జరిగినది - పచ్చికంటితో పరికింపరానిదైనను తమ గ్రంథము వచ్చిన తర్వాత ఆగలేక ఆసాంతము కంటికి శ్రమ గల్పించితిని. రసానందానుభూతిలో అన్యబాధలేమియు అగపడలేదు.

కవితాసామ్రాజ్యము-నంద్యాల.

27-7-1977. మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి

తూమాటి దొణప్ప యం.ఏ., పిహెచ్‌.డి. - ఆంధ్రశాఖాధ్యక్షుడు - నాగార్జున విశ్వవిద్యాలయము-

శ్రీ పాణ్యం నరసరామయ్యగారికి ........ మీ కృతిని చదివినాను - చక్కటిరచన. ఒక మహావ్యక్తికి సంబంధించినది. మీ ప్రయత్నం ప్రశంసాపాత్రం. ఇట్లే బుడ్డా వెంగల రెడ్డిగారి జీవిత చరిత్రను కావ్యంగా సంతరిస్తే సంతోషిస్తాను. అందుకు మీకన్న సమర్థులుండరు. అభినందలతో

14-7-1977. తూ. దొణప్ప

డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని ఎం.ఏ.ఆసర్చు, పిహెచ్‌.డి., పూర్వాంధ్ర శాఖాధ్యక్షుడు ఉస్మానియా విశ్వవిద్యాలయము

శ్రీ పాణ్యం నరసరామయ్య గారికి తమ కావ్యము చదివి అమందానందము నందితిని - సిపాయీల కలహమునకు ముందే స్వాతంత్య్రోద్యమునకు నాందిపాడిన మహావీరుడు శ్రీ నరసింహారెడ్డి చరిత్రను వెలుగులోనికి తెచ్చి తమ కవిత్వమును సార్థకముచేసుకొనుటయేకాక ఆంధ్రవాఙ్మయమునకు నొక యపూర్వవీరకావ్య రత్నమును ప్రసాదించినారు. జీవములు. వాస్తవములైన వర్ణనలతోడను ఉదాత్తమైన పాత్రచిత్రణముతోడను మధురమంజులమైన వాగ్విన్యాసముతోడను గంగా ప్రవాహసదృశమైన ధారాశుద్ధితోడను అసదృశమైన రసపోషణముతోడను - గూడి తమ కావ్యము నా కెంతో యానందము కల్గించినది. నరసింహారెడ్డి నారశింగు నారాయణరాజు మున్నగువారి పాత్రలను తాము చిత్రించిన తెఱంగు ప్రశంసా పాత్రము. ధనాశకు బానిసయైన ఆ గొల్లవాడు ఆంధ్రుడేయగుట నా యుల్లమునకు శల్యమువలె నున్నది. ఆంధ్రులు తమ లేఖినినుండి యింకను రసవన్మథురములైన మహా కావ్యముల నాశించు చున్నారు.

18-7-1977 ది.వెంకటావధాని

శ్రీరస్తు

గీ॥ శ్రీలు విలసిల్లు రాయలసీమయందు

రెడ్డికులజులు - మహిత నిర్ణద్రమతులు

బాహుశక్తి ప్రజారక్తి పరిఢవిల్ల

నేలుచుండిరి పూర్వంబు పాళెములను ॥                    1

గీ॥ వీరికులమున పెంపొందు పెక్కు శాఖ

లందు, మోటాటిశాఖయం దవతరించి

నట్టి, వీరాధివీరుఁ ‘‘డుయ్యాలవాడ’’

నగరనిలయుండు మన కథానాయకుండు ॥                2

మ॥ అమితోద్దండదురంతపీడనకులోనై, భారతీయ ప్రజా

సముదాయం బొనరించినట్టి ప్రథమస్వాతంత్య్ర సంగ్రామరం

గముకన్నం బదియేండ్ల కున్‌ మునుపె యాంగ్ల ప్రాజ్య సామ్రాజ్యసై

న్యముపైఁ గత్తిని దూసినట్టి ‘‘నరసింహారెడ్డి’’ సామాన్యుఁడే?           3

కథా ప్రారంభము

క॥ ఘనతర చెంచుమలాన్వయుఁ

డనఘుఁడు ‘‘జయరామిరెడ్డి’’ యనునాయకుఁడు

ర్విని బాలించుచు నుండెను

అనుపుగ ‘‘నొస’’ మన్ననగర మాస్థానముగన్‌॥               4

చ॥ అరువదియారుగ్రామముల కాతఁడు నాయకుఁడై ప్రజాహితం,

బరయుచుఁ బేదసాదలకు నాదరువిచ్చుచు, రాజధర్మసు

స్థిరుఁడయి రాజ్యపాలనము సేయుచు, హాయిగనుండె నింతలోఁ

గఱకుబ్రిటిష్‌ వణిక్కులకుఁ గన్నుపడెన్‌ తదధీనమౌధరన్‌॥         5

ఉ॥ భారతభూమిపైనిఁ దమపాదము మోపిననాఁటినుండి, వ్యా

పారమెగాక రాజ్యసముపార్జన సేయుచు నాఁటికే సువి

స్తారమహీతలమ్మునకు శాసకులై వెలుగొందుచుంట న

వ్వారల ఢాక కిచ్చటి నృపాలురు డీల్పడియుండి రందఱున్‌.      6

ఉ॥ అత్తఱి వార లాడినది యాటఁయుఁ, బాడినదెల్లపాటఁ యే

యెత్తును వేయుచున్న నదియో యొక నీతియు నౌచునుంట, ఆ

జిత్తులమారి వర్తకులు శ్వేతముఖుల్‌ ఘనసేనతో, నక

స్మాత్తుగ ముట్టడిరచిరి నొసంబుఁ దుపాకులబారు నెత్తుచున్‌॥         7

చ॥ ఆతఁడుమహాప్రతాపయుతుఁడయ్యును ‘శ్రీ జయరామిరెడ్డి’ యీ

గతి తనపై కివచ్చిన యఖండ బలాన్విత శత్రుసై నిక

ప్రతతి నెదుర్కొనం దగిన రాణువ దగ్గర లేకయుంట, నం

చితమతిశాలియౌటఁ బరిశీలనఁజేనెను దత్పరిస్థితిన్‌॥          8

ఉ॥ నాకడ నిప్పుడున్న వృతనాబలమల్పము, దీనితో నసం

ఖ్యాకములౌ బ్రిటీషు బలగంబులఁ దాకు టసాధ్య, మెట్టి యే

కైక ధనుర్ధరుండయినఁ గాలము చాలనినాఁడు మొప్పెగాఁ

దాకి జయింప నోపునె? వృథాశ్రమనొందుట రాజనీతియే?            9

చ॥ అదియునుగాక, సాటివసుధాధిపులంద ఱపార సైన్య సం