శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › స్వాతంత్య్రవీరుడు — 3

స్వాతంత్య్రవీరుడు — 3

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 25 / 37

పదవెలుగొందు నాంగ్ల పరిపాలక వర్గముతోడఁ బోరంఁగా

నద నిది గాదటంచు. ననువౌగతి సంధి యొనర్చుచుండి, ర

ప్పదుగురుపోవుమార్గమునుబట్టుటయుక్తముగాఁ దలంచుచున్‌॥      10

గీ॥ తనదు నేల్బడి తగ్గించుకొనెడునట్లుఁ

దనకుఁ దనవారసులకును దరతరంబు

గా ‘‘తవర్జీ’’ యనెడు వార్షికంబు భృతిని

వారొసగునట్లు సంధి నేర్పఱచుకొనియె॥                   11

మ॥ అతఁడా సంధినిబట్టి సంకుచిత రాజ్యశ్రీకుఁడై యెంతయున్‌

మతి చింతి చునుండె: సంత, ముది సంప్రాప్తింపఁగా పుత్రసం

తతిలేకుండుటఁజేసి, దత్తుగొనియెం దౌహిత్రునిం, ధీరస

మ్మతునిన్‌, ‘మజ్జరి’ వంశ జాతు ‘నరసింహారెడ్డి’ యన్బాలకున్‌॥      12

మ॥ అతఁడే, యాంగ్ల విభుత్వ నేనలకు సింహస్వప్నమై తచ్చమూ

పతి ‘వాట్సన్‌’ దొరకే యడల్‌ గొలిపి, కల్పాంతస్ఫుర ద్భైరవా

కృతి దీపింప రణంబొనర్చి, జనముల్‌ ‘‘రేనాటివీరుం’’ డనం

దతవిఖ్యాతిని గొన్న ధీరుఁ డభిమానస్వాంతుఁ డత్యంతమున్‌॥        13

గీ॥ ప్రజలు ‘‘కుందేఱ’’ టంచును బలుకుచున్న

పావనకుముద్వతీనది, పాఱునేల

నల్లరేగడియౌట ‘‘రేనాటి’’ సీమ

యనగఁ బేరొందె, నదెరెడ్డి జననభూమి॥                    14

గీ॥ మన కథారంగ మద్దాని మధ్యమందుఁ

గ్రాలుచుండుటచే, ‘‘నడిగడ్డ’’ యందు

రచటి ప్రజలంచితాత్ము, లాత్మాభిమాన

పరులు, కష్టించి పనిచేసి బ్రతుకువారు॥                    15

గీ॥ ఆత్మగౌరవమునకు, నావంతయేని

భంగపాటొ సరించిన వానిఁబట్టి

పంతమునమట్టుబెట్టెడు నంతవరకుఁ

బట్టుపట్టుట వారి స్వభావగుణము ॥                  16

గీ॥ అట్టివారికి నాయకుఁడైన కతన

వారిగుణములు రెడ్డికిఁ బట్టువడుచు

రక్తగత, మాభిజాత్యమౌ, రాజసమును

బెంచి, యాతని, వీరాధివీరుఁజేసె॥                      17

క॥ కుందేటికి పడమటితట

మందునగల ‘‘రూపనగుడి’’ యందున జననం

బొందెను తూరుపుతీరం

బందలి ‘‘ఉయ్యాలవాడ’’ యందు వసించెన్‌॥             18

గీ॥ అరయ నీ రెండు గ్రామంబులందు గలవు

రమ్యతరములు దృఢములౌ రాచ నగరు

లందు నివసించువాఁడౌట నతనిశాఖ

వారినందురు ‘‘నగరిండ్ల’’ వారటంచు ॥                   19

గీ॥ వాని కుత్తరదిశ నొక పర్వు దూర

మందుగల ‘‘గుళ్ళదుర్తి’’ యటన్న గ్రామ

మందు, బాల్యంబు గడచి ప్రాయంబువచ్చు

వరకు నల్లారుముద్దుగాఁ బెరిగె నతఁడు॥                 20

గీ॥ శైశవంబాది తగిన శిక్షణము నొంది

తనకు నుచితములైన విద్యలను నేర్చి

మొలకమాసంబు మొగముపై పొటమరించు

నాఁటికే పెక్కుకళల నిష్ణాతుఁడయ్యె॥                   21

గీ॥ పుక్కిటను బట్టి యూదిన మొరమురాళ్లు

చెట్టుకొమ్మలపై నున్న పిట్టలకును

దవిలి కూలంగఁజేయు నంతటి శరీర

బలము నార్జించె వ్యాయామకలనచేత॥                   22

సీ॥ కలికి తురాయి గిల్కొలుపు పట్టురుమాలు

    గట్టిన యు త్తమాంగంబుతోడ

వైష్ణవభక్తి భావము చాటు నూర్ధ్వపుం

    డ్రము నీటుగొలుపు ఫాలంబుతోడఁ

గ్రేవలఁ గెంజాయ రేకలింపారు నా

    తతదీర్ఘ ధవళ నేత్రములతోడఁ

జిఱునిమ్మకాయల నిరువైపునిల్పుకో

    జాలగుబురు మీసములతోడ

గీ॥ వైరిహంవీరవిదళన ప్రళయకాల

దండనిభ ఖడ్గకలిత హస్తంబుతోడ

ప్రజకు భయభక్తి సంభ్రమభావములను

గొలుపు వర్చస్సుతోడ నబ్బలియుఁడలరు॥               23

గీ॥ ఎంత యుద్దండుఁడో యంత శాంతమూర్తి;

యెంతటి శఠుండొ యంతటి మృదులహృదయుఁ;

డెంతనిష్కృష్టభావుఁడో యంత విశద

వర్తనుండు పరిస్థితిఁబట్టిఁ యతఁడు॥                   24

గీ॥ వైర మొదవిన యప్పు డెవ్వానికైన

ఫాలనేత్రంబు విప్పిన శూలపాణి;

తన్నుజేరిన విహితబృందముల కెల్ల

సవిధముననున్న కల్పవృక్షం బతండు॥                  25

కం॥ తనదర్శనంబుఁ గోరుచుఁ

జనుదెంచిన బుధులతోడ సత్కవితాగో

ష్ఠినిఁజరుపుచుండు నాతం

డనయంబును సాహితీప్రియత్వము మెరయన్‌॥              26

ఉ॥ అగ్రకులోద్భవుండు మహితాత్ముఁడు వేంకటసుబ్బయాఖ్యధీ

రాగ్రణి క్రిష్టిపాడనెడు నంతికగ్రామనివాసి నిగ్రహా

నుగ్రహశక్తి వంతుఁడు హనుమదుపాసకుఁ డప్పుడప్డు, వి

ద్యాగ్రహయాళు  రెడ్డి సభయం దొనరించుఁ గళాప్రసంగముల్‌      27

గీ॥ తనకు సాహిత్యగురువు, విద్వద్వరుండు

సంస్కృతాంధ్ర కవిత్వ విశారదుడు

‘‘ఓబుళాచార్యు’’లను వైష్ణవోత్తముండు

దనరుచుండెను రెడ్డి యాస్థానమందు॥                 28

కం॥ కరవాలు నడుము దాపల,

ధరియించి, తురంగమెక్కి, తత్య్రాంతములం

జరియించుచు బాగోగులఁ

బరికించుచుఁ, బ్రజలకాత్మ బాంధవుఁడయ్యెన్‌॥                29

మ॥ అవకాశంబులఁ గొంచుఁ బ్రాంతముల స్వాహాసేయు టేగాక, యి

య్యవనీరాజ్యధనాధికారముల నాయారీతులం బిండుచు

న్న విదేశీయుల పైని ద్వేషము మది న్నానాఁటికిం గాఢమై

యవశుం జేయుచునుండె, నంతట విపర్యాసం బొకం డేర్పడెన్‌       30

మ॥ తనకేటేట ప్రభుత్వమిచ్చు భరణార్థమ్మొక్కయుద్యోగి నా

త్తనయుం ‘కోవెలకుంట్ల కంపతహసిల్‌ దారుండు ‘తత్పూర్వమే

తనకున్‌ రెడ్డికి నొకచోట నొక సందర్భంబునన్‌ సంభవిం

చిన వాగ్వాదము జ్ఞప్తి నుంచుకొని దూషించెన్‌ మదోన్మత్తు డై        31

ఉ॥ దాసరిక్రింద కూడ, నొక దాసరియా, యని యీసడిరచి, యా

దాసరి వచ్చి మమ్మడిగి ద్రవ్యముఁగై కొనవచ్చటన్న, న

చ్చోసమయజ్ఞుఁడై యతఁడు సుంతయు మారువచింపకుండ, వి

చ్చేసి సమస్తముం, దెలియఁజేయగ రెడ్డి మహాగ్రహోగ్రుఁడై              32

మ॥ అవురా! వాఁడధికారదుర్మదముతో నట్లాడెనా? లేక మృ

త్యువు వానిం గబళింపఁబూని ముఖమందున్నిల్చి యాడిరచెనా?

యెవ రేన న్నది వానికిందెలియదా? యెంతేని దుర్గర్వధూ

ర్వివశస్వాంతునిఁ గాలవంచితుని రేపే చీల్చి చెండాడెదన్‌॥           33

గీ॥ వాని రక్తంబు నీకరవాలమునకు

భుక్తినొసఁగక నేనిఁక భోజనంబు

ముట్టఁబోనని పంతంబుఁబట్టి యతఁడు

దాని పరిణామములు నెల్లఁ దలఁచే నిట్లు?                    34

ఉ॥ ఏనొనరింపఁబోవుపని, యిప్పటికిం సుకరంబె, కాని యా

పైని, ప్రభుత్వమే కదలివచ్చు ననుంజెఱపట్ట సైన్యసం

తానముతోడ నప్పుడది నాకు భరంబగు, నౌనుగాక నే

మైనను, వాని నిప్పుడు, యమాలయమంపక యోర్వవచ్చునే!       35

ఉ॥ అంతయెగాక నాదు హృదయంబున నిండిన దేశమాతృకో

పాంతసపర్యలం బ్రథమ మాంగ్ల విభుత్వమడంచు, టయ్యద

త్యంతము దుర్ఘటంబయిన దైనను సర్వమునొడ్డి చేతనై

నంత యొనర్చుచుం బ్రజలయం దొకసంచలనంబుఁ గొల్పెదన్‌      36

చ॥ పరపరిపాలకుల్‌ గొలుపుబాధలు భారతభూమిపైని దు

ర్భరమగుటం బ్రజల్‌ దిరుగుఁబాటున కున్ముఖులౌచునుండిరి

తరుణమునం దెవండయిన ధైర్యమునన్‌ మునుదూకెనేనిఁ ద

త్సరణి కృతార్థ మాప్రథమచర్యకు. నాయది నాందియై తగున్‌॥         37

గీ॥ అనుచుఁ దలపోసి తత్క్రియాయత్తుఁడగుచు

నచటికిని మూఁడు పరువులయందునున్న

‘‘కలవటాల’’కు వార్తను తెలియఁజేయ

రెండువందల బోయలదండు వచ్చె॥                   38

గీ॥ చెప్పి చేసెడిపౌరుషశీలుఁడగుటఁ

దనప్రయత్నంబుఁ దహసీలుదారునకును

దెలుపుటకుగాను నొక్కనిఁ బిలిచి చెప్పెఁ

దనదుమాటలుగా నిట్టులనుమటంచు॥                 39

గీ॥ నీవు పలికినరీతిగా నిజముగాను

దాసరినిసుమ్ము నరసింహదైవమునకు,

నీకుమాత్రము కాలసన్నిభుఁడసుమ్ము,

తెలిసికొను మింత రేప యేతెంతునేను॥                    40

చ॥ గడిచినకాలమందు నొక గౌరవపద్ధతి నిచ్చుచుంట, నే

నడుగుచునుంటి స్వంతధనమైనను నేనిక నన్యునెవ్వనే

నడుగను, కోశమందిరమునందుఁజొరంబడి కొందు, నడ్డమై

దొడరిన వారినందఱినిఁ దుంటలు దుంటలుగాగఁగూల్చుచున్‌॥       41

గీ॥ స్వపరపరిమాణమెంచక పలుకునీకు

దాని ఫలితంబు నిప్పుడందంగఁ జేతుఁ

గాచుకొనుమంచుఁ గోపంబు నాఁచిపట్టి

దూత నా తహసీల్దారుఁ దొరయఁబంపె॥                   42

క॥ మఱునా డుదయంబుననే

పరివారము హెచ్చరించి పయనంబగుచున్‌

నరసింహదై వతంబును

స్మరియించుచు వెడలె సర్వసాధనయుతుఁడై॥             43

గీ॥ ‘‘బడ్డె ఓబన్న’’ యనునతం డురుబలాఢ్యుఁ

డంగరక్షకుఁడై, తనహయము ముందు

జనగ ‘‘కోవెలకుంట్ల’’ ప త్తనము త్రోవ

దండు నడిపించె భండనోద్దండుడగుచు॥                 44

చ॥ అనిమొన నేను నేననుచు నాత్రముఁ జెండెడువారు వై రులం

దునుముటగాక యింకొకటి తోచనివారలు, బోయవారు పే

ర్చినతమితోడ వెందవిలి రెడ్డి తురంగము వెంట ‘‘కోబలీ’’

యని పెడబొబ్బవెట్టుచును సాయుధులై చనుదెంచి రందఱున్‌॥      45

ఉ॥ ‘‘కోవెలకుంట్ల’’పట్టణముఁ గొల్లకొనం జనుదెంచుచుండె సై

న్యావళితోడ రెడ్డియని, యచ్చట నొక్క పుకారుపుట్ట భీ

త్యావిలులై యొకొక్కఁడును నచ్చటనచ్చట గుంపుగూడి, రా

బోపు విపత్తుదాటు ననువుల్‌ పరిశీలనఁజేయుచుండఁగన్‌॥        46

క॥ సమరసముద్భట భటతం

డము కేకలు, మురజపటహఢక్కాఘనరా

వములొరసి బోరుకొల్పఁగఁ

గ్రమముగ నాతండు, పురముకడ కరుదెంచెన్‌॥                47

సీ॥ అనువైనచోట భూమినిఁద్రవ్వి తమకున్న

    ధనమునంతయు దాచుకొనెడువారు

నీయుపద్రవమునం దెట్లేనిఁ గాపాడు.

    మని వేల్పులకు మ్రొక్కుకొనెడువారుఁ

దమకెల్ల శనిరీతి దాపురించెను తహ

    సిల్దారుఁడనుచు దూషించువారుఁ

దమశీలములకు నేతరుగు చేకూరునో

    యని స్త్రీలలో గొంద రడలువారు

గీ॥ నగుచు నప్పురివారెల్లఁ బ్రాణభయము

నిట్టులంబయి పర్వెత్తి, చెట్టుకొకఁడు

గుట్టకొక్కఁడుగా, దాగుకొనిరి, కొంద

ఱిండ్లలో దూరుకొనిరి వాకిండ్లుమూసి॥                  48

గీ॥ నగరమునుజొచ్చి, యది, నిర్జనంబులగుట

బావురుమనెడు వీథులఁబట్టి నడచి

యంచితముగఁ బ్రభుత్వ కార్యాలయములు

వరలు చోటికి నటు సరాసరిగ వెడలె॥                  49

చ॥ తనకడ నప్పుడున్న భటతండమె రెడ్డిని నాపనోపునం

చనుకొని యాత్మరక్షణకునై, యతఁ డెచ్చటికేనిఁ బోకయుం

డెను తహసిలుదా రచటనే, మఱికాలము దాపురించినన్‌

మనుటకు యుక్తమైబరగు మార్గముతోచునె? యేరికేనియున్‌         50

చ॥ అలఘుబలంబుడతోడ నతఁడచ్చటికిం జనుదెంచుచుండ భీ

తిలి, తమయాయుధంబులను దిగ్గున నేలకువైచి యందఱుం

దలకొకత్రోవఁ బర్వులిడి దాగిరి కావలివారు-కూలీ కై

కొలిచెడివారి కిట్టి యనుకూలము లెవ్వడు నేర్పగావలెన్‌ ॥            51

గీ॥ తనదు రక్షకులగువారు, తామె, రక్ష

ణార్థమై పర్యుటరసి, పెల్లరవదించి

ప్రాణ మురియాడ నతఁ డొక్క భవనమందుఁ

దలుపులను మూసికొని లోన దాగుకొనియె॥               53

చ॥ అచటికిఁబోయిచూడ నొకఁడైనను గన్పడఁడయ్యే రెడ్డి కం

దచటచటం దుపాకు లితరాయుధముల్‌ బడియుంట, వానిగాం

చుచుఁ దనరాకదందడినిఁజూచి ప్రభుత్వదళంబు, భీతినొం

దుచుఁ వెత్తియున్నటులఁ దోచెడి వీనినిబట్టి చూచినన్‌॥          54

చ॥ అని తలపోసి కార్యకలనాతురుఁడై, నలువైపులందుఁ గా

పునిలిచి పట్నమంతయును ముట్టుచు, నయ్యధికార దుర్మదాం

ధునిఁ దహసీలుదారునిఁ గనుంగొనితెచ్చుటకై, హుటా హుటిం

బనిచెను రెడ్డి, స్వీయభటవర్గము నీగతి హెచ్చరించుచున్‌॥        54

ఉ॥ మీరెవరైనఁగాని మితిమీరి చరించుచు స్త్రీలపై దురా

చార మొనర్పరా దేవరిసత్వము పూరియుఁగూడ ముట్టరా

దేరికి నూరకే భయ మొకింతయుఁ గొల్పగరాదటం చసా

ధారణధీరవర్తనుఁ డతండు వచించుచుఁ బంపినంతటన్‌॥         55

సీ॥ ప్రతి గృహంబును జొచ్చి ప్రశ్నించి మూలమూ

    లలనున్న గాదెగంపలను వెదకి

బిచ్చగాండ్రున్న చావిళ్ళు సత్రంబులు

    పరికించి వారి నందఱి నడిరచి

పాడుపడినట్లు ప్రతిదేవతాయత

    నముఁజొచ్చి యవలోకనమ్మొనర్చి

గుబురుగాఁబెరిగి దాగుటకు వీలైనట్టి

    చెట్టుచెట్టునుఁ బరీక్షించి చూచి

గీ॥ నగరమంతయు నన్నిప్రాంతముల వెదకి,

యేందుఁగానక, విసువును చెందఁబోక

వారు పలుమారు తహసీలుదారు కొఱకు

చూచుచుండిరి చూచినచోట్ల నెల్ల ॥                  56

గీ॥ అచట రెడ్డియుఁ దత్క్రియావ్యగ్రుఁడగుచు

‘‘ఒడ్డె ఓబన్న’’ యును మఱియొక్కభృత్యుఁ

డనుసరింప ప్రభుత్వ కార్యాలయముల

వెలుపలను లోనఁదిరుగుచు వెదకఁజొచ్చె॥              57

గీ॥ ఒక యగారముఁ జేరి మూసికొనియున్న

తలుపులన్నియొకొక్కటే తట్టిత్రోయఁ

దెఱచుకొనకుండు టరసి, యిందే యతండు

దాగుకొనియుండుననుచు నాత్మందలంచి॥             58

గీ॥ ఓయి! యిచ్చోటనే దాగియున్నవాఁడ

వే! నినుంజూడ నిందాక వెదకుచుంటి

నే! నినుంబోలువార లేయిట్టులున్న

ప్రభుత యెటుసాగు నా నాంగ్లేయ పాలకులకు?               59

మ॥ తమదుష్పాలన క్రింద హైందవుల మ్రందంజేయు నాంగ్ల ప్రభు

త్వము పాదంబులఁబట్టి వారికిని సేవల్‌ సేయుటే గొప్ప భా

గ్యముగా నెంచుచు విఱ్ఱవీగెడు దురాత్మా! నిన్న నీ వన్నవా

క్యము లన్నింటికి నుత్తరంబొసగు మత్ఖడ్గంబు, రమ్మీవలన్‌॥       60

ఉ॥ ద్వారకవాటమీక్షణమె బ్రద్దలుచేసి నినున్‌ యమాలయ

ద్వారముఁజేర్తు నాదుకరవాలము నిచ్చెనగా నొనర్చి; యీ

భారతభూమిపైని నిలువందగ వింతయు; వచ్చుజన్మలో

వారికిఁ బుట్టి యెల్లపుడు వారిపదంబులె గొల్చుచుందుమీ॥         61

మ॥ అని గర్జించుచు రోష విపుల హృదయుండై ముష్టి పైకెత్తి హు

మ్మనుచుంగ్రుద్దిన ఘాతకుందునియ లై యవ్యాకిళుల్‌ నెలఁగూ

ల, నగారంబును జొచ్చి యాతఁ డొక మూల నక్కియున్నట్టి శ

త్రునిపై దూకెను లేడిఁగన్గొనిన శార్దూలంబు చందంబునన్‌॥    62

చ॥ కఱకఱపండ్లునూరి చెడుగా! యిటురమ్మని పట్టి యాడ్చి ని

ర్భరమగు నక్కసమ్ముమెయి, వాని శిరమ్మును గాలదన్నుచుం

గఱకు కటారుఁ గేలఁగొని గ్రక్కునవైవ, శిరంబు మొండెముం

ధరణిపయిం బడెన్‌ రుధిరధారలు మందిరమెల్లఁజిమ్ముచున్‌॥      63

గీ॥ అంతఁ గోశగృహమ్మున కరిగిచూడ

నింత జరుగుచునున్న నావంతయేనిఁ

బెంపుచెదరని ధీరగంభీరముద్ర

వదనమున వెల్గువాడుఁ కన్పడెనొకండు॥                    64

గీ॥ అతఁడు ‘‘బొందిలి నారసిం’’ గనెడు క్షత్రి

యుఁడు-ఖజానాకుఁ గావలియుండె నాఁడు

ఘనకృపాణము నడుముప్రక్కను ధరించి

పాణితలముల నొక్కతుపాకిఁబూని।                 65

గీ॥ ఆత్మకర్తవ్యమునకు నై, ప్రాణమైన

విడుచుటకుఁ గూడ, సంశయపడని వాని

వాలకముఁజూచి, రెడ్డి సంభ్రమమునొంది

అతని కీరీతిఁ బల్కె నాప్యాయముగ॥                  66

శా॥ అన్నా! యెవ్వఁడవో యెఱంగ-మఱి నీయాకారమున్‌ వర్తనం

బు న్నీ వుత్తమ వీరవంశమున సంభూతుండవై యుందు వం

చు న్నాబుద్ధికిఁ దోపఁజేసెడివి, ఓ శూరాగ్రణి! నిక్కమా

నిన్నుబోలినవానిఁజూడ మది నెంతే నాకు నానందమౌ॥         67

ఉ॥ కావున నేనొనర్పఁగల కార్యముఁ దెల్పి హితంబు పల్కుదున్‌

నీవు గ్రహించి మేల్గనుము! నేనిపుడెంతయు, నీ ప్రభుత్వ భాం

డావసధంబు కొల్లఁగొన నాయితమైతిఁ గటారుకేలుతోఁ

గావునఁ బ్రక్కకుందొలఁగి కాంచుచునుండుము యూర కంతయున్‌॥ 68

ఉ॥ కాదని మమ్ము నడ్డుకొనఁగల్గుదువా, యొకరుండనీవు; ని

వే దలపోయు మింత, నవివేకముగాఁ జరియింపఁబోకు, మో

యాదరణీయ! - తప్పుకొనునట్టి యుపాయము గల్గినప్పు డి

మ్మేదిని నెవ్వరేనిఁ దమమీఁది కపాయముఁ దెచ్చుకొందురే?          69

గీ॥ ప్రాణరక్షణ ముఖ్యక ర్తవ్య మనుచుఁ

దలఁచి నీతోడివారందఱును గూడఁ

దప్పుకొన్నారుగాదె? యీ ముప్పునుండి

వారిమార్గము నీ కనుభావ్య మిపుడు ॥                    70

క॥ అందఱికి లేకపోయిన

తొందర, నీకొకని కేల దొడరుచు ననువుల్‌

ముందొడ్డి నిల్వగా! ధన

మందిర మిది నీకు పిత్య్రమా? స్వార్జితమా?             71

చ॥ మఱియొకరీతిఁజూడు, మనమాతృధరిత్రినిఁదోఁ చుచున్నము

ష్కరులు బ్రిటీషువారి ధనసంచయముం బరిరక్షసేయు టె

వ్వరయిన మెత్తురే? ప్రజలు బాగనఁబోని ప్రయత్నమందు ని

ష్ఠురముగ బ్రాణముల్‌ విడువఁజూచుటకన్నను వెఱ్ఱియున్నదే?        72

గీ॥ ఉదరపోషణకందువా! యుర్వియందు

బ్రతుకఁదలఁచిన నెన్నిమార్గములు లేవు?

వెదకుకొననేల? నాభటబృందమందుఁ

జేరుకొనుమోయి! నేన పోషించుచుందు॥                 77

ఉ॥ ఏను బ్రిటీష్‌ ప్రభుత్వమువయిం ధ్వజమెత్తితి, దానిఁ గూల్పఁజేఁ

బూనిన ఖడ్గము న్నిదురఁబుచ్చను, నాకును దోడువచ్చు నె

వ్వానికినైన స్వాగతముఁబల్కెదఁ గూల్చెద నడ్డమైన యె

వ్వానినిఁగాని; నా కితరపద్ధతి యేదియులేదు నెమ్మదిన్‌॥         74

ఉ॥ వారు తలంప నీకుఁ గులబంధువులా? వెనుకాడనేల, ఓ

వీరుఁడ! రమ్ము నా యడుగువెంబడి శస్త్రముఁజేతఁ బూనుచుం

భారతభూమి పైని పరపాలనముం బెకలించు పూన్కితోఁ

బోరెడుపట్ల! బ్రాణములు వోయిన శాశ్వతకీర్తి దక్కెడున్‌॥            75

మ॥ అను నారెడ్డికి నారసింగు వినతుండై పల్కె నీరీతిగాఁ

ననఘా! త్వాదృశులైన యార్యులు మదీయశ్రేయముఁగోరి ప

ల్కిన వాక్యంబులలోని ధర్మమును దర్కింపంగ నాబోటి య

ల్పునకుంగూడదు కాని, నాదు హృదయంబున్‌ విప్పిచూపించెదన్‌॥  76

గీ॥ దేశ హితమెంచి తత్పరిస్థితికిఁ దగిన

క్రమము నారసి కార్యతంత్రమ్ము నడుపు

ప్రభువులకు యుక్తమైనమార్గమ్మె మాకు

భృత్యులకుఁగూడ నర్హమౌనే? మహాత్మ!                 77

గీ॥ జీతమునుగొని, పోషకుల్‌ సెప్పినట్టి

పని నొకింతయు శక్తివంచనము లేక

చేయుచుండుట యొక్కటే, సేవకునకు

పరమధర్మంబుగా నేను పరిగణింతు॥                    78

గీ॥ జన్మభూమికి దాస్యమోక్షణ మొనర్పఁ

దెంపు చూపించినారు, ‘‘బుందేలు ఖండ’’

దేశవాసులు మావారు, దేశభక్తి

నాదుహృదయాన లేకపోలేదు! కాని॥                 79

గీ॥ ఇంతకాలమునుండి యేతృణమొ పణమొ

వారినుండి గ్రహించి జీవనమొనర్చి

సమయ మేతెంచి నప్పు డీ సాకుతోడ

జాఱుకొనుటను మెత్తురే ధీరవరులు॥                  80

గీ॥ స్వపరదేశీయ భేదభావమును గొలువుఁ

జేరుటకుఁ బూర్వమందై నఁ జేయవచ్చు;

చేరి యీరీతి విచికిత్స చేయనగునె?

స్వవిధిఁ బాలింపవలసిన సమయమందు॥               81

గీ॥ ప్రాణభయమునఁ గర్తవ్యపాలనంబు

నుండి తొలఁగుట-మామకానూనకీర్తి

సారబుందేలుఖండ సుక్షత్రియాన్వ

వాయు లెఱుగని క్రొంగ్రొత్త పాఠమయ్య; ॥                    82

చ॥ అని వచియించు భవ్యమతి యాతని నిర్మల ధర్మవీరతా

వినయవివేక రీతులకు విస్మయ మొందుచు, రెడ్డివర్యుఁ డి

ట్లనుకొనె నిప్డనిష్టముగనైనను, నుద్ధతిఁజూపకున్నచోఁ

బని నెరవేరఁబోదనుచు వాని తుపాకినిఁ బట్టి లాగినన్‌॥           83

గీ॥ అతఁడు తాడిత పన్నగంబట్లు రేఁగి

యడిదమును దూసి పై కెత్తు నంతలోన

నాలసించిన నింక నపాయ మనుచు

నొడ్డెయోబన్న వానిని సుత్తరించె॥                 84

గీ॥ క్షణములో నియ్యదంతయు జరిగిపోయె;

నవనిఁ గూలిన యుత్తమప్రాణి ‘‘నార

సింగు’’ నరయుచుఁ గన్నులు చెమ్మగిల్ల

రెడ్డి పరితాపవిహ్వల హృదయుఁడగుచు॥                    85

గీ॥ ఒక్కక్షణ మట్లె నిల్చి, నిట్టూర్పు విడిచి,

యంగరక్షకుఁడైన యోబన్న కనియె

నీదువర్తన దుడుకనరాదు, కాని

యింతసుజనుని మృతికిఁ జింతింతుననుచు॥              86

క॥ అంతట బాండాగారా

భ్యంతరమును జొచ్చి రెడ్డి యందలి ద్రవ్యం

బంతయును కొల్లగై కొని

పంతంబును బూర్తిచేసెఁ బలికినరీతిన్‌॥                 87

గీ॥ వైరియైనట్టి తహశీలుదారు శిరము

బల్లెమునఁగ్రుచ్చి పైకెత్తిపట్టి నడచు

నటుల నొకని నియోగించి భటులతోడ

పట్టణంబెల్ల నూరేగెఁ బ్రబలుఁడగుచు॥                   88

ఉ॥ ఆ మెయిసల్పి తృప్తహృదయంబున నచ్చటి ‘‘రంగనాయక’’

స్వామినిఁగొల్చి, తీర్ధముఁ బ్రసాదముఁగై కొని కాన్కలం భట

స్తోమముఁదన్పి, పేదలకుఁ దోరపుదానములిచ్చి, యంత, స్వ

గ్రామముఁజేరె నాపయిని రాఁగల కార్యములం దలంచుచున్‌॥        89

ద్వితీయ ఘట్టము

గీ॥ నాడు కోవెలకుంట్ల ప్రాంతంబులెల్లఁ

గలిసియుండెను ‘‘కడప’’ మండలమునందుఁ,

గాన, నటనున్న పై యధికారులకును

నెఱుకచేసిరి యీవార్త, నిచటివారు॥                 1

మ॥ అమితాటోపముతోడఁ బట్టపగలే, యారీతి, నిర్భీకతం

దమ యుద్యోగినిఁజంపి, యాపయి ఖజానాఁదోఁచియున్నట్టి దు

ర్దముఁడౌ వానినిఁ గూల్పకున్నఁ దమసామ్రాజ్యంబుపైవిప్లవో

ద్యమముల్‌ పై కొనునంచుఁ దల్లడిలి రయ్యాంగ్లేయులీవార్తకున్‌॥       2

చ॥ తన యధికారముద్ర కల తావుననే యిటులౌటఁ ‘‘కాకరేన్‌’’

అనియెడు మండలాధిపతి, యాగ్రహపూరితచిత్తుఁడౌచు, వెం

టనే యటనున్న రక్షకభటప్రకరంబున కాజ్ఞసేయుచున్‌

బనిచెను రెడ్డివీరుఁజెరపట్టుట ‘కుయ్యలవాడ’ కేపునన్‌॥          3

ఉ॥ వా రధికారియాజ్ఞపయి వచ్చిరి సాయుధులౌచుఁ; గాని, య

వ్వీరుని విక్రమంబు మునుపే వినియుండుటఁ, దత్సమీపముం

జేరెడు గుండెలే కడలుఁ జెందుచుఁ గార్యకలాప మూఢులై

యూరికి వెల్పలం విడిసియుండిరి ప్రాణముఁ జిక్కపట్టుచున్‌.      4

గీ॥ వీరి యీ తీరువెల్ల నవ్వీరవర్యుఁ

డరసి, తనుజేరఁ జడిసియున్నటు గ్రహించె;

నదియుగా కప్పుడేతెంచినట్టి వారు

భరతదేశీయులౌట నిక్కరణిఁ దలచె॥                    5

ఉ॥ జీతముకోస మాయుధము చేతధరించినవారలం భయో

పేతుల యుద్ధభూమి బలిపెట్టుటయుక్తమ; కాన, వీరి, నే

రీతిగనైన వట్టిబెదరింపులతోఁ బరువెత్తఁజేసి, యా

శ్వేతముఖుల్‌ సమీపమును జెందిన నాబల మప్డు చూపెదన్‌॥       6

క॥ అని తలచి, నగరువెల్వడి

యనుచరవర్గంబుతోడ సాయుధుఁడగుచుం

జనుదెంచి రక్షకభటులఁ

గని, ప్రావృట్కాలమేఘ గర్జార్భటిగన్‌॥                 7

గీ॥ పెద్దపులి నైన విడిచేత బిట్టడంచి

కోరలను బీకఁజాలిన వీరవరుల

కాకరంబగు నిచ్చోట కలవిగాని

పనిని సాధింపఁ దలపోసి వచ్చినారొ॥                 8

ఉ॥ ఈ నడిగడ్డ పైకిఁ బగయెత్తుచు నెవ్వఁడు గానివచ్చి కా

లూనగరాదటం చెఱుఁగరో? మఱి మీర లెఱుంగకున్నచో

నే నెఱిఁగింతు నొక్కతృటి నిల్వుఁడటంచును హుంకరించి పం

చాననమట్లు దూకుచు రయంబున వారిని డాయఁబోయినన్‌॥        9

మ॥ అడుగో వచ్చుచునున్నవాఁడు, నరసింహారెడ్డి, కల్పాంతకృ

న్మృడభీమార్భటితో, నటంచును భయంబేపార నల్వైపులన్‌

బడి, పర్వెత్తగఁ జూచి, బోయలు, రణవ్యాపారు లవ్వారి వెం

బడి పర్వెత్తుచుఁ బట్టి రెడ్డికడ నిల్వంబెట్ట, వారందరున్‌॥            10

చ॥ హృదయమునిండి పెల్లుబికి యెంతయు శోకరసంబు కన్నులన్‌

బొదలుచు ధార లైకురియఁ బొంపిరి వోయెడు ప్రాణభీతితో,

బదములఁబట్టివేడగఁ గృపామతియయ్యును, రాజనీతికో

విదుడగు రెడ్డివారి కొకబెత్తు తిరంబుగ నుండునట్లుగన్‌॥            11

గీ॥ మొదటి తప్పౌట మిమ్ము నిప్పుడు క్షమింతు,

నెన్నడేఁగాని యిటువత్తురేని నింకఁ

బ్రాణములు మేన నిల్వబోవను యథార్థ

మెఱిఁగి మెలఁగుఁడటంచు హెచ్చరికఁజేసి॥                 12

క॥ మఱియొకసంగతి; మీ సహ

చరులగుమనభారతీయ జనములకీ హె

చ్చరిక నెఱిఁగించుఁ, డని యం

దరి నాతఁడు విడిచిపెట్టె నయమేపారన్‌॥                 13

గీ॥ వచ్చునప్పుడు తమవెంటఁ దెచ్చుకొనిన

పెనుదుపాకులు గుఱ్ఱముల్‌ వివిధవస్తు

చయముఁ గోల్పోయి, రిక్తహస్తములతోడ

వెడలపోయిరి యచ్చోటు విడచి పెట్టి॥                    14

గీ॥ వారు, మృత్యువు వదన గహ్వరమునుండి

బైటపడినట్లు సంబరపడిరి; కాని,

కడప కరుదెంచి తమ యధికారిజూడ

నడలఁజొచ్చిరి ‘‘యాతఁడేమనునొ’’ యనుచు॥             15

ఉ॥ అంతట రెడ్డిసత్తముఁ డుదంచితరీతిగఁ గోటజేరి, యొ

క్కింత శ్రమంబుకల్గకయే, యీగతి ముందు తలంచినట్లుగా

నంతయు సానుకూలమయినందులకున్‌ మదిలోన నెంతయున్‌

సంతసమంది యాపయిని చక్కటులం దలపోసె నిట్టులన్‌॥            16

ఉ॥ ఇంక బ్రిటీషువారు, శివమెత్తిననుం జెఱపట్టి కూల్ప, స

ర్వంకషమౌ ప్రయత్నమున వత్తురు; వచ్చిననాఁడు, మాతృదే

శాంకిత మద్భుజాగతఖరాసికి విశ్రమమీక, దుర్మనః

పంకిల హూణవాహినులపైఁబడి చీల్చక మిన్నకుందునే?             17

ఉ॥ ఇంతకునేదియెట్లయిన నిప్డరుదెంచెడు కయ్య మింతలో

సాంతముకాదు, శాత్రవు లనంతచమూబలవంతులౌట, న

శ్రాంతము మండలాగ్రము కరంబునఁ దాలిచి జీవితాంత ప

ర్యంతముఁ బోరుచుండవలెఁ బ్రాణము లా హవభూమి నొడ్డుచున్‌॥ 18

నొస్సము కోట

క॥ చిరకాలము జరిగెడు సం

గరమునకుం దగినరీతిగా వ్యూహంబున్‌

నెఱపుకొని సిద్ధపడవలె

నరిసైన్యము లిటకు వచ్చునప్పటి కనుచున్‌॥              19

గీ॥ అచటి కోటనుగల కూపమందు జలము

క్షారరుచినొప్పి త్రావ యోగ్యంబుగామిఁ

దలఁచి, యాతఁడు యుద్ధతంత్రజ్ఞుఁడగుట

‘‘నొసము’’ దుర్గంబునకు నాత్మవసతిమార్చె॥              20

మ॥ అతఁడా దుర్గముఁజొచ్చి నల్దెసలఁ గుడ్యశ్రేణి వీక్షించి, సు

స్థితిగానుండు టెఱింగి, నెమ్మదినిఁ దృప్తింజెంది. యుద్యోగి సం

తతులం బంపి సమస్తభోజనపదార్థంబుల్‌ రణప్రక్రియో

చిత నానావిధసాధనంబుల వెసం జేర్పించె నిండారగన్‌॥          21

గీ॥ ఏడుపరువుల దూరమం దెచటనైన

జరుగు సంగతులెల్ల స్పష్టముగఁ జూచి

చెప్పఁజాలినయంజన సిద్ధుఁడొకఁడు

దనరు ‘‘గోసాయి వెంకన్న’’ యనునతండు॥               22

క॥ జనులు ‘‘మహాత్ముఁడ’’ టంచును

బ్రణుతింపగ మంత్రజపము భగవద్ధ్యానం

బుసు జేసికొనుచు వర్తిలు

ననయంబును ‘‘ఆకుమళ్ల’’ యను గ్రామమునన్‌॥           23

చ॥ అవిరతముం బరార్థము, నుపాసనఁజేసెడు యోగియయ్యుఁ దా

నవసరమైననాఁడు, కరమందుఁ గృపాణముఁదాల్చి భీకరా

హవమున వీరవిక్రమ విహారములన్‌ వెలయింపఁ జాలుయో

ధవరుఁడు, దేశభక్తి సముదార హృదంతరుఁ డాతఁ డెంతయున్‌॥       24

గీ॥ తనకు నేకాంతహిఁతుడౌటఁ, దన మహోద్య

మమున కాతని యంజనమహిమ మిపుల

యవసరంబౌట, రెడ్డీంద్రుఁ డమ్మహాత్ముఁ

బిలిచికొనవచ్చి తన చెంత నిలుపుకొనియె॥                25

ఉ॥ రాయల యల్లుడౌ ‘‘యళియరామ’’ మహీపతి వంశసంభవుం

డాయత బుద్ధిశాలి, సముదంచిత నీతివిశారదుండు, నా

త్రేయస గోత్రుఁ ‘‘డౌకు’’ నగరీనిలయుండు, నిజాప్తుఁడైన ‘‘నా

రాయణరాజు’’ తోడుఁగొన నాతని చెంతకు నేగె నంతటన్‌॥          26

క॥ అరుదెంచి, సఖుఁ డొనర్చిన

మరియాదల కలరి, స్వోద్యమక్రమమెల్లం

గరమెఱిఁగింపఁ దొడంగెను

నరసింహారెడ్డి రాజునకు నీరీతిన్‌॥                        27

శా॥ అన్నా! రోజుకురోజు తీండ్రమగు నయ్యాంగ్లేయ దుష్పాలనం

బెన్నాళ్లంచు సహించుచుందు, మిక నిట్లే చూచుచుంవెయ్యి యేం

డ్లున్నం-దానికడే యడంగునె? మహోద్యోగంబునం బోరికిం

సన్నాహంబొనరించి పైఁ బడకయున్న న్నీవె యోజింపుమా?          28

మ॥ మనపూర్వుల్‌ నరపాలు రేలుతఱి సంపద్వంతమై దేశదే

శనుతింగాంచిన భారతోర్వరఁ బ్రజాసందోహ మీనాఁడు పా

యని దైన్యంబున నన్నవస్త్రములకే నల్లాడగాఁ జొచ్చె, వ

చ్చిన యా[[4]](#footnote-4)*హూణ వణిగ్గణంబు ప్రభుతం జేఁబట్టిపీడిరచుటన్‌॥      29

ఉ॥ తీరని ద్రవ్యకాంక్షఁ బలుతీరుల లాభములం గడిరచు వ్యా

పారులకే ధరిత్రిపయిఁ బ్రాభవమబ్బిననాఁడు, తత్ప్రజా

భారము లొందునట్టి దురవస్థలకున్‌ మఱి పారమున్నదే?

స్ఫారమనీష! నీ వెఱగవా, మది నీ బహిరంగ సత్యమున్‌॥          30

గీ॥ అంతకును మూల హేతువౌ యాంగ్ల విభుతఁ

గుదురుముట్టుగఁ బెకలించి కూల్పకున్న

నినుపగజ్జెల పెద్దమ్మ యీ ధరిత్రి

వదలబోదింక శతశతాబ్దములకైన॥                   31

ఉ॥ అందుల కేను సిద్ధపడి యాయుధమూనితి నీపుఁ గూడ నీ

చందముఁ గొందువేని, నిక సాగదు హూణవిభుత్వమిచ్చటన్‌

సందియమేల? గైకొనుము శస్త్రము, నిర్వుర మేకమైన సం

క్రందనుఁడైన నడ్డుపడఁగల్గునే శాస్త్రవపక్షమూనుచున్‌॥          32

చ॥ అదియునుగాక యీ వసుధయందలి రాజులకున్‌ బ్రజాళికిన్‌

హృదయములందు హుణులపయిం గడు నక్కసు నిండి యున్న దీ

యదనున నన్ని ప్రాంతముల యందును వారును విప్లవంబు స

ల్పుదు, రపు డీ కిరాతక విభుత్వము కూలదె భారతోర్విపై           33

గీ॥ దైవవశమున తహసీలుదారు గాధ

కాకతాళీయమై యొప్పెఁగాని, మునుపె

సిద్ధపడియుంటి, నీ విదేశీయ విభుత

పైని, మనప్రాంతమందు విప్లవము రేప॥                    34

గీ॥ వర్తకముఁజేసికొనుటకై వచ్చియున్న

వారి యదుపాజ్ఞలకుఁ దలవంచుకొనుచు

బ్రతుకుటకు మించి యికఁ బరాభవము కలదె

మానుషంబున్న యెవ్వాని కైనఁగాని?                  35

గీ॥ ప్రథిత పాలకవంశసంభవులమైన