శ్రీలక్ష్మీనరసరామణీయకం › స్వాతంత్య్రవీరుడు — 4
స్వాతంత్య్రవీరుడు — 4
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 26 / 37
మనము స్వాతంత్య్రసమరోద్యమమ్ము నడపి
దేశదుస్థ్సితి మాన్ప యత్నింపకున్న
మన చరిత్రకు మాయనిమచ్చ నిలుచు॥ 36
ఉ॥ ప్రాకటకీర్తి, యయ్యళియ రామనృపాల కులప్రసూతివౌ
నీ కెఱిగింపగావలయునే యిది యింతగ? నేను మాత్ర మే
కాకిగ నైనఁ బోర సమకట్టితిఁ దెంపులులేని తెంపునన్
వీఁక, బ్రిటీషు పాలకుల పీచమడంచుచుఁ బారఁద్రోలఁగన్॥ 37
చ॥ అనితరదేశభక్తియుఁ దదర్చన కై నిటలాక్షు నైన ఢీ
కొన వెనుకంజవేయని యకుంఠిత సాహసదీక్ష పల్కు ప
ల్కున వెలుగొందు రెడ్డిజనకుంజరు వాక్యము లాలకించి,యా
తని సముదీర్ణ వైఖరికిఁ దద్దయు నెమ్మది నబ్రమొంచుచున్॥ 38
గీ॥ ఔకురాజన్యుఁ డమిత దేశాభిమాని
వెఱపెఱుంగని సంగ్రామ వీరమౌళి
యయ్యు, సమయ మెఱింగి కార్యక్రమంబుఁ
గొనెడువాడౌట రెడ్డితో ననియె నిట్లు॥ 39
గీ॥ ఔను! మిత్రమ! నీదువాక్యంబులెల్ల
నక్షరాక్షర సత్యంబు, అంతేగాక
పరవిభుత్వ నిరంకుశత్వమున నలుగు
భారతీయుల కెల్ల సంభావ్యములును॥ 40
క॥ కాని, బలవత్ప్రభుత్వము
పైనిం బహిరంగ విప్లవం బొనరింపం
బూనుటకుముందు, స్తిమితము
గా నరయఁగవలయు దేశకాలస్థితులన్॥ 41
గీ॥ ఈ వనినయట్లు దేశమం దెల్లరకును
గలదు విద్వేష మాంగ్లవర్గంబు పైన,
నైన, నిప్పుడె విప్లవోద్యమమునందు
ముందునకు వత్తురనుకొంట సందియంబు॥ 42
ఉ॥ భారతదేశమెల్ల నొక వ్యక్తిగ సంఘటితంబునొంది, పెం
పారెడు పూన్కితోఁ గవిసినప్పుడుగాక, యపార యుద్ధసం
భార పరీతభూరి పరివార విరాజితులైన యా బ్రిటీష్
వారి నడంపనౌనె, తెగువన్ మనమిర్వుర మెంత పోరినన్? 43
గీ॥ దేశహృదయాంతరస్థ విద్వేషవహ్ని
రవిలి, యేనాటి కైనను ప్రజ్వలించు
నపుడు మన మిట సల్పు నుద్యమము గాలి
వీచినట్లయి యంతట విస్తరించు॥ 44
గీ॥ అట్టి సుముహూర్త మేతెంచునంతవరకు
నీవుమాత్రము స్వీయరక్షా విధాన
మనుసరించుట మేలు-కాదని తెగించి
ముందుకుఱికిన మొదటికే మోసమగును॥ 45
చ॥ అరయగఁ గార్యవాది, సమయాసమయమ్ము లెఱింగియు క్తమౌ
తెఱఁగున సంచరించి, తన ధ్యేయము నొందునుకానియెన్న డేం
ద్వరపడునే? త్వరంపడుచు, వాలునుగై కొని యుద్ధరంగమం
దుఱికినమాత్ర యత్నము ఫలోదయమౌనెయకాల సంగతిన్॥ 46
గీ॥ నెచ్చెలీ! విభ్రమచ్చక్ర నేమి ధార
చందమునఁగ్రిందు మీఁదౌట సహజమరయఁ
గాన, మెలగుము, స్వీయరక్షణమునందె
నేఁడుకానిది రేపౌట నిశ్చయంబు॥ 47
చ॥ అవసరమైన రీతిగ సహాయమొనర్చుచునుందు నిప్పుడీ
ద్రవిణము స్వీకరించి యుచితమ్మగు యత్నముసంఘటించుకొ
మ్మవికలధీరచిత్త! యని, యాతఁ డొసంగ గ్రహించి, యంత, మి
త్రవరుని సమ్మతంబుగొని, తానరుదెంచె నొసంబుఁజేరగన్॥ 48
మ॥ తన చందంబునఁగేల ఖడ్గమును సంధానించి, యాంగ్లేయ పా
లన నిర్మూలన కృన్మహోద్యమము సల్పం దోడువచ్చుంసఖుం
డని, తా నెంచినయట్లుగాక, ధనసాహాయ్యంబు మాత్రంబు స
ల్పిన రాజన్యుని వర్తనంబున కతృప్తింజెందె, డెందంబునన్॥ 49
క॥ మరలఁ దలపోయఁ దొడఁగెను
నరసింహారెడ్డి వరుఁడు, నయకోవిదశే
ఖరుఁడుఁ దనహితముఁ గోరెడు
బరమాప్తుం డౌకురాజు పద్ధతి నిటులన్॥ 50
గీ॥ లక్ష్యమొకటిగనున్న యెల్లరకుఁగూడఁ
గార్యసంధానమార్గ మొక్కటిగనుండు
టరిది, దానవిభేదమున్నంతమాత్ర
వ్యక్తి శీలంబు శంకించు టనుచితంబు॥ 51
గీ॥ ‘ఆప్తవాక్య ముపాదేయ’ మని వచింత్రు
విజ్ఞులగువారు, కావుఁ బ్రియసఖుండు
నుడివియున్నట్టి పథమువెంబడిఁ జరించి
పైన యోచనసేతు నప్పటి విధంబు॥ 52
చ॥ అని మది నిశ్చయించుకొని యాతఁడు వైరులజాడలంగనుం
గొనఁ దగువారలం బనిచి, కోటవసించుచు నప్పుడప్డు వెం
కన తనయంజనంబు మహిమాతిశయంబునఁ దెల్పు చున్న వా
నిని గమనించుచుండె, రణనిష్ఠ నిరంతరజాగరూకుఁడై॥ 53
ఆ.వె॥ ‘ముక్కమళ్ల’ మఱియు ‘ముదిగోడు’ ‘కానాల’
‘సంజమల’యు మొదలు జనపదముల
బోయ లతని పక్షమునఁ జేఱి పోరాడఁ
దరలివచ్చి రాయుధంబులూని॥ 54
గేయం॥ [5]*రాజారావు, రాజబహదురు నారసింహరెడ్డి
రెడ్డికాదు, బంగారపుకడ్డి నరసింహరెడ్డి
ములుకోల కట్టె చేతులొ వుంటే మున్నూటికి మొనగాడు
కరువువచ్చినా కాటక మొచ్చిన ఆదరించె రెడ్డి
రెడ్డికోసమూ ప్రాణంపోయిన స్వర్గం వస్తుంది
యీపొద్దిదియా, రేపు తదియరా, నరుని ప్రాణమోయి
నీటిమీదను, బుగ్గవంటిది నరుని శరీరంబు
పదరా పదరా, తెల్లవారిని పడనరుకుదాము॥ 55
మ॥ అని, యీరీతిగఁ బాడుకొంచుఁ బటు వీరావేశ మేపారగం
దనపై భ క్తికొలంది గుంపులగుచుం, దామంతకుందామె, వ
చ్చినవారిం గని, హర్షజాతపులకస్ఫీతాంగుఁడై యందరిం
దన సేనాబలమందుఁజేర్చుకొనె, నుత్సాహంబునంబొంగుచున్॥ 56
చ॥ ఇతఁ డిటులుండ శ్వేతముఖు లింతయు భారతదేశిసైనిక
ప్రతతిని విశ్వసింపక, కరంబు, స్వజాతి భటాళితో సమా
కృతమగు సేన నంపిరి, సమిద్దపరాక్రము రెడ్డివీరుఁబం
ధితు నొనరింప, డెందమున నిండిన క్రోధము దందడిరపగన్॥ 57
క॥ ధర, లెప్టెంటుకల్నల్
వరపదవిఁ జెలంగువాడు ‘‘వాట్సన్’’ నాముం
డరుదెంచె, నాంగ్లసేనా
పరివృఢుఁడై నొసముపురమువై పున కంతన్॥ 58
క॥ పటుతరసాధనపటలో
ద్భటులయి, రిపుభటులు తరలివచ్చెడు విషయం
బిట వెంకన యంజనమున
స్ఫుటముగఁగని తెలుప రెడ్డిపుంగవుఁ డంతన్॥ 59
గీ॥ అంతికంబునఁగల చెర్వునందు నుండి
యగడితను నింపి మిగిలియుండున్నట్టి జలముఁ
దూములెత్తించి పాఱించి తొలగఁజేసెఁ
గడఁగి, పగతుర నీటియెద్దడిఁ గలంచ॥ 60
క॥ వడిసెలలతోడ ఱాళుల
జడిగాఁ గుప్పించి శత్రుచయమును గగ్గో
ల్వడఁజేయు నేర్పరుల న
ల్గడలం భిత్తికల నిల్వఁగా నియమించెన్॥ 61
గీ॥ పొంగి గుఱిజూచి యొక బాణముననె, శత్రు
మర్మభేదన మొనరించి మట్టుబెట్టు
లావుగలవారు విల్లంబులను ధరించి
వారి కించుకవెనుక నిల్వంగ నునిచి॥ 62
గీ॥ డంబుమీరుచుఁగోటగోడలను జేరి
పైకి నెగఁబ్రాక యత్నించువారినెల్ల
సలసలంగ్రాగి మసలు నూనెలను జిమ్మి
కలఁచి మసిఁజేయఁదగు చక్కటుల నమర్చి॥ 63
గీ॥ అంచితంబుగ నిటుల వ్యూహంబు పన్ని
యితర కృత్యంబులను నిర్వహింపఁదగిన
వారి నియమించి, యన్ని యేర్పాట్లుగనుచు
సిద్ధమగుచుండె నాతండు యుద్ధమునకు॥ 64
చ॥ అనితరసాహసప్రథితుఁడౌ యతఁ డీగతినుండ, శత్రువా
హిను లొక కొంతదూరముననే యరుదెంచుచునున్న వంచు వెం
కన యెఱిగింప రెడ్డివరుఁ డప్పుడు, దృష్టినిగిడ్చి చూడఁగాఁ
గనపడె, రింఖదశ్వఖురఘట్టనజాతమహీరజశ్ఛటల్॥ 65
క॥ అరసి తన యనుచరుల హె
చ్చరికం గావించుచుండ, శాత్రవసైన్యం
బరుదెంచి, చటులధాటీ
స్ఫురణంబున మెరసి కోట ముట్టడి గొనియెన్॥ 66
చ॥ వడిసెలఱాల్ శరంబులు తుపాకుల గుండ్లును రెడ్డి సైన్యముల్
వడిఁ గురిపింపఁజొచ్చె జడివానగ దుర్గమునుండి; హూణులుం
బెడిదముగా శతఘ్నికలు ప్రేల్చుచు, భీషణ మారణాస్త్రముల్
విడుచుచుఁ బోరసాగిరి, కడిరది మగంటిమి, కచ్చెమీరగన్॥ 67
చ॥ ఇవతలినుండి దుర్గమున కేయొకవస్తువు చేరకుండ రే
బవలును కావలిన్నిలిపి, వాట్సను ముట్టడి గట్టిచేసి యు
ద్ధవిధి బెనంగుచుండగ, నుచితజ్ఞుఁడు రెడ్డియు, యుక్త రీతి నా
హవ మొనరించుచుండగ, నహస్సులు కొన్ని గతించె నీగతిన్॥ 68
సీ॥ అంతట వైశాఖ మరుదెంచె రేనాఁట,
మలమలలాడు నెండలకు, వడకు
నలవాటులేకుంట, నాత్మసైన్యంబులు
దిటవేది పొగులుచుండుట గ్రహించె
నదిగాక, తత్ప్రాంతమందలి కూపంబు
లందడుగంటుచు, నపుడు, నీటి
కఱవేర్పడుచునుంట గమనించిఁయికమీద
నిటనిల్చి ముట్టడిరచుట, యసాధ్య
గీ॥ మనుచుఁ దలపోసి, యాంగ్ల సైన్యాధినేత
దుర్గభేదన మొనరించి, దొమ్మిదూకి,
పోరి, యప్పటి సంగరంబును ముగించి
సత్వరంబుగ వెడల నిశ్చయమొనర్చి॥ 69
జగన్నాథమునందలి నరసింహ దేవాలయము
గీ॥ ఆత్రమున ముందు వెనుకల నరయఁబోక
యతఁడు, తనకున్న మందుగుం డ్లన్ని కూడ
నెడతెఱపిలేక గుప్పించి, తొడరెఁగాని
కోటగోడ యొకింతయుఁ గూలదయ్యె॥ 70
గీ॥ నాఁడు, వారికి ‘‘బళ్ళారి’’ నగరమందు
యుద్ధ సామగ్రి గిడ్డంగులుండెఁ గాన
నచటివారికి ‘‘మందుగుండ్లంపుఁ’’ డనుచు
వార్తనంపించెఁ సేనాని వాట్సనంత॥ 71
గీ॥ ఔకురాజున కీ విషయంబుఁ గూఢ
చారు లెఱిగింపఁ, దగుదండు సంతరించి
పంపి దోపించె, బళ్ళారివైపునుండి
శకటములమీద వచ్చు తత్సాధనముల॥ 72
క॥ జరిగిన యీ వృత్తాంతము
నరసింహారెడ్డివర్యునకు వివరముగా
నెఱిగింప లేఖనంపెను
త్వరితంబుగ నొక్కకార్యదక్షుని వెంటన్॥ 73
గీ॥ వాఁడు తగు సాధనములతో బయలుదేరి
యర్ధనిశికెల్ల నొసమున కరిగి శ్వేత
ముఖదళంబులు నిద్దుర మునిగియుంట
గాంచి, మెల్లగఁ గోటదగ్గరికిఁ జేరి॥ 74
గీ॥ రాజొసంగిన లేఖ భద్రముగ నొక్క
బాణమునఁ గట్టి కోటలోఁ బడెడునట్లు
వింటసంధించి, విడచి, తా వెడలెఁ దిరిగి
కటికచీకటి నందరి కనులఁబ్రామి॥ 75
ఆ.వె. భటుఁడొకండు, సుప్రభాత సమయమందు
దుర్గమందుఁబడిన తూపుఁగాంచి
తనకొసంగ రెడ్డి జనవరేణ్యుఁడు విప్పి
సంభ్రమమున లేఖఁ జదువుకొనుచు॥ 76
చ॥ అనుపమ కార్యతంత్ర సమయజ్ఞత, మిత్రమహోదయుం డొన
ర్చిన పనికెంతయు న్ముదముఁజెంది, తదీయ హితానుర క్తి నె
మ్మనమునఁ ప్రస్తుతించి, రిపుమర్మవిదుండగుటందదీయ సే
నను, బహిరంగ సంగరమున న్నుఱుమాడఁదలంచియంతటన్॥ 77
చ॥ భటులకుఁ దెల్పి దుర్గముకవాటములం దెరిపించి కార్యలం
పటుఁడగు రెడ్డివీరుఁ డొక భవ్యతరోన్నత వాజినెక్కి యు
ద్భటముగ హూణవాహినులపైఁ బడి యుద్ధ ముపక్రమించియం
తటఁ జెరలాడె, శత్రుభయదంబుగ నుగ్రనృసింహమూర్తియై॥ 78
ఉ॥ అందినవానినెల్ల హతమార్చుచు, నందనివానికోసమై
ముందున కేగుచున్, సమరభూమి, విలుంఠితశత్రుకంఠని
ష్యందకవోష్ణర క్తకలితాంగకుఁడై వెలుగొందె, గ్రీష్మమ
ధ్యందినచండదీధితివిధంబునఁ జూడ్కికి దుర్నిరీక్షుఁడై॥ 79
ఉ॥ కచ్చెకుఁ గాలుదువ్వి, రిపుకాండము భీకరభండనంబునం
ద్రచ్చి, తదీయర క్తముల స్నానములాడుట కుత్సహించు, న
య్యచ్చపుబోయదండు వివిధాయుధముల్ గొని రెడ్డి వెంబడిన్
వచ్చికలంచఁజొచ్చెఁ బ్రతిపక్షబలంబులఁ బిచ్చలించుచున్॥ 80
మ॥ తొడ బల్ గొట్టుచు, బొబ్బరించుచును, శత్రుశ్రేణులంజీల్చి న
ల్గడలన్ ముట్టుచు, వైరియోధమథనోగ్రస్ఫూర్తి వాటంబు వెం
బడిఁగేలం గరవాలతోమరగద్భాల్లాదులందాల్చి, బి
ట్టడరం బోరగఁజొచ్చి రందఱు రణవ్యాపారపారీణతన్॥ 81
సీ॥ నడుము డాపలనున్న యడిదంబుఁ జేఁబూని
శిరములు పై కెగఁజిమ్మి చిమ్మి
మొలనున్న పిడిబాకు వలనొప్ప ధరియించి
కుత్తుక కోపులం గోసికోసి
కడిమిఁ మూపుననున్న గండ్రగొడ్డలి దాల్చి
కరములు పాదముల్ నఱికి నఱికి
తురగంబుపై భద్రపరచిన బల్లెంబుఁ
గొని, వడిఱొమ్ములం గ్రుమ్మి క్రుమ్మి
గీ॥ దక్షవాటీభయానకోద్దండమూర్తి
వీరభద్రుని యపరావతారమనఁగఁ
జండతేజుండు, రెడ్డివీరుండు, సమర
తలము పీనుఁగు పెంటగా సలుపఁదొడఁగె॥ 82
ఉ॥ ప్రాకటవిక్రమక్రమపరంతపుఁ డాతఁడు హుంకరించుచుం
బై కొని, కేలనున్న కరవాలునకుం క్షణమేని విశ్రమం
బీక, రణోర్వియెల్లఁ జరియించుచు నొక్కనిఁ గూడ జాఱిపో
నీకవధింపఁజొచ్చె, రిపుబృందముపాలిటి కాలమృత్యువై॥ 83
ఉ॥ వంచనతోడ రాజ్యపరిపాలనముంగొని మేను లింతయున్
వంచక భారతోర్వి విభవంబుల దత్తకుమారులట్లు భో
గించు దురాత్ములన్ మిము ముగించి, ముగించెద నేటి సంగరం
బంచుఁ దటిత్పయోదపటలానుగుణధ్వని నార్భటించుచున్॥ 84
ఉ॥ అంచితరీతిఁ గేల నుచితాయుధముం ధరియించుచున్, విజృం
భించి నృసింహరెడ్డి యిటు స్వీయబలంబులఁదాకుచుం బటా
పంచులొనర్చుచున్న నటు, వాట్సను, ప్రాణభయంబుతో, నుడా
యించె, స్వకీయ బాధ్యత నొకింతయు నెంచక వారువంబుపై॥ 85
ఉ॥ దూరమునుండి యంత్రములతో రిపుఁ గూల్చుటె కాని, శౌర్య మే
పార మఖాముఖిం బెనఁగునట్టి మగంటిమిలేమి, వార లె
వ్వారికి వార లై దెసలువట్టుచుఁ బర్విరి, రెడ్డివీరు పెం
పారసి యాంగ్ల నైనికులు, వ్యాఘ్రముఁగన్న కురంగముల్ బలెన్॥ 86
గీ॥ ప్రాణములువీడి కొందరు యమగృహంబుఁ
బ్రాణభయమున మఱికొంద రాత్మగృహముఁ
జేర వెడలంగ, శత్రునిశ్శేషమైన
రణతలము వీడి, రెడ్డి దుర్గమును జేరె॥ 87
చ॥ ఇటుల జయంబుఁగాంచి, పరితృప్తివహించి, యథోచితంబుగా
భటులను దన్పి, భవ్యగుణబంధురుఁడాతఁడు, రెడ్డిసత్తముం
డటుపయి సంభవింపఁగల యాంగ్ల బలంబులతోడి కయ్యముం
బటుగతి నిర్వహింప, మది భావనసేయఁదొడంగె నీగతిన్॥ 88
గీ॥ ఈనొసము ప్రాంతమెల్ల మైదానమగుట
వైరియూధంబులకు దురాపంబుకాదు
కాన, నిటనుండి కార్యరంగమును మార్చు
టురవటంచును, దత్క్రియాపరతఁదనరె ॥ 89
తృతీయ ఘట్టము
సీ॥ అది ‘‘నల్లమల’’ నున్నయడవి, శార్దూలాది
క్రూరమృగాళి విహారభూమి
శ్రీమదహోబల క్షేత్రంబునకు నుత్త
రమున యోజనము దూరమునఁగలదు
తరులతాగుల్మసంతతులతో వ్యాకీర్ణ
మై, యన్యదుర్గమంబైన యచట
స్వకుల పూర్వజభూమిపతులు గట్టించిన
వనదుర్గమున కాత్మవసతి మార్చి
గీ॥ రెడ్డి దానిని శత్రుదుర్భేదముగను
బాగు చేయించి వివిధసంభారములను
నవిరళంబుగఁజేర్పించి యరయుచుండె
నాంగ్ల పరిపాలకులచర్య లనుదినంబు ॥ 1
మ॥ ఒక యాంగ్లేయుఁడు నాడు ‘‘రేంజ’’రను నుద్యోగంబునందుండిపా
లక జాతీయుఁడనన్న దుర్మదముతోడన్ మించి నిత్యంబుఁ ద
న్నికటప్రాంతపుఁ బల్లెలందు జనులన్ వేధించుచున్ లోక కం
టకుఁడై ‘‘రుద్రవరంబు’’ నాఁబఱఁగు వీటన్ గాపురంబుండెడున్॥ 2
సీ॥ వనకందమూలాదులను దెచ్చికొని జీవ
నముసేయు బీదల న్గసరికొట్టి,
గుడిసెల పైఁ గప్పుకొను గడ్డికై యేగు
జనులఁ బీడిరచి లంచములగుంజి
మేత కైయరిగిన మేకల గొఱ్ఱెలఁ
దనతిండి కొఱకు సుద్ధతి గ్రహించి
ప్రొయిమంటకై కాష్ఠములఁ దెచ్చుకొన వెళ్లి
నట్టి కాంతల బల్మిఁ బట్టి చెఱచి
నల్లమల దుర్గమందలి ఫిరంగి
తే.గీ॥ యరయ నచ్చోట రావణాసురుఁడువోలెఁ
దన కెదురు లేక యిచ్చివచ్చిన విధంబు
దుండగంబుల నొసరించుచుండెఁ గాన
రెడ్డి చెవిఁ జేరె వాని దుర్వృత్తమెల్ల॥ 3
తే.గీ॥ ఆంగ్లజాతీయుఁడన్ననే యాగ్రహించు
నట్టి నరసింహరెడ్డి దురాత్ముఁడైన
వానిఁ దెగటార్చి తత్ప్రాంతవాసులకును
శాంతిఁ గలిపింప మదిని నిశ్చయమొనర్చి॥ 4
తే.గీ॥ ఒడ్డెయోబన్న వెంటరా నొక్కనాటి
రాత్రి నరుదెంచి రుద్రవరంబునందు
వాఁడు నివసించు బంగళావద్ద నిలచి
యుఱిమె నీరీతిఁ బురమెల్ల నులికిపడఁగ॥ 5
శా॥ ఓరీ! వచ్చిననాటినుండి యధికారోన్మాదివై క్రౌర్యమే
పారం బల్లెల హింసపెట్టుచుఁ దదీయద్రవ్య మెల్లప్పు డిర
పారన్మెక్కుచుఁ గొవ్వు పెంచినదురాత్మా! త్వత్కృతాఘంబులే
నోరుల్ విప్పిన విప్డు నా యడిదమందు న్నిల్చి నిన్ మ్రింగగన్॥ 6
చ॥ రమ్మోయీ! యిటు, రాక జుణ్గినను నీ ప్రాణంబు రక్షించువా
డిమ్ముల్లోకములందు లేఁ డెవఁడుగానీ, యిప్పుడే నీదు దే
హమ్మున్ ముక్కలు సేసి గ్రద్దలకు నాహారంబుగా వై తు, స
త్యమ్మీమాట తలంచుకొమ్ము తుదిపర్యాయంబు నీవారలన్॥ 7
చ॥ అని యిటు క్రుద్ధసింహనదార్భటి వాకొను రెడ్డి వాక్యముల్
విని, యడలెత్తి యా చెనఁటి స్వీయకుటుంబపురక్ష నైన యో
చన మొనరింప కెంతయును చావుభయంబున దొడ్డివాకిటన్
జని పరువెత్తి వీటఁగల సందులు గొందులు దూరి దాఁగుచున్. 8
తే.గీ॥ భయసముద్రేకవికలిత స్వాంతుఁడగుటఁ
జీమ చిటుకన్న శ్రీ నరసింహరెడ్డి
వచ్చెననుకొని యెగిసెడు ప్రాణములను
జిక్కఁబట్టుచు నందందు నక్కి నక్కి 9
కం॥ తుద కొక చాకలి యింటికి
బెదరుచు నరుదెంచి యశ్రుబిందువు లురలం
బదములఁపై బడి వేడఁగ
సదయాత్మకుఁడగుచు రజకసత్తముఁ డంతన్ 10
తే॥గీ॥ వాని కొకమూలఁ జూపించ, పండఁబెట్టి,
యుదుకుటకుఁదెచ్చి, తనయింట నుంచుకొనిన
పౌరజనముల మాసిన బట్టలెల్లఁ
గప్పి దాచెను శరణార్థిఁ గావనెంచి॥ 11
ఉ॥ అచ్చట రెడ్డి వాని నిలయంబును జెచ్చెరఁ జొచ్చి చూడఁగా
హెచ్చగు శోకభారమున నేడ్చుచునుండిన వాని పిల్లలు
న్నెచ్చెలి దప్ప రేంజ రవినీతుఁడు గన్పడుకుంట బై టికిన్
వచ్చి యతండు పట్టణమున న్వెదుకం దలపోసె నంతటన్॥ 12
కం॥ చనుదెంచి వీథివీథిని
జనముల నడుగంగ వాని జాడం బసిక
ట్టిన పౌరుఁ డొకఁడు దెల్పెను
జనకంటకు చావు తనకు సమ్మతమగుటన్॥ 13
కం॥ పరుగు నచ్చటికిం జని
యరయఁగ నా యింట రేంజరగుపడుకుంటన్
నరసింహరెడ్డి రజకునిఁ
బరిపృచ్ఛ యొనర్చె శ్వేతవదనుని యునికిన్॥ 14
తే॥గీ॥ ఆతఁడు శరణార్థియుసురుఁ గాపాడనెంచి
పలికె ననృతంబుఁ దనకేమి తెలియదనుచు;
గాని తన్ముఖమందలి కళవళికలు
గాంచి సందియ మొంది యోచించుచుండ॥ 15
తే॥గీ॥ ప్రాణభయ మగ్గలంబయి రైంజరపుడు
వడకుచుండుటఁ గప్పిన బట్టలింత
కదలు చుండుట రెడ్డి శేఖరుఁడు గాంచి,
వానిఁ దొలఁగింపఁజేయఁ, గన్పడె నతండు 16
చ॥ అతనిని గాంచినంతనె క్రుధామతి జుట్టును బట్టిలాగి, దు
ర్మతి! నిను మట్టుపెట్టఁగఁ, గరంబున నాయుధ మేటికంచు, హుం
కృతి నొనరించి, ముష్టి పయి కెత్తి, శిరంబున గ్రుద్దఁగా, ధరం
జతికిలఁ గూలి తత్‌క్షణమె చచ్చెను నెత్తుర నోటఁగ్రక్కుచున్॥ 17
ఉ॥ అంతటఁ జాకివైపు నెఱుపారిన చూపులఁ జూడఁగా నతం
డెంతయు బీతునొంది, నిజకృత్యము నున్నది యున్నరీతిగా
నంతయుఁ దెల్ప, వాని శరణాగతరక్షణ ధర్మచింతకున్
సంతసమొందుచు న్వెడలెఁ జయ్యనఁ దాను వసించుకోటకున్॥ 18
తే॥గీ॥ అచటి ప్రజలెల్ల రెడ్డి యేమడుగకున్న
నతని యుద్యమమునకు ధాన్యంబు ధనము
సాధనంబులుఁ దమ తమ శక్తి కొలఁది
నొసఁగుచుండిరి యతఁడున్న వసతికేగి॥ 19
ఉ॥ ‘‘కంబము’’ దానిచుట్టుఁ గల గ్రామములు న్నివసించువారలున్
బంబినదేశభక్తి పరిపాలనపై గడు నేవగింపుఁ జి
తంబులలోనఁ గీల్కొనఁగఁ దామును రుద్రవరంబు వారి చం
దంబు ధనాదికంబులు ఘనంబుగ రెడ్డి కొసంగుచుండగన్॥ 20
తే॥గీ॥ అచటి తహసీలుదారుఁ డియ్యదను నందు
నాంగ్ల పరిపాలకుల ప్రేమ మాదరంబు
నంది, యున్నతపదవిని నొందఁ దలఁచి
జనుల భయపెట్టి వారింపసాగె. మఱియు॥ 21
తే॥గీ॥ వాఁడు కేవల ముద్యోగ బాధ్యతలను
నిర్వహించుటగాక, దానికిని మించి
వ్యవహరించుచు నాంగ్లేయపాలకులకుఁ
బట్టుగొమ్మగ నుండె నాప్రాంతమందు॥ 22
తే॥గీ॥ ప్రజల మనమున స్వాతంత్య్రభావబీజ
ములను నాటుచు, విప్లవోన్ముఖులఁ జేయు
నట్టి నరసింహరెడ్డి ప్రయత్నములను
దెలిసికొనుచుండె గూఢచారులను బంపి॥ 23
ఉ॥ ఆతఁడు భారతీయుఁ డయినప్పటికిం దహసీలుదారుఁ డే
దో తన మేలుకై యిచటి యుద్యమమందలి తీరు తెన్నులన్
శ్వేతముఖాధికారులకుఁ జెప్పుచునుండె సతంబు-నాత్మలా
భాతురచిత్తుఁ డెట్టి పని కైనను సిద్ధము కాఁడె యిద్ధరన్॥ 24
చ॥ అతని ప్రవర్తనంబును నిజానుగు లచ్చటివారు తెల్ప, నం
చితమతిశాలి రెడ్డి జనశేఖరుఁ డిక్కరణిం దలంచె, దు
ర్మతియగు వీనిఁ గాలుని పురంబున కంపక యున్న నుద్యమ
స్థితి కొక చీడపుర్వగుచుఁ జెల్వముఁ బాపి కుదించివేసెడున్॥ 25
ఉ॥ కావున భారతీయుఁడగుఁగాక యితండును వధ్యుఁ డిట్టి దు
ర్భావుల నైతుమేని నిటువంటి దురాత్మకు లాత్మలాభ సం
భావన నాంగ్ల పాలకుల పంచకుఁజేరఁదలంత్రు కాన, ని
ప్డే వధియింపఁగా వలయు వీనిని నుద్యమ రక్షణార్థమై॥ 26
తే॥గీ॥ వీని దుర్గతి యిట్టి దుర్వృత్తులకును
జీవితాంతంబు వరకు విస్మృతికిరాని
మంచి గుణపాఠమై యొప్పునంచు రాజ
తంత్రవిదుఁడౌటఁ దత్ప్రయత్నమున నుండె ॥ 27
కం॥ పరిసరపుఁ బల్లెలందున
వరలెడు జనవితతి కోడిపందెము లొకచో
జరుపుకొన దలఁచి వేడుక
నరయుట కై రెడ్డిగారి నాహ్వానింపన్॥ 28
తే॥గీ॥ ప్రాణములు పోవునపుడైనఁ బౌరుషంబు
వదల కెంతయుఁ బోరాడు ప్రాకృతికము
లౌటఁ జరణాయుధముల పోరాట మనిన
వీరవరుఁడగు రెడ్డికిఁ బ్రియతమంబు॥ 29
తే॥గీ॥ కాన నద్దానిఁ దిలకించు కౌతుకమున
వారి పిలుపును మన్నించు భావమునను
మఱియు, స్వాతంత్య్రసమరోద్యమ ప్రబోధ
మచట నొనరించు తలఁపున ననుమతించె॥ 30
ఉ॥ ఆ తహసీలుదారు తనకయ్యది చారులు విన్నవింప, నా
రీతిగ వచ్చియున్నపుడు రెడ్డి వరేణ్యునిఁ బట్టియిచ్చినం
బ్రీతి వహించి, గొప్ప పదవి న్దనకి త్తురు హుణులంచు, దు
ర్ణీతిమెయిం దదర్థ మొనరించెఁ బ్రయత్నము చావుమూడుటన్ 31
తే॥గీ॥ అపుడు పోలీసు ‘‘సూపరెం’’ టనెడు పదవి
నుండె నాంగ్లేయుఁ డొకఁడు మహోద్దతుండు
వాని కడకేగి, యుసిఁగొల్పి, వానిఁ గలిసి
వెడలె నచటికి బలగంబు వెంటరాఁగ॥ 32
మ॥ జనముల్ రెడ్డియుఁ గోడిపందెము మహోత్సాహంబుతోఁ జూచుచుం
డ నమాంతంబుగఁ జుట్టుముట్టి తహసీల్దారుండునున్ సూపరెం
టును సజ్జీకృతమౌ భటావళిపటాటోపంబు దీపింప రె
డ్డిని బంధింపఁగ నాజ్ఞఁజేసి రత డప్డే చిక్కిన ట్లెంచుచున్॥ 33
మ॥ భరతక్షోణిఁ బరాయి పెత్తనము విధ్వంసంబుఁ గావింపఁగాఁ
గరవాలుం ధరియించియున్న స్థిరసంకల్పుడు శ్రీరెడ్డిశే
ఖరు బందీగొననుండనా జను లుదగ్రక్రోధులై రేగి యె
వ్వరికి న్వారలె ఱాయిరప్పఁగొని రువ్వంజొచ్చి రవ్వారిపై॥ 34
తే॥గీ॥ వారిలొఁగొంద ఱరుదెంచి వలయముగను
నిలిచి తనకొక రక్షణఁ గొలుప-రెడ్డి
వారి వారించి తన తరవారి దూసి
దుమికె నధికారు లిర్వురఁ ద్రుంచివేయ॥ 35
తే॥గీ॥ సూపరెండెంటు దానినిఁజూచి యపుడు
స్వీయ యత్నంబుపై నాశ విడిచిపెట్టి
బ్రతికి యిలుఁజేర రక్షణార్థము తుపాకి
కాల్పులకు నుత్తరుపు జేసె - కాని భటులు॥ 36
ఉ॥ హైందవులౌటెగాక తమ కచ్చటనుండినవారు స్నేహితుల్
బందుగులౌట, దేశ హితవర్తనుఁడౌ నరసింహరెడ్డిపై
డెందములందు గారవము కడిరదిగ నుండుట గుండ్లు ‘‘ఢామ్మ’’ నన్
దందడిమాత్రఁజేసిరి జనంబులపై గురి దప్పఁబ్రేల్చుచున్॥ 37
చ॥ పదుగురు దేశిసైనికులపై అధికారముఁబూని ‘‘సార్జ’’ నం
బదవి చెలంగువాఁడొకని వంతున నుండిరి యాంగ్ల సైనికుల్
పదుగురు, వారు మాత్రము తుపాకుల సూటిగఁబ్రేల్చఁ జొచ్చిర
య్యదిగని గుండ్లుకు న్వెఱవ కందఱు వారలపైకిదూకుచున్॥ 38
చ॥ పిలపిలఁ జుట్టుముట్టుకొని వెంటనే వారల పెందుపాకులన్
బలిమిని లాగి పెల్లుబికి వచ్చెడు క్రోధముదీర మోదుచుం
గలఁచి వధించుచుండుటను గన్గొని యయ్యధికారులష్ఠు భీ
తిలుచు గుఱాలపైఁ బరుగుఁదీసిరి ప్రాణముమీది యాశలన్॥ 39
ఉ॥ వా రటు పర్వుట న్గని సపత్నకులాంతకుఁడైన రెడ్డియున్
వారువ మెక్కి వెంటఁబడి పర్వులు దీయుచు డగ్గరించి య
వ్వారల నిర్వురం గుటిలభావులు నొక్కనివెంట నొక్కనిం
గ్రూరత రాసిధారఁ దెగఁ గూల్చెను మేనులు తుంటలై పడన్॥ 40
తే॥గీ॥ కాంక్ష మెయిఁ గోడిపందెంబుఁ గనుటె కాక
దురితచిత్తుండు దేశవిద్రోహీ నొకని
దేశపీడకు నాంగ్లజాతీయు నొకనిఁ
గూల్చినందుల కై తృప్తిఁగొనుచు నతఁడు॥ 41
కం॥ జనుల కడకేగి వారికిఁ
దన యుద్యమలక్ష్యమెల్లఁ దద్దయు బోధం
బొనరించి నిజనివాసం
బునకుం జనుదెంచె రెడ్డిపుంగవుఁ డంతన్॥ 42
చతుర్థ ఘట్టము
తే॥గీ॥ ప్రథితమగు ‘‘చెన్న నగరంబు’’ రాజధాని
కాఁగ నానాడు తెల్ల సర్కారువారు
దక్షిణాపథరాజ్యతంత్య్రముల నెల్ల
నరయుచుండిరి స్వీయసైన్యములబలిమి॥ 1
చ॥ ప్రముఖ చమూధవుండు బలవంతుఁడు ‘‘వాట్సను’’ వంటివాఁడె యు
ద్ధమున నృసింహరెడ్డి పటుధాటికిఁ దాళఁగలేక, స్వీయసై
న్యము బలిపెట్టి, సాధనచయంబును సర్వముఁ గోలుపోయి బి
క్క మొగముతోడఁ బర్వుచు నగారముఁజేరిన నాటినుండియున్॥ 2
తే॥గీ॥ తెల్లదొరలెల్ల మదిఁ దల్లడిల్లుచుండ
వార్తలరుదెంచెఁ గంబమువైపునుండి
యచట జరిగిన విషయంబు అన్ని యెఱిఁగి
యంత సభదీరి రంద ఱేకాంతమందు॥ 3
మ॥ మనకుం బానిసగాఁగ నుంటఁదగు సామాన్యుం డొకం డివ్విధం
బున సైన్యంబును బ్రోగుఁజేసికొని పెంపుం జెంది దుర్వారుఁడై
మనపైఁ గత్తిని గట్టినాఁడనిన సామ్రాజ్యాధిపత్యం బిటన్
మనకుం దక్కునె? దక్కనిచ్చునె? జయోన్మాదంబున న్వాఁడిఁకన్॥ 4
మ॥ కనుకన్ సర్వబలములు గుప్పి సముదగ్రస్పూర్తిఁ బోరాడి యా
తని బంధించి వధించుటే ప్రథమకర్తవ్యం బిఁకం జాగొన
ర్చినచో దేశమునం బ్రజావితతిఁ బ్రేరేపించి యొక్కమ్మడిన్
మనపై దూకెడులాగు తోచునని సంభావించి వారందఱున్॥ 5
కం॥ ఘనమగు ‘‘కెప్టెన్’’ పదవిం
దనరెడు సేనానియైన ‘‘నార్టన్’’ నాముం
బనుపఁగ నాతం డుదుటునఁ
జనె విరివిగ సాధనములు సైన్యముఁ గొనుచున్॥ 6
సీ॥ తమకుఁబాలితుఁడౌచుఁ దమమీదకే కత్తి
గొన్నట్టి రెడ్డి పైఁ గ్రోధకలన
తొలుతటి సేనాని కలవిగాని పని సా
ధించి యశోలక్ష్మిఁ గాంచుకాంక్ష
చిరకాలయు ద్ధోపజీవియౌటఁ స్వకీయ
రణకౌశలముపై నిఁబ్రత్యయంబు
సహజ ధైర్య స్థైర్య శౌర్యవంతుండౌటఁ
గదనోర్వి విహరించు కౌతుకంబు॥
తే॥గీ॥ నాత్మమెరయఁగ నాంగ్లసైన్యాధినేత
భీషణంబుగఁ బ్రస్థానభేరి మొఱయ
బండ్లు గుండ్లును మంది మార్బలముతోడ
నల్ల మలప్రాంతమునకుఁ బైనంబు సలిపి॥ 7
కం॥ ఘనుఁడైన రెడ్డి వీరుఁడు
దనరెడు గిరిదుర్గమునకు దవ్వులనుంటం
దనదళము విడిది జేయిం
చెను నార్టను ‘‘గిద్దలూరు’’ చెంగట నంతన్॥ 8
చ॥ అచటికి రెడ్డికోట యొక యామడదూరమునందు నుండె వృ
క్షచయము, గుండ్లు, గుట్టలును గల్గిన దుర్గమదేశమంతయున్
బ్రచుర విభుత్వశక్తి గలవాడగు నార్టను వానినెల్లఁ గొ
ట్టి చదును జేసి త్రోవనెగడిరపఁగ యత్న మొనర్చుచుండఁగన్ 9
చ॥ అతని క్రియాకలాపమును నాతనికుండిన వస్తుసం చయం
బతని బలంబు పెంపును నిజానుచరు ల్వివిరించి తెల్పఁగా
స్థితిగతు లాకళించుకొని ధీనిధి రెడ్డి స్వకీయసైనిక
ప్రతతిని ముఖ్యులై పరగువారిని బిల్చి వచించె నీగతిన్॥ 10
మ॥ హితులారా! రిపువర్గదుర్గమ మటం చిచ్చోటికి న్వచ్చి చే
రితి, మీ దుర్గముప్రాపుగాంచి భరతొర్విం బట్టి పీడిరచు దు
ర్మదుల న్వైనముఁజూచి కూల్చుటకు, నాప్రత్యర్థులే వచ్చిరా
యతయత్నంబున గిద్దలూరుకడ కుద్యత్సంగరాటోపులై॥ 11