శ్రీలక్ష్మీనరసరామణీయకం › స్వాతంత్య్రవీరుడు — 5
స్వాతంత్య్రవీరుడు — 5
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 27 / 37
కం॥ మనమిఁక జాగొనరింపక
ఘనయత్నముతోడ వారి స్కంధావారం
బును జొచ్చి శ్వేతవదనుల
హననం బొనరింపవలయు నటుగాకున్నన్॥ 12
ఉ॥ దారిని గల్లఁజేసికొని దగ్గరకుం జనుదెంచి దుర్గమున్
వారి దళంబు చుట్టుకొనిన న్మనకప్పుడు బైటినుండి సం
భారము లెవ్వి యందెడు నుపాయము కల్గదొకింత దానఁ దా
ఱ్మాఱగు వ్యూహ మాపయిఁ గరంబు భరంబులగుం బరిస్థితుల్ 13
తే॥గీ॥ కాన నేనాటి కైన దుర్గంబుదరికి
నరిదళంబులఁ జేరనీయంగరాదు
దీనిప్రాపున్న నెన్నినాళ్లైనఁ బోరఁ
గల్గుదుము. లక్ష్యసిద్ధినిఁ గాంచఁగలము॥ 14
తే॥గీ॥ భరతసామ్రాజ్య మఱచేతఁబట్టియున్న
వైరివితతికి మనకున్న బలపరిమితి
హస్తిమశకంబులకు నున్నయంత భేద
మెసఁగుఁ గావునఁ దగురీతి మసలవలయు॥ 15
కం॥ ఘోరతరమారణాస్త్ర
స్పారబలాన్వితుల రిపుల బహిరంగముగాఁ
జీఱు టసాధ్యము కావున
వా రేమఱియున్నయపుడె వధియింపవలెన్॥ 16
మ॥ అరయన్ లక్ష్య ముదాత్త ధర్మకలితం బైనప్డు తత్సిద్ధి కా
చరణీయంబగుకార్య మెట్టిదయినన్ సర్వంబుఁ దద్ధర్మ వి
స్ఫురణం జెందుటఁ జేసి గ్రాహ్యమగు విజ్ఞుల్ నింద్యమంచుం దలం
పరు కాన న్మన మట్లు శాత్రవులఁ ద్రుంపన్వచ్చు నిశ్శంకఁగన్॥ 17
చ॥ సమయము జాఱనీక రిపుసంఘముఁగూలుతుమేని స్వీయరా
జ్యము నెలకొల్పవచ్చు నిట సర్వజనుల్ మన పాలనాధికా
రముఁ దలఁదాల్తు రిట్లొక స్వరాజ్యము వెల్గుటఁ జూచి క్రొత్త దై
ర్యము మొలకెత్త దేశమున నంతట బుట్టు స్వతంత్య్రరాజ్యముల్॥ 18
తే॥గీ॥ మనము సాగించు నీ యుద్యమమ్మె, యట్లు
వ్యాప్తమై మాతృదేశదాస్యము నడంచుఁ
గాన మనజన్మ ధన్యతఁ గాంచుననుచు
వారి కెఱిఁగించి యాపైనఁ బైనమయ్యె॥ 19
తే॥గీ॥ అది యమావాస్యరాత్రి, దిశాంగణములఁ
గజ్జల మలందినట్లు చీఁకట్లు గ్రమ్మెఁ
బృథులనన్నాహుఁడై నడిరేయి కెల్ల
శత్రు శిబిరంబుఁ జేరె నా సాహసికుఁడు॥ 20
కం॥ అరిపరివారము నిద్రా
పరవశమైయుండె రెడ్డిభటు లా శిబిరాం
తరమున కతిగూఢంబుగ
నరిగి యటన్వెలుఁ గుదివ్వె లార్చుచునుండన్॥ 21
తే॥గీ॥ దానికావలివా రింతలో నెఱింగి
బిత్తరం బొంది కేకలు పెట్టఁదొడఁగి
రంత నరసింహరెడ్డి సైన్యంబు శ్వేత
వదన సంహారకర్మ కుపక్రమించె॥ 22
ఆ॥వె॥ తమ్ము నేమఱించి తప్పించుకొనిపోయి
నట్టివార లెవ్వరైనఁగాని
సమరమునకు నాయుధములు గైకొనకుండ
రెడ్డివరుఁడు దూరదృష్టి మెఱయ॥ 23
తే॥గీ॥ తనదు భటబృందమందుఁ గొందఱినిఁ బంప
వారు వైరులు తమకున్న ప్రధన సాధ
నంబు లుంచిన పటకుటీరంబుచుట్టు
నిలిచి రరుదెంచి విచ్చుకత్తులు ధరించి॥ 24
చ॥ అటునిటుఁబర్వువార లెవరైనది కన్గొని హూణులైనచోఁ
బటుతరధారఁగూల్చుచు నెవండును బైటికి జాఱకుండ నం
తటఁ బసిగట్టుచున్ రిపువిదారణదారుణకర్మఁ జిమ్మ చీఁ
కటి విహరించె రెడ్డి తనకై దువుఁ గేల ధరించియంతటన్॥ 25
చ॥ ఒకనిశిరంబుఁద్రుంచి, మఱియొక్కని బాహువులు తరించి యిం
కొకనియురంబుఁజీల్చి, మఱియొక్క నినెత్తురు నేలరాల్చి యిం
కొకని గళంబుఁగోసి, మఱియొక్కని ప్రేవులు దీసి, శాత్రవ
ప్రకరముఁ దూలఁజేసె నిటు వాటమువెంటమహోద్భటంబుగన్॥ 26
చ॥ హతవిమతాంగకీర్ణ శిబిరాంగణమందు నిశీథినిన్ భట
ప్రతతినిఁ గూడి శేషరిపువర్గముఁ గూల్చుటకై చరించు న
య్యతులిత కార్యశూరుఁడు భయంకరుఁడై కనుపెట్టె భూతనం
వృతుఁడయి ప్రేతభూమి విహరించెడు పావకనేత్రుఁడో యనన్॥ 27
తే॥గీ॥ అతని భటులును శత్రుసంహార పరత
నొకని కొక్కఁడు దీసిపోకుండ మించి
శ్వేతవదనులఁ గూల్చి రవ్వీరునకును
దగిన యనుచరులనఁగ నంతటఁ జరించి॥ 28
కం॥ తలవని తలంపుగా రిపు
బలములు పైఁ బడుట శ్వేతవదనులు సంఖ్యా
బల మాయోధనసాధన
ములు గల్గియు నుసురు గోలుపోయి రనేకుల్॥ 29
చం॥ అలమిన కారుచీకటిసహాయమున న్నరసింహరెడ్డి సే
నల కనుబ్రామి సైన్యపతి నార్టను కొందఱు హూణసైనికుల్
పలుదెసలందుఁ దప్పుకొని పర్విడి ప్రాణము మేన నిల్పుకోఁ
గలిగిరి; యింతలోన నటు గన్పడఁ జొచ్చెఁబ్రబాత దీధితుల్ 30
చం॥ అటుల నరాతిశూన్యమగు నా శిబిరంబుననున్న యాయుధ
చ్ఛటలును నట్లే యన్యమగు సాధన సంపదఁగొల్లఁగొట్టి, య
ప్పటి నిజయత్నము న్విజయవంతముగా నిటు నిర్వహించి యం
తటఁ దన కోటఁజేరె భటతండముతోడ నఖండతేజుడై॥ 31
తే॥గీ॥ నార్టనంతట బళ్ళారినగర మేగి
యచటనున్నట్టి సర్వసైన్యములతోడఁ
దిరిగి యరుదెంచెఁ బరిభవస్ఫురణ రగులు
నగ్గి గ్రక్కుచు రెడ్డిని బుగ్గిసేయ॥ 32
చం॥ ప్రకటబలోత్తరుండగుచువచ్చి యతండు మహాపరాభవ
ప్రకుపితచిత్తుఁడౌటఁ దను ప్రాభవ వైభవమెల్ల గుప్పుచుం
జకచక త్రోవనేర్పఱుప సాగెను రెడ్డివసించుకోటచెం
తకు దన యుద్ధసాధనసనాథ చమూసముదాయముల్ సనన్ 33
తే॥గీ॥ శత్రుగళనాళ నిర్యదస్రస్రవంతిఁ
బ్రధన జయనౌక నడుపుకైవర్తమౌళి
రెడ్డివీరునిరేఖ వక్రించె నేమొ
దుర్నిమిత్తంబు లగుపడఁదొడఁగె నపుడు॥ 34
తే॥గీ॥ అతని విడనాడి సతియేగె నమరపురికి
నమ్మహాసాధ్వి యతని కర్ధాంగలక్ష్మి
యగుచు సేవించుచుండఁ గార్యములయందు
విజయలక్ష్మియు నట్లే సేవించుచుండె॥ 36
తే॥గీ॥ రెడ్డి జనయిత్రి యితర యాత్రికులతోడఁ
గలిసి చనియుండెఁ బూర్వమే కాశిపురికి
నామె యటఁ గాలధర్మంబునందె ననుచుఁ
దిరిగి వచ్చిన యాత్రికుల్ దెలిపి రపుడె॥ 37
ఉ॥ వ్రేటును దిన్న పెద్దపులి బెట్టున మీదికి దూకుచుండె నా
ర్భాటముతో నపారబలవద్రిపుసేన నిజార్ధదేహమౌ
బోటినిఁ దల్లి నట్లే కొనిపోయెను మృత్యువు కాని, యాత్మ నా
రాటము నొందఁ డవ్విధిపరాయణుఁ డెంతటి కర్మయోగియో॥ 37
తే॥గీ॥ తల్లికిని భార్యకును నౌర్ఖ్వదైహికములు
శాస్త్రసమ్మతి జరిపించి, స్వప్రయత్న
తత్పరుండెయ్యె భావియుద్ధంబునకును
దేశభక్తాగ్రగణ్యుఁ డా ధీరమూర్తి॥ 38
కం॥ అనుపమములైన యధు నా
తన మారణ సాధనప్రతానము లొప్పన్
జనుదెంచి కోటముట్టడిఁ
గొనె నంతట నాంగ్లదళ మకుంఠితరీతిన్॥ 39
తే॥గీ॥ నార్ట నంతట దుర్గంబు నాల్గు దెసలఁ
జూచి బలమఱి యున్నట్టి చోటు లెఱిఁగి
పెనుఫిరంగులగుండ్లు ప్రేల్పింపఁ దొడఁగె
నన్నియెడలను దానె ప్రత్యక్షమగుచు॥ 40
చం॥ అతఁడిటులుండ రెడ్డివరుఁ డప్పటితీరు సమీక్షసేయ స్నే
హితులను బిల్చి యిట్లు వచియించెను ‘‘శాత్రపు లక్కసించి వి
స్తృతబలపూర్ణులౌచు నరుదెంచిరి; యంతీయగాక వస్తుసం
తతులును వారికన్నియు సతంబును వచ్చుచునుండుఁగావునన్॥ 41
ఉ॥ ఎన్నిదినంబులైన నిటులే మన దుర్గము ముట్టడిరచుచుం
బన్నుగఁ బోరఁగల్గుదురు వారిఁక-నిప్పటికి కిందు నిల్వలై
యున్నవి తప్పనే మొకటియు న్మనకందు నుపాయ మీపయిన్
సున్నగ నుండుఁ గానఁ దగుచొప్పున నేడు చరింపఁగావలెన్ 42
తే॥గీ॥ అందఱముఁ గూడ నీ దుర్గమందు నున్నఁ
ద్వరితగతిఁ దిండివస్తువుల్ తఱిగిపోవుఁ
గాన మనవారు కొంద ఱెట్లైన బైటి
కరిగి మెలఁగుట యుచిత మట్లైన యపుడు॥ 43
ఉ॥ వారలు రాత్రులందు నిటువచ్చి సమీపములందు దాఁగుచున్
వైరిదళంబుతో నిచటివారలు బైటికి వచ్చి పోరున
ప్డారసి చేతులంగలిపి యాజినొనర్చుచుఁ దెచ్చియున్న సం
భారము లెవ్వియే నిచటివారికి నియ్యఁగవచ్చు నెంతయున్ 44
తే॥గీ॥ పగటివేళల మనము కేవలము స్వీయ
రక్షణమునందె మెలగుఁచు రాత్రులందు
బై టి కరుదెంచి శాత్రవ ద్వజినిఁ దాకు
టుచిత మారీతిఁ బోరాడుచున్న యపుడు॥ 45
కం॥ మన కెపుడై న నపాయము
గనుపించిన, యపుడు చుట్టుఁగల గహనమునం
దనరెడు తరుతతిదాపున
మనవచ్చుఁ దమస్వినీసమయమందైనన్॥ 46
తే॥గీ॥ విపులమతులైన యోబన్న వెంకనయును
బైటివారికి నాయకత్వము వహించి
నడపవలయును గార్యతంత్రముల ననుచుఁ
బలుక, నందఱు నదియె సంభావ్య మనిరి॥ 47
మ॥ తమవ్యూహం బిటు నిర్ణయించుకొని యాతం డంత గాఢాంధకా
రము వ్యాపించిననాటిరాత్రి నిజవీరశ్రేణితోఁగూడి దు
ర్గమునందుండి బహిర్గతుండగుచుఁ దాకన్ శాత్రవుల్ గూడ ను
గ్రముగాఁ బోరఁదొడంగి రస్త్రములు ఢాంకారంబు లేపారఁగన్ 48
తే॥గీ॥ శాత్రవులు పేల్చు మారణాస్త్రములు తమకుఁ
దగులకుండఁగఁ జెట్ల మొదళ్ల వెనుక
నిలిచి నరసింహరెడ్డియోధులు స్వకీయ
సాధనంబులు గుప్పింపసాగి రపుడు ॥ 49
సీ॥ వడిసెలరాయి గూబకు ఠఫీమని తాక
గీపెట్టుచును గూలె క్షితిని నొకఁడు
చాపవినిర్ముక్త శరము వక్షముఁజీల్ప
వాపోవు చూపిరి వదలెనొకఁడు
ఉదుటఁ దుపాకిగుం డుదరంబులో దూర
విలపించుచును మేను విడిచె నొకఁడు
బాంబుదేహముఁదాకి పగిలి క్రంతలు సేయ
మూల్గుచుఁబొరలి కన్మూసె నొకఁడు
గీ॥ స్వభటు లీరీతిఁ బెక్కండ్రు చచ్చుచున్న
నపరి మితముగనుంట నయ్యాంగ్ల నేన
వెఱపునొందక పోరాడెభీషణముగ
రెడ్డి సైన్యముకూడ జీర్ణించెఁ గొంత॥ 50
ఉ॥ వా రటు పోరుచుండఁగ నభంబునఁ దోచెను వేగు జుక్క య
ప్డారసి రెడ్డివీరునిభటావళి ముందనుకొన్నరీతిగాఁ
బోరు ముగించి కొంద ఱటు పోయిరి; తక్కినవారు దుర్గముం
జేరిరి, యీగతిన్ రణము సేయుచునుండిరి రాత్రివేళలన్ 51
కం॥ దుర్గమందుఁ దఱిగిపోయిన
పరికరములు సైన్యమునకు బదులుగఁ బైవా
రురుగతిఁ బంపుట నార్టను
పిఱువోక యహర్నిశంబుఁ బెనఁగుచు నుండెన్॥ 52
తే॥గీ॥ స్వీయ దుర్గస్థకూప పానీయ మొకటి
తక్కఁ దక్కినవన్నియుఁదగ్గి పోయె
నైన నాతఁడు సహజసాహసికుఁడౌటఁ
బూన్కి విడువక రెడ్డియుఁ బోరుచుండె॥ 53
చం॥ గతదివసంబులం గఱవుకాటకముల్ చనుదెంచినప్పు డా
దృతిమెయి నాదుకొన్న తమరెడ్డిపయిం గలభక్తినాత్మజీ
వితముల యుద్ధమందు బలివెట్టిరి, పెట్టగనుండి రంద ఱూ
ర్జితమతి బోయలర వివరింపగ శక్యమె తత్కృతజ్ఞతన్॥ 54
చం॥ కదనములం గ్రమక్రమముగాఁ బలుచంబడి పోవుచున్న స్వీ
యదళముఁజూచి యెంతనుఱుమాడిన యెప్పటికప్డు పూర్ణతం
బొదలుచునున్న శత్రుదళముం బరికించి నృసింహరెడ్డి నె
మ్మదిఁ దలపోయసాగె మతిమంతుఁడుగావున నివ్విధంబునన్॥ 55
తే॥గీ॥ అమితసాధన సజ్జిత మగు నపార
వైరిబృందంబునకు సమీపంబునందు
నాకు మిగిలిన స్వల్పసైన్యంబుతోడ
వసతిఁజేయుట మిగులపాయకరము॥ 56
చం॥ అదియునుగాక యింతవర కాశ్రయమిచ్చుచునున్న దుర్గమి
య్యది యనయంబుఁబ్రేల్చు నభియాతశతఘ్నులగుండ్లుఢాకకున్
బ్రిదులుచుఁ గూలునట్లు కనుపించెడుఁ గావున దీని వెంటనే
వదలి మఱొండుచోటికి నివాసము మార్చుట యుక్త మియ్యెడన్॥ 57
చం॥ అని తలపోసి దీర్ఘముగ నాతఁడు తద్విషయంబు నంతయున్
దన భటపాళికిం దెలిపి ధ్వాంతము నిండినవేళ నుగ్రతన్
మునుపటియట్లు పోరి తరుపుంజముచాటున వైరు లేరికిం
గను పడకుండ నయ్యచలకందర సీమలకేగి రందఱున్॥ 58
చం॥ అటుసని గూఢరీతి నపుడప్పుడు పత్యకలందు నున్న గ్రా
మటికలకేగి యాప్తజనమండలిసాయములం గ్రహించు బె
ప్పటివలె సైన్యములపైఁబడి పోరొనరించుచుండె ను
ద్భటముగ రాత్రులందుఁ బ్రతిపక్షముగుండెలు దల్లడిల్లఁగన్ 59
తే॥గీ॥ స్వభటవర్గంబుతో రెడ్డివరుడు వెడలి
పోయియుండు టెఱుంగమిఁ బూర్వమట్లె
వైరిదళములు దుర్గంబుపై ఫిరంగి
గుండ్లు గుప్పించుచుండె నకుంఠితముగ॥ 60
తే॥గీ॥ అంత నొకచోట దుర్గకుడ్యంబు కూల
విజయసంరంభముగఁ జొచ్చి వెదక విజన
మగుచుఁ గనుపింపఁ దమ వ్యర్థయత్నమునకుఁ
జిన్న వోయిరి సిగ్గున శ్వేతముఖులు॥ 61
కం॥ అంతటనార్టను స్వకృతం
బంతయు నీరీతి వ్యర్థమగుటకు క్షుభిత
స్వాంతుఁడయి యమ్మహీధర
మంతయు గాలించుటకు భటావళిఁ బంపెన్॥ 62
కం॥ నరసింహరెడ్డి రణచా
తురియును దద్వీరగణము దోర్బల సార
స్ఫురణం బింతకుమును పే
యెఱిఁగినవారౌట వార లెద భీతిలియున్॥ 63
చం॥ దళపతియాజ్ఞ యింతయును దాటఁగరానిదియౌటనాయుధం
బులు ధరియించి యొక్కొకచమూగణ మొక్కొకదిక్కుఁజొచ్చి య
య్యలఘుతర ప్రభావవిభవాంచిత రెడ్డినిగూల్ప నమ్మలం
గల విపినంబులుం గుహలు కందరముల్ పరికించు చుండగన్॥ 64
తే॥గీ॥ ఇది యెఱిఁగి రెడ్డివరుఁడు తా మెచటఁగాని
స్థిరవసతి సేయ కగ్గిరిసీమలందు
సంచరించుచుఁ బొంచి వధించుచుండె
శ్వేతముఖసైన్యములు తారసిల్లినపుడు॥ 65
తే॥గీ॥ ఒకశనివాసరపు రాత్రి నోబనయును
వెంకనయు దేవదేవు సేవింప నెంచి
యయ్యహోబల దేవాలయమున కరుగ
నచటఁ గాపుండి కూల్చె నయ్యాంగ్లదళము 66
తే॥గీ॥ స్థిరతరాశయుఁడౌ నరసింహరెడ్డి
మూడు సంవత్సరము లిట్లు పోరుసరికి
స్వభటసంతానమంతయు సమసిపోవ
నతఁడు మాత్రమె యేకాకియగుచు మిగిలే॥ 67
తే॥గీ॥ తనదు నప్పటి యొంటరితనము నెంచి
యక్కసముఁబెంచి, సతము వెంటాడుచున్న
బలసమున్ని ద్రశాత్రవదళము నెంచి
యతులమతిశాలి యాతఁ డీగతిఁ దలంచె? 68
ఉ॥ ఇన్నిదినాలనుండి చరియించుటఁజేసి యరాతిసైన్య మిం
దున్న ప్రతిస్థలం బెఱిఁగియున్నది; యంతియ కాక శ క్తిసం
పన్నము దాని నే నొఁకడ మార్కొన సాధ్యముకాదు; కాన, నేఁ
డిన్నగ సీమల స్వదలి యెచ్చటికేన్ జనుదేరఁ గావలెన్॥ 69
కం॥ చనుదెంచి యట ప్రబోధం
బొనరించుచుఁ దగిన శక్తి యొదవెడుదాఁకన్
సునిగూఢవర్తనంబునఁ
దనరుట యుక్తంబటంచుఁ దలపోసి మదిన్॥ 70
తే॥గీ॥ ‘‘ఎఱ్ఱమల’’ నామధేయ మహీధరంబు
నందునున్న ‘‘జగన్నాథ’’ మనెడుచోట
నలరు నరసింహదేవాలయమును జేరి
స్వీయకార్యక్రమంబు యోజించుచుండె॥ 71
తే॥గీ॥ నల్లమల-దానిచుట్టుప్రాంతంబు లెల్లఁ
బెక్కుమారులు పెనుబూన్కి వెదకి వెదకి
రెడ్డి నరయక నార్టను బృంద మంతఁ
దిరిగి వెళ్లెను వచ్చిన తెరుపుఁబట్టి॥ 72
మ॥ అతఁ డచ్చోట వసించుచున్న విషయంబాపైనిఁగొన్నాళ్లకున్
సితవక్త్రప్రభుతాధికారుల చెవిం జేరగ వా రప్పుడీ
గతి భావించిరి ‘‘వీరుఁడౌ నతని సంగ్రామంబునం దాకి బం
ధితుఁగావించు టసాధ్య మన్యమగురీతింగాక యెప్డేనియున్ ॥ 73
కం॥ అని తలఁచి తగినవారిని
బనుపఁగవా రచటికేగి ప్రచ్ఛన్నముగాఁ
గని పెట్టుచుండి రాతని
దినచర్యలు పరిసరంపు స్థితిగతులెల్లన్॥ 74
తే॥గీ॥ అచటి కంతకమున నున్న ‘‘ఆల్వకొండ’’
యనెడు గ్రామంబునందుండి రతని కాత్మ
బంధువులు; వార లొక గొల్లవానివెంట
నంపుచుండిరి రెడ్డి కన్నాదికముల॥ 75
చం॥ ఇతరుల తోడులేక యొకడే యిటనుండు టెఱింగి కూడ వి
స్తృతభుజసారు రెడ్డి దరిఁజేరగ గుండెలులేకపోవుటం
బ్రతిదివసంబు నచ్చటికి వచ్చెడు గొల్లని సాయముంగొనన్
మతిఁ దలపోసి, శ్వేతవదనప్రభు లంపిన యోధు లాపయిన్ 76
తే॥గీ॥ అతనిఁగనుగొని మాటాడి యడిగినంత
ధనమును నొసంగి తాము చెప్పిన విధముగఁ
బనియొనర్చెడునట్లు లోఁబఱచుకొనిరి
ధనమునంగాని కార్య మిద్ధరణి గలదె?॥ 77
సీ॥ తామిచ్చు మాదక ద్రవ్యంబు రెడ్డి కో
సము తెచ్చునట్టి యన్నమునఁ గలిపి
దానినిభుజియించి మేనిపై స్మృతిలేక
పడియున్నయప్పు డాతఁడు ధరించు
కరవాలు పిస్తోలు గై కొని తమ కిచ్చు
నటులఁ బ్రభుత్వపు భటులు తెలుప
వాఁ డర్థమునకు లోబడియుండుటఁజేసి
యారీతి నంతయు నాచరించె
తే॥గీ॥ దానికిని మున్నె తగిన సాధనము లూని
తత్సమీపమునందు సిద్ధముగనుంటఁ
ద్వరితముగ నేగి శృంఖలాబద్ధుఁ జేసి
రమ్మహావీరు దేశభక్తాగ్రగణ్యు॥ 78
కం॥ ఈ విధముగ బందీగొని
కోవెలకుంట్లకును దీసికొని వెళ్ళిరి మా
యా వృతచిత్తులు వారలు
కోవిదనుతచరితు రెడ్డికులశేఖరునిన్॥ 79
తే॥గీ॥ వేగ నతనికి నురిశిక్షవేసి యమలు
జరిపె సర్కారు క్రైస్తవశకమునందు
బదియు నెన్మిదినూర్ల నల్వదికిఁ బైని
నెనిమిదవయేట నచటి[[6]](#footnote-6)* ‘‘జుఱ్ఱేటి’’ యొద్ద॥ 80
తే॥గీ॥ అతఁడు ప్రారంభ మొనరించినట్టి యుద్య
మమ్మె రవులుచు నొక దశాబ్దమ్మునకును
క్షితి ‘‘సిపాయి పితూరి’’గాఁ గింవదంతిఁ
గన్న ‘‘స్వాతంత్య్ర సమరంబు’’గా జ్వలించె॥ 81
తే॥గీ॥ అతని జీవాత్మ భౌతికమైన తనువు
వదలి యంతట వ్యాపించి బహుమహోద్య
మమ్ములొనరించి యొక శతాబ్దమ్మునకును
మాతృభూమికి స్వాతంత్య్ర మహిమఁగూర్చె॥ 82
-: ప్రాగ్జన్మ స్మృతి :-
శా॥ అన్నా! రెడ్డి కులావతంస! నరసింహారెడ్డి! యుయ్యాలవా
డ న్నీవు న్మఱి నేను జన్మఁగొనియుంటన్-కాలగర్భంబునన్
ఛన్నంబైన భవత్కథం దెనుగుబాసన్ గావ్యమున్ వ్రాసి యు
ష్మన్నామంబునకుం బ్రసిద్ధిగలిగింపన్ యత్నముంజేసితిన్॥
మ॥ అతిలోకోజ్జ్వలదేశభక్తి కలితంబౌ నీ చరిత్రంబుఁ బ
ద్యతతింగూర్పఁ గలంబుఁ గాయితముఁ జేతం బూనినష్టంతయున్
గత జన్మంబున నాకు నీ కేదియొ సఖ్యం బుండియున్నట్లు నా
మతికిం దోచుచుండె వీరనరసింహా రెడ్డిచూడామణి॥
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
శ్రీ
రామచంద్ర పరబ్రహ్మణేనమః