శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › కోదండరామ శతకము

కోదండరామ శతకము

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 28 / 37

గ్రంథ కర్త

పాణ్యం లక్ష్మీనరసయ్య

ముద్రణ

పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు

2022

ధరణినుయ్యలవాడ

సీ. తిగతిగమగరాలు బిగిజిగి కడుదూల సొగసగు తగుసిగ సొమ్ము తోడ

పలుకుపలుకున తేనె లొలుకుచు గులికెడి మొలకనవ్వుల ముద్దుమోముతోడ

చెలువకు కలువరేకుల నిగ్గుదులకించు కలుములీనెడు వాలుగనులతోడ

క్రొక్కారు నీరుదారుల బారు సిరితారు మారొనెర్చిడి మేని సౌరు తోడ

తే.గీ. వలిపెమగు పచ్చపట్టు దువ్వలువ తోడ

నిరులదనరారు మురిపెంపు సరులతోడ

నెదను వదలక నిల్వ గోరెదను దేవ!

ధరణి నుయ్యలవాడ కోదండరామ.

ఉయ్యాలవాడలో మా పూర్వులు కట్టించిన గుడి కోదండ రామాలయం. కవికి ఉపాస్యదైవం ఈ స్వామి. ఈయనను సంభోదిస్తూ మకుటంగా ‘‘ధరిణి నుయ్యలవాడ కోదండరామ’’ అని సాగిన రచన. శతకరచన లక్ష్యం తనకాలంలో నున్న సాంస్కృతిక, సాంఘిక, కుటుంబ, ఆధ్యాత్మిక పరిస్థితులను వాటి అవ్యవస్థను ఎత్తి చూపుతూ సంఘానికి సన్మార్గ నిర్దేశం చేయడం కదా! ధర్మం గురించి శృతి స్మృతి పురాణములను ప్రమాణంగా గైకొని తన సమకాలీన సమాజంలో ఏర్పడిన వికృత ధోరణులను ఎండగట్టారు ఈ శతకంలో. దానికి సున్నితమైన వ్యంగ్యం జతైంది. పాఠకులు ఈ రచన చదివి చక్కగా ఆనందిస్తారు. దానికి తోడు కవి తన భక్తి వైరాగ్యాలను కూడా ప్రకటించారు.

ఇది 1938వ సంవత్సరంలో మొదటిసారి ముద్రించబడిరది. ఇప్పుడు రెండవసారి ముద్రించబడుతుంది. నాటి కాలంలోని కవికి ఆత్మీయులైన కవిపండితులు ఇందులోని విశిష్టతను వివరించారు. వారిలో శతావధాని అనుముల వెంకట శేష కవి, మేడవరం రామబ్రహ్మ శాస్త్రి మొదలైనవారు ఉన్నారు.

నీ మీద భక్తిచే నిఖిల కష్టములోర్వ ప్రహ్లాదుడనుగాను పరమపురుష

నీ మహత్త్వము దెల్పు రామాయణము వ్రాయ వాల్మీకి నే గాను భవ్య చరిత

నీదు కార్యమునకై నిజతనువర్పింప నే జటాయువు గాను నిగమవేద్య

నిన్ను గూర్చి తపంబు నిష్ఠతో సలుపంగ నే ధృవుండను గాను నిర్మలాత్మ

నీ పదద్వందమెదనెప్డు నిలిపికొలువ

నాంజనేయుడగాను దయార్ద్ర హృదయ

నేరమెంచక గావ నీభారమయ్య

ధరణి నుయ్యలవాడ కోదండ రామ

ఈ పద్యంలో ప్రసిద్ధ భక్తులను పేర్కొంటూ నేను వారి వంటి వాణ్ణి కాదు. నాతప్పులన్నీ సైచి కాపాడమని ప్రార్థించినాడు. దృఢ భక్తివిశ్వాసాలతో కష్టాలను ఓర్చుకున్నవాడు ప్రహ్లాదుడు. సాక్షాత్తు వేదసారాన్నీ రామాయణంగా మలచి, రామమహత్వాన్నీ చాటి చెప్పినవాడు వాల్మీకి మహర్షి. సీతాపహరణ సమయంలో రావణునితో పోరాడి ప్రాణత్యాగం చేసినవాడు జటాయువు. బాల్యంలోనే విష్ణుభక్తి తత్పరుడై ఘోరతపస్సుతో అంతరిక్షంలో శాశ్వత స్థానాన్ని పొందినవాడు ధ్రువుడు. నిత్యరామభావనా తత్పరుడై హృదయంలోనే రాముణ్ణి నిల్పుకున్నవాడు హనుమ. నేను అట్టి వానినికాకున్నా నన్ను కాపాడమని కోరుతూ రాముని శరణాగత పరాయణతను వక్కాణిస్తున్నాడు. భక్తి, తపస్సు, ప్రాణత్యాగం, మహత్త్వప్రకటన, పరమనిష్ట వంటి వేవీ లేకున్నా, కేవలం శరణాగతి చాలు అన్న వైష్ణవ సంప్రదాయాన్ని ప్రబోధిస్తున్నది ఈపద్యం.

తనకున్న యంతలో తనివి నొందగలేక భోగంబులకాసజెంది

పని పాటలను వీడి పలుజూదములనాడి పట్టుదుకూలముల్‌ గట్టదొడగి

వ్యవహారములనుంచి వ్యభిచార మొనరించి వ్యాపారములమించి వ్యయముపెంచి

యప్పుగైకొని ద్రవ్య మెప్పుడు మోటార్లు రైళ్లు వకీళ్ళు హోటళ్ల కొసగి

కొన్న ఋణములకొక పెద్ద సున్నజుట్ట

నాలికోయాప్తులకొ తమయాస్తులెల్ల

విక్రయమొనర్చువారలు వెలసిరిపుడు

ధరణి నుయ్యలవాడ కోదండరామ

ఈ పద్యంలో ప్రాచీన సంప్రదాయములను వదలి అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న విదేశీ నాగరికతా వ్యామోహితులైన ప్రజల జీవిత విధానములోని వికృత పార్శ్వాన్నీ చూపుతున్నారు. ఉన్నదానితో తృప్తి పొంద లేక ఆడంబరాలకు లోనై, జూదం వంటి వ్యసనాలకు బానిసలై, ఆదాయాన్ని మించి ఖర్చులు చేస్తూ వాటికోసం అప్పులు చేసి, అవితీర్చకూడదన్న దురుద్దేశ్యంతో కేసులు, లాయర్లు అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆస్తులు తెగనమ్ముకుంటూ లేదా ఆస్తులను భార్యాబిడ్డల పేరుపై మార్చి దివాలా తీసి, ఐ.పి.పెట్టి జీవితాలన్నీ చెల్లాచెదురు చేసుకుంటున్నారని కవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికంతా కారణం ధర్మం తప్పడమే! ప్రాచీన భారతీయ జీవన శైలి విడిచి, నీతి నియమాలు వదలి భ్రష్టు పట్టడం ఇదంతా! ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్లుగా వీరేశలింగము పంతుల రచన రాజశేఖర చరిత్ర, గురజాడ కన్యాశుల్కం, వంటి వాటిలో కనిపిస్తాయి. ఈ కవి కూడా సంఘసంస్కార ధోరణిలో ఈశతకం రచించారు.

స్నాన సంధ్యార్ఘ్య ప్రదాన కాలంబెల్ల కాఫి హోటళ్ళలో గడచిపోయె

నథితిపూజా దేవతార్చనా కాలంబు దినముఖ క్షురకర్మ దీసికొనియె

బ్రహ్మయజ్ఞయ తర్పణ విధి కాలంబు చీట్లపేకాటల జెల్లిపోయె

సత్కథా శ్రవణంబు సలిపెడి కాలంబు క్రాపు దువ్వుటలోన గలసిపోయె

విప్రులే యిట్లు తమవేదవిధుల వీడ

బ్రాహ్మణేతర కృత్యముల్‌ వ్రాయ దరమె

వర్ణ ధర్మంబులన్నియు వనముజేరె

ధరణినుయ్యలవాడ కోదండ రామ

ఈ పద్యంలో కవి ఆచారాలు ఎలా మంటగల్సిపోయినాయో వివరిస్తున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణుల ఆచార భ్రష్టత తలచి ఆవేదన చెందుతున్నాడు. ఆచారాన్ని పాటిస్తూ తద్వారా సమాజానికంతా ధర్మాచరణను నేర్పించవలసినవారు విప్రులే కదా! ‘‘ఆచార ప్రభవో ధర్మః’’ ఆచారం నుండే ధర్మం పుడుతుంది, మరి వారే యేవిధంగా తయారయ్యారో తెల్పుతూ, మిగిలినవారి విషయం చెప్పబని లేదు అంటాడు. విప్రులు స్నానం, సంధ్యావందనం వదలి కాఫీహొటల్లో గడుపుతున్నారు. దేవతార్చన వదలి రోజూ మొహం గీసుకుంటున్నారు. బ్రహ్మయజ్ఞం తర్పణం వదలి పేకాట ఆడుతున్నారు.సత్కథలను వినడం మాని అందం మీద వ్యామోహం పెంచుకున్నారు. బ్రాహ్మలే ఈ విధంగా ఆచారాలను వదలివేస్తుంటే ఇతరుల మాట యెందుకు? దీన్ని ఇంకా వివరించుకుందామా. మనం ఆచారాలను విధివిహితంగా పాటించము. సఱే! ఇప్పటి జీవన విధానాలు అందుకు సహకరించవని కదా మన వాదన. ఒక విషయం గుర్తు చేసుకుందాం. ఈ గ్రంథరచనాకాలం 1938. అంటే ఆంగ్లేయ రాజ్య ప్రభావం తీవ్రంగా ఉన్నకాలం. దానితో మన పద్ధతులన్ని వదలి పర భాష సంస్కృతులు గొప్పవని వ్యామోహం చెందిన కాలం అది. ఇప్పటి మన స్థితికి మూలం అదే కదా. అసలు మానవ స్వభావంలొనే ‘‘కొత్తఒక వింత పాత ఒక రోత’’ వుంది కదా. ఏది కొత్తగా కనిపిస్తుందో దాని వెంట పడీ లేచీ సతమతమవుతున్నాం కదా. మన ‘‘మేధావులు’’ ఇదే మనకు నూరిపోసినారు. దీనిలోనుండి బయటపడే ప్రయత్నం కోసం మన భావాలను సరిదిద్దుకోవడం మన కర్తవ్యం. మరికొన్ని రసగుళికలు చూద్దాం.

గంపెడాసలతోడ గర్భంబు ధరియించి యమితమౌ వేవిళ్ల ననుభవించి

నెలలు తొమ్మిది మోసి నిత్యమ్ము దిగులొంది ఘనమైన ప్రసవ వేదనకునోర్చి

కష్టంబు లెంచక కని రోతలకు సహించి యాకలి దప్పుల కలత జెంది

కమ్మనిపాలిచ్చి కనురెప్పవలె పొంచి ప్రేమతో బాలించి పెద్ద జేసి

పెండ్లి పేరంట మొనరించి ప్రేమజూపి

నట్టి తల్లిని బాధించునట్టి మనుజ

పశువుల సుఖంబు జూచిన పాపమొదవు

ధరణినుయ్యలవాడ కోదండ రామ!

వడ్లు బియ్యముదంచి భార్య సంపాదించు ద్రవ్యంబు కల్లుముంతకును గొట్టి

ఎండలోపల మాడి ఇంతి చేకూర్చిన ప్రత్తిని బీడీల పాలుజేసి

కట్టెమోపుల దెచ్చి కాంత యార్జించిన రొక్కంబు సారాయి గ్రుక్కకిచ్చి

కూలి నాలికి బోయి కోమలి గూర్చిన దుడ్డెల్ల నల్లమందునకు బెట్టి

స్వార్జితమునేని దిననీక యాలి గొట్టి

దిట్టు నట్టి కిరాతుల పొట్ట జీల్చి

మట్టు పెట్టిన పాపంబు చుట్టుకొనునె

ధరణినుయ్యలవాడ కోదండ రామ.

బ్రష్షు లేకుండిన పల్లు దోముట గాదు సీమమల్లున గాని చెమ్మ బోదు

సబ్బు లేకుండిన స్నానమాడగ రాదు సెంటు లేక సుగంధమంటబోదు

భారతవస్త్రముల్‌ పైసోకగారాదు బెల్టు లేకయ చీర బిగివురాదు

బిస్కోతు లేకున్న పిల్ల యేడుపు బోదు కాఫి లేకయ పూట గడవబోదు

హైందవుల నిత్య జీవితాభ్యాసమిటు వి

దేశవస్తువులకు బరాధీనమయ్యె

కాలగర్భమునం దేమి కలదొ యింక

ధరణినుయ్యలవాడ కోదండ రామ.

గణపతి పూజ సక్రమముగ దెలియని వారు పురోహితులైరి నేడు

తిథివారమైనను తెలియజెప్పగలేని వారిల జ్యోతిష్కులైరి నేడు

పిప్పిలిగుణమైన జెప్పగ దెలియనివారు వైద్యోత్తంసులైరి నేడు

గణయతిప్రాసలక్షణమైన దెలియని వారు కవిశ్రేష్టులైరి నేడు

ధర్మశాస్త్ర స్వరూప పద్ధతి తెలియనివారు శాసన నిర్మాతలైరినేడు

ఏమి చెప్పుదు కలికాలమిట్లు చెలగె ధరణి నుయ్యలవాడ కోదండరామ.

కృతజ్ఞత

గీ॥ పొత్తమును సాంతముగ జూచి పొలుపుమీర

మంచిభావంబులొసగిన మాన్యులకును

గ్రంథమును సంస్కరించిన కవివరులకు

సంతతంబును భ క్తినంజలియొనర్తు ॥

పండితాభిప్రాయములు

ఓంనమః పరదేవతాయై

కవితయు గానము నను కలాద్వయము మానవులకు సహజములై పండితపామర విభేదముం బాటింపక యానందము సంఘటించుట లోక విదితము. అందు సంగీతము శవణకాల సహకృతానందమును సులువుగఁ గూర్చుట నిక్కమైనను బ్రహ్మానందసుఖమగు నానందము నొడఁ గూర్చుపట్లఁ గవిత యెక్కడనుటయు నది యాలోచనామృతమను సహృదయ జనోక్తి సాభిప్రాయ మనుటయుఁ దప్పదు ఆ కవిత యాదికాలము నుండి నేఁటివరకును సకలభాషల యందును క్షణక్షణోపచయముం బడయుచు విశ్వశ్రేయోదాయకమై వెలయుచున్నను ఫలపరిగణనమున యశఃప్రభృతులు బహుప్రయోజనములు దోచుచున్నను ‘‘కాం తాసమ్మితతయోపదేశయుజే’’ యను మహాకవివాక్కుఁ దత్వదృష్టి బరిశీలింప నేపండితుఁడైన బ్రధానసిద్ధాంత మని యొప్పుకోవలసినదే.

కవితా నిర్వర్త నీయమగు నుపదేశము పట్ల నితరకవుల కంటె శతక కవులు మిక్కిలి కృతకృత్యులగుట వారియెడ సకల లోకమును గృతజ్ఞమై యుండఁదగును శ్రవ్య దృశ్య ప్రబంధములవలెగాక యాబాలగోపాలము వాడుకకెక్కి లౌకికా లౌకిక ధర్మములు జనులకుద్బోధించు నీ తెగలోని కావ్యములలో లౌకికములకే మిగులఁ బ్రాధాన్యము.

ప్రకృతము బ్రహ్మశ్రీ ఉయ్యాలవాడ పాణ్యం లక్ష్మీ నరసింహయ్య గారు రచించిన శ్రీ కోదండరామశతకము నా మూలాగ్రము నేను జూచితిని అందలి ప్రధానోద్దేశము మానవ నైతిక జీవనముఁ జక్క పరచుటయే అక్కార్యము తత్తత్కాలిక బాహ్యాంభతర ప్రచోదనముం బట్టి ప్రాచీనకవులచేఁ బూర్వనిర్వృత్తమే యైనను నవనవప్రవృద్ధములై క్షణక్షణ పరిణామముంబడయుచు నవనాగరికత యనునామమున దాండవించు దురాచారిపిశాచములఁ దొలఁగించునెడఁ బ్రాక్కాలి కములగుఁట బ్రాచీనశతకము సమర్థములగుట యారసి యాలోటు దీర్ప నీకవి యుద్యమించెనని తోచెడిని పతిపద్యమునందును వీరి యుత్తమాదర్శము తేటపడు చుండును లోకమున కొదవు ననంతానర్థపరంపరను గూర్చిన వీరి యనుతాపము ప్రతిబింబించును అద్దానిఁ జక్క జరుపవలె నన్నఁ బరమేశ్వరుని కట్టెదుట నివేదించుకొనుటయే పరమ కర్తవ్యమని వీరు సంఘటించిన యీ శీర్షికయే చెప్పక చెప్పెడిని వీరి కవిత బలాదాశృష్యమాణ కాక సహజ సౌందర్య భాసురయై రసజ్ఞలోకమునకు ముదముగూర్చుననుట యతిశయోక్తి కాజాలదు తమ దోషజ్ఞత యాత్మవిషయమున నెట్టిదైనను పర కృతులయందు మాత్రము దోషైః దృక్కులై మెలంగువారి కెచ్చోనైనను దొసంగులు గన్పట్టుట సహజము. గాన నిందును వారికవకాశము మొగవు నేమో కాని గుణజ్ఞులకు మాత్రమీకవి శతకమును బరిశీలించుకొలది నట్టిదృష్టి తొలంగక మానదు. విషయమును బట్టి పండితపామర జన వేద్యమగు భాషయే యిక్కావ్యమునకవసరమని వీరు చక్కగా గ్రహించిరి ప్రకృతకాలమున నిట్టికావ్యములే యవసరమగుట నిక్కవివర్యుఁడును వీరి తెగవారు నుత్తరోత్తరాభివృద్ధి బడయుచు లోకోపకారము నెడ నాత్మప్రజ్ఞ నుపయోగించుచుఁ బరమేశ్వరుని కరుణాకటాక్షములకు బాత్రులగుదురు గాక.

__కర్నూలు మేడవరం రామబ్రహ్మ శాస్త్రి __

29-6-38.5 సంస్కృత పండితుడు

__ మున్సిపల్‌ హైస్కూలు__

చ॥ కవివరులందు నేడు శతకంబులు వ్రాయు సమర్థులల్పమ

ట్లవుట నవీన మార్గముల నాశతకంబు రచించి ప్రాజ్ఞ లో

కవిసన్నుతిఁగొన్న మిమ్మిపుడు గట్టిగ సంస్తుతి సఱ్పుటొప్ప దే

నవనవ కల్పనాభిరతి నచ్చదోగో నరసింహ సత్కవీ॥

తే॥గీ॥ పండిత కవీంద్రు లెందఱో ‘భళిర’ యనుచు

బొగడియున్నారు దానమీ పొలుపు దెలిసె

శతకరచనకుఁ గ్రొంగ్రొత్త సౌరులబ్బ

జేయుటల్పంబె? లక్ష్మీనృసింహ సుకవి॥

__ ఇట్లు __

__కర్నూలు శతావధాని అనుముల __

29.6.38 వెంకట శేషకవి.

కవితయన నిట్టిదని దాని స్వరూపమును నిర్ణయింప గలవారు లోకమునఁ బెక్కుండ్రుగలరు. కాని యొకని నిర్ణయము మఱియొక నిర్ణయమును కెప్పుడును భిన్నముగ నేయుండును విమర్శకుడు దనకు నచ్చిన మార్గము నొక్క దానిని మాత్రమే ప్రధానముగా మనము నందిడుకొని చర్చించుచో సత్యమెన్నటికిని బయలుపడదు. కావుననే ‘‘కాపీ కాపీ సరస్వతీ’’ అని యభిజ్ఞులు నుడువుచుందురు. కావ్యమునందు కవియొక్క హృదయము నతని తాత్కాలికావస్థయు సూక్ష్మముగ బ్రతిఫలించుచునే యుండునటయు జాలవఱకు సత్యమే.

బ్రాహశ్రీ వే.పాణ్యం లక్ష్మీనరసయ్యగారు రచియించియున్న శ్రీకోదండ రామశతకమును నేనామూల చూడముగా జదివిపరిశీలించితిని యిందువారి తాత్కాలికావస్థయును గొంతవరకు బ్రతిఫలించింది. అచ్చటచ్చట దమహృదయా వేదనను భగత్సన్నిధావమున తెలుపుకొనినట్లు కానవచ్చెడిని అయినను ముఖ్యముగ నేటి నవ నాగరకత యొక్క విచిత్ర పరిణామములను వాని యనర్థములను లోకమునకు వెల్లడి చేయవలయునను పట్టుదల యిందు బ్రధానముగ గానవచ్చు చున్నది. ప్రకృతకాలమున నిట్టికవిత్వమే విరివిగా నుదయింప వలసియున్నదని నాయభిప్రాయము. అందును శతకరచన కిట్టి సమకాల వర్తనములు విషయ భూతములగుట శ్లాఘ్యము తొల్లింటికొన్ని శతకములు తమయుత్పత్తి కాలము యొక్క చరిత్రమున కిప్పుడెట్లు సాధనములగుచున్నవో యిప్పటి యీశతకము సైతము భావికాలము వారికీ కాలపు జరిత్రమును బోధింపఁగల యుత్తమ సాధనముగా గలదని నేను నమ్ముచున్నాను. ఇట్టి యుత్తమ శతకములను మఱి కొన్నింటిని సైతము రచించి విజ్ఞులహృదయముల నానందవార్థి నోలలాడిరచుచు సకల జనులలోనే దేనియుచితమైన భావపరివర్తనము గలిగింప నీలక్ష్మీ నరసింహయ్యగారకి పరమేశ్వరుడా యురా రోగ్య భాగ్యములొసంగి రక్షించుగాక.

కర్నూలు ఇట్లు

__27-6-38 అనుముల సుబ్రమణ్యశాస్త్రి __

__ తెలుగు పండితుడు__

    __                      మునిసిపల్‌ హైస్కూలు, కర్నూలు__

శ్రీమాన్‌

బ్రహ్మశ్రీ మేడవరం రామస్వామి శాస్త్రులగారి అభిప్రాయం

చ॥ అమరధునీనవీనవి కచాబ్జ మరందరసప్రసార మీ!

క్రమమున జాలువారెననగా భవదంచిత కావ్యమార్య చి

త్తములప్రమోద వారిథి సుధామయవీచిక లందు రామనా

మమువలె దేల్చుచున్న యది మాన్యగుణాకరసుప్రసిద్ధమై

__ ఇట్లు__

__కర్నూలు మేడవరం రామస్వామిశాస్త్రీ, __

__20-6-1938. పౌరాణిక కేసరీ __

__ సుంకేసుల గ్రామం __

__ మార్కాపురం తాలూక__

హైకోర్టు వకీలు రత్నప్రభావతయ్యగారి అభిప్రాయము

ఉయ్యాలవాడ పాణ్యం లక్ష్మీ శ్రీనరసింహం గారిని చాలా కాలము నుండియు నేనెరుగుదును. వారు వ్రాసిన కోదండరామ శతకము నామూలాగ్రము జదివితిని మిక్కిలి సంతసించితిని శైలిసులభమైన చిక్కనితేట మాటలలో నిర్దుష్టముగ నలరారు చున్నది. యిందు భక్తిజ్ఞాన వైరాగ్యములు, వర్ణాశ్రమధర్మములు నవనాగరకతా స్వరూపము లోకచర్యలు మొదలగునవి చర్చింపబడినవి. యిప్పుడు సంఘ సంస్కారమను పేర శృతి స్మృత్యను గుణ్యములకు పూర్వ సాంప్రదాయము లనన్నిటిని దారుమారు చేయుచుండు కాలమున నిట్టి సనాతనధర్మావలంబములగు గ్రంథములు వ్రాయువారఱుదు. యిందు బూర్వాచార పరాయణత్వము చక్కగ వ్యక్తీకరించబడినది. కొన్ని చర్చలయందు కొందరికి మనస్సంకటములుగ నున్నను లోపములను నిష్పక్షపాతముగ చర్చించిరే కాని యేకులమునుగాని యేవ్యక్తినిగాని యేసంఘమునుగాని తూలనాడుట వారి స్వభావము గాదని వారిని సంపూర్ణముగ నెరింగిన వారెల్లరు నంగీకరింపకపోరని నావిశ్వాసము. యీ గ్రంథపఠనము వల్ల గొందరైనను నీతిమార్గము నవలంబించినచో కవి పరిశ్రమ సాఫల్య మొనరించిన వారగుదురు. రాయలసీమ వాసియైన యీకవిగారికి పండితులెల్లరు దగిన ప్రోత్సాహాదరణనులొసంగి గ్రంథరచనోన్మఖుని జేయుదురు గాత. కవిగారికి భగవానుడు దీర్ఘాయురారోగ్వైశ్వర్యములొసంగి, రక్షించుగాత.

__ ఇట్లు__

__కర్నూలు. వి. రత్న ప్రభావతయ్య గారు __

25-10-1987 హైకోర్టు వకీలు, కర్నూలు.

రాచర్ల గ్రామం వై. రాఘవాచార్యుల వారి అభిప్రాయం

గీ॥ తనర నుయ్యలవాడ కో దండరామ

శతకము రచించియాంధ్ర భాషా వధూటి

నవ్యరీతుల గై సేసి నవరసముల

చవులమరిగించి ధర్మంపు సార మెదల

భవ్యరీతుల బ్రజకుఁ జొప్పకఁగఁజేసి

వాగ్విలాసామృతరసంపు వైభవంబు

పాజ్ఞలోకంబుకర్ణపూరంబుఁ జేసి

సకలజనముల మెచ్చుల సంతరించి

జనని రాయలసీమయుత్సాహగరిమఁ

జెలఁగఁ జేసితి లక్ష్మీనృసింహసుకవీ

__ ఇట్లు__

కర్నూలు, వే. రాఘవాచార్యులు

__8-6-1937. సీనియర్‌ తెలుఁగు పండితులు __

__ మునిసిపల్‌ హైస్కూలు, కర్నూలు.__

శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః

విజ్ఞప్తి

చదువరులారా!

శ్రీమదనంత విచిత్రవిలాసాన్వితంబైన యీ ప్రపంచ మన ధర్మాధర్మముల కెప్పటికి పరస్పర సంఘర్షణ మేర్పడుచుండుట ప్రసిద్ధమైయున్నది. యీ ధర్మాధర్మములనే శ్రీ మద్భగవద్గీతయందు శ్రీకృష్ణ భగవానుడు దైవసంపత్తి ఆసుర సంపత్తియని పేర్కొనియున్నాడు. ఈ రెండిరటి సంఘర్షణ మందు నొకప్పుడు ధర్మమునకు, నొకప్పుడ ధర్మమునకు విజయము సేకూరుచుండును. సంపూర్ణ ధర్మాధికమైన కాలము కృతయుగమనియు, ఆధర్మాధికమైనకాలము కలియుగమనియు ఏ తారతమ్యమును బట్టి త్రేతా ద్వాపరయుగములనియు పేర్కొనఁబడుచున్నవి. ధర్మము, భగవత్స్వరూపము, ధర్మాచరణము, భగనత్సేవయే యగును. ధర్మమునుద్ధరించుట భగవత్కృత్యమైయున్నది. శ్రీమద్భగవద్గీతయందు, భగవానుడు

శ్లో॥ యదాయదాహిధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుథ్థానమధర్మస్య తదాత్మానంసృజామ్యహం! అనియు

శ్లో॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచదుష్కృతాం

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే

అని సెలవిచ్చియున్నాడు.

అనగ ధర్మమున కెప్పుడెప్పుడు హాని సంభవించి అధర్మము విజృంభించునో, అప్పుడపుడు తానవతరించి ధర్మోద్ధరణమొనర్తుననియు, సాధురక్షణార్థము దుష్టశిక్షణార్థము, ధర్మ సంస్థాప నార్థము ప్రతియుగమునందును తానవతరింతు ననియు సెలవిచ్చియున్నాడు. ధర్మోద్ధరణమునకై మహామహులెందరో తమ జీవితముల నర్పించియున్నారు. అర్పించుచున్నారు. ధర్మాచరణము, ప్రతిమనుజుని ముఖ్య కర్తవ్యమైయున్నది. ఇంతవరకు అంతవివాదాంశముకాని సంశయము కానిలేదనియే, చెప్పవచ్చును కాని ధర్మమనగ నెట్టి, అధర్మమనగ నెట్టిది. అను విషయమున మాత్రమే, ‘‘యెవరికివారే యమునా తీరే’’ యన్నట్లు భిన్న భిన్న వ్యాఖ్యానములు, భిన్న భిన్న సిద్ధాంతములు, చెలరేగి వాద ప్రతివాదములతో సంకుల సంఘర్షణ మేర్పడుచున్నది. వ్యాఖ్యానములు, భిన్నభిన్న సిద్ధాంతములు, చెలరేగి వాద ప్రతివాదములతో సంకుల సంఘర్షణ మేర్పడుచున్నది వాస్తవముగనొక కార్యము కొందరకు పరమధర్మముగను మరికొందరకు అధర్మముగను తోచుచుండుట మనకు ప్రత్యక్షమైయున్నది. ధర్మము నిర్వచించుటకు వేదశాస్త్రాది ప్రమాణము లెన్ని యున్నను విమర్శకులకు సత్వరజస్తమో గుణభేదములచే నైక్యత సిద్ధింపకున్నది.

శ్లో॥ అధర్మం ధర్మమితియా, మన్య తేతమసావృతా।

సర్వార్థాన్‌ విపరీ తాంశ్చ, బుద్ధిస్సా పార్థ తామసీ ॥

అనగ, అధర్మము ధర్మముగ తోచుట ధర్మప్రమాణములకు విపరీతార్థములు, స్ఫురింపజేయుట తమోగుణాన్విత బుద్ధిలక్షణమని, గీతయందే పేర్కొనబడిరది. అధర్మము నాచరించువారిని మూడు విధములుగ, విభజింపవచ్చును 1. అధర్మ మునే ధర్మమని నమ్మిచేయువారు, 2. తెలియక చేయువారు, 3. తెలిసియు, విషయలంపటులై చేయువారునైయున్నారు. వర్తమానకాలము కలియుగము, ధర్మము గోచరించుట, గోచరించినను ఆచరించుట బహుదుర్ఘటమైయున్నది. ఇదిగాక కొన్ని సామాన్యధర్మములు, వర్ణధర్మసులు, ఆశ్రమ ధర్మములు, దేశధర్మములు, ఆపద్ధర్మములు, ఇత్యాది భేదములచే ధర్మములొప్పుచున్నవి. ధర్మాధర్మ వివేకమునకు మూలములు. శృతులు, శృత్యర్థములు, సామాన్యులకు తెలియనందున మహర్షులు శృత్యనుగుణములగు స్మృతులను రచించిరి. గనుక మన్వాది ధర్మశాస్త్రములు మన వేద తుల్యములై పరమప్రమాణములై యున్నవి. ఇవి ప్రమాణములుగ నంగీకరింపనివారితో మనకు ప్రసక్తి లేదు. భగవద్గీత యందు భగవానుడు,

శ్లో॥ తస్మాచ్ఛాస్త్రంప్రమాణం తే

కార్యాకార్యవ్యవస్థితౌ ॥ అని

శో॥ యశ్శాస్త్రవిధిముత్సృజ్యవర్తతే కామకారతః

నససిద్ధిమవాప్నోతి నసుఖంవాపరాంగతిం ॥ అనియు

అనగ, ఇక్కార్యము చేయవచ్చునా, కూడదాయను విషయమున శాస్త్రము ప్రమాణము. ఎవడు శాస్త్ర విధినివిడిచి వర్తించునో వానికి గతిలేదు. సుఖములేదు. అని సెలవిచ్చియున్నాడు. కాని భగవదుద్దేశమునందున్న శాస్త్రమెద్ది అను విషయమున సంశయ ముదయించుచున్నది. కాని గీతా సమ్మతమైనశాస్త్రము మనుస్మృతియని భావింప నవకాశము గలదు. ఎట్లన గీతకు యోగశాస్త్రమను పేరు రూఢ నందియున్నది. యోగమనగ శ్లో॥ యోగఃకర్మనుకౌశలం॥ అని గీతయందే చెప్పబడినది. ॥అనగ॥ కర్మలచేయుటయందలి కుశలత్వమే యోగమని అర్థము. అట్టియోగశాస్త్రమును భగవానుడు మొదట వివస్వంతున కుపదేశించినట్లును, వివస్వంతుడు మనువుకు చెప్పినట్లును మనువు ఇక్ష్వాకున కుపదేశించినట్లు గీతయందే చెప్పబడినది.

శ్లో॥ ఇమంచివస్వ తే యోగం ప్రోక్త వానహమవ్యయం

వివస్వాన్‌ మనవే ప్రాహమను రిక్ష్వాకవేబ్రవీత్‌॥

అనుటవల్ల మనుస్మృతి ప్రామాణ్యము సిద్ధమగుచున్నది. ఇదిగాక ॥శృ॥ యద్వైకించమనురవదత్త ద్భేషజం॥ అని శృతులు కూడ మనుస్మృతినుగ్గడిరచినవి. అట్టి మనుస్మృతి యందు సర్వధర్మములు నిపులముగ చర్చింపబడినవి. కాని నేడు జరుగుచున్న ఆచారవ్యవహారములు ధర్మములు తారుమారైనవి. వేయేల! సర్వసామాన్యములైన అహింస, సత్యము, అస్తేయము దయ, శాంతి, ఇత్యాది ధర్మములే శిధిలావస్థనందుచున్నవి. ఇది కలిప్రభావము. స్కాందపురాణాంతర్గత బుధవారవ్రత కథయందు

శ్లో॥ ఆచండాలమనుప్రాప్తా స్సర్వేవాణిజ్యకర్మణి ।

శ్లో॥ సర్వేచ్వడాలతాంయాంతి ।

శ్లో॥ విస్త్రాణాంతిపసస్తత్రనాభూన్మాహాత్మ్యదర్శనం ।

శ్లో॥ తత్రిసత్కర్మకర్తాంః క్లిశ్యమా నాది నేదినె ।

శ్లో॥ జాతిసాంకర్య యో గేపిచక్రుస్సత్కర్మకించన।

శ్లో॥ కలౌత్వబ్దసహస్రాణి యావత్పంచరతానిచ

విష్ణుస్త్యక్ష్యతిభూలోకం గంగాత్యక్షతిభూతలం

ధార్మికః కష్టమాప్నోతి పాపిష్టస్సుఖ మేధతే

అద్యహంతాధికాజాతాః కలౌ వింశతివత్సరాః

అనూచాన కులం నష్టం వేదోనష్టశ్చ నత్పథః

ధర్మోనష్టః కర్శనష్టం జాతో భూద్వర్ణ సంకరః

శ్లో॥ బహూన్య కృష్ణపూర్వాణి దుస్సాధ్యానిన రైః క్వచిత్‌

శిల్పానిసంప్రదర్శ్యైనకురాజా పంచాయ తివః

సర్వధా వైదికీవృత్తిః భవతామద్య దుర్లభా॥

ఇత్యాద్యనేకశ్లోకముల కలియుగప్రభావము నుగ్గడిరపబడినది. వానినన్ని యునిటజూపుట విస్తరమగును. పై వాక్యముల తాత్పర్యమేమన:- కలియుగమందు అగ్రవర్ణము మొదలు అంత్యవర్ణమువరకు జనులందరూ వ్యాపారవృత్తి నవలంబింతు రనియు, సర్వజనులు చండాలతనందుదురనియు, విప్రుల తపస్సులకు మాహాత్మ్యముండదనియు, సత్కర్మాచరణులు దినదినము సంకటపడుచుందురనియు, జాతి సాంకర్య మేర్పడుననియు, అయినను సత్కర్మాచరణము కొద్దిగ చేయుచుందు రనియు, కలియుగమందు 5000 సంవత్సరములు గడచిన విష్ణువు, గంగయు, భూలోకమును విడుతురనియు, ధార్మికుడు, కష్టమందుననియు పాపిష్ఠుడు సుఖపడువనియు, కలియుగమందు 2020 సంవత్సరములు గడచిన ఉత్తమ కులము వేదము, మంచి మార్గము, ధర్మము, సత్కర్మయు, నష్టమగుననియు వర్ణసంకర మేర్పడు ననియు పూర్వమందు చూడనటువంటి దుస్సాధ్యములై ఇటువంటి యంత్రములను వ్యాపింపజేసిదుష్ప్రభువులు ప్రజలను మోసగింతురనియు వైదిక వృత్తి దుర్లభమగుననియు మొదలగు సంగతులచే వర్తమాన పరిస్థితులను వేల యేండ్లకు మునుపే మనమహర్షులు వాసియున్నారు. అయిన మనమిప్పుడేమి చేయవలె, కాలపరివాహమున దురీతనీదుట సాధ్యము కాదను సంగతి తెలిసినదే అయినను మినకుండరాదు. ప్రస్తుతము జరుగుచున్న సంఘసంస్కరణ వర్ణాశ్రమ ధర్మ సాంకర్యములు పంచమదేవాలయ ప్రవేశాదులు మొదలగునవి ధర్మములు మాత్రము కాజాలవు. అని నిరూపించి యధాశక్తి పాటుబడుట ధర్మము. భగవానుడు ఈ యుగమందు శ్లో॥ యథాబలం యథాయోగం తత్సర్వ సుగమంభ వేత్‌ ॥ అని సెలవిచ్చియున్నాడు. అయినను ధర్మాధర్మచర్చ పండితులు చేయతగినది.

నాబోటివానికి దుప్సాధ్యము. అయినను హృదయ గతాభిప్రాయముల పుస్తక స్వరూపమున వెలిబుచ్చుటయుక్తమే యని తలచి మొదట నీ శతకమును కలితదుష్కృతనికుంబ కలియుగంబ॥ యను మకుటముతో కలిసిబోధించి కొన్ని పద్యములు వ్రాసితిని. కాని పిమ్మట అనుల్లంఘనీయమగ దైవిక ప్రేరణమువల్ల నా యిష్ట దైవమగు శ్రీ కోదండరామ మూర్తిని సంబోధించి మార్పు చేసితిని. ఇందులోనే వ్యక్తిని గాని యేకులమునుగాని యేసంఘమునుగాని తూలనాడుల నా యుద్దేశము కాదని శ్రీరామచంద్ర సాక్షిగ వచించు చున్నాను. నేను వ్రాసినవి ధర్మములైనను కాకున్నను ధర్మములను నమ్మకముతో వ్రాయబడినవేకాని వేరు కాదు. నాకు తోచినంతవరకు కఠినపదములను వాడక వ్యంగ్య భావముల నిడక అందరకు సులభమొగనుండునట్లు వ్రాసితిని. నీబోధకు గ్రంథములలో శతకములు కూడ మిక్కిలి ప్రచారములలో నున్న వని శతక రూపమునే కల్పించితిని. ఇందు దోషములున్నను స్ఖాలిత్యములున్నను నాకు తెలిపిన కృతజ్ఞతతో గ్రహించి సవరింతును. పండితులు అనుగ్రహాదరణములొసంగి మన్నింతురుగాక యని వేడుచున్నాను. ఈశతకమును సాకల్యముగ పరిశీలించి సంస్కార మొసంగిన నాపరమ మిత్రులగు బహ్మశ్రీ కవిసింహ అవధాని పంచాననేత్యాది బిరుదాంకితులును, శతావధానులగు ప్రొద్దటూరు గ్రామం రాజశేఖర వెంకట శేషకవి పుంగవులకును, కర్నూలు మునిసిపల్‌ హైస్కూల్‌ పండితులగు శ్రీమాన్‌ రాచర్ల రాఘవాచార్యులవారికిని నా కృతజ్ఞతాభినందనము లొనర్చువాడ. మఱియు ముద్రణాది కార్యములకు సహాయమొనర్చిన భక్తులకు కృతజ్ఞతజూపుచు, సర్వజనులకు ధర్మానక్రియ దైవభక్తియుగలిగించి భోగభా గ్యములొసంగి శ్రీ రామచద్రమూర్తి రక్షించుగాక.

            __శ్రీరామార్పణమస్తు __

__ సర్వేజనాస్సుఖినోభవంతు.__

__ ఇట్లు, విన్నవించు __

14-10-1937 బుధజనవిధేయుడు

ఉయ్యాలవాడ. పాణ్యం లక్ష్మీ నరసింహయ్య

శ్రీ గణేశాయ నమః

శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః

సీ॥ శ్రీమదహోబల । స్వామినారాధించి ।

    విఘ్నేశు నెంతయు । వినుతిఁజేసి।

శారదా దేవికి । సాష్ఠాంగ మొనరించి ।

    గురువులకంజలిఁ । గుదుఱుపఱచి ।

వ్యాసవాల్మీక్యాది । వరకవీంద్రులఁ గొల్చి ।

    యాంధ్రకవీంద్రుల । నభినుతించి ।

నేఁటికవీశ్వర । కోటి నెంతయు మ్రొక్కి ।

    కుకవులమది లెక్కఁ ।గొనక దెగడి ।

తే॥గీ॥ తల్లిదండ్రుల మదిలోనఁ । దలఁచిపద్య ।

శతకమర్పించెదనుభక్తి । సమ్మతించి ।

శాశ్వతా నందపదవినొ । సంగవయ్య ।

ధరణినుయ్యలవాడకో । దండ రామ !             1

సీ॥ శ్రీరమ్యగుణధామ । శృంగారజితకామ ।

    కారుణ్యసీమరా । క్షసవిరామ ।