శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › కోదండరామ శతకము — 4

కోదండరామ శతకము — 4

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 31 / 37

నిర్దయస్వాంతులై మత । నిష్ఠయనుచు

హింసలొనరింప ధర్మమీ । మాంసయెడ

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              80

సీ॥ సర్వభూతంబుల । సమతఁజూచెడి వారు

    కౌపీనమాత్రులై । గ్రాలు వారు

పంచేంద్రియంబుల । బలమడంచిన వారు

    దివ్యతత్వములబో । ధించువారు

సుఖదుఃఖములకాత్మ । చోటొసంగనివారు

    ఘనతపోమహిమలఁ । దనరు వార

లాత్మలాభంబుల । కాసఁ జెందనివారు

    ధర్మరక్షణమాత్మ । దలఁచువారు

తే॥గీ॥ విమలమతులైన మన్వాది । విబుధవరులు

శ్రుతిహితంబుగ వ్రాసిన । స్మృతులు జగతి

సప్రమాణంబులందు రే । మందునింక

ధరణినుయ్యలవాడకో । దండరామ ॥              81

సీ॥ ప్రభుసమ్మితములనఁ । పరగు వేదములందు

    గలయర్థమెల్లలో । కమునఁ దెలుప

స్మృతులురచించివి । శ్రుత మొనర్చిరి సర్వ

    సములౌ మహర్షులు । సత్య బుద్ధి

నందలి తాత్పర్య । మనబోధ మొనరింప

    భారతంబును వ్రాసె । వ్యాస మౌని

యదియె పంచమవేద । మనఁజెలంగెను ధర్మ

    మలరఁబెక్కుపురాణ । ములలిఖించె

తే॥గీ॥ వేద వేదాంతసారమై । వెలసెగీత

యట్టిశాస్త్ర ప్రమాణంబు । లనృతమనిన

నింక ధర్మ ప్రమాణంబు । లేవొజగతి

ధరణినుయ్యలవాడకో । దండరామ॥               82

సీ॥ నీ దేహంబుగాలిచేఁ । దిరుగుచునాడుచు

    నేలఁగూలుచునుండు । గాలిపడగ

సంపదగన్గొన । సంభవించినశించు

    నిల్కడలేనట్టి । నీటిబుగ్గ

నిజకుటుంబముజూడ । నిఖిలజనంబులు

    రహి నెక్కి దిగుచుండు । రైలుబండి

సంసారసుఖములా । సలఁ గొల్పి బ్రమయించి

    యింతలో మాయమౌ । నెండమావు

తే॥గీ॥ లరయజగ మెల్లస్వప్నతు । ల్యంబుగాదె

యేమినీమాయయోగాని । యిట్టిదనుచు

దెలియగా రాదుబుద్ధిమం । తుల కునైన

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              83

సీ॥ చలనంబులేకని । ర్మలముగానుండిన

    జలమందువస్తువు । దెలియునట్లు

మనమునిశ్చలముని । ర్మలముగానుండిన

    బ్రత్యక్షమగునండ్రు । బ్రహ్మమూర్తి

యమనియమాదియో । గాభ్యాసమునగాని

    చిత్తంబు నిశ్చల । స్థితిని గనదు

సద్గురు సేవించి । శ్రవణ మొందినగాని

    నిర్మలమైబుద్ధి । నెగడదండ్రు

తే॥గీ॥ కర్మవిజ్ఞానభక్తియో । గములలోన

భక్తియోగంబుకడుసుల । భంబటిందు

దైన నీదయలేకని । న్నరయవశమె

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              84

సీ॥ పిండాండమందెబ్ర । హ్మాండంబిమిడియుండు

    విత్తనంబున చెట్టు  । వెలసినట్లు

మేరుపర్వతమన । మేనివీణాదండ

    మరయఁగశిఖరంబు । శిరముచూ వె

భూర్భువస్స్వర్గాది । భువనంబులనస ప్త

    చక్రముల్‌ పై సహ । స్రారచక్ర

మదిసత్యలోకంబు । హంసస్వరూపి వై

    పద్మాసనస్థితి । బరగునిన్ను

తే॥గీ॥ సూర్యచంద్రాఖ్యనాడులు । చుట్టితిరుగు

జ్ఞానవాహిక నదుల చేఁ । గరము వెల్గు

విశ్వమూర్తిగనిన్ను భా । వింతునయ్య

ధరణినుయ్యలవాడకో । దండరామ॥               85

సీ॥ తనువులులాంతరల్‌ । తన్మధ్యమున వెల్గు

    దీపంబువలెనాత్మ । తేజరిల్లు

నద్దంబులనుబోలి । యమరియుండునుమాయ

    జ్ఞానంబు తైలంబు । గాఁజెలంగు

వెలుఁగొక్కడేయైన । పలురకమ్ముల కాంతి

    దన రారురంగుట । ద్దములఁబట్టి

అలాంతరలువ్రయ్య । లైనప్పుడీ కాంతి

    యాది తేజంబులో । నంతరించు

తే॥గీ॥ జ్ఞానులదిగాంచిమాయకు । లోనుగాక

నిష్కళంకాత్మునంతట । నిండియున్న

నిన్నెరుంగుదురన్యులు । నేరరింత

ధరణినుయ్యలవాడకో । దండరామ॥               86

సీ॥ రథముశరీరంబు । రథికుండుజీవాత్మ

    మనముసారథిబుద్ధి । మార్గదర్శి

భావింపజక్రముల్‌ । దైవపౌరుషశక్తు

    లశ్వముల్‌ పంచేద్రి । యము లెతలప

యముని యమాదియోఁ గము లెపగ్గంబులు

    రాజయోగమెమేలి । రాచబాట

కామాది దుష్టత । స్కర బాధలను మాన్ప

    శ్రవణాదులేతగు । సాధనములు

తే॥గీ॥ పూనియీగతిజని బ్రహ్మ । మూర్తి వైన

నిన్నుఁ జేరిసుఖింతురు । నిర్మలాత్ము

లన్యులకు నిన్నుఁ జేరంగ । నగునెదేవ

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              87

సీ॥ పరగజీవుఁడుబొందు । పదియవస్థ లెపది

    యవతారములటందు । రాత్మవిదులు

మత్స్యకూర్మత్వముల్‌ । మరిగర్భగోళమం

    దవలవరాహత్వ । మర్భకదశ

బాలుఁడై నరసింహ । భావంబునొందును

    వామనత్వంబందు । పటువుగాగ

గార్హస్థ్యపరిణామ । గతులమూటఁ జెలంగు

    గ్రమతరామావతా । రములు మూడు

తే॥గీ॥ పరమబౌద్ధతగను వన । ప్రస్థుఁడగుచుఁ

గడఁగి సన్యాసితన్‌ బొంది । కల్కిభాష

మొందు విజ్ఞాన మొందుచుఁ । జెందు నిన్ను

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              88

సీ॥ కర్మయోగమునందు । గలరహస్యములెల్ల

    హరివివస్వంతున । కటవచించె

మనువుకాతఁడు దెల్ప । మహితశాస్త్రమువ్రాసె

    నతఁడదియేమను । సృతిగనెగడె

శాస్త్ర ప్రమాణంబు । సత్యంబనియెగీత

    జగతికార్యాకార్య । సంశయముల

నట్టిగీతోక్తి కి । నడ్డగీతలు వ్రాసి

    మన్వాది శాస్త్రముల్‌ । మంటఁగలిపి

తే॥గీ॥ సత్యమరయక సంఘ సం । స్కారమనుచు

భీతియిసుమంతయును లేక । విచ్చలవిడి

కరమకృత్యములను జేయ । గడగిరిప్డు

ధరణినుయ్యలవాడ కో । దండరామ।              89

సీ॥ సంసారమెల్ల బ్ర । ఛ్ఛన్నమౌ చెరసాల

    మమకార కారమెల్లను । మాయగుంట

పంచేంద్రియంబులు । పొంచిమ్రింగెడిపులుల్‌

    విషయభోగంబులు । విషఘుటికలు

కామంబుక్రూర దు । ష్కరకాలసర్పంబు

    కోపమెంతయుఁబొరి । గొనెడిమిత్తి

గర్వంబుదరిని । కాల్చెడి కార్చిచ్చు

    కరము మోహంబెల్ల । కాళరాత్రి

తే॥గీ॥ యాత్మవిజ్ఞా నమింతైన । నరయ లేకఁ

జిక్కుబడితినినాకిక । దిక్కు నీవ

కరుణఁబ్రోవుమునీకటా । క్షంబొసంగి

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              90

సీ॥ జగతిన పారమా । సంసారమేలఁక

    కామాదిగణమె రా । క్షసచయంబు

దశవిధేంద్రియముల । దనరుచుండుమనంబె

    దనుజేశ్వరుండుగు । దశముఖుండు

బుద్ధిసీతాదేవి । మోహాంధుఁడౌ చుఁద

    న్నరికట్టురావణు । నణచివేయ

నాత్మధ్యానించెఁద । దాజ్ఞఁ బ్రాణాయామ

    భవమూర్తి యగువాయు । పట్టిగదిసి

తే॥గీ॥ లంకఁగాలిచిరక్షోబ । లంబుఁజిదిమి

వాని జూఁపగనీచేత  । వాఁడు మడిసె

నట్టినీచరితంబె రా । మాయణంబు

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              91

సీ॥ సంసార మెల్లను । జల్వపందరిఱచ్చ

    కూటంబు భార్యయు । గొడుకుఁదండ్రి

యన్నలుదమ్ములు । నాప్త వర్గంబులు

    తమతమపనుల కై । దరలివచ్చి

గుమిగూడిసఖ్యంబు । కొంత కాలము చూపి

    యవసరంబులఁబట్టి । యరుగుచుండ

నాభార్య నాబిడ్డ । నా బంధువులటంచు

    మమకారకూపని । మగ్నులగుచు

తే॥గీ॥ కర్మయోగరహస్యంబుఁ । గానలేక

దిక్కు దెలియక జగమెల్లఁ । జిక్కువడియె

దేవనీమాయని సుమంత । దెలియవశమే

ధరణినుయ్యలవాడకో । దండరామ॥               92

సీ॥ నారికేళఫలంబు । నఁజెలంగుకొబ్బెర

    వలె మాయచేఁగప్ప । బడినయాత్మ

మూర్తి వౌనిన్‌ గన । నేర్తు రేమూఢులు

    ప్రాక్త నసుకృతంబు । ప్రాపుగాగ

గురుబోధమనియెడి । కొడవలిచేఁబూని

    యల్లిబిల్లిగ పైన । నల్లుకొన్న

సంసారమనెడిని । స్సారమౌపీచును

    ముక్కముక్కలుగాగఁ । జెక్కివైచి

తే॥గీ॥ కర్మవిజ్ఞానభక్తి యో । గమ్ములనెడి

కనులచేఁగాంచి మాయయన్‌ఁ । గప్పుచిప్ప

గొట్టుయోగులు పొందఁ గ । ల్గుదురుగాక

ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥             93

సీ॥ మండుచుండెడియగ్ని । కుండముల్‌ పంచేంద్రి

    యంబులాజ్యము విష । యాళియందు

వేల్చుచుండుకొలంది । వృద్ధియౌజ్వలనుండు

    నాల్కలార్చునుగాని । నవసిపోఁడు

యంతమెరుంగని । యభిలాషలను దీర్పఁ

    జాలకదుఃఖ సం । సారుఁడగుచు

పరులనుహింసించి । దురితంబులొనరించి

    జనుఁడవివేకియై । సంతతంబు

తే॥గీ॥ పుట్టిగిట్టుచుదుర్గతుల్‌ । బొందుచుండు

కర్మయోగరహస్యంబుఁ । గనివిరక్తి

బడసివేదాంతిగనుచుండు । పరమశాంతి

ధరణినుయ్యలవాడ కో । దండ రామ              94

సీ॥ జగమునాటక శాల । సర్వభూతంబులు

    వేషముల్‌, తెరమాయ । వేదవేద్య

ముల్లంబు లాద్యంతవిరహిత

    నవరసభరితమీ । నాటకంబు

సూత్రధారుఁడనీవు । సూచించువైఖరి

    వేషంబులెన్ని యో । వేయుచుండి

మదమత్సరములఁ । దన్మయుఁడనై యౌచిత్య

    మరయలేకీ యాట । లాడుచుంటి

తే॥గీ॥ గాసిఁజెందితిఁనికనైన । వాసుదేవ

కరుణమీరఁగ నన్ను బ్ర । క్కకునుఁ జేర్చి

సంతతానందముక్తినొ । సంగవయ్య

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              95

సీ॥ దారిగానక యెసం । సారాటవినిఁబడి

    దిక్కు దోఁచక నేను । దిరుగుచుండ

బలవంతులైనట్టి । పంచేంద్రియంబులన్‌

    మ్రుచ్చులుపెన్నాడి । ముట్టడిరచి

విజ్ఞానధనమెల్ల విడువ కెంతయు ద్రోచి

    కడఁశనీషణమను । గర్త మందు

బడద్రోసిరిట్టియా । పత్కాల మెఱిఁగియు

    రోష కామ క్రోధ । లోభములను

తే॥గీ॥ శత్రువుల్‌ తమబలగంబు । సందడిరప

వచ్చి మిక్కిలి బాధంప । జొచ్చిరకట

దిక్కు నీవగదాఁ బ్రోవ । దేవదేవ

ధరణీనుయ్యలవాడ కో । దండరామ॥              96

సీ॥ శరణాగతత్రాణ బిరుదంబునీకేల

    శరణాగతునినన్ను । సాగకున్న

దీనరక్షాదక్షు । దీక్షని కేటికి

    దీనునిన్‌ బ్రోవఁ । బూనకున్న

ఆర్తజనావనుఁ । డను పేరు నీ కేల

    ప్రబలమౌనాయార్తిఁ । బాపకున్న

దాసపోషకసము । ద్యత్కీర్తినీ కేల

    దాసునినన్నునో । దార్పకున్న

తే॥గీ॥ భక్తవత్సలయనినిన్నుఁ । బలుక నేల

భక్తి నినుఁగొల్చునన్నుఁ । గాపాడుకున్న

గడఁగినన్నేలనింతయా । గడమదేల

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              97

సీ॥ రా,మహాసుగుణాక । రా,మ దారివిభీక

    రా,మ హీజాతాభి । రా,మ బ్రోవ

రా,మ హితప్రచా । రా,మ ముదయఁజూడ

    రా,మ నీషి శుభాక । రా,మహీశ్వ

రా,మ నసిజసుంద । రా,మ నుకుల శేఖ

    రా, మణిస్థగితహా । రా,మ నోహ

రా,మరుమాటేల । రా,మరుదవనాద

    రా,మ రుత్సుతవిహా । రా, మనోజ్ఞ

తే॥గీ॥ రా,మ మునిభక్తజనశుకా । రా,మ విద్వ

రా,మహేంద్రాది శ్రేయస్క । రా,మహజ్జ

రామరణజన్మదుఃఖవి । రామమొసగ

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              98

సీ॥ అరయగశాలివా । హనశకాబ్దంబులు

    షట్పంచగజచంద్ర । సంఖ్యలకును

సరియగు శ్రీభావ । సంవత్సరంబునన్‌

    మధుమాససితపక్ష । నవమియందు

శనివాసరంబున । జరుగుపునర్వసు

    నక్షత్రకటక ల । గ్నంబునందు

సద్భక్తినీ పద్య । శతకమర్పించితి

    బాలకావ్యక్త సం । భాషణంబు

తే॥గీ॥ తండ్రికానంద మొసఁగదే । తప్పులున్న

కడకుద్రోయక యీకృతి । కరుణగొనియు

శాశ్వతానంద సిద్ధినొ । సంగవయ్య

ధరణినుయ్యలవాడ కో । దండరామ ॥                 99

సీ॥ సకలచరాచర । జగములన్నియునీవ

    గ్రహతారకాగణా । కారమీవ

వాసుకిప్రభృతి న । ర్పప్రకాండమునీవ

    తార్షా ్యదిపక్షి సం । తతియునీవ

పరగనశ్వద్ధాది । పాదపౌఘమునీవ

    కపిలాదిసిద్ధ సం । ఘంబునీవ

సంవత్సరర్తు మా । సదినాదులును నీవ

    జ్ఞాతయుజ్ఞేయంబు । జ్ఞానమీవ

తే॥గీ॥ సర్వభూతాశయస్థిత స్వామివీవ

క్షరమునీవ యెఱుంగఁ న । క్షరమునీవ

నిఖిలమునునీవ పర మేశ । నేనునీవ

ధరణినుయ్యలవాడ కో । దండరామ॥              100

భరతవాక్యము

గీ॥ అఖలలోకంబులకు సౌఖ్యమబ్బుగాక !

నృపులు పాడిగ ధరణిబాలింత్రు గాక !

ధర్మమెంతయు విరివిగా దనరుగాక !

పాడిపంటలు జగతి పైబరగుగాక !

వేదపాఠము లెల్లెడ వెలయుగాక !

ఐక్యమత్యంబు ప్రజలకు నలరుగాక !

దేశమెప్పుడు శుభములదేలుగాక !

శ్రీరఘూత్తముడెపుడు రక్షించుగాక !

1938వ సం॥ ఫిబ్రవరి నెల 18వ తేదీన శ్రీ కోదండరామ శతక ముద్రణ సహాయార్థము
యింజేడు గ్రామస్తులను గురించి చెప్పిన ఉత్పలమాల

ఉ॥ సాటిలేని యొకింతలేని గుణసాంద్రయశో విభ వాఢ్యులైన ఇం

జేటిపురీనివాసి బుధ శేఖరులార వచింతునే నిరా

ఘాటముగానెయొక్క శతకంబుసుభక్తి మెయిన్‌ రచించినమిము

బోటివదాన్యులన్‌ గనియుముద్రణ కార్యము నిర్వహింపగా

నేటికివచ్చినాడగడు నేను హితుండ బురోహితుండమీ

వీటికి విప్రుడన్‌ గవిని బేదగృహస్థుఁడ దానపాత్రుడన్‌

మాటలరీతిపద్యములు మాన్యులు మెచ్చగ నాశుధాటిలో

బాటవ మొప్ప వ్రాయగల గల పండితుడన్‌ మన దేశమందు

నూటికినొక్కడోకవి వినూత్న కృతిన్‌ రచియించువాడు

నేటికినింత జెప్పవలె నెల్లరకున్‌ విదితంబ కాదె, క

ర్నాటధ రావరుండయిన రాయలు రాజ్యమునేలునాడు

మేటిక వీంద్రులన్‌ బిలిచి మిక్కిలిమన్ననలిచ్చిప్రోచెనీ

నాటికిదద్యశంబును ఘనంబుగఁ దెల్పదె నాగ్వధూటి రే

నాటిధరిత్రిలోపల గుణగ్రహణుల్‌ గలరిప్డు కూడ మో

మాట మదేల తెల్పెదను ముద్రణకైపిన యమ్మనూరిలో

నూటపదార్లొ సంగిర యనూనవిధిన్‌ వడి, మీరునట్టు లే

సాటికిసాటిజేయవలె సద్యశమున్‌ భువినొందగావలెన్‌

మాటికిమాటికిన్‌ మిముల మాన్యములిమ్మనికోరఁబోను

నాటకవృత్తితోనపుడు యాచనజేసి యెరుకింగనేను నా

పాటికి గుడ్డకైయిటుల కోరగబోనిటు ముద్రణార్థమౌ

రేటు భరింపరానిది యెఱింగి యెవచ్చితి, కందనూల్‌ పురిన్‌

నూటికి వెయ్యిపొత్తము లనూనముగాప్రచురించియిత్తు ర

ప్పాటిధనంబు నేనొసఁగు భాగ్యము లేమిని మిమ్ముజూడని

చ్చోటికి వచ్చినాడ నిది సూనృతమెంతయునాదుభూమిలో

నేటికి రెండు మార్లయిన నేర్పడి రావుకుటుంబమన్న నో

పూటకు నెట్టులైన బరిపూర్ణముగా నిలునిండునట్లు పెన్‌

పెటెడుగావలెన్‌ నిజము చెప్పిన బూటకమండ్రు రాముడే

లోటును నాకొ సంగఁడని లోనదలంచెద నట్టు లెప్పుడే

వంటి కొఱుతలీయక యిలన్‌ ననుబ్రోచెనుమీరలెప్పుడున్‌

గోటికొలంది పుణ్యములకుంఠిత భక్తిని సల్పినారలే

కటను బుణ్యతీర్థముల కేగియు ధర్మమొనర్చినారు నా

బోటులచే బురాణములు బుణ్యకథల్‌ చదివించినారు బల్‌

బాటలలోన వేసవిని బాంథుల దాహముదీర్పచల్ల నౌ

నీటినొసంగివారలకు నిత్యసుఖంబొనరించినారు మేల్‌

తోటలు సత్రముల్‌ గుడులుతోరపుభక్తినినిల్పినార లీ

లాటికృతిప్రపోషణఫలంబును మీరిపుడొందగోరెదన్‌

సూటిగ దవ్వులన్‌ గవినిజూచిన మాత్రనైలోభి యెంతయున్‌

చేటికివచ్చునంచు దఱి జేరడు భీతిలిలో నదిట్టుచున్‌

బాటుకు నేగుచుండు విధిజాలక, కన్పడెనేనినట్టియా

రాటమెకాని కానియును రమ్మని ప్రీతినొ సంగబోడెటుల్‌

గాటికిఁగాళ్ళుసాపినను గల్గునె ధర్మము చింతలోభికిన్‌

మాటలు వేయునేల ననుమన్నన సేయుఁడు నావిధానమున్‌

బాటిగ జెప్పఁ బూనినను బద్యములోపల నాల్గునల్వదై

గీటులుమించే నింకపొడిగింపక నిల్పెదనిట్టి నాదువా

గ్ధాటిని, మీ కొసంగతినిదద్దయును త్పలమాలి కాతతిన్‌

బూటకమిందులేదు తమబుద్ధికిఁ దోచిన ద్రవ్యమిచ్చిమేల్‌

దీటగుపుణ్య కార్యమును దీర్పుడు మీకిలరామ ర్తిబల్‌

నీటగుభోగ భాగ్యములు నిత్యమొసంగుచు బ్రోచుగావుతన్‌