శ్రీలక్ష్మీనరసరామణీయకం › చాటు శతశ్లోకీ (వంద చాటువులు)
చాటు శతశ్లోకీ (వంద చాటువులు)
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 32 / 37
రచన మరియు సేకరణ
పాణ్యం నరసరామయ్య
ముద్రణ
పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు
2022
వంద చాటువులు
మన పాణ్యం నరసరామ కవి రచించి, సేకరించి అందించిన రచన చాటు శత శ్లోకీ అనే 100 సంస్కృత శ్లోకాల గ్రంథం. ఇందులో కవి స్వీయకృతంకొన్ని, సేకరణకొన్ని. కానీ యేవి స్వంతమో, యేవి సేకరణో తెలియదు. ఈ గ్రంథ ప్రచరణ మహాయజ్ఞంలో భాగంగా చేతనైనంత తెలుగు భావాలను జత గూర్చినాము. ప్రథమ ముద్రణకిప్పుడు నోచుకుంటుంది.
చాటు అనే సంస్కృత పదానికి తెలుగు చాటువు. అంటే ప్రియమైన మాట అని అర్థము. హఠాత్తుగా కల్గిన భావాన్ని నియమించకుండా, ఆశువుగా వెల్లగక్కడం. అది కోపము, హాస్యము, ఉత్సాహము, సంతోషము, బాధ యేదైనాగానీ, దానికి కొంచెం వ్యంగ్యం, హేళన, చమత్కారం, జతచేస్తూ అంతర్లీనంగా ఒక ఉపదేశం ఉండడం చాటువు లక్షణం. తెలుగులో శ్రీనాథాది కవుల చాటుపద్యాలు ప్రసిద్ధం. సంస్కృతంలో ఎందరో ఉన్నారు. వాటిస్ఫూర్తితో తాను కొన్ని, పూర్వ కవులవి కొన్ని కలిపి గ్రంథస్థం చేసినారు మన కవి.
‘‘ఇమాం చాటు శతశ్లోకీం కృతిం విరచితాం మయా,
ఏతస్యాం మత్కృతౌ సంతి పూర్వ పద్యాని కాని చిత్’’
ఇదీ కవి వివరణ. నాచేత రచించబడినవి, పూర్వ కవుల కృతములు కలిసి ఈ చాటు శత శ్లోకి నందు చేర్చబడినవి. దీన్ని కులదైవమైన లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేసినారు. స్వామి ప్రార్థనా శ్లోకం చూడండి చాటు లక్షణాలన్నీ ముప్పిరి గొన్నాయి.
‘‘యో వామా సవిధస్థోపి పుంస్త్వవాన్ రహసి స్థలే
నిరంజన స్తుతిం వందే హృషీకేశమివా పరం’’
దివ్య సౌందర్యంతో విలసిల్లెడి జగన్మాత లక్ష్మీదేవి తొడపైనే కూర్చొంది. కాని ఆ పరమపురుషుడు నిరంజనునిగా హృషీకేశునిగా నిర్వికారుడై చిన్మయుడై వెలుగొందుతున్నాడు అని దీని భావం. ఇక్కడ వాడిన నిరంజన, హృషీకేశ శబ్దాలు సార్థకంగా ఉన్నాయి. నిరంజనుడు. సాక్షి మాత్రంగా ఉంటూ కర్తృత్వ భోక్తృత్వాలు లేని ఆత్మతత్త్వం హృషీకేశుడు. హృషీకములు అంటే ఇంద్రియాలు. వాటి ఈశుడు. అంటే స్వాధీనపరచుకున్నవాడు. ఆత్మతత్త్వం నుండి సగుణంగా మారిన అహంకారాన్నీ సూచిస్తుంది. ‘‘పుంస్త్వవాన్ రహసి స్థలే’’ అని నామరూపాలుగా అవతరించిన స్థూల తత్త్వాన్ని సూచిస్తుంది.
కానీ స్వస్థితికి మార్పులేదని గొప్ప తాత్విక భావాన్నీ కొంత లింగ సంబంధిగా మన బుద్ధులకు చమత్కారంగా చూపించినాడు కవి.
భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో శృంగార, నీతి, వైరాగ్య శతకములు వ్రాసినాడు. మానవ జీవితంలో మొదటి రెండూ అనుభవంలోనివే. వీనిని మళ్ళీ సజ్జన, దుర్జన పద్ధతులుగా విభజిస్తాం. విశేషమైన లోకానుభవం, నిశిత మానవ స్వభావ పరిశీలన, లోకాన్ని వాస్తవిక కోణంలో దర్శించి, ప్రదర్శించడం కవి ప్రతిభకు తార్కాణం. దాన్ని కూడా సంస్కృతంలోని అనుష్టుప్ ఛందస్సులో నిపుణంగా వెలిబుచ్చడాన్ని మన నరసరామ కవి, ప్రాచీన కవుల రచనలో చూడవచ్చు.
దుర్జన పద్ధతి:
‘‘అకర్తవ్య క్రియాయాపి యాప్యవక్తవ్య వాక్తతిః
నహి తే దృష్టశాలీ భో భో దుష్ట నమో నమః’’
చేయగూడని పనులు చేయడంలో అనగూడని మాటలు అనడంలో నీకు సాటి యెవరూ లేరు కదా! ఓ దుష్టుడా నీకు నమస్కారం.
‘‘దండకృత్సన్నిధౌ సాధుః ప్రచండస్సాధు సన్నిధౌ
భవసి త్వమహో దుష్ట స్తోతవ్యా తవ చాతురీ’’
శిక్షించే వానికి లొంగిపోతావు. అణిగి మణిగి ఉంటావు. మంచి వానిపై జులుం చేస్తావు, రెచ్చిపోతావు. ఓయీ దుర్మార్గుడా! నీ నేర్పరితనం నిజంగా మెచ్చదగ్గది కదా.
‘‘లోకభీత్యాఘభీత్యా చ సర్వే వ్యాకుల చేతసః
తదభావాద్భవాన్ ధన్యో భో భో దుష్టశిరోమణే’’
సహజంగా లోకులంతా పాపభీతితో, లేదా కనీసం లోకమేమనుకుంటుందో అనే జంకుతోనైనా భయపడతారు. ఓరీ దుర్మార్గుడా! నీకవేవీ లేవు కదా, యెంత ధన్యుడివిరా!
‘‘శృణ్వన్నపి సదార్యోక్తి మృజుతాం నైతి దుర్జనః
నదీ పానీయ పూర్తస్సన్ స్వాదుతామేతి కిమబ్ధిః’’
ఎప్పుడూ మంచివారి నుండి సూక్తులను వింటున్నా సద్వర్తనమలవర్చుకోడు దుర్జనుడు. నిరంతరం నదులన్నీ తియ్యని నీటిని తెచ్చి కలుపుతున్నా కూడా సముద్రము తన ఉప్పదనాన్ని విడవలేదు కదా!
దౌష్ట్య శృంగారము:
‘‘అసంఖ్యాక విటోపేతా సుశీలాం గృహిణీం ప్రతి
భావయత్యన్నవస్త్రార్థమేకాధీనేతి భోగినీ’’
ఎందరో విటులతో గడిపే కులట భోగవైభవాలు అనుభవిస్తూ, సద్గుణవతి ఐన గృహిణిని చూసి ‘‘పాపం అన్నవస్త్రాల కోసం ఒక్కనికే స్వాధీనమై భార్యగా ఊడిగం చేస్తుందికదా’’ అని హేళన చేస్తుంది.
‘‘వృషస్యంతీ తు పురుషాద్రతి వై యాత్య సంపదం
గణికా తు సువర్ణాది సంపదం భృశమిచ్చతి’’
అక్రమ సంబంధంకల్గిన స్త్రీ తనే డబ్బు యెదురిచ్చి కామసుఖం పొందుతుంది. కానీ వేశ్య విటుని నుండి ఎక్కువ ధనాన్ని లాగుతుంది.
‘‘ఏకక్రియాయాపి విదధాతి ఫలం తు
కర్తృభేదాత్ పృథక్ తదిహ చూచుకమంగనాయాః
ఉద్యత్పయః కుచయుగః తనయ స్పృశేచ్చేత్
కాంతస్స్పృశేద్భవతి మన్మథరంగ మార్ద్రం’’
ఒకే పని కర్త(చేసేవాడు)ను బట్టి వేరువేరు ఫలితాన్నిస్తుంది. స్త్రీ స్తనములను కొడుకు తాకితే పాలు కారుతాయి. అదే భర్త చేస్తే కామోద్దీపనం కల్గుతుంది.
లోకానుశీలనం:
‘‘నియుక్తా రక్షక భటాః ప్రజాప్రాణాది రక్షితుం
రేఫస్థాన నిక్షిప్త భకారాః ప్రాయశో భవన్’’
ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేందుకు నియుక్తులైన రక్షక భటులు, తరచూ తమ పేరులోని ర కారాన్ని భకారంగా మార్చుకుంటారు. రక్షక భక్షకగా మారుతుందని వర్ణ వ్యత్యయంతో వ్యంగ్యం సాధించినారు.
‘‘ప్రభుత్యోద్యోగి హస్తేషు విత్తం న నిహితం యది
సధర్మమపి తత్కార్యం సాఫల్యం న ఇతి ప్రాయశః’’
ప్రభుత్యద్యోగికి లంచం ఇవ్వకుండా చట్టబద్ధమైన పని కూడా, తన విధిగా చేయవలసిన దాన్ని కూడా తరచుగా చేయరు.
పై రెండు శ్లోకాలలో ప్రాయశః (తరచుగా) అనే పదం వాడడంవల్ల అందరూ అట్టి వారు కాదనే అర్థం ఉంది.
‘‘కుశలీ దుర్జనేనాపి సత్కార్యం కారయిష్యతి
వైద్య శాస్త్ర ప్రవీణస్తు యథారోగ్యం గరాదినా’’
సమర్థుడైన వాడు దుర్జనులతో కూడా ప్రయోజనం సాధించగలడు. శాస్త్ర నిపుణుడైన ఆయుర్వేద వైద్యుడు గరళం(విషం)తో కూడా ప్రాణాలు నిలబెట్టగలడు.
‘‘వ్యాఘ్రతుల్యో యాచక! త్వం తం త్వాం ద్రష్టా ప్రధావతి
కుతః ప్రాణభయాత్ తస్మాత్ త్వద్విత్తార్థన సాధ్వసాత్’’
ఓ యాచకా! నీవు పులి వంటి వానివి. పులిని చూచి ప్రాణ భయంతో, నిన్ను చూచి డబ్బడుగుతావనే భయంతో పారిపోతారు.
‘‘తృణాదపి లఘు స్తూల స్తూలాదపి చ యాచకః
వాయునా కిం నీతోసౌ మామయం యాచయేదితి’’
గడ్డిపోచకన్నా దూది, దానికన్నా యాచకుడు తేలిక. తన్ను కూడా యాచిస్తాడనే భయంతో గాలి కూడా వాణ్ణి తప్పుకోని పోతుంది.
‘‘అకృతోపద్రవ కశ్చిన్మహానపి న పూజ్యతే
అర్చయంతి నరాః నాగం న తార్క్ష్యం న గజాదికం’’
మనకు కీడు కల్గిస్తారని నీచులను, దుర్మార్గులను భయంతో చూస్తాం. గొప్పవారిని పట్టించుకోము. పాములను పూజిస్తాం కాని యేనుగులను గరుడ పక్షులను పూజించము కదా.
‘‘శ్రీ కృష్ణ క్షితి పాల దత్త మణిభిః విద్వత్కవీనాం గృహాః
నానారత్న చిరత్న కుట్టిమ భువః రత్నాకరత్వం గతాః
అబ్ధిః కేవల వారి పూరనిలయ స్సంభావ్యతే సజ్జనైః
అంబోధి ర్జలధిః పయోధిరుదధిః వారాంనిధి ర్వారిధిః’’
శ్రీకృష్ణదేవరాయలచేత సన్మానింపబడిన కవుల గృహాలు అనర్ఘమణి రత్నములతో నిండి రత్నాకరములైనాయి. పాపం సముద్రునికి రత్నాకరుడనే పేరు పోయి, కేవలం అంబోధి, జలధి, పయోధి, ఉదధి, వారాన్నిధి, వారిధి అనే పేర్లు మాతమే (కేవలం నీటిని మాత్రమే కల్గి ఉందని) మిగిలాయి. కవి చమత్కారం మిన్ను ముట్టింది. రాయల కవి, పండిత పోషణ ఆదరాలను అతిశయోక్తిగా వర్ణించినారు. సముద్రంలోని రత్నాలన్నీ ఖాళీ అయ్యి, నీరు మాత్రమే మిగిలిందట. ఇట్టి కమనీయ భావనలున్న ఈ రచనను ఆస్వాదించండి.
శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః
అవిఘ్నమస్తు
శ్లో॥ యో వామా సవిధస్థోపి పుంస్త్వవాన్ రహసి స్థలే,
నిరంజన స్తుతం వందే హృషీకేశమివాపరం. 1
భావము: తొడమీదనే జగన్మోహనాకారయైన లక్ష్మీదేవి(స్త్రీ) ఉన్నా, పురుషునిగా కనిపిస్తూ, హృషీకేశునిగ పరమపురుషునిగ నిరంజనునిగ స్తుతించబడిన లక్ష్మీనృసింహునికి నమస్కారం.
శ్లో॥ ఇమాం చాటు శతశ్లోకీం కృతిం విరచితాం మయా,
లక్ష్మీనృసింహ పాదాంబుజాతయోరర్పయామ్యహం. 2
భావం: ఈ చాటు శ్లోకములను నూరింటిని నేను రచించినాను. వాటిని లక్ష్మీనృసింహస్వామి పాదారవిందములకు అంకితమిస్తున్నాను.
శ్లో॥ ఏతస్యాం మత్కృతౌ సంతి పూర్వ పద్యాని కాని చిత్,
కృతజ్ఞశ్చ వినమ్రశ్చ తత్కర్తృభ్యో నమామ్యహం. 3
భావం: వీటిలో నేను స్వయంగా రచించినవి. అజ్ఞాత కవులైన పూర్వుల రచనలున్నాయి. వారందరికీ వినమ్రంగా కృతజ్ఞతలు.
శ్లో॥ ఊన సత్వోపి గణయేన్నారిం స్థానబలీయది
వీక్ష్య త్ర సతి కిం తార్‌క్ష్యం శూలి భూషణ పన్నగః. 4
భావం: స్థానబలం ఉన్నప్పుడు బలవంతుడైన శత్రువును చూసి కూడా బలహీనుడు భయపడడు. శివుని మెడలోనున్న నాగము గరుడుని చూసి కూడా భయపడదు కదా!
శ్లో॥ అకర్తవ్యక్రియాయాపి యాప్యవక్తవ్యవాక్తతిః
న హితే దృష్టశాలీ త్వం భో భో దుష్ట నమో నమః. 5
భావం: చేయగూడని పనులు చేయడంలో అనగూడని మాటలు మాట్లాడడంలో నీకు సాటి లేరు కదా. ఓ దుష్టుడా నీకు నమస్కారం.
శ్లో॥ దండకృత్సన్ని ధౌ సాదుః ప్రచండస్సాధుసన్నిధౌ,
భవసి త్వమహాదుష్ట స్తోతవ్యాతవ చాతురీ. 6
భావం: దండిరచే వాని ఎదుట వినయంగా, సౌమ్యుని ఎదుట రెచ్చిపోయే ఓ దుర్మార్గుడా! నీ ప్రతిభ అమోఘము కదా!
శ్లో॥ లోకభీత్యాఘుభీత్యాచ సర్వే వ్యాకుల చేతసః
తదభావాద్భవాన్ ధన్యో భో దుష్ట శిరోమణేః. 7
భావం: సహజంగా లోకులంతా పాపభీతి, సంఘభీతిచే బాధపడ్తారు. కాని దుర్జనునికి అవేవీ ఉండవు.
శ్లో॥ స్వదుష్ట ప్రకృతిం మత్వా లోకేతి భయ విహ్వలే
సుమహాన్ శక్తిసంపన్న ఇతి గర్వతి దుర్జనః. 8
భావం: దుర్మార్గునికి దూరం ఉండాలనే విధంగా తన్ను చూసి భయపడే లోకులను చూసి తాను చాలా బలవంతుడనని గర్విస్తాడు.
శ్లో॥ సమాన ధర్మౌ ద్వావేతా మేహనాశక్తదుర్జనౌ,
నిరాదరాద్వినమ్రౌచ లాలనాత్తు మహోద్దతౌ. 9
భావం: బలహీనుడైన దుర్జనుడు, శిశ్నము, రెండూ సమాన గుణం కలవి. లాలించే(నిమిరే) కొద్దీ రెచ్చిపోయి, పట్టించుకోకుంటే అణిగి, ఉంటాయి.
శ్లో॥ ఉపకారిజనేనిత్యం విశ్వాసేన ప్రవర్తితుం
అహంతు సారమేయః కిమితి పృచ్ఛతి దుర్జనః 10
భావం: తనకు ఉపకారం చేసినవారి పట్ల కృతజ్ఞత (విశ్వాసం) కలిగి ఉండడానికి ‘‘నేనేమీ కుక్కనా?’’ అని ప్రశ్నిస్తాడు దుష్టుడు.
శ్లో॥ పురాశ్రిత్య ఖలః పాదం మూర్ద్ని తిష్ఠత్యనంతరం
లతాశ్రిత్య తరోర్మూలమగ్ర మారోహతి క్రమాత్. 11
భావం: మొదట పాదాలనాశ్రయించి, క్రమక్రమంగా తలపైకెక్కి కూర్చుంటుంది. కదా వృక్షాలపై పూల తీగ. దుర్జనుని పద్ధతి కూడా అంతే.
శ్లో॥ ఆత్మానం నిందతు శ్రోతా తథాప్యుత్తమవర్తనం,
దురాత్మా మత్సరగ్రస్తో దూషయన్ పరితృప్యతి. 12
భావం: సజ్జనుడు తనను ఇతరులు నిందించినప్పటికీ తన సత్ప్రవర్తన మానడు. దుష్టుడు మాత్రం ఈర్ష్యతో తిరిగి దూషించి సంతృప్తి చెందుతాడు.
శ్లో॥ శృణ్వన్నపి సదార్యోక్తి మృజుతాం నైతి దుర్జనః
నదీపానీయ పూర్తస్సన్ స్వాదు తామేతి ముద్ధరేతి కిం. 13
భావం: సత్పురుషుల సూక్తులను వింటున్నా దుష్టుడు. సద్వర్తనమలవరచుకోడు. ఎన్నో నదులు తనలో అమృత తుల్యమైన మధుర జలాలను తెచ్చి కల్పుతున్నా సముద్రం ఉప్పదనాన్ని విడువదు కదా!
శ్లో॥ పరేషామున్నతిం ద్రష్టుం భణితుం శ్రోతుమీర్ష ్యకః
అంధో మూకశ్చ బధిర స్సాక్షి జిహ్వాశ్రవా అపి. 14
భావం: దుష్టుడు ఇతరుల ఉన్నతిని ఈర్ష్యతో సహించలేడు. దాన్ని గురించి చూడడు, మాట్లాడడు, వినడు. కళ్ళు, నాలుక, చెవులున్నప్పటికీ, గుడ్డి, మూగ, చెవిటి వాని వలెనుంటాడు.
శ్లో॥ దృశ్యతే కా చ శకలే త్వతిరత్నా తళద్ద్యుతిః
తథైవ నికృతే బాహ్య సౌశీల్యమతి సజ్జనః 15
భావం: గాజు ముక్క రత్నం కన్నా తళతళలాడుతుంది. అట్లే నీచుడు సజ్జనునికన్నా బాహ్యడంబరం వెలార్చుతాడు.
శ్లో॥ ప్రయోజనం యాచితుశ్వ శ్శ శ్వదాగత్య వంచకః
ప్రదర్శితాత్మీయ భావో నమ్ర చేష్టో హసన్ముఖః 16
భావం: ధూర్తుడు తనకవసరమైనప్పుడు ఆత్మీయతను ప్రదర్శిస్తాడు. వినయాన్ని నటిస్తాడు. చిరునవ్వులు చిందిస్తాడు.
శ్లో॥ కాకోదరగతే శ్శ్వాన పుచ్ఛ స్య హఠ చేతసః
ఋజుత్వం కల్ప్యతే యేన సఏవా పర విశ్వసృట్.. 17
భావం: పాము నడకలో, కుక్క తోకలో, మూర్ఖుని మనస్సులో వక్రతను తీయగల్గడం సృష్టికర్తకు కూడా సాధ్యం కాదని భావం.
శ్లో॥ భ్రామ్యతః క్షుద్రయోర్మధ్యే స్నేహవైరే క్షణం క్షణం
వరాటసదృశోలాభనష్టః వా కారణం తయోః 18
భావం: నీచుల మధ్య స్నేహం కాని, వైరం కాని, క్షణక్షణానికి మారుతాయి. గవ్వలాటలో గవ్వ సారి సారికి పందెం మారుస్తుంటుంది కదా!
శ్లో॥ యస్యా అపి కుటుంబిన్యాః పాతివ్రత్యమయీం కథాం,
శ్రోతుం న సహతే కించిదపి స్వేచ్ఛా ప్రవర్తనా. 19
భావం: స్వేచ్ఛావర్తని అయిన స్త్రీ, కుటింబినుల, పతివ్రతల చరిత్రను వినడానికి కొంచెం కూడా ఇష్టపడదు.
శ్లో॥ అసంఖ్యాక విటోపేతా సుశీలాంగృహిణీం ప్రతి,
భావయత్యన్న వస్త్రార్థమేకాధీనేతి భోగినీ. 20
భావం: లెక్కలేనంత మందితో గడిపే దుశ్శీల, సుశీలయైన గృహిణిని చూచి, పాపం అన్న వస్త్రముల కోసం ఒక్కనికే అధీనగా ఉందని జాలి పడ్తుంది.
శ్లో॥ మహారాజ కుమారోపి నాధీతీస్స్వాన్న పండితః,
సమ్రాట్పుత్య్రపి సంతానవతీ నస్యాదమైథునాత్. 21
భావం: మహారాజు కుమారుడైనా గురువు వద్ద శిక్షణ పొందకుండా పండితుడు కాలేడు. సమ్రాట్టు పుత్రికైనా పురుష సంగమం లేకుండా సంతానం పొందలేదు.
శ్లో॥ గణికా స్వభుజంగ స్య రోగార్త స్య కువైద్యకః,
యేనకేన విధానేన హరత్యర్థం నిరంతరం. 22
భావం: వేశ్య తన విటుని నుండి, దుష్ట వైద్యుడు రోగి నుండి, నిరంతరం ఏదో విధంగా ధనం లాగుతూనే ఉంటారు.
శ్లో॥ హేతునా యేన కేనా పి పత్యా సంతాడితా యది,
సహస్ను షా మహానంద పూర్ణచిత్తా భవత్యహా. 23
భావం: భర్త ఏదో కారణంగా తన సవతిని దండిస్తే, మహదానందం పొందుతుంది ఆడది.
శ్లో॥ వృషస్యంతీతు పురుషాద్రతి వై యాత్య సంపదం,
గణికాతు సువర్ణాది సంపదం భృశమిచ్చతి. 24
భావం: భర్త ఉండీ వ్యభిచరించే స్త్రీ, తన సంపదనే ప్రియునకిస్తుంది. వేశ్య మాత్రం నిత్యం విటుని నుండి అంతులేని సంపదను కోరుకుంటుంది.
శ్లో॥ వ్యాఘ్రతుల్యో యాచక! త్వం తం త్వాం ద్రష్టా ప్రధావతి,
కుతః ప్రాణభయాత్తస్మాత్వద్విత్తార్థన సాధ్వసాత్. 25
భావం: ఓ యాచకా! నీవు పెద్ద పులి వంటి వానివి. పెద్ద పులిని చూసి జనులు ప్రాణ భయంతో పారిపోతారు. నిన్ను చూచి, డబ్బడుగుతావని భయంతో పారిపోతారు కదా!
శ్లో॥ అత్యంత తను దోషోపి విశుద్ధ చరితే జనే,
మాలిన్య వేశవచ్చు భ్రవసనే దృశ్యతే స్పుటం. 26
భావం: పవిత్ర చరిత్రము కల్గిన సజ్జనునికి తన చిన్న దోషము కూడా స్పష్టంగా లోకానికి తెలుస్తుంది. తెల్లటి వస్త్రం పై చిన్న మరక కూడా వికృతంగా కనిపిస్తుంది కదా!
శ్లో॥ నియుక్తారక్షక భటాః ప్రజా ప్రాణాది రక్షితుం,
రేఫస్థాన నిక్షిప్త భకారాః ప్రాయశో భవన్. 27
భావం: రక్షక భటులు ప్రజాల ధన, మాన, ప్రాణాలను కాపాడడానికి నియోగించ బడినారు. కాని వాళ్ళు తరచుగా వారి పేరులోని ర కారం బదులు భ కారాన్ని ధరిస్తారు. రక్షక భటులు భక్షక భటులుగా మారతారని భావం.
శ్లో॥ ప్రభుత్వోద్యోగి హస్తేషు విత్తం న నిహితం యది,
సధర్మమపి తత్కార్యం సాఫల్యం నైతి ప్రాయశః. 28
భావం: ప్రభుత్వోద్యోగులు తమ విధిలో భాగంగా చట్ట బద్ధమైన పనిని చెయ్యడానికి కూడా తరచుగా లంచం లేకుండా చేయరు కదా!
శ్లో॥ త్వత్సహాయం ప్రాప్నువంతు బహుధా బహవో జనాః,
ఏకోపి దుర్లభస్తేషాం విపది త్వత్సహాయకః 29
భావం: ఎన్నో రకాలుగా ఎందరో నీ సహాయం పొందినప్పటికీ, నీకు ఆపద కల్గినప్పుడు, సాయం చెయ్యడానికి ఒక్కరు కూడా ముందుకు రారు.
శ్లో॥ ఏకమప్యాత్మ యత్నంతు దైవాత్సాఫల్యమేతిచేత్,
చింతయత్యసమర్థోపి దక్షోహమితి మానసే. 30
భావం: తన ప్రయత్నం వల్ల కాని, లేదా దైవం వల్ల కాని, ఏదో ఒక పని సఫలమైనప్పుడు, అసమర్థుడు కూడా తనను తాను గొప్ప సమర్థుడనని భావిస్తాడు.
శ్లో॥ కుశలీ దుర్జనేనాపి సత్కార్యం కారయిష్యతి,
వైద్య శాస్త్ర ప్రవీణస్తు యథారోగ్యం గరాదినా. 31
భావం: సమర్థుడు దుర్జనులతో కూడా మంచి పనులు చేయించగలడు. శాస్త్ర ప్రవీణుడైన ఆయుర్వేద వైద్యుడు గరళంతో (విషంతో) కూడా ఆరోగ్యాన్ని చేకూర్చగలడు కదా!
శ్లో॥ పూజ్యతే సత్వ హీనోపి లోకైస్థ్సాన విశేషతః,
ప్రక్షిప్తః దేవతావేద్యాం పాషాణోపి ప్రపూజ్యతే. 32
భావం: పీఠం మీద అధివసించిన రాయి కూడా గుడిలో పూజింపబడుతుంది. కదా! బలహీనుడైనా తాను ఉండే స్థానాన్ని బట్టి లోకంలో గౌరవించబడతాడు.
శ్లో॥ దుర్లభాశ్రీశ్శక్తిహీనం యద్విధేనాపి సంగత,
కస్తూరికా మృగా ఏవ సైవ తస్మై మృతి ప్రదా. 33
భావం: శక్తి హీనునకు సంపద దగ్గరున్నా ఉపయోగపడదు, మీదు మిక్కిలి హాని చేస్తుంది కూడా. కస్తూరి మృగం తన బొడ్డులోనే ఉన్న కస్తూరి పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ అది తన వద్దే ఉందని తెల్సుకోలేక దానికై పరిగెత్తి పరిగెత్తి, చివరకు ప్రాణాలనే కోల్పోతుంది కదా!
శ్లో॥ అశాంతిర్వర్తతేన్యేషాం కదాచిత్సమయే హృది,
సర్వదా స్వైరిణీ భర్తః కుపుత్ర జనకస్య చ. 34
భావం: జారిణి అయిన స్త్రీని భార్యగా పొందిన భర్తకు, దుర్మార్గుడైన కుమారుడు కల్గిన తండ్రికి, ఎల్లప్పుడు మనసులో అశాంతి రగులుతూనే ఉంటుంది.
శ్లో॥ వినా చేతసి భామిన్యా కేవలం దృశి చాలకే,
అరాలతాం విన్యసేచ్చేత్ కీర్తనీయః ప్రజాపతిః. 35
భావం: స్త్రీలకు కేవలం చూపులలో తల వెంట్రుకలలో మాత్రమే వక్రతను కూర్చి హృదయాలలో వక్రతను చేకూర్చని బ్రహ్మదేవుడు నిజంగా శ్లాఘనీయుడు కదా!
శ్లో॥ తక్షణోత్పన్న కలహైశ్చావ్యవస్థిత భాషణైః,
అశ్లీల వాగుపాలంభైరాపానం పరిఘుష్యతే. 36
భావం: మద్య పానం వల్ల కలిగే అనర్థాలు మూడు. ఒకటి, తక్షణమే కలహించడం, రెండు, అర్థం పర్థం లేకుండా మట్లాడడం, మూడు బూతులు తిట్టడం.
శ్లో॥ యాచ్నా స్వయం యుష్మదనుగ్రహాన్మాం వృత్వా ప్రదేశాన్ వివిధాన్ జనాంశ్చ
వ్యపశ్యయల్లోకవిదస్మి తస్మాత్ దారిద్య్ర! తే నిత్యమహం కృతజ్ఞః 37
భావం: ఓ దారిద్య్రమా! నేను నిత్యం నీకు కృతజ్ఞునిగా ఉంటాను. ఎందుకంటే నీ దయతో నిత్యం యాచిస్తూ అన్ని చోట్లా అందరితో తిరగడం వల్ల నేను లోకాన్ని గురించి బాగా తెల్చుకున్నాను.
శ్లో॥ ఆత్మాచరిత కర్మాణి వివేక రహితాన్యపి,
యస్తు ప్రశస్యతే తస్మిన్నజ్ఞో భవతి ప్రీతిమాన్. 38
భావం: మూర్ఖుడు తన బుద్ధిలేని పనులను, వ్యంగ్యంగా ఎవరైనా మెచ్చుకుంటే అది నిజమే అనుకుని, ఎంతో సంతోషిస్తాడు.
శ్లో॥ పవిత్రచిత్తో లభతే మహాత్మ సందర్శనేనిర్వచనీయ తృప్తిం
ప్రాపంచికో నాస్త్యపి లాభ లేశః ప్రావృట్పయోదాగమనే శిఖీవ. 39
భావం: సజ్జనుడు సామాన్యుల వలె కాకుండా మహాత్ముల దర్శనంతో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడు. వర్ష వేళ దట్టంగా కమ్ముకున్న మేఘాన్ని చూచిన నెమలి వలె.
శ్లో॥ నీరూపోస్త్యనిలాత్సర్జరసః పరిమళం యథా,
త్యాగావదాన్యో నిస్స్వాస్తు ప్రసార యతి సద్యశః 40
భావం: వాయువు సర్జమనెడి వృక్షము యొక్క పరిమళాన్ని అన్ని దిక్కులకు వ్యాపింపజేయునట్లు త్యాగం చేతనే తన కీర్తిని దాత నల్దిక్కులకు వ్యాపింపజేయగలడు.
శ్లో॥ సాపత్నీ జననీ ప్రేమ వణిజస్సత్య సంధతా,
దృశ్యతే గణికా రాగో మృగతృష్ణా కృపీట వత్. 41
భావం: సవతి తల్లి అనురాగం, వ్యాపారి సత్య సంధత, వేశ్య ప్రేమ, ఈ మూడూ ఎండమావిలో నీరు వంటివే.
శ్లో॥ లజ్జావతీ వారకాంతా, స్వాభిమానీ చ యాచకః,
మలిమ్లుచో ధ్వాంత భీరుర్న యాంతి స్వప్రయోజనం. 42
భావం: సిగ్గు పడే వేశ్య, అభిమానవంతుడైన బిచ్చగాడు, చీకటికి భయపడే దొంగ, వారి ప్రయోజనాలను సాధించలేరు.
శ్లో॥ ఉక్త్వా స్వయం క్రూర వచాంసి జిహ్వా తిష్ఠేన్ము ఖాంతర్నిరుపద్రవంచ
తదీయ దోషేణ శిరస్తు పాద రక్షా ప్రహారైః పరి పీడ్యతే హి. 43
భావం: పరుషంగా మాట్లాడిన నాలుక నోటిలో చేరి నిరుపద్రవంగా ఉంటుంది. దీని ఫలితంగా తల చెప్పు దెబ్బలు తింటుంది కదా!
శ్లో॥ నాస్తి సృష్ట్యాం వ్యర్థ వస్తు పానీయం న భవత్యపి,
రసేన్ద్ర లవణోత్పత్తి మూలకం హ్యర్ణవోదకం. 44
భావం: సృష్టిలో వ్యర్ధమైన పానీయం లేదు. సముద్రపు నీరు నాలుకకు తగిలిన వెంటనే ఉప్పు రుచిని కల్గిస్తాయి కదా! (షడ్రుచులలో ఉప్పు ఒకటి)
శ్లో॥ ఉత్పన్నాన్యోన్య రాగౌ స్త్రీ పురుషౌ సజనావపి,
స్వకాంక్షాం వదతో దృగ్భిః కేవలం న తు భాషణైః. 45
భావం: పరస్పరానురక్తులైన స్త్రీ పురుషులు కేవలం చూపులతోనే మాటలు లేకుండా తమ కాంక్షను ఎందరిలో ఉన్నా తెలియజేస్తారు కదా!
శ్లో॥ వాచాలస్యానభిజ్ఞస్య ప్రసంగే విషయోనహి,
శ్రూయతే కేవలం తత్ర గాఢం దడ దడ ధ్వనిః 46
భావం: అజ్ఞానియైన వాచాలుడు (వదరుబోతు) తన ప్రసంగం సారవంతం కాని విషయం దడదడలాడే ధ్వనితో వెలువరిస్తాడు. ఆడంబరంగా అహంకారాన్ని ప్రదర్శిస్తూ పనికిరాని మాటలు పలుకుతాడని భావం.
శ్లో॥ సోదారావపి నోహ్వౌద్వాపుత్తమౌ వాప్యనుత్తమౌ,
ఏకార సముత్పన్నా సుమణి ప్రసరావివ. 47
భావం: అనర్ఘమైన మణితో పాటే గులకరాయి కూడా నేలలో లభిస్తుంది. అంటే సోదరులలో ఉత్తములు, నీచులు కలిసే జన్మిస్తారు.
శ్లో॥ యదేకో వాంఛతి స్వాంతే తదేవాన్యోన వాంఛతి,
యథాంధకారం చోరస్తు తథా సంపన్న మందిరః. 48
భావం: ఒకరికి ప్రియమైన దాన్ని మరొకరు ఇష్టపడరు. చీకటిని దొంగ ఇష్టపడతాడు కాని సంపన్నుడు ఇష్టపడడు కదా!
శ్లో॥ వాంఛతోద్యావేక వస్తు భావ భేదే న మానసే,
కుటుంబినీ స్తన ద్వంద్వం యథా పుత్రక వల్లభౌ. 49
భావం: ఒకే వస్తువు బావ భేదంతో వేరువేరుగా వాంఛింపబడుతుంది. స్త్రీ కుచ ద్వయం భర్త, కుమారులచేత వేరు వేరుగా భావింపబడుతుంది కదా!
శ్లో॥ చండోస్తు స్వపతిస్తస్య దర్శనాదున్మిషత్ప్రభా,
సతీభవతి పుల్లాస్యా చండాంశోరివ పద్మినీ. 50
భావం: తీక్షణుడైన భర్తను ప్రతిభాశాలిగా చూడడం వల్ల స్త్రీ సంతసిస్తుంది. సూర్య కాంతి తీక్షణంగా ఉన్నా పద్మం వికసిస్తుంది కదా!
శ్లో॥ ఏకాక్రియాయాపి విదధాతి ఫలంతు కర్తృ భేదాత్పృధకదిహ చూచుక మంగనాయాః,
ఉద్యత్పయః కుచయుగః తనయ స్స్పృశేచ్చేత్కాంతస్పృశేద్భవతి మన్మథరంగమార్ధ్రం. 51
భావం: ఒకేపని చేసేవారిలో భేదాన్ని బట్టి వేరు వేరు ఫలితాన్నిస్తుంది. స్త్రీ చను మొనలను, కుమారుడు స్పృశిస్తే పాలు కారుతాయి. భర్త స్పృశిస్తే కామోద్దీపనం కల్గుతుంది.
శ్లో॥ దోషైక దృగ్భవేదేష ఇతి మత్వా ప్రజాపతిః
కేవలం తస్య వదనే విచిక్షీపైక లోచనం. 52
భావం: వీడు కేవలం తప్పులే ఎన్నుతాడు అనే బ్రహ్మదేవుడు దోషైకదృక్‌నకు ఒకే కన్నును అమర్చినాడు కదా! (దోషైక దృక్ అనేది పండితులలో ఒక భేదం. దాన్ని కవి ఇక్కడ చమత్కరించినాడు)
శ్లో॥ అత్యల్ప బీజ జనితోపి వటో దదాతి ఛాయం పునర్వసతి మాశ్రిత జీవకోట్యై
ఏవం పరోపకృతి వర్తన చారుశీలః కశ్చిన్మహాన్ భవతి నిమ్న జనోద్భవోపి. 53
భావం: మర్రి వృక్షం అతి చిన్న బీజం నుండి తయారై జీవకోటికి ఆశ్రయమిస్తుంది. అట్లే నీచ కులంలో పుట్టిన వాడైనా పరోపకార పారీణ బుద్ధితో మహాత్ముడు కాగలడు.