శ్రీలక్ష్మీనరసరామణీయకం › చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 2
చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 2
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 33 / 37
శ్లో॥ స్థూల బీజ భవస్తాళో దీర్ఘాకారోహి కేవలం
వటవత్ప్రాణినాం ఛాయాం వసతిం వా తనోతి కిం. 54
భావం: పెద్ద తాటికాయ నుండి పెరిగిన తాటి చెట్టు కేవలం పొడుగ్గా పెరుగుతుంది. కాని చిన్న విత్తనం నుండి పెరిగిన మర్రి చెట్టు వలె ఎన్నో జీవులకు ఆశ్రయం కాలేదు కదా!
శ్లో॥ కస్త్వం దేవో దృశస్తేచ గుహ బ్రహ్మ పి నాకినాం
గణనాయాం సమాస్సంతి గాయత్య్రక్షర సంఖ్యయా. 55
భావం: ఓ దేవా నీవెవరవు? కుమారస్వామి, బ్రహ్మ, శివుడు వీరి కన్నుల సంఖ్యతో కలిసి నీ కన్ను కలిసినప్పుడు గాయత్రి మంత్రాక్షర సంఖ్య అయిన 24(24) వస్తుంది. కుమారస్వామి 12, బ్రహ్మ 8, శివుడు 3. మొత్తం (23). గాయత్రీ మంత్రాక్షర సంఖ్య 24. మిగిలిన ఒకే కన్ను కల్గిన స్వామి జ్ఞాన చక్షువు కల్గిన పరమాత్మయే అని భావం.
శ్లో॥ సంతాన కాంక్షిణౌ భార్యా భర్తారావపి వేధసా,
పుం పక్షపాతినా న్యస్తః భార్యాయాం ప్రసవ శ్రమః 56
భావం: సంతానం కావాలనెడి కోరిక గల స్త్రీ, భర్తను, బ్రహ్మను నిందిస్తుంది. ఏమని? పురుష పక్షపాతియైన బ్రహ్మదేవుడు ప్రసన శ్రమను స్త్రీలకే విధించినాడు కదా!
శ్లో॥ సంతాన కాంక్షౌ పురుషాదధికా యోషిత స్తతః
తస్యాం విధీయతే గర్భధారణాది పరిశ్రమః. 57
భావం: సంతానం కోరే స్త్రీ పురుషునకన్నా తానే ఎక్కువ తపన పడుతుంది. అందుకే ఆమెనే గర్భధారణ, ప్రసవం వంటి బాధలన్నీ పడుతుంది.
శ్లో॥ అల్పః కదాచిత్సమయేత్వనస్యసాధ్య క్రియాం వీత భయః కరోతి,
అంబష్ట కః పార్థివ కేశ పాళీం కరేణ గృహ్ణాతి తతో మహాన్ కిం. 58
భావం: నీచుడు కూడా అసాధ్యమైన పనులను భయం లేకుండా సందర్భాన్ని బట్టి చేయగలడు. మహారాజు తలజుట్టును కూడా క్షుర కర్మ సమయంలో క్షురకుడు (మంగలి) చేతితో పట్టుకుని వంచగలడు కదా!
శ్లో॥ ముఖాకృతా మన్మథ దండ ముష్క యుగ్మ ప్రమాణే పరిధావనే చ
ఆవాం సమౌ కంఠ రవేధి కోహ మిత్యబ్రవీన్మత్త ఖరస్తురంగం. 59
భావం: ముఖాకృతులు రెండూ, గుహ్యాంగాలు రెండూ, వృషణాలు రెండూ మనకిద్దరికీ సమానమే. కాని నా కంఠ ధ్వని ఎక్కువ గావున నేనే గొప్ప అని గర్వించిన గాడిద గుర్రంతో అంటుంది.
శ్లో॥ ఆజీవా బహవో జ్ఞాతా అప్యేక స్తేషు పోషకః,
నైకాస్పంతు తరోః పాదా ఏకస్సుస్థితి కారకః. 60
భావం: ఎన్నో ప్రాణులను జీవితాంతం ఒక్కరే పోషిస్తారు. చెట్టు బోదె ఒక్కటే ఎన్నో శాఖలను, పత్రాలను, పుష్ప ఫలాలను భరిస్తుంది కదా!
శ్లో॥ లోభినం బాంధవో లుప్త పూర్వస్వం పితరం సుతః,
షండం పతిం కాముకీచ కీటవత్పరిపశ్యతి. 61
భావం: లోభిని బంధువులు, దరిద్రుడైన తండ్రిని కుమారులు, నపుంసకుడైన భర్తను భార్య పురుగును వలె చూస్తారు.
శ్లో॥ యస్య మన్మథ దండస్తు పరనారీ సులంపటః,
సతస్యైవ పరోక్షేణ కాల దండాయతే ధ్రువం. 62
భావం: పరకాంతా కాముకుడై బాధించె నీచునికి మరణానంతరం యమ దండన తప్పదు.
శ్లో॥ విశిష్టాహార్య కలనా దజ్ఞో భవతి కిం సుధీః,
సతీ భవతికిమ్ వేశ్యా సావిత్రీ వేష ధారణాత్. 63
భావం: పండిత వేషం ధరించినంత మాత్రాన మూర్ఖుడు పండితుడు కాగలడా! సావిత్రి వేషం ధరించిన వేశ్య సతీ సావిత్రి వంటి పతివ్రత కాగలదా!
శ్లో॥ గళిత గరణ కంఠ శ్శంకరో నీలకంఠః
ప్రబల తర విషాశీ బర్హిణో నీలకంఠః
అజిర తృణ విసర్ప త్కీట దర్పాపహారిన్
కలయసి కలవింక త్వంచ భో నీలకంఠః 64
భావం: హాలాహలాన్ని కంఠంలో బంధించిన శివుడు నీలకంఠుడు. బలవంతమైన పాములను చంపే నెమలి కూడా నీలకంఠమే. ఇంటి బయలులో పాకి పోయే పురుగులను తినే ఓ కోడీ! నీవు కూడా నీలకంఠమే కదా! అల్పులను, అధికులను అందరినీ ఒక రకంగా చూడడం అవివేకమని భావం.
శ్లో॥ కృపణో ధన లోభేన స్వభార్యాం నాభి గచ్ఛతి,
అస్యాం యో జాయతే పుత్రస్సమే విత్తం హరేదితి. 65
భావం: లోభి తనకు పుట్టే కుమారుడు తన సంపదను హరిస్తాడనే భయంతో కొడుకులే పుట్టకూడదని తన భార్యతో సంగమించడు కదా!
శ్లో॥ క్షణ మాత్రం గ్రహావేశో యామ మాత్రం సురా మదః,
అధికార మదో దుష్ట మాదేహ మనువర్తతే. 66
భావం: గ్రహం (దెయ్యం) వల్ల కల్గే ఆవేశం కొద్ది సేపే(క్షణ కాలం). మద్యం వల్ల కల్గే మత్తు ఒక రaాము సేపే. కాని అధికారం పొందిన దుష్టుని మదం చచ్చేదాకా ఉంటుంది.
శ్లో॥ బిలాద్బహి ర్బిలస్యాంతస్థ్సిత మార్జాల సర్పయోః,
మధ్యే చాతురి వా భాతి పత్నీ ద్వయ యుతో నరః. 67
భావం: ఇద్దరు భార్యల మధ్య నలిగే భర్త పరిస్థితి కలుగులో ఉన్న పాము బైటనున్న పిల్లి రెండిరటి మధ్యనున్న ఎలుక వలె ఉంటుంది.
శ్లో॥ చితాం ప్రజ్వలితాం దృష్ట్వా వైద్యో విస్మయమాగతః,
నాహం గతో న మే భ్రాతా కస్యేయం హస్త నైపుణీ. 68
భావం: ధగధగ మండుతున్న చితిని చూసిన వైద్యుడు నాది కాని, నా సోదరునిది కాని ఈ చేతి వాటం ఎవరిది? అని ఆశ్చర్యపోతాడు. తామిద్దరూ కాక మూడో వాడెవడో రోగిని చంపాడని భావం.
శ్లో॥ గర్భ స్ధితోపి గణకో మాతృ మాంసం న భక్షతి,
పాప భీత్యా న మంత వ్యో దంత హీనత్వ హేతుతః. 69
భావం: వడ్డీ వ్యాపారి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి మాంసాన్ని భక్షించకపోవడానికి కారణం పాపభీతి కాదు. కేవలం అప్పుడు తనకు దంతాలు లేకపోవడమే. వడ్డీ వ్యాపారి అందరి రక్త మాంసాలు పీల్చి తింటాడని, లోక కంటకుడని భావం.
శ్లో॥ అజాగళస్థ స్తన ముష్ట్ర పృష్ఠం కక్షాంతరే కేశమధాండ యుగ్మం,
త్వాం మా సృజ త్సాహిణి మార తస్మాత్ బ్రహ్మా న పూజ్యో భవదత్ర లోకే. 70
భావం: మేక కంఠం వద్దనుండే చన్నులు, ఒంటి మూపు, చంకలలోని వెంట్రుకలు, వృషణముల జంట వీటిని సృష్టించినందువల్ల బ్రహ్మకు ఈ లోకంలో పూజార్హత లేకుండా పోయింది. వాటి వంటి నిష్పలమైనవి లేవని భావం.
శ్లో॥ దారిద్య్రశోచామి భవంతమేవ మస్మచ్ఛరీరే సుహృదిత్యుషిత్వా,
విపన్న దేహే మయి మందభాగ్యే మమేతి చింతా క్వ గమిష్యసి త్వం. 71
భావం: ఓ దారిద్య్రమా! నా శరీరంలో స్నేహితుని వలె తిష్ఠ వేసుకుని ఉన్నావు. దురదృష్టవంతుడనైన నా దేహము నాదే (నీదే) అనుకున్న నీవు ఎక్కడికి పోతావులే! దురదృష్టవంతుని దారిద్య్రం వదిలిపెట్టదు అని భావం.
శ్లో॥ స్వప్రాణమపి సంత్యజ్య బాధతే దుర్జనః పరాన్,
ప్రవిశ్య మక్షికా కుక్షిం వమనం కారయిష్యతి. 72
భావం: తన ప్రాణాన్ని వదులుతూ కూడా దుర్జనుడు ఇతరులను బాధిస్తాడు. ఈగ (దోమ) నోట్లో దూరి వాంతికి కారణమైతుంది కదా!
శ్లో॥ కృష్ణ రాయ కవీశాస్త్వాం స్తువంతు నవయం స్తుమః,
నరసింహ కిశోరస్య కియాన్ గజపతీర్జయః. 73
భావం: ఓ కృష్ణ రాయా! నీ గజపతులపై విజయాన్ని కవులు కీర్తిస్తున్నారు. నరసింహ కిశోరం (సింహం పిల్ల) ఏనుగుల మందను అవలీలగా పారద్రోలింది కదా!
శ్లో॥ సరసో విపరీతశ్చేత్సరసత్వం నముంచతి,
సాక్షరా విపరీతాశ్చేద్రాక్షసా ఏవ కేవలం. 74
భావం: సరసులు (రసమునెరిగిన వారు) విపరీతమైన (వ్యతిరిక్తమైనా) సరసమును వీడరు. సాక్షరులు (కేవలం శబ్దం మాత్రమే ఎరిగిన వారు) విపరీతమైతే రాక్షసులే అవుతారు. సరస శబ్దం తిప్పి చదివినా అర్థం మారదు. సాక్షరా శబ్దం తిప్పి చదివితే రాక్షసా అవుతుంది.
శ్లో॥ ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని, కీట
బుద్దిర నుష్యేషు నూతనాయాః శ్రియః ఫలం. 75
భావం: నడిమంత్రపు సిరి పొందిన వానికి ఇతురులు తన్ను పొగడటం. నిజమనుకుంటాడు. తనను తాను దేవుడని (గొప్ప వాడని తెలుస్తాడు. ఇతరులను పురుగులుగా (నీచంగా) చూస్తాడు.
శ్లో॥ స్థాన భ్రష్టా న శోభంతే దంతాః కేశా నఖా నరాః,
ఇతి విజ్ఞాయ మతిమాన్ స్వస్థానం న పరిత్యజేత్. 77
భావం: దంతములు, కేశములు, నఖములు, మనుష్యులు స్థానం మారితే శోభించవు. ఇది తెలిసిన మానవుడు తన స్థానాన్ని వదిలిపెట్టడు.
శ్లో॥ విపుల హృదయాభి యోగే ఖిద్యతి కావ్యే జడోన మౌర్ఖ్యేస్వీ,
నిందతి కంచుకమేవ ప్రాయశుష్కస్తనీ నారీ. 77
భావం: సహృదయుడు కావ్యాన్ని ఆస్వాదిస్తాడు. మూర్ఖుడు తన అవివేకాన్ని తెలియక కావ్య శోభను నిందిస్తాడు. కంచుకాన్ని (బ్రా) ఎండిపోయిన స్తనములు కల్గిన యువతి నిందిస్తుంది. స్తన సంపద కలిగిన స్త్రీ కంచుకంతో శోభిస్తుంది కదా!!
శ్లో॥ అకృతోపద్రవః కశ్చిన్మహానపి న పూజ్యతే,
అర్చయంతి నరా నాగం న తార్‌క్ష్యం న గజాదికం. 78
భావం: హాని చేయనప్పుడు గొప్ప వారిని కూడా మనుషులు గౌరవించరు. నాగులను పూజిస్తారు కాని, గరుడుని, ఏనుగులను పూజించరు.
శ్లో॥ శ్రీ కృష్ణ క్షితి పాల దత్త మణిభిః విద్వత్కవీనాం గృహాః
నానా రత్న చిరత్న కుట్టిమభువః రత్నాకరత్వం గతాః,
అబ్ధిః కేవల వారి పూర నిలయ స్సంభావ్యతే సజ్జనైః
అంభోధి ర్జలధిః పయోధి రుదధి వ్వారాంనిధి ర్వాఃధిః. 79
భావం: శ్రీ కృష్ణ దేవ రాయల చేత సత్కరింపబడిన కవుల గృహాలు అనర్ఘ మణి రత్నములతో నిండి రత్నాకరములైనాయి. రత్నాకరుడుగా పేరుపొందిన సముద్రంలో రత్నములన్నీ ఖాళీ అయిపోయినందువల్ల సముద్రునికి కేవలం అంబోధి, జలధి, పయోది, ఉదధి, వారిధి, వారాంనిధి అనే పేర్లు మాత్రమే మిగిలాయి కదా!
శ్లో॥ కుంభః పరిమితమంభః పిబతి పపౌ కుంభ సంభవోమ్భోధిం,
అతిరిచ్యతే సుజన్మా కశ్చిజ్జనకం నిజేన చరితేన. 80
భావం: కుండ పరిమితమైన నీటిని తాగుతుంది (తనలో నింపుకుంటుంది). కాని కుంభ సంభవుడైన అగస్త్యుడు సముద్రాన్నే తాగివేసినాడు. మహాత్ములు తన తండ్రి కన్నా గొప్ప పనులు చేసి, కీర్తి పొందుతారు కదా!
శ్లో॥ ఆనంద భాష్ప రోమాంచౌ యస్యస్వేచ్ఛా వశం వదౌ,
కిం తస్య సాధనైరన్యైః కింకరా స్సర్వ పార్థివాః. 81
భావం: ఆనంద బాష్పాలు పులకాంకురాలు ఎవరికైతే స్వేచ్చగా వశమైతాయో వానికి ఇతరములతో పని లేదు. రాజులంతా వానికి వశమైతారు గదా! (సేవకులు కదా!) జ్ఞాని లక్షణాలు.
శ్లో॥ దాతారోర్థిభి రర్థ్యంతే దాతృభిః పునరర్ధినః,
కర్తృ కర్మ వ్యతీహారా దహో నిమ్నోన్నతం కియత్. 82
భావం: దాతలు అర్థుల చేత (యాచకుల) విశేషంగా వృద్ధి చెందేవారు. దానం వల్ల వారి సిరి సంపదలు వృద్ధి పొందేవి. లేదా గొప్ప కీర్తి పొందేవారు. అట్లే అర్థులు కూడా దాతల వల్ల వృద్ధి పొందుతారు. ఇద్దరూ పరస్పరం సహకరించే టప్పుడు పై చేయి ఎవ్వరిదీ కాదు.
శ్లో॥ శుష్కోపవాసో ధర్మేషు బైషజ్యేషు చలం ఘనం,
జప యజ్ఞశ్చ యజ్ఞేషు రోచతే లోభశాలినాం. 83
భావం: లోభికి ధర్మాలలోశుష్కోపవాసం, మందులలో లంఖణం, యజ్ఞాలలో జప యజ్ఞం మిక్కిలి సంతోషాన్నిస్తాయి. వీటి వల్ల ఖర్చు కాదు కాబట్టి.
శ్లో॥ కాలాంతరే హ్యనర్థాయ గృధ్రో గేహే పరిస్థితః,
ఖలో గృహ సమీపస్థ స్సద్యోనర్ధాయ దేహినాం. 84
భావం: ఇంటిపైన వాలిన గ్రద్ద కాలాంతరంలో ఎప్పటికైనా హాని కల్గిస్తుంది అని శకున శాస్త్రం. కాని ఇంటి దగ్గరున్న దుష్టుడు మాత్రం వెంటనే కీడు కల్గిస్తాడు.
శ్లో॥ సదా జప స్రక్ హస్తేచ మధ్యే మధ్యేక్షి మీలనం,
సర్వం బ్రహ్మేతి వాదశ్చ సద్యః ప్రత్యయ హేతవః 85
భావం: ఎప్పుడూ చేతిలో జపమాల తిప్పడం, మధ్య మధ్య కన్నులు మూసికోవడం, సర్వం బ్రహ్మమయం అంటూ ఉండడం వల్ల వెంటనే గౌరవాన్ని, నమ్మకాన్ని పొందవచ్చు. జ్ఞాని యని, స్వామియని జనులు నమ్ముతారు. దొంగ బాబాలను హేళన చేయడం ఇది.
శ్లో॥ దుష్టా నద్రష్ట వ్యాః ద్రష్ట వ్యా శ్చేన్నతైస్తు సహతిష్ఠేత్,
యది తిష్ఠేన్నతు కథయే ద్యది కథయే ద్దుష్టవత్కథయేత్. 86
భావం: దుష్టులతో వ్యవహారాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకం. దుష్టులను చూడనే రాదు. చూడాల్సి వస్తే ప్రక్కన కూర్చోరాదు. కూర్చోవాల్సి వస్తే మాట్లాడరాదు. మాట్లాడాల్సి వస్తే దుష్టుని వలెనే (వానికిష్టమైనట్లే) మాట్లాడాలి.
శ్లో॥ కథం సుపర్ణానుగతం విహాయ ఫలైరుపేతం హరి కల్ప భూరుహం,
స్థాణుం త్వపర్ణానుగతం భజంతీత్యహో జనా విస్మయమేతి భైరవః 87
భావం: జనులు సుపర్ణ (గరుత్మంతుడు) వాహనంగా కల్గిన విష్ణుమూర్తి అనే కల్పవృక్షాన్ని విడిచి, (సమృద్ధిగా పచ్చని ఆకులతో కూడినా), అపర్ణ (ఆకులే లేనిమోడు వంటి) పార్వతితో కూడిన శివుని సేవించి ఎలా కామితార్థాలు పొందుతున్నారో కదా అని భైరవుడు ఆశ్చర్య పోతున్నాడు.
శ్లో॥ పీతాంబరం వీక్ష్య దదౌ చ లక్ష్మీం చర్మాంబరం వీక్ష్య దదే విషం తు
లోకో సమర్చయతి నిజధార్య వేషాత్ క్షీరోనిధిర్యథా హరీశ్వరాభ్యాం. 88
భావం: పీతాంబరుని (విష్ణువును) చూసి సంపదను ఇస్తారు. గజ చర్మాంబరుని (శివుని) చూసి విషాన్నిస్తారు. సముద్ర మధనంలో శివుడు విషాన్ని, విష్ణువు లక్ష్మీ దేవిని పొందినారు. వేషం బట్టి మన పట్ల ఇతరుల ప్రవర్తన ఉంటుంది కదా!
శ్లో॥ అనేకే ఫణినస్సంతి భేక భక్షణ తత్పరాః,
ఏక ఏవ హి శేషోయం ధరణీభరణ క్షమః. 89
భావం: కప్పలను తిని బతికే పాములు లెక్కలేనన్ని సృష్టిలో ఉన్నాయి. భూభారాన్ని నిత్యం మోయగల్గ సమర్థుడు ఆదిశేషుడొక్కడే.
శ్లో॥ కస్యాపి కోప్యతి శయోస్తి స, తేన, లోకే, ఖ్యాతో భవిష్యతి న సర్వవిదస్తు సర్వే
కిం కేతకీ ఫలతి? కిం పనసస్సపుష్పః కిం నాగవల్ల్యపి చ పుష్ప ఫలైరుపేతా. 90
భావం: అన్నిటిని గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరు. కొన్నింటిని గురించి జ్ఞానం లోపించినా లోకంలో ప్రసిద్ధి పొందగలరు. ఉదాహరణగా మొగలి చెట్టు ఫలించదు. కేవలం సువాసనే. పనస చెట్టుకు పువ్వులుండవు. నేరుగా ఫలిస్తుంది. తమలపాకు తీగకు పువ్వులుండవు. ఫలాలుండవు. దాని ప్రయోజనం కేవలం ఆకులతోనే కదా!
శ్లో॥ తృణాదపి లఘుస్తూల స్తూలాదపి చ యాచకః,
వాయునా కిం న నీతోసౌ మా మయం యాచయేదితి. 91
భావం: గడ్డి పోచ కన్నా దూది పింజె తేలిక(చులకన) దానికన్నా అడుక్కు తినేవాడు తేలిక. గాలి చేత కూడా తప్పించబడతాడు వాడు. (తన్ను వాడు యాచిస్తాడుఅని గాలి కూడా వాని స్పృశించదు.)
శ్లో॥ ఆశాయై యాః దాసా యే దాసాస్తే సర్వ లోకస్య,
ఆశా దాసీ యేషాం తేషాం దాసాయతే లోకః. 92
భావం: ఆశకు దాసులైన వారు లోకానికంతా దాసులే. ఆశనే దాసిగా చేసుకున్న వారికి (సంయమీంద్రులు) లోకమంతా దాసులే కదా!
శ్లో॥ తుంగభద్రా పయః పానం తుంగసద్మాధిరోహణం,
తుంగస్తనీ పరీరంభస్తుంగస్య తపసః ఫలం. 93
భావం: తుంగభద్ర నదీపానీయాన్ని తాగడం, ఎత్తైన హిమాలయాన్ని ఎక్కడం, బలిసినచన్ను లదాని పొందు, ఇవన్నీ తీవ్రమైన తపస్సు ఫలితమే. తుంగ శబ్దం మీది శ్లేషతో చమత్కారం సాధించబడిరది.
శ్లో॥ ఉపచారః కర్తవ్యో యావదనుత్పన్న సౌహృదాః పురుషాః
ఉత్పన్న సౌహృదానం ఉపచారః కైతవం భవతి. 94
భావం: నిజమైన మిత్రుడికి ఉపచారం (మర్యాద) చేయడం, గౌరవం నెరపడం, కపటంగా భాసిస్తుంది. అదే మిత్రుడు కాని వాడికి గౌరవం నటించడం అవసరమే.
శ్లో॥ నశ్యత్యనాయకం కార్యం తథైవోన్మత్త నాయకం,
స్త్రీ నాయకం తథా బాల నాయకం బహు నాయకం. 95
భావం: నాయకుడు లేకున్నా, బుద్ధి హీనుడైన నాయకుడున్నా, స్త్రీ నాయకురాలుగా ఉన్నా.. బాలుడు నాయకుడైనా, లేదా చాలా మంది నాయకులైనా ఏ కార్యమూ సిద్ధించదు. కార్య నాశనము తప్పదు.
శ్లో॥ స్వాధీనేపి కళత్రే నీచః పరదార లంపటో భవతి,
సంపూర్ణేపి తటాకే కాకః కుంభోదకం పిబతి. 96
భావం: నీచునకు చక్కని భార్య కల్గినప్పటికీ పర స్త్రీ వ్యామోహంలో ఉంటాడు. చెరువు నిండా నీళ్ళున్నా కాకి కుండలో నీటినే తాగుతుంది కదా!
శ్లో॥ శ్రోతరి జ్ఞాతరి ప్రాప్తే శ్లోక శ్లో ్శ కత్వ మాప్నుయాత్,
శ్రోతర్యజ్ఞాతరి ప్రాప్తే లకారస్తత్ర లుప్యతే. 97
భావం: రసజ్ఞుడైన శ్రోత దొరికినప్పుడే శ్లోకానికి శ్లోకత్వము (కీర్తి) లభిస్తుంది. శ్రోత వివేకహీనుడైతే శ్లోకంలోని లకారం లోపిస్తుంది. అంటే శోకంగా మిగులుతుంది.
శ్లో॥ అవసర పఠితా వాణీ గుణ గణ రహితాపి శోభతే పుంసాం,
రతి సమయే రోదంతం ప్రియమపి తనయం శప్యత్యసౌ జననీ. 98
భావం: లోకంలో జనులకు సందర్భశుద్ధిగా మాట్లాడే మాట శోభిస్తుంది. భర్తతో సంగమించే సమయంలో శిశువు ఏడిస్తే తల్లికి కూడా కోపం వస్తుంది. కదా! (బిడ్డ ఎంత ప్రియమైనా)
శ్లో॥ స్వకీయం హృదయం భిత్వా నిర్గతాయౌ పయోధరౌ,
హృదయ స్యాన్యదీయస్య భేదనే కా కృపా తయోః. 99
భావం: తన గుండెనే చీల్చుకుని వెలుపలికి పొడుచుకు వచ్చిన స్తనములకు, ఇతరుల (కాముకుల) గుండెను చీల్చడంలో దయ ఎందుకుంటుంది. తన అందంతో పురుషులలో కామాగ్నిని రగిల్చి బాధిస్తాయని అర్థం.
శ్లో॥ ముఖస్థ దారో భగవాన్ విరించి రురస్థ దారో భగవాన్ రమేశః,
పార్శ్వస్థ దారో భగవానుమేశః శిరస్థ దారో న శ్రుతో న దృష్టః. 100
భావం: బ్రహ్మ దేవునికి భార్య ముఖమందున్నది. విష్ణువునకు వక్షస్థలంలో ఉంది. శివునకు ప్రక్కన ఉంది. కాని తలపై భార్య ఉన్న వానిని గూర్చి వినము, కనము.
- సమాప్తం -
ప్రభాత రేఖలు
(ఖండకావ్యము)
పాణ్యం సోదరులు
ముద్రణ
పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు
2022
పాణ్యం సోదరులు
పాణ్యం సోదరుల(నరసరామయ్య, లక్ష్మీనరసింహశాస్త్రి) జంట తొలి రచన ‘‘ప్రభాత రేఖలు’’ అనే ఖండకావ్యం. ఇది 1945 లో ముద్రణకు నోచుకుంది. అంతకు ముందు కొన్నిసంవత్సరాలకు ముందే అప్పుడప్పుడు వ్రాసిన రచన. దీనికి ‘సరస్వతీ పుత్ర’ శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు పరిచయం వ్రాసినారు. ఈ కవులకు వారు గురుతుల్యులు. ఆ కాలంలో ఖండకావ్యం చాలా ప్రసిద్ధి చెందిన ప్రక్రియ. విశ్వనాథ సత్యనారాయణ, గుఱ్ఱం జాషువా, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రివంటి ఉద్దండులు ఈ ఖండకావ్య రచనను ప్రతిభావంతంగా నిర్వహించినారు. అందుకే మన కవులు కూడా ఈ రచనను ప్రారంభించినారేమో అనిపిస్తుంది. అసలు ఖండకావ్యం అంటే తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, లేదా చారిత్రక, పురాణ వ్యక్తులు, సన్నివేశాలు, సంఘటనలు వంటి వాటిని చూసి, విని కవి పొందిన భావతీవ్రతను ప్రభావవంతంగా చదివేవానికి స్ఫురింపజేస్తూ ఆనందాన్ని కల్గించే పద్య రచన. అసలు దీనికి ప్రభాతరేఖలు అని పేరు పెట్టడంలోనే ఇది వారి తొలిరచనగా తెలుస్తుంది కదా! దీన్ని గురించి పుట్టపర్తి వారి మాటల్లో ‘ఈ కావ్య కర్తలు ఇద్దరు. కాని వారి ఖండికలు వేరువేరుగా లేవు. ఉండనవసరము లేదు. కారణమేమనగా వారి భావములు పూర్తిగా తెలుసుకోలేనంతగానైక్యమైపొయినవి. రచనలో కనబడు గుణములో దోషములో ఇరువురి యందును సమానముగానున్నవనుటకు ఇందున్న రచనలే సాక్ష్యము. అనగావ్యక్తులిరువురు. హృదయం ఒకటే. కలములు రెండు. రచన ఒకటి.’’ ఈ మాటలను బట్టి కవుల రచనలో భావాలలో ఉన్న సమత్వం తెలుస్తుంది. ఇది ఇతర ఏ జంట కవులలో కనిపించదని పుట్టపర్తి వారి సర్టిఫికెట్. చూడండి. ‘‘తిరుపతి వెంకట కవులలో గూడా పరస్పరము శయ్య యందును భావములందును భేదము లేకపోలేదు. వీరు హృదయమును నమ్మిన కవులు. జంట కవులలోని జంటతనము హృదయమునకు సంబంధించినది కాక మరేమగును’’. ఈ మాటలను బట్టి ఈకవుల రచనా విధానం అర్థం చేసుకోవచ్చు.
దీనిలో ఉండే ఖండికలు.
జోహారు, పార్థివ, కృతజ్ఞత, మాపాప, యెవ్వాడవోయి, తార, నమస్సు, ఆశీస్సులు, అశ్వత్థామ, కాపుపడతి, కురంగము, శిల్పి, ఆంధ్రోద్యమము......
ఇందులో యెవ్వాడవోయి, అశ్వత్థామ, కాపుపడతి, శిల్పి ఆ కాలములోని సాహితీప్రియులకు అభిమానపాత్రంగా ఉండేవి.
ప్రభాత రేఖలులోని ‘యెవ్వాడవోయి’ ఖండికను చూద్దాం. దీన్ని గురించి పుట్టపర్తి వారు యేమన్నారో ఒక్కసారి గమనించి ముందుకుపోదాం. ఎవ్వాడవోయీ యనునదొక నిత్య భావము. అనగానది యొక ప్రత్యేక కాలమునకు, ఒక జాతి జనులకు, సంబంధించినది కాక, సర్వకాలములకు, సర్వవ్యక్తులకు సంబంధించినది. ఇట్టి భావములనెక్కువగా చెప్పిన వారినే మహాకవులందురు.
ఈ మాటలు మనసునదుంచుకొని ఈ ఖండికను చూద్దాం.
‘‘ప్రకటవికటాట్టహాస సంభరిత విలయ తాండవోద్రిక్త చిత్త వేధోండరంగ నిబిడ గంభీరమూర్తి’’
‘‘ప్రకృతిమాయా స్వరూప విలాసినీ మణీవశీకృత వేధోండ నిత్యకర్మ జాల తద్వ్యతిరిక్త సంసారి’’
‘‘రోదసీబిలయంత్ర శాలోదరాంతరాళ భౌతికయన్త్ర నిర్మాణ కర్మ మర్మ తత్తత్ప్రయోగ సంహారకృత్యవర్తి’’
‘‘క్రూరసంసృత్య కూపార తారణోరుభార ధారణ పారీణ ఘోరభంగవార వారణ కృత్కర్ణధార’’
‘‘సర్వహృదయాంతరాళ సంస్థాన రంగ వేషధారణ కర్మ ప్రవీణసక్త నిబిడ మాయా తిరస్కరణీ నిగూఢ’’
ఇవన్ని భగవంతుని గురించిన వర్ణనలు. అన్ని ఒకే సమాసం గా కూర్చినట్టివి. యువకవుల భావనాగంభీరతను వెలువరిస్తున్నాయి. వారి వ్యుత్పన్నతనుకూడా. పరమాత్మ తత్త్వాన్ని అన్నిరకాలుగా వివరించే సంభోధనలివన్నీ. క్లుప్తంగా చెప్పుకుందాం. పరమాత్మ తన్నుతాను ఈ జగత్తుగా విరచించుకున్నాడు. ఈ క్రమములో మాయాశక్తి తోడైనది. వీటినే సత్, చిత్ అని పేర్కొంటారు. స్ఠితి, లయముల వంటి కృత్యాలను జరిపేది అదే. సర్వమూ వ్యాపించిన ఆత్మచైతన్యము అదే. మనం దాన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం అదే. అవిద్యాస్వరూపమైన మాయాశక్తి. ఇన్ని భావాలు పలికించినారు మన పాణ్యం సోదరులు ఆవయసుకే. వారిలో బీజప్రాయంగా ఉన్న ఈ భావాలు వారిని పండిన ఆధ్యాత్మికవేత్తలుగా మలచినాయి.
చివరిలో ‘‘ఉన్నదనుకొన్న నంతయు నున్నదోయి, లేదటన్న నేమియులేదు నీకు’’
‘‘అప్రతిహతాఖిలచరాచరప్రపంచ హృదయ చిన్మూర్తి’’ అంటారు. దీన్ని గురించి పుట్టపర్తి వారు ‘భగవంతుని సంభోధించుట - హృదయమును నమ్మిన - చక్కని సార్థకమైన మాట. భగవంతుని గురించి అంతకన్న యెవ్వడు-యేమియును చెప్పలేడు. చెప్పరాదుకూడా’’.
‘‘ప్రభాత రేఖలు’’లోనున్న ‘‘అశ్వత్థామ’’ మహాభారతంలో చిన్నదైనా చాలా ప్రభావవంతమైనది. అక్కడక్కడ తళుక్కున మెరుస్తుంటుంది కదా! కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టంలో తన తండ్రి ద్రోణాచార్యునికి సహాయకునిగా వ్యవహరిస్తాడు. ఇది భావి భారత సంగ్రామానికి నాంది. అక్కడే కురుపాండవ విరోధానికి బీజం పడుతుంది. కర్ణ పాత్ర కూడా ప్రవేశించేది ఇక్కడే కదా. ఇంక రెండవ ప్రముఖ సందర్భం కృష్ణరాయబారం. శ్రీకృష్ణుని రాజనీతి చాతుర్యం ఫలితంగా కౌరవ సభలో వీరుల మధ్య రెండు గ్రూపులు ఏర్పడి ఒకరినొకరు దూషించుకుంటారు. అశ్వత్థామ సుయోధనుని తూలనాడి సభనుండి వెళ్లిపోదామని తన తండ్రి ద్రోణున్ని, మేనమామ కృపాచార్యున్ని సిద్ధపరుస్తాడు. భీష్మాదులు శాంతింపచేయడంతో అక్కడికి అది నిలుస్తుందని మనకంతా తెలిసిందే. మరి ఈ సోది ఇప్పుడెందుకు? అనుకుంటున్నారా? చెప్తా... భారత పాత్రలలో పుత్ర వ్యామోహంతో పతనమైన పాత్రలు ఒకటి ధృతరాష్ట్రుడు రెండు ద్రోణుడు. కుమారుని మరణ వార్త విన్న క్షణమే ప్రాణాలు విడిచినాడు ద్రోణుడు. ద్రోణ వధకు పాండవులు పన్నిన ఉపాయం ఇదే కదా. పాపం ధర్మరాజు మనసు చంపుకొని తన సత్య వ్రత దీక్షను పక్కకు పెట్టాల్సి వచ్చింది. అశ్వత్థామ హతః కుంజరః అని పల్కడంతో అసత్యదోషం రాదని కృష్ణుడు సవరించినాడు కానీ సంకల్పంలో గురువధ ఉంది కదా. భారతయుద్ధం ఉపపాండవుల వధతో ముగుస్తుంది. ఇది చేసినవాడు అశ్వత్థామ. పాండవులు తన తండ్రిని మోసంతో చంపినారని పాండవ వంశమే మిగల్చనని క్రోధంతో పాండవ శిబిరాన్ని చేరిన అశ్వత్థామను మన పాణ్యం సోదరులు వస్తువుగా తీసుకున్నారు. అప్పటి సన్నివేశాన్ని అద్భుతంగా మనకు కన్నులకు కట్టిస్తారు చూడండి.