శ్రీలక్ష్మీనరసరామణీయకం › చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 3
చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 3
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 34 / 37
అదిగో! క్షుద్రవిపక్ష శిక్షణ సముద్యత్‌క్షాత్రతేజ స్సము
న్మద, మంతర్గతబ్రహ్మతేజము, మహామంత్రాద్యనుష్ఠానల
బ్దదురీక్ష్యోద్దుర ఘోరరౌద్రము, మహాధ్వాంతంబునన్ పర్వుచు
న్నది! నిద్రావశపాండవేయ శిబిరాంతః ప్రాంతమున్ జేరగన్
హస్తన్య స్తసమస్త భూభరణ దక్షాహి ప్రతీకాశ ఖ
డ్గా స్తోకాచ్ఛధగద్ధగద్ద్యుతి సమూహధ్వ స్తభూయ స్తమో
విస్తారమ్మయి, త్ర స్తభీకరమహాభేతాళనాథాధి భూ
తస్తోమమ్మయి, దుర్నివారణజవౌద్ధత్యంబు దీపింపగన్
దండో త్తాడితకుండలీంద్ర ఘనపూత్కార ప్రతిస్పర్థితో
చ్చండత్వానిల దీర్ఘ దీర్ఘతర నిశ్వాసోజ్వలద్బాల మా
ర్తాండ ప్రద్యుతినేత్ర సూచిత హృదంతః పూర్ణకోలాహలో
ద్దండ క్రోధముతో, నపాండవ పదార్థ స్థాపనోద్విగ్నమై
ఎదురేమాత్రము లేని, కాళరజనీహేరాళ నిశ్శబ్దతా
పదవిన్, దంత నిఘర్షణోత్కరకరవ్రాతంబుతోడేర్పడన్
పదవిన్యాసధణం ధణ ద్ధణ ధణార్భాటంబుగా ఢోద్ధతిన్
గదుమన్ దానుపపాండవేయమృతిహుంకా రాట్టహాసోపమున్
ఆ మహావేశకాల భయంకరోద్ధు
రాంతరుద్భూత మృత్యు జిహ్వాకరాళ
శక్తిలో; లీనమైపోయె చాల కుమిలి
కుమిలి, తిర్యఙ్మనుష్య జీవముల వెన్నొ!
అది - అనిర్వాచ్యమైన దృశ్యంబు! హృదయ
మట మటింపగ జేసెడు నదియును! మరి
భయమొ? ఆశ్చర్యమో? యేమొ! ప్రకృతితనకు
తాన తెలియక, నిర్విణ్ణయైనదట్లె.
భాష భావం రెండూ విజృంభించాయి కదా! అశ్వత్థామలో సుడులు తిరుగుతున్న ఉద్విగ్నత మొదటి పద్యంలోనే విజృంభిస్తుంది. అంతర్గత బ్రహ్మ తేజము, మహామంత్రాద్యనుష్టాన ...........రౌద్రము వంటి వర్ణనలన్ని ఒక భయాన్ని, అద్భుతాన్ని మనకన్నులకు కట్టించడం లేదా? అన్నిటికీ మించి ఆఖరి పద్యంలో ‘‘భయమొ ఆశ్చర్యమో యేమొ ప్రకృతి దనకు దానె తెలియక నిర్విణ్ణయైనదట్లె’’ అన్నది ఒక మహోత్కృష్ట భావన. వీర రౌద్ర భయానక అద్భుత భీభత్స రసాలన్ని ఒక్కసారిగా అశ్వత్థామలో విజృంభించడం చూసినప్పుడు ప్రకృతి నిర్విణ్ణ ఐనది. ఇది భావ శబలత. అంటే రెండు విరుద్ధ భావాలను జోడిరచి కొత్త భావాన్ని పలికించడంలో కవుల ప్రతిభ వెల్లివిరుస్తుంది. అక్కడి సన్నివేశం అర్ధరాత్రి. ప్రకృతి సహజంగానే నిశ్శబ్దంగా ఉంది. దాన్ని కవుల నిర్విణ్ణతగా చెప్పడంలో యెంతో ఔచిత్యంగా ఉంది. యేమి భావనాశక్తి!
ఈ విధంగా ఈ ఖండికంతా ఒక ఆవేశపు దూకుడులో పరుగులు పెడుతుంది. సహృదయునిలో రస విజృంభణ కల్గిస్తుంది.
ప్రభాత రేఖల ఖండికలో ‘‘కాపు పడతి’’తో మాట్లాడదామా! కవి దృష్టి, కవిత్వము అన్నీ సమాజ శ్రేయస్సు కోసం తన చుట్టు పట్లున్న వ్యక్తులను గురించి ఉంటుంది. అంతే కాకుండా సంఘంలో అన్ని వృత్తుల వారి సాధక బాధకాలు, ఆయా వృత్తులలో వారి నైపుణ్యం వంటివన్నీ లోతుగా పరిశీలించి స్ఫూర్తివంతంగా వ్యక్తీకరించడం మహాకవుల అందరి రచనలలో ఉండే సామాన్య గుణమే కదా! ‘‘రాజశేఖరుడ’’నే ఆలంకారికుడు తన ‘‘కావ్యమీమాంస’’లో దీనినే ‘‘భావయిత్రి-కారయిత్రి’’ అని పేర్కొన్నాడు. కవికి, ఇతరులకు గల తేడా ఇదే. మనం కూడా మన చుట్టు పక్కల ఉన్న వారిని, వాటిని ప్రకృతిని చూచినప్పుడు తాత్కాలికంగానైనా కొన్ని భావాలను పొందుతుంటాం కదా! ఇది కేవలం మనుషులకే కాకుండా ప్రాణులన్నిటికీ ఉన్న సహజాతం. ఈ స్పందననే కవులు, రచయితలు తమ తమ రచనల్లో వారి వారి ప్రతిభా పాండిత్య వ్యుత్పన్నతలను బట్టి సమర్థవంతంగా అభివ్యక్తీకరిస్తున్నారు. వాల్మీకి నుండి నేటి వరకు అనంతంగా ప్రకృతి వర్ణనలు, జీవ స్వభావ వర్ణనలు వంటివన్నీ చేస్తూనే ఉన్నా చూసే చూపులో వ్యక్తం చేసే శైలిలో అనంత వైవిధ్యం రచనల్లో కనిపిస్తుంటుంది కదా! మళ్ళీ దీనిలో కవి పుట్టి పెరిగిన కుటుంబ నేపథ్యం, జీవ సంస్కారం, సమకాలీన పరిస్థితుల ప్రభావం, వంటివన్నీ ప్రభావం చూపిస్తాయి. వాటికతీతంగా ఏ రచయితా, కవీ, రాయలేడు, రాయకూడదు కూడా.
ప్రస్తుతానికి వస్తే మన పాణ్యం సోదర కవులు ఈ ‘‘కాపు పడతి’’ ఖండికలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక గృహిణి జీవితం చాలా దగ్గరగా గమనించి అనుశీలించినారు. ఆమెతో పాటు నడుస్తూ, ఆమెతో సంభాషిస్తున్నట్లుగా, ఆమెను గురించి ఒక నాటకీయ పద్ధతిలో ఈ రచన సాగుతుంది. ఈ కవులిద్దరూ పల్లెటూరి జీవితం, వ్యవసాయ వృత్తి అనుభవించినవారే. అందుకే ఇంత హృద్యంగా ఈ ఖండిక తయారైందేమో! ఆ నాటి కాలంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నిత్యకృత్యాన్ని అంత సహజంగా సుందరంగా వర్ణిస్తారు చూడండి.
చలిది చిక్కెము మూపున, సగము ముసుగు
పైన పైటను, గాన్పించు పాపటయును
యింటి మాదిగ యేడాది కిచ్చు జోడు
కాపు జవరాల! మీ చేనికా, చనునది?
- అని ప్రారంభమైతుంది ఈ ఖండిక. ఉదయమే చేనుకు సేద్యం కోసం వెళ్ళిన మగనికి భోజనం తీస్కుని కాపు పడతి పోతుంది. ఆ కాలంలో దాన్ని చలిది లేదా సద్దిగా వ్యవహరిస్తూ మోస్కుని పోయేన్దుకు వీలుగా తాళ్ళతో పేనిన ఒక వల వంటి సంచిని దాన్నే చిక్కెం అంటాం ఉపయోగిస్తారు. ఇవన్నీ నాటి జీవితంలో సాధారణాంశాలు. చేనుకు పోతూ తటాలున ఆగింది. ఎందుకు? మజ్జిగ తీస్కరావడం మర్చిపోయిందేమో! కాని, ఆమె చిరునవ్వే అతనికి దప్పి మాన్పె అమృతమని చమత్కరిస్తారు.
‘‘అదరు బెదరు లేక అంతగా బెరిగిన
జొన్న చేలలోన జొచ్చుపోదు
వే ఇదేమి పుట్టినింటి విద్యయె నీకు
క్రొత్తగాదు, మాకె క్రొత్త గాని’’
కవి ‘‘కాపుపడతి’’ ఇంటి వద్ద నుండి బయలుదేరి పొలం చేరే వరకు మధ్యలో జరిగే సన్నివేశాలన్నింటినీ సూక్ష్మంగా వర్ణిస్తున్నాడు. వర్ణనా పద్ధతిలో ఇదొక విశేషం. పొలం చేరిన తర్వాత పంట వరుసలు (చాళ్ళు) దారం పట్టి గీసినట్టుగా వంకరలు లేకుండా చేనంతా కనిపిస్తున్నాయి. ఇది సేద్యగాని నైపుణ్యానికొక మచ్చుతునక. దాదాపు అర్ధ కిలోమీటరు పొడవనున్న చేలో కూడా ఈ చివర నుంచి ఆ చివర దాకా, సొట్ట సొట్టలుగా పాము మెలికలవలె కాకుండా దారం పట్టినట్టు విత్తనం వేసేటప్పుడు గొఱ్రు తోలడం అనేది నిజంగా గొప్ప నైపుణ్యం. నేటి యాంత్రీకరణలో ఇటువంటివన్నీ మాయమైనాయి. ఇప్పటికీ కేవలం ఎద్దులతోనే సేద్యం చేసేవాళ్ళకు ఈ విద్యలు పట్టుబడుంటాయి. విత్తనం వేసేటప్పుడు ఆ చాళ్ళు సొట్టసొట్టగా ఉంటే పంట మధ్యలో చేయవలసిన పనులన్నిటికీ (కలుపు తీయడం) ఇబ్బంది కలిగి పంట దెబ్బ తింటుంది.
తన మగడు గొఱ్రు తోలుతుంటే ఈమెనే విత్తనం వేసింది. కుటుంబంలో అందరూ కలిసి పొలం పనులు చేసుకోవడం ఇప్పటికీ గ్రామీణ వ్యవస్థలోని భాగమే. కవి అంతటితో ఆగకుండా, ఆ చాళ్ళు వ్యవసాయదారుని ఋజువైన జీవన విధానానికి ప్రతీకలుగా పేర్కొంటాడు. ఆనాటి పల్లెటూళ్ళలోని స్వచ్ఛమైన ఆత్మీయ జీవనం కనిపించడం లేదా!
పంట బాగా పండిరదని పంట చేతికి వచ్చిన తర్వాత రైతుపై ఆధారపడిన ఎన్నో వృత్తుల వారి జీవికకు లోటు లేదని నాటి గ్రామీణ వ్యవస్థలోనున్న పటిష్ఠమైన విధానాన్ని తెలుపుతాడు.
‘‘విచారము లేదొక యేటి దాక నా దాసారి బాపనయ్యలకు దైవము మారెమ సుంకులమ్మకున్’’
చివరిగా అప్పటికే గ్రామాల్లో కూడా పాశ్చాత్య నాగరికా రాక్షసి ప్రవేశించి, వాటి స్వచ్ఛతను ప్రశాంతతను భంగ పరుస్తుంది. దాన్ని సూచ్యంగా కాపు పడతిని హేళనగా చూచిన పంతులమ్మ మనకు సాక్షాత్కరిస్తుంది. కాని వ్యవసాయ కుటుంబాలు వంటి వృత్తుల వారింకా సహజమైన, నిర్మలమైన జీవితాలే గడుపు తున్నారని ముగిస్తాడు కవి.
‘‘ధన్యవుపో భరతాంబ బిడ్డలన్’’.
తొలి పలుకు
‘‘ఖండకావ్యములు’’ అను పేరు క్రొత్తగానున్నదంటిని. గ్రంథ కర్తనగవే - దానికి వచ్చిన యుత్తరము[7] ధ్వనికారుడు ‘‘ముక్తకము’’లని యొక జాతిని వింగడంచినాడు. ఒక యనుగతికమగు కథావస్తువును గాక - ఏదానికది భిన్నమై యుండువానికి ముక్తకములని పేరు. కావ్యమను నదొక గ్రంథమునకే గాక - ఒకానొక శ్లోకమునకుగూడ - నాలంకారికులు వాడిరి. కనుక ‘‘ఖండకావ్యము’’ లనగా - ఒకటే అనుగతికమగు వస్తువుగాక- భిన్నభిన్నములగు నుద్దేశ్యములుగల - కొన్ని పద్యముల గుంపని వ్యాఖ్యానింపవచ్చును. ఒకటే విషయమునకు జెందిన కొన్ని పద్యములున్నను - బాధలేదు - నవ్య కవిత్వమునందు - చెలామణిలోనున్న యెన్నో ‘‘నవ్యతల’’తోబాటు- ‘‘ఖండకావ్య’’ రచనయునొకటి. అనగా నిది యెక్కడ నుండియో యెరవు దెచ్చినది గాదు. మరి - ఉన్నదాని కుద్ధరణము మాత్రమే. కాగా మారిన మన జీవితము ననుసరించి - వస్తువు పూర్వమునకన్నను కొంత భేదించినదంటే - సాహితి - సమాజము సొత్తు. అగుటచే - మహావంశోత్పన్నులగు - ధీరోదాత్తుల - ఆగర్భ శ్రీమంతురాండ్ర - మనోభావములనే గంధర్వ నగరములనే జూడ నల వాటు పడిన మనకవులదృష్టి - యీనాడుమర్త్యలోకపు సరిహద్దులకు దిగి నది. ఆప్రయత్నపుఫలమే యిందులోని ‘‘కాపుపడతికి’’ జూపినసానుభూతి.
ఈ కావ్యకర్తలిద్దరు. కాని వారిఖండికలు వేరువేరుగా లేవు. ఉండ నవసరము లేదందును. కారణమేమనగా - వారి భావములు - పూర్తిగా - తెలిసికొనలేనంతగా నైక్యమై పోయినవి. రచనలో గనబడుచున్న గుణములో - దోషములో యిరువురి యందును సమానముగా నున్నవనుట కిందున్న రచనలే సాక్ష్యము. అనగా వ్యక్తులిరువురు హృదయ మొకటి. కలములు రెండు. రచన యొకటి. దీనికి గారణము - అభ్యాస కాలము నుండి - వీరికి గుదిరిన సఖ్యమయి యుండును. ఇతరములలో లేదుగాని జంటకవుల పద్ధతి తెనుగు వారికి పరిచితమైనదే. మన అవధానముల యుగమంతయు జంటకవులదే కాని వారిలో కవిత్వమే సార్థకముగ లేనప్పుడు - పరస్పరాన్యుకూలము మాత్రమెక్కడనుండి వచ్చును? అవధానమున గవిత్వము చెప్పగలిగినవారు - కొంతవరకు - తిరుపతి కవులే కాని వారిలోగూడ - పరస్పరము - శయ్య యందును- భావములందును భేదములేక పోలేదు - అవధానులుగా గాక - కేవలము కవులుగా - ఆంధ్ర దేశమున తొట్టతొలుత బయలుదేరినవారు - నేనెఱిగినంతవరకు వేంకట పార్వతీశ్వర కవులే. నేటికి మనయదృష్టముచే - అవధానముల యుగ మంతరించినది. అంతరించుచున్నది. కేవల పాండిత్య బలముతోగాక - హృదయమును నమ్మిన కవులు కవిత్వము బయలుదేరు నీకాలమున - జంటకవులలోని ‘‘జంటతనము’’ హృదయమునకు సంబంధించినది గాక మరేమగును? - కనుక యీకావ్యమును విమర్శించునపుడు కవులిరువురను విషయము - నెంతమఱచిన- అంత మేలు.
దీనిలో సుమారు పదిపదునైదు - ఖండికల వరకు నున్నవి. అందులో గొన్ని మన తక్కిన యాంధ్రవీరులు వ్రాయుచున్నటులే గతించిన యాంధ్రుల వైభవమును చాటునవి ‘‘ఆంధ్రోద్యమము’’ ‘‘తెనుగు శిల్పి’’ మొదలైనవి. కొన్ని - మానవుల - కవుల - హృదయములలో - దాగికొనియున్న నిత్యములైన భావములు ‘‘ఎవ్వాడవోయి’’ ‘‘పితృవందనము’’ మొదలైనవి ‘‘అశ్వత్థామ’’ యను ఖండిక - చక్కని భావనాశక్తి - యమరిన ఘట్టము. భావములతోబాటు భాషయు సుడులు జుట్టి - అశ్వత్థామలో నున్న యుద్విగ్నతను మొదటి చూపులోనే స్పష్టముగా జూపించుచున్నది. దీర్ఘీకృతములై పరుషములైన సమాసములు - అశ్వత్థామ మూర్తిలోని యున్నతిని - భావమునందలి ‘‘గంభీరత’’ ను చాటి చెప్పుచున్నవి. జదుపునప్పుడు - అంతర్గత బ్రహ్మతేజము - మహామంత్రాద్యనుష్ఠాన లబ్ధ దురీక్ష్యోద్దుర ఘోర రౌద్రము - అగు - క్షాత్రతేజస్సమున్మదము - యే సోమరి పాఠకుని భావనా నేత్రము నెదుటనైనను తప్పక నిలిచితీరును. తాము వర్ణించు వస్తువుతో - రచయితలు - సంపూర్తిగా నైక్యము జెందినారనుటకీ యశ్వత్థామ చక్కని మచ్చు - ఈ ఘట్టమునందలిదేయగు ‘‘భయమొ - యాశ్చర్యమోయేమొ బ్రకృతిదనకు దానె తెలియక నిర్విణ్ణయైనదట్లె’’ అనునది - ఒక మహోత్కృష్టమగు భావము. అశ్వత్థామను జూచినప్పుడు - ప్రకృతికి భయము దానితోబాటు నాశ్చర్యమును గలిగినవి. ఈ విరుద్ధ భావములను జోడిరచుట యొక తీక్షణ దృష్టియే యగును. ఈరెంటి శబతలచేనది యొక క్రొత్త భావమైనది. దాని కేమి పేరు పెట్టవలెనో - ఆమెకేదెలియదు. నిర్విణ్ణురాలైనది - కలిగిన నిర్విణ్ణత - రెండు భావములకును బొందికగా నదికినది. దీనిచే నాభావశబలతనింకను దృఢపఱచి నట్లయ్యెను, అది యర్ధరాత్రిగనుక స్తబ్ధప్రకృతి - ఆ స్తబ్ధతను - అశ్వత్థామను జూచుటచే గలిగిన నిర్విణ్ణతగా వర్ణించుటలో నెంతయేని యౌచిత్య మున్నది. ఏమిభావనాశక్తి! దీనిని జూచినప్పుడు ‘‘తయేవ పదవిన్యాసాస్తయేవార్థ విభూతయః తధాపినూత్నంభవతి కావ్యం గ్రధనకౌశలాత్’’ అన్న శ్లోకమునాకు నిజముగా మదికిదట్టినది. ఇచ్చోట వృత్తములను వాడుటలో గూడ-గొప్పయౌచితినే గనుపఱచి నారు. ఈగ్రధనమంతయు నొక్కటే యావేశపుదూకులో పరుగిడిన యద్భుత సృష్టి.
‘‘ఎవ్వాడవోయీ’’ యనునదొక నిత్యభావము. అనగా నది యొక ప్రత్యేకకాలమునకు-ఒకజాతి జనులకును-సంబంధించినదిగాక-సర్వకాలములకు సర్వవ్యక్తులకు సంబంధించినది. అట్టి భానము లెక్కువగా చెప్పినవారినే మహాకవు లందురు. ప్రతిజాతియందును-పురాణములు మహాకావ్యములు-యీ తెగకు చెందినవే. ‘‘కళ’’ యోగముగా మారినప్పుడిట్టి భావములు దొరలును. ఈనాసోదరకవులకు కవితా తపస్సుతో-నిట్టి విశాల భావములు-ఆత్మశాంతిని సంపాదించుకొమ్మని నా సలహా.
‘‘ఆప్రతిహతాఖిలచరాచర ప్రపంచ హృదయచిన్మూర్తి’’ అని భగవంతుని సంబోధించుట - హృదయమును నమ్మిన - చక్కని సార్థకమైన మాట. భగవంతుని గురించి యంతకన్న - యెవ్వడు - యేమియు జెప్పలేదు. చెప్పరాదుకూడ. కావ్యమునకు ధ్వని జీవనమైనచో - ఆధ్వని దీని యందున్నది.
ఇక నాంధ్రోద్యమము - తెనుగుశిల్పి - మొదలగునవి తాత్కాలికములగు తీవ్రభావములు. ఇట్టివి - అంతగా - ఆదరింపదగినవి - అనుసరింపదగినవి కావనినామనవి. ఈతెగవానికి కళాదృష్టితో గొప్పవెల యేమియులేదు. సరిగదా జీవితశాంతికి గూడ మార్గములుగావు. ఈయర్థము లేని ప్రబోధములు-కొంతవరకు రాజకీయదుష్పరిణామ ఫలితముగా - అంతకన్నను పరపరిపాలనా ఫలితముగా - గల్గినవి. ఇట్టివి జీవితమునకన్నను కావ్య ములకెక్కించి నప్పుడు తీవ్రములై చాలచెడుగును గలిగించును. అన్ని దేశములకును నాగరికతాభిక్ష పెట్టినది తెనుగుతల్లి యొకతేగాదు అందరుతల్లులును తమతమ యింటగల్గిన భిక్షమునే పెట్టినారు. అట్లే - తెనుగు భాషలోనేతీపి - తెనుగుశిల్పములనేనీటు- ఉన్నదనుటయు - విచారమునకు నిలుచునదిగాదు. మరియావేశపు తొందరలో దొరలినమాట. ఎవ్వనిమాట వానికితీపి. ఎవరిశిల్పము - ఆజాతికమూల్యము - ఒకజాతినే తిరస్కరించుట నిజముగా మనయోగ్యతకు మించినపని - ఇంతకునుతాము గడ్డకు రావలెనన్న ప్రక్కవారిని దిట్టవలసిన పనిలేదు. మరియేమి గ్రహచారమోగాని అన్నిటికిని యీతెవు లమితముగా బట్టుకొనుచున్నది. ఇతరులకేమోగాని ఇప్పటికే ‘‘రాయలసీమ’’లో ‘‘తెనుగు కన్నడ’’ వివాదములు శ్రుతికి మించుచున్నవి. ఇకనైన నిట్టి భావముల సరికట్టకున్నచో మనకు ముక్తి లేదు. ఈ వాదములచే మనస్సు సంకుచితమై పోవును. కన్నడమున తెనుగువారు చదువదగిన వెన్నియోగలవు. వారి జైమినీ భారతము రన్నని గదాయుద్ధము - పంపని భారతము - కుమార వ్యాసుని రచన - మనము తప్పక చదివి తీరవలెను. అట్లే - కన్నడిగలును - భారత కవిత్రయమును - పోతన్నను - తెనుగువారని చదువక విడిచినచో - వారిని పొరపడినారనవలయును. మొన్న యొక సభలో - ఒక పెద్ద పండితుడు అంతులేని యాంధ్రావేశముతో - హిందీలోని ‘‘తులసీ రామాయణము’’ కేవలము శుష్కరచన - అని వేసెను. మరియాపెద్ద మనుష్యుడు - రామాయణమును - జదువలేదో చక్కని దృష్టితో జదువలేదో నేను చెప్పలేను. ఇట్టి భావములు మన పూర్వులకు లేవు. మనకు దాపురించినవి. ఇట్టి చీడపురుగులు నశించు వరకును - ఒక్క ఆంధ్రోద్యమమేగాదు - యిట్టి భావములుగల యేయుద్యమమును సాగదు.
ఈ కవుల యూహలు - యువకులు గనుక - చాల వాడిగలవి. ఎక్కువ తీవ్రముగా నుండును. భావతీవ్రత - చక్కనికవితాగుణములలో నొకటి. శిల్పిని గురించి ‘‘వ్రాసితివా యొక్క పాపని రాతిలో గొడ్రాలికిని చేపు గూర్పగలవు’’ అన్నారు. బాలనాయనివర్ణనమునందు ‘‘బొంగరాలతో బాటు పునుకల ద్రిప్పుచు నలరిన బాలనాయనినిజూడు’’ అన్నదానిలో నలంకారముతోబాటు - చక్కని భావ స్వాతంత్య్రమునునున్నది.
ఈ కవులు - ఆంధ్రమును బాగుగా దఱచినారు - సంస్కృత సాహితీ నదులయందు దానమాడినారు. ప్రాచీనాధునాతన కవితారీతులాకలించుకొన్నారు. జన్మతో బుట్టిన సంస్కార బలమున్నది. వెనువెంట పిల్లతనమును నున్నది. ఈ ఖండికలను జూచినప్పుడు - నాభావనా నేత్రము నెదుట - వీరి యుజ్జ్వల భవిష్యత్తును స్పష్టముగా జూడగలుగుచున్నాను. ఈకలిగిన యుత్సాహ మింతటితోనే యారిపోక - యనేక గ్రంథములకు వీరు కర్తలగుటకై - భగవంతుని బ్రార్థించు చున్నాను.
‘‘పుట్టపర్తి’’
మనవి
ఈ చిన్ని పొత్తము అపుడపుడు వ్రాసిన ఖండికల కూర్పు. ఒకసారి మాయూరికి వచ్చినపుడు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులగారికి వినిపింప ‘ఇవన్నియు కూర్చి ప్రకటింపుడు’’ అనిమాలో నొకరిని ప్రోత్సహించిరి. అప్రోత్సాహమే దీని వెలువడ జేసినది. మామీది వాత్సల్యముచే ‘‘తొలి పలుకు’’ వ్రాసియిచ్చిన వారికి మా నమో వాకములు.
ముద్రణ సంస్కారము లొనరించి గ్రంథమును సర్వాంగ సుందరమగునటుల తోడ్పడిన కర్నూలు మునిసిపల్ హైస్కూలు సహాయోపాధ్యాయులగు శ్రీ కురుముద్ది వేంకట నరసయ్యగారికి మాకృతజ్ఞతాంజలి.
పాఠక సౌలభ్యమునకై ఆదేశాగమాదు లంతగా పాటింపలేదు (ఇది నవ్యరీతులలో నొకటిగూడ). పెద్దలు క్షమింతురు గాక.
ఈ ఖండికలలో ‘‘నమస్సు’’, ‘‘కృతజ్ఞత’’ మాలో నొకరివి మాత్రమే. మరి యియ్యది సహృదయుల యా దృతి నెంతబడయునో?
పాణ్యం సోదరులు.
శ్రీః
అంకితము
మా
సారస్వతాచార్యుడు,
శ్రేయోభిలాషి,
కనిష్ఠ
పితృపాదునకు
శ్రీ దక్షిణామూర్తయేనమః
ఛందోరూప మనోజ్ఞ వీధులయథేచ్ఛన్ మించి, యంచద్విపం
చిం దివ్యోజ్వలమంజు గీతనినద శ్రీనించి, కందోయి నా
నందామందత బాష్ప బిందువులు చింద, న్మేనరోమాంచముల్
జెంద; న్వర్తిలు దేవి గావుత కవి శ్రీసోదర ద్వంద్వమున్.
హారి ఘుమ ఘుమ పరిమళమౌచు, తాసు
మమ్ము విచ్చుట ప్రకృతి సిద్ధమ్ము పొమ్ము
కొన్ననేమి; సరే కొనకున్న నేమి
దాని కేలాటివియు కొరంతలును లేవు.
కమ్మకడగంటి చూపుల, కవియువకుల
లాగివేసెడు నంతటి ప్రౌఢగాదు
కాని, పుట్టుక మంచి వంశాన గాన
తలతురనుకొందు నాకవితాకుమారి
దండిగా సొమ్ములెన్నొ, ముస్తాబు సేయు
నంతయోగ్యతలేదు మాయమ్మ! యేదొ
శక్తియున్నంత పెట్టగజాలి; తున్న
దాన సంతృప్తిపడు, కవితాకుమారి!
పిల్లనగ్రోవి బాలకుని పింఛమదల్లన దూగులాడ, జి
ప్పిల్లెడు మేల్ హొయల్ గల కవిత్వవిలాసముగల్గువారు దో
సిళ్లను పద్యపుష్పముల జిమ్మిరిమీపయి నిట్టిమీకు, నీ
పిల్లకవిత్వమందు, కనుపించునో? లేదొ? తధా విలాసముల్.
జోహారు
దురవాప భీకరోద్ధురధరాధర కందరీ
రీసీమలో, శాంతి వోసినావు
క్రూర విక్రమనక్రకోటీక్రమాక్రాంత
జలధిలో, రతనాల నిలిపినావు
భస్మీ భవజ్జగజ్జ్వలదురు జ్వాలన
జ్వాలలో, వెలుగు జొప్పఱచినావు
ఆ భీల హాలాహలా భోగ భోగీంద్ర
తనువులో, మార్దవ మునిచినావు
శాతతరకంటక వ్రాత శతపరీత
కేతకీజాతి, తావి జిల్కించినావు
హేతువది యేమొకాని, యూహింపరాదు
చిత్రతరమోయి! నీదగు సృష్టి సరణి
నునుసోగ వెన్నెలలను, జగంబుల బూయు
చందురులో, కందు జింది తేల?
జిలుగు వెలుగుల తళ త్తళలతో మించు క్రొ
మ్మించులో చాంచల్యముంచితేల?
వనన్నె వన్నెల మేని చిన్నెల జెన్నొందు
బెబ్బులిలో, జుల్ము బెట్టితేల?
నలుదెసల్ గమగమల్ వలపించు, సంపంగి
విరిలోన వెగటు జొప్పించితేల?
యీ మహత్తర శిల్పాన యేమి యేమి
యెత్తుగడలున్నవో యేమొ యెవడెరుంగు
అప్రతిహతాఖిల చరాచర ప్రపంచ
హృదయ చిన్మూర్తి! నీసృష్టికిదె జోహారు.
పార్థివ
ఎన్నో ప్రాణములీ ప్రపంచమున, ని
ట్లే క్రుంగి కూలారె మా
యన్నా! పార్థివ వత్సరంబ! మొనగా
డా! తారణుండేలి తా
చన్నంకాడయినట్టి యీచనిన వ
ర్షంబందు నెట్లుండెనో
సన్నాహంబులు నీవి? యంచు నిదె వి
శ్వంబెల్ల మోమెత్తెడున్
తారణ వత్సరంబనిన, తా, రణరంగ పిశాచపాళికిన్
పారణమౌచునేగె, తరువాతివి నీవతగాని విద్దెలన్
నేరువబోకు, జీవితము నిర్మల నిత్య నవీన కీర్తికిన్
కారణమైచనన్, నడుసఖా! రణభూముల చల్లసేయుచున్.
కృతజ్ఞత
మీ హృదయాలలో జిలుగుమించెడు వన్నెల వెన్నెలన్, మహో
త్సాహముతోడ జిందితిరి సన్న చకోరపు జంటపైన; నో
హో! హితబంధులార! యివి యుజ్వల జీవిత యాత్ర హర్ష సం
దోహ నిమగ్న చిత్తములతో మిము నెప్డు దలంచు చుండవే?
మాశీర్షమ్ములపైన, దోసిళులతో మాధుర్య సౌరభ్య యు
క్తాశీర్వాద సుమాల బోసితిరి ఆహా! యివ్వి మాజంటదౌ
యాశావల్లి నలంకరించు నిక మాకానంద సందోహ వీ
చీ శృంగార విహార హారి మధుర శ్రీ యబ్బు కొండీనతుల్
మాపాప
వానియానంద మేమియో? వాడె యెరుగు
నో? మరి యెరుంగడో? నేను నుడువలేను
పలుకరించిన ముత్యాలు గులకరించు
బోసినోటను, ‘‘మాపాప’’ ముద్దు వచ్చు
చిన్ని చేతుల సూపుచు నెన్నిమార్లొ
యేరికై నను స్వాగతమిచ్చు నతడు
హృదయమందు ‘‘నా’’ ‘‘నీ’’ యనునదియు లేని
పావనంబగు నిర్మమ జీవి యతడు
ఐన, నాకర్షణంబేమి యచట గలదొ!
యెంతయేడ్పైన నింతలో నెగిరిపోవు
వానికిని, నిట్లు మాయమ్మ వద్ద జేర్ప?
నప్పుడిరువురకొక తృప్తియావహించు.
క్రొత్త చూపులు అదేదియో క్రొత్త భాష
క్రొత్త చేష్టలు వేరొక క్రొత్త నవ్వు
అందరము క్రొత్త యతనికి, నతడు మనకు
క్రొత్త, యాతడు భూమికే క్రొత్త జీవి!
వరభుజంగాసనంబున, పరమనిష్ఠ
నుండు నొక్కొక్క యప్పుడా యోగి, యొక్క
సారి యేడుచు కొండొకసారి నవ్వు
నతని సంగతి యేరికి నవగతంబు?
ఎవ్వాడవోయి
ప్రకట వికటాట్టహాస సంభరిత విలయ
తాండవోద్రిక్త చిత్త వేధోండరంగ
నిబిడ గంభీరమూర్తి! నానికటమునకు
వచ్చి, కొంచెము చెప్పు మెవ్వాడ వోయి!
ప్రకృతి మాయా స్వరూప విలాసినీమ
ణీ వశీకృత వేధోండ నిత్యకర్మ
జాలతద్వ్యతిరిక్త సంసారి! నీవు
వచ్చి, కొంచెము చెప్పు మెవ్వాడ వోయి!
రోదసీ బిలయంత్ర శాలోదరాంత
రాళ భౌతికయంత్ర నిర్మాణ కర్మ
మర్మ తత్తత్ప్రయోగ సంహార కృత్య
వర్తివైయుండి, యుండ వెవ్వాడ వోయి!
స్వచ్ఛ సద్గురు దత్త విజ్ఞాన మూలి
కా విశేషాది సంసిద్ధధావితాంజ
న ప్రపూత మనోలోచన ప్రవేద్య
బహుసువర్ణ నిధాన! యెవ్వాడ వోయి!
క్రూర సంసృత్య కూపార తారణోరు
భార ధారణ పారీణ ఘోరభంగ
వార వారణ కృత్కర్ణధార! నీవు
వచ్చి, కొంచెము చెప్పు మెవ్వాడ వోయి!
సర్వ హృదయాంతరాళ సంస్థానరంగ
వేషధారణ కర్మ ప్రవీణ సక్త
నిబిడ మాయా తిరస్కరణీనిగూఢ!
వచ్చి, కొంచెము చెప్పు మెవ్వాడ వోయి!
పంచ భూతాల పిడికిట బట్టుకొనుచు,
నిష్ట మెట్టులనటు చెలాయించుచుంటి
రాజ్య మెవడిచ్చినాడీ నిరంకుశాధి
పత్యమున్నీకు? చెప్పు మెవ్వాడ వోయి!
ఉన్నదనుకొన్న, నంతయు నున్న దోయి!
లేడటన్నను, నేమియు లేదు నీకు
ఏమొ దీనికి నర్థ? మేమేమి కలదొ?
వచ్చి, కొంచెము చెప్పు మెవ్వాడ వోయి!
తార
గుంపులు గుంపులౌచు నొక కొన్ని, యెడంబుగ కొన్ని, యింపుల
న్నింపుచు, వస్తురూపముల నెమ్మది దోపగ జేయు కొన్ని, ము
త్యంపు సరమ్ములన్, పటమయాయత విశ్వ కుటీరమెల్ల, కు
ట్టింపుల; వేల వేసి నటు; ఠేవల గ్రాలెడు తారకాతతుల్
ఏరికి నబ్బురంబు జనియింపదు! నీస్థితిజూడ! యెట్టియా
ధారము లేనిచోట సతతంబును కాపురమున్ బొనర్చునో
తార! యొకింత తెల్పు మహితంబది సత్వము యోగసాధన
స్ఫారవిభా సమార్జితమ? సద్గురుదత్తమ? జన్మ సిద్ధమా?
ఆజగత్క ర్తయే తనయద్భుతంపు
వస్తు నిర్మాణ పారీణ పాటవంబు
తెలుపగా, నిన్ను నచ్చోట నిలిపెనేమొ?
గాకయున్నదె వేరొక కారణంబు?
ఈజగతిన్వి శేషముల, నెప్పుడు జూచుచు మంచి చెడ్డలన్
యోజనజేసి, సత్పదవి నొప్పు పవిత్ర చరిత్ర వీ, వదెం
తేజెడె ఱంకురాలగుచు నీదగు పేరివెలంది యంచు నా
యాజనులాడుచుండ వినినప్పుడు, నెమ్మది నెంతగుందెదో!
భీకరకాలకూటముల పెల్లగు, రాహుకరాళ దంష్ట్రలన్
దాకియు, మేనజీవములు దాల్చెను నీ మగడన్న నీదు న
స్తోక సుశీలతామహిమతోనని యెంతుము లేకయున్న, దో
షాకరుడేమి? యంతటి మహత్తరసత్వము గల్గియుండుటల్.
నమస్సు
నిత్యానందము నిత్యతృప్తి యెపుడు న్నీ భౌతికావస్థలో
కృత్యాలన్ గనుపించుచుండుగద, నీకేజెల్లు నా రెండు, నే
నిత్యంబున్విని నన్ను నేమఱచుచుంటన్ పాపి లోకంబులో
నత్యుచ్చస్థితినొందినావు పితృదేవా! శుద్ధ భావా! నమః
నీభిక్షే గదమాకు నల్వురిలొనెందే ‘స్వామి! కూర్చుండు’ డం
చా భాషించుచు గౌరవించుట, ప్రపంచజ్ఞాన గంభీర సం
ఫీుభావోత్తమ నీతిదాయి సకలాంగీకార్య మాధుర్య మూ
ర్తీ భావోన్నత వాగ్విలాస పితృమూర్తీ! స్వచ్ఛకీ ర్తీ నమః