శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 4

చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 4

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 35 / 37

దీక్షన్‌ బూనిన నీవు, కావలయునేదేకాని దుర్దాంత హ

ర్యక్ష ప్రక్రియదూకి తీర్చితివి కాదా పెక్కు క్లిష్టాల మా

వక్షాలన్‌ తడిగుడ్డవైచుకొని యేపాట్లేమి లేకున్న నీ

యక్షుల్‌ చల్లగనుండునేమొ? పితృదేవా! శుద్ధభావా! నమః

సంఫీుభావము నీదుసొత్తు మనవంశంబందు మాకెల్ల నా

సంఫీుభావమె పంచిపోయితివి నీ చారిత్ర మందెప్డు నీ

జాంఘాలీకముజూచినన్నగుదు మెంచన్‌ దానిలోనన్‌ గ్రహిం

పంఘాటైన విశేషముండు పితృదేవా! శుద్ధభావా! నమః

నీ గుండెన్‌ సరిపోలు గుండెయది లేనేలేదటం చందు బో

నీ గాధన్‌ గలకొన్ని ఘట్టములవింటిన్‌ గావున, న్నిత్యమున్‌

నే గర్వించెద నీ కుమారుడనియే, నిర్భీతి నెవ్వార లెం

తే గూఢంబుగనవ్వుకొన్న, పితృమూర్తీ! స్వచ్ఛకీర్తీ! సమః

ఆశీస్సులు

మనభీష్మాదులుగొప్పగొప్ప పనులేమాత్రంబునున్‌ జంకులే

కనె సాధించిరి, బ్రహ్మచర్యమున; నాగాధల్‌ విలోకింపుమా

ప్రణవశ్రద్ధలతోడ ధారణయునాపాదించు నేవేళ ని

న్ననుసాధింపుము మద్దులేటి సరసింహా! గాఢసన్నిష్ఠమై

ఈపాపిష్ఠి యుగంబునందు, నసలే యీబ్రహ్మచర్య వ్రతం

డే పాటించెడు వారులేక, భరతంబే హీనతంజెందె వీ

ర్యాపాయత్వము బొంది, క్రొత్తగను నీవద్దానిగొన్నావు, లె

మ్మా! పాటింపుమ, మద్దులేటి నరసింహా! గాఢసన్నిష్ఠమై

ఆయుత్సాహవిభూతి యాముఖమునందా బ్రహ్మవర్చస్సు, నా

గాయత్రీ జననీకటాక్షములు దొల్కన్‌ చల్లనౌశాంతి, యెం

దే యొక్కండును కానుపింపడుకదా, యేబుక్కులోదప్ప, నీ

వాయౌన్నత్యముతో సుఖింపుమికునన్నా! నీకు దీర్ఘాయువౌ

అమ్మహనీయమూర్తి కరమందు సుధాఘటమూనువాడు, పు

ష్పమువిధమ్మునన్‌ బుడుతచందురుదాల్చినయందగాడు శాం

తమ్మధికముగాను, వదనమ్మున జిమ్ముచునున్నవాడు, భా

గ్యమునయమ్ము నిమ్ముగనయమ్ము సుఖమ్మొనగూర్చు వీరికిన్‌.

ఆశ్రయణిమ్ముసుమ్ము, వివిధాశ్రమవాసుల కెంతయున్‌ గృహ

స్థాశ్రమ, మట్టిదాని నిపుడందరిలో గయికొంటివీవు, శా

స్త్రశ్రుత పద్ధతిన్‌. విధివిధానము లన్నియు నిర్వహింపు మో

యీ! శ్రమమంచు నెంచక నిదేకడుధన్యతగూర్చు జన్మకున్‌.

‘సారవిహీన మిద్దియని చాటుదురయ్యలు కొంద రైన, సం

సారమటంచు చాటుదురె మాన్యులు? సక్రమపంథనున్న సం

సారము సార్థమైమెఱయు, చాలిక చర్చలు, దీనినీవు సం

సారముసుమ్మనన్‌ రుజువుసల్పుము లోకుల కెల్ల నేర్పునన్‌

తావక పూర్వపుణ్యవశతన్‌ యువకుండు, సురూపశాలి, స

ద్భావ మనస్కుడౌ మగడు దక్కెను నాతని సౌఖ్య పెట్టుచున్‌

నీవు సుఖించుటే యికను నిల్చిన కార్యము నీ చరిత్రమే

భావిదినాల, కాంతలకు పాఠముగాగ, నొనర్ప జూడుమా

జరిగిన జన్మవాసనవశమ్మున, మీ హృదయములన్‌ పర

స్పర సువినిర్మల ప్రణయ భాస్వరబీజములున్న; వవ్వి య

ప్పరమ మహర్షి శేఖరు కృపారసధారల చెమ్మరించి, య

కురములగాంచి మంచిపువు గుత్తులనించి ఫలించి మించుతన్‌.

చూడన్‌ జూడగ క్రొత్తక్రొత్తలుగ దోచున్‌గాదె, దీక్షాకళల్‌

తోడై, యీసుకుమారదంపతులదొంతుల్‌ గట్టుకాంతుల్‌ క్వచి

ద్వ్రీడాయు క్తకటాక్షపాతములునై, లేసౌరుతోడన్‌, బలే

జోడాగూర్చెను బ్రహ్మదేవుడతడే జొప్పించుతన్‌ సౌఖ్యముల్‌

తాదినమున్‌ ధరించు ముసుతాబులవీడుచు, క్రొత్త క్రొత్త

మాదిరిగాతయారయి, సుమండితమాదగుకైత చిట్టి ము

త్తైదువు కుంకుమున్‌ పసపు దాలిచి, హారతి నెత్తవచ్చె కొం

డోదరహాస మంగళకళోజ్వల దంపతులార! హాయిమై

ఇంతవఱకును నొకయెత్తు; నింక నొక్క

యెత్తు; జాగ్రత్తగా నిర్వహింపవలయు,

దీని గార్హస్థ్యమును; నిందు తేనెలున్న

వనువునన్‌ మీరలిర్వురు నానుడోయి!

సుమమున, సౌరభంబెటుల జొప్పడి యుండునొ యూహజేసి, యా

యమరిక, మీరు మీదు హృదయమ్ముల, భావి దినాలలోన నై

క్యము నిలుపారజేసి, ప్రణయమ్ములలో మధురత్వమాని; యా

యమృతమయంపు జీవితము నంది, సుఖింపుడు కొత్త దంపతుల్‌.

అశ్వత్థామ

అదిగో! క్షుద్రవిపక్ష శిక్షణ సముద్యత్‌క్షాత్రతేజ స్సము

న్మద, మంతర్గతబ్రహ్మతేజము, మహామంత్రాద్యనుష్ఠానల

బ్దదురీక్ష్యోద్దుర ఘోరరౌద్రము, మహాధ్వాంతంబునన్‌ పర్వుచు

న్నది! నిద్రావశపాండవేయ శిబిరాంతః ప్రాంతమున్‌ జేరగన్‌

హస్తన్య స్తసమస్త భూభరణ దక్షాహి ప్రతీకాశ ఖ

డ్గా స్తోకాచ్ఛధగద్ధగద్ద్యుతి సమూహధ్వ స్తభూయ స్తమో

విస్తారమ్మయి, త్ర స్తభీకరమహాభేతాళనాథాధి భూ

తస్తోమమ్మయి, దుర్నివారణజవౌద్ధత్యంబు దీపింపగన్‌

దండో త్తాడితకుండలీంద్ర ఘనపూత్కార ప్రతిస్పర్థితో

చ్చండత్వానిల దీర్ఘ దీర్ఘతర నిశ్వాసోజ్వలద్బాల మా

ర్తాండ ప్రద్యుతినేత్ర సూచిత హృదంతః పూర్ణకోలాహలో

ద్దండ క్రోధముతో, నపాండవ పదార్థ స్థాపనోద్విగ్నమై

ఎదురేమాత్రము లేని, కాళరజనీహేరాళ నిశ్శబ్దతా

పదవిన్‌, దంత నిఘర్షణోత్కరకరవ్రాతంబుతోడేర్పడన్‌

పదవిన్యాసధణం ధణ ద్ధణ ధణార్భాటంబుగా ఢోద్ధతిన్‌

గదుమన్‌ దానుపపాండవేయమృతిహుంకా రాట్టహాసోపమున్‌

ఆ మహావేశకాల భయంకరోద్ధు

రాంతరుద్భూత మృత్యు జిహ్వాకరాళ

శక్తిలో; లీనమైపోయె చాల కుమిలి

కుమిలి, తిర్యఙ్మనుష్య జీవముల వెన్నొ!

అది - అనిర్వాచ్యమైన దృశ్యంబు! హృదయ

మట మటింపగ జేసెడు నదియును! మరి

భయమొ? ఆశ్చర్యమో? యేమొ! ప్రకృతితనకు

తాన తెలియక, నిర్విణ్ణయైనద ట్లె.

కాపు పడతి

చలిది చిక్కెము మూపున, సగము ముసుగు

పైన పైటను, గాన్పించు పాపటయును

యింటి మాదిగ యేడాది కిచ్చు జోడు

కాపు జవరాల! మీ చేనికా, చనునది?

మగనికి ప్రొద్దువోయెనని, మాటలనేవినిపించుకోక బి

ఱ్ఱుగ జనుచుంటివో? అతివరో! నిజమేమరి పాపమాతడున్‌

దగగొనియుండడా? అపుడె దాటెను నంబటి వేళగూడ ఎ

డ్లగళము పట్టికల్‌ విడిచి, లాగుల గట్లను మేపుచుండుబో!

మొగమొకకొంతయెత్తికనుబొమ్మముడిన్‌ నిలుపారుచూపుతో

డ, గతమదేమి యచ్చటతటాలున నిల్చితివమ్మ? యేమి మ

జ్జిగగొనిరాకనే, మఱచి చేనికి వచ్చితినంచునేమొ? నీ

నగవమృతంబుజిందగనె నాతిరో! యాతనిదప్పియుండునా?

భారతాంబ కోడండ్ర లోపలను, నీవె

యిట్టి కాలంబునన్‌ గూడ, గట్టి యోర్పు

తెలివితో, నిల్లు చక్కదీర్చు దాన

వందుకే అత్తగారికి నంతదయయు!

బుడుతడప్పుడే సెలకోల బుజము పైన

వేసి, దూడల నదలించివేయు; నితడె

యింక దేవునిదయతొ పదేండ్ల మీద

అగుపడున్‌ పెద్దకోడెల నగలమీద

అదరు బెదరులేక, నంతగా బెరిగిన

జొన్న చేలలోన జొచ్చిపోదు

వే! యిదేమి పుట్టినింటి విద్యయె నీకు

క్రొత్తగాదు, మాకె క్రొత్తగాని

గడుసుతనంబుతోడ వెటకారమునన్నడయాడుచున్‌ బడిన్‌

విడిచియు నింటికేగుచు, నవీన విలాసిని పంతులమ్మ నిన్‌

మిడిమిడిచూపులన్‌ గనిగమించె గిరుక్కు నమోముద్రిప్పి యా

చిడిముడిపాటులోగల విశేషము నీమది కెక్కలేదు పో!

దారము బట్టితీర్చిన విధంబుననున్నవి; చాళ్లు, వంకరల్‌

నేరని ధన్యమౌ యతని నిస్తుల జీవిక కివ్వి పోలికల్‌

నీరమణుండుతోలెగద? నేర్పున వీటిని? నాడునూత్న శో

భా రమణీయవై యతని ప్రక్కన విత్తన మేయుచుంటిగా

కాసెను జొన్న చేను బళి! కంకెడు కంకెడు కంకి! నీవేకా

వేసితి విత్తనంబు ఎటువేళయొ బంగరు చేతులమ్మ! వి

శ్వాసము గల్గుతల్లివి విచారము లేదొక యేటిదాక నా

దాసరి బాపనయ్యలకు దైవము మారెమ సుంకులమ్మకున్‌

తూర్పు జనంబు నేర్పని యధోగతిజెంద క్షణక్షణంబులన్‌

మార్పులు జెందుకాలమిది మాయల మారిది నీకు మాత్రమే

మార్పులులేవు ప్రాతయభిమానము గల్గెడు పెద్దవారి యో

దార్పునకీవె యూతగద! ధన్యవుపో భరతాంబ బిడ్డలన్‌.

కురంగము

దేవాధీశ్వర మాధవాదులకు నెంతేధ్యేయమై మించు, నా

శ్రీవిశ్వేశ్వరమూర్తి క్రొత్తనగుమేల్‌ జెల్వంబు పెల్లుబ్బగన్‌

పూవట్లున్‌ సిగపై నమర్చు, హిమభానుండున్కిగా వెల్గెడున్‌

మీవాడొక్కరుడోకురంగ! భళిరా! నీవెంత ధన్యుండవో!

అంతామిథ్యయటంచు ప్రాజ్యమగురాజ్యంబున్‌ విసర్జించి య

త్యంతాభీలమరణ్య దేశమున, తత్వాన్వేషణానిష్ఠ దు

ర్దాంతుండౌ భరతర్షిపుంగవుని డెందంబట్లె లోహం బయ

స్కాంతంబట్టుల లాగివైచితివి! నీ సామర్థ్య మేపాటిదో!

నిముసమేనియు, నొకటకాల్ని లుపకుండ

నంతయు జరించు, పవమానుడంతవాడె

కోరి కైకొనినాడు నిన్వారువముగ

నీదు సత్వంబు వేర వర్ణింపనేల?

భువన మోహనమై యొప్పు నువిదమిన్న

కన్ను దోయికి, నుపమాన ఘనతనొంది

వర కవీంద్రుల కావ్య ప్రపంచమందు

తానమార్జించి నాడవో ధన్య జీవి!

పురుహూతాదులకేని నెంతయు హడల్‌ బుట్టించు తేజస్సము

ద్దురులొయోగిజనంబె యెట్టులనో యేదో యింతమాత్రంబనా

దరణంబేర్పడ నంత నీవలుక నొందన్‌ వారె యేతెంచి ద

గ్గరకున్‌ దువ్వుచుబుజ్జగించిరి కురంగా! యెంతభాగ్యంబహో.

శిల్పి

దొమ్మిగదూకి, పెద్దగుదెతో, కలిరాక్షసులట్లు నీవు స

ర్వమ్మునుధారబోసి కళలన్‌ పెనుగుప్పలువోయు శిల్పముల్‌

గ్రుమ్మగ నెంతగా పినుగుకొంటివొయేమొ యెడందలోన పో

నిమ్ముర శిల్పి! మమ్ముసొగియించును శేషములైన ముక్కలే

జిలుగులుపూర్తిదీర్చి, యులిచే వెలిగన్నుల విప్పజేసి, ప

జ్జలనిలుచుండియోరగ, నచంచల దృష్టుల బొమ్మజూచి, న

శ్రులనిలరాల్చెదేల? సొగసుంగనియా? మరి లేక మాదు శి

ల్పులముదితాత! పెంపరుచుబోవును భావిని నిద్దియంచునా?

అలకలనుంగరాల్‌ దిరుగునట్లుగ దీరిచి బొమ్మలన్‌ సలీ

లలుగనుదిద్ది, చెక్కిళులడాపల నవ్వొలయించి, చేతిలో

మెలకువకిద్దినీకు పొలిమేరగనట్టులె బొమ్మజూచి, చి

ప్పిలనొక పిచ్చి హర్షమొక పెట్టున పైబడి ముద్దుగొంటివో

బొమ్మకునీకునున్‌ యుగమువోయిన గూఢ చిరాయువుండు మా

ర్గమ్మును ద్రొక్కినావు భళి! కారువరా! మరియెందుకింత

యా బొమ్మసృజించునట్టి యిలబొమ్మలకు మరినూరుగాదె వ

ర్షమ్ములెయాయువుండు నిక సర్వసమాన విలాసమున్నదా?

చమికి యులినుండి కరుణరసమ్ము శిలకు

బోసి ప్రేక్షకు గన్నులబొరలుచున్న

నశ్రువులజూచి నొకతృప్తి నందగలవు

ప్రకృతి ధర్మంబు నూత్న మార్గమున నడువ!

చెక్కితివా యొక్క టక్కులాడిని రాత

పరమహంసకు మత్తు బరుపగలవు

వ్రాసితివా యొక్క పాపని రాతిలో

గొడ్రాలికిని జేపు గూర్చగలవు

దీర్చితివా యొక్క దీనమూర్తిని రాత

పిసినారి చేయి జాపించగలవు

ఉంచితివా రాత నొక యోధు పందతో

మిట మిట గ్రుడ్లుఱిమింపగలవు.

సంతరించితివాయతీశ్వరుని రాత

నమితభోగిని కానల కంపగలవు

చేతి మెలకువ జూపి; మా శిల్పివర్య!

చేయవలెనన్న యేమైన జేయగలవు.

ఆంధ్రోద్యమము

ధాత్రి నెందరొ మా తలదన్నువారు

కవిశిఖామణులుండిరి గాని, దీని

నూరకేమేము, నుడుతకు నుడుతభక్తి

యన్న సామెత వ్రాసితి మన్నలార!

కమ్మని తెన్గుబాసగల గ్రంథములన్వినిపించుకొందు, ర

సమ్ము నెఱుంగకుండియును దానిజిలుంగులుజూచియెంతయున్‌

గమ్మయి, యెందరో యితర ఖండ నివాసులు తెల్లవారలే

యిమ్మహిదీనికీడుగలదే యొకడేనియు దేశభాషలన్‌.

తెనుగు కవితలయందున్న తీపిమాట

తెనుగు సంగీతసుధలలో తేటయూట

తెనుగు శిల్పాలలోనున్న తీర్పుబాట

నేర్చుననుమాట యితరుడు నీళ్లమూట

వెనుకటిమాటలన్‌ దలచి వెఱ్ఱిగ వ్రాయుచునుం రందు, రై

ననుతనలోనియాయుడుకునన్నుబయల్పడద్రోయుమంచుదూ

సెను, కవికేమొ యెప్పుడునుగూడ కలంబును కాగితంబుపై

ననుపగ నాంధ్రతేజమునె యూరక వ్రాయునదేమి చిత్రమో

మనవిభవంబులు న్మనదు మాన్యతలు న్మన చాకచక్యముల్‌

మనదగుబావుటా మనవిలక్షణ శిల్పకళా ప్రవీణతల్‌

మనకవితా విలాసముల మాటల పూర్వపువాటినెన్న లం

ఖణములలో నిషేకమున గల్గిన ముచ్చటలెంచుటౌజుమీ


అదిగో! చూడుము కన్నులన్‌ దెఱచి నీయానాటితల్లి న్మహా

పదలన్‌ బొక్కుచుశల్య శేషయగుచున్‌ ప్రాణాలువోకుండయుం

డె దయాహీనునకైన చూడకనులన్నీర్గ్రము పుత్రుండవే

గదరా కుత్తుకనిన్ని నీళ్లువిడుమింక చూతువే? యాంధ్రుడా

ఒకనాడు నీదు శిల్పకళా, విశిష్టత యన్యదేశీయులౌ ననగవెల్గె

ఒకనాడు శత్రువీరకులంబు యమదూత నేననిమిన్నందె నీపతాక

ఒకనాడు నీదు ఛత్రోల్లస చ్ఛాయలో ద్రవిడ కర్ణాటక రాజ్యముండె

ఒకనాడు నీదైనసుకవిత, ప్రభువులు దిగ్గున పీఠాల డిగ్గజేసె

ఎన్నియోయుండెలే వాటి కేమిగాని

యోజనలుసేయ నేమి ప్రయోజనంబు?

దిట్టత నమూని నడుమును గట్టుమిపుడ

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమమ్ము కొఱకు

నిఖిల శాత్రవ గర్వ నిర్వాపణక్రియా

దక్షయుష్మత్ఖడ్గ ధగధగలును

హారి విలాస శయ్యాయుతంబగు, నీదు

కవితా వనంబులో గమగమలును

నేత్ర పారణసేయు నీదగు శిల్ప ర

త్నాల యంగడిలోని తళతళలును

నితరులకెల్ల తానే భిక్ష బెట్టిన

నీ నాగరికతలో నిగనిగలును

తగిలినప్పుడు మదిలోన బుగులుపుట్టు

నాకు మాత్ర మదెందుకన్నా! స్మరింపు

నీకు గల్గకయుండునే? నిదుర నుండి

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమమ్ము కొఱకు

చెదరి రూపరియున్న జెప్పెడు నదిగొ! నీ

యానాటి కళలను హంపి బయలు

తందనాల్‌ పాటలధాటి బొబ్బిలిదాటి

యానాటి నీధాటి నదిగొ! మ్రోయు

ఆనాటి నీకవితా నాట్యభంగిమ

లదె, చాటు శ్రీ భారతాదులెల్ల

చెవులు గింగురుమన జెప్పెడునదె! నీమ

గంటిమి ఖడ్గ తిక్కన చరిత్ర

కనులు మూయుము - తలపుము - కానుపించు

తళుకు తళుకున మెఱసెడు దాని నీదు

పూర్వశక్తిగ నెంచుమా పురుష సింహ!

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమము కొఱకు

తన కత్తి కెదురులేకనె బావుటా యెత్తి

మెలగిన కృష్ణ రాయలను జూడు

ధీశక్తినే వైరి తికమక లాడిరచు

మన యాంధ్రమంత్రి తిమ్మరుసు జూడు

నవలక్షధానుష్క నాయకుండై శత్రు

రుద్రుడైన ప్రతాపరుద్రుజూడు

దొంగరాలతొపాటు పునుకల త్రిప్పుచు

నలరిన బాలనాయనిని జూడు

చాలునా? చెప్పవలయునా? చాలు వెయ్యి

మంది వాచాలురకునైన మళ్ళబడును

గాన మాబోటి వారికి కానిపనిలె

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమము కొఱకు

ఒకడోయిద్దఱొ యైనచెప్పనగుగా యోయాంధ్రసింహంబ వే

లకు వేలాంధ్రమహామహుల్గలరెయన్నా యొక్కరక్తంబు పం

చుక జన్మంబులనెత్తినారుజుమి యంతోయింతొ యాశక్తియా

రకమున్నీకును కల్గియున్న దికలేరా! యుద్యమోత్సాహివై

కడు పెడుబిడ్డలన్‌ గనె నొకండును ద్రాబిగనుండలేద యొ

క్క డొకడునొక్క లోకమువిఘాతములేకయెయేలి రమ్మకున్‌

కొడుకుల నీవొకండవె య ఘోరపుజీవితమందుమూలలన్‌

మిడుకుచు గూరుచుంటివి సుమీ! స్మరియింపుమ యాంధ్ర సింహమా

ఆదర్జా యది వేరె, యాప్రకటబాహాశక్తియే వేరులే

యాదాక్షిణ్యము వేరెయా చతురతాన్యాయ్యంబులున్‌ వేరె యా

యౌదార్యమ్మును వేరె, యన్నియును వేరౌలెమ్ముపో యేరికిన్‌

రాదోయీ! యదితల్లక్రిందులగుచున్‌ రమ్మన్న నోయాంధ్రుడా!

రాజులు పోయి, రట్లె కవి రాజులు పోయిరి, శిల్పి రాజుల

య్యో! జమయైరివారల నయోమయమయ్యెను నీదుగాథ కా

నీ జిగిమీరకీర్తి సతి నృత్యము సేయుచునే మెలంగె, ను

త్తేజముకల్గకుండెనుగదే, స్మరియింపుమ యాంధ్రసింహమా

తైలము తక్కువన్న నదిదండిగ నున్నది, వర్తిజూతమా

చాలినయంతయుండే వెదజల్లచుదీప్తి తెనుంగుజోతి యీ

కాలమునందదేమొ? కొడిగట్టెనులే యదిరాల్పు! మింక ధా

రాళ విభాలవాల సుకళాసకలాశకనొందు నాంధ్రుడా!

ఢల్లీి పాదుషహానఖండమగు పాండిత్య ప్రభావంబుచే

నుల్లాసంబునుపొందజేసి, సభలోనొప్పించి సౌందర్య, సం

పల్లావణ్యవతీలవంగిని మెహర్బానందె విఖ్యాతి వా

టిల్లన్‌, పండితరాయలాంధ్ర! మనవాడేసుమ్ము గర్వింపుమా!

తనచేతన్‌ జెలువాఱుచున్న యులికంతంతేసిశైలమ్ములే

కనుదోయిన్మరలింసనీయని యనేకమ్ముల్మనోజ్ఞా కృతుల్‌

గొనెపో జీవకళల్వెలార్ప నల ఎల్లోరా అజంతాలకున్‌

జనుమాయన్ని యునీ కెదోచు మనయాచార్య ప్రవీణత్వముల్‌

అలసంగీతకళాసుధామయ విశాలాంభోధిలోనుండి కొ

ల్లలుగా మంజులనూత్న భంగిమల కాల్వల్‌దీసి యానందకం

దళసస్యమ్ములబెంచి విశ్వవినుతోద్యత్కీర్తి ధాన్యమ్ము గా

దెలకున్నింపిన త్యాగరా, జతడుకాడేతాత యాంధ్రోర్వికిన్‌!

ఉద్దండంబగు సాహసంబున జగంబుఱ్ఱూతలూగించు ది

ఙ్మద్ధాభిఖ్యుని విక్రమార్కుని ననన్యప్రాభవోపేతునిన్‌

యుద్ధక్షోణినెదిర్చె మృణ్మయ మహాయోధాది సైన్యమ్ముతో

నౌద్ధత్యమ్మున శాలివాహను డతండన్యుండు కాదాంధ్రుడా!

తనపాండిత్యవిభూతి బౌద్ధమత విద్వత్కోటి సిద్ధాంత ఖం

డనమున్‌ జేసిమహీంద్రుడెందమునకానందంబు జేకుర్చియా

తని సైన్యంబులతోడ శాత్రవులయుద్ధక్షోణి నోడిరచి పో

యినరాజ్యమ్మును స్వామికిచ్చుటలు నీకేజెల్లునోయాంధ్రుడా!

ఇనుమున్‌ జిల్గు పదారు వన్నియలతో నింపారు బంగారుగా

నొనరన్‌ జేయుటెకాదు సిద్దులవి యెన్నోకల్గి లోకైక పా

వనమౌ బౌద్ధమతమ్మునన్నిలిపె నవ్య శ్రీమహాయానమున్‌

మననాగార్జునయోగియాతనిమదిన్‌ భావింపుమోయాంధ్రుడా!

ఆనందైకపదంబుజేర కరణంబౌ, భక్తియోగంబు మా

ర్గానం జక్కని ఫక్కి పెక్కు మజిలీలన్నిల్పి పాంథాళికిన్‌

యానంబుల్‌ సుకరంబుజేసిన ఘనుండా వల్లభాచార్యు డాం

ధ్రా! నావాడనిచాటుమోయి జగతిన్‌ ఢంకా బజాయింపుచున్‌

దైవంబుచేత, హైదరబాదు సర్కారు

నప్పు నిప్పిచు గోపన్న భక్తి

ప్రభువును, సుల్తాను బందిఖానానుండి

తప్పించు, నలయుగంధరుని యుక్తి

పోతరాజును, నేడు పూటలలో కాలు

నతిథిగా జేయు, భీమన్న శక్తి

అన్యదేశంబు నాహ్వానమున్‌ గొన్న, మం

ధాన భైరవుని వైద్య ప్రసక్తి

అణగి నీలోన నిందాక సదనుకొఱకు

వేచియున్నది యది విజృంభించుటకును

నడ్డులేదెందు నీకునో యాంధ్రసింహ!

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమము కొఱకు

హంపిలో నగరి సోయగముజూచుచు నన్య

దేశీయు లందందు తిరుగు నాడు

మన రాయబారి రోమకరాజ్య కార్యాల

యాన నాసీనుడై యలరు నాడు

ఖండాంతరముల యంగళ్లలో బందరు

చీటీలు తమ నీటు జాటు నాడు

‘‘జావా’’ ‘‘సుమిత్రా’’ లలో వెలుంగుచు తెన్గు

టెక్కెంబు చుంగులాడిరచు నాడు

మధుర తంజా పురమ్ముల మహలులందు

తెనుగుకై తలొయారముల్‌ దీర్చునాడు

సర్వతోముఖమాంధ్ర ప్రశస్తి నీవు

తలపుముప్పొంగు! నూతనోత్సాహ శక్తి

ఆగర్భ శాత్రవునైన త్రాహీ! యని

వచ్చిన - జాలు, కాపాడినారు.

మండు నిప్పులపైకి జెండు ఫిరంగీల

కుమ్మని యెదుఱొమ్ము లొడ్డినారు

అడుగవచ్చిన వాని నుడివెళ్లకయె మున్న

యీప్సితార్ధమ్ముల నిచ్చినారు

నిండునెడదల ఖండ ఖండాంతరములలో

విజ్ఞాన బీజముల్‌ విత్తినారు

ఎన్నియో యుండెలే వాటికేమిగాని

యోజనలు సేయ నేమి ప్రయోజనంబు?

దిట్టతనమున నడుమును గట్టుమివుడ

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమమ్ము కొరకు

పగతువెన్నిచ్చి పర్వగ, హుంకరింపుచు

పెనుమొగ్గరముల దీపించినారు

అరిశేషముంచి, యూపిరితోడ నింటికే

తెంచిన పతి, నీసడిరచినారు

పసితనమ్మేని పోవకమున్నె సుతుని దీ

వించి యుద్ధాలకంపించినారు

మదమెక్కి యున్న సామంతుల యుద్ధతిన్‌

డిరచి రాజ్యంబు పాలించినారు

తెనుగు కాంతల చరితంబు దీసి చదువ

కానుపించును ప్రతి పుటలోన నిట్టి

గాథలే వారి నుద్యమ కార్య రంగ

మందు నుసికొల్పి రమ్మోయి! యాంధ్రసింహ!

భజనాలయాలవెల్వడు జంతగాత్రాల

హవణించి సొగియించు నెవనిపేరు

ప్రతియింటిలోన గన్పట్టు దేవుని మూల

పీఠాన నెవ్వాని విగ్రహంబు

పరమ భాగవత జీవనువ్యాసపీటపై

వెలుగొందు నెవని జీవిత చరిత్ర

నిరవధికాశ్చర్యకరము విఖ్యాత మా

బాలగోపాల మెవ్వని మహత్తు

వంగసీమలదైవభావంబు మెలగ

ధన్యతరజీవి కృష్ణచైతన్యమూర్తి

జన్మ యాంధ్ర వసుంధరా సారభూత

మనుచుదలపుము సతతమో యాంధ్రసింహ!

ఆర్నూరామడ లబ్ధిదాటి యమితోద్యద్ధాటి విక్టోరియా

కర్ణద్వంద్వము గింగురుల్‌ గొలిపి నిష్కామక్రియా లక్ష్మికిన్‌

స్వర్ణంపుంబతకమ్ము దెచ్చెను వదాన్యశ్రీయశోదుందుభుల్‌

కర్నూల్‌ మండలవాసియైన మనవెంగల్‌ రెడ్డి మ్రోయింపగన్‌

బందోబస్తులతోడ సైమను మహాభావుం, డభూతోత్స వా

నందంబందెడునాడు చెన్నపురిలోనన్‌ తెల్లసైన్యాల పెన్‌

బందూకాలకు ఱొమ్మునిచ్చి దిటమొప్ప న్నల్లజెండాలతో

ముందుందూకిన నీదు తేజమిపుడుప్పొంగింపుమోయాంధ్రుడా

డంగై చూడ గవర్నమెంటులవి లండన్‌ వై టుహాల్‌ దాక వీ

టంగీకొల్పగ కీచురాల్‌ తమకనిష్టంబైన మున్సా ్పలిటీ

సాంగత్యానికి స్వస్తి జెప్పి పటుదీక్షన్‌ బూని చీరాలలో

నంగుప్పించిన యైకమత్యమిపుడన్నా! పూనుముత్సాహివై

తమదేశమ్మును గ్రమ్ముకొన్న దురవస్థల్‌ దీర్ప కర్తవ్యతా

క్రమమున్‌ యోజనసేయ గౌహతిపురిన్‌ కాంగ్రెస్‌ మహా నాయకుల్‌

కమిటీజేసిననాడు మొట్టమొదటన్‌ ప్రఖ్యాత పూర్ణ స్వరా

జ్యమహా సంచలనంబుగొల్పినదియన్నా! యాంధ్రధీశక్తియే

ఆసల్‌ గొల్పుచు వేషభాషణములం దాంగ్లేయ సర్కారుకున్‌

దాసోహమ్మన జేయునట్టిది గవర్నర్‌ సీటులో నుండియున్‌

దేశీయ ప్రజ మేలు మేలనగ ఖాదీ టోపిగీలించు నా

ప్రాశస్త్యంబును నీవుగాక యొరుడాంధ్రా! పొందగాజాలునే

మనయాంగ్లేయ ప్రభుత్వదృష్టికగుపింపన్‌ గొప్పనేరంబు లం

డను యం.ఏ. యయి న్యాయమూర్తి యెదుటన్‌ వాఙ్మూలమాంధ్రమ్ములో

వినిపింపన్మును ‘శ్రీరమారమణగోవిందో హరీ!’ యంచు రా

ముని నామమ్మును కోర్టులో నిలుపు నా పుణ్యంబు నీవేజుమీ

ఆనాడా బెజవాడకున్‌ సయిమనత్యాశ్చర్యభంగీ నిరా

హ్వాన శ్రీనటనావిలాస వివశుండై యాత్మ బృందమ్ముతో

రానుంకింపగ నాపుచేసితివి చైర్మెన్‌ సీటులోనుండి యాం

ధ్రా! నీకెవ్వరుసాటి యెచ్చటను నీ ధైర్యం బనన్యంబులే!

అదిగోచూడుమునేటిదాకమనయాంధ్రౌన్నత్యమున్‌ జాటుచు

న్నదొకేసారిగసూర్యుడస్తమయమొందన్‌ రానిభూభాగమం

దెడురేమాత్రములేక సుద్ధురగతిన్‌ హేరాళ సామ్రాజ్య సం

పదలన్‌ దూగెడురాజ్ఞిమస్తకముసీమన్‌ కోహినూర్‌ వజ్రమున్‌

శిల్పంబందలి తెన్గువారి ప్రతిభాక్షీణప్రభాజ్యోతి యే

యల్పంబోగల చంద్రకాంతఫలకం బై రోపియన్‌ దృష్టులన్‌

మల్పంజేయుచునిత్యనూత్నమయిలండన్‌ మ్యూజియంలక్ష్మికా

కల్పస్ఫూర్తివెలుంగుచున్నది త్రిలింగఖ్యాతులన్‌ జిమ్ముచున్‌

క్రుంగెన్నంటికిలేని శాశ్వతపు శంకుస్థాపనన్‌ జేసి; పై

హంగుల్‌ దీరిచి బెంగుళూరునగరం బాంధ్రుల్‌ వినిర్మింపగా

సింగారించిరి మీద కన్నడులు సుశ్రీనిర్మలోల్లాసముల్‌

రంగారన్నిలుచున్న దిప్పటికి నాంధ్రత్వములో నెంచుచున్‌

ఘన విద్యాపరిపూర్ణుడై అమెరికా ఖండంబునందుండి రే

వునబొంబాయిపురంబులోదిగుటకున్‌ పూర్వంబెయేతెంచి తా

ల్చిన ఫుల్‌ సూటు సముద్రమధ్యమున నట్లేపార వేయించి భ

ర్తను దేశోద్యమవీరుజేయునవి యాంధ్రస్త్రీలభావోన్నతుల్‌

ఉరుశక్తి నొప్పు విద్యుత్తులన్‌ బుట్టించు

ముచికుంద జలపాతపుం విభూతి.

విశ్వసౌందర్యంబు విరిసిన ప్రకృతి సం

పదలనొప్పు మహేంద్ర పర్వతంబు

ఆనతి లేక నెవ్వానికిన్‌ జొరరాని

గండికోటాది దుర్గముల దండు

అమృతంపుతేటకీడైన జలమ్ముతో

ప్రవహించు తుంగభద్రా స్రవంతి

కనులు మిఱుమిట్లుగొలుప బంగారువంటి

పంటలన్‌ బండు సారంపు బహుళ భూమి

జన్మహక్కోయి యేటికి సంశయింతు?

వనుభవింపగ లెమ్మోయి! యాంధ్రసింహ!

తనవారిమాటకింతయు చెల్లుబడిలేమి

తనలోన కుములు మద్రాసు జూడు

పొరుగువారికి హక్కు భుక్తమైపోయిన

పర్లాకిమిడి సమీపములు జూడు

తెనుగులో బోధనల్‌ దీర్పజాలని మన

దగు విశ్వ విద్యాలయంబుజూడు.

మనవారి బాయికాటొసరింపజూచు ప్ర

భుత్వ డైరెక్టర్ల బోర్డు జూడు

తమ జనమ్మునుసుకముల దనుపలేక

దక్షిణాభిముఖమ్మౌచు తరలిపోవు

నాంధ్రదేశ ధనప్రవాహములు జూడు

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమముకొఱకు

కూలికై యితర దేశాలకు గుంపులై

చనుచున్న పాటక జనముజూచి

భూమి గర్భమునందె మూల్గుచున్నట్టి య

పారమౌ ఖనిజ సంపదలజూడు

క్షామదేవత మహోత్సాహమ్ముతో కాపు

రము జేయు పశ్చిమాంధ్రమ్ము జూచి

పరిపాలనము లేక వ్యర్థమ్ముగా సము

ద్రము జేరు నీటిమొత్తములుజూడు

పొట్ట జరుగక మిగుల వాపోవుచున్న

పట్టభద్రులనటు మనవారిజూచి

తెనుగు దేశంబు పాలింప దిగుమతియయి

వచ్చుచున్నట్టి యుద్యోగ పరుల జూడు

ముచికుంద జలపాతములను స్వాహా జేయ

నుంకించు నున్నది యోఢ్రజాతి

తిరుపతి వేంక టేశ్వరుల తెన్గు తనమ్ము

తరిగెపో యరవ పెత్తనము క్రింద

బళ్లారినగర సంపదలు నేడో రేపొ

పోనుండె కర్ణాట భూమి గలిసి

అంత భూభాగమల్లాడు చున్నది నేటి

కిన్నిజాముల కాలి క్రింద నలిగి

వాటిననుకొన్న హృదయంబు భగ్గుమనదె?

యంతరించెనె నీలోన యాంధ్ర శక్తి?

యెంతయో మించిపోయిన దింకనైన

లెమ్ము! రమ్మోయి! యాంధ్రోద్యమము కొరకు

గొరగొరమన్చు ప్రాణములు కుత్తుకలోపలనాడుదాక పో

రిరి మనదేశమాతకయి, రేగపరాక్రమ, మాంధ్రవీరు లెం

దరో మనకంత క్షాత్రమునుదాల్చు నవశ్యముగూడలేదు బా

లుర! యొకగట్టిపట్టుదలతో పనిబూనుటె యాంధ్రసింహమా

శక్తిన్‌ మించినదేమిలేదు నిజతేజస్సున్‌ గనన్‌ లేవు నీ

రక్తంబిప్పుడె యిప్పుడే యుడుకుపారన్‌ సాగె గాబోలు మా

వక్త వ్యాంశములన్ని యైనవికమావంతయ్యె నీవంతు స

ద్భక్తిన్‌ నీదగునుద్యమంబునకు త్రోవన్‌ బట్టుటేయాంధ్రుడా

నోరునెత్తినబెట్టి యెంతోవటించి

తలకు నుడుకెక్కు పొమ్మోయి! తలచి తలచి

యేము చెప్పెడు నపుడు వేడెక్కునెంత

యట్లేయది నిల్చెనా? ఘోషసార్థకమగు.


భీష్మ పరశురామయుద్ధం

(అంబ కథ)

ఏకాంకిక

కర్త:

అష్టావధాని, పౌరాణిక రత్న

పాణ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి

ముద్రణ

పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు

2022

అంబ కథ

పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రి (గుండయ్య స్వామి) రచన భీష్మ పరశురామ యుద్ధం అనే ఏకాంకిక నాటకం. దీని రచనకు ఉన్న నేపథ్యం కవి మాటల్లోనే చూద్దాం. వారి చేతి వ్రాత కూడా మీరు చూస్తున్నారు. మన పెద్దల గుర్తుగా వారు వాడిన వస్తువులు, ఫోటోలు, వీడియోలు, ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు, వంటివాటిని భద్రపరచి అప్పుడప్పుడు అందరం కూర్చొని చూచి, విని ఆనందిచడం వారి ఘనతను ఉగ్గడిరచడం, మన పిల్లలకు తెలియజేయడం కూడా పితృదేవతార్చనే! కేవలం తద్దినాలు తర్పణాలే కాదు. ‘‘దేవ పితృకార్యాన్‌ న ప్రమదితవ్యమ్‌’’ అని తైత్తరీయమ్‌లోని శిక్షావళి హెచ్చరించింది కదా! అసలు విషయానికి వస్తే నీ పుట్టుక నీ పూర్వ జన్మల కర్మానుసారంగా సిద్ధించింది. నిన్ను అన్ని రకాలుగా పెంచి పెద్దచేసి తీర్చిదిద్దిన పితరులను మనం నిత్యమ్‌ స్మరించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. చాలామంది క్రమంగా దీనిని మర్చిపోతున్నారు. మీదుమిక్కిలి తల్లితండ్రుల మీద ద్వేషం, కసి పెంచుకొని వ్యతిరేక భావాలతో ఇటు ఇహానికి అటు పరానికి దూరమైతున్నారు. ఇది చాలా శోచనీయం. వారు ఆస్తుల పంపకంలో అన్యాయం చేసినారని, తన భార్యా పిల్లలను వేధించారని రకరకాల ఆలోచనలతో సతమతమైతూ, అందరికీ చెప్పుకుంటూ, తమను తామే దిగజార్చుకుంటారు. ‘‘మరణాంతాని వైరాని’’ అని రాముడు విభీషణునికి బోధించి రావణుని మరణానంతరం కర్మలు చేసేట్లు నిర్దేశిస్తాడు కదా! మనం అదికూడా మర్చి వారి మరణానంతరం కూడా వారిని గూర్చి వ్యతిరేకభావాలు నింపుకోవడం క్షమార్హం కాదు. అసలు విషయం దాటి చాలా దూరం వచ్చినట్లున్నాను కదా! ఏదో ధోరణి. కవి చేవ్రాలులోనే ముందుమాట అనుబంధంలో చూద్దామ్‌.

కవి మాటల్లోనే ఈ నాటకం ఎందుకు వ్రాశారో తెలుసుకున్నాం కదా! ఇంక సంక్షిప్తంగా కథా సందర్భం తెలుసుకుందాం. ఇది మహాభారతంలోని అంబ కథ. అంబ, అంబిక, అంబాలిక అనే వీరు మువ్వురు కాశీరాజు కుమార్తెలు. వీరికి స్వయంవరం ప్రకటించినాడు రాజు. భీష్ముడు తన తమ్ముని కోసం, వీరిని స్వయంవరం నుండి తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించి, బలవంతంగా ఎత్తుకొచ్చినాడు. వారిలో అంబ అప్పటికే సాళ్వుని వరించింది. అది తెల్సిన భీష్ముడు ఆమెను తిరిగి సాళ్వుని వద్దకే పంపినాడు. కాని వాడు ఆమెను తిరస్కరిస్తాడు. అంబ తిరిగి వచ్చి తనను కూడా తమ్మునికే ఇచ్చి పెండ్లి చేయమని కోరుతుంది. దానికి భీష్ముడు ఒప్పుకోడు. లేదా నీవే చేసుకోమంటుంది. నేను శాశ్వత బ్రహ్మచర్య దీక్షాకంకణబద్ధుడనని వెడలగొట్టినాడు. అంబ బతుకు ఎటూ కాకుండా అయ్యింది. చివరకు నారదుని సలహాతో పరశురాముని వద్దకు పోతుంది. దానికై పరశురాముడు భీష్ముని వద్దకు రావడంతో ఈ నాటకం మొదలైంది. ఇదంతా పరశురాముడు ప్రస్తావించి, అంబను తమ్మునికిచ్చి వివాహం జరిపించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు