శ్రీలక్ష్మీనరసరామణీయకం › చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 5
చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 5
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 36 / 37
పరపురుషానురక్త యగు భామని స్పష్టముగా నెరింగి, యె
వ్వరు తమ ధర్మపత్నిగ వివాహముజేయుదురయ్య, తామెయి
క్కరణి నధర్మమిద్దియనకే నను నాజ్ఞ నొనర్పబాడియే
గురువర! దీనిదక్క యెదిగోరిన వీడొనరింప సిద్ధమే!
అని భీష్ముడు తిరస్కరించినాడు.
ప్రేమ వ్యవహారాలు ఈనాటివి కావు. అక్రమ సంబంధాలూ అంతే. తారా చంద్రుల వంటి పురాణ కథలున్నాయి కదా. త్రిగుణాత్మకమైన సృష్టిలో సమస్త ప్రాణులు అరిషడ్వర్గాలకు లొంగక తప్పదు. కానీ ఉచితానుచితాలను గుర్తించడం వివేకం. వీటన్నింటికి ధర్మం మూలమైనప్పుడు పతనం కాము. ఇక్కడ అంబ పరిస్థితి అదే. స్వతంత్రించి సాళ్వుని ప్రేమించి, రెంటికీ చెడ్డ ఱేవడైంది. తనచెల్లెళ్ళు ఇద్దరు పెండ్లి చేసుకొని సుఖంగా ఉన్నారు. నేటికాలంలో ఇట్టివెన్నో! పురాణ కథల నుండి మనం గ్రహించవలసినవి ఇవే కదా! సరే! కథలోనికొస్తే భీష్ముని తిరస్కారంతో పరశురాముడు ఉగ్రరూపం దాల్చినాడు. ఈ సన్నివేశంలోని సంభాషణలన్నీ దాదాపు పద్యాలుగనే ఉంటాయి. ఈ రచన ఉద్దేశ్యమే అది కదా!
గురుడని నన్నేరుంగుద నఘుండవు నావచనంబునందనా
దరణము సేసి తెన్నియొ విధంబుల పల్కెదు యుక్తి తోడ, నీ
వెరవులు దక్కు మీ యబల వేగమ పెండిలి సేయుమంతతో
మరలు మదీయ కోపశిఖ మానదు వేరొక వేయి జేసినన్
అని తీవ్రంగా హెచ్చరిస్తాడు. కానీ భీష్ముడు ఏ మాత్రం తొణకడు. తనది ధర్మబద్ధమని, అధర్మమొనరించమనడం భావ్యం కాదని, ఈ మొండి పట్టు వదలమని ప్రార్థిస్తాడు.
గురుధిక్కారము జేసె భీష్ముడని నాకున్ జెడ్డపేరేల?నన్
కరుణంజూడుము! వ్యర్థసంగతిని జోక్యంబింత కాఠిన్యసం
భరితంబౌ నటు పూనుటేల?విడుడభ్యర్థించెదన్ స్వామి!ధ
ర్మరతుల్ మెత్తురుదీని కొందరితరుల్ గర్వంబటంచాడెరే!
బార్గవరాముడు క్రోధంతో తన పరాక్రమాన్ని గుర్తు చేసుకొమ్మని చెప్తూ
కార్తవీర్యార్జునుని వేయి కఠిన బాహు
వులను తెగగొట్టివాని పుత్రులను నఱికి
బిరుదు గా నాదుపేరుపై మెఱయుచున్న
పరశువున్నది నాచేత బారజూడు!
అని బెదరించినాడు. పోనుపోను మాటల తీవ్రత పెరుగుతుంది. భీష్ముడు ప్రతిగా
గర్వియై కార్యమిట్టిదకార్యమిట్టి
దని యెరుంగక లోకంబు చను పథమున
దిరుగకున్మద వృత్తి వర్థించునట్టి
వాని గురునైన దండిరపవలయుననరె
అని అధర్మవర్తి ఐన గురువును కూడా శిక్షించవలసిందే అన్నాడు. భార్గవుడు కోపంతో వూగిపోతూ ‘‘నీవయసు, రాజరికం, విక్రమమదం కలిసి విర్రవీగుతున్నావ్. కండ్లు నెత్తికెక్కినాయి. నన్నే దండిరచే మొనగానివైనావా’’ అని హుంకరిస్తూ
ఇరువది యొక్కమారులు మహిన్ గల రాజుల నేరియేరియీ
పరశు మహోగ్రధారలను పారగ నెత్తురుటేర్లు శీర్శముల్
దొరలగ నింతలింతలుగ తుంటలు తుంటలు జేసినట్టి న
న్నెరుగవో! కాక నీవెరిగియే యిటులూరక విర్రవీగెదో
అన్నాడు. ఈ సన్నివేశంలోని భీష్ముని ఆత్మస్థైర్యం, ధర్మనిరతి కళ్ళకు కడ్తున్నాయి.
అపుడు భీష్ముడు పుట్టలేదతని సాటి
పూరుషుండును భువిలోన పుట్టలేదు
అటుల చిల్లర రాజుల అలుపు జూచి
వీరుడవు వోలె విహరించితహహ!నీవు
ఈ పద్యం వ్యాసుని మూలానికి యథాతథంగా అనువాదము.
న తదా జాతవాన్ భీష్మః తత్సమో పూరుషో-పి న
ఇప్పుడు చూచి చూచికొనుమీ నను నిన్నును నీదు విద్యనే
నొప్పగఁజెప్పెదన్ మరియు నుద్ధతి, పై చదువింత కల్పుచున్
తప్పులు చేయుమంచరచి, దానికి కాదన నిట్లు రేగెదే
రొప్పకు వృద్ధసింహమ! కురుక్షితి జన్యము నిల్చె ముందటన్
తారస్థాయి చేరిన ఆవేశంతో భార్గవుడు యుద్ధమే మన సమస్యను తేలుస్తుందనడంతో మరుసటి రోజే యుద్దానికి సిద్దమై వస్తానన్నడు భీష్ముడు. ఈ విధంగా ఈ భాగం ముగుస్తుంది.
భీష్మ పరశురాముల యుద్ధం నిశ్చితమైంది కదా! కురుక్షేత్రంలో గురుశిష్యులిద్దరు తలపడడానికి సిద్ధమైనారు. ముందుగా గంగాదేవి తన కుమారుడైన భీష్మునితో యుద్ధం వద్దని వారిస్తుంది. శంతనుని భార్యగా గంగాదేవి అష్టవసువులను పుత్రులుగా కనిన వెంటనే గంగ పాలు చేస్తుంది. ఇచ్చిన మాట మేరకు శంతనుడు ఏమీ అనడు. కానీ చివరి వానిని కూడా చంపబోతే అడ్డగిస్తాడు. మాట తప్పినాడనే మిషతో గంగాదేవి శంతనుని వదలి పోతూ, ఆ కుమారుణ్ణి తనతో తీసుకవెళ్ళి పెంచి పెద్దచేసి అప్పగిస్తానని చెప్పి తీసుకుపోతుంది. వాడే భీష్ముడు. ఇదంతా గంగాదేవికి, అష్టవసువులకు శాపంవల్ల సిద్ధించింది. గంగ కుమారుడు కాబట్టి గాంగేయుడు, శంతనుని కుమారుడు కాబట్టి శాంతనవుడు, జీవితాంత బ్రహ్మచర్య దీక్ష గైకుంటానని భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడు అనే పేర్లు ఏర్పడినాయి. గంగాదేవి ఆ పిల్లవానిని పరశురాముని వద్ద సర్వ విద్యలు నేర్చడానికి వదలి పెట్టింది. ఈ విధంగా భీష్మ పరశురాములు గురుశిష్యులైనారు. ఇదీ నేపథ్యం. ప్రస్తుతానికి వస్తే తనను వారిస్తున్న తల్లితో గంగేయుడు
పరమ పావని నీదు గర్భమున బుట్టె
భీష్ముడెప్పుడు ధర్మంబు విడువడమ్మ!
భార్గవుడె కాదు కడకు నాభర్గుడైన
నాకు భయమేమి? ధర్మంబె నాకు రక్ష!
అని తన ధర్మ దీక్షను ప్రకటిస్తూ పరశురామునితోనే కాదు, అవసరమైతే శివునితోనైనా ధర్మం కోసం పోరాడుతానని, భయపడనని చెప్పినాడు. పాపం! గంగామాత చేసేదేమీ లేక పరశురాముణ్ణి సమీపించి యుద్ధము వద్దంటుంది. అక్కడా చుక్కెదురే. భార్గవుడు గంగతో
చావడు వాడును నేనును
చావను గానీ కునిష్టిజనులుగ చచ్చీ
చావని బ్రదుకులు గడపెద
మీవనటను బడకుమమ్మ యిదితప్పదుపో!
ఈ పద్యాలలో కవి ఆయా పాత్రలను మన కళ్ళకు కట్టిస్తున్నట్లు లేదా? భీష్ముని వయో పరాక్రమాదులు, ధర్మనిరతి, నిర్భీతి; అట్లే బార్గవుని అసహనం, భీష్ముడు తన ఆజ్ఞ పాటించలేదన్న ఉక్రోషం, వృద్ధుడైనా తగ్గని ఆవేశం వంటివన్నీ ఈ చిన్న పద్యాలలో ప్రకటమైతున్నవి. పద్యాన్ని, దాని భావాన్ని లోతుగా ఆలోచిస్తే ఇవన్నీ తోచి, అమందానంద తరంగిత హృదయులం కాగలం. అందుకే సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు. పరశురాముని మాటల్లో ‘కునిష్టి’’ అనే పదం సహజంగా వాడేది కాదు. చాలా మందికి తెలియదు కూడా. శారీరక శక్తులన్నీ తగ్గిపోయి, తీవ్ర అనారోగ్యంతో మూలన పడిన స్థితిని సూచించే పదమది. ఇట్టి రచన కవి ప్రతిభను వెలార్చుతుంది. సరే! గురుశిష్యులిద్దరు యుద్ధమునకు సిద్ధమై ఎదురెదురుగా నిల్చుకునారు. చివరి ప్రయత్నంగా, భార్గవుడు
కాదును కూడదంచు పెనగన్ వలదిప్పటికైన మించిపో
లేదుర భీష్మ! ఏమగును లెమ్మని యెంచితివేమొ? కార్తవీ
ర్యాదులు గూడ నేమయిరొ! రాజులు వారిని మించి కొమ్ములే
ఔదల మొల్చెనో యురక యంబకు పెండ్లి యొనొర్పు తీరెడిన్
అని మళ్ళీ హెచ్చరిస్తాడు. దానికి ప్రతి వచనంగా భీష్ముడు
వారి అధర్మమేదొయది వారికి వారికి చేటు దెచ్చెగా
నీ రణమందు నెవ్వడెటు నెగ్గిన తగ్గిన నేమియౌను, యీ
ధారుణి ధర్మసేవయె ప్రధానముగా శిరసావహించుటా
చారము మాకు తప్పైన సైచుడు!శిష్యుననుగ్రహింపుడీ!
సహజంగా మాట్లాడు కొన్నట్లు లేదా? ఈ విధమైన రచనతోనే తిరుపతి వేంకటకవులు ప్రఖ్యాతులైనారు. ‘‘బావా!యెప్పుడు వచ్చితీవు’’, ‘‘జెండాపై కపిరాజు’’ వంటి పద్యాలన్ని ఇట్టివే. మన కవి తన ముందు మాటలో తన రచనకు ప్రేరకుడైన వెంకటనర్సునాయుడు తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ, విజయం నాటకముల రచనా శైలిలో ఉండవలెనని కోరినాడని, దానిలో తానెంతవరకు కృతకృత్యుడైనాడో రసజ్ఞులే నిర్ణయింతురని పేర్కొన్నాడు కదా! చదువుతున్న, వింటున్న, చూస్తున్న సహృదయులు వారివారి సంస్కార భాష యోగ్యతలను బట్టి స్పందించగలరు గాక! కథలో ప్రవేశిద్దాం. యుద్ధం మొదలయ్యింది. ఒకరి అస్త్రాలు ఒకరు ఖండిరచుకుంటూ భీకరంగా పోరాడుతున్నారు. శిష్యుని ధాటికి పరశురాముడు మూర్ఛనొందినాడు. అది చూసి గాంగేయుడు
నెత్తిననోరు పెట్టుకొని నేనిది ధర్మవిరుద్ధమంచునున్
మొత్తుకొనంగనున్ వినవు! మూర్ఖపు పట్టున తీవ్రఘాతలన్
నెత్తురు జొత్తిలన్ బడితి నిర్గతచేతనమయ్యె మేను; చీ
కత్తులజీవితంబిది విగర్హితమౌ ధర నెట్టి వారి కిన్!
బాధపడినాడు. కాని వెంటనే తేరుకున్న భార్గవుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వారుణాస్త్రంతో భీష్ముడు దాన్ని అడ్డుకొన్నాడు. అట్లే వాయవ్యాస్త్రాన్ని, మేఘాస్త్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. పట్టశక్యం కాని క్రోధంతో భార్గవుడు శక్తిని ప్రయోగించి శాంతనవుని మూర్చిల్లజేసినాడు. అది గని గురువు శిష్యుని దీనావస్థకు వగచుచు,
పరశురాముని శస్త్రాస్త్ర పరమశక్తి
సంపుటము భీష్ముడను మాటసమసె
నిన్ను నాదు కీర్తిపతాకను నాకునేనె
కూలద్రోసితిరా! భీష్మ! గుణనిధాన!
అంటూ అంబ తన చేత యెంత పని చేయించిందని వాపోతాడు. తనకు అఖండ ఖ్యాతి తెచ్చినవాడు భీష్ముడుగా తన హృదయాన్ని వెల్లడిరచినాడు. ఇంతలో శాంతనవుడు తెప్పరిల్లి, స్వామీ నన్ను కరుణించినావా? అన్న మరుక్షణమే భార్గవుడు కృద్ధుడై పరశురామునకు కరుణ వచ్చుననుకున్నవా? అని హుంకరిస్తాడు. దానికి జవాబుగా గాంగేయుడు వ్యంగ్యంగా
అమ్మను గొంతుకోసి మరియన్నల నందరి గండ్రగొడ్డటన్
కిమ్మనకుండగా నఱకి నిబ్బరపుంగరుణాత్ముడౌచు, క్షా
త్రమ్మనజాలు పాపలను తారిన వృద్ధుల గూడ జంపగా
గ్రుమ్మఱు నీకునాకరుణకున్ భృగురాముడ! యెంతదూరమో!
అంటూ అస్త్రప్రయోగానికి సిద్ధపడినాడు. ఈవిధంగా 23 రోజులు ఇద్దరి మధ్య పోరు ఘోరంగా జరిగింది.
24వ రోజు యుద్ధసన్నివేశాన్ని చూద్దాం. భీష్ముడు
ఔర! ఇరువది మూడునాళ్ళయ్యె
గురుడులొగ్గడేనును సుంతయు లొగ్గలేదు.
ఇకను గురుశిష్య యుద్ధ నాటకమునకు
భరతవాక్యము పాడిన బాగు నేడు
అనుకుంటూ ప్రవేశిస్తాడు. నిన్నటి యుద్ధంలో జరిగిన వాటిని స్మరిస్తూ తాను మూర్ఛపోయినప్పుడు తల్లి గంగాదేవి, 8 మంది దేవతలు కనిపించినట్టు, తనను సేదదీర్చినట్టు తోచింది. వారే మళ్ళీ రాత్రి స్వప్న దర్శనమిచ్చి, పరశురాముని జయించడానికి మోహనాస్త్రం ఉపదేశించినారని అది ఇప్పుడు సమంత్రకముగా తనకు భాసిస్తుందని పేర్కొంటాడు. గురువునకెదురుగా రథం తోలుమని సారథిని ఆజ్ఞాపించాడు. భార్గవుడు కోపియై, ‘నేటి తో నీపని సరి’ అని గర్జిస్తాడు. గాంగేయుడు
నిన్నెరుంగుదు నేనును నన్ను నీవు
నెరుగుదువు దండిగా; నీవొ నేనో
తేల్చుకోవలె; అంబకు తీర్పు చెప్ప
గావలెను ధర్మజయమును కావలె గురు
అంటాడు. గురువు ‘‘అంబ బతుకు అధ్వాన్నమయ్యేటట్లు చేసిన అధర్మపరునివి నీవు. నీవు కూడా ధర్మోపన్యాసాలు చెప్తున్నావా?’’ అంటూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి బదులుగా శాంతనవుడు గూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినాడు. వాటి రెంటి సంఘర్షణవల్ల లోకాలన్నీ తల్లడిల్లినాయి. ఇక్కడ కవి వర్ణనా రామణీయకాన్ని గమనిద్దాం! వర్ణనా నిపుణుడైనవాడే కవి అని కదా ఆర్యోక్తి.
చటులంబై; ప్రళయోగ్రకాల హుతభుక్ జ్వాలా విలాభీల ది
క్పటలంబై; నిటలాక్ష రూక్ష దహనాక్ష స్ఫూర్తిమత్క్రోధ సం
ఘటనంబై; కుటిలాదిశేష విషఫూత్కారోగ్ర దంష్ట్రారటత్
రటనంబై; వికటించు నీపయికిదేరా!వచ్చె బ్రహ్మాస్త్రమున్
అట్లే గాంగేయుని మోహనాస్త్ర వర్ణన కూడా
నిష్ఠాత్మాష్ట వసుప్రసాద మహితోన్నిద్ర ప్రభావప్రభా
స్పేష్ఠంబై, పరమేష్టి సృష్టి రచనా జీవాళి చైతన్య ము
డ్కాష్ఠంబై, లయరుద్ర నృత్యవిరటత్ డక్కామహారావ బృమ్
హిష్ఠంబై, యిదె మోహనాస్త్రము నినున్ మ్రింగంగ నేతెంచెడిన్
ఇటువంటి పద్యాలు కవి ప్రతిభావ్యుత్పన్నతలకు, రచనాప్రౌఢకి నికషోపలములు. ప్రతి కవి ఇట్టి రచనకు మోహిస్తాడు. కృషి చేస్తాడు. సరే! కథలోనికి వస్తే ఈ ఘోరయుద్ధాన్ని నిల్పడానికి నారదుడు, జమదగ్ని మహర్షి(పరశు రాముని తండ్రి), గంగాదేవి, అష్టవసువులు ప్రవేశించి, ఇద్దరికీ నచ్చచెప్పి శాంతింప జేస్తారు.
పరశురాముని మంగళాశాసనముతో నాటకం ముగుస్తుంది.
మన కవి సంగీత సాహిత్యాలు రెండిటిని స్వాధీన పర్చుకునాడు. ఇప్పటికే సాహిత్య పాండిత్యాన్ని మనం చూసివున్నాం. ‘‘అష్టావధాని’’, ‘‘పౌరాణిక రత్న’’ అన్న సార్థక బిరుదులు పొందియున్నాడు. చాలా సంవత్సరాలు పురాణ ప్రవచనాలతో కర్నూల్, డోన్ వంటి పట్టణాలలో, ఆ చుట్టు పక్కల ధార్మిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్గించినారు. ఆయన వాక్కు ధీర గంభీరమై, శ్రోతలను ముగ్ధులను చేసేది. 1950, 1960, 1980 దశకాలలో ఇదే వ్యాసంగాన్ని కొనసాగించినారు. అప్పుడప్పుడు బెంగుళూర్, హైద్రాబాద్ వంటి నగరాలలో కూడా వీరి ఉపన్యాసాలు నిర్వహించబడేవి. యువకునిగా పౌరాణిక నాటకాలలో కూడా పాల్గొన్నారు. ఆ అనుభవంతోనే ఈ నాటకాన్ని స్వయంగా పాడినారు. వారికి ప్రియమైన రాగాలు మోహన, కళ్యాణి, బిలహరి, మధ్యమావతి, సింహేంద్రమధ్యమ.
ఈ నాటకంలోని పద్యాలన్నిటిని ఆయా రాగాలలో కూర్చినారు. మీరూ విని ఆనందించండి.
ఈ నాటిక పుట్టుపూర్వోత్తరాలు
రాయలసీమ రత్నమై, రంగస్థల నటులలో యావదాంధ్ర ఖ్యాతిగన్న వెల్దుర్తి వెంకట నర్సునాయుడు తన రంగస్థల నటనారంభ కాలమున నా కేకలవ్య శిష్యుడు. అతడు 2531988 కీర్తిశేషుడైనాడు. అంతకు పూర్వమే షుమారు ఒకటిన్నర సంవత్సర ప్రాంతములో వెల్దుర్తి (కర్నూలు జిల్లా, ఆం.ప్ర.) నా వద్దకు వచ్చి భీష్మపరశురామ యుద్ధం ఇద్దరు పాత్రధారులు సంభాషణ పద్ధతిలో 30 పద్యములుండునట్లు (గయోపాఖ్యానము నాటకము వలె) రచించి ఇవ్వండని అడిగినాడు. మద్రాసులోని రికార్డింగ్ (నవీప) కంపెనీ వారు కొత్త సన్నివేశములతో కథతో తాను, తనతోపాటు మరొకరు సమఉజ్జీలుగా పాత్రధారులై రికార్డు చేయవలెనని కోరినట్లు తెల్పినాడు. తానే భీష్మ పరశురామయుద్ధం ఉదాత్తమైన ఇతివృత్తంగా సూచించినాడు. కాని నీవు మరొకరెవరితోనైనా వ్రాయించు కొమ్మన్నాను. కాని బాల్యాదిగా మా మధ్యనున్న స్నేహగౌరవ సంబంధాలను ఆసరాగా నన్ను మీరేవ్రాసి ఇవ్వవలెనని నిర్బంధముగా కోరినాడు. మరల నేను ఓరినాయనా! నేను షుమారు 30 సంవత్సరములనుండి కవితా రచన వ్యాసంగం లేకుండా గడుపుచున్నాను. మీదు మిక్కిలి గత 4,5 సం॥లనుండి కేవలం ఆధ్యాత్మిక వ్యాసంగంలోనే కాలం గడుపుచున్నాను. నన్ను మరల ఈ ప్రక్రియలోనికెందుకు దించెదవు? అని నిరాకరించితిని. ఐనా అతడు పలుమార్లు నా ఇంటికి వచ్చి ఇతరులు వ్రాసినా నాకు తృప్తి లేదు. కావున మీరే వ్రాయవలెనని తన హృదయాభిలాషను వెల్లడిరచినాడు. నేను కాదనలేక సరేనన్నాను. ఈ నాటిక రంగస్థలనటులు పద్యాలు రాగాలాపనతో చేసినచో దాదాపు 30 నిముసములు పట్టునట్లు ఉండులాగున రచన కావలెనని నియమముతో రచించబడినది. వెంకటనర్సునాయుని కోరిక ఏమనగా తిరుపతి వెంకటటకవుల ఉద్యోగ, విజయముల శైలిలో నాటిక పద్యములుండవలెనని. మరి ఆ కోరిక ఈ రచనలో ఎంతవరకు కుదురుకొన్నదో సహృదయ పండిత కవులే నిర్ణయించగలరు. శ్రీ వెంకటనర్సునాయుడు కీర్తిశేషుడు గాక ముందు 1 సం॥నకు ముందుగానే రచనను ముగించి అతనికొక ప్రతినిచ్చితిని. మరల ఒకటి రెండుసార్లు కలిసినప్పుడు అతడు సెట్టింగ్ చేస్తున్నాము అని చెప్పినట్లు గుర్తు. తనకు సరిజోడి పాత్రధారి కుదరలేదని కూడా అన్నట్లున్నాడు. ఇంతలో అతని ఆయుస్సు తీరినది. నేను నా సహజమైన ఔదాసీన్యముతో దీనిని గురించి మరచియేపోయినాను. ఒకసారి మా దగ్గరి బంధువు, బావమరిది వరుసఐన శ్రీ గడియారం శేషఫణిశర్మ (ఇంజనీరు, పాల్వంచ) జనవరి 1989లో వెల్దుర్తికి వచ్చినప్పుడు సాహిత్య గోష్ఠి సమయంలో ఈ రచన విన్నాడు. అతడు వర్ధమాన రచయిత. సహృదయుడు. సాహిత్య వీథులలో వెన్నెల రెక్కలతో ఈ వరకే విహరిస్తున్నవాడు. అతని కేమి తోచిందో కాని తాను పాల్వంచలో దీని ముద్రణచేయిస్తానని పల్కినాడు. నాకేమాత్రం ఆ ధ్యాసే లేదు. సాహిత్యోపన్యాసాలకై నన్ను పాల్వంచకు ఆహ్వానించినాడు. ఆ సందర్భంలోనే దీని ముద్రణ, ప్రకటనాదులు జరుపుటకు ఉత్సాహ పడినాడు. మరి ఈ వర్ధమాన యువకవి బంధుత్వాభిమానమో? గుణగ్రాహిత్యమో? ఈ రచన, ప్రకటన వంటి సర్వహక్కులు చిరంజీవి శ్రీ శేషఫణిశర్మకు ఆనందాశీర్వాదములతో ఇచ్చినాను. నా యప్పటి జీవిత స్వభావంతో నా గురుభక్తి ప్రబోధము, ధర్మనిర్వహణాదక్షత ఈ రచనలో నున్నవిగాన ఒక విధమైన తృప్తి గలిగినది.
- పాణ్యం, లక్ష్మీ నరసింహశాస్త్రి
పౌరాణిక రత్న, అష్టావధాని
గమనిక : పైన కవి చెప్పినట్లు ముద్రణ జరుగలేదు. అది ఇన్నాళ్ళకు సిద్ధించినందులకు సంతోషాంతరంగులమైనాము.
- ప్రకాశకులు
ఇందులో వచ్చు పాత్రలు:
పురుష పాత్రలు:
-
భీష్ముడు - కౌరవ పాండవ పితామహుడు
-
పరశురాముడు - భీష్ముని గురువు
-
నారదుడు - దేవర్షి
-
అష్టవసువులు - దేవతామూర్తులు
-
జమదగ్ని - పరశురాముని తండ్రి
స్త్రీ పాత్రలు:
-
అంబ - కాశీరాజకుమార్తె, తర్వాత శిఖండిగా మారింది.
-
గంగాదేవి - భీష్ముని తల్లి
గమనిక:
ఈ నాటకములోని పద్యములను స్వరపరుచుటకుగాను రచయిత సూచించిన రాగాలను వాడగలరు.
భీష్మ పరశురామ యుద్ధము
రంగము : హస్తినాపుర రాజసౌధము
భీష్ముడు: (ప్రవేశించి)
శా॥ ధన్యమ్మయ్యెను నాదు జన్మమది, మద్భాగ్యంబులున్ పండె, స
న్మాన్యత్వమ్మును బొందె తానిపుడు గంగామాత విఖ్యాతయై
గణ్యుండయ్యెను తండ్రి శంతనుడు, నిక్కాలంబె కళ్యాణమున్
పుణ్యశ్లోకుడు వచ్చెనంట గురుదేవుండిప్డు నన్ జూడగన్ (రా: కళ్యాణి)
ఓయీ! ఎవరక్కడ?
మా గురుదేవులు భార్గవరాములకు స్వాగతసత్కారములు గావించుటకై పురోహితులను, బ్రాహ్మణుశ్రేష్ఠులను, పౌర ముఖ్యులను వెంటనే పిల్చుకొని అర్ఘ్యపాద్యాది పూజాసామాగ్రుల సిద్ధపరచి మంగళవాద్య ఘోషాపురస్సరముగా సన్నాహము నొనరింపవలసినదని మా ఆదేశముగా ప్రధానామాత్యులతో చెప్పుము! ఇదే మేమును వినీతవేషులమై వచ్చుచున్నాము.
(తెరలో మంగళవాద్యఘోషలు, సన్నాహములు)
రంగము : హస్తినాపురము
(పరశురాముడు అంబతో సహచర మునిగణముతో ప్రవేశించును)
భీష్ముడు: (ప్రవేశించి)
శ్రీ గురు దేవులకు సుస్వాగతము! శిష్యుడు శాంతనవుడు సాష్టాంగ ప్రణామములను అర్పించుచున్నాడు. అర్ఘ్యపాద్యాది సత్కారముల నందుకొని ధన్యుని జేయుడు!
పరశురాముడు:
శిష్యా! భీష్మా!
గ్రహించితిమి. కాని నీ సత్కారములందుకొనుటకు మాత్రమే మేమిచటకు రాలేదు. (అంబనుజూపి) గాంగేయా! నీవు బలిమియై స్వయంవర సమయమున దెచ్చిన కాశీరాజు కొమరితలయందు పెద్దది ఈ అంబ. ఈ యబల సాళ్వరాజు, తాను పరస్పరము ప్రేమించుకొన్నామని నీతో (హస్తినలో) చెప్పగా నీవు సాళ్వునకడ కంపితివి. అచ్చట సాళ్వునిచే తిరస్కృతయై మరియు నవమానితయై వెడలనడుపబడినది. ఈ కన్య జీవితము ఇపుడు నీ కారణముగ నాశనమగుచున్నది. కావున నా మాటవిని ఈ అంబను నీ తమ్మునికి వివాహము జేయుము.
భీష్ముడు: గురుదేవా! చిత్తగింపుడు.
చ॥ పరపురుషాను రక్తయగు భామని స్పష్టముగా నెరింగి, యె
వ్వరు తమధర్మపత్నిగ వివాహము జేయుదురయ్య తామె యి
క్కరణి నధర్మమిద్దియనకే నను నాజ్ఞ నొనర్పబాడియే
గురువర! దీనిదక్క యెదిగోరిన వీడొనరింపసిద్ధమే! (రా: బిలహరి)
పర: ఓయీ! మాకేదియునక్కరలేదు. నీవీ కుమారికి నీ తమ్మునితో వివాహము గావింపవలసినదే. ఇది మాయాజ్ఞ! మా క్రోధాగ్నికి నింధనము గాకుము!
భీష్ముడు: క్షమింపుడు. అధర్మయుక్తమగు మీ యాజ్ఞను నెరవేర్పజాలను కరుణించి నన్ను నిర్బంధింపకుడు. నమస్కరించి వేడుకొనుచున్నాను.
పర : గాంగేయా! నామాటలు బాగుగా వినుము!
చ॥ గురుడని నన్నెరుంగు దనఘుండవు నా వచనంబునందనా
దరణము సేసి తెన్నియొ విధంబుల పల్కెదు యుక్తితోడనీ
వెరవులు దక్కు మీ యబల వేగమ పెండిలి సేయుమంతతో
మరలు మదీయ కోపశిఖ మానదు వేరొక వేయి జేసినన్. (రా: మధ్యమావతి)
భీష్ముడు : భార్గవ రామా!
మ॥ గురు ధిక్కారముఁ జేసె భీష్ముడని నాకున్ జెడ్డపేరేల? నన్
కరుణంజూడుము! వ్యర్థసంగతిని జోక్యం బింత కాఠిన్యసం
భరి తంబౌ నటు పూనుటేల? వినుడభ్యర్థించెదన్ స్వామి! ధ
ర్మరతుల్ మెత్తురు దీని కొందరి తరుల్ గర్వంబటంచాడరే! (రా: కన్నడ)
పర : (కోపముతో)
ఓహో! నీవు ధర్మ నిర్వాహకుడవు. మేమధర్మ నిర్వాహకులుగా నేర్పరచితివిగా! ఈ అంబగతి ఏమికావలెనను కొన్నావురా!
గీ॥ కార్తవీర్యార్జునుని వేయి కఠిన బాహు
వులను తెగగొట్టి వాని పుత్రులను నఱికి,
బిరుదుగా నాదుపేరుపై మెఱయుచున్న
పరశువున్నది నా చేతఁ బారజూడు! (రా: మోహన)
భీష్ముడు: స్వామీ! ఇట్టి యకృత్యంబొనరించు కంటె నీచేత నెటులైనను లెస్స. అది అటులుండనిండు. పూర్వము పెద్దలు ఇట్లు వచించిరి గదా!
గీ॥ గర్వియై కార్యమిట్టి దకార్యమిట్టి
దని యెరుంగక లోకంబు చనుపథమున
దిరుగకున్మద వృత్తి వర్తించునట్టి
వాని గురునైన దండిరప వలయుననరె (రా: మధ్యమావతి)
పర : (కోపముతో మండిపడి) ఓరీ! శాంతనవా!
గీ॥ వయసు మదమును రాజుల వంశమదము
అమ్మ కోర్కెను మేమిచ్చు నస్త్రమదము
నెత్తికెక్కెను జుమి! కనుల్ నింగికెగిసె!
పరశురాముని దండిరచు బంటువయితె!! (రా: మధ్యమావతి)
(క్రోధసంరంభంతో) ఓరీ! రాజకుల గర్వోన్మత్తా!
చ॥ ఇరువది యొక్క మారులు మహిన్ గల రాజులనేరియేరియీ
పరశు మహోగ్రధారలను పారగనెత్తురుటేర్లు శీర్షముల్
దొరలగ నింత లింతలుగ తుంటలు తుంటలు జేసినట్టిన
న్నెరుగవొ! కాక నీ వెరిగియే యిటు లూరక విర్రవీగెదో! (రా: సింహేంద్ర మధ్యమ)
భీష్ముడు: పరశురామా!
గీ॥ అపుడు భీష్ముడు పుట్టలేద తనిసాటి
పూరుషుండును భువిలోన పుట్టలేదు
అటుల చిల్లర రాజుల అలుపు జూచి
వీరుడవు వోలె విహరించిత హహ! నీవు!! (రా: మోహన)
కానీ!
ఉ॥ ఇప్పుడు చూచి చూచుకొనుమీ నను నిన్నును నీదువిద్యనే
నొప్పగఁజెప్పెదన్ మరియునుద్ధతి, పై చదువింత కల్పుచున్
తప్పులు చేయుమంచరచి దానికి కాదననిట్లురేగెదే
రొప్పకు వృద్ధ సింహమ! కురుక్షితి జన్యము నిల్చెముందటన్. (రా: మధ్యమావతి)
పర : (కోపముతో)
ఓరీ! భీష్మా!
గీ॥ వట్టి మాటల పనిలేదు గట్టినిలుము
రేపు ప్రొద్దుననేనీదు వైపు గలుగు
సర్వ సైన్యాల సిద్ధమై సమరమునకు
రమ్ము పొమ్ముర! భీష్మ! నీ లావుతెలియు!! (రా: మధ్యమావతి)
భీష్ముడు: గురువర్యా!
తాము ప్రసాదించిన అస్త్రశస్త్ర విద్యలే నాకు సర్వసైన్యములు గాన రేపు నేనొకడనే వచ్చి యుద్ధసేవ గావించుకొందును. సెలవు.
(నిష్క్రమింతురు)
రంగము : కురుక్షేత్ర ప్రాంతము
(భీష్ముడు రథముపై ప్రవేశించి)
భీష్ముడు : అమ్మా! గంగాదేవీ! ప్రణామములు. భార్గవులతో యుద్ధము భారమగునని నన్ను మానుకొనుమనుచున్నావా? అయ్యో! నీ మాతృ హృదయమునకట్లు తోచుచున్నది కాని,
గీ॥ పరమపావని నీదు గర్భమున బుట్టి
భీష్ముడెప్పుడు ధర్మంబు విడువడమ్మ!
భార్గవుడె కాడు కడకునా భర్గుడైన
నాకు భయమేమి? ధర్మంబెనాకు రక్ష ! (రా: కాఫీ, బీంప్లాస్)
అమ్మా! నాకిక సెలవు! సారధీ రథము పోనిమ్ము!
పర : (ప్రవేశించి)
అమ్మా! భాగీరథీ! నీ కొడుకుపై గల మమకారముతో నన్ను వాని కరుణించి విడువుమనుచుంటివి. కాని వయసు పొగరులోనున్న వానికి నేనొక లెక్కయా!
కం॥ చావడు వాడును నేనును
చావను గానీ కునిష్టిజనులుగ చచ్చీ
చావని బ్రదుకులు గడపెద
మీవనటను బడకు మమ్మయిది తప్పదుపో! (రా: కేదార గౌళ)
భీష్ముడు: (పరిక్రమించి) (రథము దిగి)
శ్రీగురుదేవులకు సాష్టాంగ ప్రణామములు. తమ యాజ్ఞమేరకు సిద్ధమై వచ్చితిని. కాని నేను రథస్తుడనైయుండ ఆచార్యులు భూచారులై సమరము చేయుట ఎట్లని కొతుకునెడదతో ఆలోచించుచున్నాను.
పర : ఇదిగో! సంకల్పించినాము. నీ కొతుకు తీరునటుల శిష్యుడు అకృతవ్రణుడీతడు సారథిగా సర్వసన్నద్ధమైన రథము పై నధిరోహించినాము చూడుము.
భీష్ముడు : (కించిదాశ్చర్యముతో)
ఔరా! గురువులు సిద్ధసంకల్పులుగదా!
పర : శిష్యా! గాంగేయా!
ఉ॥ కాదును కూడదంచు పెనగన్ వలదిప్పటికైన మించిపో
లేదుర భీష్మ! ఏమగును లెమ్మని యెంచితివేమొ? కార్తవీ
ర్యాదులు గూడ నేమయిరొ! రాజులు వారిని మించికొమ్ములే
ఔదలమొల్చెనో యురక యంబకు బెండ్లియొనర్పు; తీరెడిన్. (రా: కళ్యాణి)
భీష్ముడు : గురువర్యా!
ఉ॥ వారియధర్మమేదొయది వారికి వారికి చేటుదెచ్చెగా
నీ రణమందు నెవ్వడెటు నెగ్గిన తగ్గిన నేమియౌను, యీ
ధారుణి ధర్మసేవయె ప్రధానముగా శిరసావహించుటా
చారము మాకు తప్పయిన సైచుడు! శిష్యుననుగ్రహింపుడీ! (రా: కాఫీ)
పర : ఓరీ! చాలునిక నీమిథ్యా వినయాభినయములు. ధర్మోపన్యాసములు కట్టిపెట్టి రణమునకు కడంగుము.
భీష్ముడు : గురుదేవా! నమస్కారము! ఇదే రథమారోహించుచున్నాను!
(రథమెక్కి శంఖంబు పూరించి, నారిసారించును)
సారథీ! భార్గవరాములకెదురుగా రథము తోలుము.
పర : ఓరీ! ఈ శరవర్షములో నీవెక్కడ మునిగెదవో చూచుకొమ్ము!
(శరవర్షము కురియును)
భీష్ముడు : (బాణములన్నిటినీ దూరముననే గుదియగొట్టి)
భార్గవదేవా! ఏదీ నీబాణమొక్కటియును నా కడకు రాలేదే! (అని నవ్వును)
పర : భీష్మా ! ఈ దెబ్బలు తప్పించుకో! చూతము. (బాణములు వేయును)
భీష్ముడు : ఇదె మీ చాపము తుంటలైపడును.
(పరశురాముని ధనస్సు తుంటలైపడును)
పర : (కోపంతో)